కాజాల్లాంటి బాజాలు-80: చిత్రగుప్తుడి చిట్టాలో తికమకలు..

6
4

[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]

[dropcap]ఇ[/dropcap]వాళ పొద్దున్నే అభయాంబక్కయ్య ఫోన్ చేసింది.

అభయాంబక్కయ్య మీకు తెలుసుకదా.. మా చిన్నప్పుడు మా కింద వాటాలో వుండీ, నేనూ మా చెల్లెళ్ళూ మడీ తడీ చూసుకోకుండా తిరిగేస్తుంటామని మా అమ్మగారికి ఫిర్యాదులు చేసేదీ… తనే.. ఆమధ్య అనుకోకుండా మార్కెట్లో కనపడింది. ముందు గుర్తు పట్టలేకపోయేను. కానీ ఆ షాప్ వాడితో మాట్లాడుతున్న మాటల్ని బట్టి అనుమానం వచ్చి, నెమ్మదిగా మాట కలిపి ఆరా తీస్తే… ఇంకెవరూ… అభయాంబక్కయ్యే.. ఆమెని చూసి నేనెంత ఆనందపడ్డానో అంతకు వెయ్యి రెట్లు నన్ను చూసి ఆమె ఆనందపడిపోయింది. కాసేపు మా అమ్మానాన్నగార్ల గురించి కబుర్లు చెప్పుకున్నాక ఒకరి కొకరం ఫోన్ నంబర్లు యిచ్చి పుచ్చుకుని, వీలైనప్పుడు యింటికి రమ్మని చెప్పుకుంటూ విడిపోయేం..

ఏ ముహూర్తాన మళ్ళీ కలిసామో యేమో.. ఆతర్వాత నుంచీ ఈ కరోనా మూలంగా ప్రపంచం మొత్తం అతలాకుతలమైపోయింది. అక్కడికీ ఏ నెలకో రెణ్ణెల్లకో ఓసారి యిద్దరం ఫోన్లు చేసుకుని మాట్లాడుకుంటూనే వున్నాం కానీ కలవడానికే కుదరలేదు. అందుకే ఇంత పొద్దున్నే అభయాంబక్కయ్య ఫోన్ చెయ్యగానే కాస్త వెంటనే యెత్తేను.

ఆమె తన మామూలు ధోరణిలో “స్వర్ణా, మీ ఆయనకి రేపు శెలవేనా..” అనడిగింది. అసలు సంగతేవిటో చెప్పకుండా తనక్కావల్సినదేదో అడిగెయ్యడం అక్కయ్యకి అలవాటే.. అసలు మా ఇద్దరి మధ్యా మా ఆయనెందుకొచ్చేరో అర్థం కాలేదు. అందుకే “ఎందుకూ!” అనడిగేను ముందు జాగ్రత్తగా..

“రేపు మీ ఆయన్ని భోజనానికి పిలుద్దామనీ..” అంది.

నన్ను కాకుండా మా ఆయన్ని పిలవడమేంటీ..ఇది మరీ ఆశ్చర్యంగా అనిపించింది.. మళ్ళీ “ఎందుకూ!” అనడిగేను.

“రేపు సప్తమి కదా.. మీ ఆయనకి భోజనం పెట్టి చిత్రగుప్తుడినోము ఉద్యాపన చేసుకుందామనీ..”

“మా ఆయనకే ఎందుకూ…”

“నీ మొహం.. నీకేం తెలీదు. చిత్రగుప్తుడినోము ఉద్యాపనకి అన్నదమ్ములకి కానీ, గ్రామ కరణానికి గానీ, గ్రామాధికారికి గానీ, భోజనం పెట్టి, ఎడ్లు తొక్కని వడ్లు అయిదు కుంచాలు కట్లు లేని గంపలో పోసి, దాని మీద గుమ్మడిపండుని పెట్టి, రెండున్నరకిలోల బియ్యం, ఆకుకూరలు, పట్టు పంచె ఆ గంపలో పెట్టి వెండి ఆకు, బంగారు గంటము వాటి మీద వుంచి, దక్షిణ తాంబూలాలతో అందివ్వాలి.”

కాస్త గుక్క తిప్పుకుందుకు ఆగింది మా అభయాంబక్కయ్య. వింటున్న నాకు యేంటో తుదీ మొదలూ లేని కథ వింటున్నట్టనిపించింది. కానీ అక్కయ్యని కాదంటే మళ్ళీ నాకు మడీ అంటూ, పూజా వ్రతం లేదంటూ స్తోత్రం మొదలు పెడుతుందేమోనని భయమేసింది.

మళ్ళీ అక్కయ్యే అందుకుంది.

“ఈ కరోనా మొదలయ్యాక వెంటనే వచ్చిన సంక్రమణం రోజే చిత్రగుప్తుడినోము పట్టేను. ఈ యేడాదంతా రోజూ కథ చెప్పుకుని, అక్షింతలు వేసుకుంటున్నాను. ఇంకిప్పుడు ఉద్యాపన చేసుకోవాలి. ఈ రోజుల్లో ఈ పట్నాల్లో మనకి గ్రామాధికారులు ఎక్కడ దొరుకుతారూ! మా తమ్ముడు ఎక్కడో అమెరికాలో ఉన్నాడయ్యె. మీ ఆయన సద్బ్రాహ్మణుడు కదా… అందుకని ఆయన్నే తోబుట్టువుగా భావించి భోజనం పెట్టి, దక్షిణ తాంబూలాలిద్దామనీ..” అంది.

ఈ సంగతంతా చెప్పి అభయాంబక్కయ్య ఇంటికి భోజనానికి వెళ్ళమంటే మా ఆయన వెళ్ళడు అని ఖాయంగా తెలిసిన నేను, “అంతర్జెంటేవుందీ! కాస్త ఊళ్ళో అంతా సరిగ్గా అయ్యాక పెట్టుకోవచ్చుకదా ఈ భోజనాలవీ..” అన్నాను నెమ్మదిగా..

“అబ్బే.. అస్సలు ఆలస్యం చెయ్యడానికి లేదు. అసలిప్పటికే ఆలస్యం చేసేసేను. అన్నట్టు నువ్వు చిత్రగుప్తుడినోవు పట్టేవా లేదా.. పడితే నువ్వు కూడా గబగబా ఉద్యాపన చేసేసుకో… మీ ఇంటికి భోజనానికి మా ఆయన్ని తీసుకొస్తాలే..అయినా మీ తమ్ముడు ఊళ్ళోనే ఉన్నాడుగా.. నీకు పరవాలేదు”

నా సంగతి కూడా అక్కయ్యే తేల్చేస్తుంటే నాకేం మాట్లాడాలో తెలీలేదు.

“ఏంటి మాట్లాడవూ.. అసలే చిత్రగుప్తుడు యేం చెయ్యాలో తెలీక తికమక పడిపోతున్నాడు. మనం ఇంక ఆలస్యం చెయ్యకూడదు.”

నాకు మతి పోయింది.

“చిత్రగుప్తుడెవరూ!” అన్నాను ఆయన ఎవరి బంధువో అర్ధం కాక.

“హూ.. ఇలా వుందన్నమాట నీ జ్ఞానం. చిత్రగుప్తుడంటే మన పాపపుణ్యాల చిట్టా రాసేవాడు. ఆయన రాసి పెట్టినదాన్ని బట్టే యముడు మనం నరకంలో వుండాలో, స్వర్గానికి వెళ్ళాలో నిర్ణయిస్తాడు.”

“కావచ్చూ… కానీ ఆయన దేవుడు కదా… ఆయన తికమక పడ్దం యేవిటీ! అలా పడుతున్నాడని నీకెలా తెల్సిందీ!”

“ఎందుకు తెలీదూ! ఈ ఏడాదిలో ఎంతమంది వున్నారో యెంతమంది పోయేరో అసలెక్కడైనా లెక్కాపత్రం వున్నాయా? గవర్నమెంటే లెక్కలు చెప్పలేక చేతులెత్తేసింది. ఎవరైనా పోయేరని చెపితే వాళ్ళు బతికే వుంటున్నారు. బతికున్నారని చెప్పిన మనుషులు కలికంలోకి కనపడ్డం లేదు. పొలోమంటూ అందరూ ఒక్కసారిగా ఆ నరకం గేట్ల దగ్గర పడిగాపులు పడుతున్నారు. నేను నేనంటూ అందరూ ఒకరిమీద ఒకరు పడిపోతుంటే ఎవరి చిట్టాపద్దు యేదో పాపం ఆ చిత్రగుప్తుడికి తెలీక తల పట్టుక్కూర్చుంటున్నాడు.”

సినిమాలో దృశ్యంలా ఆ యమపురి గేట్ల దృశ్యాన్ని చూపిస్తున్న అభయాంబక్కయ్య దివ్యదృష్టికి తబ్బిబ్బు పడిపోయేను.

“ఇదంతా నీకెలా తెల్సిందీ!” కాస్త తేరుకుని అడిగేను.

“ఇందులో తెలీకపోడానికి ఏవుందీ? ఇంతమంది ఒక్కసారి వచ్చి మీద పడిపోతుంటే ఎవరికైనా గాభరా వస్తుంది కదా! అదే చెప్పేను” అంది ధీమాగా..

నా తల్లే అనుకుని, “అసలు ఆ గేట్ల దగ్గర జనాలకీ నీ నోము ఉద్యాపనకీ సంబంధం ఏవిటీ?” మళ్ళీ అడిగేను.

“ఆమాత్రం తెలీట్లేదా స్వర్ణా.. పనెక్కువైతే మనం ఏం చేస్తాం? ఖంగారులో ఒకదాని కింకోటి చేసెయ్యం? అలాగే ఆ గాభరాలో చిత్రగుప్తుడు ఒకరి పాపపుణ్యాలు ఇంకోళ్ళకి రాసేస్తే..”

నాకు చిరాకులాంటిది వచ్చింది. నేను దేవుణ్ణి నమ్ముతాను. పూజిస్తాను. అంతేకానీ అలాంటి దేవుణ్ణి మన మనుషుల స్థాయికి తీసుకొచ్చి, మనకుండే బలహీనతలన్నీ వారికీ వుంటాయనే ఇలాంటి అభయాంబక్కయ్యలాంటి వాళ్లని చూస్తే మటుకు నాకు అస్సలు నచ్చదు.

ఆ మాటే స్థిరంగా చెప్పేను అక్కయ్యకి.

“మనం మనుషులం.. తప్పులు చేస్తాం. కానీ చిత్రగుప్తుడు మనిషి కాదు కదా! దేవుడు.. అందుకని ఆయన అలా చెయ్యడు..”.

“ఏమో ఎవరు చెప్పగలరూ! మన జాగ్రత్తలో మనం వుండాలి కదా!”

“అక్కర్లేదు. భగవంతుడంటే భక్తి వుండాలి కానీ భయం ఉండకూడదు. దేవుడి దగ్గర అడ్డదార్లు లేవు. నువ్వు చేసిన పాపపుణ్యాలు అందరికన్న ముందు నీ మనసుకే తెలుస్తాయి. ఆయన మన మనసుల్లోనే గుప్తంగా వుండి మన చిట్టా తయారు చేస్తాడు. అందుకనే చిత్రగుప్తుడు అంటారు. ఇలాంటివన్నీ చేసి మనల్ని మనం మభ్యపెట్టుకోకూడదు అక్కయ్యా..”

అక్కయ్య కంఠస్వరం నిష్ఠూరంగా మారింది.

“ఏవోనమ్మా.. నా బెంగ నాదీ.. ఆ పేరు చెప్పుకుని రోజూ పూజ చేస్తే తప్పేం లేదు కదా… అందుకనే ఆయన పేరు చెప్పుకుని యేడాదిపాటు కథ చెప్పుకుని, ఆయన పేరు మీద ఉద్యాపన చేసేస్తే ఆయన మనని బాగా గుర్తు పెట్టుకుంటాడు. అలాంటప్పుడు ఇంక మనకి ఆ చిత్రగుప్తుడి చిట్టాలో తికమకలు రావు కదా! ఇంతకీ మీ ఆయనకి రేపు శెలవుందో లేదో చెప్పనే లేదూ!” అంది దీర్ఘం తీస్తూ..

“లేదు. రేపే కాదు.. ఆ తర్వాతి సప్తమికి కూడా మా ఆయనకి శెలవు లేదు.. నువ్వు ఇంకెవర్నైనా చూసుకో అక్కయ్యా..” అని గబగబా చెప్పి ఫోన్ పెట్టేసేను.

అభయాంబక్కయ్యలాంటివాళ్ళు మన చుట్టూ ఎంతమందున్నారో కదా అనిపించింది ఒక్కసారి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here