జ్ఞాపకాల తరంగిణి-2

0
3

[box type=’note’ fontsize=’16’] జీవితంలోని వివిధ దశలలో తనకు కలిగిన విశేష అనుభవాలను సంచిక పాఠకులతో పంచుకుంటున్నారు డా॥ కాళిదాసు పురుషోత్తం. [/box]

[dropcap]క్రీ.[/dropcap]శ. 1850 ప్రాంతంలో పెన్న నుంచి సర్వేపల్లికి పెద్ద పంట కాలువ తవ్వారు. బ్రిటీష్ అధికారులు గ్రామాన్ని దక్షిణ దిక్కు నుంచి, కాలువకు సమీపంగా నిర్మించుకోమన్నారు. ఆ విధంగా గుడిని కూడా మార్చారట! సోమశిల ఆనకట్ట పెన్నానది మీద కట్టక ముందు మా వూరు నిరుపేద కరువు గ్రామం. పెన్న నుంచి సర్వేపల్లి చెరువుకు వెళ్ళే కాలువలో నీళ్ళుంటేనే మా పొలాలు పండేవి. సోమశిల నిర్మాణం తర్వాత మా వూరి ముఖచిత్రం మారిపోయింది. మున్నూట అరవై ఐదు రోజులు పొలాలకు నీళ్ళు అందుబాటులోకి వచ్చి ముక్కారు పండిస్తారు. వెంకయ్య స్వామి అమరులయ్యాకా, వారి సమాధి మీద కట్టిన మందిరం దర్శనార్థం ప్రతి శనివారం ఏభై వేల భక్తులు రావడంతో మా వూరు మా వూరు కాకుండా పోయింది. ఇంటింటికీ ట్రాక్టర్లు, కార్లు, మోటారు సైకిళ్ళు, హోటళ్ళు… కొంపలు వగైరా వచ్చాయి.

గొలగమూడి గుర్తొస్తే మా కోనేరు గుర్తు రాకుండా ఉండదు. ఊరికి పశ్చిమంగా పూర్వం ‘దండుబాట’లో ప్రయాణించే సార్థవాహుల కోసం, బాటసారుల కోసం బొమ్మిడిసెట్టి అనే పుణ్యాత్ముడు కోనేరు తవ్వించాడు. నా బాల్యంలో వూరి కంతటికీ తాగు నీరు ఆ కోనేరు నించే తెచ్చుకొనేవారు. బొమ్మిడిసెట్టి వాళ్ళు ఏడుగురు అన్నదమ్ములట! ఈ సోదరుల్లో పోలిసెట్టి వెంకటగిరిలో ఇప్పుడున్న రాజ ప్రాసాదం వెనుక పోలిసెట్టిగుంట తవ్వించాడు. 1975 వరకు వెంకటగిరి టౌన్ ప్రజలకు అదొక్కటే తాగునీరు అందించేంది.

వెంకటగిరి టౌన్. వెనుక నేపధ్యంలో పడమటి కనుమలలో వెలిగొండలు

ఈ సోదరుల్లో ఒకరు నెల్లూరు జిల్లా నాయుడుపేట సమీపంలో దొరవారి సత్రంలో కోనేరు తవ్వించారు. మరొకరు సర్వేపల్లిలో కోనేరు తవ్వించారట! మా వూరి కొలను నిండా తామరపువ్వులు! స్నానం చేసి పువ్వులూ, ఆకులూ తెంపుకొని పోయేవాళ్ళం! ఒక చంద్ర గ్రహణం రాత్రి మా నాయనతో కలిసి కోనేటిలో స్నానం చేసి అక్కడే జపం చేసుకొంటున్న నాయన పక్కన చాలా సేపు నిలబడి వున్నాను. రెండేళ్ళు వర్షాలు లేక మా కోనేరు చాలా కృశించి పోయింది. అదే అదనుగా మా వూరి వాళ్ళు కోనేరు పూడిక తీస్తూంటే ఒంటెద్దు బండికి సరిపోయేంత పెద్ద వృద్ధ మత్స్యాలు చిక్కాయి. ఇప్పుడు వెంకయ్యస్వామి ఆశ్రమం అధికారులు కోనేరు నాలుగు వైపులా ముళ్ళ కంచె నిర్మించి ఆ జలం కలుషితం కాకుండా కాపాడుతున్నారు.

మా వూరి కోనేరుకు దక్షిణంగా, సమీపంలోనే ఆంజనేయస్వామి గుడి పాడుబడి వుండేది. 1950 ప్రాంతంలో, గ్రామస్థుల సహకారంతో మా నాయనగారు ఆ గుడి జీర్ణోద్ధరణ జరిపి నిత్యపూజ ఏర్పాటు చేశారు. పూజారి కుదిరాకా కూడా కొన్నిసార్లు అప్పుడే వడుగైన నేను ఆ స్వామి పూజా విధులు నిర్వర్తించాను. ఆంజనేయస్వామి మూలవిరాట్టు ఉబ్బెత్తు శిల్పం, నాలుగు అడుగుల ఎత్తు శిల. వెంకయ్యస్వామి ఆశ్రమానికి వచ్చే భక్తుల్లో పది శాతమైనా ఈ స్వామినీ దర్శిస్తారు.

నెల్లూరు జిల్లా పడమటి ప్రాంతం నుంచి వెంకయ్య అనే సాధువు మా వూరి ఆంజనేయస్వామికి గుడి సమీపంలోనే ఒక సాల వేసుకొని వుండేవారు. నలుగురో, ఐదుగురో శిష్యులు. స్వామి సాధువర్తనులు. బీదా బిక్కీ వెళ్ళి తమ కష్టాలు స్వామివారికి చెప్పుకొని సాంత్వన పొందేవాళ్ళు.

నాకు పదహారు ఏళ్ళు వచ్చేప్పటికే వెంకయ్యస్వామి తెలుసు. మధ్యాహ్నం, సాయంత్రం చీకటి పడగానే ఆయన శిష్యులు అన్నపూర్ణ కావిడి వేసుకొని ఊళ్ళో తిరిగేవారు. అందరూ లేదనకుండా పెట్టేవారు. స్వామి తెల్లకాగితాల మీద చేతులతో సిరా అద్ది భక్తులకు ఇచ్చేవారు. మా మేనల్లుళ్ళు గొలగమూడి బడిలో చదువుతూ, పరీక్షల సమయంలో తెల్ల కాగితాల కోసం స్వామి వద్దకు వెళ్ళి అడిగి తెచ్చుకొనేవారట! మా వూరి బడిలో చదివిన ఒక మేనల్లుడు గొప్ప సర్జన్‍గా పేరు తెచ్చుకొన్నాడు.

పశువులు తప్పిపోయినా, రోగాలు, రొష్టులు వచ్చినా వెంకయ్యస్వామి వద్దకు వెళ్ళి ప్రశ్న చెప్పించుకొనేవారు. ఆయన సమాధానం ప్రతీకల్లో, ఏదో సంకేతాల రూపంలో చెప్పేవారు. ‘పడగ’లని ఏవేవో పదాలు వాడేవారు. ఆయన శిష్యులు వ్యాఖ్యానించేవారు. ఆయన ఎవ్వరినీ యాచించి ఎరగరు. ఆయన ఎదురుగా 24 గంటలూ ఒక మంట ‘ధుని’ మండుతూ వుండేది. గోతం పట్ట మీద ధుని ముందు కూర్చొని తంబుర మీటుతూ ఏదో పాడేవారని జ్ఞాపకం! 1972లో ఇద్దరు ప్రొఫెసర్లు వారి దర్శనం చేసుకోవాలని కోరితే తీసుకొని వెళ్ళాను. సంభాషణ ముగిసిన తర్వాత, వీడ్కోలు తీసుకొంటూ ఒక ప్రొఫెసరు స్వామి చేతికి వంద రూపాయల నోటు ఇవ్వబోతే వారు ముట్టుకోలేదు. శిష్యులు వారు కూర్చున్న గోతం పట్ట కింద పెట్టమన్నారు. వెంకయ్యస్వామి ఎవరినీ ఏమీ కోరేది లేదు. పేద పల్లీయులకి ఏదో చెప్పి కాస్త ఊరట కలిగించారు. మహిమలు, మంత్రాలూ, తంత్రాలూ ఏవి ఆయన ప్రదర్శించలేదు. తులశమ్మ అనే భక్తురాలు స్వామి కోసం ఒక గది నిర్మించి శ్లాబు వేయించింది. స్వామి అందులో ప్రవేశించకముందే నిర్యాణం చెందారు. ఆ గదిలోనే వారి సమాధి నిర్మించారు.

మా గొలగమూడి అంటే పశు సంపద గుర్తొస్తుంది. మాకే 30 దాకా ఆవులూ, దూడలూ, కోడెలూ, ఎద్దులూ, దున్నలూ ఉండేవి. ఉదయం మేతకు తోలుకొని వెళ్ళేవారు. ఇంకా మాటలు కూడా రాని చీమిడి ముక్కుల పిల్లలు ఆ పశువుల పేడ కోసం కాచుకొని వుండేది. ‘కాల్దోయడం’ అనే ఒక ప్రక్రియ. పేడకడిని ఎవరు కాల్తో కదిలిస్తే వారిదౌతుందన్న మాట. గోధూళి వేళ పశువులన్నీ కాలువలో నీళ్ళు తాగి ఇంటికి చేరి వాటి వాటి స్థానాల్లో నిలబడేవి. చిన్నపిల్లలు కట్టేసినా ఏమనేవి కావు. నెల్లూరుకు వెళ్ళిన మా బండి కాంపౌండు లోపలికి ప్రవేశిస్తుంటే మా పశువులన్నీ ఒక్కసారిగా పలకరిస్తున్నట్లు అరిచేవి. మా ఇంటి ఆవరణలో ఒక వేప వృక్షం, గంగరావి చెట్టు, చింత చెట్లు వుండేవి. ఆ నీడలో పశువులను కట్టేసేది. ఒక దిరిసెన చెట్టు నిండుగా పూచి వేసవిలో వేడి గాలులకు కాయలు గలగలమని శబ్దం చేసేవి. కొందరు దిరిసెన చెట్టు ముఖం ఉదయం చూడగూడదని సలహా యిచ్చారు. నాయన వినలేదు. 1952లో మా నాయనగారు మంచం పట్టారు.

నా చదువు ఆగిపోకుండా మా అన్నయ్య చెంచురామయ్య నన్ను నెల్లూరు వేద సంస్కృత పాఠశాలలో చేర్చారు. అక్కడ నాలుగవ తరగతిని కుమారసంభవం క్లాసు అనేవారు. కుమారసంభవం, హితోపదేశం, శబ్దాలు, ధాతువులు… ఇవి కాక నాలుగవ తరగతి గణితం వగైరా చెప్పేవారు. పాఠశాల ఉదయం 11.20కి ప్రారంభమయ్యేది, ఆచార్యులు, విద్యార్థుల అనుష్ఠానానికి అడ్డులేకుండా. కొందరు విద్యార్థులు న్యాయవాదులు, వైద్యుల ఇళ్ళల్లో దేవతార్చన బ్రాహ్మణులు. కొందరు వారాలతో రోజులు గడిపేవారు. పాడ్యమి, చవితి, అష్టమి, అమావాస్య అనధ్యయన దినాలు, కనుక సెలవులు.

నేను కూడా ఇంట్లో దేవతార్చన పూర్తి చేసి, భోజనం చేసి పాఠశాలకు బయల్దేరేవాణ్ణి. అమ్మ చిన్న సత్తు టిఫిన్‌లో పెరుగన్నం, ఊరగాయ పెట్టి ఇచ్చేది. పొగతోట లోని మా ఇంటి నుంచి మూలప్పేట పాఠశాలకు నడిచిపోతే నలభై నిమిషలు పట్టేది.

నెల్లూరు పొగతోట, కస్తూరిదేవి నగర్ లో రచయిత యింటిముంగిలి ముందు చెట్లు

ఇంగువ శ్రీకృష్ణయ్య గారనే న్యాయవాది దత్తపుత్రులు కూడా సంస్కృత వేద కళాశాలలో ఎంట్రన్సు చదివేవారు. అప్పుడప్పుడు ఆయన తన కారులో ఎక్కించుకొని తీసుకెళ్ళేవారు. పాఠశాలా, కళాశాల ఒకే ఆవరణలో. అధ్యాపకులకు గదులు స్థిరంగా వుంటాయి. విద్యార్థులే పీరియడ్ పీరియడ్‍కు గదులు మారాలి. అధ్యాపకులకు చిరిచాపలుండేవి. విద్యార్థులు నేల మీద కూర్చునేవారు. ఆ రోజుల్లో మా నాయనగారి శిష్యులే గాజులపల్లి హనుమచ్ఛాస్త్రిగారు కళాశాల ప్రిన్సిపాల్‌గా వుండేవారు. వారి అమ్మాయి రామమ్మ నా సహాధ్యాయిని. మరొక బాలిక సుబ్బమ్మ అక్కడి సరస్వతీ మందిరంలో పండితుల కుమార్తె. మా తరగతిలో మొత్తం ఇద్దరు బాలికలు, నలుగురు బాలురు. అప్పుడు నా వయసు 12 సంవత్సరాలు. కుమార సంభవం క్లాసును కృష్ణస్వామి అనే వైష్ణవ స్వామి తీసుకొనేవారు. శ్లోకం చదివి, పదచ్ఛేదన, అన్వయక్రమం, ప్రతిపదార్థం, తాత్పర్యం అన్నీ చెబుతూంటే పుస్తకం ముందు పెట్టుకొని వినాల్సిందే గాని కలం పెట్టి అక్షరం రాసుకొన్నా కొట్టేవారు. ఆయన క్లాసు విడిచి పెట్టిన తర్వాత విద్యార్థులందరం కూర్చుని, కలబలుకుకొని నోట్సులో ఎక్కించుకొనేవాళ్ళం. రామమ్మ ఏకసంథాగ్రాహి. ఆమె సహకారం వుండేది. కృష్ణస్వామి గారి చేతిలో నాకు దెబ్బలు పడలేదు గాని 18 సంవత్సరాల విద్యార్థిని కూడా ఆవేశంగా బాదిపారేసేది. ఆ పాఠశాలన్నా ఒక భయం ఏర్పడిపోయింది. కోటయ్య శాస్తుర్లు హితోపదేశం, పుష్పగిరి వెంకట కృష్ణయ్య శబ్దాలు, ధాతువులు చెప్పారు. బడికి వెళ్ళే సమయంలో, ఇంటికి వచ్చే సమయంలో నా శిఖ, ‘పింగళం’ చూసి దారినపోయే పెద్ద పిల్లలు పిలిచి మొట్టేవాళ్ళు. ‘అర్ధ పింగళం’ అని గేలి చేసేవాళ్ళు. “నా ఈడు పిల్లలందరూ చక్కగా స్కూలుకు వెళుతుంటే నేను మాత్రం ఈ శిఖ, తుండు పంచ కట్టుకొని ఎందుకు పాఠశాలకి వెళ్ళాలి?” అని  అమ్మను, అక్కలను అడిగేవాణ్ణి. మొత్తం మీద ఆ పాఠశాల వాతావరణం నాకు ఏ మాత్రం నచ్చలేదు.

నా చిన్నతనంలోనే మా నాయన అక్కలకు, నాకు హిందీ చెప్పించారు. నేను స్కూలుకు పోకముందే, దక్షిణ భారత హిందీ ప్రచార సభ నిర్వహించే రాష్ట్రభాష పాసయ్యాను. ఇంగ్లీషు చదవడం, రాయడం రాదు. మా మేనత్త కుమారులు సి.వి. సుబ్బరామయ్య మద్రాసులో లా చదివి, 1952లో నెల్లూరులో ఒక న్యాయవాది వద్ద అప్రెంటీసుకు చేరారు. వారు వేసవి సెలవల్లో ఇంగ్లీషు చదవడం, రాయడం నేర్పించారు. ఆ యేడే, నెల్లూరు వి.ఆర్. హైస్కూలు వారు థర్డ్ ఫారంలో నేరుగా చేర్చుకొనేందుకు ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఆ పరీక్షలో గణితం తప్ప మిగతా ప్రశ్నలకు సమాధానాలు రాశాను గాని, నేను పరీక్ష తప్పుతానని నా ఆత్మీయ మిత్రుడితో చెప్పుకొన్నాను. తను నా కన్నా నాలుగేళ్ళు పెద్దవాడు. అతను నన్ను వెంటబెట్టుకుని వి.ఆర్. హైస్కూలు తెలుగు పండితులు కురువాడ సుబ్బరాఘవయ్య వద్దకు తీసుకొని వెళ్ళి నేను కాళిదాసు వెంకట సుబ్బశాస్త్రి అబ్బాయినని పరిచయం చేసి వారి సహాయం అర్థించాడు. వారు ధైర్యం చెప్పి పంపించారు. ఆ విధంగా నాకు థర్డ్ ఫారంలో ప్రవేశం లభించింది.

రచయిత పెద్దక్క శ్రీమతి స్వర్గీయ వెంకటసుబ్బమ్మ గారు

ఆరోజుల్లోనే నెల్లూరులో వి.ఆర్. హైస్కూలును ‘బందెల దొడ్డి’ అని ఎగతాళిగా అనేవారు. మూలపేటలో కోల్సు అక్కర్‌మన్ మెమోరియల్ (CAM) హైస్కూలు క్రమశిక్షణకు అప్పట్లో ప్రసిద్ధి. స్టోన్‌హౌస్‌పేటలో ఆర్.యస్.ఆర్. హైస్కూలుకు మంచి పేరుండేది. బాలికలకు శ్రీమతి పొణకా కనకమ్మ స్థాపించిన కస్తూరీదేవి విద్యాలయం, ఏ.బి.యం. మిషనరీ హైస్కూలు, సెయింట్ జోసఫ్ బాలికల పాఠశాలకు మంచి పేరుండేది.

“ఈ విద్యాలయం అబివృద్ధికై తుది మొదలు నేటి వరకు కనకమ్మగారు కురిపించిన అవ్యాజానురాగమే లేకపోతే రాయప్రోలు వారు వర్ణించినట్టు వందల కొలది ‘ఎండ కన్నెరుగని నిడుద కనుసోగల, బంగారు వడ్దాణముల, ముత్యపు బులాకీల, చెంగావి సరిగ చీరల, వైదుష్యాన్నెరుగని, వాన మేపుగనని’ కాపుకంజాక్షుల ఆడుబిడ్డలు ఈ పాటి వికాసాన్ని, నాగరికాన్ని పొందియుండరు” అని పద్మభూషణ్ వెన్నెలకంటి రాఘవయ్య గారంటారు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here