ఎన్నో ప్రశ్నలు – కొన్ని జవాబులు-8

0
3

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత్రి గంటి భానుమతి గారి కలం నుంచి జాలువారిన ‘ఎన్నో ప్రశ్నలు – కొన్ని జవాబులు’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]శి[/dropcap]వరామ్ అసహనంగా అటూ ఇటూ చూసాడు.

“అలా అని నీకనిపిస్తోందా! పదాలు ఇష్యూ కాదా! అది ముఖ్యం కాదా! అలా అంటే నేను ఒప్పుకోను. ఒక్కొక్కసారి వాడాల్సిన పదాలు కఠినంగా ఉంటాయి. ఇప్పుడు కూడా అంతే. కాని, చెప్పక తప్పదు.

నువ్వు అపార్టుమెంటు తీసుకున్నావని తెలీదు. చూడడానికి కూడా నన్ను పిలవలేదు.

నాకు నీ ఇల్లు చూడాలని ఉంది. నీ ఇంటికి రావాలనిపించినా, కాని నీ ఆహ్వానం లేకుండా ఎలా వస్తాను. ఎందుకలా చేసావు, ఎందుకు ఆహ్వానించలేదు. కాని నీ గురించి తప్పుగా ఆలోచించలేదు. అప్పుడు కూడా నీవైపు నుంచి ఆలోచించాను.

నీ అపార్టుమెంటు చూపించడానికి సిగ్గుపడ్డావేమో, నేను జమీందారి వంశం నుంచి వచ్చిన వాడిని, ధనవంతుడిని, గొప్పవాడిని, మా ఇళ్ళముందు నీ అపార్టుమెంటు బీదగా కనిపిస్తుందనిపించిందేమో, ఆ విషయం ఒప్పుకోడానికి మనసొప్పలేదేమో అందుకని నీ అపార్టుమెంటు చూపించడానికి ఓ కాంప్లెక్స్‌తో కూడిన అహంకారం అడ్డు వచ్చిందేమో, అని ఇలా ఎంత నన్ను నేను సమర్థించుకున్నాను, కాని ఎంత ఆలోచించినా అసలు ఏం అర్థం అవలేదు.

మనిద్దరి మధ్య డబ్బు వచ్చిందా! కావచ్చు, ఎందుకంటే అది నీకు లేదు. ఆ విషయం నీకు జీర్ణం అవలేదు. అలా అని ఒప్పుకోవడం నీకిష్టం లేదు.

నా సంపద నీకు క్షమించరానిదైంది. ఏంచేస్తాను, నేనలా పుట్టాను. మన మధ్య ఆర్థిక సమానత లేదు. నువ్వు నీ అపార్టుమెంటు చూపించక పోవడానికి నేను చెప్పిన కారణం కాకపోవచ్చు. దీనికి జవాబులు వెతికాను. మన విషయంలో కష్టం అనిపించింది. ఎందుకంటే నువ్వు వెళ్ళిపోవడంతో నేను ఒక్కడినే జవాబులు ఇచ్చుకోలేను.”

బ్రహ్మాజీ ఆగాడు. ఆ గొంతులో ఓ రకమైన తృప్తి.

తన మాటల్ని కొన సాగించాడు..

“మళ్ళీ వేట జరిగిన రోజుకే వస్తున్నాను.

నువ్వు టౌన్ వెళ్ళావని నీకు వేటలో సాయం చేసిన వాళ్ళు చెపితే తెలిసింది, తెలిసాకా నీ ఇల్లు చూడాలని అనుకున్నాను. నన్ను నువ్వు పిలవలేదు. రమ్మనలేదు అయినా వచ్చాను. ఇంటి ముందు నుంచున్నాను.

లోపల చూసాకా నా కళ్ళని నేను నమ్మలేక పోయాను. పెద్దది కాదు కాని అందంగా ఉంది. మధ్యలో ఓ దివాన్, దాని మీద ఎర్రటి తివాచి. దాని మీద వీణ. అది ఎవరికోసం కొన్నావు. ఎందుకంటే నీకు వాయించడం రాదు. మరి, ఎందుకు కొన్నావు.

మూలల్లో అందమైన పూల కుండీలు. అవి అన్నీ అపురూపమైన మొక్కలు. నీకు మొక్కలంటే ఇష్టం. అవి నువ్వు, జాంబాగ్ వెళ్ళే దారిలో ఉన్న నర్సరీల్లో, సికింద్రాబాదు కంటోన్మెంటులో, పబ్లిక్ గార్డెన్‌లో వెతికి వెతికి కొన్నావని నాకు తెలుసు. ఎందుకంటే ఈ ఇంటికి నువ్వు ఎన్నో రకాల మొక్కలు తెచ్చావు. అప్పుడు చెప్పావు వాటిని ఎక్కడ కొన్నావో. గోడలకి పెద్ద పెద్ద పెయింటింగ్‌లు. అందంగా ఉన్న కింద అంతస్తు, రెండు మెట్లు. ఆ తరవాత మరో అంతస్తు. ఇల్లు ఎంతో అందంగా కళాత్మకంగా ఉంది. ఓ కళాకారుడు సృష్టించుకున్న అందమైన లోకం. రహస్యంగా, ఎవరికీ తెలీకుండా అన్నీ సమకూర్చుకున్నావు. ఆ గదిలో అటూ ఇటూ తిరుగుతూ అన్నీ కూడా మనసులోనే లెక్క వేసాను.

నువ్వు నిజమైన కళాకారుడివని ఆ సమయాన నాకు తెలిసింది.

నువ్వు ఓ కొత్త శివరాంలా అనిపించావు. ఇన్నాళ్లు నా ఇల్లు నీలాంటి ఓ రెఫ్యూజీకి ఆశ్రయం ఇచ్చినట్లుగా అనిపించింది. నువ్వు మామూలు వాడివి కాదు. నువ్వు మా మధ్య అన్ని ఏళ్ళున్నావు, కానీ మా మనిషివి కాదు. మాకు సంబంధించినవాడివి కాదు. ఇన్ని ఏళ్ళలో నేను నీ గురించి ఎప్పుడూ అడగలేదు. నువ్వు కూడా ఎప్పుడూ చెప్ప లేదు.

నా ఆలోచనలు ఇలా ఉన్న సమయంలో చప్పుడయింది. వెనక్కి తిరిగి చూసాను. శివరామ్ కావచ్చు, శివరామ్ కాక మరెవరు ఈ ఇంటికి వస్తారు. శివరామ్ వెనక్కి వచ్చి ఉంటాడు అని అనుకుంటూ ఆశగా చూసాను.

కావేరి.

ఒక్కసారి శిలలా ఉండిపోయాను.

గుమ్మం దగ్గర నా భార్య కావేరి నుంచుని ఉంది.

ఆశ్చర్యపోయాను. నేను అలా ఆశ్చర్యంలో ఉండగానే కావేరి లోపలికి వచ్చింది.

నాకు అసలు ఏం అర్థం కాలేదు. ఇక్కడ కావేరి ఏంటీ? అసలు కావేరి ఎందుకొచ్చింది? ఆమెకి ఇక్కడ ఏం పని?

అంటే కావేరికి శివరామ్‌కి నాకు తెలియని స్నేహం ఉందా! అది స్నేహమేనా!

ఆ తరవాత ఆలోచించ లేక పోయాను. భయం వేసింది.

ఒక్కసారి మనసు ఎలాగో అయింది. నన్ను నేను తిట్టుకున్నాను.

కావేరి నా భార్య. ఆమె నాకు బాగా తెలుసు.

ఆ చెడు ఊహలు నాలో రాకూడదు. కాని వస్తున్నాయి. శివరామ్ నా నుంచి ఏదో దాచాడు. తప్పు చేసాడు. అలజడి. ఆ సమయంలో అపార్టుమెంటు అంతా మారువేషంలో ఉన్నట్టుంది.

నేరం జరిగి పోయాకా జరిగినది తెలుసుకోడానికి వచ్చిన పోలీసులకి పూర్తి సమాచారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లుగా చేతులు కట్టుకుని ఓ పెయింటింగ్ దగ్గర నుంచున్నాను.

అయోమయంగా, ఏం ఆలోచించాలో తెలీక అక్కడే చాలా సేపున్నాను.

దీనికి సమాధానం కావాలి. నువ్వే ఇవ్వాలి. అని అనుకున్నాను.

అసలు ఎవరు నువ్వు, నీకేం కావాలి, ఏం సాధించాలనుకున్నావు, పిరికివాడివా, సాహసవంతుడివా, నమ్మకస్థుడివా, నువ్వు నాకేం అవుతావు. నా స్నేహితుడివా, కాని నువ్వు చెప్పకుండా వెళ్ళిపోయావు, అది కూడా మాటమాత్రం కూడా చెప్పకుండా. స్నేహితుడివి అవుతావా.

మళ్ళీ ఆలోచనలు.

అసలు నీ అపార్టుమెంటుకి నేనెందుకు వెళ్ళాలి, నువ్వు నన్ను రమ్మనలేదు. కాని వచ్చాను. నువ్వు లేవు. ఆ సమయానికి కావేరి నీ ఇంటికి రావడం ఏంటీ, అది కూడా నాకు తెలీకుండా, ఎందుకంటే ఆమె నా దగ్గర ఏదీ దాచదని నా నమ్మకం, అది నిజం కాదంటే నా మనసు కల్లోలం అయింది. నాకు అర్థం కానిది మరొకటి కూడా ఉంది.

నేను ఒకవేళ అడిగితే నీకు నేను సారీ చెప్పాలనుకున్నాను కాని నీకు చెప్పడానికి నాకు టైము లేక పోయింది. అందుకే చెప్పలేదు అని నువ్వు అంటే నమ్మడం కష్టం. నీకు సమయం లేదు అనడానికి ఛాన్సే లేదు. మనం కలసుకునేంత సమయం లేదు అని నువ్వు అంటే నువ్వు మోసగాడివని తెలిసిపోతుంది. ఎందుకంటే అంతకు ముందు రోజే కదా మనం కలుసుకున్నాం. అప్పుడు నువ్వు ఓ చిన్న హింటు కూడా ఇవ్వలేదు. నువ్వు వెళ్ళాలనుకుంటున్నావని నాతో అనలేదు. అలా వెళ్ళడానికి కారణం కూడా చెప్పలేదు. అది జీర్ణించుకోలేకపోయాను.

ఆ తరవాత నేను ఒంటరివాడినయ్యాను. కాని, నా అనుమానాలకి, సందేహాలకి సమాధానం ఇవ్వాల్సిన నువ్వు వెళ్ళిపోయావు. ముఖ్యంగా బుధవారం నాటి సంఘటన.”

అంటూ శివరామ్ వైపు చూసాడు.

శివరామ్ కాఫీ తాగుతూ మండుతున్న చితుకుల వైపు చూస్తున్నాడు.

“బుధవారం నాడు జరిగింది మాట్లాడాలి. ఆ రోజు బుధవారం. ఆ నాటి ఆ వేట గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడు అది చాలా ముఖ్యం. నన్ను చంపాలనుకన్న దానికి కారణం తెలియాలి.

ఆ రోజు వేట చాలా బాగా జరిగింది. అది ఓ పెద్ద వేట. మా ఇంట్లో ఎవరైనా వేటాడడానికి వస్తే అన్నివిధాల సాయపడడానికి కొంతమంది స్థానికులు ఉన్నారు. వాళ్ళు ఇప్పటికీ ఉండి ఉంటారు. ఎందుకంటే ఆ తరవాత నేను ఎప్పుడూ వేటకి వెళ్ళలేదు.

కాని ఆ రోజుని మర్చిపోలేను. అది నిజమైన వేట. ఎందుకు నిజమైనదో నీకు అది అర్థం కాదులే.

ఆ రోజున వేట కోసం తయారవమని నీకు చెప్పాను. అప్పటి నీ ముఖం నాకు బాగా గుర్తు. ఆరోజే కాదు, ఎప్పుడు వేట అన్నా నీ ముఖంలో అయిష్టత కనిపించేది. నవ్వు తుపాకీని నిర్లక్ష్యంగా పట్టుకునే వాడివి. ఓ వాకింగ్ స్టిక్‌లా వాడుతున్నట్లుగా అనిపించేది.

నిజానికి వేటాడడం మా వృత్తి కాదు. మాకు అది ఓ వినోదం. మా పూర్వీకులు అంతా అంతే. స్నేహితులతో కలిసి వెళ్ళేవారు. అందుకని ఎప్పడూ మేము తుపాకులుంచుకుంటాం. కత్తులుంచుకుంటాం. మా తాతగారు వాళ్ళు పాలకులు. వందల ఎకరాల భూములున్న వాళ్ళు. సహజంగా మాకు శతృవులుంటారు. మమ్మల్ని మేము రక్షించుకోవడం కోసం ఇవన్ని మా ఇళ్ళల్లో ఉంటాయి.” అని ఆగాడు బ్రహ్మాజీ.

శివరామ్ ఏం మాట్లాడలేదు. మళ్ళీ ఇద్దరి మధ్య నిశ్శబ్ధం.

బ్రహ్మాజి టేబుల్ మీదికి వంగి, రెండు గ్లాసుల్లో నింపాడు. తాను కొంచెం తాగి, గ్లాసుని టేబుల్ మీద ఉంచాడు. శివరాం గ్లాసుని తీసుకున్నాడు. ఏం మాట్లాడలేదు. సమాధానం ఇవ్వడానికి ప్రయత్నించలేదు.

బాగా చీకటి పడిపోయింది. కరెంటు ఇంకా రాలేదు. ఆ కొవ్వొత్తుల వెలుగులో శివరాంని చూసాడు .

“ఆ వేట జరిగిన రోజున నన్ను చంపాలని అనుకున్నావు కదా, అని ఇప్పుడు నిన్నడిగితే నాకా ఉద్దేశం లేదనే సమాధానం ఇస్తావు. కాని అది నిజం. నన్ను ఎందుకు చంపాలనుకున్నావో కారణాలు వెతికాను.

అసలు నన్ను చంపాలన్న ఆలోచన నీకు మనసులో ఎప్పటినుంచి ఉందో, ఎప్పుడు నువ్వు అనుకున్నావో, ఆ కోణం లోంచి, కూడా ఆలోచించాను. మన పరిచయం అయిన దగ్గరి నుంచి జరిగినవన్ని కూడా ఒకదాని తరవాత మరొకటి గుర్తుకు తెచ్చుకుని ఆలోచించడం మొదలు పెట్టాను.

స్కూల్లో ఉన్న రోజుల్లో. తల్లి లేని నువ్వు, తండ్రి ఉన్నా అతను లేనట్టుగా ఉండే నీ మీద మొదట్లో జాలి ఉన్నా, నీ పట్టుదలని, నీ ప్రతిభని చూసి అబ్బుర పడ్డాను. నీ టాలెంటుని గౌరవించాను. ఆదరించాను. నిన్ను ఆదర్శంగా తీసుకుని, నీ అంత ఎత్తుకి కాక పోయినా కాస్త దగ్గరగా అయినా ఎదగాలనుకున్నాను. అంతే. అందుకే నిన్ను నా స్నేహితుడి కన్నా ఎక్కువగా ప్రేమించాను. నమ్మాను. అప్పటి నుంచి నీకు ఈ చెడు ఆలోచన ఉండదు అని నా కనిపించింది.

ఆ తరవాత సమ్మర్ వెకేషన్‌లో నిన్ను ఇంటికి తీసుకెళ్ళడానికి రాని నాన్న గురించి బాధపడుతూ అక్కడే ఉంటే అయ్యో తల్లి లేదు, తండ్రి నిరాదరణ ఇంటికి కూడా వెళ్ళకపోతే ఎక్కడుంటాడు అన అనిపించి తండ్రికి పరచయం చేసి, ఇంటికి తీసుకెళ్ళాను. అప్పటి నుంచి మా దగ్గరే మా ఇంట్లో ఉన్నావు. ఏదో ఆశించి నేను ఇవన్నీ చెయ్యలేదు. మధ్య మధ్య మీ ఊరు వెళ్ళేవాడివి. కొన్ని రోజులు ఉండి వచ్చేసేవాడివి. కాని నన్ను ఎప్పుడు రమ్మనలేదు.

ఇంత చేసినా కాని నీకు నాలో ఒక డబ్బున్న వాడు, తన కన్నా ఎక్కువ సౌకర్యాలు అనుభవిస్తున్నవాడే కనిపించాడు. అంతే తప్ప ఓ స్నేహితుడు, అభిమాని అన్ని విధాల నిన్ను ఆదుకుంటున్న ఓ మంచి మనిషి కనిపించలేదు. ఇది ట్రాజెడి కదా.

జీవితంలో ఎంతో ఆదర్శంగా, ఆరోగ్యమైన వాతావరణంలో పెరిగిన నేను, నేను నా చివరి వరకూ పాటించ గలనా అన్న సందేహం ఇప్పుడు కలుగుతోంది. కాని సాధ్యమైనంత వరకు నా వ్యక్తిత్వాన్ని మంచితనాన్ని బ్రతికించుకుందామనే ప్రయత్నిస్తూంటాను. ఇంత వరకూ అలాగే ఉన్నాను.

ఒక నిజం చాలా రోజుల తరవాత తెలిసింది, నేనంటే నీకు ద్వేషం, అసూయ అని. ఎందుకో నాకు తెలీదు. నీకు అహంకారం, ఇమోషన్‌లు ఉన్నాయని నేనెప్పుడు అనుకోలేదు. భరించ లేని అసూయ నిన్ను అలా చేసాయనుకున్నాను. అంతే అనుకున్నాను. కాని అది ఎన్నో రోజులు లేదు. మరో అడుగు ముందుకెళ్ళావు. రివెంజ్ తీసుకోవాలనుకుంటున్నావని అనిపించింది. ఒక్కటి చెప్పు నన్ను ఎందుకు ద్వేషించేవాడివి. నన్ను చంపాలనుకునేంతటి కోపం ఎందుకు?

దీని గురించి ఎన్నో ఏళ్ళు ఆలోచించాను. నువ్వు నా దగ్గర్నుంచి డబ్బులు కానీ, బహుమతులు కానీ తీసుకోలేదు. కలిసి ఉన్నన్ని ఏళ్ళు నిజమైన అన్నదమ్ముల్లా ఉన్నాం. కాని ఆ బంధాన్ని నువ్వు వద్దనుకున్నావు. ఎప్పటినుంచి ద్వేషించడం మొదలు పెట్టావంటే మనం స్కూల్లో ఉన్నప్పటి నుంచి కావచ్చు. నీలో చాలా మంచి టాలెంట్లున్నాయి. కళ, సంగీతం, ఇవి నీకు గౌరవాన్ని తెచ్చి పెట్టాయి. కాని నీలో ఓ భయంకరమైన ఆశ ఉండేది. అది నువ్వు అనుభవిస్తున్న దానికన్నా ఎక్కువ.

దేవుడు ఇచ్చిన దానికి సంతృప్తి చెందాలి. అన్నింటినీ అంగీకరించాలి. అలా చేయడానికి ఓ విచక్షణ ఉండాలి.

ఈ జ్ఞానం మనకి ఏ విధమైన బహుమతిని గాని, పురస్కారాన్ని కాని ఇవ్వదు. జీవితం ఓ పతకం, పురస్కారం కాదు, ఓ పిన్ను తీసుకుని గుండెల దగ్గర గుచ్చడానికి. బహుమతి అంతకన్నా కాదు. మనకి ఓ కిరీటం ఎవరూ పెట్టరు. అది మనల్ని ప్రశాంతమైన జీవితాన్నిస్తుంది.

మనం మనలోని గుణాలని, లోటుపాట్లని, బలహీనతలని ఎంత వీలైతే అంత భరించాల్సిందే. నిశ్శబ్దంగా అనుభవించాల్సిందే. ఎందుకంటే వాటిని అధిగమించి, అది దిద్దుకోడానికి మం అనుభవం సరిపోదు. మన కోరికలకి ప్రతిధ్వనులుండవు. ఇది తెలుసుకోవాలి.

మనం ప్రేమించే వాళ్ళు మనలని ప్రేమించక పోవచ్చు. ప్రేమించాలన్నరూల్ లేదు. దీనికి ఒప్పుకోవాలి. ఎదుటి వాడు అంగీకరిస్తారన్న ఆశ ఉంచుకోకూడదు. అప్పుడపప్పుడు నమ్మక ద్రోహం, మోసం చేయడం లాంటివి కూడా జరుగుతాయి. దీనిని అంగీకరించాలి. కాని నేను దీనిని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. పెద్ద పాఠం నేర్చుకున్నాను.

నా డెబ్బైఏళ్ళ ఈ వయసులో ఈ పెద్ద భవవంతిలో, అరణ్యంలా ఉన్న ఈ చెట్లల్లాంటి తోటలో తిరుగుతూ ఆలోచిస్తూ నేను నేర్చుకున్నది ఇదే, కాని నువ్వు దాన్ని అంగీకరించలేక పోవచ్చు, నావాడు అనుకున్న వాడు ఇలా చేయగలడు అని తెలిసింది.”

మాటలు ఆపి , ఆగి చీకట్లో ఓ గుడ్డివాడిలా శివరాం కూచున్న వైపు చూసాడు.

శివరాం ఏదైనా మాట్లాడుతాడేమో అని ఆగాడు. కాస్త సమయం కూడా ఇచ్చాడు.

ఏవిధమైన శబ్ధం రాలేదు. తనే మొదలు పెట్టాడు.

“ఈ ఒంటరితనంలో, మన చిన్నప్పటి రోజులు కూడా తలచుకునే వాడిని. చెప్పాను కదా, ఇన్ని ఏళ్ళు ఆలోచనలతోనే గడిపాను అని. నీ రాక కోసం ఎదురు చూసాను. ఆ రోజులు ఏదో మంత్రం వేసినట్లుగా ఉండే అద్భుతమైన రోజులు. అప్పుడు ఆ అద్భుతమైన రోజుల్లో నీకు ఆలోచన వచ్చి ఉంటుందంటే నమ్మకం కలగడం లేదు. నాకు ఆనందాన్నిచ్చినది, నీలో అసంతృప్తిని కలిగించిందంటే నమ్మకం కలగడం లేదు.

రాను రాను, వయసవుతున్న కొద్దీ, జ్ఞాపకశక్తి ఇంకా పదునవుతున్నట్లనిపిస్తోంది. ప్రతీ చిన్న విషయం, సంఘటన విపులంగా స్పష్టంగా కనిపిస్తుంది. కారణాలు వెతకడానికి అవి పనికొచ్చాయి.

ఆ రోజుల్లో మనం చిన్న పిల్లలం. స్నేహితులం. నీ స్నేహం, అది నాకు ఓ పెద్ద బహుమతి. అది అపురూపమైనది. అది నాకు దొరికినందుకు , ఆ అదృష్టాన్నిచ్చిన దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి అని అనిపించేది.”

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here