అంటు మొక్క

0
4

[dropcap]సూ[/dropcap]ర్యుడు తూర్పున ఉదయిస్తూ మానవాళిని మేల్కొతాడు. ప్రకృతి అంతా పులకించి జన జీవనం మొదలు. ఇవన్నీ మానవులకు అద్భుతాలు.

జీవితం ఎప్పుడూ అనందంగానే ఉంటుంది మన పరిస్థితులను బట్టీ, మనసును బట్టీ మారుతూ ఉంటుంది. ప్రకృతిని మన జీవిత సారథిగా ఎంచుకుంటే అన్నీ సమతుల్య భావాలతో మంచిగా ఆలోచిస్తే ఉన్నతంగా ఉత్తమంగా ఎదగడానికి అవకాశం ఎక్కువ ఉంటాయి. ఒక మాటలతో ఎన్నో అద్భుత సౌధాలు సృష్టించగల అవకాశాలను దక్కించుకుంటారు. మాట మంచితనంతో ఎన్నో విజయాలు సాధించి వచ్చును అని మన పెద్దల అభిప్రాయము. కానీ అన్ని ఒకలా పరిస్థితులు ఉండవు. కొందరు ఎంత తగ్గినా, ఎదుటివారు మరింత రెచ్చిపోయి అవతల వ్యక్తి సహనాన్ని పరీక్షించి, తమ గొప్ప ప్రదర్శించి ఆనంద పడతారు.

మనిషి జీవితానికి బాల్యంలో బంగారు బాట ఏర్పడుతుంది. అది పెద్దల పెంపకం వల్లనే వస్తుంది. అందుకే పెద్దలు పిల్లల్ని సక్రమంగా పెంచడానికి ప్రయత్నించాలి.

శ్రీ నమ్రత ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టిన పిల్ల. తండ్రి కొంత స్వంత పొలం. కొంత కౌలుకి తీసుకుని చేసేవాడు. చదువు ఇష్టం, ఆడపిల్లలని కూడా బాగా చదివించాలని కోరిక. ఇద్దమ్మాయిలతో చిన్న కుటుంబం. మగ పిల్లలు లేరు. ఆడపిల్లను పద్ధతిగా పెంచారు. పెద్ద పిల్ల శ్రీ నమ్రత. రెండో పిల్ల శ్రీ నవ్య. ఇద్దరికీ రెండేళ్లు తేడా. పెద్ద పిల్ల ఇంటర్‌లోకి వచ్చింది రెండవది టెన్త్‌కి వచ్చింది.

శ్రీ నమ్రత పేరుకి తగ్గట్టుగానే చిన్నప్పటి నుంచి చాలా నెమ్మదిగా ఉండేది. పెద్దల మాటకు గౌరవం ఇచ్చేది. పిల్ల నెమ్మది అని బంధువుల్లో పేరు వచ్చింది. ఇంటర్ అవగానే తెలుసున్న పిల్ల, రూపేచ లక్ష్మి అని విని ఆ పిల్ల అయితే మంచిదని మధ్యవర్తి ద్వారా “మీ పిల్లను మేము చేసుకుంటాము” అని కబురు పంపారు. నమ్రత తండ్రి రావు ఈ విషయం భార్య సునీతకు చెప్పాడు. అమె ఆలోచనలో పడింది

తన పెళ్లి చిన్నప్పుడు చేశారు. ఇరవై ఏళ్ళు వచ్చేటప్పటికి, ఇద్దరు పిల్లల తల్లి ఇంటి బాధ్యతలు, ఐతే భర్త మంచి వాడు కనుక జీవితం సజావుగా సాగిపోయింది. అత్త బావగారు జులుం చేసినా, మంచితనం వల్ల భార్యను కష్టపెట్టేవాడు కాదు. ఇంటి పరిస్థితులు వ్యతిరేకమైనా, భర్త సౌమ్యుడు కావడంతో పిల్లలను చదివించారు. ఆడపిల్లలు చదివేందుకు అంటూ బావగారు రోజు ఏదో ఒక గొడవ పెట్టేవాడు.

సునీత.. చదువుతో పాటు సంగీతం కూడా నేర్పించింది, కరాటే నేర్పించింది. ముఖ్యంగా శ్రీ అన్నమయ్య శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తనలు ప్రత్యేకంగా నేర్పించింది.

ఇంటర్ అంటే జీవితంలో గమ్యం చేరే సమయము. ఎటు వెళ్ళి చదవాలి అని ఎంచుకునే ట్రాన్సిషన్ టైమ్. ఈ పీరియడ్‌లో ఎవరికైనా డోలాయమానంగా మానసిక స్థితి ఉంటుంది. డిగ్రీలో పెడితే మళ్లీ మూడు ఏళ్లు చదవాలి. పెళ్లి చేసేస్తే మంచిదని ఆలోచన. ఈ ఓపిక, డబ్బు ఉండగా ఆడపిల్లను పెళ్లి చేసి పంపితే రెండు పురుళ్ళు పోసేటప్పటికి రెండో పిల్ల పెళ్లికి అందుకుంటుది.

శ్రీ నమ్రతది ఎటు తేల్చి చెప్పలేని పరిస్థితి. కాలేజిలో స్నేహితులతో గ్రూప్స్ డిస్కషన్. ఇంట్లో పెద్దలు పెళ్లి మాటలు. ఎవరి మాట వినాలి? ఎవరి ఆలోచన మంచిది? సహజముగా ఆ వయస్సులో ఆడపిల్లల పెళ్లిళ్ల మాటలే ఎక్కువ.

అయితే మంచి సంబంధం అంటున్నారు. ‘కాళ్ళ దగ్గరికి వచ్చిన బేరం, కాశీకి పోయినా రాదు’ అని పెద్దలు అన్నారు. పెద్దల మాట సద్ది మూట అన్నారు. తాత, మామ్మ ఎలా అంటారో అలా చెయ్యాలి అని అనుకున్నారు. ఎందుకంటే శ్రీ నమ్రత అంటే ఆ ఇంటి మొదటి ఆడపిల్ల. బావగారికి మగ పిల్లలు, పెద్ద వాళ్ళు. ఆడపిల్లలు చిన్నవాళ్ళు. కనుక “అత్త మామకి ఒక మాట చెప్పి అప్పుడు సంబంధం వారికి చెపుదాం” అని సునీత భర్త రావుతో అన్నది

సరే అని రావు తల్లి తండ్రులుకి, అన్న గారికి చెప్పడానికి నిర్ణయించుకున్నారు. అవతల సంబంధానికి బాగా పొలాలు ఉన్నాయి, పిల్లాడు డిగ్రీ చదువు చదివాడు. ఫైనాన్స్ బిజినెస్ చేస్తున్నాడు. వాళ్ళ ఆడపిల్లలు ఇద్దరు అత్తింటికి వెళ్లేరు. అన్నగారు బెంగుళూరులో ఉద్యోగం. ఇక్కడి పొలాలు, బిజినెస్ అన్ని కూడా ఈ పిల్లాడు చూస్తున్నాడు అది విషయము.

***

మంచి రోజున బామ్మ తాత శ్రీ నమ్రతను దగ్గర కూర్చోపెట్టుకుని పెళ్లి విషయం మాట్లాడారు. ఆడపిల్ల ఈ సమాజంలో ఎంత చదివినా ఎంత ఎదిగినా సరే, ఏ వయస్సు వచ్చినా సరే పెళ్లి తప్పదు. ఏ వయస్సు కా వయస్సు పెళ్లి చెయ్యాలి.  పిల్లలకి ఎంత చదివినా ఇంకా చదవాలని ఉంటుంది. ఉద్యోగం, సంపాదన అన్ని వచ్చాక, వయసుకు తగ్గ వాడు చదువు ఈ మాత్రం ఉన్నవాడు దొరకవద్దా అన్నారు.

“తల్లి, తండ్రి పుట్టింటి ప్రేమ ఎప్పుడూ ఉంటుంది. ఇది శాశ్వతం కాదు ఆడపిల్లకి అత్తింట ప్రేమ అభిమానాలు పొంది పుట్టింటి పేరు నిలబెట్టుకోవాలి. భర్త ప్రేమ, పిల్లలు నీ జీవితం నీది నీ సంసారం నీది” అన్నారు.

“ఆడపిల్ల జీవితం ‘అంటు మొక్క’ లాంటిది. పుట్టింట్లో ఎంత గారాబంగా పెరిగినా అత్తింటికి వెళ్ళి వంశాన్ని పెంచాలి. అంటుకట్టిన మొక్క తల్లి వేరు నుంచి వేరుపడి దాన్ని ఏ ప్రాంతంలో,  ఏ రాష్ట్రంలో ఏ దేశంలో పట్టుకెళ్ళి పాతినా అక్కడి ప్రకృతి వాతావరణ శీతోష్ణ పరిస్థితులకు అనుగుణంగా పెరిగి పువ్వులు, కాయలు ఇవ్వాలి. అది యజమాని ద్వారా ఏ వాతావరణ పరిస్థితులలోకి ట్రాన్స్‌పోర్ట్ చెయ్యబడుతుంది, ఎవరు కొని పాతుకుంటారు? ఎలా సంరక్షణ చేస్తారు? అన్నది తెలియదు.  మరి తెలియదు కదా. అలాగే ఈడొచ్చిన ఆడపిల్ల జీవితం కూడా ఇంతే. మాకు ఈ ఓపిక ఉండగా పెళ్లి చెయ్యాలి అని ఆశ. మంచి సంబంధం వచ్చిందని మాకు మంచిది అనిపించింది. అందుకే నీ ఉద్దేశం కూడా చెప్పమంటున్నాము” అన్నారు తాత బామ్మలు.

నమ్రత నవ్వింది. “నాకు జీవిత ఆశయము ఉంది. నాకు చదువుకోవాలని కోరిక ఉన్నది. లా చదివి జడ్జి అయ్యి ఆడపిల్లల జీవితానికి ఆదర్శం కావాలి. ఇది నా బలీయమైన కోరిక. అయితే మీ మాట కాదు అనను. అలాగేనని జీవిత ఆశయం వదులుకోను. నేను మార్చుకోలేను. అందుకే సంఘర్షణలో ఉన్నాను. అయితే ఈ విషయం వారితో మాట్లాడి, వారు చదివిస్తాను అంటే పెళ్లి చేసుకుంటాను. వారిని ఒప్పించితే మీకు నచ్చిన సంబంధం కనుక అందరికీ ఆనందమే కదా” మనుమరాలు తెలివిగా చెప్పింది.

“వాళ్ళ కోడలిగా నేను ఎదగడం వారికి ఇష్టమే కదా. ఆ కీర్తి ప్రతిష్ఠలు అన్ని ఆ కుటుంబానికి చెందుతాయి. పెళ్లికి ముందు అన్ని ఓకే అంటారు. మేము అన్ని సర్దుకుంటూ ఉంటాము. పిల్లను ఇస్తే చాలు అంటారు. తరువాత వద్దు అంటే బాధపడాలి. అందుకే ముందు అన్ని విషయాలు చర్చించి నిర్ణయం తీసుకోండి. మీ మాట కాదని ఎన్నడు అనను, అనలేను. ప్రతి మనిషి పుట్టుక పెరుగుదలకు పట్టు కొమ్మలు తల్లి తండ్రులు కదా. ఇంక మీ మాట కాదని, ఎవరి మాట వింటాను?” ఇంటర్ చదువుతున్న శ్రీ నమ్రత చక్కని సమాధానం ఆలోచించి చెప్పింది.

‘దీని పెళ్లి అయితే రెండవ పిల్ల శ్రీ నవ్య ఎదుగుతుంది’ ఇలా పెద్దలు ఆలోచించి శ్రీపతి వాళ్ళకి ఫోన్ చేశారు. వాళ్ళ పిల్ల చెప్పినవన్నీ చెప్పారు. “పిల్లకి చదువు ఇష్టం. ఇంకా చదువుతాను అంటోంది. దాని జీవిత ఆశయం జడ్జి కావాలని. అందుకు తగిన ఎంట్రన్స్ టెస్ట్ కూడా ప్రిపేర్ అవుతోంది. మరి మీ సమాధానంపై పెళ్లి ఉన్నది. పెళ్లి తరువాత చదువుకోవడానికి ఇష్టమేనా? అందుకు ఇష్టమైతే ముహూర్తాలు పెట్టుకుందాం” అని వారికి ఫోన్‍లో చెప్పాడు. అంతా మీ ఇష్టము అని అన్నాడు “నాకు ఎంత తొందరగా చేస్తే అంతా మంచిదని ఆలోచన కూడా” అన్నాడు.

ఇలా సాగిన వారి మాటలు సునీతకు, శ్రీ నమ్రతకు నచ్చాయి.

సునీత మనసు ఒక సారి గతంలోకి వెళ్ళింది

శ్రీ నమ్రత వయసు పిల్లలు ఆడుకుంటూ ఉంటే, 6వ తరగతి చదివే రోజుల్లో వీణ నేర్పించింది. కారణం దాని వల్ల చాలా నిదానం వస్తుంది. మళ్లీ మంచి గురువు దొరకరు. నమ్రత అంతా ఆసక్తిగా నేర్వలేదు. తల్లి సునీత పట్టుదలగా నేర్పించింది. ఎక్కువ మంది లేక డబ్బు చాలక వెళ్ళి పోయారు. జీతాలు బాగా వస్తే గాని పాఠాలు చెప్పలేరు. అలా ఆరునెలలు నేర్చుకున్నాక ఆయన వెళ్లిపోవడంతో బ్రేక్ వచ్చింది.

ఇప్పుడు ఈ పెళ్లితో ఈ చదువు ఎన్ని మలుపులు తిరగుతుందో అనుకొన్నది. ఆందోళన పడింది. ఆచరణకి మాటకి చాలా దూరమే కదా. పెళ్లి అయ్యాక ఇంకా చదువా ఇంట్లో ఉండాలి అన్నా తప్పదు. అత్తింటి పంపండి చదువు చాలు అనే పలువురి విమర్శలు వినాలా – ఇలా సునీతకి ఎటు పాలు పోకుండా ఉన్నది.

పెళ్ళి వారు టిఫిన్స్ తిని ఏదో లోకం పోకడ మాట్లాడుకుని వెళ్లారు. పిల్లకి పట్టు చీర తెచ్చి పెట్టారు. నిశ్చితార్థంలో నగలు పెడతాము అని చెప్పారు

“అమ్మా నమ్రతా, నీకు నచ్చితేనే పెళ్లి. పట్టు చీర ఇస్తే పెళ్లి చేసుకోవాలని లేదు. నువ్వు ఆలోచించుకో” అన్నది తల్లి.

“అమ్మా, ముందు లా సీటు వచ్చి, చేరాక పెళ్లి. డిగ్రీలో కొంత చదువు, అనందం, మంచి స్నేహితులు, ఇవన్నీ ఎంతో గొప్ప విషయాలు. అవి జీవితంలో రుచి చూడాలి” అని నవ్వింది.

కూతురు కోరికను వద్దు అని చెప్పలేక పోయారు. పెళ్లి వారితో అదే చెప్పారు. దానికి పెళ్ళివారు సమ్మతించారు. లా కోర్సు ఎంట్రన్స్ పాస్ అయింది. తాంబూలాలు పుచ్చుకునే కార్యక్రమం కోసం ఘనంగా చేశారు.

ఈలోగా కాలేజిలో చేరింది. లా పరీక్షలలో మంచి మార్క్‌లతో పాస్ అయింది. శ్రీపతి కుటుంబం సంతోషించింది. “ఐతే ఈ వేసవిలో పెళ్లి చేద్దాము” అన్నారు.

పెళ్లి కుదిరింది, కనుక రమణ వచ్చి వెడుతున్నాడు. అయితే గిట్టని వాళ్ళు – “ఈ రోజుల్లో పిల్లలను పెళ్ళి చేసుకుని ఉద్యోగాలు చేయించి డబ్బు సంపాదిస్తున్న విషయాన్ని గొప్పగా చెపుతున్నారు. అయినా ఉద్యోగం లేని కొడుకు ఎంత డబ్బు ఉన్నా ఎవరు పిల్లను ఇవ్వలేదు. అందుకని పెళ్లి చేసుకుని ఆ పిల్లని చదివిస్తున్నారు కాబోలు” అని అన్నారు. లోకో భిన్న రుచి కదా.

రెండు కుటుంబాల తరఫునా, “పిల్ల బాగుంది, మంచి సంబంధం” అంటూ మెచ్చుకున్నారు. మరికొందరు ఈర్ష్య పడ్డారు. దీవించి, భోజనాలు చేసి వెళ్లారు. చదువుకున్న కోడలు, జడ్జి ఉద్యోగం, ఏమేమి రెండు చేతులతో సంపాదన అన్నారు.

ఆ చదువుకి కావాల్సిన పరీక్షలు రాసింది, సెలెక్ట్ అయింది. నమ్రత చదువు బాగానే సాగుతోంది. రమణ పండుగలకు వచ్చి వెళ్ళేవాడు.

అలాగే పండుగలకు నమ్రత అత్తవారింటికి వెళ్ళి వచ్చేది. వేసవి సెలవుల్లో అత్తింట వెళ్ళి ఉండి వచ్చేది. అత్తగారు ప్రేమగా చూసేది పరీక్షలు కాగానే సారే పెట్టి ఘనంగా పంపారు.

“రిజల్ట్స్‌తో పనిలేదు మా కోడలు జడ్జి” అని అత్తగారు గొప్పగా చెప్పేది. ‘తన కలల సాకారం కోసం అత్తింట ప్రోత్సాహం ఉంది, అందరి మనసులో మంచి స్థానం పొందింది. తన లక్ష్యాన్ని తను వదులు కోకూడదు’ అని అనుకుంది నమ్రత. భర్త ప్రోత్సాహంతో బాగా ప్రిపేర్ అవుతున్నది. ఎదగాలనే లక్ష్యంగా చదువుకుంది. “నువ్వు కావాలంటే కోచింగ్‌కి పంపుతాను. ట్రైనింగ్ సెంటర్లో చేరు. నేను నీతో వచ్చి అక్కడ ఉంటాను” అని చెప్పాడు రమణ.

“సార్ మీకు నా కన్న ఎక్కువ క్యూరియాసిటి ఉన్నది జడ్జి భర్త అవ్వాలని” అని నవ్వేది. ఎప్పుడు రమణ నొచ్చుకొనలేదు. “అవును నాకు జడ్జి భర్త నవ్వడం ఎంతో ఇష్టం” అనేవాడు. కోడలి చదువు ఇష్టపడని అత్తవారు ఉన్న ఈ రోజుల్లో కోడల్ని చదివిస్తున్నారు అని ఈర్ష్య చాలా మందికి ఉన్నది.

***

కాల గమనంలో నమ్రత జడ్జిగా ఢిల్లీలో సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్ కూడా అయింది. మొదటగా ఉద్యోగం ఏలూరులో పోస్టింగ్ ఇచ్చారు. మంచి పేరు తెచ్చుకుని డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జిగా ప్రమోషన్‌తో వైజాగ్ వెళ్ళింది.

భర్త ఎప్పుడు కూడా ఉండేవారు. నమ్రతలో గర్వం లేదు. కాలగమనంలో ఇద్దరు పిల్లలు పుట్టారు. వారిని ఒక్కతే చూసుకోవడం కష్టం కనుక పిల్లల్ని తల్లిదండ్రులు దగ్గర ఉంచితే మంచిదని పెద్దలు సలహాలు ఇచ్చారు. కానీ నమ్రత ఒప్పుకోలేదు. ఎవరి పిల్లలని వారే పెంచుకోవాలి అప్పుడే ఆనందము అనుబంధము పెరుగుతుంది అని నవ్వింది.

“నో. నో. నా పిల్లలను దత్తతగా కూడా ఇవ్వను. పిల్లల పెంపకంలో సహాయం అంతే” అన్నది. “ఎందుకంటే రేపు నా చెల్లికి పిల్లలు పుడతారు. నాన్న ఆస్తి మేము ఇద్దరమూ సమంగా పంచుకుంటాము. నా పిల్లలను మీరు పెంచుకుంటే వాడికి ఆస్తి అంతా ఇస్తారు. అలా వద్దు మేము ఇద్దరమే పంచుకుంటాం. కనుక ఆ ఆలోచన వద్దు” అంది.

నమ్రతలో ఎదిగే కొద్ది ఒదిగే లక్షణం పెరిగింది. అందరూ స్త్రీల కాకుండా ప్రత్యేకంగా ఆలోచిస్తుంది. స్త్రీ ఎదుర్కొంటున్న సమస్యల కోసమే తన వృత్తిని చేపట్టింది. ఎంతో కృషి చేసి మంచి పేరు తెచ్చుకుంది. భర్త సహకారంతో వృత్తిని భక్తిగా నిర్వహించేది. కోర్టు నుంచి ఇంటికి వెళ్ళాక సంగీత సాధనకు వెళ్ళేది. గురువు దగ్గర నేర్చుకుంటే పద్ధతిగా ఉంటుంది.

ఒక డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి సామాన్యులు మాదిరి స్వేచ్ఛగా బయటికి వెళ్ళకూడదు. వాళ్ళకి సెక్యూరిటీ ఉండాలి. కొన్ని రూల్స్ పాటించాలి. క్వార్టర్స్ నుంచి సాయంత్రం సంగీతం పాఠానికి వెళ్ళేది. కూడా ఆమెకు ఒక బంట్రోతు, ఒక అసిస్టెంట్, కార్ డ్రైవర్ వచ్చేవారు. ఆ సంగీత విదుషీమణి ఇంటికి కారులో రావడం, లోపలికి వెళ్ళడం, అంతా అక్కడి వారు గమనించేవారు. ఇది చూచే వాళ్ళకి ఎంతో హంగామాగా ఉండేది. అమె అసిస్టెంట్ కూడా సంగీతం పుస్తకం, పెన్ను పట్టుకు వచ్చేవాడు. పాఠం అయ్యేవరకు బయట బాల్కనీలో నుంచుని ఉండేవాడు. ఆమెకు పాఠం అవగానే పుస్తకం పట్టుకుని పెన్ను తీసుకుని వెళ్లి డోర్ తీసి పట్టుకుని నుంచుండేవాడు.

ఓ ఐదు నెలలు కాస్త పడి నేర్చుకున్నది. సెలవు నాడు డ్రైవర్ రాడు. అందుకని ఆ రోజు పంజాబీ డ్రస్ వేసుకుని స్కూటీపై వచ్చేది. ఆవిడ వెనకాల ఎవరో ఒకరు ఉండాలి, ఒంటరిగా వెళ్లకూడదు. శత్రువులు ఉంటారని భయం ఉంటుంది. కానీ అవేమీ పట్టించుకునేది కాదు.

నమ్రత భర్తకి అమె పరిస్థితి తెలుసు. ధ్యేయం, ధైర్యం రెండు తెలుసు. అందుకే ఆమె ఎక్కడ ఉంటే అక్కడ్నుంచే ఫైనాన్స్ బిజినెస్ చేసేవాడు. ఇప్పుడు అంతా కుగ్రామం మాదిరి అరచేతి వైకుంఠంగా మారింది.

రమణ యోగాభ్యాసంలో మంచి దిట్ట. గొప్పకవి కూడా. ఎప్పుడు మంచి పుస్తకాలు కొంటూ చదువుతూ కాలం గడిపేవాడు. చిన్న పిల్లాడు మాత్రం తల్లి కోసం మారాం చేస్తూ ఉంటాడు. పెద్దవాడు మాత్రం అర్థం చేసుకోగలడు.

మంచి సలహాలు ఇస్తు ఉండేవాడు. ఎందరివో జీవితాలు తన భార్య తీర్పుపై ఆధారపడి ఉంటాయి. అందుకు అమ్మని ప్రశాంతంగా ఉండనివ్వాలని పిల్లలకి చెపుతూ ఉంటాడు.

నమ్రత స్ర్తీల జీవితాలు అవపోసన పట్టింది. తన భావాలు భర్తకు చెప్పి ఒక స్నేహితుల మాదిరి మాట్లాడుకుంటూ ఉండేవారు. చాలా కుటుంబాల్లో భర్తతో గొడవలు పెట్టాలని ఇంట్లో వాళ్ళు ఆ మాదిరి ప్రయత్నిస్తూ ఉంటూ ఉంటారు. కుటుంబ సమస్యలపై ఎన్నో వ్యాసాలు రాసింది. ప్రతి ఉపన్యాసంలో ఈ అంశముపై చర్చ కూడా వచ్చింది. అసలు వాళ్ళకి బాధ లేకపోయినా, కొసరు వాళ్ళు గొడవ పెడుతున్నారు. ఈ విషయాలు ఆవేశంగా భర్తకి చెప్పాకా, అమె కొంచెం ఆవేశం తగ్గేది. ప్రతి రోజు ఒక గంట సంగీత సాధనలో సర్వం మరచి ప్రశాంత చిత్తం పొందుతుంది.

ఆ సాధనలో ప్రపంచాన్ని జయించగలిగే శక్తి వచ్చింది. హిందోళం, మోహన కల్యాణి, శంకరాభరణం, బిహాగ్ రాగాలు మరింత ప్రశాంతత నిస్తాయి. అందుకే పిల్లలకి కూడా మోహన రామ్, కళ్యాణ శ్రీనివాస్ పేర్లు పెట్టింది. చెల్లెలు పిల్లలకి కూడా అమృతవర్షిణి,  బైరవి మాళవిక అని పేర్లు పెట్టింది.

***

నమ్రత నిత్య జీవితంలో ఎంతో ఆలోచిస్తే కానీ న్యాయం చెప్పదు. ఇంటి నుంచి ఎటువంటి ఉద్వేగాలు,  బాధలు, బెంగలు ఉండకూడదు. అందుకే రమణ భార్యకు సంపూర్ణ సహకారం అందిస్తాడు. ముందడుగు వేయిస్తాడు. సంగీత సాధన ద్వారా ప్రశాంత చిత్తంతో తన లక్ష్య సాధన చేస్తే చాలు అని ఆనంద పడతాడు. అమె పురోగతిని మరింత మెచ్చుకుంటారు. ఇలాంటి భర్తలు చాలా తక్కువ ఉంటారు.

ప్రతి స్త్రీ తన ఉనికి చాటుకోవాలని, అత్తింట ప్రోత్సాహం ఉండాలి అని ఆశిస్తారు. స్త్రీ పుట్టింట ఎంత ఘనంగా ఉన్నా, ధోరణి అంతా అత్తింటిపై ఉంటుంది. ఎన్నో ఊహా సౌధాలు నిర్మిస్తుంది. సరి అయిన ప్రోత్సాహం లేక జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ అక్కరలేని బాధలు సమస్యలు మధ్యవర్తి వల్ల పడుతూ – జీవితంలో ఎంతో  సంక్షేమం కోసమే ఆలోచిస్తూ అత్తింటి ఆరట్లు పడుతుంది. అందరూ ఆమెకు కావాలి. అందుకే ఆమె అన్ని బాధలు పడుతుంది కానీ వాళ్ళకి ఈర్ష్య ద్వేషం పెంచుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు.

గార్డెన్ లోకి వెళ్లి కొత్త మొక్కలు చూసి ఆనంద పడింది. వేరు వేరు ప్రాంతాల నుంచి నర్సరీకి తెచ్చి అమ్ముతారు. అన్ని అంటూ మొక్కలు. తల్లి నుండి వేరుపడి ఇక్కడికి వచ్చాయి. వాతావరణం పడటం కోసం గ్రీన్ నెట్ పెట్టించి పందిళ్ళు వేశారు.  మరి అది జడ్జి గారు ఉండే క్వార్టర్. అక్కడ ఎన్నో రకాల మొక్కలు.

మరి మానవ జీవితం అంతే. మగ పిల్లలు సంపాదన కోసం విదేశాలకు వెడితే ఆడపిల్లలు అత్తింటికి వెడతారు. విదేశాలలో వాళ్ళు ఉండగలిగితే ఉంటారు, ఉండలేక పోతే కొంత సంపాదించుకుని వచ్చేస్తారు. కానీ ఆడపిల్ల పెళ్లి తరువాత అత్తింటిలో ఉండగలిగినా, ఉండలేకపోయినా తప్పదు. అయితే ఈ తరం స్త్రీలు అటు వంటిల్లు ఇటు ఉద్యోగాలు బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తూ అందరి విమర్శలు భరిస్తూ జీవన సాగరం నడుపుతున్నారు. అదే భర్త, అత్తవారు సహకరిస్తే అమె ఇంకెంతో ఎదుగుతుంది. సహకారం కోసం ఎదురుచూస్తుంది.

ఆవేశాలు ఆచరణలో పెట్టడం, ఆలోచించడం – అందులో న్యాయ దేవత స్థానంలో ఎంతో ఓర్పు నేర్పు సమతుల్యత సామరస్యం పాటించి వ్యవహరించడం నమ్రతకు అలవాటు. అన్ని ఉద్యోగాలలో ఈ తరహా  ఉద్యోగం చాలా కష్టం కూడా. రక రకాల అంశాలను ఎంతో చాకచక్యంగా అన్ని కోణాల్లో పరిశీలించి ఆలోచించి నిశితంగా పరిశోధించి పర్యవేక్షించి తీర్పు చెప్పాలి అందుకే నమ్రత సంగీత సాధన చేస్తుంది.

ఎంత తెలివి ఉన్నా ఆడవాళ్ళ జీవితం మరగుజ్జు మొక్కల్లా మిగిలి పోతోంది. అవి చూడటానికి ఎంతో అందంగా ఉంటాయి, కానీ దాని పెరుగుదల? ఎంతో శ్రద్ధగా తయారు చేస్తూ మొక్కను మంచి ఆకారంలో అందంగా పెంచాలి. ఒక శాస్త్రీయ పద్ధతిలో తయారు చేస్తారు. ఆడపిల్ల జీవితము అంతే, ఆమెకి ఇల్లు జీవితం సమాజంలో గౌరవం కోసం పుట్టిన దగ్గర నుంచి అడపిల్ల అంటూ సామాజిక భద్రత కోసం సమస్యలు రాకుండా పుట్టింటి గౌరవం మర్యాద పాటిస్తూ పెరుగుతుంది. పెద్ద చేసి ఒక అయ్య చేతిలో పెడతారు. అందుకే స్త్రీ జీవితం అత్తింటి వైపు మరలి వారు చెప్పినట్లు వింటు స్వతంత్ర భావాలు లేకుండా బ్రతకాలి.

ఒక గొంగళి పురుగు ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొని, మెటా మార్ఫాసిస్ ద్వారా సీతాకోకచిలుకగా మారి అందమైన వన్నెల రంగులతో తన జీవితాన్ని మార్చుకుంటుంది.

బంగారం అటు పోట్లు, సమ్మెట దెబ్బలు తిని కొలిమిలో వేడికి మిల మిలా మెరుస్తూ అందమైన ఆభరణంగా మారి ఆనందాన్ని ఇస్తుంది. స్త్రీ జీవితం కూడా ఉన్నతి స్థితిలో ఉండి కుటుంబం నడపడంలో అత్తింటి సహకారం కావాలి.

నమ్రత స్థాయిని బట్టి ఆమెకి ఎదురు చెప్పలేరు కానీ అందరి పరిస్థితి అలా ఉండదు. ఈ సమాజంలో నమ్రత లాంటి జీవితాలు అతి తక్కువ మందికి ఉంటాయి. ఎందుకు అంటే సమాజంలో స్త్రీ స్వయంగా సమస్య ఎదుర్కోవడం కష్టం. భర్త నుంచి తగిన ప్రేమ, ఆదరణ ఉన్నప్పుడు ఎన్నో విజయాలు సాధించగలదు. అమె తన జీవితాన్ని – వృత్తి రీత్యా పరుల న్యాయం కోసం వెచ్చించి, అందులో సక్సెస్ పొందింది. ఈ తరంలో ప్రతి స్త్రీ నమ్రత లాగానే ఆలోచిస్తుంది. వారిని ఉన్నతి లోకి తేవడం బాధ్యత కుటుంబం అందరిపైనా ఉన్నది. ముఖ్యంగా వెన్ను తట్టి ముందుకు నడిపే బాధ్యతలు అత్తింటి వారి అండ దండలతో కూడా ఉన్నది. ధీర వనితలు విజయం కోసం నిరంతరం శ్రమ పడతారు.

జీవన నాటకంలో ఎన్నో పాత్రలు మన చుట్టూ ఉన్న వ్యక్తులు. శ్రీ అన్నమయ్య శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తనలు సారాంశంలో ఉన్న నీతి నిజాయితీ జీవన విశేషాలు తెలుసుకుని మానవ జన్మ గొప్పతనం తెలుసుకుని జీవన గమ్యం చేరాలి. విజయం కోసం కృషి చెయ్యాలి. బెస్ట్ ఆఫ్ లక్ ధీర వనితామణి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here