[dropcap]అ[/dropcap]మ్మ నాకు జన్మనిస్తే దైవం కరుణించినట్లే
తొలి ప్రేమ జల్లుల్లో తనువంతా తడిసినట్లే!
అమ్మ లాల పోస్తుంటే పూలవాన తాకినట్లే
పుట్టినందుకేదైనా మంచి చేయమన్నట్లే!
అమ్మ జోల పాడుతుంటే ఆత్మ మేలుకొన్నట్లే
బతుకుబాటలో ఇంక భయంలేక నడిచినట్లే!
అమ్మ ఉయలూపుతుంటే ఆకాశం అందినట్లే
అందరాని చందమామ ఆటబొమ్మ అయినట్లే!
అమ్మ బువ్వ తినిపిస్తుంటే అమృతమికలేనట్లే
కడుపుతీపి తోవంతా చేయిపట్టి నడిపినట్లే!
అమ్మ బరులు నేర్పుతుంటే బ్రతుకు అర్థమైనట్లే
మనిషితనం చదువంతా మనసారా నేర్చినట్లే!
అమ్మ కళ్లు ఎర్రబడితే తప్పులన్ని తెలిసినట్లే
తడబడని నడకలతో గమ్యం ఇక చేరినట్లే!
అమ్మ ఘడియ దూరమైతే చుట్టూతా చీకట్లే
వెలుగు కోసం వేసటతో మరిమరి తిరుగాడినట్లే!
అమ్మ కంట నీరు తిరిగితే ఆ సంద్రం పొంగినట్లే
కలతపెట్టే ఏ బిడ్డను ఆ దేవుడు మన్నించనట్లే!
అమ్మ కోసం అక్షరాల్లో వెదికేవా ఓ భవానీ!
అణువణువులోని దైవం అమ్మలా కనిపించినట్లే!!