కాజాల్లాంటి బాజాలు-79: కెరియరే ముఖ్యం..

4
3

[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]

[dropcap]మా[/dropcap] పక్కింట్లో వుండే ప్రతాపరావుగారి మనవడి పెళ్ళి కుదిరింది. ఆ పెళ్ళి కుదుర్చుకున్న పధ్ధతి చూసి ఆశ్చర్యపోయేరు ప్రతాపరావుగారూ ఆయన భార్య ప్రభావతీ.

ప్రతాపరావుగారి మనవడు సుధీర్ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్ళికూతురు సౌమ్య ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తోంది. హైద్రాబాదులో వున్న ప్రతాపరావుగారి కొడుకు వేణుగోపాల్ కంప్యూటర్‌లో కొడుకు వివరాలు పెడితే చాలామంది వాళ్ళ అమ్మాయిలకోసం రిక్వెస్టులు పంపించేరు. వేణుగోపాల్, అతని భార్య వందన కలిసి వాటిలోంచి జాతకాలూ గట్రా కూడా చూపించుకుని ఇద్దర్ని సెలెక్ట్ చేసి వాళ్ళని కాంటాక్ట్ చేసేరు. అందులో ఒకమ్మాయి తండ్రికి ఢిల్లీలో ఉద్యోగమైతే, ఇంకో అమ్మాయి తండ్రికి బరోడాలో ఉద్యోగం. ఒకమ్మాయి ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తుంటే, ఇంకో అమ్మాయి జర్మనీలో ఉద్యోగం.

వేణుగోపాల్, అతని భార్య వందన ఇద్దరి అమ్మాయిల తల్లితండ్రులతోనూ స్కైప్‌లో మాట్లాడి, ఒకరి కుటుంబాల గురించి ఇంకొకరు వివరంగా తెల్సుకున్నారు. అప్పుడు సుధీర్‌కి ఇద్దరి అమ్మాయిల ఫోన్ నంబర్లూ యిచ్చి వాళ్లతో మాట్లాడిస్తే అందులో ఆస్ట్రేలియాలో పని చేస్తున్న అమ్మాయికీ, సుధీర్‌కీ అభిప్రాయాలూ, అభిరుచులూ కలిసేయి. ఆ సంగతి వాళ్ళు పెద్దవాళ్లతో చెప్పగానే మళ్ళీ మూఢం వచ్చేస్తోందని ఆ రెండోరోజే యిద్దరూ యెవరింట్లో వాళ్ళే వుండీ, స్కైప్‌లో కలుసుకుని తాంబూలాలు పుచ్చేసుకున్నారు. ఆ రోజు ఇండియాలో, అమెరికాలో, ఆస్ట్రేలియాలో వున్నవాళ్లందరినీ ఒకేసారి స్కైప్‌లో చూసి ప్రతాపరావుగారూ, ప్రభావతీ ఆశ్చర్యపడి, ఆనందపడిపోయేరు.

‘పెళ్ళిమాటలు లేకుండా నిశ్చితార్థం యేమిట్రా’ అంటూ తండ్రి అడిగినదానికి వేణుగోపాల్ నవ్వుతూ “ఇవి కట్నాలూ, లాంఛనాలూ మాట్లాడుకునే రోజులేంకాదు నాన్నా… పిల్ల తండ్రి మంచి హోదాలో వున్న ఉద్యోగం చేస్తూ రెండుచేతులా సంపాదిస్తున్నాడు. ఒక్కతే అమ్మాయి. వాళ్ళూ పెళ్ళి బాగా చేస్తామనే అంటున్నారు. అంతకన్న మనకేం కావాలీ?” అన్నాడు.

“అదికాదురా.. మన ఆనవాయితీలూ, సాంప్రదాయాలూ ఫలానా అని వాళ్లకి చెప్పొద్దూ?” అన్న తల్లి మాటలకి

“ఈ రోజుల్లో ఎంత గొప్పగా చేస్తే అదే సాంప్రదాయం..” అని తల్లిని మరి మాట్లాడనివ్వలేదు.

నిశ్చితార్థం అయిన దగ్గర్నించీ ప్రభావతిగారూ, నేనూ పిట్టగోడ కటూ యిటూ నిలబడి రోజూ మాట్లాడుకునే మాటలన్నీ సుధీర్ పెళ్ళి ముచ్చట్లే..

కంచి వెళ్ళి చీరలు కొనుక్కుంటామనీ, పెట్టుబడి చీరలు కూడా కంచిపట్టువే పెడతామనీ, అయిదురోజులూ రెండుపూట్లా మా ఫామిలీ కూడా వాళ్లతోపాటే వుండాలనీ, రాబోయే మనవరాలికి ముద్దినుసు నగలూ చీరలూ పెడతామనీ, యెక్కడెక్కడి బంధువులనీ గుర్తు చేసుకుని మరీ పిలుస్తామనీ… అబ్బో… ఇలాంటి కబుర్లు ఒకటా రెండా.. తెగ సంబరపడిపోతూ బోల్డు కబుర్లు చెప్పేవారు ప్రభావతిగారు. ఆవిడ సంబరం చూస్తుంటే ఆ వచ్చే మనవరాలిని కాలు కింద పెట్టనీయదేమో అనిపించేది.

ఇలాంటి సమయంలో ప్రపంచాన్నంతా తలకిందులు చేసేస్తూ కరోనా అనే మహమ్మారి ప్రవేశించింది. ఇంకేముందీ.. ఎక్కడి వాళ్ళక్కడే బందీలైపోయేరు. రైళ్ళు, బస్సులూ ఆపేసేరు. విమానాలు ఆపేసేరు. దేశమంతా లాక్‌డౌన్ పెట్టేసేరు. ఇంకేం చేస్తారు పాపం.. ప్రతాపరావుగారి మనవడి పెళ్ళి వాయిదా పడింది.

సరే కొన్నాళ్లాగేక ముహూర్తాలు పెట్టుకుందామనుకుంటే ఎప్పుడు విమానాలు నడుస్తాయో.. యెప్పుడు ఆగిపోతాయో తెలీని పరిస్థితి వచ్చేసింది. అందుకని పెళ్ళి కూడా ఆన్‌లైన్ లోనే చేసేసుకుందామనుకున్నారని ఆ రోజు ప్రభావతిగారు చిన్నమొహం చేసుకుని చెప్పేరు.

అమెరికాలోని పెళ్ళికొడుకూ, ఆస్ట్రేలియాలో పెళ్ళికూతురూ కలిసి ఇండియాలో పురోహితులు మంత్రాలు చదువుతుంటే అటూ యిటూ పెద్దలు ఆన్‌లైన్‌లో వీక్షిస్తుంటే పెళ్ళి చేసేసుకున్నారుట.

ప్రభావతిగారి మాటల్లోనే చెప్పాలంటే..

“ఇదెక్కడి విడ్డూరవమ్మా.. ఇట్నించి పెళ్ళికొడుకు జీలకర్ర, బెల్లం కలిపిన ముద్దని స్క్రీన్ వైపు చూపిస్తుంటే అట్నించి తల వంచుకుని పెళ్ళికూతురు తన చేతిలో వున్న ముద్దని స్క్రీన్ వైపు చూపించి, ఆ ముద్దని నెత్తి మీద పెట్టుకుంది.

ఇట్నించి పెళ్ళికొడుకు లేచి నిలబడితే అటు పెళ్ళికూతురే చేతిలో వున్న తాళి తనకు తనే కట్టేసుకుంది. తలంబ్రాలు ఎవరి నెత్తిన వాళ్ళే పోసేసుకుని, నవ్వేసుకున్నారు. ఏవిటేవిటో మాట్లాడేసుకుని నవ్వేసుకుంటున్నా రిద్దరూ. ఆ భాష నాకర్ధం కాలేదు. మొత్తానికి మా ఒక్కగానొక్క మనవడి పెళ్ళీ ఓ ముద్దూముచ్చటా లేకుండా యిలా అయిందమ్మా..” అంటూ చిన్నబుచ్చుకున్న మొహంతో ఆవిడ చెపుతుంటే నాకు బాధగా అనిపించింది.

ఆవిణ్ణి ఓదారుస్తూ “విమానాలు మళ్ళీ నడవడం మొదలయ్యేక ఇద్దరూ ఇండియా వస్తార్లెండి. అప్పుడు మీ ముచ్చట్లన్నీ తీర్చుకుందురుగాని..” అన్నాను.

దానికావిడ “అయ్యో.. ఆ సౌడభ్యం కూడానా. ఆ పిల్ల ఏదో కొత్త జాబ్‌లో చేరిందిట. ఇప్పుడప్పుడే ఆస్ట్రేలియా వదిలి రాదుట. ఎప్పుడైనా శెలవు పెట్టుకుని ఓ నెలో పదిరోజులో మొగుడి దగ్గరికికే వెడుతుందిట.” అన్నారావిడ చిన్నబుచ్చుకున్న మొహంతో.

“పోనీ మీ మనవడే ఆస్ట్రేలియా వెడతాడేమోలెండి..” అన్నాను ఆవిణ్ణి ఓదారుస్తూ.

“వాడూ అలాగే అంటున్నాడు.. ఎప్పుడో శెలవు దొరికినప్పుడు వెడతాట్ట. అదేవిట్రా.. ఇద్దరూ ఒకచోట వుండనప్పుడు ఇంక పెళ్ళెందుకు చేసుకున్నట్టూ.. అనడిగేనని వాడు ఒకటే నవ్వుతూ.. ‘ఇదివరకటిరోజులు కాదు నాన్నమ్మా.. ఎవరి కెరియర్ వాళ్ళకి ముఖ్యం కదా!’ అంటున్నాడు.. అవునూ…కాపరం కన్న కెరియరే ముఖ్యం అంటాడేవిటీ.. నాకేం అర్థం కాలా.. నీకేవైనా అర్థం అయిందామ్మా..” అంటూ అడిగేరు నన్ను.

నిజం చెప్పొద్దూ… నాకూ అర్థం కాలేదు. మీకేమైనా అర్థమైందా!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here