[box type=’note’ fontsize=’16’] ‘నా బాల్యం కతలు’ అంటూ తన చిన్ననాటి ముచ్చట్లను అందిస్తున్నారు జిల్లేళ్ళ బాలాజీ. [/box]
13. రెడ్డిగుంట సుట్టూ రవుండు
[dropcap]తి[/dropcap]ర్తనిలో మా తాతోళ్ల ఇంటికి ఎదురుగా బాబూవోళ్లు బాడిక్కుండేటోళ్లు. బాబూవోళ్ల అమ్మ మూడేండ్ల ముందర సచ్చిపోతే, వోళ్ల నాయిన ఇప్పుడుండే ఆమెను రొండో పెండ్లి జేసుకున్నాడంట. ఆమెకిప్పుడు ఒక మొగబిడ్డగూడా ఉండాడు.
ఆ పిలగాడికిప్పుడు రొండేండ్లు. ఆ పిలగాడికి పాపం రొండు కాళ్లూ సచ్చుబడిపోయి, సత్తవలేక ఏలాడుతున్నట్టుగా ఉంటాయి. దాంతో ఆ పిలగాడు లేసి నిలబడలేక సేతల్తోటే ముందుకు దోగాడతా ఉంటాడు! వోళ్లమ్మ కనిపిస్తే సాలు ఎత్తుకోమని ఒగటే ఏడుపెత్తుకుంటాడు. ఆమెకి పన్లుంటాయి కాబట్టి, వోణ్ణి బాబూను ఎత్తుకోమని జెప్పి ఊరంతా తిప్పమనేది. అందుకే, బాబూ ఎప్పుడూ వోణ్ణి ఎత్తుకోని తిరగతా, వోడితో ఆడుకుంటా కనిపిస్తాడు. బాబూకు వోడితోటే పెపంచం.
బాబూవోళ్ల నాయిన పంచాయితీ ఆపీసులో జీబు డయివరుగా పనిజేస్తా ఉండాడు.
బాబూవోళ్లు యాడికి పోవాలన్నా జీబులోనే పొయ్యేటోళ్లు. బాబూ వోళ్ల అమ్మ బజారుకు పోవాలన్నా, సినిమాకు పోవాలన్నా, కడాకు ఊరికి పోవాలన్నా (బస్టాండు దాకా) వోళ్లకు జీబు ఉండాల్సిందే.
బాబూవోళ్ల నాయిన మద్దేనం అన్నం తినేదానికి జీబులోనే ఇంటికొస్తాడు. జీబును బయిట నిలబెట్టి లోపలికి పోతాడు. బాబూవోళ్ల నాయిన అన్నం తినిందే ఆపాట్నే ఆఫీసుకు బయలుదేరడు. కొంచేపు నడుం వాల్చి, అలుపు తీర్చుకుని అనాక బయలుదేరతాడు. ఎట్టలేదన్నా వొక గంటైనా బాబూవోళ్ల నాయిన ఇంట్లో ఉంటాడు. ఆ గంట గడిసినాంక జీబును డైవ్ జేసుకుంటా ఆఫీసుకు ఎల్లిపోతాడు. ఆ గంటసేపు నాబోటి పిలకాయలకందరికీ ఆ జీబే వొక ఆడుకునే ఆటవస్తువు.
బాబూ, వోళ్ల తమ్ముడూ ముందుపక్కన డ్రైవర్ సీట్లో కూసునేటోళ్లు. వోళ్లు టీరింగ్ పట్టుకుని అట్టా ఇట్టా తిప్పతా, పాంపాం అని ఆరన్ శబ్దంజేస్తా… జీబు నడుపుతున్నట్టుగా ఆడుకుంటా ఉంటే, నాబోటి పిలకాయలంతా జీబుకాడ నిలబడుకోని వాళ్లుజేసే సేస్టల్ని ఇంతగా జూస్తా, నవ్వతా ఉండేటోళ్లం. అప్పుడు మేము జీబును సేత్తో తాకతా, దానికి ఆనుకోని నిలబడేటోళ్లం.
ఏంజేసినా మేము జీబు బయటే ఉండాల. జీబు ఎక్కటానికి మాకు అనుమతి లేదు. జీబుకు ఆ పక్కన కొందురు, ఈ పక్కన కొందురు, ఎనకపక్కన ఇంకొందురు నిలబడుకోని గెట్టిగెట్టిగా అరస్తా ఆడుకునేటోళ్లం. ఆ అరుపులకు అప్పుడప్పుడూ బాబూ వోళ్ల పిన్నమ్మ బయటికొచ్చి మమ్మల్ని జీబునుండి దూరంగా పొమ్మని కసురుకునేది. మేము దూరంగా పొయ్యి ఆమె అట్టా ఇంట్లోకి పోంగానే మళ్లా జీబుకాడికి నైసుగా వొచ్చేసేటోళ్లం.
మా పిలకాయల్లో తెలివైనోళ్లు కొందరుండారు. వోళ్లు బాబూతో మాటాడుతున్నట్టుగానో, వోడికి తమకాడుండే ఆటవస్తువును సూపిస్తున్నట్టుగానో, లేదా వోళ్ల తమ్ముడికి మిఠాయి తినిపిస్తున్నట్టుగానో… ఏదో ఒగసాకుతో నైసుగా జీబులోకెక్కి సీట్లో కూసునేటోళ్లు. మాబోటోళ్లు లోన ఏదో ఇంత జూస్తున్నట్టుగా జీబు పుట్‌బోడ్ మీదికెక్కి నిలబడి సూస్తా ఉండేటోళ్లం. బాబూవోళ్ల నాయిన ఆపీసుకు బయలుదేరేదానికి జీబు దెగ్గిరికి రాగానే మేమంతా దూరంగా పోయి నిలబడేటోళ్లం.
ఆయిన జీబులోకెక్కి కూసోని జీబును స్టాట్ జేసేటోడు. బాబూ, వోళ్ల తమ్ముడూ మాత్రం దర్జాగా జీబులోనే కూసోని ఉండేటోళ్లు. మేమంతా జీబుకు దూరంగా నిలబడి జీబునే కంటిమింద రెప్పెయ్యకుండా జూస్తా ఉండేటోళ్లం. .
ఆయిన జీబును ముందుకు పరిగెత్తించగానే, మేం ఓ అని అరస్తా దాని ఎనకనే కొంచిం దూరం పరుగెత్తేటోళ్లం. జీబు రెడ్డిగుంట సుట్టూ ఒగ రవుండు ఏసొచ్చి వాళ్లింటికాడ ఆగగానే… బాబూ, వోళ్ల తమ్ముణ్ణి ఎత్తుకోని కిందికి దిగేటోడు. ఇంతలో బాబూవోళ్ల పిన్నమ్మ బయటికొచ్చి బిడ్డను తన సేతల్లోకి తీసుకొనేది. అనాక ఆమె, బాబూవోళ్ల నాయిన సేతికి డబ్బిచ్చి, ఏదో మాట్లాడి, బిడ్డలనేత వాళ్ల నాయినకు టాటా సెప్పింజేది. ఆయినకూడా వోళ్లకు టాటా జెప్పి జీబును ఇస్పీడుగా ముందుకు పోనిచ్చేటోడు. జీబు ఎల్తున్నప్పుడు మేము పిలకాయలందరమూ కలిసి జీబులో ఉండే బాబూవోళ్ల నాయినకు టాటా సెప్పేటోళ్లం. ఆయిన మాకల్లా తిరిగి సూడకుండా జీబును తోలుకుంటా ఆఫీసుకు ఎల్లిపోయేటోడు.
ఇట్టా రోజూ జరగతా ఉండాది. మాకందరికీ కూడా జీబులో కూసోని ఒక్కసారైనా రెడ్డిగుంట సుట్టూ రవుండు తిరగాలని ఆశె.కానీ ఏ దినమూ ఆయిన మమ్మల్ని జీబులో కూసోబెట్టుకుని గుంటసుట్టూ తిప్పిందిలేదు.
ఒగరోజు… బాబూ సేతికి కొడుకును అప్పగించి, గంటలో తిరిగొచ్చేస్తానని పక్కీధిలో ఉండే బంధువులింటికి పొయ్యింది బాబూవోళ్ల పిన్నమ్మ. బాబూ, తమ్ముణ్ణి కూసోబెట్టుకొని వాళ్లింటి తిన్నెమింద ఆడిస్తా ఉంటే, మేమూ ఇంకొంతమంది పిలకాయిలం వోళ్ల తిన్నెమింద జేరి ఆడుకుంటా ఉండాము. ఇంతలో మా ఈధిలోకి కోతిని ఆడించేటోడు వొచ్చినాడు. దాన్ని జూసేటందుకు మేమంతా దాని కాడికి పరిగెత్తినాము. బాబూ వొళ్లింటికాడ్నే ఉండిపోయినాడు.
కోతిని ఆడించేటోడు నాలుగిండ్ల మద్దెన దానినేత రకరకాల సేష్టలు జేయిస్తా ఉండాడు. మేమంతా సప్పట్లు కొడతా, గెట్టిగా నవ్వతా గంతులేస్తా ఉండాము. పాపం బాబూకు పేనమంతా ఆ కోతిమిందే ఉండాది. వోడికీ మాతో కలుసుకు సూడాలని ఉంది! వోణ్ణి మా కాడికి రమ్మని పిలిసినాం. వోడు తిన్నెమింద తమ్ముణ్ణి పండుకోబెట్టి, వాడి నోటికి పాలబాటిల్‌ను అందించి మాకాడికి పరిగెత్తుకుంటా వొచ్చేసినాడు. కోతిజేసే సేష్టల్ని సూస్తా తమ్ముణ్ణి మరిసిపోయినాడు. ఈలోగా బాబూవోళ్ల తమ్ముడు, లేసి కూసోని దోగాడతా దోగాడతా తిన్నె కడా కొచ్చి, జారి… కాలవలో పడిపోయినాడు. మా పెద్దమ్మ సూసి గబగబా బిడ్డనెత్తి తిన్నెమింద కూసోబెట్టింది. కాలవ నీళ్లతో బిడ్డ సొక్కా అంతా తడిసిపాయె. ఒళ్లంతా గలీజు అయిపాయె. బిడ్డ ఓహో మని ఏడ్సేదానికి మళ్లినాడు.
ఇసయం తెలిసి బాబూ పరుగెత్తుకుంటా తమ్ముడికాడికి పొయ్యినాడు. మా పెద్దమ్మ పసిబిడ్డ సొక్కాను తీసి పక్కన ఏసేసి, పొయ్యిమింద ఇంత ఉడుకునీళ్లు బెట్టి పిలగాడికి నీళ్లుబోసి ఏరే సొక్కాయుంటే ఏసి, ఏడుపును ఆపించింది.
ఈ ఇసయం బాబూవోళ్ల పిన్నమ్మకు ఎట్ట తెలిసిందో ఏమో, ఉరుకులు పరుగులమింద ఇంటికాడికొచ్చింది. రావాటం రావాటం బాబూనుండి బిడ్డను లాక్కోని గుండెకు అదుముకోని ఒళ్లంతా పట్టిపట్టి జూసింది.
బాబూమింద కోపం పెరిగిపోయి, కండ్లెర్ర జేసి, కట్టె తీసుకొని బాబూను సితక బాదేసింది. వాడూ కుయ్యో మొర్రో అని అరస్తా ఉన్నా ఇనిపించుకోలేదు.
ఆమె కొట్టే దెబ్బలకు వోడు తట్టుకోలేక ‘నీ సేత సిక్కి బతికేదానికన్నా, ఏ బాయిలోనన్నా దూకి సావటం మేలని’ సెప్పి ఇంట్లో నుండి ఎక్కడికో ఎల్లిపోయినాడు. “సస్తే సావురా, పీడా వదిలిపోతుంది.” అని వోళ్ల పిన్నమ్మ వోణ్ణి పట్టించుకోలేదు.
వోడట్టా ఏడస్తా పోతా ఉంటే, ఏంజేసుకుంటాడో ఏమోనని వోడి ఎనకనే నేనూ, ఇంకొంతమంది పిలకాయలం పోతిమి. వోడు ఊరి బయటున్న ఆర్ముగసామి గుడికాడున్న ఒగ సింత సెట్టుకింద కూసోని ఏడ్సుకుంటా ఉండె. మేమంతా వాడి సుట్టూ సేరి వోణ్ణి ఓదార్సినాము. ఏడవబాకని వోడి కన్నీళ్లు తుడిసి మాకాడుండే బిస్కత్తులు, మిఠాయిలు ఇచ్చినాము.
మద్దేనానికి… బాబూవోళ్ల నాయిన మమ్మల్ని ఎతుక్కుంటా గుడికాడికొచ్చినాడు. సేతిలో కట్టి బట్టుకోని వొస్తున్న ఆయిన్ను సూడగానే బాబూ వొణకతా లేసి పారిపోయేటందుకు సిద్ధపడినాడు. “రేయ్ మర్యేదగా ఆగు, నీ ఎనక నన్ను పరుగెత్తించి నాకింకా కోపం తెప్పించమాకు. ఆడే నిలబడు, నిన్నేమీ జెయ్యను!” అని మాకల్లా నాలుగడుగులు ఏసినాడు.
మేము పిలకాయిలందరం ఆయిన కాళ్లకు అడ్డంపడి, కాళ్లను గెట్టిగా పట్టుకోని, “అన్నా, బాబూను కొట్టొదన్నా, వోణ్ణి ఏమీ సెయ్యొద్దన్నా…” అని ఏడస్తా ఏడుకున్నాం. బాబూ సేతులమిందా, కాళ్లమిందా తేలిన వాతల్ని సూసి ఆయిన సేతిలోని కట్టి కిందికి జారిపోయింది. ఆయిన కొడుకు పరిస్థితికి సలించిపోయి తన రొండు జేతుల్నీ ముందుకు జాపి… “బాబూ, ఇట్టా రారా! నువ్వు సస్తానని బెదిరించి ఈడికొచ్చినావని మీ పిన్ని సెప్పితే, నిన్ను నాలుగు దంచి తీసకపోవాలన్న కోపంతోటే వొచ్చినాను రా. కానీ, నీ ఒంటిమీదుండే దెబ్బలకు తోడు, నేనూ ఇంకా కొట్టి నిన్ను సంపుకోలేను రా!” అనగానే బాబూ పరుగెత్తుకుంటా పొయ్యి వోళ్లనాయిన సేతల్లో వాలిపోయినాడు. ఆయిన బాబూను గుండెలకు అదుముకోని ఈపుమింద ప్రేమగా నిమరతా ఉండిపోయినాడు. కొంచేపయినాంక ఆయిన, బాబూ సెయ్యి బట్టుకుని నడిపించకుండా ఇంటికి తీసకపోయినాడు. మేమందరం వోళ్ల ఎనకనే పోతిమి. అనాక మా మా ఇండ్లకు ఎల్లిపోతిమి.
ఆ దినమంతా బాబూ ఇంటి బయటికి రానేలేదు. వోడు కనిపించకపోయేకొందికి మేమంతా బాగా దిగులు పడిపోతిమి.
మర్నాడు- బాబూ, వోళ్ల తమ్ముణ్ణి ఎత్తుకోని మా కాడికొచ్చినాడు. మేమంతా కలిసి సంతోసంగా, ఆయిగా ఆడుకున్నాం.
మద్దేనం బాబూవోళ్ల నాయిన అన్నానికి ఇంటికొచ్చినాడు. బాబూ, వోళ్ల తమ్ముడితో కలిసి జీబులోకెక్కి ఆడుకో సాగినాడు. మేమంతా జీబు దగ్గరికిపోయి దాన్ని ఆనుకుని నిలబడినాము. వోళ్ల ఆటని ఏడుక జూస్తా ఉండిపోయినాము.
గంటసేపయినాంక బాబూవోళ్ల నాయిన డూటీకి ఎలబారినాడు. డైవింగు సీట్లో కూసోని జీబు స్టాట్ జేసినాడు. మేమంతా దూరం జరిగి నిలబడినాం. జీబు ఎలబారింది. బాబూకూ, వోళ్ల తమ్ముడికీ మేము నవ్వతా టాటా జెప్పినాం.
జీబు కొంచిం దూరం పొయ్యి సడన్ బ్రేకుతో నిల్సిపోయింది. మేమంతా ఆచ్చెర్యంగా జీబుకల్లా జూస్తా నిలబడినాం. బాబూవోళ్ల నాయిన తల బైటికి పెట్టి మాకల్లా జూస్తా సేత్తో మమ్మల్ని దెగ్గిరికి రమ్మని సైగజేసినాడు. మేము పరుగెత్తుకుంటా జీబు దెగ్గిరికి పోగానే, మమ్మల్నంతా జీబులోకి ఎక్కమన్నాడు. మేము ఉసారుగా జీబెనకన ఒకరినొకరు తోసుకుంటా జీబు ఎక్కతాంటే, “మెల్లిగా… మెల్లిగా…” అని జెప్పి అందరూ ఎక్కి కూసున్నాంక జీబును ముందుకు ఉరికించినాడు. జీబును ఎక్కినామన్న ఆనందంలో అందరమూ సంతోసంగా సప్పట్టు కొట్టినాము. జీబు రెడ్డిగుంట సుట్టూ ఒక రవుండు ఏసకొచ్చి బాబూవోళ్ల ఇంటి ముందర ఆగింది. మేమంతా కిందికి దిగినాంక జీబు మళ్లా బయలుదేరుతుంటే, బాబూవోళ్ల నాయినకు మేమంతా కలిసి టాటా జెప్పినాం. తొలిసారిగా… ఆయినా మాకు టాటా జెప్పినాడు.
ఆ దినం నిండి, రోజూ మేము జీబులో కూసోని రెడ్డిగుంట సుట్టూ రవుండ్లు ఏస్తా ఉండాం.
(మళ్ళీ కలుద్దాం)