[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]
[dropcap]కా[/dropcap]నీ రాజేశ్వరి గారు, దామోదరరావు గారు వివాహం చేసుకున్నాకా, ఆవిడకి ఇది ఒక సమస్య కూడా అయింది… అదెలా అంటే, మిగతా సభ్యురాళ్ళు, ఇది వరకు ఆవిడ సంబంధాలు చూపిస్తే చేసుకునేవారు, ఇప్పుడు ‘మీ ఆయన లాంటి వరుడే కావాలం’టున్నారు! బాగా డబ్బూ, చదువూ, సమాజంలో హోదా, ఇంటర్నేషనల్ ట్రావెల్స్, ఖరీదైన జీవితం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు… “నిన్న వాకింగ్‌కి వెళ్తే, కె.బి.ఆర్. పార్క్‌లో ఒకావిడ, ‘మీరు లక్కీ ఛాన్స్ కొట్టేసారు, మీ భర్త లాంటి ఆయన దొరికితే చెప్పండి, నేనూ చేసుకుంటాను’ అంది” అంటూ ఆవిడ బాగా నవ్వి, “మరి మా ఆయన నాలో ఏం చూసారో తెలుసా? తన పక్కన పొడుగ్గా వుండాలి, లావుగా వుండకూడదు.. మంచి ఇంగ్లీష్ మాట్లాడాలి, A.G.Rao Foundation అని ఆయన తండ్రిగారి ఆర్గనైజేషన్‍లో స్థాపించిన కాన్సెప్ట్ స్కూల్స్ చూసుకోవాలి, ఇంటర్నేషనల్ ట్రావెల్స్‌లో అన్ని ఏర్పాట్లూ చూసుకోవాలి, మంచి ఇంటలిజెంట్ కంపెనీ ఇవ్వాలి – అని! నేను వంటా, ఇంటి పనులూ చెయ్యను అని మొదటే చెప్పాను” అన్నారావిడ.
మనుషులు చాలా వరకూ తమకేం కావాలో క్లియర్‍గా వుంటారు కానీ, తాను ఎలా వుండాలని ఎదుటివారు ఎక్స్‌పెక్ట్ చేస్తారో ఆలోచించరు! ప్రతి వాళ్ళకీ, “నాలో లేనిది ఆవిడలో ఏముంది? ఇంతమంచి అవకాశాలు రావడానికి?” అని ఆలోచిస్తారు. డెఫినెట్‍గా ఆవిడకి ఎక్కువ అర్హతలు కానీ, మనకి తెలీని ఒక ప్రత్యేక అర్హత కానీ వుంటుంది, మనకి రాని అవకాశం దొరకడానికి.
రచయిత్రులు చాలా మంది “రమణీ ఏమంత గొప్ప? మనమూ కథలూ, నవలలూ రాస్తాం… కానీ టీవీ, సినిమా ఫీల్డుకి వెళ్ళలేకపోయాం… బహుశా… ఇంకేదో వుండి వుంటుంది” అని వ్యంగ్యార్థాలతో మాట్లాడి, వంకర నవ్వు నవ్వుతారని నా మగ రచయిత స్నేహితులు చెప్తే, నవ్వి “వాళ్ళు అనుకునేది… వాళ్ళలో లేదుగా?” అంటాను. నిజానికి కథ అందరూ రాస్తారు, నవల చాలామంది రాస్తారు. కానీ కమర్షియల్‍గా రాయడానికి ట్రైనింగ్ కావాలి.. ఎదుటివాడి చేత డబ్బులు ఖర్చు పెట్టించి పుస్తకం కొనిపించడం, సీరియల్‍కి ప్రొడ్యూసర్ డబ్బులిచ్చేట్టు డైలాగ్స్ రాయడం, సినిమాకి కథ ఒప్పించడానికి… కమర్షియల్ పాయింట్ డైరక్టర్‍కి కనిపించాలి. డైలాగ్ రైటింగ్‌లో బ్రీవిటీ ఇంటెలిజెన్స్, మనుషులకి కనెక్టివిటీ ప్రధానాంశాలు! ఇవన్నీ నేను చిన్నప్పటి నుండీ చదువుతున్న రచయితలు – విశ్వనాథ వారూ, శరత్ చంద్ర ఛటర్జీ, చలం, రంగనాయకమ్మా, వీరేంద్రనాథ్‌ల భాషా ప్రయోగాల వల్ల, సీన్ కన్సీవ్ చేసే విధానాల వల్లా నాకు అబ్బాయి! ఇవి చదివిన వారంతా కమర్షియల్ రైటర్స్ అయిపోలేరు… ఇవన్నీ పక్కన పెడ్తే కథ నెరేట్ చేసే పద్ధతి చాలా ముఖ్యం… ఎదుటివారితో సంభాషించడం కూడా ఒక కళ! పెద్ద పెద్ద రైటర్స్ స్టోరీ నెరేషన్ చండాలంగా చెయ్యడం చూసాను… కొంతమంది పేరున్నవాళ్ళు సిట్టింగ్స్‌లో కూర్చుని డిస్కస్ చేసేటప్పుడు ఒక్క మాట మాట్లాడరు… మాట్లాడినా తడబాటూ, కంగారూ, మనసులో వున్నది చెప్పలేకపోవడం… ఇవన్నీ కారణాలు… నాకన్నా బాగా నెరేట్ చేసి, సీన్ కన్సీవ్ చేసే అసిస్టెంట్‍లనీ, అసిస్టెంట్ డైరక్టర్స్‌నీ నేను అప్రీషియేట్ చేసాను. నా రికమెండేషన్ వల్ల వాళ్ళు పెద్ద పెద్ద దర్శకుల వద్ద పని చేసే అవకాశం లభించి, ఆ తరువాత పెద్ద పెద్ద డైరక్టర్లు అయ్యరు. అది వాళ్ళలో వుంది, నాలో లేదు! మన అర్హతలని బట్టి మన ప్రాప్తం! ఎదుటివారి మీద ఏడవడం మానేసి ఈ దిశలో కృషి చెయ్యాలి.
నేను ఏ సంఘాల్లో చేరలేదు! ఏ మీటింగ్స్‌కీ ఎక్కువగా వెళ్ళలేదు! ఎప్పుడూ సాటివారితో కాకమ్మ కబుర్లు చెప్పలేదు! తల ఎత్తకుండా 23 సీరియల్స్, 11 సినిమాలు, 22 నవలలు, ఎన్నో కథలు, ఎన్నో కాలమ్స్ రాసాను, ఇప్పుడు వెబ్ సిరీస్ చేస్తున్నాను. మిగతా రచయిత్రులు అనుకునే ‘వెకిలి’ కారణాలు (కొందరు చెప్పారు కాబట్టి)తో అయితే ఎప్పుడో ఫీల్డ్ నుంచి వైదొలగేదాన్ని! ఎంత ఇష్టం అయినా ప్రొడ్యూసర్‍కి డబ్బులొచ్చే కంటెంట్ ఇవ్వకపోతే రైటర్‍గా కొనసాగనివ్వడు… రచయిత మాత్రం ప్రతినిత్యం చస్తూ పుడ్తూ కొత్త జన్మ ఎత్తాల్సిన ఫీల్డ్ ఇది!
ఇదే ‘తోడూ నీడా’ రాజేశ్వరి గారి కేస్ కూడా! ఆవిడ ఎఫిషియన్సీ, ఆవిడ చొరవా ఈ స్థాయికి రావడానికీ, ఓ గొప్ప వ్యక్తి తన హృదయంలోకి ఆహ్వానించడానికీ కారణాలు! అఫ్‍కోర్స్ ఆ జంట అందంగా, హుందాగా, మేడ్ ఫర్ ఈచ్ అదర్‌లా వుంటారనుకోండి.
‘తోడూ నీడా’ కార్యక్రమాలకి నేను చీఫ్ గెస్ట్‌గా రెండు సందర్భాలో వెళ్ళాను. ‘తోడూ నీడా’ పంచమ వార్షికోత్సవ కార్యక్రమానికి నేను చీఫ్ గెస్ట్‌గా వెళ్ళినప్పుడు శ్రీ రావి కొండల రావు గారు కూడా గౌరవ అతిథిగా వచ్చారు. అక్కడ జరిగిన వివాహాలు, ఒక్కొక్కటీ, ఒక్కో నవలకి సరిపడా కంటెంట్ ఇస్తాయి. పెద్ద వయసులో ఇంట్లో పిల్లలు వ్యతిరేకిస్తే, అరవై పై బడ్డ జంటలు, పారిపోయి వచ్చి పెళ్ళి చేసుకోవడం, ఆ ఎడ్వంచర్స్ బావుంటాయి. C/o కంచరపాలెం లాస్ట్ సీన్ లాంటివి.
ఒక్క ముక్క హిందీ రాని తెలుగావిడని ఒక గుజరాతీ వ్యక్తి పెళ్ళి చేసుకున్నాడు. ఆవిడ అన్నం పెడ్తుంది… ఆయనకి రొట్టె అలవాటు. ఆవిడ బ్రాహ్మణ స్త్రీ, నాన్ వెజ్ తినదు… ఆయన నాన్ వెజిటేరియన్. ఆవిడకి సిగరెట్, డ్రింకింగ్ అంటే అసహ్యం, ఆయన చైన్ స్మోకర్… సంవత్సరం కాపురం చేసాకా, ఆయన మాతో పంచుకున్న విషయాలు ఇవి – “ఆవిడ నెయ్యి వేసి అన్నంలో పచ్చడి కలిపి చేతికి ముద్దలు అందిస్తూ వుంటే, రొట్టెలు మరిచిపోయాను… ఆవిడ బోలెడు కష్టాలు పడి వచ్చాను మొదటి భర్త వల్ల అని చెప్పినప్పుడు, డ్రింకింగ్ మానేసాను… మల్లెపూలు, అగరవత్తులూ స్మెల్ బావుంటుందని ఆవిడ చెప్పాకా, స్మోకింగ్ మానేసాను… ఆవిడకి ఇష్టం వుండదని నాన్ వెజ్ మానేసాను… ఆవిడ ప్రేమ ముందు ఇవన్నీ చిన్న విషయాలు” అన్నాడు.
డెబ్బై ఏళ్ళ వయసులో అరవై పైబడ్డ స్త్రీని ద్వితీయ వివాహం చేసుకున్న మనిషి చెప్పిన విషయాలు ఇవి! దీనికి కొసమెరుపు ఏంటంటే, ఆ వ్యక్తి కూతురు “ఇప్పుడు నా కాపురం నేను హాయిగా చేసుకోగలుగుతున్నాను, అమ్మ వచ్చాకా నాన్న గురించి నాకు దిగులు ఉండడం లేదు” అని చెప్పడం!
ముఖ్యంగా పిల్లలు వ్యతిరేకించిన వివాహాలు అనీ ఆస్తి కోసమే అయి వుంటాయి. ఈ కొత్త ఆవిడకి తండ్రి ఆస్తిలో వాటా ఇవ్వవలసి వుంటుందని బాధ. అది సహజమే! కొంతమంది స్త్రీలు మా రాజేశ్వరి గారి లాంటి వాళ్ళు ‘మీ ఆస్తిలో నాకు భాగం ఇవ్వనక్కర్లేదు’ అని రాసి ఇచ్చేస్తారు. ఆయన నవ్వి ఆ కాయితం ఆవిడకే ఇచ్చేసారుట. ఇలా కూడా చెయ్యొచ్చు! కానీ ఒక బీద స్త్రీ ఎన్నో కష్టాలు పడి, తనకంటూ ఓ ఇల్లు కావాలని ఈ లేట్ వయసులో పెళ్ళి చేసుకుంటే, నీకు బతికినంత కాలం అన్నం తప్ప, ఆస్తిలో భాగం లేదు అంటే ఎందుకు చేసుకుంటుంది? వంట మనిషీ, పని మనిషీ కాదుగా? ఇది కూడా ఆలోచించాలి!
స్వార్జితం మీద బిడ్డలకి హక్కు వుండదు! అందుకే తల్లి తండ్రులు తమని చదివించి, పెద్దవాళ్ళని చేసాకా, వారి ఇష్టాలకి వాళ్ళని వదిలెయ్యాలి. భోజనం, ఇల్లూ కాకుండా వారు మనిషి సమక్షం, సామీప్యం, ఇంకొకరి సమయం ఆశిస్తున్నప్పుడు చట్ట సమ్మతంగా పెళ్ళి చేసుకోనివ్వడమే ఉత్తమం… అసాంఘీక కార్యకలాపాల వల్ల ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, పరువు నష్టం కూడా సంభవించవచ్చు!
ఈ పెళ్ళిళ్ళు చెయ్యడాలే కాకుండా, ఆవిడ వృద్ధులకి హోం నడిపేవారు. అదీ, వర్కింగ్ డేస్ మాత్రమే తల్లి తండ్రులని అక్కడ వుంచవచ్చు. లేదా ఒక వారంతంలో ఏక్టివిటీస్ కోసం వాళ్ళని దింపవచ్చు! అక్కడ వృద్ధులలో ఒకరికి ప్రభాస్, ఒకావిడకి తమన్నా అని నేను పేర్లు పెట్టాను. వాళ్ళు ‘బాహుబలి’ వచ్చిన కొత్తల్లో ‘పచ్చ బొట్టేసినా…’ పాటకి ఎంతో చక్కగా, అవే స్టెప్పులు వేస్తూ డాన్స్ చేసేవారు. ఎటువంటి ఇన్హిబిషన్స్ పెట్టుకోకుండా, సాటివారితో, తమ ఏజ్ గ్రూప్ వారితో డాన్స్‌లూ, పాటలూ, మిమిక్రీలూ, హౌసీ ఆడడాలూ, మ్యూజికల్ ఛైర్స్; దసరా వస్తే ‘బతుకమ్మ’ ఆడడం, ఇవన్నీ సందడిగా చేస్తారు. నేను అమ్మని వనభోజనాలకి తీసుకెళ్ళాను. ఆటల్లోనే ఒంటరిగా వచ్చి, జంటలై పోయిన వారూ వున్నారు! మా స్నేహితురాలు దివ్యజ్యోతిని కూడా నా వెంట రెండు మూడు సార్లు ‘తోడూ నీడా’ కార్యకలాపాలకి తీసుకెళ్ళాను. “కొంపదీసి మనకీ పెళ్ళి సంబంధాలు వస్తాయోమో ఇక్కడ ఎక్కువగా కనిపించడం వల్ల” అని నవ్వుకున్నాము.
ముఖ్యంగా రాజగోపాలరావు పరిమి అనే రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ గారు, అందరికీ యోగా నేర్పించేవారు. ఆయన బావుండేవారు, మంచి ఫిజిక్‍తో. చాలా మంది స్త్రీలు ఆయన్ని చేసుకోవాలని అనుకుని, అభిలాష వ్యక్తం చేసారు. కానీ ఆయన చిన్నప్పటి స్నేహం అయిన, భర్త పోయి అమెరికాలో కొడుకు దగ్గర వుంటున్న తన మేన మరదలిని వివాహం చేసుకున్నారు. ఆ పెళ్ళికి నేనూ జ్యోతీ వెళ్ళాం! పెళ్ళి కూతుర్ని చెయ్యడం దగ్గర్నుంచి శాస్త్రోక్తంగా పీటల పెళ్ళి జరిపించడం దాకా, మా రాజేశ్వరి గారి ఆధ్వర్యంలో జరిగింది. ఆయన నా యోగా గురూ కూడా. మా డ్రైవర్ కారు తీసుకెళ్తే, రోజూ వచ్చి నాకు నెల పాటు యోగా నేర్పించారు.
(సశేషం)