అపూర్వం నీలమత పురాణానువాదం

0
3

[dropcap]పు[/dropcap]రాణాలు ఎన్ని? అవి ఏవి? అనే ప్రశ్నలు రాగానే మనకు గుర్తుకొచ్చే శ్లోకం – “మద్వయం భద్వయం చైవ….” అనేది. ఈ శ్లోకంలో పేర్కొన్న మత్స్య, మార్కండేయాది పురాణాలే కాక శివ, భార్గవ, కపిలాది ఉపపురాణాలూ ఉన్నాయి.

“సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణిచ
వంశానుచరితం చైవ పురాణం పంచలక్షణమ్”

అని పురాణాలకున్న ఐదు లక్షణాలను చెప్పారు.

పురాణానికి ‘పురాపి నవం భవతి’ అనే నిర్వచనం కూడా ఉన్నది.

ప్రాచీనమైనదయినా నిత్య నూతనమని దీని అర్థం. అయితే చాలా మంది  దృష్టిలో పురాణాలంటే సాయం సమయాలలో దేవాలయాలలో శాస్త్రిగారు చెప్పే నాలుగు మంచి మాటలు అనే. అది కాదు – పురణాలు భారతీయ విజ్ఞాన సర్వస్వాలు అని చెప్పిన వారూ ఉన్నారు. అష్టాదశ పురాణాలను గురించి, వాటిలోని విషయాలను గురించి క్షుణ్ణంగా తెలిసినవారు, ఎంతో కొంత తెలిసినవారు ఉన్నారు. కాని ‘నీలమత పురాణం’ అనే మాటను కూడా విననివారే ఎక్కువ మంది. మనలో చాలా మందికి పేరు కూడా తెలియని నీలమత పురాణాన్ని తెలుగులోకి అనువదించి, దాని వైశిష్ట్యాన్ని గురించి అద్భుతంగా పరిచయం చేసారు శ్రీ కస్తూరి మురళీకృష్ణ. ఇది కేవలం ఒక పుస్తకానువాదం లేదా పురాణానువాదం మాత్రమే కాదు .ఈ అనువాదం ఒక చారిత్రక అవసరం.

కల్హణుని ‘రాజతరంగిణి’ సుప్రసిద్ధ చారిత్రక కావ్యం. దానిలో కల్హణుడు అతి ప్రాచీనమైన నీలమత పురాణాన్ని ప్రస్తావించి తాను కశ్మీర్ ప్రాచీన రాజుల వివరాలను నీలమత పురాణం నుంచే సేకరించానని చెప్పాడు. కాని రాజతరంగిణిని అనువదించిన వారు కూడా నీలమత పురాణాన్ని చూడలేదట. 1924లో తొలిసారిగా నీలమత పురాణం ప్రచురింపబడిందనీ, అప్పటి నుండీ పరిశోధకులు నీలమత పురాణాన్ని అధ్యయనం చేస్తున్నారనీ తెలియజేసారు మురళీకృష్ణ. తన  అనువాదానికి నీలమత పురాణం సంస్కృత ప్రతితో పాటు శ్రీమతి వేదకుమారి ఆంగ్లనువాదం కూడా తోడ్పడిందని చెప్పారు. కల్హణుడు చెప్పిన దాన్ని బట్టి నీలమత పురాణం క్రీ.పూ.1182 నాటిది. పాశ్చాత్య చరిత్రకారులు మాత్రం నీలమత పురాణ రచనాకాలం క్రీ.శ.6, 7 శతాబ్దాల కాలమన్నారు. మురళీకృష్ణ ఆ సిద్ధాంతాల జోలికి పోకుండా నీలమత పురాణాన్ని ఒక చారిత్రక పత్రంగానే విశ్లేషించటం మంచిదని అభిప్రాయపడినారు. కశ్మీరు భారతదేశంలో అన్ని విధాలా అవిభాజ్యమైన అంశం అనీ, దీని ద్వారా కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించటం, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించటం తన రచనోద్దేశమని మురళీకృష్ణ స్పష్టంగా చెప్పారు.

ఇంతకూ నీలమత పురాణం అంటే ఏమిటి? దీనిలో ఏముంది? ఈ విషయాలను సంక్షిప్తంగా తెలుసుకొందాం. ఈ పురాణం కశ్మీరుకు సంబంధించినది. నీలుడనే నాగు మతాన్ని అంటే ధర్మాన్ని చెప్పే పురాణం నీలమత పురాణం. ఇది వైశంపాయనుడు జనమేజయునికి వినిపించిన పురాణం. ఈ కథ మూడవ గోనందుని కాలంలో జరిగిందని రాజతరంగిణి వలన తెలుస్తున్నది. నీలమత పురాణకర్త చంద్రదేవుడు. జనమేజయుడు వైశంపాయనుని మహాభారత యుద్ధంలో పాల్గొన్న వీరులలో కశ్మీర రాజుల ప్రసక్తి లేదేమని అడగటంతో నీలమత పురాణం ప్రారంభమవుతుంది. జనమేజయుని ప్రశ్నకు వైశంపాయనుడు చెప్పిన సమాధానంగా కాశ్మీరు చరిత్ర వివరణ ఉన్నది.

కలియుగారంభంలో కశ్మీరును పాలించిన రాజు మొదటి గోనందుడు. ఇతడు యుధిష్ఠిరునికి సమకాలికుడు. జరాసంధునికి స్నేహితుడు. జరాసంధుడు మధురపై దాడి చేసినప్పుడు గోనందుడు అతనికి సహాయంగా వెళ్ళాడు. ఆ యుద్ధంలో వీరికి ఓటమి సంభవిస్తుంది. గోనందుడు తీవ్రంగా గాయపడి మరణిస్తాడు. అతని తరువాత అతని కుమారుడైన దామోదరుడు రాజవుతాడు. కృష్ణుడు, అతని బంధువులు స్వయంవరం కోసం గాంధార రాజ్యానికి వెళ్ళారని తెలిసి దామోదరుడు సైన్యసమేతంగా అక్కడకు వెళతాడు. అక్కడ కృష్ణునితో తలపడి అతని చేతిలో మరణిస్తాడు. అప్పటికి దామోదరుని భార్య యశోవతి గర్భవతి. యుద్ధంలో విజయం సాధించినా కృష్ణుడు కశ్మీరును ఆక్రమించకుండా యశోవతిని కశ్మీరుకు రాణిగా నియమిస్తాడు. కృష్ణుడు కశ్మీరును ఆక్రమించకపోవటానికి కారణం కశ్మీరు భూభాగం సాక్షాత్తూ పార్వతీమాత కావటం. రాజు శివాంశజుడనే భావన. యశోవతి కుమారుడు గోనందుడు. గోనందుడు బాలుడు కావటం వలన కౌరవ పాండవులు అతనిని మహాభారత యుద్ధంలో పాల్గొనమని కోరలేదు. జయించిన వాసుదేవుడు కశ్మీరును ఆక్రమించుకోకుండా ఒక స్త్రీని రాణిగా ఎందుకు చేసాడని జనమేజయుడు ప్రశ్నించాడు. ఉమాదేవికీ, కశ్మీరానికీ అభేదప్రతిపత్తే అందుకు కారణమని చెప్పి వైశంపాయనుడు కశ్మీరు వైశిష్ట్యాన్ని గురించి వివరిస్తాడు. కశ్మీరును రెండుగా విభజిస్తూ దేవీ సమానమైన వితస్తనది ప్రవహిస్తోంది. కశ్మీరు ఒకప్పుడు సతీసరోవరం. అక్కడ భూమి ఏర్పడటానికి గల కారణాలను వైశంపాయనుడు ఇలా వివరించాడు. వాసుకి జనార్ధనుని స్తుతించి గరుడుని నుండి రక్షణ పొందుతాడు. భగవంతుని ఆనతి ప్రకారం వాసుకి సపరివారంగా సతీసరోవరంలో నివాసం ఏర్పరచుకొని నీలుని రాజుగా నియమిస్తాడు. సతీసరోవరానికి పతీసమేతంగా వచ్చిన శచీదేవిని చూసి సంగ్రహుడనే దైత్యుడు మోహిస్తాడు. సరోవరంలో పడిన అతని రేతస్సును నాగులు కాపాడుతారు. దాని నుండి జలోద్భవుడనే వాడు ఉద్భవిస్తాడు.

జలోద్భవుడు తపస్సు చేసి భగవంతుని నుండి వరాలు పొందుతాడు. ఆ వర గర్వంతో సతీసరోవరం పరిసర ప్రాంతాలలోని మనుషులను తింటుంటాడు. కశ్మీరు జలోద్భవుడి అకృత్యాలతో అల్లకల్లోలమవుతోన్న సమయంలో తీర్థయాత్రలు చేస్తూ కశ్యపుడు అక్కడకు వచ్చాడు. నీలుడు కశ్యపుని పూజించి జలోద్భవుని అరికట్టమని ప్రార్థించాడు. కశ్యపుని ప్రయత్న ఫలితంగా దేవతలు జలోద్భవుని పైకి యుద్ధానికి వెళ్ళారు. నీటిలో ఉన్నంత వరకూ జలోద్భవుని ఎవరూ ఏమీ చేయలేరు. అందువలన జనార్దనుని ఆదేశంతో అనంతుడు తన శరీరాన్ని పెంచి హిమాలయాలను కదలించాడు. నీరు బయటకు ప్రవహించటంతో కంగారు పడిన జలోద్భవుడు తన మాయాశక్తితో జగత్తును అంధకారమయం చేశాడు. శివుడు రెండు చేతులతో సూర్యుని, చంద్రుని ఎత్తి పట్టుకొన్నాడు. ఆ వెలుతురులో యోగి శరీరాన్ని ధరించిన హరి జలోద్భవునితో పోరి అతనిని సంహరించాడు. త్రిమూర్తులు నిలచిన మూడు శిఖరాలూ వారి పేర్లతో ప్రసిద్ధమయ్యాయి. దేవతలంతా అక్కడ ఆశ్రమాలు నిర్మించుకొన్నారు. ఆ ప్రదేశాన్ని మానవ నివాసయోగ్యంగా చేయమని కశ్యపుడు విష్ణువును ప్రార్థించాడు. కాని నాగులు మానవులతో కలసి ఉండటానికి ఒప్పుకోలేదు. ఆగ్రహించిన కశ్యపుడు వారిని పిశాచాలతో కలసి జీవించమన్నాడు. నీలుని ప్రార్థనపై శాంతించిన కశ్యపుడు వారిని (నాగులను) ఆరు నెలలు మనుషులతో, ఆరు నెలలు పిశాచాలతో కలసి జీవించమన్నాడు.

భగవంతుని ఆదేశం ప్రకారం ఆరు నెలల తరువాత మనుషులు కశ్మీరును వదలి వెళ్ళినా కశ్యపుని వంశానికి చెందిన చంద్రదేవుడు వెళ్ళలేదు. కశ్మీరుకు తిరిగి వచ్చిన పిశాచాలు హింసించటంతో దారి తెన్నూ లేక తిరుగుతున్న చంద్రదేవుడు నీలదేవుని భవనానికి వెళ్ళి అతనిని స్తుతించాడు. ప్రసన్నుడైన నీలుడు చంద్రదేవుడు కోరిన కశ్మీరంలో మానవులు ఎల్లప్పుడూ నివసించటమనే వరాన్నిచ్చాడు. కశ్మీరుకు వచ్చిన విరోదయ రాజుకు చంద్రదేవుడు నీలుడు చెప్పిన ధర్మాలను తెలియజేసి, వాటిని పాటిస్తే కశ్మీరంలో సుఖంగా ఉండవచ్చని చెప్పాడు. “ప్రజాపతిని ‘క’ అంటారు. కశ్యపుడు ప్రజాపతి. కశ్యప నిర్మితమైన ఈ ప్రాంతాన్ని కశ్మీరమంటారు.” ఇది నీలమత పురాణంలోని సంక్షిప్త కథాంశం.

ఇక మురళీకృష్ణ గారి అనువాద విధానాన్ని స్థాలీపులాక న్యాయంగా పరిశీలిద్దాం. అనువాదమంతా రచయిత రచనోద్దేశానికి అనుగుణంగానే సాగింది. కశ్మీరు చరిత్రను చెపుతూనే రచయిత సందర్భానుసారంగా నేటి పరిస్థితులతో సమన్వయించి చూపారు. మురళీకృష్ణ గారు ప్రతిపాదించిన అనేక అంశాలు పఠితలను అలోచింపచేసేవిగా ఉన్నాయి. చారిత్రక సత్యాలను అవిష్కరిస్తూ తమ నిశిత పరిశీలనాదృష్టితో ప్రాచీన భారతీయ విజ్ఞానాన్ని ఆధునిక శాస్త్రాలకు అన్వయిస్తూ చెప్పిన తీరు చక్కగా ఉంది. పుస్తకాన్ని చదవటం పూర్తి చేసేసరికి మనం ఎంతగా భావదాస్యంతో కొట్టుమిట్టాడుతున్నామో అర్థమవుతుంది. విషయ వివేచనలో రచయిత దేశ భక్తి, ధర్మానురక్తి వెల్లడవుతున్నాయి.

కృష్ణుడు దామోదరునిపై విజయం సాధించినా కశ్మీరును ఆక్రమించకుండా అతని భార్యను రాణిని చేసిన విషయాన్ని గురించి చెపుతూ “తాను గెలిచి సైతం ఓడిన రాజు భార్యకు సింహాసనం అప్పగించిన అతి అపురూపమైన సన్నివేశం ఇది. ఓడిన శత్రువును అవమానించి, వారి భార్యలను తన రాణివాసానికి సేవకులుగా తరలించడమో, వారి సేనలకు భార్యలుగా చేయటమో మాత్రమే తెలిసిన ‘జాతుల’కు కృష్ణుడి ఈ చర్యలోని ఔన్నత్యం అర్థం కాదు” అంటారు. ప్రపంచ చరిత్ర పుటల్లో ఆ జాతుల తీరుతెన్నులు లిఖితమయే ఉన్నాయి. ఈ సందర్భంలోనే “ఇదే భారతీయ ధర్మం. ఇదే భారతీయాత్మ స్వచ్ఛమైన స్వరూపం” అని చాలా గట్టిగా, స్పష్టంగా అన్నారు.

కశ్మీరు భౌగోళిక స్వరూపాన్ని వివరిస్తూ నాటి పురాణాలలో చెప్పిన విషయాలు ఆధునిక శాస్త్రాలకు ఏ విధంగా సరిపోతాయో చెప్పారు. భూగర్భ శాస్త్రానుసారంగా 70 మిలియన్ సంవత్సరాల నాటి పరిస్థితి ఏమిటో, ఆస్ట్రేలియా ఇండియాలు, అండమాన్, నికోబార్ ద్వీపాలు, హిమాలయాలు ఎలా ఏర్పడినాయో వివరంగా చెప్పారు. ప్లేట్ టెక్టానిక్స్, కరెవాలు, అరెనేషియస్, టెథిస్ సరస్సు మొదలైన ఆధునిక వైజ్ఞానిక శాస్త్ర టెర్మినాలజీ, పదాలు వేరయినా జలోద్భవుడు, కశ్యపుడు, కశ్యపమేరు మొదలైన పురాణ పదాలతో ఎలా సరిపోలుతున్నాయో చెప్పిన తీరు అబ్బురపరుస్తుంది. ఆధునిక విజ్ఞానవేత్తలు చెప్పిన విషయాల పట్ల ఉన్న నమ్మకం పురాణాల మీద లేనందుకు కొంత మందలింపూ ఉంది. “భారతీయ పురాణ గాథలను భారతీయ దృక్పథంలో అవగాహన చేసుకొని సానుభూతితో ప్రతీకలను గుర్తించి అవగతం చేసుకొని ఆలోచించాల్సి ఉంటుంది” అంటారు. నిజమే కదా! పైపైన చూసి అంతర్గతమైన ఆలోచనలను, ఋషుల ఆంతర్యాన్ని అర్థం చేసుకొనే ప్రయత్నం చేయకుండా ఒక్క మాటలో ‘పుక్కిటి పురాణాలు’ అని ఎంత తేలికగా కొట్టిపారేస్తున్నాం!

చారిత్రక దృష్టి లేకుండా, పురాణ వాఙ్మయాన్ని సరిగా అర్థం చేసుకోకుండా అగ్ర అల్ప వర్ణాల చర్చలను లేవదీసి దుష్ప్రచారం చేస్తున్న కుహనా పండితుల వాదాలను నిర్ద్వంద్వంగా ఖండించారు. వ్యక్తి,  గతానికి, భవిష్యత్తుకు నడుమ వారధి కాబట్టి బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని సూటిగా, స్పష్టంగా చెప్పారు. అలెక్స్ హేలీ రచించిన ‘రూట్స్’ను ఉటంకిస్తూ తన వారసత్వానికి దూరమైన వ్యక్తి వేదనను చెప్పారు. ఆ పుస్తకం తెలుగు అనువాదం గురించి ప్రస్తావిస్తూ మూలంలోని ఆత్మను అనువాదకుడు అందించలేకపోవటాన్ని చెప్పారు. సమాచార వ్యవస్థ బాగా అభివృద్ధి చెందిన కాలంలోనే ఒక రచన దుర్వ్యాఖ్యానాలకు లోనైనప్పుడు ఎప్పుడో రచించిన పురాణాల మాటేమిటి? వాటిని మనం సరిగా అర్థం చేసుకోగలుగుతున్నామా?  సరిగా చెప్పేవారి మాటలను వింటున్నామా?  ఈ ప్రశ్నలు ఇంతకు ముందు రాకపోయినా మురళీకృష్ణ గారి పుస్తకాన్ని చదివిన తరువాత ఖచ్చితంగా వస్తాయి.

సాధారణంగా పురాణాలలో ఎవరు ఎవరి సంతానమో ఓ జాబితా ఉంటుంది. అది ఒక్కొక్కసారి విసుగును కలిగిస్తుంది కూడా. కానీ ఇది ఆవశ్యకమంటారు రచయిత. “అనంతమైన ఈ మాలలో తాను ఒక పుష్పమన్న భావన కలుగుతుంది” అంటారు. కశ్యపుడు దర్శించిన పుణ్యతీర్థాలను గురించి చెపుతూ అది ఏ ఒక్క రాజ్యానికో చెందినవి కావని, సకల భారతీయులకు పవిత్ర ప్రదేశాలనే స్పష్టం చేసారు. ఇక్కడ భారతీయుల దృక్పథాన్ని గురించి చెప్పిన మాటలు గమనించదగినవి.

“భారతీయులకు దేశం, ధర్మం భావనల నడుమ అభేధ ప్రతిపత్తి. దేశభావనకు రాజుతో సంబంధం లేదు. ధర్మభావనకు రాజుతో సంబంధం లేదు. భక్తి భావనకు ఎవరితో సంబంధం లేదు. సంబంధం అంతా ధర్మంతో, దైవంతో అంతే”. మరో మాట “కొన్ని తరాల పాటు వర్తించే కర్మసిద్ధాంతాన్ని కొన్ని రోజులలో, గంటలలో పరిశీలించి చూసి పనికిరాదని తేల్చడం అజ్ఞానానికి నిదర్శనం, హ్రస్వదృష్టికి తార్కాణం.” ఇంత బలంగా చెప్పిన తరువాత మనం కనీసం ఒక్క నిమిషం ఆగి, ఆలోచించకుండా ఉండగలమా? ఇక కశ్మీరులోని నదుల, పవిత్ర స్థలాల పేర్లు చాలా వరకు మనకు తెలియదు. (రచయిత చెప్పినవి)

నీలమత పురాణంలోని వివిధ జాతులను గురించి చెపుతూ ప్రాచీన భారతీయ వాఙ్మయంలోని ప్రతీకలను, వాటిని సరిగా అర్థం చేసుకోలేని మన అజ్ఞానాన్ని రచయిత తీవ్రంగానే విమర్శించారు. అంతే కాదు, విదేశీయుల తీర్మానాల వలన, అనుచిత వ్యాఖ్యల వలన మనకు జరిగిన అన్యాయాన్ని సోపపత్తికంగా వివరించారు. ఎవరో సృష్టించిన అపోహల ఆధారంగా మనం గతాన్ని వదులుకుని ప్రపంచం ముందు బికారుల్లా నిలబడుతూ అదే అభ్యుదయమనే, అదే అభివృద్ధి అనే అనుకొనే హ్రస్వదృష్టిని మన దృష్టికి తీసుకువచ్చారు.

“అధర్మపరులు రాక్షసులు, ధార్మికులు దేవతలు. అందుకే ఋషిసంతానమైన తాటకి, రావణాసుర, శూర్పణఖలు రాక్షసులు అయ్యారు. మానవ సంతానమైన రాముడు, వానరుడైన హనుమంతుడు దైవాలయ్యారు. ఇక్కడ ధర్మం దైవం. ధర్మం దేశం. ధర్మమే సర్వం” అంటూ ఈ విషయాలను గురించి మరో ప్రశ్నకు అవకాశం లేకుండా చెప్పారు. నదులను, వాటి పరీవాహకాన్ని వేద ఋషులు అద్భుతంగా వర్ణించిన విషయాన్ని చెప్పి వేదనాగరికత దాదాపు క్రీ.పూ 8500 సంవత్సరాల నాటిదని స్పష్టం చేసారు రచయిత. మనమందరం సింధునాగరికత గురించి విన్నాం. కాని ‘సరస్వతి సప్తతి సింధుమాత’ అనే ఋగ్వేదంలోని ప్రకటనను, శాస్త్రవేత్తలు ‘సింధునాగరికత’గా నామకరణం చేసిన దాని 80 శాతం అవశేషాలు అదృశ్యమైన సరస్వతి నదీ తీరాన ఉండటాన్ని చెప్పినప్పుడు మనం ఆశ్చర్యపోతాం. వేదఋషుల వర్ణనలకు, ఆధునిక పరిశోధనలకు గల భేదాన్ని గుర్తించగలుగుతాం. సతీదేవి ధరించిన నదీ రూపం ‘వితస్త’. అదే ఇప్పటి ఝీలం నది.

ఈ అనువాదంలో ఉద్ధరణ ప్రాయాలైన (quotations) వాక్యాలెన్నో ఉన్నాయి. ఉదా “అహం ఎంతటి  పవిత్రడినయినా అపవిత్రం చేస్తుంది”, “భారతీయ ధర్మం ఆత్మ మారదు”.

‘రుద్ర’ పదం తరువాతి పౌరాణిక సాహిత్యంలో శివుడికి పర్యాయపదంగా మారింది కాని శ్వేతాశ్వతరోపనిషత్తులో అక్షరాల స్వంత అర్థంతోనే ఈ పద ప్రయోగం జరిగిందన్నారు. ‘రుద్ర’  పదానికి ధాత్వర్థం ‘భక్తుల పాపాలనూ, శోకాలనూ నాశనము చేసేవాడు. జ్ఞానము, ఆనందము అనుగ్రహించేవాడు’ అని అట… ‘తన శారీరక, నైతిక ఆధ్యాత్మిక నియమాలను ఉల్లంఘించేవారిని దండించేవాడు’ అని కూడా అర్థమట. నాటి ఉత్సవాలను గురించి వివరిస్తూ నాటి సమాజంలో ప్రజలు హెచ్చుతగ్గులు లేకుండా కలసి మెలసి జీవించిన విధానాన్ని, కశ్మీరు ఇస్లాంమయం కాకముందు వరకూ అక్కడ మహిళలకున్న గౌరవ స్థానాన్ని, ఆ ప్రాంతాన్ని పాలించిన రాణులను గురించి ఈ పుస్తకం ద్వారా తెలుసుకున్నప్పుడు కశ్మీరు గురించి కొంతయినా తెలుసుకున్నామన్న తృప్తి కలుగుతుంది. నాగులు, మానవులు, పిశాచాలు, గాంధారులు, జహుందరులు, అభిసారులు మొదలైన జాతులను గురించి ప్రాథమిక విషయాలూ తెలుస్తాయి. పురాణాల పట్ల మనకున్న అపోహలను తొలగిస్తూ “దేశాన్ని ఏకత్రితం చేయటంలో పురాణ సృజన ఒక అపూర్వమైన, అద్భుతమైన పద్ధతి” అని కస్తూరివారు తన రచన ద్వారా నిరూపించారు. కశ్మీరు భారతదేశంలో అంతర్భాగమని, అవిభాజ్యమైన అంగమనీ పదే పదే చెప్పారు. “నీలమత పురాణం కశ్మీరుకు భారతదేశంలోని ఇతర ప్రాంతాలతో ఉన్న సామాజిక, ధార్మిక, ఆధ్యాత్మిక అనుబంధాన్ని స్పష్టం చేస్తుంది” అంటూ అంతే స్పష్టమైన ఆలోచనా సరళితో, చక్కని శైలితో సాగిన వారి రచన బహుధా ప్రశంసనీయం.

***

నీలమత పురాణం
రచన: కస్తూరి మురళీకృష్ణ
పేజీలు: 224
వెల: ₹ 150/-
ప్రచురణ, ప్రతులకు:
సాహితి ప్రచురణలు, #33-22-2,
చంద్రం బిల్డింగ్స్, సి. ఆర్. రోడ్,
చుట్టుగుంట,
విజయవాడ – 520 004.
ఫోన్: 0866-2436643

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here