ఎదురుచూడని క్షమాపణ

0
4

[dropcap]మో[/dropcap]హనరావుకు వియ్యంకుని దగ్గర నుంచి గృహప్రవేశానికి నాలుగు రోజులు ముందుగానే రమ్మంటూ ఫోను వచ్చింది. ఆ తరువాత వియ్యపురాలు కూడా కరుణకి ప్రత్యేకంగా ఫోనులో అదే మాట చెప్పడంతో వాళ్ళ అభిమానానికి చాలా సంతోషం కలిగింది. కూతురు రాధ ద్వారా ముందుగానే ఈ కబురు తెలిసిన దగ్గర నుంచి కరుణకి మనసులో కొంచెం కంగారుగానే వుంది. మోహనరావుకి కూడా కూతురింటికి వెళితే ఏమాట వినవలసి వస్తుందోనని మనసులో ఒక మూల బెంగగానే వుంది. ఈ విషయం యిద్దరి మనసులలో ఒకేసారి మెదిలినా విచిత్రంగా భయం వలన ఎవరూ ఒకరితోమరొకరు మాట్లాడుకోలేదు. కూతురు సాయం కోసం వీలు చేసుకుని రెండు రోజులు ముందుగానే గృహప్రవేశానికి మాత్రం బయలుదేరారు. ఇద్దరినీ ఎంతో అభిమానంగా వియ్యంకులు ఆహ్వానించినా మనసులో యిద్దరికీ బెంగ తీరలేదు.

అల్లుడు గృహప్రవేశం చాలా ఆర్భాటంగా జరిపాడు. ఇంటినిండా అతిథులతో రాధ తన అత్తగారి వెనకే వుంటూ పనిలో చాలా బిజీగా ఉంది. ఉన్న మూడు రోజులూ కరుణ కూతురితో ఒంటరిగా మాట్లాడాలని ఎంత ప్రయత్నించినా కుదరలేదు. గృహప్రవేశమయిన మరునాడు మోహనరావు కరుణలు, వియ్యంకులకూ కూతురు అల్లుడికీ చెప్పి తిరుగు ప్రయాణం కట్టారు. ‘పెళ్ళయి నాలుగేళ్ళయినా మీ అమ్మాయి యింకా నెల తప్పలేదం’టూ వియ్యపురాలి నుంచి ఏమాట వినవలసి వస్తుందోనని భయపడిన కరుణకు అసలు ఆ మాటే రాకపోవడం కొంత ఆశ్చర్యం కలిగించింది. బహుశా ఇంట్లో అతిధులతో హడావిడిగా వుండి ఆ ప్రస్తావన రాలేదేమో అనుకుంది.

రాధ ఇంటినుంచి వచ్చిన తరువాత మోహనరావు ముభావంగా వుండడం చూసి కరుణ, బహుశా ప్రయాణ బడలిక వలనేమో అనుకుంది. రెండు రోజుల తరువాత కూడా పరధ్యానంగా ఉంటున్న భర్తను చూసి మనసులో ఏమయిందోనన్న కంగారు కలిగింది. రాధ ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా? అసలు రాధ అల్లుడి మధ్య సంబంధం సరిగ్గానే వుందా? వియ్యంకుడు ఏమయినా అన్నారా! ఇటువంటి ఆలోచనలు మదిలో మెదలగానే యిక వుండలేక పోయింది. మధ్యాహ్నం భోజనానంతరం భర్త చెంతకు చేరి “ఏమయ్యింది? ఎందుకు గత రెండు రోజులుగా పరధ్యానంగా వుంటున్నారు. రాధ యింట్లో ఏమయినా అన్నారా?” అంటూ ప్రశ్నిస్తూ భర్త మొహంలోకి ఆత్రంగా చూడసాగింది. ప్రేమతో కూడిన కరుణ కంగారు చూసిన మోహనరావుకి కళ్ళు చెమర్చాయి. అందరిలా ఎన్నో ఆశలతో తన ఇంట్లో అడుగు పెట్టిన కరుణకు తన ప్రవర్తన వల్ల కలిగిన మానసిక బాధ కళ్ళ ముందు మెదిలింది. తన అల్లుడి మాటలు, కూతురి పట్ల అతను చూపించే ప్రేమ, భాధ్యత తనలో లోపాన్ని వేలెత్తి చూపుతున్నట్లు అనిపించి, గతం కళ్ళ ముందు కదిలింది.

డిగ్రీ పాసయి ఉద్యోగం చేయాలనుకున్న కరుణ, పెళ్ళి తరువాత అవసరమయితే చెయ్యమని తండ్రి అనడంతో ఆ ప్రయత్నం మానుకుంది. కరుణ తండ్రి ఉన్నంతలో మంచి కట్నం ఇచ్చి మోహనరావుతో వివాహం జరిపించాడు. మోహనరావు మున్సిపల్ హైస్కూల్లో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు. ఏ చెడు అలవాట్లు లేవు. పెద్దల పట్ల గౌరవం కలవాడు. తండ్రి వెనకేసిన ఆస్తిపాస్తులేమీ లేకపోవడంతో మోహనరావు తన పెళ్ళికి వచ్చిన కట్నంతో పెద్ద చెల్లెలు పెళ్ళి చెయ్యాలని అనుకున్నాడు. చెల్లెలు బిఇడి చేస్తేగానీ వివాహం చేసుకోనని పట్టుబట్టడంతో వివాహ ప్రయత్నాలు కొంత కాలం ఆపవలసి వచ్చింది. ఆ తరువాత వచ్చిన సంబంధాలు ఛాయ తక్కువని కొన్ని, ఉద్యోగం లేదని మరికొన్నీ కుదరలేదు. మోహనరావుకి పెద్ద చెల్లెలు వివాహం ఒక పెద్ద సమస్యగా మారింది. మోహనరావు తల్లి కూడా పెళ్ళై మూడేళ్ళయినా మనవడినో మనవరాలనో అందించ లేదంటూ కరుణను తరచూ సాధించడం మొదలు పెట్టింది. ఇరుగు పొరుగు వారు ఆ విషయం అడిగిందే తడవు తనకా అదృష్టం లేదేమో అంటూ నిష్ఠురంగా మాట్లాడటం,కూతురి పెళ్ళి కాకపోవడానికీ కారణం కరుణ అడుగు పెట్టడమే అంటూ నిందించ సాగింది.

అత్తగారి సాధింపు కరుణకు చాలా బాధ కలిగించింది. ఒకసారి రాత్రి భర్తతో “ఏమండీ, అత్తగారు పిల్లలు కావాలని రోజూ అడుగుతున్నారు. మనం ఏమీ జాగ్రత్తలు తీసుకోవడం లేదు కదా! ఎందుకైనా మంచిది. ఒకసారి మంచి డాక్టర్ని సంప్రదిద్దామండీ” అనగానే చూద్దాంలే అంటూ దాటేసాడు. ఒకటి రెండు సార్లు మళ్ళీ ఆమాట అనగానే కోపం విసుగూ చూపించడం మొదలుపెట్టాడు. తన మనసు మళ్ళించుకోవడానికి ఉద్యోగం చేద్దామనుకున్నా అత్తగారు ఒప్పుకోలేదు. తండ్రితో తన బాధ చెప్పలేక లోలోనే మదనపడసాగింది. ఒకరోజు అనుకోకుండా అత్తగారు కోపంగా మాట్లాడే సమయంలో తండ్రి తన ఇంటికి రావడమూ విషయం తెలియడమూ జరిగింది. ఆరోజు కరుణ తండ్రి వెనక్కి బయలుదేరుతూ బస్టాప్ దగ్గర దించమని అల్లుడికి చెప్పడంతో అత్తగారు ముగ్గురూ వెళ్ళకూడదంటారని కరుణ ఇంట్లోనే ఉండిపోయింది. తన అత్తగారి మాటలకు తండ్రి ఏమనుకుంటారు తన గురించి ఎంత బాధపడి ఉంటారోనని మనసులోనే మదనపడింది. కనీసం ఏదో నచ్చచెబుదామంటే తండ్రి కూడా వెళ్ళలేకపోయానని బాధపడింది.

రెండు మూడు నెలల తరువాత అదృష్టవశాత్తు మోహనరావు ఎన్నో సంబంధాలు వెతికిన తరువాత పెద్ద చెల్లెలికి ఓ పెళ్ళి సంబంధం కుదిరింది. కొంచెం కట్నం ఎక్కువైనా మోహనరావు ఆలోచించక వివాహం జరిపించాడు. అదే పెళ్ళిలో బియస్సి చదివి, మంచి ఛాయ గల చిన్న చెల్లెలిని చూసి ఓ సంబంధం కోరి రావడంతో మోహనరావు ఆనందం రెట్టింపు అయింది. ఆ సందర్భలోనే కరుణ కూడా నెల తప్పిందని తెలిసి ఇంటిల్లపాదీ సంతోషంతో ఉబ్బితబ్బిబయ్యారు.

కరుణ నెలతప్పిన విషయం తెలియగానే రెండవ చెల్లెలు పెళ్ళి చేయటానికి కొంచెం వ్యవధి అడిగాడు. పెళ్ళి సమయంలో మాటల మధ్యలో ఈ శుభకార్యాలకు కారణం తన తండ్రేనని తెలియడంతో కరుణకి చాలా ఆశ్చర్యం కలిగింది. తన ఇంటి విషయాలను తను చెప్పకనే తెలుసుకుని తల్లీ తండ్రీ ఒకరై సమస్యలను ఒక కొలిక్కి తెచ్చిన తండ్రికి కరుణ సంతోషంతో మరోసారి పాదాభివందనం చేసింది.

భాధ్యతలు ఒక కొలిక్కి రావడమూ, కరుణ కూతుర్ని ప్రసవించడంతో మోహనరావు జీవితంలో ఆనందం వెల్లివిరిసింది. కరుణ కాన్పు జరిగిన నాలుగు నెలలకే చిన్న చెల్లెలి వివాహమూ జరిపించాడు. మనవడు కలగలేదని బాధపడే మోహనరావు తల్లి కూడా మూడేళ్ళ వ్యవధిలో మనవడినీ ఎత్తుకుంది. పిల్లల ఆటపాటలలో మోహనరావు కరుణల సంసారం ఆనందంగా నడవసాగింది. ఏ ఒడుదుడుకులూ లేకుండా పిల్లల చదువులు కూడా ముందుకు సాగాయి. డిగ్రీ వరకు చదివించిన కూతురుకి సంబంధాలు వెతకసాగాడు. తన చెల్లెళ్ళ వివాహ బాధ్యతలో కలిగిన అనుభవం దృష్టిలో ఉంచుకుని ఆ విషయంపై జాగ్రత్త పడి కాబోయే వియ్యంకునికి, ఇంజనీరయిన ఒక అబ్బాయీ పెళ్ళయి అత్తవారింట్లో వున్న అమ్మాయీ గల సంబంధం చూసి ఘనంగా పెళ్ళి చేసాడు. కూతురి సుఖమయ సంసారం చూసి చాలా ఆనందించాడు. రాధకి పెళ్ళయి నాలుగేళ్ళయినా పిల్లలు కలగక పోవడంతో గృహప్రవేశమయిన తరువాత తన అల్లుడు కృష్ణని కారణం ఏమిటని అడిగాడు. మావగారి భయం అర్థం చేసుకున్న కృష్ణ “మావయ్యా, ఈ రోజుల్లో సైన్సు బాగా వృధ్ధి చెందింది. సంతాన సమస్యల పరిష్కారానికి ఎన్నో మార్గాలున్నాయి. మీరేమీ కంగారు పడకండి” అంటూ నవ్వుతూ జవాబు చెప్పాడు. ఆ మాట వినగానే మోహనరావుకు మనశ్శాంతితో పాటూ ఏమూలో అంతర్మథనం కూడా మొదలయ్యింది.

ఆత్రంగా “ఏమండీ, ఏమండీ” అన్న కరుణ పిలుపుతో ఒక్కసారిగా మోహనరావు ఆలోచనల నుంచి తేరుకున్నాడు. ‘కరుణా’ అంటూ గృహప్రవేశమయిన తరువాత అల్లుడు చెప్పిన మాటలు కరుణకి చెప్పి కంటతడి పెట్టాడు. కరుణ ఆశ్చర్యంతో “ఇదేమిటండీ అంత మంచి అల్లుడూ, వియ్యంకులూ దొరికితే మీరు సంతోషించాలిగానీ ఈ కంట తడి ఏమిటి? ఇవి ఆనందభాష్పాలేనా?” అంటూ ప్రశ్నించింది. ఆ మాటలకు మోహనరావు మరింత ఇబ్బంది పడుతూ “కరుణా ఐయామ్ సారీ, నన్ను క్షమించు” అని పదేపదే అనడంతో కరుణకి ఏమీ అర్థం కాలేదు. వంట గదిలోకి వెళ్ళి గ్లాసుడు నీళ్ళు, రెండు కప్పుల టీలతో వచ్చింది. అవి తాగి పదినిమిషాలలో కాస్త తేరుకున్న మోహనరావు “కరుణా నేను నీదగ్గర ఒక విషయం దాచాను. మన పెళ్ళయి మూడేళ్ళయినా పిల్లలు లేరంటూ అమ్మ నాతో అనడం, స్నేహితులు చేసే వేళాకోళం నన్ను బాధించింది. డాక్టర్ని సంప్రదిస్తే కొన్ని పరీక్షలు చేసి నాలోనే చిన్న లోపం వుందన్నారు. కొద్ది నెలలు మందులు వాడితే సరి అవుతుందని కూడా చెప్పారు. ఆ విషయం ఎవరికైనా తెలిస్తే నా గౌరవం పోతుందని చెప్పలేదు. నీతో కూడా చెప్పడానికి సిగ్గుపడి నీ మీద లేనిపోని కోపం చిరాకు చూపించాను. ఈనాడు మన అల్లుడి ప్రవర్తన ఆ నాడు నేను చేసిన తప్పుని నాకు తెలియజేసింది. నా లోపం తీరి మనకు పిల్లలు కలిగేంతవరకూ నువ్వు ఎంత మానసిక క్షోభ అనుభవించావో, నన్ను క్షమించు కరుణా “అంటూ చెయ్య పట్టుకున్నాడు.

భర్త మాటలు విన్న కరుణ “నాకు ఈ విషయం అప్పుడే తెలుసు. మీ రెండో చెల్లెలు పెళ్ళి తరువాత మిమ్మల్ని నిలదీసి అడిగేదానినే, ఈలోగా నేను నెలతప్పడంతో యిక ఆ రాద్ధాంతం ఎందుకని ఊరుకున్నాను. ఆరోజే మీరు మనసువిప్పి నాతో ఈ విషయం మాట్లాడితే నేను అర్థం చేసుకునేదానిని. ఈ మనోవేదన ఆనాడు నాకూ, నేడు మీకూ కలిగేదీ కాదు. అల్లుడిని చూసిన తరువాతైనా మీరు నాతో ఇన్నేళ్ళకు ఈ విషయం చెప్పినందుకు ఆనందంగా ఉంది” అన్న కరుణ మాటలకూ, సంస్కారానికీ మోహనరావుకి నోట మాట రాలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here