ఎన్నో ప్రశ్నలు – కొన్ని జవాబులు-7

1
3

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత్రి గంటి భానుమతి గారి కలం నుంచి జాలువారిన ‘ఎన్నో ప్రశ్నలు – కొన్ని జవాబులు’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]శి[/dropcap]వరామ్ అసహనంగా అటూ ఇటూ చూసాడు.

“ఏం భయపడకు. నీకు ఎప్పుడు వెళ్ళాలనిపిస్తే అప్పుడు నిన్ను తీసుకు వచ్చిన కార్లో నిన్ను దింపుతాము. ఇక్కడ రాత్రి పడుకోవాలనిపిస్తే దానికి కూడా అన్నీ ఉన్నాయి. అది నీకు కంఫర్టబుల్‌గా ఉండదని నాకు తెలుసు.”

“ఉండను. నేను వెళ్ళిపోతాను.” తల అడ్డంగా ఊపాడు.

“కాని, నువ్వు వెళ్ళే ముందు నేను చెప్పేవన్ని వినాలి.”

“వింటున్నాను. చెప్పు.” ఆ గొంతులోని సౌమ్యత బ్రహ్మాజీకి ఉత్సాహాన్నిచ్చింది.

“మా నాన్నగారు ఎవరితో చేయి కలపరు. ఆ చెట్టు కింద నీతో చేయి కలిపారు. షేక్‌హాండ్ ఇచ్చారు. అప్పుడు మన వయసు పన్నెండు సంవత్సరాలు. మన బాల్యపు చివరి రోజులు. నీకు ఇబ్బందిగా ఉందా వినడానికి.”

“లేదు. ఏం పరవాలేదు చెప్పు.” కొవ్వొత్తి వెలుగులో శివరాం మొహంలోని భావాలు సరిగా కనిపించలేదు.

“ఆ స్నేహం ఇప్పుడు ఉందో లేదో కాని, అప్పుడు నా దృష్టిలో అదో గొప్ప బంధం. దానికి ఆధారం నీమీద జాలి కాదు. ఓ మనిషిగా ఆలోచించాను, పాపం, చిన్నవాడివి, ఒక్కడివి, ఎలా అనే ఆలోచించాను. ఆ భావం ఏంటో నాకే తెలీదు కాని, దాన్ని పైకి చెప్పేలాంటి భాష లేదు. పన్నెండేళ్ళ వయసులో ఏం చెప్పగలను, అది చెప్పేందుకు నా దగ్గర పదాలు లేవు.

మనది స్నేహం అనుకున్నాను. అలా అనుకోడంలో ఓ ఆకర్షణ ఉంది. అది ఎటువంటిదో తెలీదు, చెప్పడం కష్టం. ఈ రోజుల్లో అలాంటి స్నేహం గురించి రాయడానికి పుస్తకాలున్నాయి. నువ్వు బయటి ప్రపంచాన్ని చూసావు, నీకు నాకన్నా బాగా తెలుసు. నేను ఈ అడివి లోని బంగాళాలో ఉండిపోయాను. కాని నాకు స్నేహం విలువ తెలుసు. స్నేహాన్ని స్నేహం లాగానే ఉంచాలి, అని అనుకునే వాడిని.

ఈ విషయం మా నాన్నగారికి తెలుసు. ఆయనకి ఎంతో మంది స్నేహితులున్నారు. మా ఇంట్లో వాళ్ళు రెండు మూడు రోజులుండేవారు. కలిసి వేటకి వెళ్ళేవారు, ఆయన స్నేహానికి విలువనిచ్చారు. అదే నాకు వచ్చింది.

ఆయన ఎప్పుడూ అనేవారు. స్నేహం అంటే ఓ డ్యూటీ లాంటిది. స్వచ్ఛమైన స్నేహనికి విధులు కూడా ఉంటాయి. ఓ స్నేహితుడికి ఎన్నుకున్నాక అతని తప్పులు బలహీనతలు చూడకూడదు. దాని పరిణామాలు ఆలోచించకూడదు.. అది ఆదర్శం. అటువంటి ఆదర్శం లేనప్పుడు, ఏదైనా అర్థం ఉంటుందా ఆ స్నేహానికి.

ఒకవేళ ఆ స్నేహితుడు నిలబెట్టుకో లేకపోతే అతను నిజమైన స్నేహితుడు కాదు. అతని గుణాల మీద, అతని బలహీనతల మీద దెబ్బ కొట్టినట్టే. స్నేహితుడిలోని అభిమానాన్ని లాయల్టీ మంచితనం దాని విలువని సరిగ్గా చూడగలిగితే ఆ స్నేహం విలువ కట్టలేము. నిజాయితీ నమ్మకం లేకపోతే ఆ ప్రేమకి, ఆ అభిమానానికి విలువ ఏంటి. అందుకే ఎలాంటి స్నేహితుడినైనా అంగీకరించడం బాధ్యత. విధి అని నేననుకున్నాను, ఇప్పుడు చెప్పు మన సంబందాల్లో ఈ నిరుత్సాహం మంచిదా! ఇన్ని ఏళ్ళ తరవాత స్నేహం అనేదానికి అర్థం మారిందని తెలుసుకున్నాను.

ఓ మనిషి తన జీవితంలోని ముఖ్యమైన దశని, స్నేహం కోసం త్యాగం చేసాను. గుడ్డిగా నమ్మిన ఆ స్నేహితుడు నమ్మక ద్రోహం చేసాడు. పగ పట్టాడు. మోసం చేసాడు. హటాత్తుగా ఆ స్నేహితుడిని వదిలేసాడు. అలాంటప్పుడు ఆ స్నేహానికి అర్థం ఏంటీ? ఆ స్నేహానికి విలువ ఏంటీ?

దీనికి జవాబులు వెతికాను. నిజానికి ఇవన్నీ థియరిటికల్ ప్రశ్నలు.

ఎంతో ఆలోచించాను. ఇవన్నీ నన్ను, నా మనసుని బిజీగా ఉంచాయి. అయితే ఆ ఆలోచనల్లో ఒంటరితనంలో నాకు జవాబులు దొరకలేదు. ఎన్నో పుస్తకాలు చదివాను. కాని దొరకలేదు. నిజం ఏంటో తెలీలేదు.

చదవడం, నన్ను నేను ప్రశ్నించుకోడం, దీనితో కాలం గడిచి పోయింది. ఈ జ్ఞాపకాలు గుట్టలు గుట్టలుగా పేరుకు పోయాయి. దీనికి జవాబులు వెతికాను. మన విషయంలో కష్టం అనిపించింది. ఎందుకంటే నువ్వు వెళ్ళిపోవడంతో నేను ఒక్కడినే జవాబులు ఇచ్చుకోలేను. జవాబులు ఇవ్వాల్సిన వాళ్ళు వేరే ఉన్నారు.”

చీకటిగా ఉన్న ఆ గదిలో కొవ్వొత్తులు ఊగుతున్నాయి.

“దీని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అందుకే నువ్వు ఇక్కడ ఉన్నావు, దీనికి జవాబులు కావాలి. ఓ కథలాంటి నిజం ఉంది. దీని గురించి మాట్లాడడం కష్టం కాదు.”

చేతులు కట్టుకుని, కుడి కాలుని ఎడమ కాలి మీద వేసి, ఆ పెద్ద సోఫాలో వెనక్కి వాలి కూచున్నాడు. ఆ చర్యలో రాజసం ఉంది.

“గత కొన్ని సంవత్సరాలు మన జీవితాలలో ఎన్నో జరిగాయి. అందులోని నిజాలు, సత్యాలు ఎలా ఉన్నాయంటే ఓ మనిషిని నరకయాతన పెడుతూంటే అరిచే అరుపుల్లా గట్టిగా అరుస్తున్నాయి. మనలో ఇంకా ఇప్పటికి కూడా తప్పు చేసాం అనే భావన రాకపోతే నిజం బయటికి రాదు. నేను చదివిన వాటిల్లో ఇలాగే ఉంది.

ఓ మనిషి నమ్మక ద్రోహం , హత్య చేసినా తప్పించుకుని తిరగచ్చు. కాని నీ విషయంలో అలా జరగలేదు. నువ్వు చేసినది నాకేమాత్రం అర్థం కాలేదు. నీ చేతలు పూర్తి నిజాన్ని చెప్పవు.

నువ్వు వెళ్ళిపోవడం ఎన్నో చెప్తాయి. కాని నీ ఉద్దేశం చెప్పకపోవచ్చు. నీ ఈ పలాయనం గురించి, అంతర్ధానం గురించి ఈ నలభై మూడేళ్ళు అన్ని కోణాల్లోంచి కారణాలు వెతికాను, ఆలోచించాను. నా జవాబులు నాకు సంతృప్తినివ్వ లేదు. నిజం ఒక్కటే అన్నింటినీ స్పష్టం చేస్తుంది.” ఆగాడు బ్రహ్మాజీ.

“నువ్వు చాలా కఠినమైన పదాన్ని వాడావు. పలాయనం అన్నావు. అంతర్ధానం అన్నావు, ఎందుకని వాటిని వాడావు? నిజం నేను వెళ్ళిపోయాను. నేను ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. నాకు స్వతంత్రం ఉంది. వెళ్ళే హక్కు ఉంది. నేను ఎవరికీ వాగ్దానాలు చెయ్యలేదు. ఎవరికి బాకీ లేను. వెళ్ళిపోయాను. అంతే, కాని అంతర్ధానం అవలేదు.” అలా అంటూ కుర్చీలోంచి కదిలాడు.

“నువ్వన్నావు ఎవరికీ బాకీ లేను అని, అది నిజం కాదు. నువ్వు ఉంటున్న ఊళ్ళో ఎవరికీ బాకీ లేకపోవచ్చు. నాకు కూడా బాకీ లేకపోవచ్చు. కాని నువ్వు బాకీ ఉన్నది వేరు.

ఈ సమయాన నీకు ఆ బాకీ గురించి, ఆరోజు జరిగినది గుర్తు చెయ్యాలి. నాకు అన్నీ బాగా గుర్తు. ఆ రోజు బుధవారం, నువ్వు వెళ్ళిపోయిన రోజు.

నువ్వు నీ వెనకాల బాకీని వదిలి వెళ్ళావని తెలుసు. అవి నువ్వివ్వాల్సిన జవాబులు. అవే బాకీలు. ఆ తర్వాత నా అనుభవం కూడా నీకు తెలియాలి కదా, ఒకటి ఆ బుధవారం, నువ్వు నన్నెందుకు చంపాలనుకున్నావు, దాని జవాబు కావాలి. రెండోది ఆ మరునాడే చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయావు,

దీని గురించి అడుగుదామనుకుని ఆ మరునాడు, అంటే గురువారం, నీ అపార్టుమెంటుకి వెళ్ళాను. నువ్వు కనిపించలేదు. నీ అపార్టుమెంటు ఖాళీ. పనివాడిని అడిగాను. అప్పటికే నువ్వు వెళ్లి చాలా సేపైందని విన్నాను.” అని కళ్ళమీద చేతిని ఉంచాడు. ఏదో గుర్తు తెచ్చుకుంటున్నట్లు ఉన్నాడు.

శివరాం ఏం మాట్లాడ లేదు. అందుకని బ్రహ్మాజీ కొనసాగించాడు.

“నీ గదిలోకి వెళ్ళాను. ఖాళీగా ఉంది. ఆ గది మధ్యలో ఒక్కడినే ఉన్నాను. చుట్టూ చూసాను. ఖాళీ. ఏమీ లేదు. అది కఠోరమైన సత్యం. నా జీవితంలో ఓ పాతికేళ్ళు నా ఇంట్లో ఉన్న వాడు, నాతో గడిపిన మనిషి, నా మనిషి అని అనుకున్న నువ్వు వెళ్ళిపోయావు, ఇది షాక్. కఠినమైన సత్యాన్ని నమ్మలేకపోయాను. పాజిటివ్‌గా తీసుకోవాలనుకున్నాను.

నీకు ఒంట్లో బాగా లేదేమో అనుకున్నాను. కాని ఆ ఆలోచన తాత్కాలికం, ఏదో ఓ రోజున తిరిగి వస్తావని అనుకున్నాను. ఎన్నో విధాలుగా ఎన్నో కోణాల్లోంచి ఆలోచించాకా ఒక్కటే అనిపించింది, నువ్వు తప్పు చేసావు, ఓ దొంగలాగా, ఓ మోసగాడిలాగా మొహం చాటేసి చెప్పకుండా వెళ్ళిపోయావు.

నీకు ఇంకా కొన్ని విషయాలు గుర్తు చెయ్యాలి.

ఈ భవనంలో మనం ముగ్గురం గడిపాం. ఒక్కొక్కసారి రాత్రి అంతా గడిపే వాళ్ళం. చాలా రోజుల తరవాత కలుసుకున్న స్నేహితుల్లాగా, అన్నదమ్ముల మధ్య ఉండే సఖ్యత లాగా, కవల పిల్లలు షేర్ చేసుకునేలాంటి విషయాలు ఎన్నో మాట్లాడుకునేవాళ్లం. మనల్ని ఎవరూ వేరు చేయలేరని అనుకున్నాను.

మనది ఒకటే జీవితం. మరణం ఒక్కటే మనల్ని దూరం చేస్తుందని అనుకున్నాం. కాని అది నిజం కాదని తరవాత అర్థం అయింది. వయసు పెరుగుతున్నకొద్దీ, రోజులు గడుస్తున్న కొద్దీ మన మధ్య ఏవో బీటలు కనిపించడం మొదలైంది. ఏదో జరుగుతోంది, ఏదో ఉన్నట్టుగా ఉంది. మన మధ్య దూరం పెరిగిందనిపించింది. అది నీ వైపు నుంచి, నువ్వు నాకు అర్థం కాకుండా పోతున్నావు.

చాలా రోజులు ఆలోచించాను. నేనేమైనా తప్పుచేసానా, ఈ ఇంట్లో అవమానం జరిగిందా, ఎస్టేట్‌లో తక్కువగా చూసారా, ఆఖరికి ఒక కంక్లూజన్‌కి వచ్చాను. అలా పెరగడానికి కారణాలు ఏమైనా ఉందంటే నా పెళ్ళి కావచ్చు అని అనుకున్నాను. ఆ కారణం కూడా నాకు ఊహకి అందనిది.

స్నేహితుల మధ్య దూరం పెరుగచ్చు. ఒకరి నుంచి మరొకరు దూరంగా వేరే ప్రదేశాలకి వెళ్ళి ఉండచ్చు. దేశాలు విడదీయచ్చు, నదులు విడదీయచ్చు కాని ఒకళ్ళ గురించిన మరొకళ్ళకి ఆ స్నేహ పరిమళం తెలుస్తుంది. ఆ ఇద్దరిలో ఒకరికి ఓ కొత్త ఫ్రెండ్ దొరకవచ్చు. కాని ఆ పాత బంధం గురించినవి వారి మధ్య రాక పోవచ్చు. కాని ఆ స్నేహం చెదరదు. ఇలా పాజిటివ్‌గా ఎన్నో ఎన్నో విధాలుగా ఆలోచించాను.

కాని నువ్వు ఆలోచించలేదు. మన స్నేహం గురించి నేను మాత్రం ఓ పిచ్చివాడిలా ఆలోచిస్తూండి పోయాను. ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంటుంది, వెళ్ళిపోతున్నప్పుడు నువ్వు నన్ను కలుసుకోకూడదు అన్న ఆలోచన నీకు వచ్చినందుకు.

ఇక్కడే మొదటిసారిగా ఆశ్చర్యపోయాను. ఇంతకు ముందు ఇలా ఎప్పుడూ జరగలేదు. మొదటిసారి నువ్వు అలా ప్రవర్తించడం. నువ్వు అలా వెళ్ళి పోవడానికి ముందు ఓ ఇల్లు తీసుకున్నావని తెలుసాకా మళ్ళీ ఆశ్చర్యపోయాను. ఇల్లు తీసుకున్న విషయం కూడా నాకు తెలీకుండా జాగ్రత్త పడ్డావు.

నీ ప్రవర్తనకి బాధ పడ్డాను. ఎందుకు, ఎందుకు అన్న ప్రశ్నలు నాలో మొదలయ్యాయి.

మొదటి ప్రశ్న ఇల్లు ఎందుకు తీసుకున్నాడు అన్నది. ఇల్లు తీసుకున్నట్లు నాకు చెప్పలేదు. ఎందుకు , ఇది నువ్వు పారిపోడానికి ముందర నుంచి వేసుకున్న ప్లాన్ అని తెలిసి మరోసారి ఆశ్చర్యపోయాను. మరోసారి ఎందుకు.

నాకు తెలుసు పారిపోడం అన్న మాట నీలో అలజడిని రేపుతుందని. కాని ఆ మాట ఇప్పుడు సరి అయినది.” ఆగిపోయి శివరాంని చూసాడు బ్రహ్మాజీ.

“ఆపకు, పర్వాలేదు, నీ మాటలు కొనసాగించు. ఇక్కడ పదాలు అనేవి ఇష్యూ కాదు.”

ఆశ్చర్యంగా, అమాయకంగా చూసాడు శివరాంని.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here