[box type=’note’ fontsize=’16’] శ్రీ సన్నిహిత్ వ్రాసిన ‘కలగంటినే చెలీ’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]
[dropcap]ఇం[/dropcap]టికొచ్చి కాళ్ళు కడుక్కున్నాడు. పార్వతమ్మ కంచంలో అన్నం కూర పెట్టి ఇచ్చింది. ఆవురావురుమని తినసాగాడు సూర్యం.
తిన్నాక చేతులు కడుక్కుని పుస్తకాల బేగ్ ఓపెన్ చేసాడు.
పొద్దున్న మేథ్స్ సార్ చెప్పిన ప్రోబ్లమ్స్ మళ్ళీ ప్రాక్టీసు చెయ్యసాగాడు. చూస్తుండగానే సాయంత్రం అయింది. బద్ధకంగా వళ్ళు విరుచుకుంటూ లేచి కొంచెం ఫ్రెష్ అయ్యాడు.
“అమ్మా…. అలా గుడి దాకా వెళ్ళొస్తాను” అని చెప్పి బయటపడ్డాడు.
పార్వతమ్మ సూర్యాన్ని ఎప్పుడూ కట్టడి చెయ్యదు. వయసొచ్చిన కుర్రాడు అన్న భయం మనసులో ఉన్నా సూర్యం మీద ఉన్న నమ్మకం ఆమెకు భరోసా ఇస్తుంది. పైగా ఎప్పుడూ చదువే లోకంగా ఉండే సూర్యం తప్పుదారిలోకి వెళ్ళడని గట్టి నిశ్చింత!
నడుస్తున్నాడు సూర్యం. ఊరు దాటగానే పెద్ద చెరువు ఉంటుంది. దాని గట్టు మీదుగా నడిచి వెళితే ఆవల వైపు శివుని గుడి ఉంది. ఆ గుడి అంటే సూర్యానికి చాలా ఇష్టం. వీలున్నప్పుడల్లా అక్కడికి వెళుతుంటాడు. ప్రశాంతమైన ఆ కోనేటి గట్టున కూర్చుని ఏదో ఒక పాట పాడుకుంటూ ఉంటాడు.
సూర్యం గుడిలోకి వెళ్ళగానే పూజారి గారూ “బాబూ బాగున్నావా?” అంటూ ఆప్యాయంగా పలకరించారు.
“బాగున్నానండీ..” అని చేతులు జోడించి నమస్కరించాడు. లోపల శివుని విగ్రహం దేదీప్యమానంగా వెలుగుతోంది. భక్తిగా దండం పెట్టుకుని “నా చదువుకు సహకరించు తండ్రీ” అని వేడుకున్నాడు.
గుళ్ళో నుండి బయటకు వచ్చి చెరువు గట్టుపైన కూర్చున్నాడు. చల్లగా వీస్తున్న గాలి ఆహ్లాదంగా ఉంది. నీటి ఉపరితలం మీద కదులుతున్న చిన్న చిన్న అలలు లయబద్ధంగా చప్పుడు చేస్తున్నాయి. ఒక దొంగ కొంగ ఒంటి కాలి మీద జపం చేస్తూ చేప కోసం ఎదురుచూస్తోంది! కను చూపు మేర వ్యాపించి ఉన్న పచ్చటి పొలాలు. వాటిలో నుండి నడిచి వస్తున్న రైతు జనం. పడమటి కొండల్లోకి దిగిపోతున్న సూరీడు. ఆకాశంలో సంజకెంజాయ. గుంపులుగా ఎగురుతూ తమ గూళ్ళకు సాగిపోతున్న పక్షులు. దూరంగా రోడ్డు పైన పడుతూ లేస్తూ సాగిపోతున్న ఎర్ర బస్సు…
“తరలి రాదా తనే వసంతం.. తన దరికి రాని వనాల కోసం” పాట అప్రయత్నంగా సూర్యం నోటి నుండి జాలు వారింది. ఆ శబ్దానికి తపోభంగమైన కొంగ ఎగిరిపోయింది. అప్పటిదాకా ఒడ్డున ఉన్న కప్ప ఒకటి నీళ్ళ లోకి దూకింది. చెరువులో చిట్టి అలలు వృత్తాకారంలో. నవ్వుకున్నాడు సూర్యం.
దీపాలు పెట్టే వేళవుతుండటంతో నెమ్మదిగా ఇంటిముఖం పట్టాడు. ఇంటికొచ్చాక చెల్లెళ్ళతో పాటూ చదువుకోవడానికి కూర్చున్నాడు. “అన్నయ్యా.. నాకు సైన్స్‌లో కొన్ని డౌట్స్ ఉన్నాయి.. చెప్పవా” అని అడిగింది సుమతి. వెంటనే ఆమె బుక్ తీసుకుని వివరంగా అన్నీ చెప్పాడు. నిజానికి అతని చెల్లెళ్ళు అదృష్టవంతులు. సబ్జెక్ట్‌లో ఏ డౌట్ ఉన్నా వెంటనే అన్నయ్యని అడిగి నివృత్తి చేసుకుంటారు. అలా అందరికీ అవకాశం ఉండదు కదా! కాసేపట్లో శంకరం వచ్చాడు.
“పార్వతీ ..పార్వతీ” అని పిలుస్తూ హడావుడి చేస్తున్నాడు. సాయంత్రం స్కూల్ అవగానే తిన్నగా ఇంటికి రాడు. తన స్థాయి మిత్రులతో ప్రపంచ సమస్యలన్నీ తీవ్రంగా చర్చించి ఇంటికి వస్తాడు. వాళ్ళు చెప్పే బోడి సలహాలని ఇంట్లో వాళ్ళ మీద ప్రయోగిస్తాడు .
“అబ్బబ్బ.. ఉండండీ వస్తున్నాను” అంటూ వంటగదిలో నుండి కొంగుతో చెయ్యి తుడుచుకుంటూ వచ్చింది.
“ఏం చేస్తున్నారు వీళ్ళు” అని పిల్లల గురించి అడిగాడు.
“ఏముంది.. రోజూ లాగే కూర్చుని చదువుకుంటున్నారు” అని చెప్పింది
“ఆహా.. అలాగా” అని చేతిలోని కూరగాయల సంచీ ఆమెకందిస్తూ “మా క్లాసు పిల్లలు తెచ్చారు..” అని చెప్పాడు. ఆ సంచీ తీసుకుని వంటింట్లోకి వెళ్ళిపోయింది పార్వతమ్మ.
రిలాక్స్‌గా కుర్చీలో వాలి చదువుతున్న పిల్లలని గమనించసాగాడు శంకరం. తండ్రి తమని గమనిస్తున్నాడని మరింత శ్రద్ధగా చదవసాగారు పిల్లలు.
‘వీళ్ళని ఎలా చదివించాలి రా భగవంతుడా!’ అని ఆలోచిస్తున్నాడు. ‘సూర్యంని ఇంటర్‌తో ఆపించెయ్యాలి. ఆడపిల్లలిద్దరినీ పదోక్లాసు దాటాక మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేసెయ్యాలి. సూర్యం ఏదో ఒక చిన్న జాబ్‌లో జాయిన్ అయితే అతని ఆదాయం తనకి వేన్నీళ్ళకి చన్నీళ్ళలా సరిపోతుంది. కుటుంబం ఏ ఇబ్బంది లేకుండా గడిచిపోతుంది’ అనుకున్నాడు.
తండ్రి మదిలో కదులుతున్న ఆలోచనలు చదవలేని సూర్యం ముందున్న పుస్తకాన్ని మాత్రం కసిగా చదవసాగాడు. శంకరం అనుకున్నట్టే వాళ్ళ భవిష్యత్తు ఉంటుందా? ఏమో.. కాలమే సమాధానం చెప్పాలి!
***
“సూర్యం.. నిన్ను కెమిస్ట్రీ సార్ పిలుస్తున్నారు” చెప్పాడు ఫ్రెండ్.
‘ఎందుకు రమ్మన్నారో’ అనుకుంటూ ఆదరా బాదరాగా ఆయన దగ్గరకి వెళ్ళాడు సూర్యం. కెమిస్ట్రీ లేబ్‌లో ఒక మూల ఉంటుంది ఆయన సీటు. అక్కడే కూర్చుని తన పని చేసుకుంటూ ఉంటారు ఆయన.
“నమస్కారం సార్.. రమ్మన్నారంట” వినయంగా అన్నాడు సూర్యం.
‘అవును’ అన్నట్టు తలాడించి చెప్పసాగారు ఆయన.
“చూడు సూర్యం.. చదువులో నీ ప్రతిభ.. శ్రద్ధ నాకు నచ్చాయి. ఇంటర్మీడియట్ పూర్తవ్వగానే ఎంసెట్ వ్రాయి. ఇంజనీరింగ్ చదివే అవకాశం వస్తుంది. నీ భవిష్యత్తు కూడా బాగుంటుంది. నీ లాంటి గ్రామీణ విద్యార్థులు పరిస్థితులకి భయపడి వెనుకంజ వేయకూడదని నా ఆరాటం. అందుకే నిన్ను ప్రత్యేకంగా పిలిచి మరీ చెప్పాను. సబ్జెక్ట్‌లో ఏ సందేహాలున్నా నన్ను అడుగు. సిగ్గుపడకు.. వెళ్ళిరా” అన్నారు.
ఏదో ఒక కొత్త శక్తి తనలోకి ప్రవేశించినట్టుగా… ఒక జ్ఞాన నేత్రం తెరుచుకున్నట్టుగా అనిపించింది సూర్యానికి.
“తప్పకుండా సార్. నేను మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తాను. మీరు చెప్పినట్టే చేస్తాను” అని చెప్పి అక్కడినుండి వచ్చేసాడు.
“బ్రైట్ బోయ్..” అని నవ్వుకున్నారు కెమిస్ట్రీ లెక్చెరర్.
“ఏరా.. ఏమన్నారు సార్” అడిగారు ఫ్రెండ్స్.
“ఇంటర్మీడియట్ అవగానే ఎంసెట్ వ్రాయమన్నారు. దానికి ఇప్పటి నుండే ప్రిపేర్ అవ్వాలని చెప్పారు. బాగా చదువుకోమన్నారు” అని చెప్పాడు
“ఓహ్… వెరీ గుడ్ రా.. ఇంకేం దాని మీద దృష్టి పెట్టు.. తప్పకుండా నీకు మంచి రేంక్ వస్తుంది” అని ప్రోత్సహించారు ఫ్రెండ్స్. ఆనందంగా ఫీల్ అయ్యాడు సూర్యం.
ఆ సాయంత్రం… తండ్రి రాక కోసం భయం భయంగా చూస్తున్నాడు సూర్యం. చదువుతున్న పుస్తకం మీద మనసు పెట్టలేకపోతున్నాడు. తండ్రి రాగానే పొద్దున్న కెమిస్ట్రీ సార్ చెప్పిన విషయం గురించి మాట్లాడాలి. తీరా చెప్పాక ఏమంటాడో అన్న గుబులు!.
చీకటి పడగానే నిదానంగా వచ్చాడు శంకరం. అతని ముఖం జ్ఞాన సముపార్జనతో వచ్చిన ఆనందం వల్ల వెలిగిపోతోంది. మిత్రబృందం పంచిన జ్ఞానం అది. రాగానే భార్య పార్వతిని పిలిచాడు
“పార్వతీ.. నీకో విషయం చెప్పాలి. మనం ఎంత తప్పు చేసాం చూడు. సూరీడుని అనవసరంగా ఇంటర్మీడియట్‌లో జాయిన్ చేసాము. పదో క్లాసు అవగానే డిప్లొమా చదివిస్తే మంచిదట. అది చదివితే వెంటనే మంచి ఉద్యోగం దొరుకుతుందట ..”
“ఆహా… అలాగా.. ఎవరు చెప్పారండీ” విస్తుపోతూ అంది.
“ఇంకెవరు.. నా ఫ్రెండ్ బాలరాజు చెప్పాడు. వాళ్ళ అబ్బాయిని ఇప్పుడు అదే చదవించబోతున్నాడట”
ఈ సంభాషణ అంతా వింటున్న సూర్యం గుండెలో రాయి పడింది. ఈ పరిస్థితిలో ఆ దేవుడు వచ్చి చెప్పినా వినేటట్టు లేడు శంకరం.
శంకరం భార్యను చూస్తూ “..అయినా ఇప్పటికీ మించిపోయింది లేదులే.. ఇంటర్ మానిపించి డిప్లొమా పరీక్ష వ్రాయిద్దాం” అన్నాడు
“బాగుందండీ ఆలోచన..” మెచ్చుకుంది తల్లి. నిస్సహాయతతో బాధగా అనిపించింది సూర్యానికి.
‘ఎలా చెప్పాలి వీళ్ళకి?’ అనుకుని మౌనంగా ఆలోచనలో పడ్డాడు.
***
కాలం పరుగెత్త సాగింది. ‘ఇంటర్మీడియట్ మధ్యలో ఆపించటం అంత మంచిది కాదని..కావాలంటే ఇంటర్ అయిన తర్వాత డిప్లొమా ఎగ్జాం వ్రాస్తే మంచిద’ని ఇంకెవరో సలహా ఇవ్వడంతో శంకరం మళ్ళీ సూర్యం చదువు జోలికి రాలేదు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అయిపోయింది. మంచి మార్కులు వచ్చాయి సూర్యానికి. రెండో సంవత్సరం కూడా బాగా చదివి పరీక్షలు చాలా బాగా వ్రాసాడు. ఫ్రెండ్స్ అందరూ దగ్గర్లో ఉన్న విశాఖపట్నం వెళ్ళి ‘షార్ట్ టర్మ్ ఎంసెట్’ కోచింగ్ తీసుకుందామని ప్లాన్ చేసుకుంటున్నారు. సూర్యానికి కూడా మనసులో ఆ కోరిక ఉన్నా తన తండ్రికి ఎలా చెప్పి కన్విన్స్ చెయ్యాలా అని తర్జనభర్జన పడుతున్నాడు. సమస్య మళ్ళీ మొదలైంది. సూర్యం భవిష్యత్తుకి సంబంధించిన సమస్య!
ధైర్యం చేసి తండ్రితో మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు సూర్యం. ఇప్పుడు తను చెప్పకపోతే జీవితంలో ముందు ముందు జరగబోయే పరిణామాలన్నిటికీ తానే బాధ్యుడవుతాడు.
ఆ సాయంత్రం.. ప్రశాంతంగా టీ తాగుతున్న తండ్రి ఎదురుగా నిలబడి నీళ్ళు నమలసాగాడు “ఏరా.. పరీక్షలు బాగా వ్రాసావా?” అడిగాడు శంకరం.
“చాలా బాగా వ్రాసాను నాన్నా..”
“వెరీ గుడ్.. ఇక చదువు ఆపెయ్. ఈ క్వాలిఫికేషన్ చాలు. ఏదైనా జాబ్ కోసం ట్రై చేద్దాం. జాబ్‌లో జాయిన్ అయ్యాక నీకు ఓపిక ఉంటే డిగ్రీ పార్ట్ టైములో చదువుకో” సలహా ఇచ్చాడు
“అలా వద్దు నాన్న.. అదీ.. అదీ..” అంటూ ఆగిపోయాడు.
“చెప్పరా.. ఏంటి”
“నాకు ఇప్పుడే డిగ్రీ చెయ్యాలని ఉంది నాన్నా”
“ఆహా.. అలాగా… ఇప్పుడు నువ్వు డిగ్రీ చేసి ఏం పీకుతావు.. నా తాహతుకి నిన్ను ఇంటర్ దాకా చదివించడమే ఎక్కువ” కోపంగా అన్నాడు.
“అదేంటి నాన్నా.. నేనేమీ పూర్ స్టూడెంట్‌ని కాదు కదా.. నన్ను చదివించడం దండగ అని ఎందుకనుకుంటున్నావు” ధైర్యం చేసి అన్నాడు.
(సశేషం)