నా జీవన గమనంలో…!-26

54
3

[box type=’note’ fontsize=’16’] జీవన గమనంలో ఆంధ్రా బ్యాంకులో ఉద్యోగపర్వంలో తాను చవిచూసిన సంతోషాలు… దుఃఖాలు…; సుఖాలు…, కష్టాలు…; ఆశలు…, నిరాశలు…; సన్మానాలు…, అవమానాలను… ఒక్కొక్కటిగా నెమరు వేసుకుంటూ సంచిక పాఠకులకు అందిస్తున్నారు తోట సాంబశివరావు. [/box]

41

[dropcap]గ[/dropcap]త సంవత్సరాలకు మల్లే, ఈ సంవత్సరం కూడా అదే పంథాలో పని చేస్తే, అత్యధికంగా పెంచిన టార్గెట్లను అందుకోవడం అత్యంత కష్టం… అందుకే… అంతకుమించి ఇంకేమైనా చేయగలమా?.. అనే ఆలోచన నా మదిలో కదలాడుతుంది. అప్పుడే ‘మేనేజింగ్ హ్యుమన్ ఫ్యాక్టర్స్ ఇన్ డెవెలప్‍మెంట్’, ‘అభివృద్ధి సాధనలో మానవ వనరుల వినియోగం’ అనే విషయంపై ఒకానొక మహానుభావుడు వ్రాసిన వ్యాసం చదివాను. ఆ వ్యాసంలోని ఒక కొటేషన్ నా మనసుకు హత్తుకుంది.

‘టేక్ కేర్ ఆఫ్ ది బోయిస్… ది బోయిస్ విల్ టేక్ కేర్ ఆఫ్ ది బిజినెస్’.

ఆ కొటేషన్‌ని విపులీకరిస్తే,… ‘మనతో కలిసి పని చేసే సిబ్బందిని జాగ్రత్తగా చూసుకోండి… ఆ సిబ్బంది మీ వ్యాపారాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు’ అనే అర్థం స్ఫురిస్తుంది. ఈ కొటేషన్ ఏదో ఒక బ్యాంకు కోసమో, ఒక కార్పోరేట్ సంస్థ కోసమో చెప్పింది కాదు. చిన్నా పెద్దా… అనే తేడా లేకుండా ఏ సంస్థ కైనా అన్వయించుకోవలసిన ఒక అర్థవంతమైన మార్గదర్శక సూత్రం. ఈ సూత్రాన్ని నేను పని చేసే ప్రతి చోటా, తెలిసో తెలియకో, అమలు చేస్తూ వస్తున్నాను. కానీ ఈసారి ఈ బ్రాంచీలో మాత్రం మరింత శాస్త్రీయంగా అమలు పరచాలని నిర్ణయించుకున్నాను.

  • మొదటిగా… ఈ టార్గెట్లనేవి కేవలం ఒక్క బ్రాంచి మేనేజర్ కోసం పెట్టినవి కావు… ఆ బ్రాంచికి, ఆ బ్రాంచిలో పని చేసే సిబ్బంది అందరికీ కలిపి ఉమ్మడిగా పెట్టినవి. టార్గెట్లు రీచ్ కాగలిగితే, అది ఆ బ్రాంచి యొక్క, అంటే ఆ బ్రాంచి మేనేజరు మరియు సిబ్బంది యొక్క సమిష్టి కృషి వలన సాధించిన ఘనత అని తెలుసుకోవాలి.

అదే విషయాన్ని బ్రాంచిలో సిబ్బంది సమావేశాన్ని ఏర్పాటు చేసి, అందరికీ అర్థమయ్యేలా చెప్పి ఒప్పించగలిగాను. మనందరి భవిష్యత్తు మన బ్యాంకు అభివృద్ధితో ముడిపడి వుందని సవివరంగా చెప్పాను. తద్వారా ప్రతి ఒక్కరూ, డిపాజిట్ల పెంపుదలలో, అప్పుల వసూళ్ళలో, ఖాతాదారులకు మెరుగైన సేవలందించడంలో, తమ వంతు బాధ్యతను చక్కగా నిర్వర్తించారు.

  • రెండోది… సిబ్బందిలో ఎవరికైనా తన విధి నిర్వహణలోగాని, వ్యక్తిగత విషయాల్లో గాని, ఎలాంటి ఇబ్బంది ఎదురైనా సానుభూతితో పరిశీలించి, ఒక మేనేజర్‌గా సాధ్యమైనంత సహాయ సహకారాలను అందించడం మొదలుపెట్టాను.
  • మూడోది… ఎవరైనా సిబ్బంది ఏదైనా సాధిస్తే, హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉత్తేజపరుస్తున్నాను.
  • నాలుగోది… ఏ సిబ్బంది అయినా ఒప్పు చేస్తే పదిమందిలో మెచ్చుకోవడం, తప్పు చేస్తే, ఒంటరిగా వున్నప్పుడే మందలించడం ద్వారా వారి మనోస్థైర్యాన్ని నిలబెట్టగలుగుతున్నాను.
  • ఐదోది… ఎవరైనా సిబ్బంది ఏదైనా ఫేవర్ కోరితే, చేసేందుకు వీలైతే వెంటనే చేస్తున్నాను. వీలు కాని పక్షంలో చేయలేనని, ఆ సిబ్బంది యొక్క మనోభావాలు దెబ్బతినకుండా, సున్నితంగా, నేర్పరితనంతో చెప్తున్నాను. నిజానికి, ‘యస్’ అని చెప్పడం కంటే, ‘నో’ అని చెప్పడం చాలా కష్టం.
  • ఆరోది… బ్రాంచి తరఫున ఏదైనా సాధిస్తే, అది కేవలం మా సిబ్బంది సహకారం వల్లనే జరిగిందని మా పై అధికారులకు తెలియజేస్తున్నాను. పైవాళ్ళు కూడా నాతో పాటు, మా సిబ్బందిని కూడా అభినందిస్తూ ఉత్తరం పంపేవారు. ఆ ఉత్తరాన్ని సిబ్బంది అందరూ చూసి సంతకం చేయమని కోరుతున్నాను. అప్పుడు సిబ్బంది, తమ శ్రమని పై అధికారులు కూడా గుర్తిస్తున్నారని తెలుసుకుని సంతోషిస్తున్నారు.
  • ఏడోది… బ్రాంచి అభివృద్ధి కోసం అనునిత్యం శ్రమిస్తూ, తమ వంతు పాత్రను నిజాయితీగా పోషిస్తున్న సిబ్బందికి, పదోన్నతి సమయంలో అన్ని విధాల సహాయకారిగా వుంటున్నాను. పైవాళ్లతో చర్చించి, అర్హత వున్న వారిని అందలం ఎక్కించే ప్రయత్నం చేస్తున్నాను.
మహబూబాబాద్ బ్రాంచిలో ‘డఫ్తరీ’గా పనిచేస్తున్న శ్రీ ఐ.యస్. రావు గారికి ‘క్లర్కు’గా పదోన్నతి లభించి, తను కోరుకున్న నెల్లూరు రీజియన్‍కి బదిలీ అయిన సందర్భంగా… కూర్చున్నవారు (ఎడమ నుంచి కుడికి) సర్వశ్రీ 1). మహేశ్వరరెడ్డి గారు 2). యాదగిరి గారు 3). నరేంద్ర రెడ్డి గారు 4). సుబ్బారావు గారు, ఆంధ్రా బ్యాంకు కర్షక సేవా సహకార సంఘం, కురవి మేనేజింగ్ డైరక్టర్, 5). ఐ.యస్. రావు గారు 6). రచయిత 7). ప్రకాశరావు గారు 8). తిరుమల రావు గారు… నిల్చున్నవారు (ఎడమ నుంచి కుడికి) శ్రీమతి విశాలాక్షి గారు… సర్వశ్రీ 1). పార్థసారథి గారు 2). ప్రకాశ్ బాబు గారు 3). వరదా రెడ్డి గారు 4). శివకుమార్ గారు 5). భుజంగ రావు గారు 6). వెంకటేశ్వర్లు గారు మరియు 7). శామ్యూల్ గారు

పైన చెప్పినవే కాకుండా, సిబ్బందికి సహాయపడడంలో, వారిని సంతృప్తి పరచడంలో వచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని అందిపుచ్చుకున్నాను. సద్వినియోగం చేసుకున్నాను. తత్ఫలితంగా, సిబ్బంది… బ్రాంచి టార్గెట్లను రీచ్ అయ్యేందుకు, నా బరువు బాధ్యతలను పంచుకుంటూ, నాతో చేయి చేయి కలిపి ముందుకు నడుస్తున్నారు.

42

నా సహోద్యోగులల్లో చాలామంది ఇప్పటికే బ్యాంకు నుండి హౌసింగ్ లోన్ తీసుకుని ఇళ్ళు కట్టుకోవడమో, కొనుక్కోవడమో చేశారు. నేను కూడా ఈపాటికే ఒక ఇంటిని సమకూర్చుకుని ఉండాల్సి వుంది. అప్పటికీ మా ఆవిడ చెప్తూనే వుంటుంది. కానీ, నేనే… చూద్దాం… చేద్దాం… అంటూ ఇప్పటివరకు విషయాన్ని దాటేస్తూ వచ్చాను.

కాని ఇప్పుడిక ఏ మాత్రం ఆలస్యం చేయదలచుకోలేదు. ఎందుకంటే, ప్రతి ఒక్కరి జీవితంలో, ఉద్యోగంలో చేరడం, పెళ్ళి చేసుకోవడం, ఇల్లు కట్టుకోవడం అనే మూడు ఘట్టాలు చాలా ముఖ్యమైనవి. నా విషయంలో ఆ మొదటి రెండూ సకాలంలోనే జరిగాయి. మూడోదానికే ఇప్పటివరకు ముహూర్తం కుదరలేదు.

ఓ సినిమాలో, ఓ సినీకవి గారు చెప్పారు…

“పెళ్ళి చేసుకుని, ఇల్లు కట్టుకుని
చల్లగా కాపురముండాలోయో…,
మీరెల్లరు సుఖముగ ఉండాలోయ్…!” అని.

ఆ మూడు ఘట్టాలు పూర్తయితే, ఒక వ్యక్తి యొక్క సగం జీవితం సార్థకమయినట్లే..!

వెంటనే గుంటూరులోని నా స్నేహితులకు, బంధువులకు, కొనడానికి నాకో ఇల్లు వెతికిపెట్టమని ఉత్తరాలు వ్రాశాను.

ఒక ఆదివారం గుంటూరు వెళ్ళాను. వాళ్ళు నాకు ఓ మూడు ఇళ్ళను చూపించారు. నాకు అంతగా నచ్చనందున వాటిని కాదనుకున్నాము. తరువాత ఆదివారం గుంటూరు వెళ్తే, మరో మూడు ఇళ్ళను చూపించారు. అందులో ఒకటి బాగా నచ్చింది. ఆ ఇల్లు గుంటూరు, నెహ్రూనగర్ మూడవ లైనులో, 180 చదరపు గజాల్లో సుమారు ఆరు సంవత్సరాల క్రితం నిర్మించబడిన ఇండిపెండెంట్ హౌస్. నచ్చిన తరువాత, ఇక ఆలస్యం చేయకూడదని, ఇల్లు అమ్మే వ్యక్తికి, నాకు ఆమోదయోగ్యమైన రేటును కుదుర్చుకున్నాము. కొంత డబ్బును అడ్వాన్సుగా ఇచ్చి, అగ్రిమెంటు వ్రాసుకున్నాము.

ఇంటి పత్రాల, అగ్రిమెంటు కాపీలను జత చేస్తూ, ఆంధ్రా బ్యాంకు హెడ్ ఆఫీసుకు హౌసింగ్ లోన్ కోసం దరఖాస్తు పంపాను. ఓ పది రోజుల తరువాత లోన్ శాంక్షన్ లెటర్ వచ్చింది. ఆ తరువాత వారం రోజుల్లో ఇంటి రిజిస్ట్రేషన్ కూడా పూర్తయింది.

నా పేరుతో ఓ ఇల్లు, నా పేరు పైన ఒక స్థిరాస్తి, నా స్వార్జితం… తలచుకుంటేనే చెప్పలేనంత తృప్తి, ఆనందం. ఒక ఇంటి వాడినైనందుకు ఒకింత గర్వం కూడా…

ఆ ఇంటికి కొన్ని అవసరమైన మరమ్మతులు చేయించి, రంగులు వేయిస్తే బాగుంటుందనిపించింది. మా దగ్గరి బంధువులలో ఒకరు బిల్డింగ్ కాంట్రాక్టులు చేస్తూంటాడు. ఆయన ఓ సివిల్ ఇంజనీరు కూడ. మంచి అనుభవం కూడా సంపాదించాడు. అతనికే మా ఇంటి పనులు అప్పజెప్పాను.

ఇల్లు కొనడం అనేది… ఎప్పుడో జరగాల్సింది… కాని ఇప్పటికి జరిగింది. అందుకనే అంటారు – ‘దేనికైనా టైం రావాలి!’ అని.

43

1986 సంవత్సరం.

జిల్లాలోని లయన్స్ క్లబ్‌లన్నీ ఆ సంవత్సరం పొడవునా చేపట్టిన సామాజిక సేవా కార్యక్రమాలను సమీక్షించిన మీదట, మహబూబాబాద్ క్లబ్‌ను ఉత్తమ క్లబ్‍గా, ఆ క్లబ్ అధ్యక్షుడిని ఉత్తమ అధ్యక్షుడిగా, ఆ క్లబ్ కార్యదర్శిని ఉత్తమ కార్యదర్శిగా ఎంపిక చేశారు. కార్యదర్శిగా నా పాత్రను నేను సమర్థవంతంగా పోషించాననేదానికి నిదర్శనంగా నాకీ అవార్డు లభించడం నాకు అపరిమిత ఆనందాన్నిచ్చింది. తదుపరి హైదరాబాద్‍లో జరిగిన ఓ సభలో జిల్లాలోని లయన్స్ క్లబ్‍ల ప్రతినిధులందరూ పాల్గొన్నారు. ఆ సభలో అవార్డు గ్రహీతలందరికీ అవార్డులను బహుకరించారు. సమాజసేవలో పాల్గొనే అవకాశాన్ని నాకు కల్పించిన మహబూబాబాద్ లయన్స్ క్లబ్‍కు, ఆ క్లబ్ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేశాను.

***

ఇక మహబూబాబాద్ బ్రాంచి టార్గెట్సు విషయానికొస్తే, అలవి కానివైనా,… అవలీలగా సాధించామని చెప్పడం, అతిశయోక్తి అవుతుంది. నిజానికి, నేను మా సిబ్బంది, అందరం కలిసి ఐకమత్యంగా, సంవత్సరం పొడవునా, అహర్నిశం శ్రమించి ఆ టార్గెట్స్‌ని సాధించాము. ముమ్మరంగా సాగిన మా ప్రయత్నాల యొక్క ఫలితాలను, రోజూ వారీ లెక్క లేసుకుంటూ వుండేవాళ్ళం. పొరపాట్లు ఏమైనా దొర్లితే అప్పటికప్పుడే దిద్దుబాటు చర్యలు చేపట్టేవాళ్ళం. కలిసికట్టుగా శ్రమిస్తే సాధించలేనిదంటూ ఏదీ ఉండదని నిరూపించాం. ఆ క్రమంలో వరంగల్ రీజినల్ మేనేజరు గారు మరియు హెడ్డాఫీసులో మా బ్రాంచిని పర్యవేక్షించే ఉన్నతాధికారుల మన్ననలను మేము పొందగలిగాము.

***

మహబూబాబాద్ బ్రాంచీలో మూడు సంవత్సరాల పదవీకాలం పూర్తయింది. ఆ రోజే బదిలీ ఉత్తర్వులు అందాయి. నన్ను గుంటూరు రీజినల్ ఆఫీసులో లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ (యల్.డి.యమ్)గా పోస్టు చేశారు. గుంటూరు జిల్లాకు ఆంధ్రా బ్యాంకు లీడ్ బ్యాంక్. ఆంధ్రా బ్యాంకు తరఫున గుంటూరు జిల్లా లీడ్ బ్యాంక్ పథక అమలు బాధ్యతలను గుంటూరు రీజినల్ మేనేజర్ గారి ఆధ్వర్యంలో, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ నిర్వహించాలి. ఒక విధంగా నేను బ్రాంచి స్థాయి నుండి జిల్లా స్థాయి బాధ్యతలను చేపట్టబోతున్నందుకు చాలా సంతోషం అనిపించింది. వ్యక్తిగతంగా చూస్తే, ఈ మధ్యనే నేను గుంటూరులో కొనుక్కున్న నా సొంత ఇంట్లోనే మేము నివసించవచ్చు. నా బంధువులందరికి చేరువలో వుండవచ్చు. గుంటూరు పట్టణంలో మా పిల్లలకు నాణ్యమైన విద్యాబోధన లభిస్తుంది. గుంటూరు బదిలీ అన్ని విధాలా ఆనందించదగినది. ఆహ్వానించదగినది.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here