[dropcap]కో[/dropcap]విడ్-19 టీకాలు ఎలా వచ్చాయన్న విషయమై తాను చదివిన పుస్తకాల ద్వారా గ్రహించిన విషయ సారాన్ని సంచిక పాఠకులతో పంచుకుంటున్నారు వీబీ సౌమ్య.
ఫైనాన్షియల్ టైంస్” 130 ఏళ్ళ చరిత్ర ఉన్న ప్రముఖ దినపత్రిక. వీళ్ళు ప్రతి ఏటా ‘పర్సన్ ఆఫ్ ద యియర్’ పేరిట ఒక అవార్డు ప్రకటిస్తున్నారు. ఇది సాధారణంగా రాజకీయ నాయకులకి ఎక్కువగా వెళ్తూ ఉంటుంది. దీని యాభై ఏళ్ళ చరిత్రలో ఒకటో అరో శాస్త్రవేత్తలకి ఇచ్చిన సందర్భాలూ లేకపోలేదు. అలాంటి ఒక సందర్భం 2020లో జరిగింది. ఫైనాన్షియల్ టైంస్ “పీపుల్ ఆఫ్ ద యియర్” అవార్డు శాస్త్రవేత్తలైన ఉస్లెం తురేచి, ఊర్ షాహిన్ అన్న భార్యాభర్తలకి లభించింది. వీరిద్దరూ కలిసి స్థాపించి, నిర్వహిస్తున్న జర్మన్ పరిశోధనా సంస్థ BioNTech 2020 చివరిలో అప్పటికే విచ్చలవిడిగా ప్రపంచంలో విధ్వంసం సృష్టిస్తున్న కోవిడ్-19 కి టీకా కనిపెట్టింది. ఇదే ఇపుడు ఫైజర్ వారి ద్వారా వివిధ దేశాలలో లక్షల కొద్దీ జనాభాకి అందిస్తున్నారు. అందుకే వారికి ఆ గౌరవం లభించింది. సరే, వ్యాధులన్నాక పరిశోధనలు చేస్తారు, మందులూ, టీకాలూ అన్నీ కనిపెడతారు. ప్రస్తుతం మన మధ్య తిరుగుతున్న కోవిడ్‌కి టీకా కనిపెట్టారన్న విషయం మినహాయిస్తే ఏమిటి ప్రత్యేకత?
సాధారణంగా ఒక కొత్త రోగానికి టీకా కనిపెట్టడం అంటే చాలా తతంగం ఉంది. మొదటి దశ అన్వేషణాత్మకంగా, ప్రయోగశాలల్లో జరుగుతుంది. పరిశోధనలే ప్రధానం ఇందులో. ఈ దశ ఫలితాలను బట్టి తరువాతి దశకి వెళ్ళగలిగే టీకా అభ్యర్థులని ఎంపిక చేసుకుంటారు. తరువాత ప్రీక్లినికల్ దశ – అంటే జంతువులపైన ప్రయోగాలు చేసుకుని మొదటి దశలో ఎంపిక చేసుకున్న టీకా అభ్యర్థులని బేరీజు వేసుకోవడం. ఇవి దాటుకుంటే ఇక క్లినికల్ ట్రయల్స్ – అంటే మనుషుల మీద ప్రయోగం – మూడు దశలలో క్రమంగా సాగుతుంది. వీటిలో ఫలితాలని – టీకా పని చేస్తుందా? సైడ్ ఎఫెక్ట్ లు ఉంటాయా? ఏ వయసు/ఆరోగ్య సమస్యల వారితో ఎంత బాగా పనిచేస్తుంది? ఇలాంటివి అన్నీ చూసి నిర్ణయిస్తారు. ఇదంతా విజయవంతంగా ముగిశాక గానీ టీకాలు అందరికీ ఇవ్వడానికి అనుమతి రాదు. ఈ తతంగం అంతా పూర్తవడానికి ఓ పది పదిహేనేళ్ళు పడుతుంది మామూలుగా. ఇదంతా అయ్యి అందరికీ టీకాలివ్వడం మొదలయ్యాక కూడా కూడా దాని ప్రభావాన్ని పరిశీలిస్తూనే ఉంటారు.
మరి అలాంటిది మొట్టమొదటి కోవిడ్-19 కేసులు 2019 డిసెంబర్‌లో వస్తే, పూర్తిగా సంవత్సరం తిరక్కుండా డిసెంబర్ 2020లో బ్రిటన్‌లో మొట్టమొదటి కోవిడ్ టీకా పోటు పడింది! ఆర్నెల్ల తర్వాత చూస్తే మన చుట్టు పక్కల ఎంతో మందికి కనీసం మొదటి డోసు టీకా పడింది. టీకా శాస్త్ర పరిశోధనల్లో ఇదో సంచలనం. టీకాల చరిత్రలో ఇంతకు ముందు వచ్చిన అత్యంత వేగవంతమైన టీకా 1967లో కేవలం నాలుగేళ్ళలో అందుబాటులోకి వచ్చిన గవదబిళ్ళల (Mumps) టీకా. మరి ఇపుడు ఇంత వేగంగా, ఇంత భారీ స్థాయిలో కోవిడ్-19 టీకాలు వచ్చేశాయి!
ఇంతదాకా చదివితే మూడు సందేహాలు కొంతమందికైనా వచ్చి ఉంటాయి:
అ) అన్నింటికీ పదేళ్ళు పట్టేది మరి ఇపుడు ఏడాదిలో అన్ని రకరకాల టీకాలు ఎలా అందుబాటులోకి వచ్చేశాయి?
ఆ) ఇన్ని రకరకాల టీకాలెందుకు? ఒకటి చాలదూ?
ఇ) చూడబోతే పరమ హడావుడిగా మార్కెట్లోకి టీకాలని దించారల్లే ఉంది. అసలు ఈ టీకాలు పనిచేస్తాయా? ఇవి వాడితే మనకేం కాదా?
ఈ ప్రశ్నలని చర్చించే ముందు అసలు ఇలాంటి రోగం ఒకటి వస్తే మన శరీరం ఎలా స్పందిస్తుంది? టీకాలు ఏం చేస్తాయి? అన్నది ఒకసారి చూద్దాము: కోవిడ్ వంటి సూక్ష్మక్రిములు ఏదో ఒక మార్గంలో మన శరీరంలోకి ప్రవేశించగానే జీవకణాలపై దాడి చేసి తమవంటి మరిన్ని సూక్ష్మక్రిములను పుట్టించుకుంటూ, వ్యాధిని సంక్రమింపజేస్తాయి. మనలోని వ్యాధినిరోధక శక్తి దీనిని నివారించడానికి తనకున్న వివిధ వనరులని వాడుకుంటుంది. ఒకసారి వ్యాధి వస్తే దాన్ని తగ్గించడానికి ఎలాంటి పోరాటం చేయాలో మన వ్యాధినిరోధక వ్యవస్థ తనకుతాను నేర్చుకోడానికి ప్రయత్నిస్తుంది. మళ్ళీ అదే వ్యాధి కారక క్రిములు (ఆంటిజెన్లు) మన శరీరంలోకి వస్తే గుర్తించి గతానుభవంలో తయారుచేసుకున్న ప్రతిరక్షక పదార్థాలను (ఆంటిబాడీలు) వాటి మీదకి వదిలి శరీరాన్ని రక్షిస్తుంది. టీకాలు చేసే పని వ్యాధి రాకుండానే మనకి ఈ విధమైన రోగనిరోధక శక్తి కలిగించడమే.
ఇక పైన ప్రస్తావించిన మూడు ప్రశ్నల సంగతి చూద్దాము.
ఏడాదిలో కోవిడ్ టీకాలు ఎలా వచ్చేశాయి?
ఇంత వేగంగా ఒక కొత్త వ్యాధికి టీకాలు రావడం అన్నది ఇంతకుముందు ప్రస్తావించినట్లు, కనీవినీ ఎరుగని పరిణామం. మరి ఇది ఎలా సాధ్యమైంది? నాకు అర్థమైనంతలో – రెండు ప్రధాన కారణాలు కనిపించాయి.
- ఈ టీకాల వెనుక కొన్ని దశాబ్దాలుగా సాగుతున్న శాస్త్ర సాంకేతిక పరిశోధనలు, వాటి ఫలితాలు ఉన్నాయి. ఎయిడ్స్, క్యాన్సర్ ఇలా అనేక ఇతర వ్యాధులకి మందులకోసం చేసే పరిశోధనలలో తెలుసుకున్న విషయాలు కూడా ప్రస్తుత టీకాల తయారీలో ఒక పాత్ర పోషించాయి. అలాగే, గతంలో వచ్చిన ఇతర కొరోనా వైరస్ల (సార్స్, మెర్స్ వంటివి) గురించిన అధ్యయనాలు కూడా ఇప్పటి టీకాల రూపకల్పనకు ఉపయోగపడ్డాయి. భవిష్యత్తులో ఈ మహమ్మారిపై మానవాళి సాధించిన విజయాల కథ రాస్తునపుడు ఈ చరిత్ర మర్చిపోకూడదనీ, శాస్త్ర పరిశోధనలని నమ్మి, నిలకడగా శాస్త్రవేత్తలకి సహకారం అందించడం వల్ల దీర్ఘకాలంలో సమాజానికి జరిగే హితమేమిటో గుర్తుంచుకోవాలనీ అమెరికన్ శాస్త్రవేత్త, అక్కడి ప్రభుత్వంతో కోవిడ్-19 విషయంలో దగ్గరగా పనిచేసిన డాక్టర్ ఆంథొనీ ఫౌచీ అభిప్రాయపడ్డారు.
- అమెరికా ప్రభుత్వం ఆధ్వర్యంలో 2020 మే నెలలో ప్రారంభించిన Operation Warp Speed కార్యక్రమం ఈ వేగంలో ప్రధాన పాత్ర పోషించింది. సాధారణంగా బోలెడు టీకా అభ్యర్థులని చూస్తే ఒకటి చివరి దాకా అన్ని పరిశోధనలూ దాటి మార్కెట్ రెడీగా నిలుస్తుంది. కానీ, ఈ కార్యక్రమం వివిధ పద్ధతులు వాడుతూ, వివిధ ఫార్మా కంపెనీలు పరిశోధనలు చేస్తున్న టీకా అభ్యర్థులని ఇంకా పూర్తిగా ఫలితాలు తెలియకముందే ఒకవేళ పనిచేస్తాయని తేలితే వెంటనే భారీ స్థాయిలో మార్కెట్లోకి తెప్పించేసేలా రూపొందించారు. ఇందువల్ల భారీగా ఖర్చైనా కూడా వాక్సిన్లు ఊహించినదానికంటే చాలా వేగంగా రావడం సాధ్యమైంది. ఆర్థిక సాయం ఒక్కటే కాక అనేక ఇతర విధాలుగా ఈ కార్యక్రమం అందించిన సహకారం అసలు భవిష్యత్తులో ఫార్మా/బయోటెక్ కంపెనీలు టీకా పరిశోధనలు చేసే పద్ధతినే ప్రభావితం చేయగలదని సైన్సు పాత్రికేయులు రాశారు.
ఇన్ని టీకాలెందుకు? ఒకటి చాలదూ?
జూన్ 2021 నాటికి కనీసం ఒక దేశంలో వాడుకకు అనుమతి లభించిన టీకాల సంఖ్య 18! ఇంకా కొన్ని వందలకొద్దీ టీకాలు వివిధ దశల పరిశోధనల్లో ఉన్నాయి. ఇది వింటే అసలు ఇన్నెందుకు? అన్న ప్రశ్న ఎవరికన్నా వస్తుంది.
టీకాల పని ఇందాక రాసినట్లు మనలో వ్యాధి నిరోధక శక్తిని కలిగించడం. దీనికి శాస్త్రవేత్తలు పలు మార్గాలనుకనిపెట్టారు. టీకాల గురించిన వికీపీడియా పేజి చూస్తే తొమ్మిది పద్ధతుల జాబితా ఉంది. వీటిలో మనకి వార్తల్లో కనబడే టీకాల పేర్లను బట్టి చూస్తే కోవిడ్‌కి ప్రధానంగా మూడు పద్ధతులు వాడినట్లు ఉన్నారు.
mRNA టీకా – ఇది కోవిడ్-19 వైరస్ నుండి వ్యాధి కారకమైన భాగాన్ని మనలోకి ఎక్కించి, దానిలాంటి ఒక హాని చేయని ప్రొటీన్‌ని చేయడానికి శరీరానికి సూచనలు అందిస్తుంది. దీని ద్వారా వ్యాధి నిరోధానికి కావాల్సిన పదార్థాలని శరీరం ఉత్పత్తి చేసుకుంటుంది. ప్రధానంగా ఉత్తర అమెరికా, యూరోపు లలో వాడుతున్న ఫైజర్, మాడెర్నా టీకాలు ఈ కోవకు చెందినవి.
వెక్టర్ టీకాలు (vector vaccines): ఇది బలహీనం చేయబడ్డ వేరే వైరస్‌ని కోవిడ్ వైరస్‌కి దగ్గరగా ఉండేలా మార్పులు చేసి తయారు చేస్తారు. ఈ వైరస్ పదార్థం వల్ల మనకే రోగమూ రాదు. మన వ్యాధి నిరోధక వ్యవస్థ ఈ పదార్థం, దీనితో పాటు టీకా ఇచ్చిన సూచనలను అందిపుచ్చుకుని వ్యాధినిరోధక పదార్థాలని ఉత్పత్తి చేసుకుంటుంది. భారతదేశంలో అత్యధికులకి ఇచ్చిన కోవిషీల్డ్, కొంతమందికి ఇచ్చిన స్పుట్నిక్, ఇతర దేశాల్లో వాడుతున్న జాన్సన్ అండ్ జాన్సన్ టీకాలు ఈ కోవకు చెందినవే.
ఇనాక్టివేటెడ్ టీకాలు (inactivated vaccines): ఇందులో క్రియారహితం చేయబడిన కోవిడ్ వైరస్‌ని ఇస్తారు. దీని వల్ల కూడా మనకి వ్యాధులేం రావు కానీ వ్యాధినిరోధక శక్తి వస్తుంది. భారతదేశంలో రూపొందించిన కోవాక్సిన్ ఇటువంటిదే.
ఇంకా ఇతర పద్ధతులు, వ్యాక్సిన్లు ఉన్నాయి. నాకు ఏ కాస్తో అర్థమైనవి, అవసరమనిపించినవి ఇక్కడ పంచుకున్నాను. పాయింటేమిటంటే – అన్ని టీకాలెందుకూ? మరి ఇన్ని రకరకాల పద్ధతులున్నాయి టీకా శాస్త్రంలో! ఒక్కోటీ ఒక్కో విధంగా వ్యాధిని నిరోధించడానికి ప్రయత్నిస్తుంది.
మరి ఇలా హుటాహుటిన మార్కెట్లోకి వదిలిన టీకాలు పని చేస్తాయా?
హుటాహుటిన వచ్చేశాయన్న మాట నిజమే కానీ అలాగని పద్ధతీ పాడూ లేకుండా వచ్చాయని కాదు. ఉదాహరణకి ఫైజర్ టీకాని తీసుకుందాం – రెండు మూడు క్లినికల్ ట్రయల్స్ అయ్యి వాటి ఫలితాల గురించి కొంత అవగాహన వచ్చాకే దానికి బైట మార్కెట్లో విడుదలకి అనుమతి లభించింది. తరువాత కూడా గర్భిణులు, పిల్లలు ఇలా వివిధ వ్యక్తులకి ఇవ్వొచ్చా లేదా, కొత్త వేరియంట్ల మీద ఎలా పనిచేస్తోంది? ఏ క్యాన్సర్ వంటి వ్యాధో ఉన్న వారికి ఇవ్వొచ్చా? ఇలాంటివి తెలుసుకోడానికి పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఆ పరిశోధనల ఫలితాలను బట్టి టీకాలకి అర్హులైన వారూ పెరుగుతున్నారు. కనుక పరిశోధనలన్నీ వేగవంతం చేసి అంతా శ్రమిస్తున్నారు, వివిధ ప్రభుత్వాల యంత్రాంగాలు కూడా ఈ యజ్ఞానికి పూర్తిగా సహకరిస్తున్నాయి అని అనుకోవచ్చు కానీ టీకాల నాణ్యతనూ, వైద్య ఆరోగ్య రంగాలలో ఇలాంటి పరిశోధనా ఫలితాలు జనం మధ్యకి విడుదల చేసేందుకు ఉన్న క్రమబద్ధీకరణ పద్ధతులనూ తప్పుపట్టలేమని నా అభిప్రాయం. కనుక నాకర్థమైనంతలో టీకా వేసుకోకపోవడం కంటే వేసుకోడమే ఉత్తమం.
ఈ రకరకాల టీకాలు అన్నీ ఒక్క విధంగా పనిచేస్తాయనీ, కొత్త కొత్తగా పుట్టుకొస్తున్న రూపాంతరాలు అన్నింటి నుండీ మనల్ని వందశాతం కాపాడతాయని చెప్పలేము. కానీ, ఏ టీకా వేసుకున్నా ఎంతో కొంత వ్యాధినిరోధకశక్తి వస్తుందనే శాస్త్రవేత్తల అభిప్రాయం. మరి ఆ శక్తి ఎన్నాళ్ళుంటుంది? అన్నది ప్రస్తుతానికి ఖచ్చితంగా జవాబు తెలియని ప్రశ్న. అయితే, టీకాలు ఇవ్వడం వేగం పుంజుకున్నాక యూఎస్, కెనడా, ఇజ్రాయెల్, యూకే ఇలా అనేక దేశాల్లో కేసులు, మరణాలు తగ్గడం, అలాగే కొన్ని చోట్ల నెమ్మదిగా పాత రోజుల వైపుకి సమాజం మరలడం చూస్తూ ఉంటే పనిచేస్తున్నట్లే ఉన్నాయి. ఈ విషయమై వివరంగా శాస్త్ర పరిశీలనలూ అవీ రావడానికి మరికొన్ని నెలలు పట్టవచ్చు – నాకింకా ఏవీ తారసపడలేదు. ఏదేమైనా, ఓ చిన్న సూదితో, అసలు ఉందో లేదో తెలియనంత ద్రవపదార్థమేదో శరీరంలోకి పోతే – అది ఇంత పెద్ద మహమ్మారి నుండి మానవాళికి ఎంతో కొంత రక్షణ కల్పించడం నా వరకు అద్భుతమే.
సైడ్ ఎఫెక్ట్స్: అయితే, ఈ టీకాల గురించి ఇంకా మనకి తెలియని విషయాలు బోలెడున్నాయి. ఉదాహరణకి అనుషంగ ప్రభావాలు (సైడ్ ఎఫెక్ట్స్). సాధారణంగా ఏ టీకాకన్నా కొన్ని ఇలాంటి ప్రభావాలు వస్తాయి. టీకా పోటు మన శరీరంలోకి వెళ్ళగానే తెల్ల రక్తకణాలు తమ పని చేసేందుకు బయలుదేరతాయి. ఇంజక్షన్ వేసిన ప్రాంతంలో సైటోకిన్లనే రసాయనాలని ఉత్పత్తి చేయడం మొదలుపెడతాయి. దీని వల్ల మనకి అక్కడ వాపు/నొప్పి, అలసట, కొంచెం జ్వరం, ఇలాంటి చిన్న చిన్న ప్రభావాలు కనబడతాయి. ఒకట్రెండు రోజుల్లో అవే తగ్గిపోతాయి. ఎక్కడో చాలా అరుదుగా ప్రమాదకరమైన, ప్రాణాంతకమైన ప్రభావాలు కూడా సంభవిస్తాయి కానీ అవి అసాధారణం. కనుక సగటున చూస్తే ఈ టీకాలు వేసుకోడం వల్ల ప్రమాదాలేం రావని చెప్పవచ్చు.
మామూలుగా చిన్న చిన్న అనుషంగ ప్రభావాలు వచ్చాయంటే టీకా పనిచేస్తుందని అర్థం చేసుకోవచ్చు. కానీ, ఈ ప్రభావాలు కొందరికి వస్తున్నాయి, కొందరికి రావట్లేదు. ఒక్కోరికి ఒక్కో రకమైనవి వస్తున్నాయి. కొందరికి మొదటి డోసుకి, కొందరికి రెండో డోసుకి. ఇలా ఎందుకుంది? ఈ ప్రభావాలు ఉంటేనే కోవిడ్ టీకాలు పని చేస్తున్నట్లా? ఈ ప్రశ్నలకి మన శరీరాలు వేరు, మన జన్యువులు, ఆహారపుటలవాట్లు, రోగనిరోధక వ్యవస్థలు వేరు – అన్న సమాధానం తప్ప అంతకంటే స్పష్టమైన శాస్త్రీయ వివరణలు ఇంకా లభ్యమవడం లేదు (వ్యాసం చివర్లో ఒక నేషనల్ జాగ్రఫిక్ వారి లంకె ఇచ్చాను. అందులో మరింత చర్చ ఉంది ఈ విషయమై). ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే – ఈ చిన్న చిన్న అనుషంగ ప్రభావాలు, అరుదుగానైనా సంభవించే తీవ్ర ప్రభావాలు – అన్నింటినీ శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు, పరిశోధిస్తున్నారు. టీకాలొచ్చేసినాయ్ అని ప్రశ్నించడం ఎవరూ ఆపలేదు.
ఇకపోతే పిల్లలకి ఎప్పుడిస్తారు? పిల్లలకి అసలు ఇది పని చేస్తుందా? చేటు చేస్తుందా? – ఈ ప్రశ్నలకంతా ఇంకా స్పష్టంగా జవాబు లేదు కానీ పరిశీలనలు జరుగుతున్నాయి. కాబట్టి, ఏడాది తిరక్కుండానే కోవిడ్ టీకాల పరంగా ఎంతో ప్రగతి సాధించినా, ఇంకా సాధించాల్సింది ఎంతో ఉంది. సైన్స్ ఆసరాతో త్వరలో ఈ చిక్కుముడులు విడిపోయి కోవిడ్-19 ని నెమ్మదిగా సాగనంపేస్తామని ఆశిద్దాము!
నాకు అర్థమైనంతలో ఇదీ ఇప్పటిదాకా కోవిడ్-19 టీకాల కథా, కమామిషూ. చెప్పుకోవాలనుకుంటే ఇంకా నేను వదిలేసినవి కొన్నీ, నాకు అర్థం కానివి బోలెడు, రాజకీయ ప్రభావం ఉన్నవి ఇలా బోలెడు ఉపకథలు ఉన్నాయి కానీ, ఈ వ్యాసం ఉద్దేశం ఒక పరిచయాన్ని ఇవ్వడమే. ఈ వివరాలతో మనకి అర్థమయ్యే భాషలో (అంటే జనం మాట్లాడే తెలుగులో) ఎవరో ఒక పుస్తకం రాస్తారు ఖచ్చితంగా. అపుడు మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు! ఇక నేనీ వ్యాసం రాయడానికి కారణం చెప్పి ముగిస్తాను: కొన్ని రోజుల క్రితం నేను ”మన దేశం లో టీకాల చరిత్ర” గురించి ఒక పరిచయ వ్యాసం రాసాను సంచికలోనే. అది చదివిన నా చిన్నప్పటి సైన్స్ టీచర్ నాకు కోవిడ్-19 టీకాల గురించి కూడా రాయమని సలహా ఇచ్చారు. దానితో నాకూ కొంచెం ఉత్సాహం వచ్చి ప్రయత్నిద్దాం అనుకుని ఈ వ్యాసం రాశాను. ఎప్పట్లాగే, తప్పులుంటే కింద వ్యాఖ్యల్లో తెలియజేయగలరు. స్వస్తి.
ఉపయుక్త వ్యాసాలు:
- Ball, P. The lightning-fast quest for COVID vaccines-and what it means for other diseases. Nature. Vol. 589, 16-18, (2021)
- Fauci, A.S. The story behind COVID-19 vaccines. Science, Vol. 372, Issue 6538, (2021)
- “COVID research: a year of scientific milestones” Nature news. May 2021.
- Understanding how COVID-19 Vaccines work (Centers for Disease Control and Prevention (CDC) వారి వ్యాసం).
- Vaccine Development, Testing, and Regulation (వ్యాక్సిన్ల చరిత్ర వెబ్సైటు వ్యాసం)
- Why vaccine side effects really happen, and when you should worry (National Geographic వారి వ్యాసం)
- COVID-19 Vaccine – Wikipedia