[box type=’note’ fontsize=’16’] కొవ్వలి, భయంకర్ పేరుతో రచించిన జగజ్జాణ ఆ కాలం పాఠకులను సమ్మోహితులను చేసింది. ఆనాటి జగజ్జాణను ఈనాటి పాఠకుల కోసం సరళంగా, సంక్షిప్తంగా అందిస్తున్నారు డా. సి.హెచ్. సుశీల. [/box]
శ్రీ కొవ్వలి లక్ష్మీ నారాయణ గారితో ముఖాముఖి:
[dropcap]ర[/dropcap]చయిత్రి: నాన్నగారి గురించి, వారి రచనలు గురించి మీరేం చెప్పదలుచుకున్నారు?
కొ.ల.నా.: కొవ్వలి వారు రచనలు ప్రారంభించిన తొలి రోజుల్లో ఆ నవలలు ఆంధ్రదేశమంతటా ఒక సాహిత్య ప్రభంజనాన్ని సృష్టించాయి. ఆయన రచనలు ప్రారంభించినప్పుడు వారి ముఖ్య ఉద్దేశాలు మూడు –
- పామర జనానికి భాష అందుబాటులో ఉండాలి.
- ఆనాటి సాంఘిక దురాచారాలని రూపుమాపాలి.
- వాడుక భాషా వ్యాప్తి ద్వారా పాఠకుల్లో పఠనాసక్తి పెంచాలి.
కానీ అప్పటి సమాజంలోని కరుడుగట్టిన గ్రాంథిక భాషావాదులు శ్రీ కొవ్వలి వారి రచనల ద్వారా తమ ఉనికి ప్రశ్నార్థకంగా మారబోతోందని గ్రహించారు. ఆ ఉద్యమాన్ని ఆపాలి అంటే ఏం చేయాలి అని ఆలోచించి, పథకం ప్రకారం వారి నవలలని అపఖ్యాతి పాలుచేయాలని ప్రయత్నించారు. పత్రికల్లో ఆయనకు వ్యతిరేకంగా వ్యాసాలు రాశారు. వారి నవలలు చదవనిచ్చేవారు కారు. అవి పనికిరానివి అని ప్రచారం చేశారు. ఆ నవలలు ప్రచురిస్తే దుష్పరిణామాలు కలుగుతాయి అని ప్రచురణకర్తలను బెదిరించారు. కానీ ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. కానీ కొందరు మాత్రం తమ వంతు యథాశక్తి అన్నట్లు, సాహిత్య చరిత్రలో ఆయనకు పేరు, స్థానం రానివ్వకుండా చేశారు. అది అప్పటి కాలం. ఇంచుమించు ప్రస్తుత సాహితీ లోకానికి అంతటికి వారి గురించి, వారి రచనా శక్తి గురించి తెలిసింది. కానీ ఆయన నవలలు పూర్తి వివరాలు అందుబాటులో లేవు. అవి పూర్తిగా ఈ తరానికి లభ్యం కాకపోవటం దురదృష్టకరం. అందువలన వారి సంతానమైన మేము ఇప్పటికి వివిధ ప్రచురణకర్తల ద్వారా దాదాపు వంద నవలలు ప్రచురించేలా ప్రయత్నించాం. కానీ మా కృషి సరిపోదు. వాటిమీద పరిశోధనలు జరగాలి. మాకు సంతోషకరమైన విషయం ఏమిటంటే ఆయనను ప్రజాకవిగా పాఠకులు ఆమోదించారు. అది చాలదా వారి నవల ఆమోదయోగ్యత గురించి చెప్పడానికి.
జాషువా గారన్నట్టు “సుకవి జీవించు ప్రజల నాలుకల యందు”- మా నాన్నగారికి 100% వర్తిస్తుంది. మా నాన్నగారు తెలుగువాడిగా పుట్టడం ఆయన దురదృష్టం. మరే భాషకు చెందిన వారయితే మా నాన్నగారి పేరున ఊరూర విగ్రహాలు వెలిసేవి. తమిళనాడులో సంవత్సరంలో మూడు రోజులు రచయితలకు కేటాయించి “ముప్పెరుం విళా” అని సభలు సన్మానాలు జరుపుతారు. వారి భాషకు ఆద్యుడైన “వాళ్ళువర్” రాసిన “తిరుక్కురళ్” తమిళ కుటుంబానికి ప్రామాణిక గ్రంథము. బస్సుల్లో ఆయన సూక్తులుంటాయి.
ప్రసిద్ధులైన మనకవులను ఎంత మందిని స్మరించుకుంటున్నాం! ఇటువంటి నేపథ్యంలో వాడుక భాషా వ్యాప్తికి తన జీవితకాలం ప్రయాసపడి తద్వారా పఠనాసక్తిని పెంచిన కొవ్వలిని ఉపేక్షించడం అన్యాయం. మహానుభావులు కొడవటిగంటి కుటుంబరావు గారి మాటల్లో…. “తెలుగులో పఠనాసక్తి పెంచడానికి నవలలు రాసి కృషి చేసిన వారిలో కొవ్వలి ప్రథముడు. ఆ కృషి ఫలితాన్ని ఈనాడు అనేక పత్రికల్లో రచయితలు అనుభవించుతూ ఉండటం మనం చూస్తున్నాం. ఆ ఫలితం ఆయనకు అందక పోవడం శోచనీయం”. కానీ మన సాహితీ వేత్తలు ఎంతమంది కొడవటిగంటి వారిలాగా కొవ్వలి గొప్పతనాన్ని ఒప్పుకుంటారు! మనం జవాబు వెతుక్కోవాలి.
రచయిత్రి: తెలుగు సాహిత్యానికి ఇంత సేవ చేసిన మీ తండ్రి గారి గురించి సాహిత్య చరిత్రలో అసలు ప్రస్తావించకపోవడానికి కారణాలేమిటి?
కొ.ల.నా.: సముచిత స్థానం ఎవరు కల్పించాలి అన్న ప్రశ్న మనం వేసుకుంటే – అది ప్రశ్నగానే మిగిలిపోతుంది. ప్రభుత్వమా లేక పాఠకలోకమా లేక సాహితీవేత్తలా లేక చరిత్రకారులా అన్నది చర్చనీయాంశమవుతుంది. ఆనాడు పాఠకలోకం మాత్రం ఆయనకు బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడు పునర్ముద్రింప బడుతున్న నవలలకు కూడా పాఠకాదరణ లభిస్తోంది. మీరు సాహిత్యచరిత్ర అన్నారు కాబట్టి చరిత్రలో సముచిత స్థానం కల్పించాలి అంటే సాహితీవేత్తలు, ప్రభుత్వం పూనుకోవాలి. ఆయన రచనలపై విశేషంగా పరిశోధనలు జరగాలి. ఆయన గురించి పాఠ్యాంశాల్లో చేర్చాలి. ముఖ్యంగా ఇటీవల కాలంలో శ్రీ మద్దాళి రఘురాం గారు, ద్వా.నా. శాస్త్రిగారు, వోలేటి పార్వతీశం గారు కొవ్వలి వారి పేరు మళ్లీ తెరపైకి తీసుకురావడానికి విశేషమైన కృషి చేశారు.
ఇప్పటికైనా మనమందరం సమిష్టిగా కృషిచేసి నేను పైన ఉదహరించిన వాటిని ఆచరణలో పెట్టగలిగితే గతకాలపు సాహితీవేత్తలు చేసిన అన్యాయానికి కొంత ఉపశమనం కలుగుతుందని నా అభిప్రాయం.
రచయిత్రి: ఆనాటి ప్రముఖ రచయితలకు శిష్యులు, ప్రశిష్యులు ఏర్పడి అనేక పరిశోధన గ్రంథాలు కూడా వచ్చాయి. కొవ్వలి గారి పట్ల ఏర్పడిన ఉపేక్షకు కారణం ఏమిటి?
కొ.ల.నా.: ఏ రచనైనా రక్తి కట్టించాలి అంటే భావ పుష్టి భాష పుష్టి ఉండాలి అప్పుడే పాఠకులు వాటిని ఆసాంతం ఆస్వాదిస్తారు. ముఖ్యంగా నాన్నగారి జానపద నవలలు చదివితే భాష పుష్టి ఎంత పటిష్టంగా ఉందో అవగతమవుతోంది విషయానికొస్తే ఆయన విప్లవభావాలు అభ్యుదయ భావాలు పాఠకులకు బాగా నచ్చేవి ఆసక్తి గురించి చెప్పాలంటే తమ రచనల ద్వారా హాస్యాన్ని పండించారు. ఒక్కొక్క దానికి ఉదాహరణ చెప్పాలంటే ఎంతో చెప్పవచ్చు స్థలాభావం వల్ల మరోసారి ప్రస్తావిస్తాను.
రచయిత్రి: సమకాలీన రచయితలు మీ ఇంటికి రావడం గానీ, మీ నాన్నగారితో స్నేహ బంధాలు జరిపినట్టు గాని మీకు ఏమైనా జ్ఞాపకాలు ఉన్నాయా?
కొ.ల.నా.: నాకు అప్పుడు బాగా చిన్నతనం. నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు చెప్పాలంటే జివిజి గారు, కొలను బ్రహ్మానందరావు గారు, గోటేటి శ్రీ రామారావు గారు, అనిసెట్టి గారు, గబ్బిట వెంకట్రావు గారు తరచూ మా నాన్న గారిని కలవడానికి మా ఇంటికి వచ్చేవారు.
రచయిత్రి: సినీ చిత్ర ప్రపంచంలో కొవ్వలి గారి నవలపై విపరీతమైన ఆకర్షణ ఉందట. ఆ వివరాలు చెప్పగలరా?
కొ.ల.నా.: మా నాన్నగారు సన్మానాలుకి, బిరుదు ప్రధానాలకి చాలా దూరంగా ఉండేవారు. చాలా మొహమాటస్తులు. ఉదాహరణ చెప్పాలంటే స్వర్గీయ రావి కొండలరావు గారు అప్పటి సినీ పత్రిక విజయచిత్రలో పని చేసేటప్పుడు అనేకసార్లు మా నాన్నగారి ముఖాముఖి కోసం ప్రయత్నించారు. నాన్నగారి గురించి వ్యాసం రాయాలని ఆయన సంకల్పం. కానీ నాన్న గారు ” కొండల్రావుగారూ! నేను అంతా పెద్దవాడిని కాదండి నా గురించి ఏముంటుంది కనుక రాయటానికి” అని చెప్పేశారు.
రచయిత్రి: మీ గురించి చెప్పండి.
కొ.ల.నా.: నా శ్రీమతి పేరు స్వర్ణ పెమ్మరాజు వారి ఆడపడుచు. నాకు ముగ్గురు అబ్బాయిలు ప్రస్తుతం విశాఖపట్నంలో ఉంటున్నాను. చివరిరోజుల్లో ముఖ్యంగా మా అమ్మగారు గతించిన తరువాత మా నాన్నగారు నాతో ఎక్కువ సమయం గడిపేవారు. ఎక్కువగా జ్ఞాపకాల్ని పంచుకొనేవారు. ఆయన వారి నాన్నగారిని కంటిపాపలా చూసుకునేవారు. మా అమ్మ పూర్తిగా అందుకు సహకరించేది. మా నాన్నగారు షూటింగ్ నుంచి రాత్రి బాగా పొద్దు పోయాక ఇంటికొచ్చి అమ్మని అడిగే మొదటి ప్రశ్న :మా నాన్న గారు భోజనం చేశారా’ అని. అప్పటికే అమ్మ మా తాతగారికి భోజనం పెట్టివుండేది. అంతేకాక తన అత్తమామలను కూడా ఆయన చివరకు తన దగ్గర పెట్టుకొని ఎంతో ఆప్యాయంగా చూశారు. అంతటి పెద్ద రచయితా చివరి రోజుల్లో చిన్న పిల్లవాడి తరహాలో ప్రతి విషయమూ నాతో చర్చించేవారు. ముఖ్యంగా నాకు తన వైపు బంధువులని పరిచయం చేయాలని నన్ను, చెల్లెళ్ళను తీసుకుని వెళ్లి గోదావరి ప్రాంతాలలోని తన బంధువులకు పరిచయం చేశారు. నాన్నగారు తన ఆశయాన్ని ఆయన ఎదుర్కొన్న ఆటుపోట్లను నాకు విశిష్టంగా చెప్పేవారు ముఖ్యంగా – ‘నువ్వు ఏ వృత్తిలోనైనా చేరు, కానీ అందులో అత్యున్నత స్థితికి ఎదగడానికి ప్రయత్నించాలి’ అని నాకు చెప్పేవారు. ఆయన ఆశీర్వాదం వలన మా అమ్మ దీవెన వలన నేను బ్యాంకులో ఉన్నతమైన జనరల్ మేనేజర్ పదవికి రాగలిగాను కానీ చూసి సంతోషించేందుకు వాళ్ళు లేరు. వ్యక్తిగతంగా నా వరకు నేను ఆయన ఆశయాన్ని చాలా వరకు నెరవేర్చగలిగే స్థితిలో ఉన్నాను.
రచయిత్రి: సంచిక మ్యాగజైన్‌లో నేను రాస్తున్న “జగజ్జాణ సరళంగా సంక్షిప్తంగా” పై మీ అభిప్రాయం ఏమిటి?
(నా సరళ సంక్షిప్త జగజ్జాణపై కొవ్వలి లక్ష్మీ నారాయణ గారి అభిప్రాయంతో పాటు, “నేనెందుకిది రాసాను” – వచ్చేవారం.)