సేవాధురీణ హెలెన్ కెల్లర్

10
3

[dropcap]జూ[/dropcap]న్ 27వ తేదీ ‘హెలెన్ కెల్లర్’ జయంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.

***

మూగ, చెవిటి, అంధురాలైన యువతి అయినా బ్రెయిలీ లిపిలో చదివి విద్యావేత్త, ఉపన్యాసకురాలు, అధ్యాపకురాలు, నిర్వహణా సమర్థురాలు, దివ్యాంగుల కోసం సంస్థల స్థాపకురాలు, నిధుల సేకరణతో దివ్యాంగుల సంస్థలను సుసంపన్నం చేసిన సేవాధురీణ రచయిత్రి హెలెన్ కెల్లర్.

ఈమె 1880 వ సంవత్సరం జూన్ 27 వ తేదీన అమెరికాలోని అలబామా రాష్ట్రంలోని టస్కంబియాలో జన్మించారు. తల్లిదండ్రులు కేథరీన్ ఎవెరెట్ ఆడమ్స్ కెల్లర్, ఆర్డర్ హెన్రీ కెల్లర్‌లు. ఈ కుటుంబం ‘ఐవీగ్రీన్’ అనే భవనంలో నివసించేవారు.

ఈమె సంవత్సరమున్నర వయసులో అనారోగ్యం పాలయింది. ప్రాణాలతో బతికి బట్టకట్టింది కానీ కంటి చూపునీ, వినికిడి శక్తిని కోల్పోయింది. వినికిడి శక్తి లేదు కాబట్టి మాటలు రావు.

వంటమనిషి చిన్న కుమార్తెతో సంజ్ఞలు చేసి మాట్లాడే అలవాటయింది. వాళ్ళిద్దరి సంభాషణ సంజ్ఞలతో సాగేది. సహజంగా ఇటువంటి దివ్యాంగులు కోపం, అసహనం, అసంతృప్తులతో మథనపడుతూ ఉంటారు. ఇతరులను కొడుతూ ఇబ్బంది పెడుతుంటారు. కెల్లర్ అందుకు మినహాయింపు కాదు.

ఈ పిల్లలతో తల్లి పడే వేదన, యాతన అసామాన్యమయినది. వారిని మామూలు పిల్లల స్థాయికి తీసుకుని రావడానికి ఎక్కడ ఏ అవకాశం దొరుకుతుందో అని వెతుకుతూ ఉంటుంది.

ఈ వెతుకులాటలోనే ఆమె తల్లికొక ఆశాకిరణం దొరికింది. ఛార్లెస్ డికెన్స్ యొక్క ‘అమెరికన్ నోట్సు’ తో చెవిటి, అంధురాలయిన లారా బ్రిడ్జిమన్ అనే మహిళ గురించి చదివింది. తరువాత భర్తతో సంప్రదించిందామె.

బాల్టిమోర్‌లో పని చేస్తున్న జులియన్ చిసోమ్ అనే ముక్కు, నోరు, కళ్ళు, గొంతుల స్పెషలిస్ట్ డాక్టర్‌ను కెల్లర్ తల్లిదండ్రులు కలిశారు. ఆయన ‘పెర్కిన్స్ స్కూల్ ఫర్ ది భ్లైండ్’లో చెవిటి పిల్లల కోసం పని చేస్తున్న అలెగ్జాండర్ గ్రాహమ్‌బెల్‌ను కలవమని చెప్పారు. అలెగ్జాండర్ గ్రాహమ్‌బెల్ సలహాల మేరకు ‘అన్నే మాన్సీ ఫీల్డ్ సుల్లివన్’ అనే ఇరవై ఏళ్ళ చెవిటి, అంధ యువతి బోస్టన్ లోని ‘పెర్కిన్స్ స్కూల్ ఫర్ ది బ్లైండ్’లో చదువుకున్న మహిళ కెల్లర్‌కు ఉపాధ్యాయినిగా నియమించబడింది. ఈమె పేరును పాఠశాల డైరెక్టర్ మైఖేల్ అనాగ్నాస్ గ్రాహమ్‌బెల్‌కు సూచించారు.

ఈమె బ్రెయిలీ లిపి ద్వారా ఆమెకు రాయడం, చదవడం నేర్పించింది. చేతి వ్రేళ్ళనుపయోగించి మనసులోని భావాలను ఎదుటివారికి అర్థమయ్యేట్లు చెప్పడం నేర్పించింది.

1936లో సుల్లివన్ మరణించే వరకు అన్ని విషయాలలోను హెలెన్ కెల్లర్‌కు అండదండగా ఉన్నారు. అప్పటివరకు కెల్లర్ విజయాల వెనుక సుల్లివన్ ఉండడం ఆమె అదృష్టం.

బోస్టన్ లోని ‘హోరేస్‌మన్ స్కూల్ ఫర్ ది డెఫ్’ లో సారాపుల్లర్ వద్ద వక్త పెదవులు, గొంతుపై వేళ్ళు ఉంచడం ద్వారా చదవడం అర్థం చేసుకోవడం నేర్చుకున్నారు.

తరువాత ఆంగ్లం, ఫ్రెంచి, లాటిన్, జర్మన్, గ్రీస్ భాషలను కూడా బ్రెయిలీ లిపిలో నేర్చుకున్నారు. ‘రైట్ హ్యూమన్ స్కూల్’, ‘కేంబ్రిడ్జి స్కూల్ ఫర్ యంగ్ లేడీస్’ లలో చదివారు. న్యూయార్క్ లోని రాడ్‌క్లిఫ్ కళాశాలలో చదివారు. 1904లో గ్రాడ్యుయేట్ పట్టాను తీసుకున్నారు. గ్రాడ్యుయేట్ డిగ్రీని తీసుకున్న తొలి మూగ, చెవిటి, అంధ యువతిగా రికార్డును సృష్టించారు.

1903లో రాడ్‌క్లిఫ్ కాలేజీలో చదువుతున్నప్పుడే తన జీవితానుభవాలను వ్రాయడం మొదలు పెట్టారు. 50 సంవత్సరాలు నిరంతరాయంగా రచనా వ్యాసంగంలో కొనసాగారు. ‘ది స్టోరీ ఆఫ్ మై లైఫ్’ అనే ఈ గ్రంథంలో 21 సంవత్సరాల వరకు గల ఈమె జీవిత చరిత్రను నిక్షిప్తం చేశారు.

గ్రోవర్ క్లీవ్‌లాండ్ నుండి లెండన్ బి. జాన్సన్ వరకూ అమెరికా అధ్యక్షులుగా పని చేసిన వారందరూ ఈమెను అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్ హౌస్‌కి ఆహ్వానించడం విశేషం.

మార్క్ ట్వైన్, అలెగ్జాండర్ గ్రాహమ్‌బెల్, విలియం జేమ్స్ వంటివారు ఈమెకు అత్యంత సన్నిహితులు.

1932లో స్కాట్లాండ్ ఎడ్యుకేషనల్ ఇన్‍స్టిట్యూట్ వారు సుల్లివన్, హెలెన్ కెల్లర్‌లకు సంయుక్తంగా గౌరవ ఫెలోషిఫ్‌ను అందించి గౌరవించారు.

బ్రెయిలీ లిపి ఈమెను మంచి రచయిత్రిగా తయారు చేసింది. అంధత్వం, చెవిటితనం, సామాజిక సమస్యలు, రాజకీయ అభిప్రాయాలు, మహిళల హక్కులను గురించి 500 వ్యాసాలను వ్రాశారు.

చాలా ఉపన్యాసాలు ఇచ్చారు. అనేక మంది వక్తల ఉపన్యాసాలను అవగాహన చేసుకుని ఇతరులకి తెలియజేసేవారు. దివ్యాంగుల అభివృద్ధి కోసం ఎన్నో వ్యాసాలను జాతీయ పత్రికలలో వ్రాశారు.

వక్తలు మాట్లాడుతున్నపుడు స్పీకర్ పైన మునివేళ్ళను ఉంచేవారు. స్పీకర్ నుండి వచ్చే ‘వైబ్రేషన్స్’ (ధ్వని తరంగాల) ఆధారంగా వారు మాట్లాడిన మాటలను పొల్లుపోకుండా బ్రెయిలీ లిపి ద్వారా తెలియజేసేది. ఈ ‘టాడోమా’ పద్ధతిలోనే ప్రపంచంలోని అనేక విషయాలను తెలుసుకుని బ్రెయిలీ లిపి ద్వారా వ్యాసాలు, గ్రంథాల రూపంలో వెలయించారు.

వివిధ సంస్థల ద్వారా సామాజిక సేవను అందించారీమె. 1920లో ‘అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్’ ను స్థాపించారు. అమెరికన్ పౌరహక్కుల కార్యకర్తలు రోజర్‌నాష్, బాల్డ్విన్ వంటి వారితో కలిసి పనిచేశారు.

1915లో జార్జ్ ఎ.కెస్లర్ తో కలిసి ‘హెలెన్ కెల్లర్ ఇంటర్నేషనల్’ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ దృష్టిలోపం, అంగవైకల్యం అంశాలను గురించి పరిశోధనలు చేసింది.

1924లో ‘అమెరికన్ ఫౌండేషన్ ఫర్ బ్లైండ్’ సంస్థకి సలహదారుగా పనిచేశారు. అత్యధిక చందాలను సేకరించే పనిని ఈమెకు అప్పగించారు. హెన్రీ ఫోర్డ్, జాన్.డి. రాక్‌ఫెల్లర్ వంటి అమెరికాలో పేరు పొందిన ధనవంతుల ద్వారా ఈ సంస్థ నిధులు పెరిగాయి. సుమారు 2 మిలియన్ల ఎండోమెంట్ ఫండ్‌ను సేకరించారు. పై సంస్థను విదేశాలలో స్థాపించారు. సుమారు 35 దేశాలలో ఆమె పర్యటించారు. ముఖ్యంగా చెవిటి వాళ్ళ గురించి దృష్టి సారించారు. విదేశాలలోని సంస్థలను ‘హెలెన్ కెల్లర్ ఇంటర్నేషనల్’గా మార్చి కార్యకలాపాలను నిర్వహించారు.

1955లో గ్లోబ్-గిర్డింగ్ పర్యటనలో భాగంగా భారతదేశాన్ని సందర్శించారు. ప్రధాని స్వర్గీయ జవహర్‌లాల్ నెహ్రూని కలిశారు.

ఈమె ఆత్మకథ ‘THE STORY OF MY LIFE’కు చాలా ప్రత్యేకతలున్నాయి. ఈ గ్రంథాన్ని అలెగ్జాండర్ గ్రాహమ్‌బెల్‌కు అంకితమిచ్చారు. 1903లో మొదటిసారి ప్రచురింపబడింది. సుమారు 50 భాషలలోకి అనువదించబడింది.

శ్రీ విలియం గిబ్సన్ 1957లో రంగస్థల నాటకంగా మలిచారు. 1959 లో బ్రాడ్‌వే నాటక ప్రదర్శనగా తయారయింది. 1962 లో ఈమె కథ హాలీవుడ్ చిత్రంగా తయారయింది. 1979లో ‘The Miracle Worker’ చిత్రంగా తీశారు. 2005లో ‘బ్లాక్’ అనే సినిమా ఈమె జీవితచరిత్ర ఆధారంగా నిర్మించబడింది. 1984లో ‘The Miracle Continues’ పేరుతో ఈమె జీవితచరిత్రను టి.వి.చిత్రంగా రూపొందించారు.

1919లో ఒక మూకీ చిత్రం ‘డెలివరెన్స్’ లో ఈమె కన్పించారు.

ఈమెకు వివిధ దేశాల విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేశాయి. విద్య, మేధోసాధన, దివ్యాంగుల కోసం ప్రత్యేక వ్యాసాలు, గ్రంథాలు, నిధులు సేకరించి దివ్యాంగులకు సాయం చేయడం వంటి కార్యక్రమాలకు గాను ఈ డాక్టరేట్లు లభించాయి.

ఢిల్లీ, హార్వర్డ్, గ్లాస్గో, టెంపుల్, బెర్లిన్, విట్వాటర్‌రాండ్ మొదలయిన విశ్వవిద్యాలయాలు డాక్టరేట్లను అందించాయి.

ఈమె వ్రాసిన గ్రంథాలలో ముఖ్యమైనవి 1903లో ‘ద స్టోరీ ఆఫ్ మై లైఫ్’, ‘ఆప్టిమిజం’లు. 1908లో ‘ద వరల్డ్ ఐ లివ్ ఇన్’, 1938లో ‘హెలెన్ కెల్లర్స్ జర్నల్’, 1957లో ‘ద ఓపెన్ డోర్’ పేరు పొందినవి.

జర్మన్‌ యూదు రచయిత హెల్డెగార్డ్ జోహన్నా కేజర్ ఈమె జీవిత చరిత్రను వ్రాశారు. ఈమెకు ‘యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్’, ‘ఫ్రెంచ్ లెజియన్ ఆఫ్ ఆనర్’ లభించాయి. 1965లో జరిగిన ‘న్యూయార్క్ వరల్డ్ ఫెయిర్’లో ‘నేషనల్ ఉమెన్స్ హల్ ఆఫ్ ఫేమ్’గా ఎన్నికయిన 20 మందిలో ఒకరుగా ఎంపిక కావడం ఈమె జీవితంలో గొప్ప విజయం. 1960లో పులిట్జర్ బహుమతిని గెలుచుకున్నారు.

ఈమెకు అపుడప్పుడు స్ట్రోక్స్ వచ్చేవి. చివరకు 1968వ సంవత్సరం జూన్ 1వ తేదీన వెస్ట్‌పోర్ట్ లోని కనెక్టికట్‌లో తన ఆర్కా అని పిలవబడే ఇంట్లో మరణించారు.

శారీరకంగా ఏ లోపంలేని వారు చాలా సమయాన్ని వృథా చేసుకుని కాలక్షేపం చేస్తున్నారు. మూగ, గ్రుడ్డి, చెవిటి యువతి అయిన హెలెన్ కెల్లర్ వంటి వారు సాధించిన విజయాలను స్పూర్తిగా తీసుకుని జీవితాలను కొనసాగిస్తే పురోభివృద్ధి సాధించవచ్చు.

భారత తపాలాశాఖ 1980 జూన్ 27వ తేదీన ఈమె శతజయంతి సందర్భంగా 30 పైసల విలువతో ఒక స్టాంపును విడుదల చేసింది. ఈ స్టాంపు మీద సైడ్ ఫోజుతో హెలెన్ కెల్లర్ చిత్రం ముద్రించబడింది.

జూన్ 27వ తేదీ హెలెన్ కెల్లర్ జయంతి సందర్భంగా ఈ నివాళి.

***

Image Courtesy: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here