రంగుల హేల 40: తస్మాత్ జాగ్రత్త!!

19
3

[box type=’note’ fontsize=’16’] “తమని తాము ఎక్కువగా గానీ, తక్కువగా గాని అనుకునే కాంప్లెక్స్ ఉన్నవారికి దూరంగా ఉండాలి” అని అంటున్నారు అల్లూరి గౌరీ లక్ష్మిరంగుల హేల’ కాలమ్‌లో. [/box]

[dropcap]మ[/dropcap]నకి ఊహ తెలిసినప్పటినుండీ పెద్దలు జాగ్రత్తరా బాబూ, తెలుసుకో! అంటూ ఏవో ఒకటి చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు మనంతవాళ్ళం మనం అయినా కూడా ఈ జాగ్రత్తలవసరమే. ఈ జీవితం ప్రతిరోజూ తాడు మీద సర్కస్ నడకే. తాటిపట్టె మీద వంతెనదాటే. సైకిల్ మీద పోయినా, స్కూటర్ మీద పోయినా, కారెక్కినా, బస్సెక్కినా, విమానం ఎక్కినా, ఆఖరికి రోడ్ మీద నడిచి పోతున్నా జాగరూకులమై ఉండాలి. ఇంట్లో తిని కూర్చున్నా కొన్ని మెళకువలు పాటించాలి. ఇంకిప్పుడైతే ఈ కోవిడ్ పుణ్యమా అని ‘టేక్ కేర్’ మన ఊతపదమై, దీవెన అయ్యి కూర్చుంది. ‘నాలుగు కాలాలు బతకాలంటే జాగ్రత్తలన్నీ తీసుకో. లేదంటే అంతే మరి‘ అని ప్రాక్టికల్ బెదిరింపులు ప్రత్యక్షంగా కనబడుతూనే ఉన్నాయి.

నేను కూడా మీకిప్పుడు పరాకు చెబుతున్నాను. అయితే నేను చెప్పే విషయం ప్రత్యేకమైనది. ఈ మధ్య వాట్సాపుల్లో ఇంగ్లీష్ కొటేషన్‌లు మరీ ఎక్కువయ్యాయి. ‘అందరినీ క్షమించెయ్యండి లేదంటే ఇగ్నోర్ చెయ్యండి’ అంటూ. ఇలా మనల్ని బాధపెట్టిన వారినందరినీ క్షమించుకుంటూ వాళ్ళ మధ్యే కూర్చుంటే ఆఖరికి మన చెంపల్ని మనమే వాయించుకోవలసిన స్థితిలో పడిపోతాం. ఒకే రాయిచేత అనేక దెబ్బలు తినడం పిచ్చితనం కాదూ! ఆలోచించండి.

మా బంధువులమ్మాయి సెక్రటేరియట్‌లో ఒక డిపార్ట్మెంట్ హెడ్ దగ్గర పి.ఏ.గా పని చేసేది. అతని దగ్గరే దాదాపు పదేళ్లుగా పని చెయ్యడం వల్ల ఒకరికి మరొకరి ఫామిలీతో పరిచయం కూడా ఉంది. ఒక రోజు హఠాత్తుగా ‘మీరంటే నాకు చాలా ఆరాధన.నన్ను మీరు అర్థం చేసుకోండి లేకపోతే నేను చచ్చిపోతాను’ అనడం మొదలు పెట్టాడుట. ఈ అమ్మాయి భయపడిపోయి లీవ్ పెట్టేసి సిక్ అయిపోయి ఎవరికీ చెప్పుకోలేక మరో డిపార్ట్మెంట్‌కి ట్రాన్స్ఫర్ చేయించుకుని ఊపిరి పీల్చుకుంది. అయినా ఆమెకు అదొక షాక్ లాగా అయ్యి, కొన్ని సంవత్సరాల వరకూ మామూలు మనిషి కాలేకపోయింది. మనుషుల్లో కొన్ని చీకటి మూలాలు పైకి కనబడవు. ఇలాంటి సమస్య ఉద్యోగం చేసే స్త్రీలకి కొందరికి ఎదురవుతుంది. అలా అని రోజులో మూడోవంతు సమయం చొప్పున, మూడేసి దశాబ్దాలు పనిచేసే ప్రదేశంలో బిగుసుకుపోయి ఉంటే స్త్రీల ఆరోగ్యం దెబ్బతింటుంది. చురుకైన ఉద్యోగులు కూడా కాలేకపోతారు. ఇలాంటి పైత్యానికి యాభై దాటి, అరవై వయసు కూడా కొందరు మగాళ్ళకి అడ్డుకాదు. అప్పుడప్పుడూ ఆఫీసర్స్ ఇలాంటి పోకడలు పోతున్న విషయం ఆఫీస్‌లో మిగిలిన వారికి తెలీదు. ఆ యువతులు చెప్పుకోలేరు కూడా. అది మరింత అవమానం తెచ్చిపెడుతుంది తప్ప సత్ఫలితం ఉండదు.

కొందరు తోటివారితో ఇరుగుపొరుగుగా గానీ, సహోద్యోగులుగా గానీ, సంగీత సాహిత్య గోష్ఠుల్లో గానీ చాలా సన్నిహితంగా ఉంటారు. ఎప్పుడో సరదాగా ఎవరో ఒక మాట అంటే అది వారు దేనికో అన్వయించుకుని వారినే అవమానించారనుకుని అపోహపడి మాట్లాడడం మానేసి బిగిసిపోతారు. అది అపోహే అని తర్వాత తెలిసినా పౌరుషానికి పోయి శాశ్వత శత్రుత్వం ప్రకటిస్తారు. ఇలాంటి వారు ప్రతి సమూహంలోనూ ఒకరైనా ఉంటారు. తమని తాము ఎక్కువగా గానీ, తక్కువగా గాని అనుకునే కాంప్లెక్స్ ఉన్నవారికి దూరంగా ఉండాలి. ఇలాంటి దెబ్బలు తగిలాక కానీ వారెలాంటి వారో మనం గ్రహించలేం. పైకి నవ్వుతూ పలు మానసిక రుగ్మతలతో అలరారుతున్న అనేకమంది మన చుట్టూ ఉంటారు.

మా కవి మిత్రుడొకాయన మేం మీటింగుల్లో కలిసినపుడు మా అందరిమధ్యా కూర్చుని ఆడవాళ్ళ గొప్పతనం గురించి చెబుతూ బోలెడన్ని జోక్స్ వేస్తూ చాలా స్నేహంగా ఉంటాడు. మేమంతా భేషజం లేని అతన్ని చాలా ఇష్టపడతాము. ఒకోసారి శ్రీమతితో వస్తాడు. మమ్మల్ని గుర్తుపట్టకుండా గబగబా అటూ ఇటూ తిరుగుతుంటాడు. ఈ రహస్యం తెలీక మా మిత్రురాలు “ఏవండీ రమేష్ గారూ!” అంటూ పలకరిస్తుంటే తలే తిప్పడు. చిత్రంగా అతని భార్య మాతో మాట్లాడుతుంటుంది. మరీ అంత ఓవర్ యాక్షన్ చెయ్యకపోతే ఆమెకి పరిచయం చెయ్యొచ్చుకదా. ఇదో రకం దుర్మార్గం! అక్కడికి ఆ భార్యేదో నియంత అన్నట్టు. తర్వాత ఈ సంగతి గ్రహించిన మా వాళ్ళు మెల్లగా ఆయన్ని మరిచిపోయారు.

కొందరికి హెలుసినేషన్స్ ఉంటాయి తనని ఎవరో ఏదో అన్నారని నిరంతరం బాధపడుతూ అవకాశం దొరకగానే ఎవరో ఒకరి మీద నిష్ఠూరపడిపోతుంటారు. భర్త తిట్టాడని కాదు పక్కింటామె నవ్వింది అన్న సామెతగా తమకి కష్టం కలిగించిన వారిని ఏమీ అనలేక, ఇంకెవ్వరిపైనో ఆగ్రహం పెట్టుకుంటారు. స్నేహం ధర్మం వదిలేసి వారిపై ద్వేష సమరం సాగిస్తుంటారు.

మన బంధుమిత్రుల్లోనే కొందరు ఫోన్ చెయ్యగానే ఎవరో ఒకరిమీద నేరాలు చెబుతూ ఉంటారు. మనం ‘అవునా? అన్యాయం, కదా!’ అన్నామా ఐపోయామే, మనం ఇలా అన్నామని ఇంకొకరికి చెబుతారు. నేలకి పోయేదాన్ని నెత్తికి రాసుకున్న చందంగా మనకి చుట్టుకుంటుంది ఆ విషయం. మనకి తెలీకుండానే మన చుట్టూ ఒక శత్రువర్గం తయారయిపోతుంది మనం మెలకువగా లేకపోతే. ఒకోసారి ఈ అపార్థాలు పీటముడి పడిపోయి ఎప్పటికీ కొందరు మనుషులకు దూరం అయిపోతాం. జీవితం సినిమా కాదు ఓ నాలుగు డైలాగులు చెప్పి పరిస్థితిని అవతలివారికి వివరించడానికి. అమాయకంగా మనం ఒకోసారి ఇలాంటి వలలో పడి నిందితులం అవుతాము. ఆ నేరం నుంచి మనం బైటపడలేం ఎప్పటికీ.

ఒకసారి మా సహోద్యోగి మేమూ ఒకేసారి ఇల్లు కట్టుకుంటున్నాం. ఒకరోజు ఆయన కడుతూ ఉన్న మా ఇంటికి వచ్చి తనకెంత ఖర్చయ్యిందీ చెప్పి మాకెంత అయ్యిందీ వివరాలు అడిగితే చెప్పాము. ఆయనకన్నా మేము రెట్టింపు ఖర్చుతో కాస్త రిచ్‌గా కడుతున్నామన్న సంగతి బైటపడింది. ఆ తర్వాత ఆయన ఆఫీస్‌లో నాతో మాట్లాడడం మానేసాడు. నేను పలకరిస్తే బలవంతంగా, అయిష్టంగా మాట్లాడేవాడు. కొన్నాళ్ళకి అదీ ఆగిపోయింది. ఇలాంటి ముళ్ళు కొన్నుంటాయి.

మేం కట్టుకున్న కొత్త ఇంటి పక్కనే ఉన్న డబల్ స్టోరీడ్ బిల్డింగ్లో ఒక ధనవంతురాలు దిగింది. మా ఇంటికొచ్చి పరిచయం చేసుకుంది. ఆవిడే దగ్గరుండి స్కూల్ కట్టించుకుంది. మా అమ్మాయిని కూడా అందులో చేర్చాము. మేం కాస్త బాగానే మంచి మిత్రులం అయ్యాము. ఆమె నా రాతలన్నీ చదివి ఇవి సరిపోవండీ, ఇంకా బాగా రాయాలి మంచి బుక్స్ చదవండి అంటూ సలహాలిచ్చేది. ‘అవున్నిజమే చదవాలి’ అనేదాన్ని. మాది అరమరికలు లేని స్నేహం అనుకున్నాను.

ఒకరోజు మాటల్లో మీ టీచర్లు హోమ్ వర్క్ సరిగా దిద్దట్లేదు. తప్పులుంటున్నాయి అని మా అమ్మాయి పుస్తకం తీసి చూపించాను. ఆ తర్వాత ఆమె ఏమీ మాట్లాడలేదు. ఆ విషయమై సీరియస్‌గా ఆలోచిస్తోంది కాబోలు అనుకుని నేను వచ్చేసాను. కొన్నిరోజుల తర్వాత వాళ్ళింటికి వెళ్ళినప్పుడు నేను మామూలుగా మాట్లాడుతూనే ఉన్నా,ఆమె మాత్రం మొహం ముడుచుకుని అంటీ ముట్టనట్టు మాట్లాడుతోంది. నా కర్ధం కాలేదు. నేను “వస్తానండీ” అని లేచివస్తుంటే గుమ్మం వరకూ రానేలేదు. నేను ఒక వారం రోజులు సరిగా నిద్రపోలేకపోయాను. నా వల్ల ఏం తప్పు జరిగిందీ అన్న తీవ్ర సమీక్షలో పడిపోగా, పోగా అర్థం అయింది ఇదే. చిన్న విషయానికి జాగ్రత్తగా పెంచుకున్న స్నేహపు మొలక వాడిపోయింది అని బాధేసింది. అయితే తుమ్మితే ఊడే ముక్కు ఏదో ఒకరోజు, ఇవాళ కాకపొతే రేపైనా ఊడిపోవాల్సిందే. ఒక పనైపోయింది.

కొంతమంది ఒకోసారి కనబడినపుడు తెగ కబుర్లు చెప్పిమరోసారి అన్‌జాన్ కొడుతుంటారు. మనం హర్ట్ అవుతాం. అకారణంగా మొహం ముడుచుకుని పక్కకి జరిగిపోతుంటారు. ఇదో రకం కాంప్లెక్స్. మన చుట్టూ ఉన్నవారిలో ఇటువంటి సిక్‌నెస్ ఉన్నవాళ్లున్నారేమో గమనించుకుంటూ మనకి మనమే బాడీగార్డ్‌లా ఉండాలన్న మాట.

కొంతమందికి ఇతరుల వస్తువులు ఎంత బావున్నా వారికస్సలు నచ్చవు. తమదే బావుందంటారు. అదీ మంచిదే. వారికీ మనకీ మనశ్శాంతి. మా మిత్రుడొకాయన ఏ బ్రేకింగ్ న్యూస్ చెప్పినా ఇది నాకెప్పుడో తెలుసు అంటాడు. అదెలా? అంటే ఊహించానంటాడు. నేనే మహా తెలివయినవాడిని. భగవంతుడు నా ఒక్కడికే ఇన్ని తెలివితేటలిచ్చేసాడు. మిగిలిన వాళ్ళు తెలివిహీనులు అనుకోవడం కొందరికుండే బలహీనత. అది గుర్తుపట్టి వదిలెయ్యాలి, పట్టించుకోకూడదు.

కొంచెం కూడా సర్దుబాటు ధోరణి లేకుండా అనుక్షణం ఎవరో ఒకరిపై కోపంతో, ద్వేషంతో రగులుతూ ఉండేవారు కొందరుంటారు. ఇటువంటి వారిని కదిలిస్తే ఎవరో ఒకరిని ఆడిపోసుకుంటూ ఉంటారు బంధువులపైనో, ఎవరూ దొరక్కపోతే నిత్యం టీవీలో కనబడే ఏ రాజకీయ నాయకులపైనో వారికి ఆగ్రహం ఉంటుంది. మనపై వారికి కోపం లేదుకదా అని మనం వారిని ఉపేక్షించరాదు. ఏదో ఒకరోజు మనపై కూడా కోపిస్తారు. వాళ్ళు చెదపురుగుల్లాంటివారు. ఆ చీడని పక్కవారికి పట్టిస్తారు. వారితో స్నేహం పులిమీద స్వారీ లాంటిది. ‘బివెర్ ఆఫ్’ అని ఇటువంటివాళ్ల గురించి ఎక్కడా బోర్డు ఉండదు. వారి బారిన పడి చేతులు కాలాక గంటలు గంటలు వారి గురించి ఆలోచించి మన మనశ్శాంతి పోగొట్టుకోకూడదు కదా.

ఇంకొందరు మనకి పూర్తిగా ఇష్టం లేకున్నా చొరవగా వచ్చి అతి స్నేహం చేసి చివరికి ఏదో ఒక తప్పు ఎంచి ఆ స్నేహం చెడగొడతారు. ఎవరికీ చెప్పుకోలేం, చెప్తే అది మరో అల్లరి. ఇటువంటి వారి మనో వైకల్యం పైకి కనబడదు. పూర్తిగా పిచ్చివారిని అంతా గుర్తించి దూరం జరుగుతారు. వీళ్ళు మనలాగే ఉంటూ మనకి పిచ్చెక్కిస్తారు.

మా ఆఫీసుకి, మాదూరపు బంధువొకాయన వచ్చి నేను లోపల విజిటర్స్‌తో మాట్లాడుతూ ఉండగా డోర్ దగ్గర నిలబడి చెయ్యి ఊపాడు. నేను గుర్తుపట్టలేదు. వెయిట్ చెయ్యండి అన్నట్టు చెయ్యి ఊపాను. ఆ తర్వాత అతను మళ్ళీ నాకు కనబడలేదు. నాకు ఊరినించి ఫిర్యాదొచ్చింది. అతను మా బంధువనీ, పెద్ద ఉద్యోగం చేస్తున్నానని నాకు గర్వమనీ నేను లోపలికి రమ్మని పిలవలేదనీ నిష్ఠూరం. ఇటువంటి వాళ్ళు ఏ బంధువుల పెళ్లిలోనైనా కనబడినా మొహం తిప్పుకుంటారు. అకారణ వైరం ఇదో బాధ. ఇలాంటి అనుభవాలు అందరికీ ఉంటాయి. ఏమీ చెయ్యలేం. ఎవరికీ చెప్పుకోలేం.

కొందరికి నేను ఫలానా అన్న అతిశయం, మిడిసిపాటు ఉంటుంది. ఎప్పుడన్నా పొరపాటున వారి అహానికి దెబ్బ తగిలినట్టు అనుమానం వచ్చిందంటే చాలు అప్పటి వరకూ బాగానే ఉన్నా చటుక్కున నోటికొచ్సినట్టు మాట జారతారు. వారి బారిన పడకుండా చూసుకోవాలి. ఏదో పెద్ద కవి కదా అని నమస్కారం పెడితే మర్యాద అందుకోవడం కూడా రాదు కొందరికి. అప్రస్తుతపు మాటలు జారిపోతారు. విలువ దిగజార్చుకుంటారు. విద్య చాలామందికి వినయం ఒసగదు.

ఇంకొంత మందిది మరొక రకం శాడిజం. వాళ్లెదురుగా ఎవరిని పొగిడినా తట్టుకోలేరు. వెంటనే ఆ పొగడబడిన వాళ్ళ ఇజ్జత్ తీసే మాటలు వీళ్ళ నోటివెంట గబుక్కున వచ్చేస్తాయి. ఎప్పుడూ చుట్టూ విషపు పెర్‌ఫ్యూమ్ జల్లుతూ ఉంటారు. ఫలానా ఆయన “సమాజ సేవ చక్కగా చేస్తుంటాడండీ” అనగానే, వెంటనే “అలాగే కదా నాలుగిళ్ళు కొన్నాడు” అనో, లేకపోతే “మీకు తెలీదేమో ఆయనకి ముగ్గురు, గోపాలకృష్ణుడండీ బాబూ!” అనో అనేసి పగలబడి నవ్వేస్తుంటారు. ఒక్క మాటతో కుండెడు పాలలో విష బిందువు వేసేసి అలా వారి వ్యక్తిగత ద్వేషాన్ని వెలువరిస్తుంటారు. అటువంటి మాటలు విన్నవారి మనసులు కూడా కలుషితం అవుతాయి. చాలామంది మగవాళ్ళకి తాము మాత్రమే ఏకపత్నీవ్రతులమనీ మరెవ్వరూ కాదనీ ఒక భ్రమ ఉంటుంది. అందుకే వారిమాటల్లో అలాంటి ఆవేదన, ఆక్రోశం పొంగిపొర్లుతూ ఉంటాయి. ఛాన్స్ దొరికితే చాలు ఇతరులను తక్కువ చెయ్యడానికి వువ్విళ్లూరుతూ ఉంటారు. ఇటువంటి వాళ్లతో మరీ ప్రమాదం.

జన్మలో మరొకరికి చాకోలెట్ కూడా ఇవ్వని వారు, మనం పిలిచి పాతిక రూపాయల స్వీట్ ఇస్తే తినేసి “నీకన్నీఅలా కలిసొస్తాయి,ఇస్తావు” అనేస్తారు ‘ఇచ్చావులే మహా’ అన్నట్టు. ఆ మాటకి మనకి బీపీ పెరుగుతుంది. వారంతా ‘మా ఇంటికొస్తే ఏం తెస్తావ్? మీ ఇంటికొస్తే ఏమిస్తావ్?’ బ్యాచ్. వెనక ఎంతమంది నవ్వుకున్నా లైట్‌గా తీసుకోగల విశాలహృదయులు. ‘ఎవరేమనుకుంటేనేం మన రూపాయి మిగిలింది అదే చాలు’ అనుకుని హాయిగా నిద్రపోతారు. ఇదో రకం సిక్‌నెస్. ఇలా రకరకాల సిక్‌నెస్ లున్నవాళ్ళందరికీ మేమొక పేరు పెట్టాం. సిక్ ఇన్‌స్టిట్యూట్‌లో మెంబర్ (SIM), షార్ట్‌కట్‌లో సిమ్ అంటూ ఉంటాం. ‘ఫలానా వ్యక్తి సిమ్, జాగ్రత్త!’ అనుకుంటూ ఒకరినొకరు హెచ్చరించుకుంటూ ఉంటాం.

వీళ్ళు అన్నిసార్లూ ఇలాగే ఉండరు. పైత్యం ప్రకోపించినప్పుడే ఇలా మాట్లాడతారు. అందుకే మనం వీళ్ళ బారిన పడతాం. ఇలాంటి మానసిక అనారోగ్య లక్షణాలు కలవారిని తక్షణం దూరం పెట్టడం మన ఆరోగ్యరీత్యా మంచిది. కొంతమంది మనసులో మనపై ద్వేష భావన ఉంచుకుని పైకి ప్రేమ ఉన్నట్టు నటిస్తుంటారు. ఇదో రకం క్రూరత్వం. జీవితంలో తమకు తగిలిన ఎదురుదెబ్బలకి కొందరు బతుకు లోతుపాతులు గ్రహించి మంచివ్యక్తులుగా మారితే, మరికొందరు లోకంపై ద్వేషం పెట్టుకుంటారు. వారి నోటినుంచి ఒక్క మంచి మాటరాదు. ఎప్పుడూ తప్పులే పడుతుంటారు. ఇదొక వ్యాధి. వారికి బంగారపు గిన్నె బహుమతిగా ఇచ్చినా ‘ఇది బాగా మెరవట్లేదు, మంచిది కాదిది కల్తీ బంగారం’ అనేయగలరు. ఇటువంటి వారిని మనం గుర్తుపట్టి, చీడ పురుగును ఏరి పారేసినట్టు పారెయ్యకపోతే పక్కనుండే మొక్కలన్నీ పాడవవుతాయి.

కొందరు, ఏదైనా మనం సాధించిన విజయం గురించి ఎప్పుడన్నా చెప్పబోతే అసహనంగా మొహం తిప్పేసుకుంటారు. వారికి గుండెల్లోంచి దాచుకోలేనంత బాధ పెల్లుబికివస్తూ ఉంటుంది. మనల్ని చిన్నబుచ్చేట్టు చెయ్యడం వారి ఉద్దేశం. ఈర్ష్యా, ద్వేషం, అసూయా, అసహనం, ఓర్వలేనితనాలు ఒకలాంటి మానసిక వ్యాధులు. ఇలాంటి లక్షణాలు పొడగట్టినప్పుడు ఇంట్లో వాళ్ళు గమనించి వాళ్ళని మానసిక నిపుణుడి దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. లేకపోతే ప్రస్తుత నష్టం చుట్టుపక్కలవాళ్ళకి జరిగినా, కొంతకాలానికి అటువంటి వాళ్ళు శాపగ్రస్తుల్లా, అగ్నిగుండంలా రగిలి రగిలి ఒంటరైపోతారు.

మన మిత్ర బృందంలో కూడా ఇలాంటి వాళ్ళుండవచ్చు. వారి మీద అధిక ప్రేమవల్ల కళ్ళు మూసుకుపోయి, ఇలాంటి తేడాగాళ్ళని కనిపెట్టి మసులుకోకపోతే ‘రబ్బింగ్ ఆన్ ది రాంగ్ సైడ్’ అన్నట్టుగా అయ్యి, ఏదో ఒక రోజు స్పర్థలు రావొచ్చు. ఎంతమందినని మనం అవాయిడ్ చెయ్యగలం? కాబట్టి కేర్‌ఫుల్‌గా ఉండడమే మందు. చుట్టూ ఉన్న రక రకాల సిక్ ఫెలోస్‌ని ఆనవాలు పట్టి దూరం జరగకపోతే చివరికి మనం సైకియాట్రిస్ట్‌ని కలవాల్సివస్తుంది. మన స్వీయ రక్షణ కోసం ఇలాంటి క్లిష్టమైన పరిశీలన కూడా చాలా అవసరం. అందుకే మళ్ళీ మళ్ళీ చెబుతున్నా. మైండ్ దగ్గరపెట్టుకుని ఆజూ, బాజూ జనాల్ని గమనించుకోండి. భద్రం జర!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here