[dropcap]ఎ[/dropcap]క్కడమ్మా వెన్నెల…
ఎక్కడమ్మా కలువ చెలియా
చంద్రుని రాకకై కలువరించినది…
ఆకాశంలో మబ్బులు కమ్మివేస్తే కలత చెందినది
పగలంతా నిదురించిన కలువలు
రేయంతా మేలుకునే ఉంటాయి
అలుపెరుగక ఎదురుచూపులు చూస్తాయి…
చూచి చూచి కలువ చెలియకు కన్నులేమో కాయలు కాచి
చిలిపి మేఘాలు చిరుజల్లు కురిపించి పరిహాస మాడితే
ఉదయరుణాకిరణాలలో తడిసిన వలువలు ఆరబోసుకున్నాయి…
పదహారుకళల పున్నమి రేయికై పలవరిస్తూ
అమావాస్య రోజుల్లో వేయి కనులతో వేచి చూస్తాయి…
నింగిలో నెలవంకను చూడగానే పరవశించి పోతాయి
నెలరేని స్పర్శతో పులకించి మైమరచి లోకం మరిచి
వెన్నెల కిరణాల శయ్యపై వాడిపోతాయి…
ఎన్ని తరాలకైనా మారని ప్రకృతి సిద్ధమైన ప్రేమ కథలెన్నో
వీడని బంధాలకు సాక్షిగా నిలిచి పోయాయి.