[dropcap]పం[/dropcap]తులమ్మ సినిమా 1977లో వచ్చింది. ఈ సినిమాకు మూడు నంది బహుమతులు లభించాయి. ఉత్తమ నటిగా లక్ష్మికి, ఉత్తమ గేయ రచయితగా వేటూరి సుందరామ్మూర్తి గారికి, ఉత్తమ సంగీత దర్శకులుగా రాజన్-నాగేంద్రలకు. కథ కన్నా సంగీతపరంగా ఈ రోజూకీ గుర్తుండి పోయే సినిమా ఇది. అద్భుతమైన పాటలు, మర్చిపోలేని సంగీతం ఈ సినిమాకు ఆకర్షణ. ఆ పాటలలో వేటూరి గారి సాహిత్యం తెలుగు పాటకు కొత్త సొగసులు అద్దిందని చెప్పవచ్చు.
కథకు వస్తే రాజేశ్ ఒక సినీ నటుడు గాయకుడు, అతని భార్య ఆక్సిడెంట్‌లో మరణిస్తుంది. భార్యను ఎంతో ప్రేమించిన అతను ఆ దుఃఖం నుండి బైటకు రాలేకపోతాడు. అతనికో చిన్న కొడుకు. పనితో ఎప్పూడూ ఇంటి నుండి దూరంగా ఉండే రాజేశ్, తన ఇంటి పెత్తనం అంతా అక్కగారికి అప్పజెప్పుతాడు. ఆమెది అందరినీ తన గుప్పిటిలో పెట్టుకుని ఆడించే మనస్తత్వం. బాబుకు టీచర్‌గా ఉండడానికి ఆ ఇంటికి శారద అనే యువతి వస్తుంది. శారద ముందు బాబుకు దగ్గరవుతుంది. తరువాత రాజేశ్ మంచితనం ఆమెను ఆకర్షిస్తుంది, అతన్ని ప్రేమిస్తుంది. శారదపై తమ్ముడికి మమకారం పెరుగుతుందని భయపడిన అతని అక్క తన ఫామిలీ డాక్టర్‌తో ఆమెను ఎలాగయినా ఇంటి నుండి పంపించేయడానికి సహాయం కోరుతుంది. స్త్రీలోలుడైన ఆ డాక్టర్ శారదను ఆకర్షించలేక ఆమెపై కోపం పెంచుకుంటాడు. రాజేశ్ భార్య సీతకు తనతో అక్రమ సంబంధం ఉండిండని, అది భర్తకు తెలుస్తుందేమో నన్న భయంతోనే ఆమె చనిపోయిందని శారదతో డాక్టర్ చెప్పడం విన్న రాజేశ్ అతన్ని ఇంటి నుండి గెంటేస్తాడు. కోపంతో ఆ డాక్టర్ మరుసటి రోజు రాజేశ్ భార్య సీత తనతో అతి దగ్గరగా ఉన్న ఫోటోలు పత్రికలలో వేయిస్తాడు. అది నిజం అని నమ్మి రాజేశ్ తాగడం మొదలెడతాడు.
శారద ఇందులో నిజాలు కనుక్కోవాలనుకుంటుంది. సీత డైరీ సంపాదించి అది రాజేశ్‌కు చూపిస్తుంది. మోసంతో మత్తు మందు కలిపి ఫోటోలు దిగి తనను బ్లాక్‌మెయిల్ చేస్తున్న డాక్టర్ సంగతి భర్తకు చెప్పలేక సీత ఆత్మహత్య చేసుకుందని రాజేశ్‌కు శారద ద్వారా తెలుస్తుంది. అందులో తన అక్క పాత్ర కూడా ఉందని తెలుసుకుని ఆశ్చర్యపోతాడు రాజేశ్. చివరకు శారద రాజేశ్‌లు ఒకటవుతారు. ఇటువంటి కథల పట్ల నాకు పెద్దగా ఆసక్తి ఉండకపోయినా ఈ సినిమాలో నచ్చింది సింపిల్ ప్రెజెంటేషన్. సింగితం శ్రీనివాసరావు గారు మంచి కుటుంబ కథా చిత్రంగా ఈ సినిమాను మలిచారు. మసాలలు చెత్త డాన్సుల ఫార్ములాలు కనిపించవు. అతి చక్కని పాటలు. రాజేశ్ పాత్రలో రంగనాథ్ గారు చాలా డిగ్నిఫైడ్‌గా కనిపిస్తారు. చిల్లరతనాన్ని హీరోయిజం అనుకునే వారికి వారి పాత్ర నచ్చకపోవచ్చేమో కాని హుందాతనాన్ని ఆరాధించేవారికి ఈ సినిమాలో రంగనాథ్‌లో ఒక హీరో కనిపిస్తాడు. కాని అంత ప్రేమించిన భార్యను పేపర్లలో వచ్చిన ఒక్క ఫోటో కారణంగా అనుమానించే స్థితికి భర్తలు చేరడం లాంటి కాన్సెప్ట్‌లపై నాకు కొంత అసహనం ఎప్పుడూ ఉంటుంది. ఇది తప్ప సినిమాలో ఎక్కడా అనవసరమైన డైలాగులు కాని మేనరిజంలు కానీ కనిపించవు. లక్ష్మి చాలా పద్దతిగా, అందంగా, హుందాగా ఉంటారు ఈ సినిమాలో.
ఇక పాటల విషయానికి వస్తే అన్నీ ఆణీముత్యాలే.
పల్లవించు ప్రతి పాటా బ్రతుకు వంటిదే…రాగమొకటి లేక తెగిన తీగవంటిదే…
కొన్ని పాటలింతే… గుండే కోతలోనే చిగురిస్తాయ్… కొన్ని బ్రతుకులింతే వెన్నెలతో చితి రగిలిస్తాయ్
ఇలాంటి వేటూరి వాక్యాలు రాజన్ నాగేంద్ర గారి సంగీతంలో అలరిస్తాయి.
“ఎడారిలో కోయిల” సందర్భానికి వచ్చే పాటే అయినా వెతికెతే ఎనో అర్థాలు ఆ వాక్యాలలో…..
ఎద వీణపై అనుగాగమై తలవాల్చి నిదురించు నా దేవతా
కల అయితే శిల అయితే మిగిలింది ఈ గుండె కోతా…
నా కోసమే విరబూసినా మనసున్న మనసైన మరుమల్లికా,
ఆమనులే వేసవులై రగిలింది ఈ రాలు పూత…..
ఎంత సున్నితమైన పదాలతో భార్యా వియోగాన్ని చూపించారో వేటూరి గారు…. అలాగే…..
జాబిలి కన్నా నా చెలి మిన్న, పులకింతలకే పూచిన పొన్న
కానుకలేవి నేనివ్వగలను, కన్నుల కాటుక నేనివ్వగలను
పాల కడలిలా వెన్నెల పొంగింది పూల పడవలా నా తనువూగింది
ఏ మల్లెల తీరాల నిను చేరగలనో మనసున మమతై కడతేరగలనో,…
మానస వీణ మధుగీతం మన సంసారం సంగీతం
సాగర మథనం, అమృత మధురం
సంగమ సరిగమ స్వర పారిజాతం….
ఈ పాటకే వేటూరు గారు నంది బహుమతి అందుకున్నారు. ఎంత అందమైన పద ప్రయోగం ఇది… సంగీతం తెలిసిన వారు రాగాలను అర్థం చేసుకున్న వారు కుదిర్చే పదాలివి అనిపిస్తుంది ఈ పాట విన్న ప్రతి సారి కూడా.. ఇక మరో అద్భుతమైన తెలుగు పాట వేటూరి గారి కలం సృష్టి “సిరి మల్లె నీవే” తెలుగు మాటకే అందానిచ్చేన పాట ఇది. ఎన్ని తరాలు గడిచిపోయినా మిగిలిపోయే ఒక తెలుగు సినిమాద్భుతం….
సిరిమల్లె నీవే విరిజల్లు కావే వరదల్లే రావే వలపంటే నీవే ఎన్నేల్లు తేవే… ఎద మీటీ పోవే
ఇందులే కష్టమైన మాటలేం లేవు కాని వాటిని ఆలా కూర్చడం వలన వచ్చే ఫీలింగ్‌ని ఆస్వాదించడం ఒక అనుభూతి. ఇటువంటి అనుభవానివ్వడం వేటూరిగారికే చెల్లింది.
“ఎలదేటి పాట… చెలరేగే నాలో చెలరేగిపోవే మధుమాసమల్లే, ఎలమావి తోట.. పలికింది నాలో పలికించుకోవే మది కోయిలల్లే… నీ పలుకు నాదే.. నా బ్రతుకు నీదే”…..
ఎక్కడా కష్టమైన పదం లేదు ఒక ఎలదేటి పాట, ఎలమావి తోట ను కలిపి ఇందులో ఆయన తీసుకొచ్చిన ప్రేమ భావన ఎంత గొప్పగా ఉంటుందో…..
తొలి పూట నవ్వే… వన దేవతల్లే… పున్నాగపూలే.. సన్నాయి పాడే… ఎన్నేల్లు తేవే.. ఎదమీటీ పోవే…
తొలి పూట అనే ప్రయోగంతో ఆ తొలి ఉషస్సుని ఆయన చూపడం నాకు ఈ పాట విన్న ప్రతి సారి తెలియని ఆనందానిస్తుంది. అలాగే తొలి పూటతో పాటు చేరిన పున్నాగ పూలు, వెన్నల కలబోత తలచుకుంటేనే ఒకవిధమైన హాయిని కలిగిస్తాయి… ఏం రాసారండీ వేటూరి గారు… ఇక అక్కడితో ఆగారా… లేదు….
మరు మల్లె తోట.. మారాకు వేసే.. మారాకు వేసే… నీ రాకతోనే…. మరుమల్లే తోట మారాకు వేసిందట. ఎందుకంటే చెలి వచ్చిందని. ఆమెతో వచ్చిన పరిమళం మల్లెలనే మించిందని అర్థమా….
నీ పలుకు పాటై.. బ్రతుకైన వేళ బ్రతికించుకోవే నీ పదముగానే…. నా పదము నీవే.. నా బ్రతుకు నీవే…
ఈ వాక్యం దగ్గరకు వచ్చేసరికి ఆ సమర్పణ భావానికి మనసు పులకరిస్తుంది. తరువాత ఇలా రాస్తారు….. అనురాగమల్లే సుమగీతమల్లే…నన్నల్లుకోవే నా ఇల్లు నీవే…..
ఎక్కడా.. పదాల మాజిక్ లేదు. పాండిత్యపు భాష లేదు కాని ఎంతటి అందం ఆ వాక్యాలలో ఈ పాటకు సంగీతాన్ని కూర్చిన రాజన్ నాగేంద్రలు కూడా ఎంతటి రోమాంటిజంను జోడించారంటే అదో అద్భుత సంగమం. పంతులమ్మ సినిమా అంటే నాకు అందుకే ఎవరూ గుర్తుకు రారు.. ఒక్క వేటూరి గారు తప్ప….. సినిమాలో ఈ పాటల చిత్రీకరణ కూడా చాలా బావుంటుంది. అందుకే ఎన్ని అంతర్జాతీయ సినిమాలు చూసినా భారతీయ సినిమాకు పాటే జీవం అనిపిస్తుంది నాకు. అవి సహజత్వానికి దూరం అని మేధావులన్నా సినిమాలలో వచ్చే ఇలాంటి పాటలిచ్చే నిషా అనుభవించాక పాటలు సినిమాకు ఊపిరి అనిపిస్తుంది.
మంచి ఫీల్ ఇచ్చే సినిమా ఇది. వేటూరి గారు ఎన్నో పాటలు రాసినా ఈ పాటలిచ్చే అనుభూతి వేరు. మనసెరిగినవాడు మా దేవుడు శ్రీరాముడు అనే మరో పాట ఉంటుంది. అదీ వేటూరి గారి మార్క్ తోనే నడుస్తుంది. అందమైన సినిమా, అందమైన నటులు, అందమైన పాటల, మాటల కాంబినేషన్ ఈ పంతులమ్మ… కొన్ని సార్లు గొప్ప సినిమాలు ఇవ్వలేని ఆనందాన్ని అందమైన సినిమాలు ఇస్తాయి. వీటిలో గొప్ప కథ, గొప్ప కథనం ఉండకపోయినా మనసును పరవశింపజేసే కొన్ని భావాలుంటాయి. దాన్ని అనుభవించడం చేతనైన వారు ఈ సినిమాను తప్పక ఆనందిస్తారు.