[box type=’note’ fontsize=’16’] శ్రీ సన్నిహిత్ వ్రాసిన ‘కలగంటినే చెలీ’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]
ప్రారంభానికి ముందు:
[dropcap]”చె[/dropcap]ప్పు… హత్య ఎందుకు చేసావు..?”
తలెత్తి చూసాడు సూర్య.
మళ్ళీ అన్నాడు ఎస్సై “చెప్పు …ఎందుకు చేసావ్..”
“నేను చెయ్యలేదు సార్..”
“అబ్బా.. ఎన్నిసార్లు చెబుతావురా అదే సమాధానము..”
“నేను చెప్పేది నిజం సార్.. ఆ హత్యకు నాకు ఎలాంటి సంబంధం లేదు..” చిన్నగా చెప్పాడు
“మరెవరు చేశారు..”
“నాకేం తెలుసు సార్..”
“నీ చేత ఎలా చెప్పించాలో నాకు తెలుసు.. అందాకా ఆ సెల్‌లో ఉండు” అని కానిస్టేబుల్‌ని పిలిచాడు.
సూర్యని సెల్‌లో పెట్టి తాళం వేసాడు కానిస్టేబుల్.
సెల్‌లో గోడకి చేరబడి నిస్సత్తువగా కిందికి జారిపోయాడు సూర్య!
‘ఇదేనా తాను కలలు గన్న జీవితం’ అనుకుని నిశ్శబ్దంగా కన్నీరు కార్చసాగాడు!!!
ప్రారంభం:
“ఐ లవ్యూ”
వినిపించిన ఆ తియ్యటి స్వరాన్ని వెదుకుతూ తల తిప్పి చూసాడు సూర్య. విపరీతమైన సంభ్రమానికి లోనయ్యాడు. తన కాలేజ్‌మేట్ ‘హాసిని’ ఎదురుగా ఉంది. చిరునవ్వులు చిందిస్తూ తననే చూస్తోంది. తాను విన్నది నిజమేనా అన్న డైలమాలో ఉన్నాడు సూర్య.
“మిమ్మల్నే.. ఐ లవ్యూ” మళ్ళీ అంది హాసిని.
“ఓహ్.. థాంక్యూ.. ఐ లవ్యూ టూ” అంటూ స్పందించాడు. అతని ఆనందాన్ని ఎక్కువసేపు ఉంచకుండా ఆమె నెమ్మదిగా వెళ్ళిపోసాగింది.
“హాసినీ… ప్లీజ్… నన్ను వదిలి వెళ్ళకు… నన్ను వదిలి వెళ్ళకు” అంటూ పిచ్చివాడిలా ఆమె వెనక పరుగుదీసాడు సూర్య. కానీ ఆమె అతనికి అందలేదు. దిగంతాలవైపు ఎగిరిపోసాగింది. కన్నీళ్ళు వచ్చాయి సూర్యకి. వెక్కి వెక్కి ఏడ్వసాగాడు… ఏడుస్తూనే ఉన్నాడు..
కన్నీటి తడికి మెలకువ వచ్చింది సూర్యకి. ఇంతసేపూ తను కన్న కల అతన్ని ఇంకా బాధలోనే ఉంచింది. ఆ బాధ నుండి బయటపడే మార్గం కోసం చుట్టూ చూసాడు. భార్యా, పిల్లాడు నిద్రపోతున్నారు. ఇక నిద్ర రాక బాల్కనీ లోకొచ్చి నిలబడ్డాడు. దట్టమైన చీకటిని పారద్రోలుతూ బ్రైట్‌గా వెలుగుతున్న వీధి లైట్లు. దూరంగా ఎక్కడో కుక్కల అరుపులు.
కల ఇంకా ఫ్రెష్‌గా అతని కళ్ళ ముందు కదలసాగింది.
ఎప్పటి హాసిని?
అతను కాలేజీ చదువు ముగించి చాలా సంవత్సరాలు అయింది. కానీ ఇప్పటికీ అలాంటి కలలు వస్తున్నాయంటే అతని మనసు మూలల్లో ఎక్కడో హాసిని సజీవంగా ఉంది.. లేదా… అతని ప్రస్తుత జీవితంలో ఎక్కడో అసంతృప్తి ఉంది… అతని మనసు ప్రేమ కోసం అంతరాంతరాల్లో అర్రులు చాస్తోంది అన్న మాట… ప్రేమ రాహిత్యం.. ఎంతో మందిని అంతర్లీనంగా వేధిస్తున్న ప్రేమ రాహిత్యం!! ఈ విషయాలన్నీ మనకు అర్థం కావాలంటే అతని విద్యార్థి దశను ఒక్కసారి మనం చూసి రావాలి.
***
అప్పుడప్పుడే తెలవారుతోంది. వెచ్చటి భాను కిరణాలు చుర్రుమనిపిస్తున్నాయి. రాత్రంతా నిద్రపోయి విశ్రాంతి తీసుకున్న సూర్యభగవానుడు.. యమ ఉత్సాహంతో లోకాన్ని ఏలడానికి అన్నట్టు.. కొండ కోనల వెనకనుండి.. పై పైకి వచ్చేస్తున్నాడు.
ఉత్తరాంధ్రలో ఒక అందమైన పల్లెటూరు.. ఆ ఊళ్ళో ఒక అందమైన పెంకుటిల్లు. ఆ ఇంటి పెరట్లో బావి దగ్గర పళ్ళు తోముకుంటున్నాడు ‘సూర్యం’. అతని పూర్తి పేరు సూర్యనారాయణ. అందరూ సూర్యం అని పిలుస్తారు. మరీ దగ్గర వాళ్ళు ‘సూరీడు’ అని పిలుస్తారు. ఆ ఊరికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న మండల హెడ్ క్వార్టర్‌లో ఉన్న జూనియర్ కళాశాలలో ఇంటర్‌మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థి అతను. తెలుగు మీడియం కళాశాల అది. ఎంపీసీ గ్రూపు అతనిది.
కాలకృత్యాలు పూర్తవ్వగానే దేవుడికి పూజ చేసుకుని కొంచెం చద్దన్నం తిని పుస్తకాల బేగ్ భుజాన వేసుకున్నాడు. అతని తల్లిదండ్రులూ.. ఇద్దరు చెల్లెళ్ళూ ఇంకా నిద్రపోతున్నారు. వాళ్ళకి డిస్టర్బెన్స్ అవకుండా మెయిన్ డోర్ తలుపు దగ్గరగా వేసి బయటికి వచ్చాడు. గోడ పక్కగా ఉన్న సైకిల్ తీసుకుని రోడ్డెక్కాడు.
నెమ్మదిగా సైకిల్ తొక్కుతూ ఆలోచించసాగాడు.
రాత్రి తల్లిదండ్రుల మధ్య జరిగిన సంభాషణ అతనికి పదే పదే గుర్తుకు వస్తోంది.
“పిల్లాడు కాలేజీ చదువులోకొచ్చాడు. ఖర్చు పెరిగిపోతోంది..” అంది తల్లి
“అవును.. అదే నేనూ ఆలోచిస్తున్నాను. పైగా వాడు తీసుకున్నది మేథ్స్ గ్రూపు. పుస్తకాలకి బోలెడంత అవుతోంది. ట్యూషన్ కూడా జాయిన్ అయ్యాడు.” నిట్టూర్చాడు తండ్రి.
“ఏం చేద్దాం..”
“చేసేదేముంది.. ఇంటర్ చదువు పూర్తికాగానే అక్కడితో ఆపించేద్దాం. ఏదైనా చిన్న జాబ్ చూసుకోమని చెబుదాం. ఉద్యోగం చేస్తూ చదువుకుంటాడు. లేకపోతే లేదు”
“సరే లెండి.. అలాగే చేద్దాం” అంది తల్లి.
వాళ్ళ మాటలు పదే పదే గుర్తుకొస్తున్నకొద్దీ బాధగా అనిపించింది సూర్యానికి. ఆ సరస్వతీ దేవి కటాక్షం వల్ల చదువు అబ్బింది తనకి. ఒక్కసారి పాఠం వింటే మర్చిపోడు తను. బుద్ధిగా చదువుకునే తనని టీచర్లు కూడా ఎంతో ఇష్టపడతారు. బాగా ప్రోత్సహిస్తుంటారు. అలాంటిది తల్లిదండ్రులకి మాత్రం తను చదువుకొని పైకి రావడం ఇష్టం లేదు. ఇదెక్కడి విడ్డూరం!
కాలేజీ వచ్చింది.
ఆలోచనలని కట్టిపెట్టి సైకిల్ దిగి స్టేండ్‌లో పెట్టాడు. బేగ్ తీసుకుని క్లాసు రూము వైపు కదిలాడు. ప్రతీ రోజు పొద్దున్న ఆరు గంటల నుండి ట్యూషన్ ఉంటుంది. కాలేజీలో పాఠాలు బోధించే టీచర్లు కొంచెం ముందు వచ్చి ట్యూషన్ చెబుతుంటారు. ఎనిమిది గంటలదాకా ట్యూషన్ ఉంటుంది. ఆ తర్వాత రెగ్యులర్ కాలేజీ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం దాకా క్లాసులు జరుగుతాయి. లంచ్ బ్రేక్ తర్వాత పెద్దగా క్లాసులేమీ ఉండవు. అవే తరగతి గదులు వేరే గ్రూపు విద్యార్థులకి కేటాయించబడతాయి. పొద్దున్న సైన్స్ గ్రూపు వాళ్ళకి. మధ్యాహ్నం ఆర్ట్స్ గ్రూప్ వాళ్ళకి అన్న మాట. చిన్న కాలేజీ కావడంతో ఆ ఎడ్జస్ట్‌మెంట్ చెయ్యబడింది.
సూర్యం వెళ్ళేటప్పటికి మేథ్స్ లెక్చరర్ లెసన్ ప్రారంభించారు. సైలెంట్‌గా వెనక బెంచీలో కూర్చుని పాఠం వినడంలో మునిగిపోయాడు సూర్యం.
***
ఏడు గంటలవుతుండగా లేచారు పార్వతమ్మ, శంకరం! సూర్యం తల్లిదండ్రులు వాళ్ళు. పార్వతమ్మ గృహిణి. శంకరం అదే ఊళ్ళో ఉన్న ప్రైమరీ స్కూల్లో టీచర్. సూర్యం తర్వాత ఉన్న ఆడపిల్లలిద్దరూ ఒకరు తొమ్మిదో తరగతి, ఇంకొకరు ఆరో తరగతి అక్కడే హైస్కూల్‌లో చదువుతున్నారు. ఒకరు సుమతి, ఇంకొకరు శ్రీ వల్లి. చాలా ఒద్దికైన అమ్మాయిలు. తల్లిదండ్రుల మాట జవదాటరు. అన్నయ్య అంటే మహా భయం. ఎప్పుడూ చదవమని చంపుతూ ఉంటాడని.
పార్వతమ్మ భర్త చేతికి టీ అందిస్తూ “పెద్దది వయసుకొస్తోంది.. కొంచెం జాగ్రత్త పడాలి మనం” అంది.
“సరేలేవే.. ఇప్పటి నుండే భయం ఎందుకు.. చూద్దాం.. ఇంకా టైము ఉందిగా” అన్నాడు.
“అలా అనుకుంటే ఎలా అండీ.. ఆడపిల్ల ఎదగడం ఎంతసేపు!” అంటూ వంటగది లోకి వెళ్ళిపోయింది. లేచి స్కూల్‌కి వెళ్ళడానికి రడీ అవసాగాడు శంకరం. సుమతి, శ్రీ వల్లి కూడా రడీ అయి కూర్చున్నారు. వాళ్ళందరికీ అప్పుడే చేసిన టిఫిన్ ఏదో పెట్టింది పార్వతమ్మ. అది కాస్తా తిని ఎవరి దారిన వాళ్ళు పోయారు.
తర్వాత.. ప్రశాంతంగా మిగతా ఇంటి పనులు చేసుకోవడంలో మునిగిపోయింది పార్వతమ్మ.
***
“ఏరా.. లంచ్ తెచ్చుకున్నావా?” అడిగారు ఫ్రెండ్స్.
సూర్యం ‘అవునూ.. కాదు’ అన్నట్టు తలూపాడు. అప్పటికే మధ్యాహ్నం ఒంటి గంట దాటింది. కడుపులో పేగులు కరకరలాడుతున్నాయి. పొద్దున్న తిన్న చద్దన్నం ఎప్పుడో జీర్ణమైపోయింది.
“సరే.. మాతో పాటూ తిందువుగాని రా” అన్నారు.
“లేదు లేరా.. నేను ఇంటికి వెళ్ళాక తింటాను” అని తప్పించుకున్నాడు. సైకిలెక్కి బయలుదేరాడు. మళ్ళీ ఆలోచనల పరంపర. పదో క్లాసులో చాలా మంచి మార్కులొచ్చినప్పుడు అందరూ అతన్ని అభినందించారు. ‘నువ్వు చాలా గొప్పోడివి అయిపోతావురా’ అని పొగిడారు. చాలా సంతోషపడ్డాడు.
భవిష్యత్తు అంతా రంగులమయంగా ఉంటుందని ఊహించుకున్నాడు. కానీ ఇంకా ఇప్పటికీ వర్తమానంలోనే ఉన్నాడు. ఆ అందమైన భవిష్యత్తు లోకి ఇంకా అతను ప్రవేశించలేదు. ‘ప్రవేశిస్తాను’ అన్న ఆత్మవిశ్వాసం అయితే ఉంది కానీ తల్లిదండ్రుల మాటలు చూస్తుంటే అది సాధ్యమయ్యే పనేనా అన్న అనుమానం అప్పుడప్పుడు అతన్ని పీడిస్తూ ఉంటుంది.
(సశేషం)