మా బాల కథలు-3

0
3

[dropcap]బా[/dropcap]ల అందమైన ఏడేళ్ళ పాప. అందమైనదే కాదు, తెలివైనది కూడా. వయస్సు రీత్యా కొంత అమాయకత్వమూ ఉంది. అన్నీ తనకు తెలుసుననుకుంటుంది. అంతే కాదు, అన్నిటి లోనూ తల దూర్చి అందరికీ సలహాలు కూడా ఇస్తుంది. ఆ బాల చేసిన పనుల్లో కొన్ని కథల్లాగా చెప్పచ్చు. అందులో ఇది ఒకటి.

బాల కినుక:

“బాలా త్వరగా రా” నాన్న గట్టిగా పిలుస్తున్నాడు బైటనుంచి.

“త్వరగా తెములు. నాన్న కోప్పడతారు” అంటూ పని పిల్లతో ఆడుతున్న బాలని లాక్కువచ్చింది అమ్మ. ఇంకో చేతిలో స్కూల్ బాగ్ ఉంది.

“కొంచెం త్వరగా తయ్యారు చెయ్యచ్చు కదా. నాకు కూడా లేట్ అవుతోంది రోజూ. మేమిద్దరం వెళ్ళాక ఏమి పని ఉంటుంది? అప్పుడు చేసికోవచ్చుగా మిగతా పనులు” విసుక్కున్నాడు నాన్న.

“అదేమీ చేస్తుందిరా నీ కూతురు ఎంత లేపినా లేవదు. చెప్పిన మాట వినదు. మందలిస్తే నువ్వు ఊరుకోవు.” అమ్మకి బామ్మ వత్తాసు పలికింది.

“ఏదైనా అంటే ఇద్దరూ ఒక్కటయి పోతారు. చిన్నపిల్లతో మీకు పోలిక ఏమిటి? సరే హోం వర్క్ చేయించావా. లేకపోతే టీచరుతో అది తిట్లు తినాలి”.

తలూపింది అమ్మ.

“ఎంత చేసినా దీనివల్ల నాకు చివాట్లే” అమ్మ మొహం చిన్నబుచ్చుకుంది.

“ఆడ జన్మ అంతే. మొగుడుతో, పిల్లలతో అందరితో పడాలి” అని పాత సినిమా డైలాగ్ అంటూ లోపలి తీసుకెళ్ళింది నాన్నమ్మ.

ఇదంతా వినబడుతున్నా బాల నాన్నకు కోపం రాలేదు గాని, బాలకి మాత్రం కోపం వచ్చింది. అసలు తిట్లు తింటున్నది తను కదా.

బండి కదిలిపోయింది.

బాలకి చాలామంది పిల్లలలాగే బడి కెళ్ళటం అంటే ఇష్టం ఉండదు. పొద్దున్నే లేవాలి. తయ్యారవ్వాలి. హోం వర్క్ చెయ్యాలి. టైంకి పడుకోవాలి. టి.వి. చూడకూడదు.

నాన్నమ్మ అయితే ఎప్పుడు అదిలిస్తూ బెదిరిస్తూ ఉంటుంది

తను అయితే చక్కగా ఎప్పుడూ ఇంటిలోనే ఉంటుంది. తనకిష్టమైన భక్తి సినిమాలు వస్తే బండి కట్టించుకుని పక్కింటి నాన్నమ్మతో సినిమాకి కూడా వెళ్తుంది.

తను కష్టపడి బడి నుంచి వచ్చేసరికి నిద్రపోయి లేచి, కాఫీ తాగేసి పక్కింటి నాన్నమ్మతో కబుర్లు ఆడుతుంటుంది. లేదా వైకుంఠపాళీ ఆడుతుంటుంది. లేదా టి.వి.చూస్తూ ఉంటుంది.

అమ్మలా పనీ లేదు. నాన్నలా ఆఫీస్ లేదు. తనలా స్కూల్ లేదు. ఎంత హాయి. ‘పైనించి తను చేసిందని, వద్దన్నా ఐస్ క్రీం తింద’ని నాన్నకి చాడీలు చెబుతుంది.

సాయంత్రం స్నేహితురాలు జామకాయలు ఇస్తా అంటే అమ్మ కిష్టమని వెళ్లి తీసుకుని, ఇల్లుచేరింది..

“ఎక్కడికెళ్ళావే ఇంతసేపు, వెతకలేక చస్తున్నాము” అంది నాన్నమ్మ కోపంగా.

అమ్మ కళ్ళ నీళ్ళతో చూస్తూ దగ్గరకు తీసుకుంది.

“అమ్మా నేను నాన్నమ్మ అంత అవాలంటే ఏమి చెయ్యాలి?” అడిగింది.

బామ్మ తెల్లబోయింది “ఎందుకే” అ౦ది ఆశ్చర్యంగా.

“నీకు స్కూల్ లేదు. మాస్టారి తిట్లు ఉండవు. హోం వర్క్ ఉండదు. ఎప్పుడూ ఇంట్లోనే ఉండచ్చు. ఎప్పుడూ కబుర్లు ఆడచ్చు. టి.వి. చూడచ్చు. పనేమీ ఉండదు అన్నీ తినచ్చు హాయిగా” అంది కోపముగా.

కొంచెం సేపు నివ్వెరపోయిన నాన్నమ్మ గట్టిగా నవ్వేసింది. అమ్మకూడా. పైని౦చి నాన్న వచ్చాక మళ్ళీ తను అడిగిన మాట చెప్పి మళ్ళీ అందరూ నవ్వారు.

కానీ ఎలా అవుతుందో ఎవ్వరూ చెప్పలేదు.

అసలు అందులో నవ్వేది ఏముంది?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here