ఈజీగా ఇంగ్లీష్ ఛాప్టర్ 4

0
4

[dropcap]మీ[/dropcap]రు తెలుగు మీడియమా? అయితే ఇది మీ కోసమే. ఇకపై మీరు మాతృభాషలాగా ఇంగ్లీష్ మాట్లాడగలరు. MNC జాబ్ తెచ్చుకోగలరు.

~

మనం ఈ ఛాప్టర్‌లో చాలా ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటాము.

మొట్ట మొదట అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయమేంటంటే

  1. ఇంగ్లీష్ చాలా సులభమైన భాష. అందువల్లనే ఇంగ్లీష్ ప్రపంచ ప్రజలందరికీ దగ్గరయింది.
  2. ఇంగ్లీష్ చాలా సులభమైన భాష మాత్రమే కాదు, చాలా ముఖ్యమైన భాష
  3. సంస్కృతం వంటి ఎన్నో గొప్ప భాషలతో పోలిస్తే ఇంగ్లీష్ గొప్ప భాష ఏమాత్రం కాదు. ఇంగ్లీష్ భాష వయసు రెండు వేల సంవత్సరాలు కూడా ఉండదు.

కానీ ఇంగ్లీష్ భాష ప్రస్తుత కాలంలో అత్యంత అవసరమైనది. కాబట్టి ఉత్సాహంగా ఇంగ్లీష్ నేర్చుకుందాం.

కానీ ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే మనల్ని మనం కించపరచుకోవాల్సిన పని లేదు.

ఎట్టి పరిస్థితులలో ఇలా ఆలోచించకండి,”ఇంగ్లీష్ చాలా గొప్ప భాష, నేనేమి గొప్ప వాడిని కాను. నా సంస్కృతి గొప్పది కాదు, నా మాతృ భాష గొప్పది కాదు, నేను ఇంగ్లీష్ ఎన్నటికీ మాట్లాడలేను, ఇంగ్లీష్ మాట్లాడాలి అంటే చాలా అదృష్టం ఉండాలి, నేను తెలుగు మీడియం నుంచి వచ్చాను, నేను చిన్న ఊరి నుంచి వచ్చాను, నా ఫ్రెండ్స్ ఎవ్వరూ ఇంగ్లీష్ లో మాట్లడలేరు”

ఇవ్వాళ మీకు మన సబ్‌కాన్షస్‌ మైండ్ యొక్క గొప్పదనాన్ని చెప్పబోతున్నాను.

మిమ్మల్ని అన్ని అవరోధాలు దాటించి విజేతలుగా నిలబెట్టటానికి మీకు దేవుడు ఇచ్చిన గొప్ప వరం మీ సబ్‌కాన్షస్ మైండ్. మీరు ఏది అనుకుంటే అది సాధ్యం చేసి మిమ్మల్ని విజేతలుగా నిలబెట్టగలదు మీ సబ్‌కాన్షస్ మైండ్.

మీరేమి ఆలోచిస్తే అవే నిజమని నమ్మి, మీకు గొప్ప సహాయం చేస్తుంది మీ సబ్‌కాన్షస్ మైండ్.

డైరీ Vs సబ్‌కాన్షస్ మైండ్

“మీలో డైరీ వాసే అలవాటు ఎంత మందికి ఉంది?” ప్రశ్నించాడు రాజు

కొద్ది మంది చేయెత్తారు.

“గుడ్. డైరీలో ఏమి వ్రాస్తాము?” తిరిగి ప్రశ్నించాడు.

“ఏ రోజు చేసిన పనులు ఆ రోజు రాత్రి కానీ, మరుసటి రోజు ఉదయం కానీ వ్రాస్తాము” ఇందక చేయి ఎత్తిన కుర్రాళ్ళు సమాధానం చెప్పారు.

“గుడ్. నేను ఇటీవల ఒక ఇంగ్లీష్ ఫాంటసీ సినిమా చూశాను. అందులో హీరోకు ఒక అద్భుతమైన ఇల్లు దొరుకుతుంది. ఆ ఇంట్లో ఒక గది ఉంటుంది. ఆ గదిలోకి వెళ్ళి మనం ఏమి కోరుకుంటే అవి క్షణాల్లో నిజమై కూర్చుంటాయి. అవి నిజంగానే జరుగుతాయి. అలాగే ఒక కొరియన్ ఫాంటసీ సినిమా చూశాను. అందులో హీరోకి ఒక అద్భుతమైన నోట్ బుక్ దొరుకుతుంది. అందులో అతను ఏమి వ్రాస్తే, అవి నిజంగా జరుగుతాయి.

నిజానికి ఇవేవి ఫాంటసీలు (అద్బుతమైన ఊహాజనితాలు) కావు.

మన సబ్‌కాన్షస్ మైండ్‌కి ఇలాంటి అద్బుతాలు చేసే శక్తి ఉంది. మనం ఏదయినా బలంగా అనుకుంటే అవి నిజం అవుతాయి. అది ఈ సబ్‌కాన్షస్ మైండ్ చేసే పని.

మన కాన్షస్ మైండ్‌కి లాజిక్ ఉంటుంది. ఇది ప్రతి దానిని ‘ఎందుకు, ఎలా?’ అని ప్రశ్నించి మనల్ని ముందుకు కదలనీయదు. మనచే అద్భుతాలు చేయనివ్వదు. అందుకే మీరు అవరోధాలు ఎదుర్కోకుండా విజయం సాధించాలి అంటే మీ సబ్‌కాన్షస్ మైండ్‌కి పగ్గాలు అప్పగించాలి.

మీరు జరిగిపోయిన విషయాలు డైరీలో వ్రాసుకుంటారు.

భవిష్యత్ ఎలా ఉండాలి అని ప్లాన్ చేసుకుంటున్నారో అది మీ సబ్ కాన్షస్ మైండ్ లో వ్రాసుకోవచ్చు.

డైరీలో గతం, సబ్‌కాన్షస్ మైండ్‍లో మీ భవిష్యత్ ప్లానింగ్ వ్రాసుకోవాలి.

మీ జీవితం ఎలా ఉండాలి అన్న విషయాల్ని మీ సబ్‌కాన్షస్ మైండ్‌లో వ్రాసుకుంటే, సరిగ్గా మీరు వ్రాసుకున్న ప్రకారమే జరిగి తీరుతుంది.

ఇది గ్యారంటీ.

మీ సబ్‌కాన్షస్ మైండ్ కి పగ్గాలు అప్పజెప్పాక, మీకు అపజయం అనేది ఉండదు.

తెలుగు మన మాతృభాష అయినందుకు మనం గర్వించాలి. ఇంకో ముఖ్యమైన విషయం చెప్పనా, తెలుగు వారికి ఇంగ్లీష్ నేర్చుకోవటం చాలా సులభం. మనకు స్పష్టమయిన ఉచ్చారణ ఉండటం వల్ల ఇంగ్లీష్ చాలా సులభంగా అలవడుతుంది.

మీరు ఇంగ్లీష్‌లో ఫ్లూయెంట్‌గా మాట్లాడగలగాలి అంటే, మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉండాలి.

మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉండాలి అంటే, మిమ్మల్ని మీరు ప్రేమించాలి.

మిమ్మల్ని మీరు ఎన్నడు కించపరచకోరాదు.

ఇంగ్లీష్‌ని ఇష్టపడండి, ఇంగ్లీష్‌ని ప్రేమించండి, కానీ మిమ్మల్ని మీరు కించపరచుకుని, మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకుంటే ఇంగ్లీష్ మీకు దూరమవుతుంది. ఎందుకంటే మిమ్మల్ని గూర్చి మీరు అనుకునే ప్రతి మాట నిజం అనుకుంటుంది మీ సబ్‌కాన్షస్ మైండ్.

‘ఇంగ్లీష్ నేర్చుకుంటే నాకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, ఇంగ్లీష్ వల్ల నాకు వ్యాపారం అభివృద్ది అవుతుంది. ఇంగ్లీష్ ముఖ్యమైన భాషే కానీ నా మాతృ భాషకంటే గొప్పదేమి కాదు, నేను ఇంగ్లీష్ భాషని సునాయాసంగా నేర్చుకోగలను, ఇంగ్లీష్‌లో నేను చాలా సులభంగా మాట్లాడగలను, నాకు ఇంగ్లీష్ ఒక లెక్కే కాదు’ ఇలా అనుకుంటే మీకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కలగదు.

ఇవ్వాళ్టి క్లాసులో సబ్‌కాన్శస్ మైండ్ ని మనకు అనుకూలంగా ఎలా మలచుకోవాలి అన్న విషయాల్ని ప్రస్తావిస్తాను.

చాలా అనుభవమున్న ఫ్రొఫెసర్‌లా చెప్పుకుపోతున్నాడు రాజు.

***

“మనకు ఏ భాషలో ఎక్కువ పదాలు తెలుసు, తెలుగులోనా ఇంగ్లీష్ లోనా?”

మరుసటి రోజు సెషన్ ప్రారంభించే మరలా ఒక సారి ప్రశ్నించాడు రాజు.

“మాకందరికీ ఇంగ్లీష్ లోనే ఎక్కువ పదాలు తెలుసు” అందరూ ఒక్కసారిగా గట్టిగా గొంతెత్తి సమాధానం చెప్పారు.

“వెరీ గుడ్ మైడియర్ ఫ్రెండ్స్. నిన్నటి కన్నా మీ అందరిలోనూ కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. మీ విజయానికి ప్రధానంగా కావాల్సింది ఇదే.

ఎప్పుడు ఉత్సాహంగా ఉండటం, నేను గెలుస్తాను అన్న నమ్మకంతో ఉండటం, హాయిగా గొంతెత్తి మాట్లాడటం, ఆత్మ విశ్వాసంతో కూడిన బాడీ లాంగ్వేజి, అత్మస్థైర్యం వెల్లడి చేస్తూ మాట్లాడటం ఎప్పుడు మనం వదిలిపెట్టకూడదు.

మనం నిరుత్సాహంగా ఉన్నప్పుడు చేయాల్సింది ప్రధానంగా చేయాల్సిన పనులు రెండు, అవేమిటి అంటే

  • మన ఎనర్జీని మార్చుకోవటం
  • మన భాషని మార్చుకోవటం

మొదటి పాయింట్, మీ ఎనర్జీని ఎక్కువ చేసుకోవాలి అంటే, వీలయినంత వరకు సెల్ ఫోన్ అడిక్షన్‌కి దూరం అవండి.

మీకు నిరాశగా ఉన్నప్పుడు కాస్తా స్థలం మారండి. అంటే నా ఉద్దేశం అందరూ ఊర్లు మారాలి అని కాదు. మీకు అనుకూలమైన పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చే స్థలానికి వెళ్ళండి. అది గుడి కావచ్చు, స్నేహితుడి ఇల్లు కావచ్చు, పార్క్ కావచ్చు. యోగా సెంటర్ కావచ్చు.

అలా స్థలం మారాక, నలుగురితో కలిశాక మీకు, నిరాశ పోయి కాస్తా ఉత్సాహం వస్తుంది.

కాసేపు మీకు బాగా అలసట కలిగే పనులు చేయండి. వేగంగా నడవటం కావచ్చు, డాన్స్ కావచ్చు, ఎక్సర్‍సైజులు చేయటం కావచ్చు, ఇలా చేసిన తర్వాత మీలో తక్షణం కొత్త శక్తి వస్తుంది. నిరాశ తాలుకు నెగెటివ్ వైబ్రేషన్స్ వెళ్ళిపోతాయి.

నాకు ఊరు మారటం కల్సి వచ్చింది. అదే విధంగా రాయల్ సాఫ్ట్ స్కిల్స్ క్యాంపస్‌లో ప్రతి రోజు క్లాసు ప్రారంభం అయ్యే ముందు మాతో తీవ్రంగా అలసట కలిగేలా గేమ్స్ ఆడించేవారు. నేను మొదట్లో నవ్వుకొనే వాడిని. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులో చక్కగా గ్రామర్, ఇంగ్లీష్ వాక్యాలు చెప్పి వదిలేయకుండా ఏమిటి ఈ హడావుడి అని. కానీ నాలో కలుగుతున్న మార్పులు చూశాక నాకు అర్థం అయింది. వారు అక్కడ ఏదీ కూడా ఉత్తినే చేయించటం లేదని.

ఇక రెండవ పాయింట్, మీ భాషని మార్చుకోవటం. అంటే, తెలుగు వదిలి హిందీలోనో, తమిళ్ లోనో మాట్లాడమని కాదు నా ఉద్దేశం. మీ భాషలో ఎటువంటి నెగెటివ్ పదాలు రాకుండా జాగ్రత్త పడండి. నేను తప్పకుండా ఇంగ్లీష్ మాట్లాడగలను. నేను తప్పకుండా ఇంటర్వ్యూలలో గెలుపొందుతాను, నా ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్‌ని నేను తప్పకుండా మెరుగు పరచుకోగలను. అని మీరు ఎప్పుడు కూడా పాజిటివ్‌గా మాట్లాడటం ప్రాక్టీస్ చేయాలి.

ఈ రెండు స్టెప్స్ చాలా ముఖ్యమైన స్టెప్స్.

మనం ఇంగ్లీష్‌లో ఎందుకు మాట్లాడలేకపోతున్నాము తెలుసా? మనం ఇంగ్లీష్‌లో మాట్లాడలేకపోతున్నాము అంటే దానికి అర్థం ఇంగ్లీష్ కష్టం అని కాదు.

సమస్య ఇంగ్లీష్ లో కాదు. మన మనస్సులో ఉంది.

అందుకే ఇంగ్లీష్ నేర్చుకోబోయే ముందు, ఒక సెషన్ మొత్తం మానసిక అంశాల గూర్చి చెపుతాను. అప్పుడు మీకు సులభంగా విషయం అర్థం అవుతుంది.

మీరు మీ జీవితాల్ని చిటికెలో మార్చుకోగలరు. జీవితంలో గొప్ప మార్పులు రావాలి అంటే సంవత్సరాలు, నెలలు, రోజులు అక్కరలేదు.

మీ జీవితంలో అతి గొప్ప మార్పు రావాలి అంటే ఒక సంవత్సరమో, ఆరు నెలలో, నెలో అక్కరలేదు. బలంగా మీరు నిశ్చయం తీసుకుంటే, ఒక్క క్షణం చాలు మీ జీవితంలో మార్పు తెచ్చుకోవచ్చు.

“నేనీ క్షణం నుంచి ఇంగ్లీష్ మాత్రమే మాట్లాడతాను” అని బలంగా నిశ్చయం తీసుకోండి. ఇందుకు ఎవ్వరూ సాక్షం ఉండనక్కరలేదు. మీకు మీరే సాక్షి.

ఏదో నా కండ్ల ముందర నన్ను తృప్తి పరచటానికి నా ముందున్నంత సేపు మాత్రమే ఇంగ్లీష్ మాట్లాడి, బయటకి వెళ్ళిన మరుక్షణం నుంచి మళ్ళీ తెలుగులో మాట్లాడారు అనుకోండి ఏమి లాభం?

ఈ ప్రపంచంలో నన్ను మార్చగలిగేది నేను మాత్రమే.

నిన్ను మార్చగలిగేది నువ్వు మాత్రమే.

ఇవ్వాళ్టి సెషన్ ఇంట్రడక్టరీ సెషన్.

రేపటి నుంచి ఒక అయిదు రోజులు బూట్ కాంప్ ఉంటుంది.

ఆ తరువాత మన ఇంగ్లీష్ సెషన్స్ సరిగ్గా ముఫై రోజులు ఉంటాయి. ఈ ముఫై రోజులు నేను చెప్పినది చెప్పినట్టు మీరు పాఠిస్తే మీకు తప్పక ఇంగ్లీష్లో ఫ్లూయెంట్‌గా మాట్లాడటం వస్తుంది.

రేపటి నుంచి అయిదు రోజులు బూట్ క్యాంప్ ఉంటుంది.

బూట్ క్యాంపు ఏమిటి అని మీరు ఆశ్చర్య పోతు ఉండవచ్చు. ఇది ఆర్మీలో వాడే పదం. ఇది నేను కూడా రాయల్ సాఫ్ట్ స్కిల్స్ క్యాంపస్‌లో నేర్చుకున్నదే. ఈ అయిదు రోజుల బూట్ క్యాంపులో మనం ఇంగ్లీష్‌లో మాట్లాడటానికి మానసికంగా సిద్ధమవుతామన్న మాట.

మనల్ని మనం కించపరచుకుంటూ ఇన్ని సంవత్సరాలు మనం మన సబ్ కాన్షస్ మైండ్ ని అయోమయంతో నింపేశాము.

నిజానికి ఇంగ్లీష్‌లో మాట్లాడలేకపోవటం అన్నది భాషకు సంబంధించిన సమస్య కాదు. మనల్ని విజేతలుగా మార్చగలిగే మన సబ్‌కాన్షస్ మైండ్‌ని మనం గందరగోళ పరచి మనం దీన్ని మానసిక సమస్యగా మార్చుకున్నాము. ఈ అయిదు రోజుల బూట్ కాంప్‌లో మీ సబ్‌కాన్షస్ మైండ్‌పై పడ్డ అనేక నెగెటివ్ సూచనల్ని తొలగించి, మిమ్మల్ని విజేతలుగా మార్చటానికి మొదటి అంకం ప్రారంభం చేస్తానన్నమాట.

అంతేకాదు, ఈ బూటు క్యాంపులో మనం అనేక విషయాలు తెల్సుకుంటాము.

ఇంత సులభమైన ఇంగ్లీష్ భాషని మనం ఎందుకు ఈజీగా మాట్లాడలేక పోతున్నాము, దాని వెనుక ఉన్న కారణాలు ఏమిటి, మన విద్యా వ్యవస్థ మనల్ని ఇంగ్లీష్‌లో మాట్లాడనీయకుండా ఎలా అడ్డుపడింది అన్న అంశాలు కూడా తెల్సుకుంటాము.

ఇంగ్లీష్ మీడియంలోనే చదివిన కుర్రాళ్ళు, ఎంఏ ఇంగ్లీష్, ఇంగ్లీష్‌లో డాక్టరేట్ చేసి, ఇంగ్లీష్ సబ్జక్టులో లెక్చరర్స్‌గా పనిచేసే వారు కుడా ఎందుకు ఇంగ్లీష్‌లో సులభంగా మాట్లాడలేక పోతున్నారు అన్న అంశాలు తెలుసుకుంటాము. అందరూ సిద్దమేనా?”

రాజు ఇంగ్లీష్‌లో మాత్రమే మాట్లాడుతున్నాడు. అతను చెప్పే ప్రతి మాట సులభంగా అందరికీ అర్థం అవుతోంది.

వారందరికీ అర్థం అవుతోంది. వాతావరణం క్రమక్రమంగా వేడి ఎక్కుతోంది అని, రాజు తప్పకుండా తమ అందరితో ఇంగ్లీష్‌లో సులభంగా మాట్లాడించటానికి కంకణం కట్టుకున్నాడని అర్థం అయింది అందరికి. రాయల్ సాఫ్ట్ స్కిల్స్ క్యాంపస్‌లో కేవలం ఒక నెల రోజులు క్లాసులు అటెండ్ అయిన రాజు ఎలాంటి మార్పు (ట్రాన్స్ఫర్మేషన్) పొందాడో కళ్ళార చూస్తున్న వారందరికీ రాజును చూస్తుంటే చాలా ఆప్యాయంగా అనిపిస్తోంది.

“ఇప్పుడు నేను కొన్ని మంత్రాలు చెపుతాను. అందరూ ఒక సారి లేచి నిలబడండి” రాజు గొంతు ఖంగున మ్రోగింది గదిలో.

ఆశ్చర్యపోవటం అందరి వంతయింది. ‘మంత్రాలేమిటి’ అని అందరూ తమలో తాము తర్జనభర్జనలు పడ్డారు.

“మైడియర్ ఫ్రెండ్స్, నేను ఇందాకే చెప్పినట్టు ఈరోజు కేవలం ఇంట్రడక్షన్ (ఉపోద్ఘాతం) మాత్రమే. రేపటి నుండి అయిదు రోజులపాటు బూట్ క్యాంప్ ప్రారంభం అవుతుంది. ఈ వేళ్టి నుండి, ప్రతి రోజు సెషన్ ప్రారంభం అవటానికి ముందు, సెషన్ ముగిసిన తర్వాత నేను కొన్ని మంత్రాలు చెబుతాను.

ఈ మంత్రాలు ఏ మత విశ్వాసానికి సంబంధించినవి కావు. ఇవి మీ విజయానికి సంబంధిచినవి. వీటిని ఇంగ్లీష్ సెల్ఫ్ అఫర్‍మేషన్స్ అంటారు. రేపు బూట్ కాంపులో మొదటి రోజు. నేను మీకు సబ్‍కాన్షస్ మైండ్ అంటే ఏమిటి దాని యొక్క ప్రాధాన్యత ఏమిటి అన్నది తెలుసుకుందాము.

మనం జీవితంలో ఏమి సాధించాలి అన్నా మన సబ్‌కాన్షస్ మైండ్ దగ్గర పరిష్కారం ఉంటుంది.

జీవితంలో గెలుపొందే వారంతా తమ సబ్‌కాన్షస్ మైండ్‌ని పూర్తిగా తమ అదుపాజ్ఞలలో పెట్టుకుని విజయం సాధించారు. అలా కాకుండా లాజిక్‌ని ఉపయోగించి సబ్‌కాన్షస్ మైండ్‌ని శంకించి దాని యొక్క పూర్తి సాయాన్ని పొందలేక పోయిన వారంతా పరాజితులుగా మిగిలిపోతారు.

మనం ఎన్నో విజయాలు సాధించగలం. కానీ మనల్ని విజేతలుగా అవకుండా మనల్ని మనమే అడ్డుకుంటున్నాము.

మనం ఎప్పటికీ విజేతలుగా ఉండి పోవటానికి ఇప్పుడు నేను మీకు తెలపబోయే మంత్రాలను నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రాలు అందరూ పెద్ద గొంతుతో, మీకున్న శక్తినంతా ఉపయోగించి గట్టిగా అరిచి చెప్పాలి. మనం ఇకపై రాగల ముప్ఫై అయిదురోజులూ ప్రతి రోజు మన క్లాస్ ప్రారంభం అవబోయే ముందు, క్లాసు అయ్యాక ఈ విజయ మంత్రాలని ఇలాగే పెద్ద గొంతుతో అరచి చెప్పుకుందాం.

అందరికీ ఈ ప్రక్రియ ఉత్సాహంగా అనిపించింది.

తను ముందే ఏర్పాటు చేసిన ప్రొజెక్టర్ ద్వారా, వేదిక మీద ఉన్న తెల్లటి గోడపై ఇలా అక్షరాలు పడ్డాయి.

English is Easy

English is Fun

***

I am lovable

I am capable

I am important

***

I can Speak

I can Win.

ఒక్కో వాక్యాన్నీ పెద్ద గొంతుతో రాజు మూడు సార్లు ఉఛ్చరించాడు.

ఆ తరువాత అందరి వంకా కాసేపు చూస్తుండి పోయాడు. ఆ తరువాత చిరునవ్వుతో అందర్నీ కూచోమని చెప్పాడు. ఆ తరువాత గొంతు సవరించుకుని చిన్నగా చెప్పటం మొదలెట్టాడు.

“రాయల్ సాఫ్ట్ స్కిల్స్ క్యాంపస్‌లో నాకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయో, నేను అక్కడ ఏమేమి చూసి నేర్చుకున్నానో అవన్నీ మీకు నేను నేర్పిస్తాను. ఇందాక మనం చెప్పుకున్న ఈ వాక్యాలని అక్కడ క్యాంపస్‌లో విజయ మంత్రాలు లేదా రాయల్ మంత్రాలు అనే వారు.

ప్రతి రోజు క్లాస్ మొదలవటానికి ముందు, క్లాసు అయ్యాక అందర్నీ నిలబెట్టి గట్టిగా ఈ మంత్రాలని మాతో వల్లే వేయించే వారు. మంత్రాలకు చింతకాయలు రాలతాయా అని నవ్వుకునే వాడిని మొదట్లో. కానీ, ఈ మంత్రాలని ’సెల్ఫ్ అఫర్మేషన్స్ అంటారని’ మనల్ని విజేతలుగా నిలబెట్టే మన సబ్ కాన్షస్ మైండ్ వీటి సాయంతో మన కలలన్నింటిని నిజం చేస్తుందని తెలుసుకున్నాను.

***

“అసలు నీవు చాలా మారిపోయావు రాజు. అసలు నువ్వూ మా రాజువేనా, లేదా ఏదైనా పెద్ద యూనివర్శిటీ ఫ్రొఫెసరా అన్న అనుమానం కలుగుతోంది” అని సరదాగా అన్నాడు ప్రసాద్.

“ఒరే ప్రసాద్, నేను అక్కడ ఒక నెలరోజులు చూసి నేర్చుకున్నది చెపుతుంటేనే నువ్వు ఇంత ఇది అవుతున్నావు. అక్కడ మా డైరెక్టర్ వివేకానంద్ రాయపెద్ది గారి క్లాసులు, ఇతర సీనియర్ ఫాకల్టీ క్లాసులు వింటే నీవు ఎలా ఫీలవుతావో” అన్నాడు రాజు.

“నిజమే” తల పంకించాడు ప్రసాద్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here