[dropcap]1[/dropcap]
కొందరుంటారు
తరిగిపోని జ్ఞాన నిధుల్లా
మన మధ్యనే తిరుగుతుంటారు
సంభాషణల మధురిమలతో
అద్భుత కావ్యాల్లా అలరిస్తుంటారు
అపరిమితమైన కోరికలను
అడుగడుగున దహించుకుంటూనే
అసాధ్యాలను సుసాధ్యం చేసుకుంటూ
విజయ రాగాలను వినిపిస్తుంటారు
రంగులమయమైన జీవనంలో
సింగిడిలా విరాజిల్లుతుంటారు
సమస్యల సవాళ్లు ఎదురైనా
తలవంచని యోధుల్లా వర్ధిల్లుతుంటారు
అపజయాలు వెంటాడుతున్నా
నిర్భయంగానే సంచరిస్తుంటారు
ఆలోచనల సాకారం కోసం
నిర్విఘ్నంగా శ్రమిస్తుంటారు..!
2
ఇంకొందరుంటారు
పున్నమి నాటి వెన్నెల వలె ఉండాలంటే
అందులోని మచ్చలను వెతుకుతుంటారు
పదాలలోని అర్థాలను గ్రహించాలంటే
విపరీతార్థాలతో
ఒళ్ళును తడుముకుంటారు
ఆత్మీయ బంధాలను నెలకొల్పాలంటే
విరోదభరితమైన
విస్మయాన్ని కలిగిస్తుంటారు..!
తమ చుట్టు తాము గీసుకున్న
వలయంలోనే సేదతీరుతూ
అన్ని తెలుసుననే
భ్రమల్లోనే బ్రతుకుతూ
వంచనలతో కూడిన ప్రసంగాలను
చెప్తూ సేవ చేస్తున్నామంటారు
ఏవో కల్లబొల్లి వాగ్దానాలను
మాయమాటలతో నమ్మిస్తుంటారు
ఆ క్షణాలు గడిచిపోగానే
మటుమాయమై పోతుంటారు
స్నేహపు సంకెళ్ళల్లో మనల్ని బంధించి
వెర్రి వాళ్ళను చేసి ఆడుకుంటారు..!
మనలను మెట్లుగా మార్చుకొని
వాళ్ళు దర్జాగా అదిరోహిస్తుంటారు
అవసరం తీరితే చాలిక
అంతుబట్టని ఆరోపణలను గుప్పిస్తూ
మానసిక వేదనలకు గురి చేస్తుంటారు..!
ప్రాణంగా విశ్వసించిన వాళ్లే కావచ్చు
విలాపాలకు కారణమవుతుంటారు
బ్రతకడం నేర్చుకోవాలని
లౌక్యమిట్ల ప్రదర్శించాలని
పక్కా ప్రణాళికలతో చేరుతుంటారు
అందుకనే జర జాగ్రత్త సుమా
జనారణ్యంలో వేటగాళ్ళుగా
నీడలా వెంటాడుతున్న మోసగాళ్లతో..!
3
మరి కొందరుంటారు
తనువంతా రక్తసిక్త గాయాలైన
లక్ష్యాన్ని వదలని సాధకులు వాళ్ళు
రక్త మరకలు చెరిగిపోతాయేమో కాని
ఆశయాలను మరువని ధీరులు వాళ్ళు
ముసురుకున్న చీకట్లను పారద్రోలే
కొంగ్రొత్త వెలుగు రేఖలు వాళ్ళు
యుగ యుగాలుగా అవిశ్రాంతమైన
మానవీయ సేద్యంలో కర్షకులు వాళ్ళు
ఒడ్డున నిలబడి ఉన్నంతకాలం
నది సొగసును ఆస్వాదించడమే కాదు
పరువల్లెత్తుతున్న దాని హోరును పసికట్టి
పడిపోకుండా నిలువడమెట్లనో
నేర్పే కార్యసాధకులు వాళ్ళు
తేజోమయమైన బోధనలో
ఉత్తేజపరిచే ఆచార్యులు వాళ్ళు
నిర్విరామ గమనోత్సాహంలో
మడమ తిప్పని
మార్గ నిర్దేశకులు వాళ్ళు..!