మా బాల కథలు-2

0
4

[dropcap]బా[/dropcap]ల అందమైన ఏడేళ్ళ పాప. అందమైనదే కాదు, తెలివైనది కూడా. వయస్సు రీత్యా కొంత అమాయకత్వమూ ఉంది. అన్నీ తనకు తెలుసుననుకుంటుంది. అంతే కాదు, అన్నిటి లోనూ తల దూర్చి అందరికీ సలహాలు కూడా ఇస్తుంది. ఆ బాల చేసిన పనుల్లో కొన్ని కథల్లాగా చెప్పచ్చు. అందులో ఇది ఒకటి.

మురికే… మురికే…:

వేసవి శలవులు ఇచ్చారు. బాల ఆనందం చెప్పనలవి కాదు. ఒక పక్క శలవలు. మరో పక్క శలవలకి అమ్మమ్మ గారి ఊరు వెళ్తూండటం. అదీ రైల్లో.

ఉమ్మడి కుటుంబం కావటం వలన, పెద్దవాళ్ళు ఉండటం వలన సాధారణముగా అందరూ తమ ఇంటికే రావటం అలవాటు. ఎప్పుడూ ఎవరో ఒకరు బంధువులు ఉంటూనే ఉంటారు. అందువల్ల పెద్ద కోడలుగా బాల తల్లికి అసలు ఇల్లు కదలటానికి కుదరదు. కానీ ప్రతి వేసవిలో మాత్రం ఒక పది రోజులు అమ్మమ్మ గారి ఊరు, అమ్మమ్మ కోరికపై పంపుతారు.

అందుకోసం బాల తల్లి శాంతే కాక బాల కూడా ఎదురు చూస్తుంది. ఎందుకంటే అమ్మమ్మ బాలని ఎంతో గారం చేస్తుంది. ప్రేమగా చూస్తుంది. అడిగినవన్నీ కొనిస్తుంది.

కొంచెం కూడా కసురుకోదు. కోప్పడదు. ఎంత అల్లరి చేసినా నాన్నమ్మలా (అది బాల ఉద్దేశం. కానీ ఎప్పుడో గానీ వెళ్ళదు కదా. అందుకే అని దానికి తెలియదు).

శలవులు రాగానే, ముఖ్యముగా రైలు ఎక్కినప్పటినుంచి బాలా సంతోషం మొదలయ్యింది. అందరు చిన్న పిల్లల లాగానే చిరుతిళ్లు అంటే బాలకి చాల ఇష్టం.

దానికి తోడు రైలులో కేటరింగ్ కూడా ఉంది. అడపా తడపా ఏదో ఒకటి రాసాగాయి.

బాల ఒక్కటీ పోనివ్వకుండా మారాం చేసి, ఏడిచి అన్నీ కొనిపించుకు తినసాగింది. ఎందుకంటే ఇంట్లో నాన్నమ్మ, తండ్రిల కట్టుబాటు, భయం, తల్లి దగ్గరే దాని ఆటలు. ఇంట్లో అయితే తల్లి మాట చెల్లదు కూడా. అందుకే గారం చేసి, గోల చేసి, ఏడిచి కొనిపించుకు తినసాగింది.

రాను రాను శాంతకి కూడా విసుగు వచ్చింది. ముఖ్యముగా బయటవి తింటే అనారోగ్యం అని భయం..

అందుకే తన దగ్గర డబ్బులు అయిపోయాయని, ఇంక కొనలేనని, ఎవరైనా ఊరికే ఇస్తే తీసుకుందామని అంది. అమ్మేవాళ్ళు ఎవరూ ఊరికే ఇవ్వరుగా. చిన్నపిల్లని ఒకవేళ ఇచ్చినా చాలా ఇవ్వరు, అందరూ ఇవ్వరు. ఖాళీ పర్సు కూడా చూపించి౦ది శాంత.

బాల చాలా సేపు నిశ్శబ్దముగా కూర్చుంది. ఫలహారాలు, పానీయాల వాళ్ళు తిరుగుతున్నా ఏమీ అడగలేదు. అమ్మ దగ్గర ఎక్కువ డబ్బులుండవని బాలకి తెలుసు. ఏది కావాలన్నా నాన్నో, నాన్నమ్మో తెప్పిస్తారు అన్నీ ఇంటికే.

బాల తల్లి ‘అమ్మయ్య’ అనుకుంది.

బాల సంగతి తెలిసిన బాల తల్లి ఎప్పుడూ ఒక ఖాళీ పర్స్ బాలకి చూపటానికే తెస్తుంది ఎప్పుడు బయటికి వచ్చినా.

బాలకి జాగ్రత్తలు చెప్పి, మెల్లగా బాలతల్లి నిద్రకు ఉపక్రమించింది.

‘అమ్మా లే..లే’ కుదుపుతూ హడావిడిగా లేపసాగింది తల్లిని బాల.

“ఏమైయ్యింది మన ఊరు వచ్చేసిందా” ఖంగారు పడింది.

“లేదు. నువ్వు ఊరికే ఇస్తే తీసుకుందాము అన్నావు కదా అదుగో అతను ఊరికే ఇస్తాడుట” అంది. అంటూనే “ఇలారా అబ్బీ” అని తల్లికి చెబుతూనే ఆతను వెళ్ళిపోతాడిమోనని పిలిచింది బాల.

“ఊరికే ఎవరిస్త్తారే” అంది చిరాగ్గా.

“ఇస్తాడుటమ్మా. ఇప్పటివరకూ అరిచాడు కూడా. నువ్వు కూడా పిలువు” అంది గాబరాగా చెయ్యి పట్టి లాగుతూ. మళ్ళీ తనే పిలిచింది. “అబ్బి ఇక్కడ రా” అంది.

చిన్నపిల్ల పిలుస్తూడటం, తల్లి ఆసక్తి చూపకపోవటం గమనించిన ఆతను నమ్మకం లేకపోయినా తప్పనిసరిగా వస్తూనే, ఇంకెవరైనా కొంటారేమోననే ఆశతో మళ్ళీ గట్టిగా కేక పెట్టాడు.

“మురికే… మురికే…”

“విన్నావా. ఊరికే, ఊరికే అంటున్నాడు” అంది బాల.

శాంత ఏదో చెప్పబోయింది.

అప్పటికే ఆ అబ్బాయి అక్కడికి రావటం బుట్ట దింపటం జరిగింది.

బుట్ట ని౦డుగా జంతికలు (మురుకులు) ఉన్నాయి.

శాంత నవ్వాపుకోలేక పోయింది. జ౦తికలని కొన్ని చోట్ల మురుకులు అంటారని బాలకి తెలియదు. అందుకే అతను మురికే… మురికే అంటే తను ఊరికే… ఊరికే అనుకుంది.

పిలిచి వద్దంటే బాగుండదు కదా అని తీసుకుంది.

ఏది ఏమైనా మరో చిరుతిండి దొరకటం బాలకి ఆనందం కలిగించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here