గొల్ల రామవ్వ – పీవీ నరసింహారావు సృజనాత్మక వ్యక్తిత్వం

1
5

[box type=’note’ fontsize=’16’] ప్రభుత్వ సిటీ కళాశాల(A), హైదరాబాదు, 26.6.2021 నాడు నిర్వహించిన సెమినార్ లో “పూర్వ ప్రధాని శ్రీ పివి నరసింహారావు సాహిత్యం-వ్యక్తిత్వం” అంశం పై శ్రీ కస్తూరి మురళీకృష్ణ ప్రసంగ పాఠం, సంచిక పాఠకుల కోసం. [/box]

[dropcap]అం[/dropcap]దరికీ నమస్కారం,

ఈ రోజు మీ అందరి ముందు మాట్లాడగలిగే అర్హతను ప్రసాదించిన వాగ్దేవి  వీణాపాణి సరస్వతీ దేవికి వందనాలు సమర్పిస్తూ, సరస్వతీ కటాక్షం పుష్కలంగా కల పండితుడు,  సృజనాత్మక రచయిత పి.వి నరసింహారావు తన రచనలో కనబరచిన సృజనాత్మకతను నా పరిధిలో  వీలైనంత నేను అర్థం చేసుకున్నది మీతో పంచుకుంటున్నాను. అయితే సమయాభావం వల్ల ప్రస్తుతం విశ్లేషణను ఒక్క రచనకే పరిమితం చేస్తున్నాను.

‘సృజనాత్మకత’ అన్నపదం గమ్మత్తయినది. సృజనాత్మకత అంటే ఆంగ్లంలో Creativity,  సృజించడం. భారతీయ తత్త్వం ప్రకారం వైజ్ఞానిక సూత్రాల ప్రకారం ఈ సృష్టిలో ఎవరూ ఏదీ కొత్తగా సృజించలేరు. ఈ సృష్టిలో ఏదేది సృజితమైందో అదంతా విశ్వసృష్టికారుడి సృజన. Energy in the universe can neither be created nor  destroyed. It always  remains the same అంటుంది,  Law of  conservation  of energy. Law  of  conservation of  mass- mass can neither .be created nor destroyed. It is a constant,  అంటుంది.  అలాగే భారతీయ తత్త్వంలో

ఓం పూర్ణమదఃపూర్ణమిదం పూర్ణాత్  పూర్ణ ముదత్చ్యతే

పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాహ శిష్యతే!

అంటుంది శాంతి మంత్రం. అంటే ఆ కనిపించేది అనంతం. బాహ్య ప్రపంచం పూర్ణం. ఈ అంతఃప్రపంచం పూర్ణం. పూర్ణం నుంచి పూర్ణం తీసివేసినా కలిపినా మిగిలేది పూర్ణమే. ౦-౦=౦. infinity plus or minus is the same.  ఇదీ ఒక శక్తి నిత్యత్వ సూత్రమే. అంటే సృష్టిలో ఎవరూ కొత్తగా ఏమీ సృష్టించలేరు. ఏది ఎంత సృష్టించినా అది ఇంతకుముందు ఉన్నదే. దానివల్ల ఎలాంటి ఎదుగుదల, తరుగుదల ఉండదు. మరి ఇలాంటప్పుడు సృజనాత్మకత, Creativity అన్న పదాన్ని మానవ జీవితంలో, మానవ ప్రపంచంలో ఎలా అన్వయించుకోవాలి? ఎలా అర్థం చేసుకోవాలి? ఎందుకంటే మనిషి ఏదో కొత్తగా సృజించలేడు. ఇంతవరకూ ఆధ్యాత్మికంగా కానీ, వైజ్ఞానికంగా కానీ మానవుడు సాధించినిదీ, సృజించినిదీ అంతా సృష్టిలో ఉన్నదాన్ని కనుగొనటమో, ఉన్నదాన్ని తనకనువుగా మలచుకుని వాడుకోవటమో తప్ప కొత్తగా సృష్టించింది, సృష్టించేదీ ఏమీలేదు. ఎందుకంటే energy can be changed from one form to another. ఒక రూపం నుంచి మరో రూపానికి మారవచ్చు.  ఒక రూపం నుంచి మరో రూపానికి మార్చటాన్నే మనం సృజనాత్మకత, Creativity గా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మానవ ప్రపంచంలో సృజనాత్మకత అన్నది తన చుట్టూ ఉన్న సృష్టి అర్థాలు కనుక్కోవటమో, సృష్టిలో నిబిడీకృతమై ఉన్న సూత్రాలను ఆవిష్కరించటమో లేక చుట్టు ఉన్న ప్రపంచాన్ని గమనించి, అనుభవించి, అర్థం చేసుకుని, ఎలాగైతే సాలీడు తనలోంచే దారాలు తీసి గూడు అల్లుతుందో, అలా అందమైన గూడులాంటి కథలు అల్లటం ద్వారా తాను గ్రహించిన రహస్యాన్ని ప్రపంచానికి విశదీకరించటమోగా అర్థం చేసుకోవచ్చు.

ఆపిల్‍పండు చెట్టుమీద నుంచి క్రిందకు జారిపడటం భూమి ఆకర్షించటం వల్ల అవి తీర్మానించటం సృజనాత్మకత. వీచే గాలి ఒత్తిడిని భూమిపై పెంచడం ద్వారా, భూమి ప్రతిచర్యను ఆధారం చేసుకుని గాలిలోకి ఎగిరే విమానాన్ని తయారు చేయటం సృజనాత్మకత. పారే నీటిలో నిబిడీకృతమై ఉన్న విద్యుచ్ఛక్తిని గుర్తించి,  ఉపయోగించి పలు ప్రయోజనకరమైన సాధనాలను తయారుచేయటం సృజనాత్మకత. అలాగే తన అనుభవాలను, అనుభూతులను ఆధారం చేసుకుని తన చుట్టూ ఉన్న సమాజాన్ని,  సమాజంలోని మనుషుల మనస్తత్వాలను అర్థం చేసుకుని, వాటి ఆధారంగా ఇతరులకు అవగాహన కలిగించటం, మార్గదర్శనం చేయటం వినోదాన్ని అందించటం కూడా సృజనాత్మకతనే. గమనిస్తే, సృజనాత్మకత అంటే ఏదో లేనిదాన్ని సృష్టించటం కాదు. ఉన్నదాన్ని అర్థం చేసుకోవటం ద్వారా సృష్టిలో నిబిడీకృతమై ఉన్న సూత్రాలను గ్రహించి వాటిని సమాజానికి ప్రకటించటం సృజనాత్మకత. అలాంటి సృజనాత్మకత అమితంగా తన రచనల ద్వారా, తన జీవితం ద్వారా ప్రదర్శించి, ప్రకటించి భావితరాలకు అవగాహనను, ఆలోచనను కలిగిస్తున్న మార్గదర్శకం చేస్తున్న సృజనత్మకత పి.వి నరసింహారావు గారిది. ఆయన సాహిత్యాన్ని పరిశీలిస్తే ఈ నిజం స్పష్టంగా తెలుస్తుంది.

ఈ రోజు మనకున్న సమయాన్ని పరిగణలోకి తీసుకుని విశ్లేషణను ఒక్క కథ గొల్లరామవ్వకు పరిమితం చేస్తున్నాను. ‘గొల్ల రామవ్వ’ కథ పి.వి నరసింహారావు గారి స్వీయానుభవమో లేక ఆయన చూసి అతి దగ్గరగా పరిశీలించిన సంఘటననో అనిపిస్తుంది. ఈ సంఘటన ఆయనపై ఎంత ప్రభావం చూపిందంటే ఇది ఆయన ఒక పెద్ద కథగా ప్రధాన సంఘటనగా రచించారు. మళ్ళీ కొన్ని దశాబ్దాల తరువాత ‘The Insider ‘లో కూడా ఈ సంఘటనను పొందుపరిచారు. అంటే ఈ సంఘటన ఆయన మానసిక వ్యవస్థపై అంత ప్రభావం చూపించిందన్నమాట. ఒక జరిగిన సంఘటనను నాటకీయంగా, ఆసక్తికరంగా ఉద్విగ్నత కలిగించే రీతిగా, కళ్ళముందు జరుగుతున్నట్టు చెప్పటం సృజనాత్మకత. ‘గొల్లరామవ్వ’ కథ చదువుతుంటే దృశ్యం కళ్ళముందు నిలబడుతుంది. అక్షరాలతో మనస్సు తెరపై చలనచిత్రాన్ని ప్రదర్శించటం అనే అత్యద్భుతమైన సృజనాత్మక రచన సంవిధానం ఈ కథలో కనిపిస్తుంది.

నిజామ్ వ్యతిరేకంగా పోరాడుతున్న ఓ యువకుడు ఒక పోలీసును చంపి,  తప్పించుకుని పారిపోతూ ఓ ముసలామె గుడిసెలోకి దూరతాడు. ఆమె ఆమె అతడికి ఆశ్రయమిస్తుంది. రక్షిస్తుంది. ఇది జరిగింది. జరిగినది జరిగినట్టు చెప్పటంలో సృజనాత్మకత లేదు. అనుభవించింది అనుభవించినట్టు చూపటంలో సృజనాత్మకత లేదు. జరిగినది నాటకీయంగా చెప్తూ చదువుతున్న పాఠకునిలో పలురకాల భావాలు చెలరేగేట్టు చెప్పటం, కథను విశ్లేషిస్తూపోతే పలు పొరలు పొరలుగా అనేకానేక సామాజిక, తాత్విక, మానసిక, చారిత్రక, రాజకీయ, ధార్మిక అంశాలు బోధపడేటట్టు చేయటం సృజనాత్మకత. ‘గొల్లరామవ్వ’ కథలో ఈ సృజనాత్మకత అడుగడుగునా కనిపిస్తుంది. అక్షరాలు చూపే  దృశ్యం ఒకటి. అక్షరాలలో ఒదిగిన భావం ఇంకొకటి. దృశ్య చెప్పే బాష్యం మరొకటి. ఇవన్నీ కలిపిచూస్తే అందే విజ్ఞానం కలిగించే అవగాహన ఇంకొకటి.

మొదటి రెండు పేరాలలో నిజాం వ్యతిరేక  పోరాటం సాగుతున్న కాలంలో గ్రామాలలో పరిస్థితిని, మానసిక వ్యవస్థను, సామాన్యుల ప్రవర్తనను అత్యద్భుతంగా ’ఇదీ’ అని చెప్పకుండానే మనసుకు  స్ఫురింపచేస్తాడు రచయిత. ‘ఢాం’ అని బాంబు పేలితే ‘ఊరి వారందరికీ ఒకే సమయాన ఏదో మహాభయంకరమైన పీడకల వచ్చి హఠాత్తుగా నిద్రనుండి త్రుళ్ళిపడి లేచారు అన్నంత అలజడి చెలరేగింది ఆ రెండు నిమిషాల్లో’ అన్న వాక్యం ఆనాటి సామాన్యుల పరిస్థితిని కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. ప్రజలందరిలో రాజ్యంపట్ల వ్యతిరేకత, నిరసన ఉంది. కానీ సామాన్యులు  కార్యశూరులు కారు. సామాన్యుల నిరసనకు కొందరు కార్యశూరులు ఆచరణ రూపం ఇస్తారు. వారికి సామాన్యుల మౌన మద్ధతు ఉంటుంది. కానీ వారు తమ ఆవేశానికి, ఆచరణ రూపం ఇవ్వలేరు. అందుకే ‘ఒక్కసారి ఘొల్లుమన్న గ్రామస్తులు మాత్రం అదేదో దివ్యజ్ఞాన బోధ కలిగిందా అన్నట్లు మళ్ళీ కిమ్మనలేదు. కిమ్మనలేదు నిజమే కాని బొడ్డూడిన కూన పర్యంతం ఎవ్వరూ నిద్రకూడా పోలేదు.’ బాంబు పేలిన వెంటనే ప్రజల స్పందన ఆపై వారి ప్రవర్తన’ ప్రజలలో నెలకొని ఉన్న భయాందోళనలను, అభద్రత భావాన్ని ఎంతో గొప్పగా చూపిస్తుంది. ఇక్కడ మనకు సృజనాత్మకత అంటే ఏమిటో అర్థం చేసుకునే వీలు చిక్కుతుంది. ఒకవేళ రచయిత అనుభవం కనుక కథ అయి ఉంటే, బాంబు పేలిన తరువాత ప్రజల మనస్సులలో ఏం జరుగుతుంది, వారి ప్రవర్తన ఏమిటి రచయిత గమనించే స్థితిలో ఉండడు. బాంబుపేల్చి ప్రాణాలు అరచేత పెట్టుకుని పారిపోవటంపైనే దృష్టి ఉంటుంది. ఒకవేళ ఈ సంఘటనకు రచయిత ప్రత్యక్షసాక్షి అయినా, ఊళ్ళో వీధుల్లో జరుగుతున్నది చివరికి పక్షుల కలవరం, వాటి రెక్కల తటతట, ఊరిచుట్టు పెరండ్లలో నుండి కుక్కల అరుపు, రోడ్లలో నిశ్చింతగా నెమరువేస్తున్న పక్షుల గిజగిజ, అక్కడక్కడ దొడ్ల కంపను విరగద్రొక్కి ఊళ్ళో తోచిన దిక్కుల్లో పరుగెత్తే దున్నపోతుల గిట్టల రాపిడి ఇవన్నీ గమనించడం కుదరని పని. ఎందుకంటే ఆ సమయంలో ఏం జరుగుతుందో అన్న విషయం పైనే దృష్టి ఉంటుంది. కానీ బయట పక్షులు ఏం చేస్తున్నాయి? పశువులు ఎలా ప్రవర్తిస్తున్నాయి అన్నదానిపై ఉండదు. పోనీ వేరే ఎవరో చెప్పిన సంఘటనను కథగా మలిచారనుకున్నా ఈ వర్ణన ఎలా సాధ్యం? ఇదీ సృజనాత్మకత. తన అనుభవమైనా, ఇతరుల అనుభవమైనా, ఊహ అయినా దాన్ని తన మనస్సులో దర్శించి, తన మనస్సులోని భావనలు, ఓ అనుభవంతో ఏమాత్రం సంబంధం లేని వారి మనస్సులలో  స్పందనలు కలిగించే రీతిలో అక్షరరూపంలోకి రూపాంతరం చేయటం ద్వారా అక్షరాలకు  దృశ్యాలను చిత్రించే శక్తినివ్వటం సృజనాత్మకత. అనేక విభిన్నమైన సంగీత వాయిద్యాలు కలగలిసి మ్రోగుతూ మధురమైన నాదాన్ని సృష్టించినట్టు, పలు విభిన్నమైన అంశాలను ఒకచోట పేర్చి తాను కలిగించాలనుకున్న భావాన్ని ఉద్దీపితం చేయగలగటం సృజనాత్మకత.

‘బాంబుపేలింది’ బాంబు పేలిన తరువాత వాతావరణంలో మార్పు వచ్చింది. ప్రజల స్పందన, పశువుల స్పందన, ప్రజల మనస్సుల్లో గూడు కట్టుకున్న భయాందోళనలు వంటివన్నీ రచయిత పలు విభిన్న సందర్భాలలో చూసినవి, ఇపుడు కథలో ప్రదర్శించటం ద్వారా పాఠకుల కళ్ళముందు ఆ సంఘటనను అప్పటి ప్రజల మానసిక స్థితి ని, అభద్రతాభావాన్ని సజీవంగా నిలుపుతున్నాడు రచయిత.

ఇంతవరకూ వర్ణించిన వాతావరణాన్ని మనస్సును మరింతగా పట్టేందుకు ఓ summing up  లాంటి వ్యాఖ్య జోడించాడు. ‘అదొక విచిత్ర ప్రళయం….. అదొక క్షణిక మృత్యుతాండవం. అదొక అస్థిరోత్పాత.’ పదాల ఎంపిక చూడండి. అవి కలిగించే భావం చూడండి. ఒక్కొక్క పదం పరిస్థితి తీవ్రత స్థాయిని పెంచుతూ పోతుంది.

కథా రచన సంవిధానంలో ఇది ‘Visual Writing style’ అంటారు. ఆధునికులకు ‘Script Writing ‘ అంటే సులభంగా అర్థమౌతుంది. సాధారణ కథా రచన వేరు. దృశ్యమాధ్యమానికి స్ర్కిప్టు రచన వేరు. ఇవి వేర్వేరు ప్రక్రియలు అన్న ఆలోచన ఉంది. కానీ కొందరు రచయితల రచన పద్ధతి ఎంత విలక్షణమైనదంటే, వారి కథ రచన దాన్ని దృశ్యమాధ్యమానికి అనువదించేందుకు అతి సులభంగా వీలయ్యేట్టు ఉంటుంది. ’గొల్లరామవ్వ’ కథ ఇంతకాలం మన దృశ్యమాధ్యమ కళాకారుల దృష్టిలో పడకపోవటం సినీ కళాకారులకు సాహిత్యానికి ఉన్న దూరాన్ని సూచిస్తుంది.

ఇంతవరకూ కథలో వర్ణన మాత్రం ఉంది. కానీ ఈ వర్ణన కథ గమనానికి అడ్డువచ్చే వర్ణన కాదు. కథలో ఆనాటి పల్లెల్లో నెలకొని ఉన్న భయానక వాతావరణాన్ని పరిచయం చేస్తూ పాఠకుడిని తనతో పాటు ముందుకు తీసుకువెళ్తూ, తాను కలిగించాలనుకున్న భావనలను, ఆలోచనలను కలిగిస్తూ ముందుకు సాగే వర్ణన. ఇక్కడి నుంచి పాత్ర కథలో ప్రవేశిస్తాయి.

ఇక్కడ సృజనాత్మకతలోని మరోకోణం గమనించే వీలు చిక్కుతుంది. రాసే రచయిత ఒక్కడే కథలో పాత్రలు అనేకం. ఏ రచయిత అయితే ప్రతి పాత్ర తానే అయి రచనను సాగిస్తాడో, అ రచయిత సృజించిన పాత్రలు సజీవంగా నిలుస్తాయి. సాహిత్య ప్రపంచంలో చిరంజీవులుగా నిలుస్తాయి.

‘గొల్లరామవ్వ’లో పాత్రల వర్ణన ఉండదు. ఆమె తల నెరిసిపోయింది. పళ్ళూడిపోయాయి లాంటి specific  వర్ణనలు లేవు. ‘గొల్లరామవ్వ తన గుడిసెలో చీకటిలోనే కూర్చుని ఉంది. ఆమె కాళ్ళు చేతులు కూడా వణుకుతున్నవి. కొంత వృద్ధాప్యం వల్ల, కొంత భయం వల్ల ఇదీ ’గొల్లరామవ్వ’ Introduction. పాత్రలను కథలో ప్రవేశపెట్టటంలో ఇదొక విలక్షణమైన పద్ధతి. పాత్రల రూపం గురించి, లక్షణాల గురించి ఎలాంటి వర్ణన లేకుండా తిన్నగా పాత్రలను, అదేదో మామూలు విషయం అన్నట్టుగా ప్రవేశపెట్టటం. గుడిసెలో ముసలవ్వ కూర్చుని ఉంది. specific గా వర్ణిస్తే మన కళ్ళముందు ఒక రూపం నిలుస్తుంది. అలా వర్ణించకపోవటం వల్ల ‘గొల్లరామవ్వ’ నిజాం కాలంలోని    గ్రామంలోని సాధారణ ముసలవ్వ అయింది. ప్రతివారూ తనకు పరిచయం ఉన్న  ముసలవ్వను ఊహించుకుంటారు. దాంతో పాత్రతో కనెక్ట్ అవుతారు. కథను పాఠకులకు చేరువచేయటంలో సామాజిక చైతన్యంలో సుస్థిరంగా ప్రతిష్టించటంలో ఇలాంటి సార్వజనీనతను ఆపాదించటం ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆమె ఒళ్ళో పడుకున్న బాలిక ‘గిదేం చప్పుడే’ అనగానే ముసలవ్వ కసురుతుంది. ‘బాలిక మళ్ళీ మాట్లాడ సాహసించలేదు’ అని వ్యాఖ్యానిస్తాడు రచయిత. ఆ బాలిక గొల్ల రామవ్వకు ఎదురుచెప్పలేదని, ఆమె చెప్పినట్టు ప్రశ్నించక చేస్తుందని పాఠకుడికి అర్థమౌతుంది. కథ చివరలో ’మల్లీ! ఆ మూలకు మంచం వాల్చి గొంగడెయ్యె. పిల్లగా! అండ్ల పండుకో’ అని రామవ్వ ఆజ్ఞాపించినప్పుడు ఆ పాపనుంచి ఎలాంటి ప్రతిఘటన రాకపోవటం మనకు అర్థమౌతుంది. అమోదిస్తాం. కథా రచనలో ఇదొక పద్ధతి. ఒక్కపదం వ్యర్థం కాకూడదు. ఒక్క సంభాషణ అనవసరం కాకూడదు. కథారంభంలో జరిగిన సంభాషణ పరమార్థం కథ చివరలో తెలియాలి. ఒక్కమాట మాట్లాడి కసురబోగానే మళ్ళీ మాట్లాడ సాహసించని బాలిక రాములవ్వ ఆజ్ఞాపిస్తే కాదనే ప్రసక్తి లేదు. ఒక యువతి పరపురుషుడు అజ్ఞాతవ్యక్తిని దగ్గరకు ఎలా రానిచ్చింది అన్న సందేహానికి ఇది ఒక సమాధానమైతే, మానవత్వం దేశభక్తి అన్న సమాధానాలు కథలో అంతర్లీనంగా స్ఫురిస్తాయి. అంతేతప్ప రచయిత పనిగట్టుకుని ఆమె రామవ్వ మాట జవదాటదు, ఆమెకు దేశభక్తి అధికం లాంటి వ్యాఖ్యలు చేయనవసరం లేదు.

ఇక్కడ నుంచి కథలో రచయిత ‘ఇదీ’ అని తాను చెప్పకుండా పలు కీలకమైన అంశాలను పాఠకుడికి చేరువచేస్తాడు. కథలో పాత్రలు ప్రత్యక్షంగా పలికిన పలుకులకన్నా వారు అనని మాట్ల ద్వారా అసలు అర్థాన్ని స్ఫురింప చేయటం అత్యుత్తమరచన సంవిధానానికి అసలైన నిదర్శనం అంటారు. తలుపు శబ్దమవుతుంది.  మల్లమ్మ ‘నాకు బయమైతోందే అత్తా!’ అనటంతో ఆ కాలంలో ఒక నిస్సహాయ మహిళ భయాందోళనలు, నిస్సహాయ స్థితి  స్పష్టంగా తెలుస్తాయి. కిటికీలోంచి దూకిన ఆగంతకుడు రామవ్వ నోరు మూయగానే ఆమె మనసులో చెలరేగిన భావనలు ఆ కాలంలో అమాయకులపై జరిగిన అత్యాచారాలు, వారి నిస్సహాయత, దయనీయ స్థితులను చెప్పకనే చెప్తాయి. ఇక్కడ రచయిత ప్రత్యక్షంగా ఏమీ చెప్పటం లేదు. పాత్ర మానసిక స్థితి ద్వారా ఆనాటి స్థితిగతులను ప్రకాశమానం చేస్తున్నాడు రచయిత. గొల్ల రామవ్వ మనసులో చెలరేగిన ఆలోచనల ద్వారా ఆకాలంలో సామన్యుల ఆలోచనలను పాఠకులకు చేరువ చేస్తున్నాడు రచయిత. ఈ సందర్భంలో రచయిత గొల్లరామవ్వ మనసులో దూరి ఆమె మనసును పాఠకులకు ప్రదర్శిస్తున్నాడు. అంటే రచయిత పాత్ర అయిపోయాడన్నమాట. కొందరు విమర్శకులు రచయితను సినీనటుడితో పోలుస్తారు. కానీ సినీనటుడు సినిమాలో ఒకేపాత్ర పోషిస్తాడు. రచయిత కథలో ప్రతి పాత్రా తానే అవుతాడు. ప్రతి పాత్రలో తాను జీవించి ఆయా పాత్రల అంతరంగాల లోతులను ఆవిష్కరిస్తాడు.

ఇక్కడ గమనించాల్సిన మరో అంశం ఉంది. రామవ్వ యువకుడిని తడిమినప్పుడు రచయిత మనసు రామవ్వ చేతికి తగిలిన వాటిని వివరించటం ద్వారా ఆ యువకుడి పరిస్థితిని బోధపరుస్తాడు. ‘దేహమంత పల్లేరుకాయలు చిగురంత, జిట్తరేగుముండ్లు అంటుకుని ఎండిపోయిన రేగటి మన్ను, ఆ మంటిలో చిక్కుకొనియున్న తుంగపోచలు, గడ్డిపోచలు, వెంపలాకులు తాటిపీచు వగైరా – ఇవన్నీ ముసలమ్మ చేతులకు కండ్లున్నవా అన్నట్టు గోచరించినవి’ అని వర్ణిస్తాడు రచయిత. రచయిత గొల్లరామవ్వ రూపురేఖలను వర్ణించలేదు. కానీ ఆ యువకుడిని తడిమినప్పుడు ఆమె చేతులే కళ్ళయి దర్శించిన వాటిని మనకు చూపటం ద్వారా ఆ యువకుడు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు పడిన కష్టాలను, దాక్కున్న చెట్ల పొదలను, పాకిన మట్టిని చూపిస్తున్నాడు. ఇదంతా రామవ్వ దృక్కోణంలో చూపిస్తున్నాడు. దృశ్యమాధ్యమంలో దీన్ని POV,  Point Of View  అంటారు. ఆమెకేం తెలుస్తుందో మనకు అదే తెలుస్తోంది. ఆ తెలియటం ద్వారా రచయిత ప్రత్యక్షంగా చెప్పనిది మనకు బోధపడుతుంది. ఇలా పరోక్షంగా తెలియటం వల్ల కథ పాఠకుడికి  మరింత చేరువ అవుతుంది. రచయిత అరటిపండు ఒలిచి అందించినట్టు అన్నీ చెప్తున్నట్టుండే కన్నా ఇలా సూచనీయంగా చెప్పటం వల్ల కథ చదువుతున్న పాఠకుడి మెదడు ఆలోచిస్తూంటుంది. చురుకుగా పనిచేస్తుంది.

‘స్పర్శతోనే  ఈ పరిస్థితినంతా గమనించింది ముసలవ్వ. ఆ వ్యక్తి నిస్సహాయుడు. అపాయస్థితిలో హఠాత్తుగా తటస్థించిన శరణాగతుడు. ‘ఇక ఇక్కడునుంచీ ముసలవ్వ ప్రవర్తన మారిపోతుంది. ఒక కమాండర్‍లా ఆజ్ఞలు జారీచేస్తుంది. పరిస్థితిని అదుపులోకి తీసుకుంటుంది. ఇది సర్వ సాధారణంగా జరిగేదే. ఒక నిస్సహాయ స్థితిలో అనుభవజ్ఞులైన ఎవరో ఒకరు నడుం బిగిస్తారు. చకచకా ఆజ్ఞలు జారీ చేస్తారు. క్షణంలో పరిస్థితి చక్కదిద్దుతారు. ఇక్కడ ముసలవ్వ అదే చేస్తుంది. చకచకా ఆజ్ఞలు జారీచేస్తుంది.

ఈ సందర్భంలో కూడా రచయిత ప్రత్యక్షంగ దేన్నీ చెప్పడు. అన్నీ రామవ్వ సంభాషణల ద్వారా పరోక్షంగా పాఠకుడికి బోధపడేట్టు చేస్తాడు. ’మల్లి పోరీ కుంపటి మీద కడుముంతెడు నీళ్ళెక్కియ్యె…. అబ్బ! ముంజగిన్నెరోలె కదుల్తది ముచ్చుముండ! ఈడ పోరని పానం పోతాందంటే దీనికి నిద్దర మచ్చీ వదల్లేదు! ఈ రకంగా రామవ్వ మాటలు, ఆమె ఇచ్చే ఆజ్ఞలు, చేసే హడావుడి, మధమధ్యలో మల్లిని తొందరపెట్టే విధానం, విమర్శించే విధానం,’ఉన్నదే ఒనరు నీ దగ్గిర’ అని మెచ్చుకోవటం…. ఒనరు అంటే ’హునర్’ అనే ఉర్దూ పదానికి తెలుగురూపం. హూనర్ అంటే టాలెంట్. ఇలా యువకుడి శరీరం నుంచి ముళ్లు తీయటానికి మల్లమ్మ జంకుతుందని చెప్పేందుకు ”అయ్యో! సిగ్గయితుందా వాన్ని ముట్టుకుంటే? ఏం మానవా వతివి గదనే! నీ సిగ్గు అగ్గిలబడ! వాని పానం దీత్తవా యేం సిగ్గు సిగ్గు అనుకుంటు?’ ఇక్కడ రచయిత రామవ్వతో మాట్లాడించిన మాటల్లో అనుభవం ఉంది. అభిమానం ఉంది. మానవత్వం ఉంది. జీవిత సత్యం ఉంది. ఒక ప్రాణం నిలపటం ముఖ్యం. ’సిగ్గయితుందా?’ వాని పానందీత్తవా సిగ్గుసిగ్గనుకుంట’ అన్న సంభాషణలు భవిష్యత్తులో కథలో జరగబోయే సంఘటనకు మార్గం సుగమo చేస్తున్నాయి. మానవత్వానికి మనిషి ప్రాణం నిలపటానికి ఇచ్చే ప్రాధాన్యత స్పష్టం చేస్తున్నాయి సంభాషణలు.

ఇంతవరకూ రామవ్వ వైపునుంచి కథ చెప్పిన రచయిత ఇప్పుడు హఠాత్తుగా యువకుడి మనసులో భావాలను మనకు చెప్తాడు. అంటే కథను కాసేపు యువకుడి దృక్కోణంతో చూపిస్తాడన్నమాట. ఇది ఎందుకో మనకు రామవ్వ ‘ఇద్దర్ను! కాని ఇంకిద్దరు మిగిలిన్రు  కొడకా! సగం పనే చేసినవు!’ అని అన్నప్పుడు యువకుడు ఎంతగా చకితుడౌతాడో పాఠకుడు కూడా అంతగా చకితులయ్యేందుకు.  సస్పెన్స్ రచన పద్ధతి ఇది. సినిమాల్లో కెమెరా ఒక పాత్రను వెంబడిస్తుంది. పాత్ర ఎంతవరకు కనిపిస్తుందో ప్రేక్షకుడికి అంత కనిపిస్తుంది. పాత్రపైకి  కనబడని వైపునుంచి ఏదో దూకినప్పుడు పాత్ర ఎంత ఉలిక్కిపడుతుందో, ప్రేక్షకుడూ అంతే ఉలిక్కి పడతాడు. యువకుడి దగ్గర తుపాకీ దొరకగానే రామవ్వ ‘ముఖలక్షణాలు వర్ణనాతీతంగా మార్పు చెందినవి’ అంటాడు రచయిత. ఆ తరువాత ‘యువకుడు ముసలవ్వ ముఖాన్ని సూక్ష్మంగా పరీక్షిస్తున్నాడు’ అంటూ ఆమెకు  అనవసరంగా తుపాకీ గురించి చెప్పానని అతను బాధపడటం గ్రామస్తుల పిరికితనం వల్ల తోటి కార్యకర్తలు పట్టుబడ్డారని ఆలోచించటం  పాఠకుడిలో గొల్లరామవ్వ స్పందన ఎలా ఉంటుందో తెలుపుతుంది. పాఠకుడు రచయిత చూపుతున్న కోణంలోనే ఆలోచిస్తాడు. పాఠకుడు రామవ్వ స్పందనను నిర్థారించుకోగానే ఒక్కసారి ఆమె పని సగమే చేశావు ‘ఇంకా ఇద్దరు మిగిలిఉన్నరు’ అంటుంది. ఇది పాఠకుడు ఊహించి ఉండడు. ఆమె అ మాట అనగానే ‘ఒహ్’ అనిపిస్తుంది పాఠకుడికి ఆ యువకుడిలాగే. ఇదీ సృజనాత్మకత. అంతవరకూ కథను రామవ్వ దృక్కోణంలో చెప్తున్న రచయిత అదే ధోరణిలో కథను కొనసాగిస్తూ, తుపాకీ చూసి ‘సగం పనే చేసినావు’ అనే ఇవే సంభాషణలు అని ఉంటే ఇప్పుడు చూపినంత ప్రభావం చూపేదికాదు  సంభాషణ. రచయిత కావాలని దృక్కోణం మార్చి తాను అనుకున్న రీతిలో పాఠకుడి మనసులో ఆలోచనలు నింపి, హఠాత్తుగా పాఠకుడు ఊహించని రీతిలో భిన్నమైన రీతిలో పాత్ర ప్రవర్తించేట్టు  చేయటంతో ఈ సంభాషణ మరపురాని సంభాషణగా మిగులుతుంది. ఇదీ సృజనాత్మకత. మామూలుగా చెప్పే విషయాన్ని అసాధారణమైన ప్రభావం కలిగించే రీతిలో చెప్పటం. ఇక్కడ మనం మరో విషయం ప్రస్తావించుకోవాలి.

ఒక రచయిత ఎన్ని విభిన్నమైన రచనలు చేయనీ, ఎన్ని విచిత్రమైన పోకడలు పోనీ అతని రచనలో అతని వ్యక్తిత్వం కనిపిస్తుంది. పి.వి నరసింహారావు గారు స్వతహాగా demonstrative కాదు. ‘drama’ ఆయన వ్యక్తిత్వంలో లేదు. కానీ ఆయన ప్రతిచర్య దీర్ఘకాలిక ప్రభావం చూపించేది. ’గొల్లరామవ్వ’ కథలో ఎక్కడా పటాటోపాలు, melodramaలు అనవసర ఆర్భాటాలు లేవు. కథ సూటిగా  తిన్నగా సాగుతోంది. కేవలం దృక్కోణం మార్చి చెప్పటం  వల్ల కథలో అత్యద్భుతమైన ‘ప్రభావం’ సాధించటం గమనించవచ్చు. కథలో పాత్రల్లో  కూడా melodrama లేదు. కానీ పాఠకులను అత్యంత శక్తివంతంగా ప్రభావితం చేస్తాయి. గొల్లరామవ్వకూ, యువకుడికీ  నడుమ జరిగిన సంభాషణ అత్యంత ఆసక్తికరమైనదే కాదు ఒకరకంగా సామాన్య జనుల దృక్కోణాన్ని, రచయిత అభిప్రాయాలను వ్యక్తపరుస్తుంది. ‘పెద్దపెద్దోల్లేమో ముచ్చట్లు పెట్టుకుంట కూకుంటరంట! పసిపోరగాల్లనేమో పోలీసోల్ల మీదికి పొమ్మంటరంట’ ఇది ఆ కాలంలోనే కాదు ఇప్పటికీ మనం చూడవచ్చు. timeless wisdom of a village elderly women! (ఈ సంభషణను విశ్లషించేందుకు ప్రత్యేక ప్రసంగం అవసరం అవుతుంది.)

యువకుడు నిద్రపోయిన తరువాత రామవ్వ ఆలోచనలు జరుగబోయే సంఘటన పట్ల ఉద్విగ్నతను పెంచుతాయి. పోలీసులు వస్తే జరిగే అనర్థం గురించి పాఠకుడిలో ఉద్విగ్నతను పెంచుతాయి.

ఇక్కడ మళ్ళీ దృశ్యాత్మకమైన సంవిధానం చూడవచ్చు. తద్వారా కథలో ఉద్విగ్నతను పెంచటం గమనించవచ్చు.

‘అకస్మాత్తుగా బజార్లో మోటార్ ట్రక్కు చప్పుడైంది. ఎటు విన్నా బూటుకాళ్ళ తటతటలే వినరాసాగినవి. ఏవో అరుపులు, తురక భాషలో తిట్లు, దుర్భాషలు, ప్రగల్భాలు, ఛటేల్ ఛటేల్ మని కొరడా దెబ్బలు…’

ఇదంతా గుడిసెలో ఉన్న రామవ్వకు వినిపిస్తున్న శబ్దాలు మనకు చూపిస్తున్నాడు రచయిత. ఇక్కడ మరోసారి ముసలవ్వ రూపాంతరం చెందటం అద్భుతంగా చూపిస్తాడు రచయిత.

కథ ఆరంభంలో ఆమెలో భయం చూపించాడు. యువకుడి వల్ల ప్రమాదం లేదని గ్రహించిన తరువాత పరిస్థితిని అదుపులో తీసుకున్న కమాండర్‍ను చూపించాడు. చర్చల సమయంలో విషయాన్ని లోతుగా అర్థం చేసుకుని జగతి రీతిని గ్రహించి వాఖ్యానించే మేధావిని చూపించాడు ఇప్పుడు ‘ముసలవ్వ స్థితి మాత్రం చెప్పేటట్టు లేదు. అది భయం కాదు, వ్యాకులత కాదు, దుఃఖము అసలే కాదు. అపూర్వమైన నిశ్చలత్వం గాంభీర్యం ఆమెలో ప్రవేశించినవి. బయట హహాకారం, చలి సోకిన కొద్దీ ఆమెలో కూడా అదొక రకపు ఉద్వేగం బయలు దేరసాగింది.’

వ్యక్తులు స్వతహాగా భయస్తులు. వీలైనంత వరకూ ’ఎందుకులే గొడవ’ అని పక్కకు తప్పుకుపోవాలని చూస్తారు. కాని తప్పనిసరిగా ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ’పిల్లి కూడా మార్గం లేనపుడు పులిలా మీదపడే చందాన వారిలో ఓ రకమైన తెగింపు వస్తుంది. రామవ్వలో ఆ తెగింపు రావటాన్ని అత్యంత సరళంగా దృశ్యాత్మకంగా చూపిస్తున్నాడు రచయిత.

ఇక ఆ తరువాత పోలీసులతో ఆమె మాట్లాడిన మాటలు, వ్యవహరించిన తీరు, ఆ మాటలలో దాగిఉన్న గడుసుదనం. ఆ మాటల్లో అంతర్లీనంగా ద్యోతకమయ్యే ఆకాలం నాటి పరిస్థితులు, భయాలు, నిస్సహాయ వేదనలు, రామవ్వ నటన ఒకటేమిటి…. ఈ కథలో అత్యంత జాగ్రత్తగా, పఠించి, విశ్లేషించాల్సిన భాగం ఇది. రచయిత రచన ప్రతిభకు అద్దం పడుతుందీ భాగం. రామవ్వ సంభాషణలతో మనకు active scene ను రచయిత చూపిస్తాడు. అత్యంత చంచలము, చైతన్యవంతమైన దృశ్యం ఇది. బయట పోలీసులు తలుపు బాదుతుంటారు. లోపలనుంచి రామవ్వ వారిని తిడుతూ, లోపలున్న  వారికి ఆజ్ఞలు జారీచేస్తుంది. తలుపు తీయటం ఆలస్యం చేయటం వల్ల లోపలున్న వారికి సమయం కల్పిస్తోంది.’’ఇగనిన్న మొగడచ్చిండేమో దానికి పట్టపగ్గాల్లేకుంటున్నది. ఏ పని చెప్పినా యినిపించుకోడు. నడుమనే ఆగమైతాంది. మొగన్ని చూచి మురిసిపోతుంది’ ఇవి complaints ఆ! పోలీసులకు పరిస్థితి వివరించటము! లోపలున్న వారికి instructions ఇవ్వటమూ! ఇదంతా ఒకేసారి జరిగిపోతుంది. అత్యద్భుతమైన రచన సంవిధానం ఇది. పోలీసులు లోపలకు వచ్చిన తరువాత వారిని దబాయించిన విధానం అద్భుతం. ’అప్పటి  తీవ్రతకు, ఇప్పటి విధేయతకు పోలీసులు చకితులైనారు. ఏమనుకోవాలో, ఏం చేయాలో తోచలేదు వారికి’

వారికే కాదు మనకూ ఆశ్చర్యం కలుగుతుంది. క్షణక్షణానికి రంగులుమార్చి ఊసరవెల్లిలా మాటలు, చేతలు మారుస్తున్న రామవ్వ విజ్ఞతకు నిశ్చేష్టులమవుతాం. ఆరంభంలో వయసుతో భయంతో వణికే గొల్లిరామవ్వ చివరలో ’అవ్వా! నీవు సామాన్యురాలవు కావు. సాక్షాత్ భారతమాతవే’ అని ఆ యువకుడు అన్నప్పుడు అతడితో  ఏకీభవిస్తూనే ఒక పదిపేజీల కథలో ఒక సామాన్య నిరక్షరాస్య ముసలవ్వను భరతమాత స్థాయికి ఎదిగింపచేసి అందరూ ఆమోదించేట్టు చేసిన రచయిత సృజనాత్మక ప్రతిభకు జోహార్లు అర్పించాలనిపిస్తుంది.

మళ్ళీ హఠాత్తుగా ‘నాకీ పేర్లబెడుతున్నావు? నాపేరు గొల్లరామి గంతే’ అని అనటంతో పాత్ర మరింత ఎలివేట్ అవుతుంది.

ఆరంభంలో సృజనాత్మకత అంటే ఉన్నదాన్నే కొత్తరూపంలోకి మార్చటం అని చెప్పుకున్నాం. ఇప్పుడీ గొల్లరామవ్వ కథ చదివితే ఆ నిర్వచనానికి తిరుగులేని దృష్టాంతం ఈ కథ అని స్పష్టం అవుతుంది.

ఈ కథ జరిగింది. ఎలా జరిగింది? ఇలాగే జరిగిందా? ఇంకో రకంగా జరిగిందా? ఎవరికి జరిగింది? అన్నది అనవసరం. ఈ సంఘటనను రచయిత తన సృజనాత్మకతతో ఒక స్ఫూర్తినిచ్చే అత్యద్భుతమైన కథగా రూపొందించాడు. తరతరాలు చదివి అచ్చెరువొంది, భారతదేశపు మహిళల ఔన్నత్యాన్ని, త్యాగనిరతిని దేశభక్తిని అత్యద్భుతమైన మానవత్వాన్ని అంతులేని విజ్ఞతను అవగాహన చేసుకుని, ఒక  Mother India ని,  ఈ సమాజ శక్తిని అర్థం చేసుకునే రీతిలో కథను సృజించాడు. ఎలాగైతే energy changes from one from to another అంటారో అలాగే ఒక అత్యద్భుతమైన సంఘటన అత్యంత ప్రభావితమైన కథగా రూపాంతరం చెందింది. కథ అదే. కానీ సృజనాత్మక సరస్సులో స్నానమాడి వింత వెలుగును అలుముకుని, కొత్త వెలుగులు ప్రసరిస్తూ సాహిత్య ప్రపంచంలో అలలారుతోంది. ఇది సృజనాత్మకత.

మనకు పి.వి నరసింహారావు సృజనాత్మక రచనలు పరిమితంగా లభ్యం అవుతున్నాయి. కానీ ఆ పరిమిత రచనల్లో అపరిమితంగా ద్యోతకమయ్యే సృజనాత్మకతను ఇంకా విశ్లేషించాల్సి ఉంది. ఒక్క గొల్లరామవ్వ కథను లోతుల్లోకి వెళ్ళకుండా ఇంకా అనేక కోణాలు స్పృశించకుండా విహంగవీక్షణానికే ఇంత సమయం అవసరమైంది. ఆయన రచనలను లోతుగా విశ్లేషించి ప్రతి ఒక్క అంశాన్ని సరైన రీతిలో అర్థం చేసుకోవాల్సి ఉంది. ఇది భవిష్యత్తులో ఉద్యమంలా జరగాల్సిన కార్యక్రమం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here