[dropcap]ఇ[/dropcap]వాళ ఒక దెయ్యం కథ చెబుతానర్రా. దెయ్యం అనంగానే భయపడక్కరలేదు. అవేం వచ్చి మనల్ని పీక్కు తినవు సినిమాల్లోలాగ. మీలో కొందరికి దెయ్యాలనంగానే భయం వేస్తుందికదా!? ఆ భయం పోగొట్టటానికే ఇలాంటి కథలు. మరి కథ చెప్పనా?
అనగనగా ఒక ఊరు. ఊరు చివర ఒక పెద్ద మఱ్ఱి చెట్టు. చాలా ఏళ్ళనాటిది. చాలా పెద్ద చెట్టు. మఱ్ఱి చెట్టుకి ఊడలుంటాయి తెలుసుకదా మీకు? పై కొమ్మలనుంచి కింద భూమిదాకా నెమ్మది నెమ్మదిగా పెరిగి భూమిలో పాతుకుపోతాయి, అంత పెద్ద చెట్టుకి ఆధారం అన్నట్లు. ఆ చెట్టు తర్వాత కూడా తర్వాత పెరిగిన ఊరు వుంది. ఆ చెట్టుకి అవతల ఒక పెద్ద ఇంట్లో గోపాలరావు అనే ఆయన పెద్ద బేకరీ నడుపుతున్నాడు. అక్కడే అన్నీ తయారు చేయించి తాజాగా ఆ ఊరి వారికే గాక పక్క ఊళ్ళవాళ్ళకి కూడా అమ్ముతుంటాడు. ఆ బేకరీ చుట్టుపక్కల చాలా ప్రసిధ్ధి చెందింది. చాలామంది అక్కడికి వచ్చి కొనుక్కెళ్తుంటారు.
ఆ బేకరీలో కొన్ని ఎలుకలు కూడా వున్నాయి. సాధారణంగా ఆహార పదార్ధాలు తేలిగ్గా దొరికే చోట ఎలుకలు, పురుగులు తప్పకుండా వుంటాయి. అందుకే కదా మన అమ్మలు ఎప్పుడూ వంటింటిని శుభ్రంగా వుంచుతారు. లేకపోతే ఎలుకలు, పురుగులు చేరి వాటివల్ల మనకి కూడా జబ్బులు వస్తాయి. కదా సరే. ఆ ఎలుకల్లో రెండు ఎలుకలు, ఈజా, ఊజా మరీ గడుగ్గాయిలు. తెగ అల్లరి చేస్తాయి. అవ్వన్నీ ఆ బేకరీలో సరుకులు పెద్ద మొత్తంలో తెచ్చినప్పుడు కింది పడ్డ ఆహార పదార్ధాలను తింటూ హాయిగా వుంటున్నాయి. (తయారయిన పదార్ధాల జోలికి పోవులెండి. వాటిని గాజు బీరువాల్లో భద్రపరుస్తారుకదా.)
ఒకసారి ఆ ఊరిలో పెద్ద పుకారు వచ్చింది. పుకారు అంటే తెలుసా? ఆధారం లేకుండా ఏదన్నా వార్తని అందరూ చెప్పుకుంటూ దాన్ని ప్రచారం చేస్తే దాన్ని పుకారు అంటారు! ఆ వార్తలు మంచివీ వుండచ్చు, చెడ్డవీ వుండచ్చు. ఇక్కడ వచ్చిన పుకారు ఏమిటో తెలుసా? ఆ మఱ్ఱి చెట్టు మీద ఒక దెయ్యం వచ్చి వున్నదని, రాత్రయితే అది ఆ ప్రాంతాలకి ఎవరినీ రానివ్వటంలేదనీ, పెద్దగా అరుస్తూ, వింత వింత కేకలు వేస్తూ అందర్నీ భయపెడుతోందనీ, ఒక్కొక్కసారి పగలు కూడా అరుస్తూ అటు వెళ్ళినవాళ్ళని భయపెడుతోందనీ, అందరూ చెప్పుకోవటం మొదలెట్టారు. దెయ్యం భయంతో కొంచెం చీకటి పడిందంటే ఆ వైపులకి ఎవరూ రావటం లేదు సరికదా, కొందరైతే అటెళ్ళక పోతే పోనీ, ప్రాణాలతో వుంటే చాలని పగలు కూడా అటు పక్కకి వెళ్ళటం మానుకున్నారు. పాపం గోపాలరావు వ్యాపారం బాగా దెబ్బతింది ఈ దెయ్యం గోలతో. రాత్రి 11 గంటల దాకా సాగే వ్యాపారం చీకటి పడకుండానే మూత పడుతోంది. ప్రజలలో పిరికివాళ్ళు చాలామంది పగలు కూడా ఆ ఛాయలకు రావటం లేదు. బేకరీకి చాలా నష్టం వస్తోంది. ఏం చెయ్యాలో తోచక దిగులు పడ్డాడు గోపాలరావు.
వ్యాపారం సాగకపోయేసరికి ఆహార పదార్థాల కొనుగోలు తగ్గింది. వున్నవాటిని జాగ్రత్తగా వాడటంతో ఎలుకలకు ఆహారానికి ఇబ్బంది కాసాగింది. ఇవ్వన్నీ గమనించి ఈజా, ఊజాలు తమ యజమానికి ఏదన్నా సహాయం చెయ్యాలనుకున్నారు. మరి ఆయన గమనించి తోలక పోవటంతోనే కదా తామింత హాయిగా బతుకుతున్నది. ఆయన అనుకున్నా, అనుకోకపోయినా ఆయన తమ యజమాని. ఆయన కష్టాన్ని పోగొట్టి ఆయన వ్యాపారం మళ్ళా మామూలుగా వుండేటట్లు చూడాలనుకున్నాయి. ఇంక తమ పరిశోధన ప్రారంభించాయి.
అసలు దెయ్యమంటే ఏమిటి? అది ఎట్లా వుంటుందో చూడాలనుకున్నాయి ముందు. ఎందుకైనా మంచిదని పగలే ఒకసారి వెళ్ళి భయం భయంగా ఆ చెట్టు చుట్టూ తిరిగాయి. ఏమీ కనబడలేదు. దెయ్యం చెట్టుమీదా వుందా? ఆకుల చాటున దాక్కునుందా? ఎలా కనుక్కోవటం? ఇంతలో ఒక మనిషి అటుగా వెళ్తున్నాడు. కొత్తవాడనుకుంటా.. దెయ్యం సంగతి తెలియక వెళ్తున్నాడేమో! అతన్ని చూడగానే చెట్టు పైనుంచి అడవి మనుషులు వేసే కేకలు లాంటివి వినిపించాయి. దానితో ఆ మనిషి చుట్టు పక్కల ఎవరూ లేకపోవటంతో భయపడి పరిగెత్తిపోయాడు. ఈజా, ఊజా సంతోషంతో ఎగిరి గంతేశాయి. దెయ్యం సంగతి తెలిసిపోయింది. ఇంక దాన్ని అక్కడనుంచి పంపించాలి.
కొంచెం ఆలోచించి రాత్రికి వద్దామనుకున్నాయి. ఆప్పుడయితే ఎవరూ వుండరు కదా. అలాగే రాత్రికి వస్తూ వస్తూ బేకరీనుంచి ఒక రొట్టె తెచ్చాయి. చెట్టుకిందకొచ్చి దెయ్యం అరిచినట్లే అరిచాయి పెద్దగా. చెట్టుమీద వున్న దెయ్యం తమవారెవరో వచ్చారనుకుని గబగబా దిగి వచ్చింది. దాన్ని చూడగానే ఈజా ఊజా రొట్టె ఇచ్చాయి. కొన్ని రోజులనుంచీ తిండిలేక ఆకలికి మాడి వున్నాడేమో, ఆ దెయ్యం గబగబా ఆ రొట్టెంతా తినేశాడు. అప్పటిదాకా నిశ్శబ్దంగా వున్న ఈజా, ఊజా అప్పుడడిగాయి ఆ దెయ్యాన్ని ఇక్కడికి ఎందుకు వచ్చావని? వీటి భాష దెయ్యానికి అర్థం కాలేదు. అది చూసి ఈజ, ఊజా సంజ్ఞలతో అడిగాయి.. ఇక్కడికి ఎందుకు వచ్చావని. ఆ దెయ్యం తన భాషలో ఏదో చెప్పింది. వీటికి అర్థం కాలేదు. దాంతో కొంత తన భాషలో, కొంత సంజ్ఞలతో చెప్పింది తప్పిపోయి వచ్చానని. తిరిగి వెళ్ళాలంటే ఎట్లా వెళ్ళాలో తెలియలేదనీ, పైగా ఈ మనుషులని చూసి వాళ్ళు తననేం చేస్తారోనని భయంతో అరిచేవాడినని. ఈజా, ఊజా తెగ నవ్వుకున్నాయి దెయ్యం సమాధానం విని. మేము దోవ చూపిస్తాం వెళ్ళిపో అని దెయ్యానికి చెప్పాయి. ఆ దెయ్యం సంతోషంగా తల వూపింది. తమతో రమ్మని ముందు ఈజా, ఊజాలు పరుగు తియ్యగా వెనకాల దెయ్యం పరుగు తీసింది అడవిలోకి. ఈజా ఊజాకి ఆ అడవి, అక్కడ వుండే మనుషులు తెలుసు గనుక ఆ దెయ్యాన్ని క్షేమంగా వాళ్ళ ఊరు దాకా తీసుకెళ్ళాయి.
ఇంతకీ ఆ దెయ్యం ఏమిటో తెలుసా? దగ్గరలో అడవిలో వుండే అడవిజాతి యువకుడు. కొందరు అతని వేషం సరిగా చూసీ, చూడకా, అతని అరుపులు విని దెయ్యం అనుకుని పుకార్లు లేవదీశారు. ఆ అడవి మనికీ ఊరు, ఊరిలో మనషులు కొత్త. ఎప్పుడూ ఇటు రాలేదు. ఈ మనుషులు తననేమి చేస్తారోననే భయంతో వాళ్ళు దగ్గరకి రాకుండా పారిపోవటానికి అరిచేవాడు.
మొత్తానికి ఈజా, ఊజాలు తమ యజమాని కోసం అసలు విషయం తెలుసుకుని ఆ దెయ్యాన్ని పారదోలి,, యజమాని వ్యాపారాన్ని నిలబెట్టి, వాళ్ళు హాయిగా బతకసాగారు.