[box type=’note’ fontsize=’16’] దాదాపుగా అయిదువందల ఏళ్ళ నిర్విరామ పోరాటఫలితంగా అయోధ్యలో రామజన్మభూమి భవ్యమందిర నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఆ సందర్భంగా, అసలు ఈ దేశానికి శ్రీరామచంద్రుడు ఆత్మగా ఎలా ఎదిగేడు? ఎందుకని నోరుండి మెదడులేని ప్రతివాడూ వివేచనాశూన్యంగా శ్రీరామచంద్రునికి వ్యతిరేకంగా దుర్వ్యాఖ్యలు చేస్తూ ప్రజల దృష్టిలో రాముడిని కించపరచి తక్కువ చేయాలని చూస్తున్నారు? ఇలాంటి అనేక చారిత్రిక, ధార్మిక, సామాజిక, రాజకీయ ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించే ప్రయత్నం శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న ఈ వ్యాస పరంపర. [/box]
[dropcap]వా[/dropcap]ల్మీకి రామాయణంలో మనకు ప్రధాన రాజ్య వ్యవస్థలు.. ప్రధాన నగరాలు మూడు కనిపిస్తాయి. ఒకటి కోసలరాజ్యం, దాని రాజధాని అయోధ్య, రెండు కిష్కింధ రాజధాని కిష్కింధ, మూడు రావణుడి లంక రాజధాని లంక. ఈ మూడు మూడు రకాల రాజ్య వ్యవస్థలు. వీటిలో అయోధ్య, లంక గురించిన వర్ణన మనకు రామాయణంలో విస్తృతంగా, వివరంగా కనిపిస్తుంది. ఈ రెండు నగరాలు అద్భుతమైన ఆర్కిటెక్చర్‌కు ప్రతీకలుగా నిలిచాయి. మనం రామాయణం అంటే.. రాముడు పుట్టడం.. సీతను పెండ్లాడటం, ఆమెను రావణుడు ఎత్తుకుపోవడం, రాముడు అతడిని వధించి భార్యను తీసుకొచ్చేయడం అని మాత్రమే అనుకొంటాం.. అనుకొంటున్నాం కూడా. మన అద్భుత చరిత్రకారులు రామాయణాన్ని, భారతాన్ని చరిత్రగా పరిగణించకపోవడం వల్ల ఆ రెండు ఇతిహాసాలు కూడా మిథ్యాగాథలుగా మారిపోయాయి. వాటిలోని కొన్ని పాత్రలకు దివ్యత్వాన్ని జోడించడంతో అమ్మమ్మలు, నానమ్మలు పిల్లలకు చెప్పే కథలుగా తయారయ్యాయి. భారతదేశంలో ఏ ఒక్క పాలకుడు సైతం ఈ రెండు ఇతిహాసాలను చారిత్రక దృక్పథంతో చూడటానికి ఈషణ్మాత్రమైనా ప్రయత్నించలేదు. ఈ కారణంగానే రామాయణం లోతుల్లోకి చొచ్చుకొని పోయి కొంత విస్తారంగా చర్చించాల్సి వస్తున్నది.
అయోధ్య.. ఈ నగరం ఎక్కడ ఉన్నది? ఎలా ఉండేది? దాని నిర్మాణం, ఆర్కిటెక్చర్, టౌన్ ప్లానింగ్ వంటివి ఏ విధంగా ఉన్నాయి. ఈ అంశాలపై చాలా చాలా పరిశోధనలే జరిగాయి. ముఖ్యంగా ఉత్తరభారతంలో కొందరు ఔత్సాహిక పరిశోధకులు.. బ్రిటన్, ఆస్ట్రేలియా, జర్మనీలోని సంస్కృత పరిశోధకులు అయోధ్య, లంకా నగరాలపై పరిశోధన చేశారు. రెండూ అద్భుత నగరాలే. నేటి ఆర్కిటెక్ట్‌లను విస్మయపరిచే రీతిలో ఉన్న నైపుణ్య నిర్మాణాలు. ముఖ్యంగా అయోధ్య నగర వర్ణన.. వాల్మీకి రామాయణంలోని బాలకాండ, అయోధ్య, యుద్ధకాండలో కనిపిస్తుంది.
‘అయోధ్యా నామ్ నగరీ, తత్ ఆసీతు విశ్రుతా..
మనూనా మానవేంద్రేణ యా పురీ నిర్మితా స్వయమ్..’
అని వాల్మీకి అన్నాడు. రాముడి పూర్వీకుడైన మను చక్రవర్తి ఈ నగరాన్ని నిర్మించాడని దీని అర్థం. ఈ నగరం కోసల దేశానికి రాజధానిగా ఉన్నది. ఈ కోసల దేశం సరయూనది తీరంలో ఉన్నది. ఈ సరయూ నది ప్రస్తుత భారతదేశంలో ఉత్తర పద్రేశ్‌లో ఉన్నది. ఇంతకీ అయోధ్య నగరమా, పట్టణమా, గ్రామమా? అంటే ‘ఏ ఒక్కటీ కాదు.. అన్నీ అవును’ అని చెప్పాల్సి ఉంటుంది. అయోధ్యలో గ్రామీణ ప్రాంతాలున్నాయి. వ్యవసాయ క్షేత్రాలున్నాయి. అర్బన్ ఏరియాలూ ఉన్నాయి. అన్నింటికి మించి రాజధాని నగరంగా కూడా మనుగడ సాగించింది.
ఈ చిత్రం ప్రస్తుతం మనకు కనిపించే అయోధ్య నగరం. ఉత్తర ప్రదేశ్‌లోని ఫైజాబాద్ జిల్లాలో నిన్న మొన్నటిదాకా భాగంగా ఉన్న నగరమిది. ఇప్పుడు ప్రత్యేక జిల్లాగా అవతరించింది. ఈ నగరాన్ని ఆనుకొనే సరయూ నది ప్రవహిస్తున్నది. ఈ అయోధ్య కోసల రాజ్యానికి రాజధాని నగరంగా విలసిల్లింది.
కోసలో నామ ముదితః స్ఫీతో జనపదో మహాన్
నివిష్ట్ సరయూ తీరే ప్రభూత్ ధన ధాన్యవాన్..
అని కోసల రాజ్యాన్ని వాల్మీకి అభివర్ణించాడు. ధనధాన్యములతో తులతూగుచూ నిత్య సంతుష్టులైన ప్రజలు గల కోసలమనే గొప్ప దేశము సరయూ నదీతీరంలో ఉన్నది. ధనము, ధాన్యము రెండూ ఉన్నాయని ప్రత్యేకంగా వాల్మీకి ప్రస్తావించాడు. భారతదేశంలో ధనముతోపాటు, ధాన్యము కూడా సంపదతో సమానమే. అంటే వ్యవసాయానికి ఉన్న ప్రాధాన్యమది. ఇవాళ వ్యవసాయాన్ని ఏ విధంగా ట్రీట్ చేస్తున్నామో మనం చూస్తూనే ఉన్నాం. ఈ రాజ్యంలో అయోధ్య అనే ప్రసిద్ధమైన నగరం ఉన్నది.. కోసల దేశానికి చెందిన రాజు దశరథుడు ఈ నగరంలో నివసిస్తున్నాడు అని మాత్రమే వాల్మీకి రాశాడు. నేటి పరిభాషలో రాజధాని అన్న పదాన్ని వాల్మీకి ఇక్కడ ఉపయోగించలేదు. రాజుగారు నివసిస్తున్న నగరమని మాత్రమే పేర్కొన్నాడు. రాజుగారు ఉంటారు కాబట్టి రాజధాని అన్న మాట వచ్చిందేమో.. తెలియదు. కోసలదేశం ఎంత పటిష్ఠంగా, దుర్భేద్యంగా నిర్మించారో తెలుసుకుంటే ఆశ్చర్యమేస్తుంది.
అయోధ్య నగరం 12 యోజనాల పొడవు, 3 యోజనాల వెడల్పుతో నిర్మాణమైనదని వాల్మీకి పేర్కొన్నాడు. ఈ యోజన పరిమాణం 12 కిలోమీటర్లతో సమానమని కొందరి లెక్క. మరికొందరు దీని ప్రమాణం 12 కిలోమీటర్ల కంటే తక్కువగా ఉంటుందని చెప్తారు. ఈ లెక్కలో స్పష్టత రావాల్సి ఉన్నది. ఏమైనప్పటికీ, వాల్మీకి ఈ నగరాన్ని 12 యోజనాల పొడవు, 3 యోజనాల వెడల్పుతో నిర్మించారని.. విశాలమై మార్గాలు ఇందులో ఉన్నాయని పేర్కొన్నాడు.
అంటే నగరం చాలా విశాలంగా ఉన్నదనే అర్థం. అంతకుమించి అయోధ్య నగరం దీర్ఘ చతురస్రాకారంలో ఉన్నది. అయోధ్య రూపాన్ని జూదమాడే పీట వంటి ఆకారంతో పోల్చాడు వాల్మీకి. జూదమాడే పీట కూడా దీర్ఘ చతురస్రాకారంలోనే ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం చతురస్రం, దీర్ఘ చతురస్రాకారంలోనే నిర్మాణాలను నిపుణులు సరైన ప్రమాణాలుగా భావిస్తారు. నేడు పుదుచ్చేరి, చండీగఢ్ వంటి నగరాలు ఇదే ఆకారంలో నిర్మించిన నగరాలు. ఈ నగరాల్లో రోడ్డుకు ఒక పక్క నిలుచుని చూస్తే.. అటుపక్క చివరి ప్రాంతం కనిపిస్తుంది. అంతగా ఋజుమార్గంలో నిర్మించిన రహదారులవి. మన దగ్గరున్న నగరాల్లో అలాంటి ఒక్క రోడ్డునైనా చూడగలమా?
ఈ చిత్రాలు చూడండి. సింధులోయ నాగరికత ఆనవాళ్లు. హరప్ప నాగరికతకు సంబంధించిన ప్రముఖ ఆనవాళ్లలో ఒకటైన ధోలావీర. ఇది గుజరాత్ లోని కచ్ ప్రాంతంలో ఉన్న పట్టణమిది. సింధులోయ నాగరికతలో భాగంగా తవ్వకాల్లో బయటపడ్డ నగరమిది. ఈ నగరం పూర్తిగా చతుర్భుజాకారంలో నిర్మించబడ్డది. ఉత్తరం నుంచి దక్షిణానికి ప్రవహించే వాగు లేదా నది ఒడ్డున నిర్మించిన ఈ నగరం ధోలావీరా పేరుతో ప్రసిద్ధి పొందింది. ఇందులోని జలాశయాలు కానీ, ఇతర నిర్మాణాలు కానీ, చతురస్ర, దీర్ఘ చతురస్రాకారంలో మనకు కనిపిస్తాయి. ఈ నగరం క్రీస్తు శకాల లెక్కలు గట్టిన చరిత్రకారులు చెప్పిన ప్రకారమే లెక్కించుకొంటే.. నేటికి ఆరువేల ఏండ్ల పురాతనమైంది.
అయోధ్య విస్తీర్ణాన్ని కనుక లెక్కిస్తే.. అత్యధికుల ప్రమాణం ప్రకారం యోజనం తొమ్మిది మైళ్ల లెక్కను ప్రమాణంగా తీసుకొంటే.. నగర విస్తీర్ణం దాదాపు 4,692 చదరపు కిలోమీటర్లు వస్తుంది. ప్రస్తుత ప్రపంచంలోని లాస్ ఏంజెలిస్, ఫిలడెల్ఫియా వంటి వాటికంటే కూడా అయోధ్య పెద్దది.
అయోధ్య నగరం ఎట్లా ఉన్నదంటే.. విశాలమైన రోడ్లు ఉన్నాయి. ఈ రోడ్లను ఎప్పటికప్పుడు నీటితో తడుపుతూ, పూలు చల్లుతూ ఉండే ప్రత్యేక సిబ్బంది ఉండేవారు. అంటే నగరంలో రోడ్లు దుమ్ము రేగకుండా ఉండటం.. ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండటం కోసం అయోధ్యలో ప్రత్యేక వ్యవస్థనే ఉన్నది. దీనికి తోడు రహదారులపై పూలు చల్లుతుండటం వల్ల నిరంతరం గాలి సుగంధాలను వెదజల్లుతూ ఉంటుంది.
అయోధ్య నగరం చుట్టూ అతి పెద్దదైన, పటిష్ఠమైన ప్రహరీ ఉన్నది. దీని బయట ఉన్న తలుపులు, దర్వాజలు (ద్వార బంధములు) చాలా చాలా దృఢమైనవి. ఇవాళ తమిళనాడులోని చిదంబరం వంటి దేవాలయాలకు వెళ్తే ఆ ఆలయ ద్వారాలను తెరవడం ఒక్కరివల్ల అయ్యేపని ఎంతమాత్రం కావు. ఇక అయోధ్యాపురి మెయిన్ ఎంట్రెన్స్ ఎలా ఉండేదో ఊహించుకొండి. ఈ నగరానికి ఉన్న సెక్యూరిటీ సిస్టమ్ కూడా చదువుతుంటేనే ఆశ్చర్యమేస్తుంది. ఇవాళ మనం చెప్పుకొనే ఆయుధాలు ఏవీ లేనప్పటికీ, ఇప్పుడు మనం అత్యాధునికం అనుకొనే సాంకేతిక పరిజ్ఞానం ఏదీ లేనప్పటికీ.. అయోధ్య దుర్భేద్యమైన నగరంగా ప్రసిద్ధి చెందింది. అయోధ్య అన్న పేరులోనే.. యుద్ధము చేయడానికి అశక్తమైనది.. అంటే అసాధ్యమైనది అన్న అర్థం ఉన్నది. నగరం కూడా అచ్చంగా అదే విధంగా నిర్మాణం చేయడం విశేషం.
అయోధ్య నగరంలోపల బలిష్ఠమైన కోట బురుజులు అత్యంత ఎత్తైనవిగా ఉన్నాయి. బురుజుల నిండా.. యంత్రాలు (మెషిన్స్) శతఘ్నుల వంటి ఆయుధాలను ఏ క్షణంలోనైనా ప్రయోగించడానికి వీలుగా అమర్చి ఉంచారు. ఒకటికాదు.. రెండు కాదు.. వందలకొద్దీ శతఘ్నులు ఉన్నాయిట. నగరం చుట్టూ.. వడ్డాణం మాదిరిగా ప్రాకారాన్ని నిర్మించారు. ఇది చాలా విశాలంగా ఉన్నది. ఈ ప్రాకారంపై ఏనుగులు, గుర్రాలు తిరగవచ్చు. ఈ ప్రాకారంపై నుంచి అయోధ్య నగరంలోకి ప్రతీఘాత శక్తులు ప్రవేశించగలరన్న అనుమానమున్న దిక్కులకు గురిచూసి శతఘ్నులను ఏర్పాటుచేశారు. ఈ రక్షణ వలయం ఇంతటితో ఆగలేదు. ప్రాకారం బయట అగాధమంత లోతున్న అగడ్తను నిర్మించారు. ఈ అగడ్తను దాటి శత్రువు ప్రవేశించడం సాధ్యమయ్యే పనే కాదు. ఈ అగడ్త నిండా ఎప్పుడూ నీరు ఉంటుంది. దీనిచుట్టూ క్రూర జంతువులు తిరుగుతూ ఉంటాయి. వీటిని దాటి నగరంలోకి ప్రవేశించి దానిని ఆక్రమించడం ఎవరి వల్లా అయ్యేపని కానే కాదు.
ఈ అగడ్త తరువాత అయోధ్య చుట్టూ దాదాపు రెండు యోజనాల విస్తీర్ణంలో దట్టమైన అడవిని పెంచి.. దానిని క్రూర మృగాలకు ఆలవాలంగా చేశారట. అంటే శత్రువు అయోధ్యలోకి రావాలంటే.. ముందుగా అడవి.. అందులో క్రూర మృగాలు.. ఆ తరువాత అగడ్త, అనంతరం ప్రాకారం, ఆపై బురుజులపై నున్న శతఘ్నులు, దృఢమైన తలుపులు.. బలిష్ఠులైన సైనికులను దాటితే కానీ సాధ్యం కాదన్నమాట.
ఈ రెండు చిత్రాలను ఒకసారి చూడండి. ఇందులో ఒకటి కాంబోడియాలోని విష్ణువు కొలువై ఉన్న అంకోర్‌వాట్ దేవాలయం. రెండోది నెదర్లాండ్‌లోని బోర్టేంజ్ కోట. ఈ రెండింటిలోనూ సిమిలారిటీ ఏమిటంటే.. చుట్టూ అగడ్త ఉండటం. అందులో నీళ్లు ఉండటం.. ఆ అగడ్తకు లోపలా, బయటా అటవీ ప్రాంతం ఉండటం. అచ్చంగా వాల్మీకి రామాయణంలో అయోధ్యా నగర వర్ణన కూడా ఇలాగే ఉంటుంది. ఆశ్చర్యమేస్తుంది. ప్రాచీన కాలంలో నగరానికి రక్షణ కల్పించడానికి అనేక నగరాలు అగడ్తలను నిర్మించడం సర్వ సాధారణమే. కౌటిల్యుడి అర్థశాస్త్రంలోనూ.. నగర నిర్మాణంలో అగడ్తల ప్రస్తావనను మనం గమనించవచ్చు.
అయోధ్యలో ఇండ్లన్నీ విమానము మాదిరిగా ఏడంతస్తులతో నిర్మించినట్టుగా వాల్మీకి పేర్కొన్నాడు. నగరంలో దట్టంగా ఇండ్లు కట్టారట. నిరుపయోగంగా ఉన్న స్థలం అన్నది లేనేలేదని తేల్చిచెప్పాడు. నగరం ఎక్కడ కూడా ఎత్తుపల్లాలు లేకుండా ఫ్లాట్‌గా సమతలంగా ఉన్న భూమిపై నిర్మించారని కూడా వాల్మీకి రాశాడు. ఇంత పక్కాగా నగర ప్రణాళిక వేయడం ఇవాళ్టి ఇంజినీర్లకు, ఆర్కిటెక్ట్‌లకు సాధ్యమయ్యే పనేనా? ఇండ్లన్నీ విమానము మాదిరిగా, ఏడంతస్తులతో ఉన్నాయని చెప్పాడు. ఈ విమానం అంటే ఏమిటి?
విమానం అంటే మన విమానశాస్త్రం చెప్తున్న ఆకారం. మన దేవాలయ గోపురం ఎలా ఉంటుందో.. విమానం కూడా అదేవిధంగా ఉంటుంది. పైనున్న చిత్రాలను గమనిస్తే అర్థమవుతుంది. పాశ్చాత్యుల పరిభాషలో చెప్పాలంటే పిరమిడ్‌లు. ఈ పిరమిడ్‌లనే మనం విమానాలు అన్నాం. మన వైమానిక శాస్త్రం కూడా ఇదే ఆకారాల్లో విమానాల తయారీని వర్ణించాయి. ఈ విమానంలో అంతరాలు కూడా దాదాపు కనీసంగా ఏడు అంతరాలు కనిపిస్తాయి. అయోధ్యలో ఇండ్లన్నీ ఏండతస్తులున్నాయని వాల్మీకి ప్రశంసించాడు.
అయోధ్యాపురి లేఅవుట్ చాలా చక్కగా పద్ధతి ప్రకారం ఉంటుంది. రాజుగారి ప్యాలెస్, రాణుల మందిరాలు, రాజవంశీకుల మందిరాలు ఒకదగ్గర, అంగడి వీధులు ఒక దగ్గర, మంత్రుల మందిరాలు ఒక దగ్గర ఇలా మంత్రాంగానికి, వ్యాపారానికి, సామంతులకు, దౌత్యవేత్తలకు.. ఇలా ఒక ప్రణాళిక ప్రకారం ఏరికోరి కూర్చినట్లు అయోధ్యలో మందిరాలు ఉన్నాయి. ఢిల్లీలో చాణక్యపురి ప్రాంతం ఉన్నది. దౌత్యవేత్తలు, మంత్రులు వారి నివాస భవనాలు ఈ చాణక్యపురిలోనే ఉంటాయి. అదేవిధంగా అయోధ్య నగరానికి మధ్యలో రాజుగారి నివాసం ఉన్నది. రాజుగారి నివాసానికి సమీపంలో రాణులు, ఇతర రాజవంశీకుల మందిరాలు ఉన్నాయి. వీటిని ఆనుకొని మంత్రుల నివాసభవనాలు ఉన్నాయి. రాజ్య పరిపాలనలో కీలక భాగస్వాములుగా ఉండే ముఖ్యుల ఇండ్లన్నీ కూడా అయోధ్య నగరం మధ్యలోనే ఉన్నాయి. వాటి తరువాతి అంతరంలో వ్యాపార కూడళ్లు.. అనంతరం ప్రజల రెసిడెన్షియల్ జోన్లు ఉన్నాయి. నలువైపుల నుంచి నగరంలోపలికి వచ్చే హైవేలు.. ఎలాంటి వంకరలు లేకుండా నగరం మధ్య వరకు వెళ్తాయి. నాలుగు రోడ్లుకూడా అదే పద్ధతిలో నగరం మధ్యకు వస్తాయి. అందుకే అయోధ్యను వాల్మీకి జూదం ఆడే పీటతో పోల్చాడు. మన వరంగల్ కాకతీయుల కోటకు వెళ్లినవారికి ఈ రకమైన నిర్మాణం అనుభవంలోకి వచ్చే ఉంటుంది. నాలుగు వైపుల నాలుగు కీర్తితోరణాలు… వాటి మధ్యనుంచి కోటలోకి ప్రవేశ మార్గాలుంటాయి.
ఉదాహరణకు కైకేయి ప్యాలెస్‌ను చంద్రుడితో వాల్మీకి పోల్చాడు. ఆమె భవన విమానం చంద్రుడి వలె తెల్లగా మెరుస్తున్నదంట. ఈ కైకేయి ప్యాలెస్‌కు కూడా నాలుగు వైపుల విమానాలు ఉన్నాయని.. వీటి మధ్యలో కైకేయి మందిరం ఉన్నదని చెప్పాడు. ఇవి రత్నకాంతులతో మెరుస్తున్నాయని పేర్కొన్నాడు. కౌసల్యకు, సుమిత్ర, రాముడి సోదరులకు వేర్వేరు భవనాలు ప్రత్యేకంగా ఉన్నాయి.
ఇక సీతారాముల భవనం ఎలా ఉన్నదో ఒకసారి చూద్దాం. రాముడి నివాస భవనానికి పెద్ద పెద్ద తలుపులు ఉన్నాయి. అత్యంత ఎత్తైన తలుపులు ఉన్నాయి. మనం ప్యాలెస్‌లకు వంద అడుగుల ఎత్తు ఉన్న తలుపులు కూడా ఉన్న ప్యాలెస్‌లు ఇవాళ్టికీ మనకు కనిపిస్తాయి. రాముడి ఇంటిముందు వందల కొద్దీ అరుగులు ఉన్నాయి. ఇంటిపై శిఖరంపైన బంగారు శిల్పాలను ఏర్పాటు చేశారు. ప్యాలెస్‌లో అక్కడక్కడా నెమళ్లు, కోయిలలు వంటి పెంపుడు జంతువులు, పక్షులు ఉన్నాయి. చందనాగరు పర్ఫ్యూమ్‌లతో ఆ మందిరం నిరంతరం సువాసనలు వెదజల్లుతున్నది. (ఇవాళంటే మనం రూమ్ ఫ్రెష్‌నర్లను వాడుతున్నాం లెండి.) (రామాయణం అయోధ్యకాండ). రాముడి ఇంటి తలుపులను రాయి, చెక్క, బంగారు, వెండి లోహములతో తయారుచేశారు.
కేవలం కల్పనలతో మాత్రమే రాసి ఉంటే.. వర్ణనలు తప్ప వివరణలు ఉండేవి కావు. అయోధ్య నగరం గురించిన ప్రస్తావనల్లో నగర నిర్మాణం, నిర్మాణ శైలి, నైపుణ్యం, రక్షణ ఏర్పాట్లు, మౌలిక సదుపాయాలు, నివాస సముదాయాలు, సైన్యం కోసం వినియోగించే జంతువులు, పెంపుడు జంతువులు.. ఇలా ప్రతి ఒక్కదాన్నీ కూడా వాల్మీకి సవివరంగా చెప్పుకుంటూ పోయాడు. ఇప్పుడు చెప్పండి.. అయోధ్య కంటే సెక్యూర్డ్, సాఫిస్టికేటెడ్, బ్యూటిఫుల్ సిటీని ఇప్పుడు మన దేశంలో ఎక్కడైనా చూడగలమా?