కశ్మీర రాజతరంగిణి-37

4
3

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా నీలమతపురాణం తరువాత అందిస్తున్న జోనరాజు, శ్రీవరుడు, ప్రజ్ఞాభట్టులు కల్హణుడి అడుగుజాడల్లో నడుస్తూ సంస్కృతంలో రచించిన ‘కశ్మీర రాజతరంగిణి’ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

యే ప్రజాపీడన పరాస్తే వివశ్యేన్తి సాన్వయా।
నష్టం తు యే యోజయేయూస్తేషామ్ వంశానుగాః శ్రియః॥
(కల్హణ రాజతరంగిణి 1-188)

[dropcap]క[/dropcap]ల్హణుడు రాజతరంగిణి రచనారంభంలోనే తన రచన నిర్జీవమైన చారిత్రక అంశాల సంకలనం కాదని స్పష్టం చేశాడు. గుణపాఠాలు నేర్పనిదే చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం రాజులు పుట్టిన తేదీలు, పాలనా కాలం వంటి విశేషాలు చరిత్ర కాదు. అలాంటి ప్రాణం లేని విషయాలను పొందుపరచటం రచన కాదు. గతం నుంచి వర్తమానంలో పాఠాలు నేర్చుకుంటేనే భవిష్యత్తును తీర్చిదిద్దుకోగలుగుతారు. అంతే కాదు, భారతీయ ధర్మం ప్రకారం ఈ సృష్టి సర్వం ‘ఋతం’ ఆధీనం. ప్రతీ దానిలో ఒక పద్ధతి ఉంటుంది. నియమం ఉంటుంది. ఆ నియామాన్ని, ఆ పద్ధతిని ఏదీ అతిక్రమించలేదు. ఎంతటి మహాశక్తి అయినా ఈ ‘నియమా’నికి లోబడి ఉండాల్సిందే. అలాంటి నియమం ‘కర్మ’. చేసిన ప్రతి పనికి ఫలితం ఉంటుంది. మంచి పనికి మంచి ఫలితం. చెడు పనికి చెడు ఫలితం. ఈ నియమం నుంచి ఎవరూ తప్పించుకోలేరు. మామూలు మనిషకయినా, రాజుకయినా, మహారాజుకయినా ఈ నియమం వర్తిస్తుంది. కొన్ని సందర్భాలలో కొందరు నేరాలు చేసి కూడా తప్పించుకున్నట్టు అనిపిస్తుంది. వారు జీవితంలో రాజభోగాలు అనుభవిస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ విశ్వప్రణాళికలో మానవ జీవితం అతి స్వల్పం. ఒక వ్యక్తి ఈనాడు దౌష్ట్యం నెరపి తాను భోగం అనుభవిస్తున్నాననుకుంటాడు. కానీ దాని ప్రభావం అతని సంతానంపై కనిపిస్తుంది. అతని వంశంపై కనిపిస్తుంది. ఇదంతా గమనించాలంటే ఒక జీవితకాలం సరిపోదు. భారతీయ దృక్కోణంలో చరిత్ర పఠనం, చరిత్రను తెలుసుకోవటం ఇందుకోసమే. విశ్వప్రణాళికలోని నియమాలను గమనించటం, తమ నడవడిని దిద్దుకోవటం, తద్వారా భవిష్యత్తు తరాలకు ‘మంచి’ అందేట్టు చూడటం. భారతీయ ఇతిహాసాలు, పురాణాలు, వాఙ్మయం సర్వం ఈ దృక్పథంతోనే నిర్మితమయ్యాయి. ఈ విషయాన్ని కల్హణుడు రాజుల జీవితాల ప్రదర్శన ద్వారా స్పష్టం చేస్తున్నాడు.

ఏ అధికారులయితే అధికార మదంతో ప్రజలను ఇక్కట్లకు గురిచేయటంపైనే దృష్టి పెడతారో, ప్రజలను నానా బాధలు పెడతారో, వారు వారి వంశంతో సహా నాశనమవుతారు. ఇందుకు భిన్నంగా ఎవరయితే దిగజారుతున్న వ్యవస్థను బాగుపరిచి ప్రజలకు మేలు చేస్తారో, అదృష్టం వారికీ, వారి వంశానికీ శుభం కలిగిస్తుంది.

ఇందుకోసం చరిత్ర తెలుసుకోవాలి. గత గాథలు స్మరించటం, అధ్యయనం చేయటం ఇందుకు. గతంలో ఎవరెవరు ఎలాంటి పొరపాట్లు చేశారు, వాటి ఫలితాలు వారి మీద, వారి వంశం మీద ఎలా ప్రదర్శితమయ్యాయో గ్రహించి జాగ్రత్త పడటం కోసం చరిత్ర అధ్యయనం ఆవశ్యకం.

గోనందుడు, అతడి సంతానం విభీషణుడు యాభై నాలుగేళ్ళుగా రాజ్యం చేశారు. కశ్మీరును సురక్షితం, సుభిక్షం  చేశారు వారు. వారి తరువాత ఇంద్రజిత్తు, రావణ, రెండవ విభీషణుడు వంటి వారు ప్రజారంజకంగా రాజ్యం చేశారు. తరువాత విభీషణుడు కొడుకు నరుడు లేక కిన్నరుడు రాజ్యానికి వచ్చాడు. ఆరంభంలో ఇతడు ప్రజారంజకంగా రాజ్యం చేసాడు.

విహారే నివసన్నేనః కింనరగ్రామ వర్తిని।
తస్య యోగబలాత్కోపి శ్రమణోపాహరత్ప్రియామ్॥
(కల్హణ రాజతరంగిణి 1-199)

కిన్నర గ్రామ విహారంలో నివసించే ఒక బౌద్ధ శ్రమణుడు తన యోగబలంలో రాజు ప్రియతమను (భార్యను) అపహరించాడు.

ఈ సంఘటన బౌద్ధ శ్రమణులకు, రాజుకు నడుమ సంఘర్షణను చూపుతుంది. రాజు భారతీయ ధర్మానుయాయి. బౌద్ధానికి వ్యతిరేకి కాడు. కానీ బౌద్ధానుయాయి కాదు. రాజు భార్యను అపహరించి తీసుకువెళ్ళే ధైర్యం శ్రమణుడికి ఉందంటేనే ఆ కాలంలో బౌద్ధుల ఆగడాలు అర్థం చేసుకోవచ్చు. ఎందుకని, రాజులు, ప్రజలు బౌద్ధులంటే విముఖంగా ఉండేవారో ఊహించవచ్చు. బహుశా, తమ మంత్ర తంత్రాలతో వారు తమని నమ్మని వారిని ఇలాగే కష్టాలకు, నష్టాలకు గురి చేస్తుండి ఉంటారు. దాంతో బౌద్ధులంటే వైముఖ్యం, నిరసన రాజ్యంలో నెలకొని ఉంటుంది.

తన ప్రియతమను ఇలా అపహరించటం రాజు సహించలేదు. వేల సంఖ్యలో విహారాలను నేలమట్టం చేయించాడు. ఆయా గ్రామాలను ‘మధ్యమ మఠం’లో నివసిస్తున్న బ్రాహ్మణులకు ధారాదత్తం చేశాడు.

ఈ శ్లోకంపై వ్యాఖ్యానిస్తూ ఆర్. ఎస్. పండిత్ “This is another illustration of the destruction of viharas and confiscation of their property” అని వ్యాఖ్యానించాడు.

విహారాలను నేలమట్టం చేయడంలో రాజుకు ఒక కారణం ఉంది. బౌద్ధులు తమ యోగబలంతో ప్రజలను ఇబ్బంది పెట్టటం రాజు గమనించి ఉంటాడు. చివరికి తన ప్రియతమనే అపహరించటంతో ఆగ్రహం కట్టలు దాటి ఉంటుంది. ఇది ఈ కాలంలో కూడా మనం చూడవచ్చు. అమెరికాపై 9/11 దాడి తరువాత, అమెరికా ఇదే పని చేసింది. అఫ్ఘనిస్తాన్‌ను అల్లకల్లోలం చేసింది. ఇప్పటికీ అఫ్ఘనిస్తాన్ ఇంకా రగులూతూనే ఉంది. ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఇలాంటి దృష్టాంతాలు బోలెడన్ని లభిస్తాయి.  ఫ్రాంజ్ ఫెర్డినాండ్ హత్య మొదటి ప్రపంచ యుద్ధానికి దారి తీసింది. జర్మన్‍లను కష్టాలు పెడుతున్నారనే నెపంతో హిట్లర్ పోలాండ్‍పై దాడి చేయడంతో రెండవ ప్రపంచ యుద్ధం ఆరంభమయింది. అంటే పైకి కనిపించే కారణం ఒక సాకు మాత్రమే. అసలు కారణాలు వేరే ఉంటాయి. కిన్నరుడు విహారాలను ధ్వంసం చేయటానికి అతని భార్యను శ్రమణుడు అపహరించాడన్నది ఒక సాకు మాత్రమే. అసలు కారణాలు శ్రమణుల దౌష్ట్యాలు, ప్రజలలో నిరసన వంటివి అయి ఉండవచ్చు. ఇదంతా విశ్లేషించకుండా విహారాలను ధ్వంసం చేయటం, ‘బౌద్ధులను హింసించటం’గా భావించటం, అలా వ్యాఖ్యానించి, చివరికి బ్రాహ్మణిజం, బ్రాహ్మణుల కాపట్యం ఇదంతా అని తీర్మానించటం అన్యాయమే కాదు, అక్రమ వక్రీకరణ అవుతుంది.

ఆ తరువాత శ్రమణుడు ఏ పని చేస్తే, విహారాలను కిన్నరుడు ధ్వంసం చేశాడో, అదే పని కిన్నరుడు చేశాడు. కిన్నరుడితో పాటు ప్రజలూ ఆ దుశ్చర్యల వల్ల కలిగిన దుష్ఫలితం అనుభవించారు.

కిన్నరుడు వితస్త ఒడ్డున ఒక గొప్ప నగరం నిర్మించాడు. ఆ నగరానికి దగ్గరలో ఉన్న సరస్సులో సుశ్రవుడనే నాగు ఉండేవాడు. అతడి కూతురు చంద్రలేఖను ‘విశాఖ’ అనే బ్రాహ్మణుడు వివాహం ఆడాడు. ఆమె అందం చూసి మోహించిన కిన్నరుడు ఆమెను తనకు అప్పగించమని విశాఖుడిని వేధించాడు. చివరికి ఆమెని అపహరించి తెమ్మని భటులను పంపుతాడు. వారికి చిక్కకుండా విశాఖుడు, చంద్రలేఖ తప్పించుకుని సుశ్రవుడిని చేరతారు. ఆగ్రహం పట్టలేక సుశ్రవుడు, అతని సోదరి రమణ్య కలిసి కిన్నర నగరంపై దాడి చేశారు. నగరాన్ని బూడిద చేశారు. కశ్మీరాన్ని బూడిద చేశారు. రమణ్య విసిరిన బండల వల్ల ‘రమణ్యాటవి’ ఏర్పడింది. ఇప్పటికీ కశ్మీర ప్రజలు ఈ గాథను స్మరిస్తూ, పరస్త్రీ వాంఛ వల్ల కలిగే అనర్థాలను, రాజు చేసే నేరం ప్రజలపై దుష్ప్రభావం కలిగిస్తుందన్న సత్యాన్ని గుర్తు చేసుకుంటూంటారు [కిన్నరుని కోరిక – కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు, (పేజీ 65)].

ఈ సందర్భంగా కల్హణుడు కొన్ని సార్వజనీన సత్యాలు ప్రకటిస్తాడు. అప్పుడప్పుడు ఇలా యమదూతల్లాంటి వారు పాలకులవుతారు. వారు ప్రజలను రక్షిస్తున్నట్టు కనిపిస్తారు, కానీ వారి సర్వనాశనానికి కారణమవుతారు. పాలకులు చేసే తప్పుడు పనులు చిన్నవే అనిపించవచ్చు కానీ వాటి వల్ల ఘోరమైన దుష్పరిణామాలు ఉంటాయి. శీలవంతులు, దైవం, విప్రులకు అన్యాయం చేస్తే జరిగే అనర్థాల గాథలు ముల్లోకాలలో ప్రతిధ్వనిస్తున్నాయి.

ఇక్కడ గమనించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. తన భార్యను శ్రమణుడు అపహరించాడని కిన్నరుడు విహారాలను ధ్వంసం చేస్తే, బౌద్ధుల పైన జరిగిన అన్యాయంగా వ్యాఖ్యానించినవారు; నాగరాజు తన కూతురిని అవమానించాడన్న నెపంతో కశ్మీరాన్ని ధ్వంసం చేస్తే ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అసలు దీన్ని వ్యాఖ్యానించవలసిన అంశంగా పరిగణించనే లేదు. తన కూతురిని మోహించింది కిన్నరుడు. కానీ నాగరాజు సుశ్రవుడు కశ్మీరాన్ని శ్మశానంలా మార్చాడు. అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఎలాగయితే ఒక్క రాజు దుశ్చర్య ప్రజలందరి నాశనానికి కారణమయిందో, అలాగే ఒక్క శ్రమణుడి దుష్టపు పని బౌద్ధుల వినాశనానికి దారి తీసింది. ఇది స్వాభావికం. జగతి రీతి. ఒకడు చేసిన పనికి కుటుంబం అంతా నష్టపోవటం, ఒకడు చేసిన నేరానికి సమాజం అంతా దెబ్బతినటం, ఒకడి దుశ్చర్య దేశానికి చెడుపు చేయటం, ఒకడి చెడుపని ప్రపంచానికే నష్టం కలిగించటం అన్నదానిలో ఒకరిపై ద్వేషం, కుట్రలు వంటివి ఉండవు. అదంతే. లేకపోతే, సీతను ఎత్తుకుపోయింది రావణాసురుడు. కానీ నాశనం అయింది లంక. మరణించింది రాక్షసులు. కాబట్టి పని కట్టుకుని బౌద్ధులను బాధించారని భావించటం, వ్యాఖ్యానించటం కుదరదు.

కిన్నరుడి కొడుకు ‘సిద్ధుడు’ తండ్రి జీవితం నుంచి గుణపాఠం నేర్చుకున్నాడు. ప్రజలను చక్కగా పాలించాడు. తరువాత వచ్చిన రాజు కశ్మీరాన్ని చక్కగా పాలించారు. ఈ సమయంలో మ్లేచ్ఛులు కశ్మీరంపై దాడి చేశారు. అల్లకల్లోలం చేశారు. మ్లేచ్ఛ మూకలతో అల్లకల్లోలమైన కశ్మీరానికి ‘మిహిరకులుడు’ రాజయ్యాడు. మిహిరకులుడు క్రూరుడు. యముడి లాంటి వాడు.

అథ మ్లేచ్ఛగణాకీర్ణే మండలే చాడచేష్టితః।
తస్మాన్మేజోభూన్మిహరకులః కాలోపమో నృపః॥
(కల్హణ రాజతరంగిణి 1-289)

మ్లేచ్ఛుల దాడులతో అల్లకల్లోలమవుతున్న కశ్మీరానికి వసుకులుడి పుత్రుడు, యముడి లాంటి మిహిరకులుడు రాజయ్యాడు.

మళ్ళీ ఇక్కడ సమస్య వస్తుంది.

రాజతరంగిణి ప్రదర్శిస్తున్న రాజుల పరంపర ప్రకారం మూడవ గోనందుడి వంశంలో 12వ రాజు మిహిరకులుడు. వరుసగా రాజుల పేర్లు, వారు పాలించిన కాలంతో సహా కల్హణుడు పొందుపరచాడు. దాని ప్రకారం మిహిరకులుడు 64వ రాజు. అతని తండ్రి వసుకులుడు. కొడుకు బకుడు. వీరంతా క్షత్రియులు. అంటే రాజతరంగిణి ప్రకారం మిహిరకులుడు క్షత్రియుడు. మ్లేచ్ఛమయమయిన కశ్మీరు నుంచి మ్లేచ్ఛులను తరిమినవాడు. మిహిరకులుడు దాదాపుగా 70 ఏళ్ళు పాలించాడు. రాజతరంగిణి ప్రకారం ఈయన కలిశకం 2397 సంవత్సరం అంటే క్రీ.పూ. 704వ సంవత్సరం నాటి వాడు.

కానీ పాశ్చాత్య చరిత్ర రచయితలు మిహిరకులుడిని తమ ఇష్టం వచ్చిన కాలానికి పంపేశారు. హెచ్. హెచ్. విల్సన్ మిహిరకులుడు క్రీ. పూ. 200 నాటి వాడన్నాడు. కన్నింఘామ్ అతడిని క్రీ.శ. 163కి లాక్కువచ్చాడు. డాక్టర్ ఫ్లీత్ మిహిరకులుడు క్రీ.శ. 6వ శతాబ్దం నాటి వాడన్నారు. వీరంతా కలిసి మిహిరకులుడు అసలు భారతీయుడే కాదు, అతడు హూణుడు అని నిర్ధారించారు. మిహిరకులుడి తండ్రి తోరమాణుడని, వీరు భారతదేశంపైకి గ్రీకులు, శకులు, పల్లవులు, కుశానులను అనుసరించి దాడికి వచ్చారని నిర్ధారించారు. హూణులు గాంధారం, పంజాబ్‌తో పాటు కశ్మీరాన్ని కూడా గెలుచుకున్నారని, మిహిరకులుడు ‘సగల’ (పాకిస్తాన్ లోని సియాల్‍కోట్) రాజధానిగా పాలించాడని తీర్మానించారు. ఇతడు ఆరంభంలో బౌద్ధం వైపు మొగ్గు చూపినా, ఓ బౌద్ధ భిక్షువు అవమానించాడన్న కోపంతో బౌద్ధుల ఆరామాలను, విహారాలను, స్థూపాలను నాశనం చేశాడు. బౌద్ధ శ్రమణులను క్రూరంగా చంపించాడు, అని మిహిరకులుడిని ఓ రాక్షసుడితో సమానమైన ‘విలన్’ను చేశారు. ఈ పాశ్చాత్య మిహిరకులుడికి కశ్మీరులో కల్హణుడు చెప్తున్న మిహిరకులుడికి పేరు తప్ప, క్రూరులన్నది తప్ప  మరే పోలిక లేదు.  కానీ ఈ రెండు అంశాల ఆధారంగా క్రీ.పూ. 704వ సంవత్సరానికి చెందిన క్షత్రియ మిహిరకులుడిని క్రీ.శ. 6వ శతాబ్దానికి చెందిన హూణ మిహిరకులుడితో కలిపేసి చరిత్ర రాశారు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here