[dropcap]‘చే[/dropcap]తులెత్తి మొక్కుతా చేయి చేయి కలపకు రా…
కాళ్ళు కూడా మొక్కుతా కాలు బయటపెట్టకురా…’
అంటూ డి.జే. బాక్సులో నుండి పెద్ద సౌండుతో వినిపిస్తూ జనాల మధ్య నుండీ వెళుతోంది వేన్. ఆ జంక్షన్‌లో రోడ్లన్నీ చాలా బిజీగా వున్నాయి. కరోనా పాట ఒకపక్క అసంకల్పితంగా వింటూనే ఎవరి పనుల్లో వారు వున్నారు. పలకరింపులూ, ధీమా కబుర్లూ, బాతాఖానీలూ అస్సలు లేవు. కాయగూరలూ, పళ్ళ దుఖాణాలూ తగినంత దూర దూరంగా వున్నాయి. ఒక పక్కగా పళ్ళ బళ్ళు కూడా వున్నాయి. అన్నిటి మధ్యా సామాజిక దూరం పాటించేటట్టు పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రజలకు కరోనాపై అవగాహనా కల్పించడానికీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసే ఫ్లెక్సీలు ఎదురుగా దర్సనమిస్తున్నాయి. లాక్‌డౌన్ సడలించిన ఆరు నుండీ పది గంటల మధ్య సమయం అది. బజారు పనులు చక చకా చక్కబెట్టుకొని ఇంటికి వెళ్లిపోవాలనే తొందరలో వున్నారు. వర్షం పడే ముందు చీమలు ఆహార పదార్ధాలను వాటి పుట్టల్లోకి తొందరగా తీసుకువెళ్ళే దృశ్యాన్ని జ్ఞప్తికి తెస్తున్నారు.
కృష్ణారావు కూడా అలాంటి తొందర్లోనే వున్నాడు. రెండురకాల కాయగూరలు కొనుక్కొని ఇంటిదారి పట్టాడు. నడుస్తున్నాడే గానీ, అతని ఆలోచనలన్నీ రోజులు గడవడం మీదే వున్నాయి. కొత్తగా పెళ్ళయి ఇంటికి వచ్చిన తన చెల్లీ, బావగారి గురించే ఆలోచిస్తున్నాడు. వాళ్లోచ్చి ఇరవై రోజులు పైనే కావస్తోంది. లాక్‌డౌన్ ముందే వచ్చారు. రెండు మూడు రోజులు వుండివెళ్ళిపోదామని వస్తే, ఆకస్మితంగా లాక్‌డౌన్ ప్రకటించడంతో వుండి పోవాల్సివచ్చింది. ఇప్పటికే అప్పులు చేసాడు. మళ్ళీ ఎవరినైనా అడుగుదామంటే, అందరిదీ అదే పరిస్థితి. అసలు అడగడానికే నోరురావడం లేదు. రోజులు గడవడం కష్టంగా వుంది. మొదట్లో నాలుగైదు రోజులు ఇంటింటికీ వచ్చి బియ్యం, కాయగూరలూ ఇచ్చారు గానీ, ఇప్పుడదీ లేదు. నోరు విడిచి “మీరు వెళ్ళిపొండి” అని చెప్పలేకపోతున్నాడు. ఆలోచనల్లో ఉండగానే ఇల్లు వచ్చింది. దూరం నుండే చూసినట్లుంది భార్య రామలక్ష్మి దగ్గరకు వచ్చి కాస్త నెమ్మది స్వరంతో…
“మీ చెల్లీ, బావ సంగతి ఏమిటి?ఎన్నాళ్ళిలా?ఈ రోజైనా మీరు చెబుతారా?నన్ను చెప్పమంటారా?” అంది చేతిలోని కాయగూరల సంచి అందుకుంటూ.
“తొందరపడకు. వెళ్ళడానికి అవకాశం లేకే కదా! లేకపోతే… వెళ్లిపోరా?” అన్నాడు అంతే నెమ్మదిగా. ఇంట్లోకి వెళ్లి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తుండగానే… లోపలి నుండి వచ్చి ఎదురుగా కూర్చున్నాడు బావ రవీంద్ర.
“ఉదయం ఆరునుండీ పది గంటల లోపు పోలీసు గస్తీ లేని ఏరియాల్లో ఆటోలు తిరుగుతున్నాయట. ఈ రోజుకి ఎలాగూ అవ్వదు. రేపు పొద్దున్నే బయలుదేరుతాం” అన్నాడు.
“అదేమిటీ? తీరా బయలుదేరి వెళ్ళిన తరువాత ఇబ్బంది పడాలి. మధ్యలో ఆపితే, తరువాత అనవసరంగా క్వారంటైన్లూ అవీనీ”
“పరవాలేదులెండి. ఏదో చెప్పుకోవచ్చు. అక్కడ వుంటే కనీసం పది వరకైనా పని చేసుకోవచ్చు. ఇక్కడ అలా కూర్చోవడం అంటే, మహా ఇబ్బందిగా వుంది” అంతలో ఇద్దరికీ టీలు తెచ్చిఇచ్చింది రామలక్ష్మి. “చెల్లీ బావగారు వెళ్లిపోతామని అంటున్నారు” అన్నాడు భార్యని ఉద్దేశించి. ఆమె ఏమీ అనలేదు. వదిన ఆంతర్యం ఇది వరకే గ్ర్రహించింది సురేఖ. అంతేకాదు గత కొద్ది రోజులుగా అన్నయ్యా, వదినా పడుతున్నఆర్థిక ఇబ్బందిని గమనించక పోలేదు చెల్లెలు సురేఖ. మామూలుగా రావడం వలన తెచ్చిన కొద్దిపాటి డబ్బులు ఇంట్లోకే ఖర్చుపెట్టారు. పోనీ ఖర్చుపెడదామన్నా లేవు. దాదాపు ఇరవై రోజులు కావస్తోంది.
మరుసటి రోజు వేకువ జామునే బయలుదేరుదామనే అనుకున్నారు సురేఖా, రవీంద్రలు. కానీ, మరీ తెల్లవారుజామునైతే ఆటోలు దొరకవని ఏడు గంటలప్పుడు బయలుదేరారు. “ప్రయాణం ఎంతో సేపు పట్టదు. ఇంటికి వెళ్లి టిఫిన్ చేస్తాం” అని అనడంతో రామలక్ష్మి ఇద్దరికీ టీలు ఇచ్చింది. తాగిన తరువాత వెళ్లి వస్తాం అని బయలు దేరారు. అది చిన్న పల్లెటూరు. ఊరు దాటి రావడానికి ఎంతోసేపు పట్టలేదు. బయట ఎక్కడ మనిషి జాడలేదు. ఊరవతల రెండు ఆటోలు వున్నాయిగానీ కనీసం మరొక్క మనిషి ఉంటేనే గానీ, ఆటో తియ్యనన్నాడు. నిజానికి ఆటోలో ముగ్గురు వెళ్ళకూడదు ఈ రోజుల్లో. కానీ, వాడికి కిట్టదు. ఆ సంగతి వాడు అనలేదు గానీ, అతను చెప్పకనే చెబుతున్న అర్థం అదే. ముందే చెప్పాడు “వూరు లోపలకు వెళ్ళడం కుదరదు. బయటే దింపేస్తాను” అని. తప్పలేదు. ఈ పరిస్థితిలో మరో దారిలేదు. అప్పటికే ఎనిమిది దాటింది. అంతలో మరో ఆడమనిషి రావడంతో ఆటో కదిలింది. రవీంద్ర చేతిరుమాలు మాస్క్ లాగా తగిలించుకున్నాడు. సురేఖ చీరకొంగు నోరుకి అడ్డంగా పెట్టుకుంది. కుదుపులతో ఆటో వెళుతోంది. ఎక్కడా పిట్ట మనిషి కనిపించడం లేదు. పౌరుషానికి పోయి తప్పు నిర్ణయం తీసుకున్నామేమోననిపించింది. దూరంగా ఇద్దరు పోలీసుల్ని చూసి ఆటో లూప్ లైను వైపుకి తిప్పాడు డ్రైవర్. మట్టిరోడ్డు మరీ సన్నగా వుంది. సరిగ్గా అటో అంత వెడల్పే వుంది. పక్కనున్న చెట్ల కొమ్మలు రోడ్డు మీదకు వచ్చి, ఆటోను రాస్తున్నాయి. మరికొంచెం దూరం రాగానే తారురోడ్డు మీదకు వచ్చారు. కాస్త వెళ్ళిన తరువాత అటో ఆపి “కొంచెం దూరం నడచివెళ్తే, మీకు ‘రామ తీర్థాలు జంక్షన్’ వస్తుంది. అక్కడ నుండి మీరు విజయనగరం వెళ్ళొచ్చు” అని సమాధానం కోసం ఎదురు చూడకుండా ఆటో వెనక్కి తిప్పీ డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు. మాతో పాటు ఎక్కిన ఆడమనిషి మాత్రం ఆటోలోనే వుంది. సురేఖ బేగు భుజానికి తగిలించుకుంది. ఇద్దరూ నడవడం మొదలెట్టారు. మే నెల కావడం వలన అప్పటినే ఎండ చిర్రుమంటోంది. కొద్ది దూరం అన్నాడు గానీ దూరమే. ఒళ్ళంతా చెమట. బట్టలు చిత్తడి..చిత్తడి అయిపోయాయి. దాహం వేస్తోంది ఇద్దరికీ. ఆకలి కూడా. మరీ ఇంత సమయం పడుతుందని అనుకోలేదు. ఒక చెట్టు నీడలో కాసేపు నిలబడ్డారు. పక్కనే తాటిగెలలు కుప్పగా పడి ఉన్నాయి. రైతు తాటి ముంజెలు వలుస్తున్నాడు. కొత్తగా పెళ్లయిందేమో భార్య దగ్గర జేబులోనుండీ డబ్బులు తీసి ఖర్చుపెట్టడం సరదా పెళ్ళికొడుకులకి. “తాటి ముంజెలు తింటావా?” అడిగాడు రవీంద్ర. భుజాన వున్న బేగు కిందకు దించి, కాస్త సిగ్గు వలకబోస్తూ.. “మరి మీరో” అంది. “ఇద్దరమునూ”. కరోనా లాక్‌డౌన్‌తో దేశాలన్నీ అతలాకుతలం అవుతుంటే, ఆ సమయంలో అవేవీ గుర్తుకు రాలేదు ఎందుకంటే, కొత్తగా పెళ్ళయిన మోజులో వున్నారు. “డజను యెంత?”
“బాబూ! ఎండనపడి ఒత్తున్నారు. ముందు తినండి. తరువాత తోసింది ఇవ్వండి. ఇవి కరోనా కరువు రోజులు. ఎప్పుడో కరోనా అయిన తరువాత దింపుదామంటే చెట్లు మీదే ముదిరిపోయి, తినడానికి పనికి రావు. అందుకే దించేస్తున్నాను. ‘సచ్చినోడి పెల్లికి వచ్చిందే కట్నం’ అని అయినన్ని అవుతాయి. మిగిలినవి పంచేస్తాను” అని అంటూ కాయల దిప్పలను కత్తితో నరికి వరసగా పెడుతున్నాడు. ఇద్దరూ చెరొక ఆరు ముంజెలూ తిన్నారు. దాహం తీరి. చల్లదనానికి కాసేపు సేదతీరారు. బేగు పట్టుకొని మళ్ళీ బయలుదేరారు. కాస్త నడిచాక రామతీర్థాలు జంక్షన్ వచ్చింది. అక్కడపోలీసులు కాపలా కాస్తున్నారు. అంతలో ఇద్దరు కుర్రవాళ్ళు టూ వీలర్ మీద వెళుతుంటే, పోలీసులు అడ్డగించారు.
“ఒరేయ్! బండాపు. ఎక్కడికి వెళుతున్నారు?ఆధార్ కార్డులు ఉన్నాయా?” వెంటనే జేబులోనుండి తీసి చూపించి, ఎక్కడకి వెళుతున్నారో చెప్పారు.
“ఇక్కడికిక్కడికే బండి మీద ఇద్దరెందుకురా? ‘సామాజిక దూరం పాటించండిరా’ అని టి.వి.ల్లోనూ, పేపర్లలోనూ నెత్తీ, నోరుకొట్టుకొని చెబుతున్నా వినరేమిట్రా.”
“ఎందుకురా అనవసరంగా మీరు సచ్చి, అందర్నీ చంపుతారు. మేం రోజూ రాత్రుళ్ళూ, పగళ్ళూ ఇక్కడ డ్యూటీలు దేనికి చేస్తున్నాం. నువ్వెళ్ళు. ఆడు నడిచి వస్తాడు. ఇంకోసారి డబుల్స్ కనపడ్డారో కేసు రాసేస్తాను జాగ్రత్త” అని గట్టిగ కేకలేశాడు.ఇదంతా దూరంనుండే చూసిన సురేఖా, రవీంద్రలు వెనుతిరిగి వచ్చిన త్రోవవైపే నడవడం మొదలుపెట్టారు. మళ్ళీ తాటిముంజెలు రైతు దగ్గరకు వచ్చి, “విజయనగరం వెళ్ళడానికి వేరే త్రోవ వుందా?” అని అడిగారు.
“ఉందండి. ఇలా బ్రిడ్జి కింద నుండి ఎల్తే, పూడమ్మగుడి వస్తాది. ఆ గుడి పక్కనుండి ఎల్తే ఇజినగరం రోడ్డొస్తాది.” ఆ రైతు చెప్పినట్టే వెళ్లారు. కాసేపటికే రోడ్డు మీదకు వచ్చారు.ఇంతలో వెనకవైపునుండి ఒక జీపు వచ్చి వీళ్ళ పక్కగా ఆగింది. ఇద్దరూ ఒక్కసారి గతుక్కుమన్నారు. ఒకవ్యక్తి దిగి రెండు ఆహర పొట్లాలూ, మంచినీళ్ళ పాకెట్లూ ఇస్తుండగా మరో వ్యక్తి సెల్‌లో నుండి ఫోటో తీసాడు. మరో మాట లేకుండా జీపు వెళ్ళిపోయింది. ఏదో స్వచ్ఛంద సంస్థలాగా వుంది. అప్పటికే పదకొండు దాటింది. తాటిముంజెలు తప్ప కడుపులో ఏమీలేదేమో, చెట్టుపక్కనే కూర్చొని భోజనం చేసేశారు. ఆ పూడమ్మ తల్లే భోజనం పంపించింది అనుకున్నారు. కాసేపటి తర్వాత మళ్ళీ నడక మొదలెట్టారు. ఆ నడకలో ఎన్నో విషయాలు మాట్లాడుకున్నారు. ఒకర్నిఒకరు అర్థం చేసుకోవడానికి సుదీర్ఘ నడక ఒక సాధనం అని అర్ధమైంది.
చివరకు ఎలాగైతేనేం అనేక ప్రయాసలు పడి వాళ్ళుండే ఇంటికి చేరుకున్నారు. వీధిలో వాళ్ళకళ్ళలో యేవో బెదురు చూపులూ, ప్రాణభయం కనిపిస్తున్నాయి. ఇంటి దగ్గరకు వచ్చాడో, లేడో దూరంనుండే చూసిన రవీంద్ర అన్నయ్య కేకలుమొదలెట్టాడు. “నువ్వెందుకు ఇక్కడకు తగలబడ్డావురా! పెద్ద పెద్ద వాళ్ళే కాళ్ళకు సంకెళ్ళేసుకొని ఇంట్లో కూర్చుంటే… ఇక్కడ ఏం వుద్ధరిద్దామని వచ్చేశావు?”
“ఇదేదో తగ్గిన తర్వాత రాలేకపోయరా?ఇక్కడ చిన్నపిల్లలతో వున్నాం. మీరిద్దరూలోనికి రావద్దు. అలా వెళ్లి పెరట్లో దొడ్డి గుమ్మం దగ్గర కూర్చోండి.” వదిన మాటలు గట్టిగానే వున్నాయి. లైటు స్థంభంమీద కరెంటు షాక్కొట్టిన కాకికోసం మిగతాకాకులు గుంపులు గుంపులుగా అరచినట్లు వీధిలో అందరూ వాళ్ళ వాళ్ళ ఇళ్ళలో నుండి బయటకు వచ్చి చూస్తున్నారు. ఇంతా కష్టపడి ఎనిమిది మైళ్ళు నడచి వస్తే, ఇక్కడ కొత్త సమస్య ఎదురైందని, విస్తుపోయి… తలోమాటా అంటుంటే, సమాధానం చెప్పలేక, చెప్పే శక్తి లేక తీర్పుకోసం ఎదురు చూసే నేరస్తుల్లా, పెరటి గుమ్మం దగ్గరే కూర్చుండిపోయారు.
ఎవరో ఫోన్ చేస్తే వాలంటీర్ వచ్చి, వీళ్ళిద్దరి వివరాలూ రాసుకొని, జిల్లా కరోనా ఆసుపత్రికి ఫోన్ చేసింది. అక్కడ నుండి నర్సు వచ్చి, బ్లడ్ సాంపిల్స్ తీసుకొని, హోం క్వారంటైన్‌లో ఉండమని, తగిన జాగ్రత్తలు తీసుకోమని చెప్పి వెళ్ళిపోయింది. రవీంద్ర అన్నయ్యా, వదినలకు ఇష్టం లేకపోయినా లోపలకు పిలవక తప్పలేదు. మరుసటి రోజు డాక్టర్ గారి దగ్గరనుండి ఫోన్ వచ్చింది. వాళ్ళిద్దరికీ ‘నెగిటివ్’ వచ్చిందని అయినా ఇరవైఎనిమిది రోజులు సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉంచమని, వాళ్ళిద్దరిపై ఎటువంటి వివక్షా చూపించకుండా, సహకరించమని చెప్పారు. వాళ్ళ అకౌంట్లో గవర్నమెంట్ రెండు వేల రూపాయలు వేస్తారని చెప్పారు. ఆ మాట విన్న తర్వాత కొంచెం స్థిమిత పడ్డారు. ఈ వ్యవహారం కాస్త సద్దుమణిగాక ఇద్దరూ వేరే ఇల్లు తీసుకొని వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు. ఇరవై ఎనిమిది రోజుల తర్వాత ఇద్దరినీ ఆసుపత్రికి రమ్మనమని ఫోన్ వచ్చింది. ఇద్దరినీ మళ్ళీ చెక్ చేశారు. ఆరోజంతా ఆసుపత్రిలోనే వున్నారు. సాయంత్రం ‘నెగిటివ్’ వచ్చిందని చెప్పారు. అదే రోజు ఆసుపత్రి ఆవరణలో డాక్టర్లూ, నర్సులూ, పారామెడికల్ సిబ్బందీ, పరిశుద్ద పని వాళ్ళూ, పోలీసు అధికార్లూ, పోలీసులూ అందరూ దూర దూరంగా నిలబడ్డారు. వీరంతా ప్రాణాలకు తెగించి, సమాజంలో అందరి కోసం రాత్రింబవళ్ళూ ఎన్నో కష్టనష్టాలకోర్చి సేవచేసినందుకు భారత వైమానిక దళం వారు దేశ ప్రధానమంత్రి ఆదేశానుసారం పూల వర్షం కురిపించారు. ఆ సందర్భంగా టి.వి. చానళ్ళు ఒక్కొక్క విభాగం నుండి వారి వారి అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. మొదటగా ఆసుపత్రి సూపరెండెంట్‌ని అడిగారు.“హాస్పిటల్ సూపరెండెంట్‌గా ఈ కార్యాక్రమాన్ని ఎలా భావిస్తున్నారు?”
“పైన హెలికాఫ్టర్ నుండి మా అందరిపై పూలు వేయడం మాకు ఒక అరుదైన గౌరవంగా భావిస్తున్నాము. ఇది మాకు ఎంతో స్పూర్తిని ఇవ్వడమే కాకుండా మా భాద్యతను మరింత పెంచింది.” తరువాత సూపరెండెంట్ ఆఫ్ పోలీస్‌ని అడిగారు.
“సమాజంలో శాంతి భద్రతలే కాకుండా, సమాజ శ్రేయస్సు కూడా మా భాద్యతగా మేము భావిస్తున్నాం. అందులో మేం తు.చా. తప్పకుండా పాటించామనే అనుకుంటున్నాం. మేము యెంత చేసినా, ప్రజల్లో కూడా అవగాహన వుండాలి.”
“కరోనా నివారణకు మీరు ఎలా పనిచేసారు?” నర్సుని అడిగారు. “కరోనా వ్యాధి వున్న వాళ్లకి మేం సేవ చేస్తున్నప్పుడు మాకు కూడా వస్తుందేమోననే భయం లేకుండా భద్రతా దుస్తులతో ధ్యైర్యంగా పని చేస్తున్నాము. కొందరు పేషంట్లు కోలుకొని డిశ్చార్జి అవుతుంటే మేమూ, మా డాక్టర్లూ మానసికంగా ఎంతో ఆనందపడుతుంటాము. అదిగో ఆ నలుగురూ డిశ్చార్జి అయ్యారు.” అంటూ ఎంతో ఆనందంగా నవ్వుతూ వాళ్ళవైపు చూపించింది. ఆ నలుగురి పెద్దవయసు వున్న అతని దగ్గరకు వెళ్ళాడు విలేఖరి.
“ఈ కరోనా మహమ్మారిని జయించిన వారిగా మీరు ఏం చెప్పదలచుకొన్నారు? ”
“నా పేరు ప్రకాష్. నేను బయో కెమిస్ట్రి లెక్చరర్‌గా చేసి రిటైరయ్యాను. నా వయసు ఇప్పుడు అరవై అయిదు సంవత్సరాలు. మీ ద్వారా అందరికి చెప్పేదేమంటే, ఈ వ్యాధి రాకుండా మనం జాగ్రత్తలు పడాలి తప్పా, వచ్చిన తరువాత దాని నుండి తప్పించుకోవడం పిల్లలకు, పెద్ద వయస్సు వారికి చాలా కష్టం. అసలు ఈ కరోనా వైరస్ ప్రకృతి లోని వాతావరణంలో మార్పుల వలనా, ప్రజల జీవన శైలిలో మార్పుల వలనా ఏర్పడితే, మళ్ళీ ఆ ప్రకృతే దానిని సరిచేస్తుంది. అందులో ఎటువంటి అనుమానమూ లేదు. గతంలో ప్లేగూ వ్యాధి కూడా అలాగే పోయింది. ఒక వేళ ఈ కరోనా వైరస్‌ని ఎవరైనా ఉద్దేశ్యపూర్వకంగా ప్రకృతి లోనికి జోప్పిస్తే అంత నీచమైన, హేయమైన పని మరొకటి వుండదు. జంతువు విసర్జించిన మలంలో పుట్టిన పేడ పురుగుతో కూడా అలాంటి వాళ్ళను పోల్చకూడదు. ప్రకృతిలో దాని మానాన అది జీవిస్తోంది. ఏ జీవికీ హాని చెయ్యదు. అలాంటి పేడ పురుగుతో పోల్చితే, అది పేడ పురుగుకే అవమానం. కానీ, వీళ్ళు అంత కంటే మరింత హీనం. కాబట్టి, ప్రపంచ శాస్త్రవేత్తలారా! అలాంటి నీచమైన ఆలోచన చెయ్యకండి. రాజ్యకాంక్ష, చిన్న దేశాలమీద పెత్తనం కోసం, ప్రపంచ వ్యాపారంపై ఆధిపత్యం కోసం ఏ దేశ పెద్దలైన కోటానుకోట్ల డబ్బుతో, లేక పెద్ద పెద్ద ఉద్యోగ, పదవులతో మిమ్మల్ని ప్రలోభపెట్టితే లోబడి ఏ శాస్త్రవేత్త కూడా ఇలాంటి మారణహోమం తలపెట్టకూడదు. మానవాళితో సహా సమస్త జీవరాశి పది కాలాలు సుభిక్షంగా వుండే ప్రయోగాలు చెయ్యండి. మీ పేరు తరతరాలు చెప్పుకుంటారు. అలాంటి రోజు మనందరి మీద నిజంగా పూల వర్షం కురుస్తుంది. ప్రపంచ శాస్త్రవేత్తలారా! మీకు శత సహస్ర వందనాలు. ఈ భూగోళం మీ చేతుల్లో వుంది. మీ ఇష్టం.” అంటూ అతను ఉద్వేగంగా మాట్లాడుతూ వుంటే అందరూ ఆశ్చర్యంగా చూస్తూ వుండిపోయారు.