మూడు చేపలు

0
3

[dropcap]”సా[/dropcap]ర్. మీరు ఇదివరకు భవానీ నగర్‌లో ఉండేవారు కదా?” తన ఆటో ఎక్కిన సాయిప్రసాద్‌ని  అడిగాడు రవి ఆటో నడుపుతూ.

“అవును. నీకెలా తెలుసు?” అని అడిగాడు సాయిప్రసాద్.

“నా ఫ్రెండ్స్ మీ ఇంటిదగ్గరే ఉండేవారు సార్. ఇప్పుడు మీరెక్కడ ఉంటున్నారు?”

“గత అయిదేళ్ళుగా బెంగళూరులో మా అబ్బాయి దగ్గర ఉంటున్నాను. మా ఇల్లు నీకు తెలుసా?”

“తెలుసు సార్. మీ ఇంటిప్రక్కనే ఖాళీ స్థలం ఉండేది. నేను, నా ఇద్దరు ఫ్రెండ్స్ కాలేజీ వదలగానే అక్కడికి వచ్చి, అక్కడ ఉన్న ఓ బల్ల పైన కూర్చుని సినిమాల గురించి, బిగ్ బాస్, జబర్దస్త్ లాంటి టీవీ కార్యక్రమాల గురించి, క్రికెట్ మ్యాచుల గురించి గంటలకొద్దీ మాట్లాడుకునేవాళ్ళం. ఓ రోజు మీరు మా దగ్గరికి వచ్చిమాకు పెద్ద క్లాస్ తీసుకున్నారు. చాలా ఓపికగా మాకు మంచి చెప్పారు” అన్నాడు.

సాయిప్రసాద్‌కి గుర్తొచ్చింది. ఆరోజు తను వారి దగ్గరికి వెళ్ళి “మిమ్మల్ని రోజూ చూస్తున్నాను. టీవీ షోలు రిటైర్ అయినవారు, గృహిణులు కాలక్షేపం కోసం చూసే ప్రోగ్రామ్‌లు. మీరు విద్యార్థులు. ఎంతో భవిష్యత్తు ఉన్నవారు. రిక్రియేషన్ కోసం ఓ క్రికెట్ మ్యాచ్, ఓ సినిమా అప్పుడప్పుడూ చూస్తే తప్పు లేదు గానీ, పనిగట్టుకుని అన్ని ప్రోగ్రాములు చూడటమే కాకుండా వాటిగురించి గంటల తరబడి చర్చిస్తూ మీ విలువైన సమయాన్ని వృథా చేస్తున్నారు. మీ  విజ్ఞానాన్ని పెంపొందింపచేసే కార్యక్రమాలు ఉంటాయి, వాటిని చూడండి. మీ సంస్కారాన్ని పెంచే పుస్తకాలున్నాయి. వాటిని చదవండి. ముఖ్యంగా మీ పాఠ్యపుస్తకాలు చదివి పరీక్షలు పాస్ అవండి. మీరు మేధావులు కండి, వెధవలు కాకండి” అన్నాడు.

“మీరు అంత బాగా వివరించి చెప్పినా నేను వినిపించుకోలేదు” అన్నాడు రవి బాధగా.

ఆటో ఓ పెద్ద బిల్డింగ్ ముందు ఆగింది.

“మీరు ఎవరిని కలవాలి సార్” అని రవి అడిగాడు.

“ఈ బిల్డింగ్‌లో లాయర్ రవిశేఖర్ ఆఫీస్ ఉందని విన్నాను. ఆయన్ని కలవాలి”

“మీరు ఆటోలోనే కూర్చుని ఉండండి. నేనిప్పుడే వస్తాను” అంటూ రవి ఆ బిల్డింగ్ లోపలికి వెళ్ళి, ఓ వ్యక్తితో తిరిగి వచ్చాడు.

“వీడు రమేష్. రవిశేఖర్ గుమాస్తా. మీ మాట వినని రెండో వెధవ వీడు. అయితే ‘మూడు చేపలు’ కథలో ప్రాప్తకాలజ్ఞుడిలా వీడు ఆలస్యంగానైనా కళ్ళు తెరిచాడు. పరీక్షలన్నీ పాస్ అయి  రవిశేఖర్ దగ్గర గుమాస్తాగా చేరాడు. బాగా సంపాదిస్తున్నాడు” అంటూ రమేష్‌ని సాయిప్రసాద్‌కి పరిచయం చేసాడు రవి.

“చాలా సంతోషం” అన్నాడు సాయిప్రసాద్.

“నేను దీర్ఘసూత్రుడినయ్యాను. ఇలా ఆటో నడుపుకుంటున్నాను” అన్నాడు రవి నవ్వుతూ.

“మరి ఆ మూడో అబ్బాయి ఏమయ్యాడు?” అని రవిని అడిగాడు సాయిప్రసాద్ కుతూహలంగా.

“వాడు వెధవ కాలేదు. మేధావి అయ్యాడు. మన కథలో దీర్ఘదర్శి వాడు” అన్నాడు రవి.

“ఏం చేస్తున్నాడు అతను?” సాయిప్రసాద్ అడిగాడు.

“ఈ ఊర్లో లీడింగ్ లాయర్ అయ్యాడు. వాణ్ణి కలవడానికే మీరు ఇక్కడికి వచ్చారు” అన్నాడు రవి.

తర్వాత రవిశేఖర్‌ని కలసి తన ఇంట్లో అద్దెకుంటున్న వ్యక్తి తనకు పెడుతున్న ఇబ్బందుల గురించి, తనపై పెట్టిన కేసు గురించి చెప్పాడు సాయిప్రసాద్.

“చాలా సింపుల్ కేస్ ఇది. న్యాయం మీ పక్షానే ఉంది. మనం ఈ కేసు సునాయాసంగా గెలుస్తాం” అన్నాడు రవిశేఖర్.

“మీ ఫీజు ఎంతో చెబితే అడ్వాన్స్ ఇచ్చి వెళతాను” అన్నాడు సాయిప్రసాద్.

‘ప్రక్కవాడు ఏమైపొయినా ఫరవాలేదు, నేను బాగుంటే చాలు’ అనుకునే మనుషులే ఎక్కువగా ఉన్న ఈ రోజుల్లో మేమెవరో తెలియకపోయినా మేము బాగుండాలని మీరు కోరుకున్నారు. మా గురించి మా అమ్మానాన్నలే పట్టించుకోలేదు, కాని మీరు పట్టించుకున్నారు. మీ సమయం వెచ్చించి మాకు మంచి చెప్పారు. నాలో మంచి మార్పుకు కారణమయ్యారు. మీదగ్గర ఫీజు ఎలా తీసుకుంటాను సార్? ఆ ఫీజు నా గురుదక్షిణలా భావించండి…. ప్లీజ్” అన్నాడు రవిశేఖర్ చేతులు జోడించి.

అతని మాటలు విన్న సాయిప్రసాద్ కళ్ళలో నీరు తిరిగింది అప్రయత్నంగా. మనిషితనాన్ని చూసినందుకు వచ్చిన ఆనందభాష్పాలు అవి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here