అలనాటి అపురూపాలు-68

0
4

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

సాటిలేని స్వరకర్త రమేష్ నాయుడు:

రమేష్ నాయుడు 1 జనవరి 1933 నాడు ఆంధ్ర ప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా, కొండపల్లిలో జన్మించారు. పాఠశాల విద్య ముగిసాకా, తన తొలి, చివరి ఆసక్తి అయిన సంగీతంపైనే దృష్టి నిలపాలనుకున్నారు. బాల్యంలో ఆయన సంగీతంలో ఎటువంటి నియత శిక్షణ పొందలేదు, కానీ గడ్డిపరకలా సన్నగా ఉన్న ఆయన ప్రకృతిలోని ఏ స్వరాన్నైనా సులువుగా గుర్తించేవారు. పొలాల్లోకి వెళ్ళి కూర్చుని మధురమైన గీతాలను ఆలపించేవారు. ఆయనకు శ్రీవాత్సవ్ అనే మిత్రుడు ఉండేవారు. ఈ శ్రీవాత్సవ అప్పటికే బి.ఆర్. చోప్రా కోసం చక్కని గీతాలను రాస్తున్నారు. శ్రీవాత్సవ్‌కి రమేష్ గానం అంటే అమితమైన ఇష్టం. ఓ రోజు శ్రీవాత్సవకి ఒక ఆలోచన వచ్చింది, తను రాసే గీతాలను రమేష్ ఆలపిస్తే బాగుంటుందని. అంతే, ఇద్దరూ ఎవరికి చెప్పకుండా బొంబాయికి వెళ్ళిపోయారు.

అక్కడ బి.ఆర్. చోప్రాని కలిసారు. మనిషి ఒకలా తలిస్తే, దైవం మరొలా తలుస్తాడని అంటారు. రమేష్ నాయుడు విషయంలో అదే జరిగింది. చోప్రా గారికి శ్రీ వాత్సవ్ రాసిన గీతాలు గాని, రమేష్ నాయుడు పాడిన పాటలు గాని నచ్చలేదు. కానీ రమేష్ నాయుడి స్వరకల్పన నచ్చింది. రమేష్ నాయుడికి రెండు పాటలు ఇచ్చి బాణీలు కట్టమన్నారు. ఏ ఇబ్బంది లేకుండా, సునాయాసంగా వాటికి బాణీలు కట్టి ఆలపించడంతో చోప్రా ఎంతో సంతోషించారు. ఒక రికమండేషన్ లెటర్ రాసిచ్చి, వెళ్ళి సుప్రసిద్ధ గాయకుడు జి.ఎన్. జోషిని కలిసి ఆ ఉత్తరం ఇవ్వమని చెప్పారు. ఆయన, హెచ్.ఎం.వి. సంస్థ అధికారులు రమేష్ నాయుడి ప్రతిభను మెచ్చుకున్నారు.

అప్పుడు ఆయన వయసు 14 ఏళ్ళు మాత్రమే. ఈ విధంగా 1947లో హెచ్.ఎం.వి. సంస్థ కార్యాలయంలో వివిధ వాయిద్యాలను వాయించడంలోనూ, సంగీతం కూర్చడంలోనూ రమేష్ నాయుడు శిక్షణ పొందారు. ఆ రోజుల్లో శంషాద్ బేగం అద్భుత గాయని, అస్సలు తీరిక లేకుండా ఉండేవారు. జి.ఎన్. జోషి గారు ఎన్ని సార్లు అడిగినా, సినిమాయేతర పాటలు పాడలేదు, డిస్క్‌లు విడుదల కానివ్వలేదు. రమేష్ బాణీలు విన్నాకా, వచ్చి ఒకసారి బాణీలను వినమని ఆయన ఆవిడని బతిమాలారు. ఆమెకి స్వరాలు నచ్చకపోతే, డిస్క్ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు. ఆమె అందుకు అంగీకరించి హెచ్.ఎం.వి. వారి ఆఫీసుకు వచ్చారు. ఆమె ఎదురుగా పాడేందుకు రమేష్ వణికిపోయారు. అయితే ఆయన స్వరపరిచిన విషాద గీతానికి వణికే గొంతు మరింత వన్నె తెచ్చింది. శంషాద్ బేగంకి పాట విపరీతంగా నచ్చేసి, హెచ్.ఎం.వి. వారితో ఒప్పందం కుదుర్చుకున్నారు. దురదృష్టవశాత్తు రికార్డింగ్ సిబ్బంది సమ్మెకి వెళ్ళడంతో ఆమె పాటలని రికార్డు చేయలేకపోయారు.

కొన్ని రోజుల తర్వాత వారు రమేష్ నాయుడికి కొన్ని మరాఠీ పాటలు స్వరపరిచేందుకు ఇచ్చారు. వాటిని గాయని మోహనతార అజింక్య పాడగా, డిస్క్ విడుదల చేశారు. ఆ పాటలు బాగా ప్రసిద్ధమయ్యాయి. అయితే రమేష్ మాత్రం తనకి ప్రేరణనిచ్చింది శంషాద్ గారేనని అంటారు. ఆ తర్వాత మూడు మరాఠీ సినిమాలకు సంగీతం అందించే అవకాశం లభించింది. సంగీత దర్శకుడిగా ఆయన తొలి చిత్రం మరాఠీ సినిమా ‘బంద్వల్ పహీజా’. ఈ సినిమాలోని పాటలు జనరంజకమయ్యాయి. సుప్రసిద్ధ రాజకీయవేత్త ఎస్.కె. పాటిల్ రమేష్ నాయుడిని కిషోర్ సాహుకి సిఫార్సు చేశారు. ఆ విధంగా రమేష్ గారికి హిందీ చిత్రం ‘హామ్లెట్’కి సంగీతం సమకూర్చే అవకాశం లభించింది.

ఆ రోజుల్లో కిషోర్ సాహు గారికి ఓ విచిత్రమైన అలవాటు ఉండేది. తన సినిమాల్లోని పాటలను అనేకమంది సంగీత దర్శకులకు ఇచ్చి, వారిలోంచి ఒకరి బాణీలను ఎంచుకునేవారు. ఆశ్చర్యకరంగా ఆయన రమేష్ నాయుడి స్వరాలు బాగా నచ్చి, ‘హామ్లెట్’లో అన్ని పాటలకి సంగీతం కూర్చే అవకాశం ఆయనకి ఇచ్చారు. అప్పట్లో  బొంబాయిలోని మెట్రో థియేటర్‍లో కేవలం ఇంగ్లీష్ సినిమాలే విడుదలయ్యేవి. 1954లో తొలిసారిగా ఆ థియేటర్‌లో హిందీ చిత్రం ‘హామ్లెట్’ని ప్రదర్శించేలా చేశారు కిషోర్ సాహు. ఆ చిత్రం ప్రీమియర్ షోలో, 21 ఏళ్ల సంగీతదర్శకుడు రమేష్ నాయుడు హిందీ సినీ రంగంలోని దిగ్గజాలను కలుసుకున్నారు.

హామ్లెట్ చిత్రంలోని ఒక పాట యూట్యూబ్‍లో:

https://www.youtube.com/watch?v=11hInfGedDM

ఆ తరువాత షోరబ్ మోడి, అమియ చక్రవర్తి సినిమాలకు సంగీతం కూర్చే అవకాశం లభించింది. అవన్నీ సాకారమై ఉంటే, ఆయన హిందీ సంగీత దర్శకుడిగా అగ్రస్థానంలో ఉండేవారు. కానీ, జబ్బు చేసి, సొంత ఊరికి వచ్చేయాల్సి వచ్చింది. కోలుకోవడానికి దాదాపు ఒక ఏడాది పట్టింది. అయినా ఆయన నిరాశ చెందలేదు.

సినిమాలలో ప్రయత్నించేందుకు ఆయన మళ్ళీ బొంబాయి వెళ్ళారు. తెలుగు నుంచి హిందీలోకి డబ్ అయిని సినిమాలకు సంగీతం అందించారు. ఉదాహరణ 1959 నాటి ‘జయసింఘ్’. ఇది 1955 నాటి తెలుగు చిత్రం ‘జయసింహ’కు అనువాదం. ‘జయసింహ’లో ఎన్.టి.ఆర్., వహీదా నటించగా, యోగానంద్ దర్శకత్వం వహించారు. రమేష్ నాయుడు – యోగానంద్ స్నేహితుడైన ప్రసిద్ధ నటుడు ఎన్.టి.ఆర్.ని కూడా కలిసారు. ఆ రోజుల్లో ఒక డిస్ట్రిబ్యూటర్ హిందీ సినిమాలకు మద్రాసుకు తెచ్చి తెలుగు ప్రాంతాలలో విడుదల చేసేవారు. వారి బ్యానర్ మధుసూదన్ పిక్చర్స్. రమేష్ నాయుడు వారితో పాటు మద్రాసు వచ్చేశారు. అక్కడ ఆయన మీర్జాపురం రాజావారిని, వారి సతీమణి, నటి కృష్ణవేణిని కలిసారు. అప్పుడు ఆవిడ ‘దాంపత్యం’ నిర్మిస్తున్నారు. ఒక తెలుగు వ్యక్తి మరాఠీ, హింది చిత్రసీమలలో సంగీత దర్శకుడిగా రాణించడం అపూరూపమని విశ్వసించిన కృష్ణవేణి ఆ చిత్రానికి సంగీత దర్శకత్వం బాధ్యతలను రమేష్ నాయుడికి అప్పగించారు. ఈ విధంగా 1957 నాటి ‘దాంపత్యం’ ఆయన మొదటి తెలుగు సినిమా అయింది (ఈ సినిమాలోని పాటలను ఈ లింక్ ద్వారా వినవచ్చు: https://tunes.desibantu.com/dampatyam-1957/ )

ఆయన సంతకం చేసిన తొలి చిత్రం ‘దాంపత్యం’ అయినప్పటికీ, దానికన్నా ముందు యోగానంద్ దర్శకత్వంలో రమేష్ నాయుడు సంగీతం అందించిన ‘స్వయంప్రభ’ విడుదలయింది. ఈ చిత్రాన్ని యోగానంద్ సోదరులు డి. కోటేశ్వరరావు నిర్మించారు. ఆయన తర్వాత జెమినీ స్టూడియోలో సౌండ్ ఇంజనీరుగా స్థిరపడ్డారు. ఈ చిత్రాలలో రమేష్ నాయుడు అందించిన పాటలు హిట్ అవడంలో ‘మనోరమ’ (1959) వంటి చిత్రాలకు సంగీతం కూర్చే అవకాశం లభించింది. ‘మనోరమ’లో ఆయన తలత్ మహమూద్‌తో రెండు పాటలు పాడించారు (వాటిని ఈ లింక్‌ల ద్వారా యూట్యూబ్‌లో చూడవచ్చు:

https://www.youtube.com/watch?v=KnXgm5HdsPw,

https://www.youtube.com/watch?v=0sheQPJGwzc).

బిచ్చగాళ్ళ గీతంగా ప్రసిద్ధి కెక్కిన ‘గతి లేని వాడ్ని, గుడ్డివాడిని బాబయ్యా’ పాట ఈ సినిమాలోదే (https://www.youtube.com/watch?v=mb3JEdRAkOE ).

ఆ తరువాత ఆయన ‘కూతురు కాపురం’, ‘గుళ్ళో పెళ్ళి’, ‘శాంత’ వంటి చిత్రాలకు హిట్ పాటలు అందించారు. ‘శాంత’ చిత్రం తరువాత ఆయన మద్రాసు వీడి, కలకత్తాకి వెళ్ళిపోయారు. అక్కడ 1960-61 మధ్య ‘మహాకవి కీర్తివాన్’, ‘దుయ్ మా’ వంటి బంగ్లా చిత్రాలకి సంగీతం అందించారు. అక్కడ్నించి ఆయన నేపాల్ వెళ్ళి నేపాల్ సినిమాలకు సంగీతం అందించారు. మద్రాసు, కలకత్తా నేపాల్ మధ్య తిరుగుతూ ఉండేవారు. ఒక బెంగాలీ యువతిని వివాహం చేసుకున్నారు. దాదాపు పదేళ్ళ పాటు బెంగాలీ, నేపాలీ, ఒరియా సినిమాలకు పని చేశారు. ఆ రోజుల్లో బెంగాల్‍లో నక్సలైట్ ఉద్యమం ప్రారంభమైంది. తన కుటుంబం గురించి భయపడ్డారాయన. అదే సమయం దైవం సాయం చేసినట్టుగా 1972లో తెలుగు నిర్మాత, విజయలక్ష్మి ఫిల్మ్స్ అధినేత జి.వి.ఎస్. రాజు నుంచి ఫోన్ వచ్చింది. తాను తీస్తున్న ‘అమ్మ మాట’ సినిమాకు సంగీతం అందించమని ఆయన రమేష్ నాయుడిని కోరారు. ఈ సినిమాలో రమేష్ నాయుడు అందించిన ‘మాయదారి చిన్నోడు’ పాట గొప్ప హిట్!

(https://www.youtube.com/watch?v=QJ5pHfE4j3k )

దీని తర్వాత ఆయన బొంబాయికి, అక్కడ్నించి తన కుటుంబం ఉంటున్న కలకత్తాకి వెళ్ళిపోయారు. తెలుగు నటుడు, నిర్మాత అయిన గిరిబాబు ఆయనని తెలుగు చిత్రసీమకి శాశ్వతంగా వచ్చేసేలా ఒప్పించారు. మాతృభాషా చిత్రాలకు పనిచేయాలని రమేష్ నాయుడికి మనసైంది. గిరిబాబు నిర్మిస్తున్న ‘జీవితం’ (1973) చిత్రానికి సంగీతం అందించేందుకు మద్రాసు వచ్చారు. ఈ చిత్రంలో ‘ఇక్కడే కలుసుకున్నాము’ అనే పాట గొప్ప హిట్ (https://www.youtube.com/watch?v=ldpueO4SxCY ). దీనికన్నా ముందు 1972లో ఆయన ‘తాత మనవడు’ చిత్రానికి సంగీతం సమకూర్చారు. ఈ చిత్రంలోని ‘అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం’ పాట ఎంత హిట్టో అందరికీ తెలిసిందే (https://www.youtube.com/watch?v=8bQvPwO8HKo ).

1973లో ఆయన సూపర్ హిట్ చిత్రం ‘దేవుడు చేసిన మనుషులు’కి సంగీతం సమకూర్చారు.

వారు పనిచేసిన చిత్రాల జాబితాని ఈ లింక్‌లో చూడవచ్చు: https://en.wikipedia.org/wiki/Ramesh_Naidu#Filmography

ప్రతిభాశాలియైన ఈ సంగీత దర్శకుడు 1987లో 54 ఏళ్ళ వయసులో హైదరాబాదులో 1987, సెప్టెంబర్ 3 నాడు మరణించారు.

1987 వరకు స్వరకర్తగా క్రియాశీలకంగా ఉండి, ఎన్నో హిట్ పాటలు అందించిన రమేష్ నాయుడు చిన్నవయసులోనే పరమపదించడం విచారకరం!


జాతీయవాది, నటి వనమాల:

పృథ్వీరాజ్ కపూర్ ఆమెను ‘డయానా, ది మూన్ గాడెస్’ అని పిలిచేవారు. నటులు పహారీ సన్యాల్ ఆమెను ‘మాలా’ అని పిలిచేవారు. మోతీలాల్ గారు మరింత నిరాడంబరంగా, ‘మెరిసే కళ్ళు’ అనేవారు. బహుశా ఆమె కళ్ళే ఆమెకు ‘సికందర్’ చిత్రంలో రుక్సానా పాత్ర వచ్చేలా చేసి ఉంటాయి, ఆ చిత్రం విజయానికి దోహదం చేసి ఉంటాయి. మినర్వా మూవీ టౌన్ వారి తొలి విజయాలలో ఇది ఒకటి… భారతీయ సినీ చరిత్రలో ఘన విజయాన్ని చాటింది.

***

నటి వనమాల గురించి వారి సోదరి సుమతీదేవి ధన్‌వాతేయ్ 1976లో చెప్పిన వివరాలు ఆమె మాటల్లోనే చదువుదాం:

భారతదేశపు పశ్చిమ తీరమైనా, మధ్యధరా సముద్రమైనా, స్వచ్ఛమైన నీలీ-ఆకుపచ్చ తరంగాలు నన్ను ఎంతగానో ఆకర్షించేవి. నా చిన్నప్పుడు, ఎప్పుడూ నా సోదరి వనమాల దగ్గరే కూర్చునేదాన్ని. బయటి కాంతిని అనుసరించి తన కళ్ళల్లో రంగులు ఎలా మారుతూండేవే గమనిస్తూండేదాన్ని. 30వ దశాబ్దంలోని గ్వాలియర్ మా నివాసం. రాజవైభవంతో కూడిన జీవనం. నాన్నగారు కల్నల్ సర్దార్ రావ్ బహాదూర్ బాపూరావ్ పవార్ ముర్తాజ్-ఇన్-ఉద్-దౌలాహ్ అంటే విపరీతమైన భయం! ఆయన ఆజ్ఞకి తిరుగుండదు – మేమైనా, బయటివారైనా! చిత్రంగా, మేం కూడా ఆయన్ని ‘మాలిక్’ అని పిలిచేవాళ్ళం.

మా సోదరిని ఇంటర్వ్యూ చేద్దామని సిద్ధమయినప్పుడు మళ్ళీ ఆమె ముఖంలో సముద్రపు నీలీ-ఆకుపచ్చ రంగులు చూశాను. నుదుటన నిత్యం ఉండే సిందూరం, కనుబొమల మధ్యగా గంధం అలంకరణ, ఆ విశాలమైన కళ్ళల్లో ఎన్నెన్నో భావాలు కదలాడేవి. గతంలో కనబడని సౌమ్యత కదలాడింది.

బహుశా నాకే గ్రాహకశక్తి పెరిగిందేమో! కాలంతో పాటు జీవితాన్ని దిద్దుకుంటూ ఓ గొప్ప స్థాయికి వచ్చిన వనమాల వృత్తిపరంగా ఎన్నో విజయాలు సాధించింది. ఆధ్యాత్మిక ఉన్నతికి చేరుకుంది.

‘నా జీవితం తుఫానులో చిగురాకు లాంటిది’ అంది సంభాషణ ప్రారంభిస్తూ. రోజూ వారీ సంభాషణలో కూడా వనమాల ఎన్నో కొటేషన్స్ వాడుతుంది, లోతైన తాత్త్వికత ఉంటుందామె మాటల్లో. తన విద్యా సుగంధానికి మూలం తన జన్మస్థానమైన ఉజ్జయిని అని చెప్తుంది. ఉజ్జయిని విద్యల నగరం. మహాకవి కాళిదాసు కూడా అదే మాట అన్నారు. 21 ఏళ్ళకే వనమాల డబుల్ గ్రాడ్యుయేట్ అయ్యింది. పూణే లోని అగార్కర్ హైస్కూల్‍లో టీచర్‍గా చేసింది. తన జీవితానికో లక్ష్యం ఉన్నట్టు తను భావించేది. తాను అనుకున్నది ఆమెకి లభించిందా? బోధన ఆమె మొదటి ప్రయత్నం, దాచలేని తన ప్రతిభను వ్యక్తం చేయడానికి సినీ రంగంలోకి వెళ్ళడం రెండవ ప్రయత్నం.

సాంప్రదాయక మరాఠీ కుటుంబపు నిషేధాజ్జలను, ప్రేమతో అమ్మ అందించిన భక్తి, శ్రోత్రియ సంప్రదాయాలను తోసిపుచ్చింది వనమాల. భారతదేశంలో ఏ కళ అయినా ఒక పవిత్ర భావంతో చేసేదేనని ఆమె వితండవాదులని ఒప్పించ ప్రయత్నించింది.

అయితే మరాఠీ రంగస్థలం మీద ప్రదర్శనలు ఇచ్చే అవకాశాలు వచ్చినప్పుడు డబ్బులొచ్చే సినిమాలను వదులుకోడానికి తను వెనుకాడలేదు. బొంబాయి లోని మరాఠీ సాహిత్య్ సంఘ్ భవన నిర్మాణ నిధులకై ఎంతో కృషి చేసింది. ‘టేమింగ్ ఆఫ్ ది ష్రూ’ మరాఠీ అనువాదంలో ఆమె ప్రధాన పాత్ర పోషించింది. ఇది 40వ దశకం తొలినాళ్ళలో.

భారతీయ సినీరంగం వేళ్ళూనుకుంటున్న రోజులవి. ఓ మాదిరి చదువు, అందం ఉన్న నటీమణులు దొరకడం కష్టమయిన రోజులు. నిజానికి, ఆచార్య ఆత్రేతో తన సినిమాల గురించి మాట్లాడుతున్న వి. శాంతారాం – స్క్రిప్ట్ రైటింగ్ లోనూ, దర్శకత్వంలోనూ వనమాల  తనకి సహాయంగా ఉంటే బాగుంటుందని చెప్పారు. బహుశా నటన ఉన్నత వర్గాల మహిళలకు నప్పదనే సూచన అవ్యక్తంగా ఉండి ఉంటుంది.

జనుల భృకుటి ముడిపడినా, వనమాల నటననే ఎంచుకుంది, ఇతరులు గ్రహించేలోగా సినీ నటి అయింది. చిగురాకు తుఫానులో కొట్టుకుపోయింది.

‘లపాండవ్’ అనే మరాఠీ చిత్రం ఆమె మొదటి సినిమా. ఇందులో సామాజిక కట్టుబాట్లుకు వ్యతిరేకంగా – గుర్రపు స్వారీ చేస్తూ, టెన్నిస్ ఆడ్తూ, స్విమ్ సూట్ ధరించే పాత్రలో కనబడింది. ఇవి చేయడానికి వనమాల ఏ మాత్రం సంకోచించలేదు, ఎందుకంటే ఇవన్నీ ఆమె బాల్యం నుంచి చేస్తున్నవే. ఈ సినిమా ద్వారా ఆమెకి పృథ్వీరాజ్ కపూర్ సరసన ‘సికందర్’ చిత్రంలో రుక్సానా పాత్ర పోషించే అవకాశం వచ్చింది. ఈ బృందం గొప్పది, ఒకరి ప్రతిభను ఒకరు గౌరవించేవారు. కొన్నేళ్ళ తరువాత, పృథ్వీరాజ్ కపూర్ తన పృథ్వీ థియేటర్స్ ప్రదర్శించే నాటకాలలో తన పక్కన నాయికగా నటించమని ఆమెని అడిగారు. కానీ అప్పుడామె రంగస్థలం, సినిమాలను కాదని ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపింది.

సికందర్ చిత్రంలో రుక్సానా పాత్ర వచ్చేలా చేసిన ఆమె కళ్ళే మరుసటి సినిమాలో ఆమెకు దూరమయ్యాయి. ‘పర్బత్ పే అప్నా డేరా’ అనే చిత్రంలో అంధురాలిగా గొప్పగా నటించింది.

మొదట ఉల్హాస్ చేతిలో కర్రతో, కాళ్ళు కాకుండా, కర్ర దిగువ భాగం కనిపిస్తుంది. ఆ తరువాత వనమాల కోమలమైన పాదాలు నెమ్మదిగా అడుగులు వేస్తూ కనబడతాయి. కెమెరా నెమ్మదిగా పైకి వెళ్తూ ఆమె మొత్తం రూపాన్ని చూపిస్తుంది. ఆ పాత్రలో ఎంత లీనమైందంటే – తరువాత నాతో ఒకసారి చెప్పింది, తనికి నిజంగా గుడ్డితనం వచ్చినట్టు భావించానని. తన దృష్టిని ఆకర్షించాలని ప్రయత్నిస్తున్న శాంతారాం గారిని చూసేందుకు ఒక్క క్షణం రెప్పలు ఆర్పిందట.

మరో సినిమా ‘కాదంబరి’. దీనిలో శాంతా ఆప్టే, పహారీ సన్యాల్ లతో కలిసి నటించారు. బొద్దుగా ఉన్న శాంతా ఆప్టేని, బక్కపలచగా ఉన్న వనమాలని చూసి ‘ఒకరు కాదంబరి (నవలిక), ఒకరు నిఘంటువు’ అని హాస్యంగా వ్యాఖ్యానించారు. తరువాత సురేంద్రతో ‘పరిందే’, ఎజ్రా మీర్ ‘బీతే దీన్’, మోతీలాల్‍తో ‘ముస్కురాహట్’ సినిమాలు వచ్చాయి. మోతీలాల్, వనమాలల జోడీ బావుంటుంది. ఇద్దరూ సౌకర్యంగా నటించేవారు. వాడియా మూవీటోన్ వారి ‘షరాబతీ ఆంఖేం’ వచ్చింది. నర్గిస్‌కి తల్లిగా నటించిన ‘అంగారే’ వనమాల మరో చిత్రం.

‘వసంతసేన’ చిత్రం మరాఠీలోనూ, హిందీలోనూ ఒకేసారి విడుదలయింది. వనమాల, ఆచార్య ఆత్రే సంయుక్తంగా యజమానులైన చిత్ర మందిర్ ద్వారా ఈ చిత్రం విడుదలయింది. ఇది తన ఉత్తమ చిత్రంగా తను భావిస్తుంది. ఈ సినిమాలో తను – నిరుపేద అయినా, ప్రతిభావంతుడైన చారుదత్త అనే వ్యక్తిని ఇష్టపడే ఆస్థాన నర్తకి పాత్ర పోషించింది. జనాల ఆస్తుల ఆధారంగా వారిని అంచనా వేయని కులీన మహిళ విశ్వాసం పొందడానికి ఆమె తీవ్రంగా ప్రయత్నిస్తుంది. నేటి కేబరే డాన్సర్ల కంటే చక్కగా నృత్యం చేయగలదు వనమాల. అది ఆమెకు అదనపు బలం. ‘వసంతసేన’ చిత్రం ప్రేక్షకులని ఉజ్జయిని నగరానికి తీసుకువెళ్ళడం యాదృచ్ఛికం. ఆ నగరంలోనే ప్రముఖ సంస్కృత కవి కాళిదాసు ఈ నాటకాన్ని రచించారు. అక్కడే మా సోదరి వనమాల పుట్టింది.

‘పయాచి దాసి’ మరో సినిమా. ఇది ‘చరణోం కీ దాసీ’ అనే పేరుతో హిందీలో కూడా విడుదల అయింది. అత్తగారి దాష్టీకానికి గురయ్యే కోడలిగా వనమాల నటించింది. అత్తగారిలా దుర్గా ఖోటే నటించారు. ఈ చిత్రంలో వనమాల నటన అత్యంత సహజంగా ఉంటుంది. ఎందుకంటే తనకి ఇల్లంటే ఇష్టం, అదెంత అసౌకర్యంగా ఉన్నా సరే! ‘ఇంట్లో కొన్ని పుస్తకాలు ఉండాలి, తోటలో పూలు ఉండాలి’ అనేది.

బొంబాయిలో సముద్రపు ఒడ్డున ఫ్లాట్‌ని అద్దెకి ఇచ్చి, ఖండాలాలో ఓ భవంతి తన అభిరుచులకు అనుగుణంగా కట్టుకుంది. ఓ మినీ లైబ్రరీని ఏర్పచుకుంది. అయినా అది తన ఇల్లు కాలేకపోయింది. అనారోగ్యంగా ఉన్న మా నాన్నకి సేవలు చేయడానికి గ్వాలియర్ వచ్చేసింది. ఒక స్టూడియోని కొని, స్టూడియో యజమాని అయిన తొలి మహిళ అయింది.

‘శ్యామ్చి ఆయ్’ త్యాగాలు చేసి, పవిత్ర జీవితం గడిపే తల్లి పాత్ర పోషించింది. ఈ పాత్ర కోసం మా అమ్మ జీవన విధానాన్ని బాగా అనుకరించింది. ఈ చిత్రం మొదటిసారిగా రాష్ట్రపతి స్వర్ణపతకం పొందింది. నేటికీ ఓ క్లాసిక్‍గా పరిగణించబడుతుంది. ఈ పాత్ర పోషిస్తున్నప్పటికీ, తన ఆలోచనలన్నీ మరో చోట ఉన్నాయి. నాన్నగారి ఇంటి తోటలో మృదువుగా పాడే పక్షుల, నెమ్మదిగా కదిలే ఆకుల సవ్వడిపైనా ఉండేవి.

వనమాలాదేవి సినిమాల నుంచి విరమించుకోవడం ఆమె మిత్రులకు ఆశ్చర్యం కలిగించలేదు. భౌతిక పరమైన విజయాల కన్నా, ఆధ్యాత్మిక అనుభవాలు గొప్పవని తనకి తోచింది. తనకి కావలసినది సినీరంగంలో దొరకదని గ్రహించింది. తొలుత బృందావన కృష్ణుడికి, ఆపై మా తండ్రిగారికి సేవలందించింది.

తన కెరీర్‍ని ఒకసారి పునరావలోకనం చేసుకుంటే, ఎన్నో జవాబులేని ప్రశ్నలు మిగులుతాయి. కొన్ని పనులు ఎందుకు చేసిందో, ఎందుకు చేయలేదో అర్థం కాదు. ఉదాహారణకి తాను రాజకీయాలలోకి ఎందుకు ప్రవేశించలేదో తెలియదు. గట్టి జాతీయవాది అయినా, – అరుణా అసఫ్ అలీ, అచ్యుత్ పట్వర్ధన్ వంటి స్వాతంత్ర సమర యోధులకు తన ఇంట ఆశ్రయమిచ్చినా, రాజకీయాలలోకి ఎందుకు రాలేదో ఎవరికీ తెలియదు. వారిద్దరూ ఓ చిరునవ్వుతో మాయమైపోతారని – వాళ్ళని – ‘సరదా దెయ్యాలు’ అనేది. ఒకసారి అరుణా అసఫ్ అలీ పారిపోయేందుకు గాని ఆమె దుస్తులు తను వేసుకోవాల్సి వచ్చింది.

సినిమాలలో సెక్స్, క్రైమ్‍లను నిషేధించాలని తను కోరుకునేది. తన ఉద్దేశంలో రొమాన్స్ అనేది ఉదాత్తంగా ఉండాలని అనుకుంది. తన అభిప్రాయంలో – అన్ని సినిమాలూ – తన సినిమాల్లో చక్కని సందేశం కలిగి ఉండాలి. భారతీయ సంస్కృతి ఆధారంగా ఉండే సినిమాల ద్వారా వచ్చే డబ్బుతో మన సంస్కృతిని వృద్ధి చేయాలని అనేది. తాజ్ మహలో లేక అజంతా ఎల్లోరా గుహలో మన సంస్కృతికి గొప్ప కాదు, సభ్యసమాజం ముఖ్యమని భావించేది. గ్రామాల్లో కాని, పుణ్యక్షేత్రాలలోని కాని షూటింగ్ చేస్తే ఆ ప్రాంతాలకి ఉపయుక్తంగా ఉంటుందని తన అభిప్రాయం.

సినిమా గ్లామర్ మిస్ అవుతున్నావా అని అడిగితే, తను నవ్వేసింది. వీణ నుంచి సంగీతం పలకగానే, నొప్పి మాయమైనట్టు – బహుశా అటువంటి విషయాలను ఆమె అధిగమించింది. తనది నిరాడంబరమైన జీవితం. వేణువుగా మారిన వెదురు లాంటిది. దేవుడు దానిలో అపూర్వ సంగీతాన్ని నింపుతాడు.

***

సుశీలా దేవీ పవార్ అనే పేరుతో 23 మే 1915 న ఉజ్జయినిలో జన్మించారు వనమాల. 30వ దశకం చివర్లో, గ్రాడ్యుయేషన్ అనంతరం ఆమె సినీ కెరీర్ మొదలయ్యింది. అప్పటికే ఆమె పూణేలో టీచర్‍గా పని చేయసాగారు. గౌరవప్రదమైన కుటుంబాలకు చెందిన స్త్రీలు సినిమాలలో ప్రవేశించడంపై నిషేధం ఉన్న రోజుల్లో ఆమె సినిమాల్లో ప్రవేశించారు. అయితే అప్పటికే దేవికా రాణి, దుర్గా ఖోటే లాంటి మహిళలు సినిమాల్లో ఉన్నారు. సినీరంగంలోకి రమ్మని ఆవిడని ప్రోత్సహించింది వి. శాంతారాం గారు. వనమాల మరాఠీ, హిందీ – రెండు చిత్రసీమల్లోనూ ప్రసిద్ధి చెందారు. అయితే అది అంత సులువుగా సాధ్యం కాలేదు. ఆమె సినిమాల్లోకి రావడం ఇష్టం లేని ఆమె తండ్రి బాబూరావ్ పవార్ -గ్వాలియర్ పాలక వర్గానికి చెందిన వ్యక్తి – గ్వాలియర్‍లో ఆమె సినిమాలన్నీ నిషేధించాలని పట్టుపట్టారు. వనమాల మొదటిసారిగా వెండితెర పై కనబడినప్పుడు ఆయన తెరని తుపాకీతో కాల్చారు!

వనమాల మరాఠీ సినిమా ‘లపాండవ్’ (1940)తో తన కెరీర్ ప్రారంభించారు. ఈ సినిమా ప్రీమియర్ షో లో వనమాల షోరబ్ మోడిని కలిసారు. ఆయన తన చారిత్రాత్మక చిత్రం సికందర్ (1941) చిత్రంలో అవకాశం ఇచ్చారు.

ఆవిడ హిందీ సినిమాలలో ‘సికందర్’, ‘షరాబతీ ఆంఖేం’ (1945) అందరికీ గుర్తుండిపోయే చిత్రాలు. ‘షరాబతీ ఆంఖేం’ చిత్రాన్ని వాడియా మూవీటోన్ వారి కోసం రామచంద్ర ఠాకూర్ తీశారు. ‘సికందర్’ చిత్రంలో వనమాల అలెగ్జాండర్ ప్రియురాలు, పర్షియన్ మహిళ రుక్సానా పాత్ర పోషించారు. అలెగ్జాండర్ ప్రాణాలకు ముప్పు వస్తుందేమని భయపడి, పురుషోత్తముడి వద్ద మాట తీసుకుంటుంది రుక్సానా. ఈ చిత్రంలో వనమాల గాఢమైన ప్రభావం చూపారు. ఆమె కళ్ళు, అందమైన రూపం ప్రేక్షకులను చూపు తిప్పుకోనీయలేదు. హాలీవుడ్ సెట్‌లను తలపించే సెట్‍లు అదనపు ఆకర్షణ. అలాగే యుద్ధ సన్నివేశాలు కూడా. ఓ బ్రిటీష్ రచయిత – మాస్టర్ పీస్ – అని ప్రశసించారు.

‘షరాబతీ ఆంఖేం’ చిత్రంలో – వనమాల కళ్ళను గొప్పగా ఉపయోగించుకున్నారు. చిత్రం పేరుకి తగినట్టుగా… ఆమె కళ్ళు ప్రేక్షకులను మత్తెక్కించాయి. ఈ చిత్రం మహమ్మద రఫీ – ప్యార్ కర్నా హీ పడేగా, బహుత్ ముక్త్‌సర్ హై హమారీ కహానీ – అనే రెండు పాటలు పాడారు. ఈ చిత్రానికి ఫిరోజ్ నిజామి అద్భుతమైన సంగీతం సమకూర్చారు.

అయితే వనమాలకి ఘనకీర్తి తెచ్చిపెట్టిన సినిమా, ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘శ్యామ్చి ఆయ్’. దీనికి పి.కె. ఆత్రే దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్నీ నేటికీ ఓ క్లాసిక్‌గా పరిగణిస్తారు.

సానె గురూజీ (1899-1950) జీవితం ఆధారంగా అల్లిన కాల్పనిక 20వ శతాబ్దపు (1935)మరాఠీ నవల ఈ చిత్రానికి ఆధారం. ఆయన గాంధీజీని, వినోభా భావేని ఆదర్శంగా తీసుకుని, రైతులు కోసం పోరాటాలు జరిపి జైలుకి వెళ్ళారు. జైలులో రాసిన పుస్తకమే ‘శ్యామ్చి ఆయ్’. 45 అధ్యాయాలున్న ఈ పుస్తకం – కొంకణ్ ప్రాంతంలో జీవించే శ్యామ్ అనే యువకుడి కథ.  నిరాడంబంగా జీవిస్తూ, ఆచారవంతురాలైన తల్లి బోధనలను పాటిస్తాడతను. ఈ చిత్రం మరాఠీ చిత్రసీమలో ఓ మైలురాయిగా నిలిచింది. ముఖ్యంగా తల్లి పాత్రలకి వనమాల పాత్ర నమూనాగా మారింది. ఈ చిత్రంలో కొడుకు శ్యామ్ పాత్ర పోషించిన నటుడు మాధవ్ వాజే – “ఆమె పనులే ఆమె గురించి తెలిపేవి, ఆమె చాలా తక్కువ మాట్లాడుతారు. ఆమె విద్యాధికురాలు. గ్వాలియర్ సంస్థానానికి చెందిన కులీనులకు చెందిన మహిళ” అని చెప్పారు వనమాల గురించి.

సినీరంగాన్ని విడిచిపెడితే క్షమిస్తానని తండ్రి చెప్పడంతో – వనమాల సినిమాలను వదిలేశారు. ‘శ్యామ్చి ఆయ్’, ‘అంగారే’ (1954) తరువాత నటన నుంచి శాశ్వతంగా విరమించుకున్నారు. పయాచి దాసి (మరాఠీ)/చరణోం కీ దాసీ (హిందీ) (1941), వసంతసేన (1942), దిల్ కీ బాత్ (1944), పరిందే (1945), హాతీమ్ తాయ్ (1947), బీతే దిన్ (1947), ఆజాది కీ రాహ్ పర్ (1948) వారి ఇతర చిత్రాలు.

పైకి శాంతంగా కనబడే వనమాల దృఢమైన జాతీయవాది. అరుణా అసఫ్ అలీ, అచ్యుత్ పట్వర్ధన్ తోనూ స్నేహం చేశారు. ఎన్నో సామాజిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ నేషనల్ మెమోరియల్ కమిటీ సభ్యురాలు. బాలబాలికలకు భారతీయ కళలలో శిక్షణనిచ్చే ‘ది హరిదాస్ కళా సంస్థాన్’ అనే సంస్థని నడిపారు.

కాన్సర్‌తో బాధపడిన వనమాల  2007, మే 29న గ్వాలియర్‌లో మరణించారు.

ఆమె పాటలని యూట్యూబ్‌లో ఈ లింక్ లలో చూడవచ్చు:

https://www.youtube.com/watch?v=PDQaZ_DKO8w

https://www.youtube.com/watch?v=4B_OpWPs0Rs

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here