[box type=’note’ fontsize=’16’] జూలై 4వ తేదీ అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు రాజేశ్వరి దివాకర్ల. [/box]
[dropcap]జా[/dropcap]నపద వినోద గాన కళా ప్రక్రియగా బుర్రకథ ఉత్తమ ప్రచార సాధనం. సంగీతం, నృత్యం, అభినయాలతో కూడిన జన ప్రియమైన ప్రదర్శన కళ బుర్రకథ. ప్రజలకు వినోదంతో పాటు విజ్ఞానాన్ని ప్రసాదించి, ఉత్తేజపరచి చైతన్యవంతులను చేయగలిగిన మహత్తర మాధ్యమం బుర్రకథ.
బుర్రకథలో ప్రధాన కథకుడు, భుజం మీది తంబురా మీటుతూ, ఎడమ చేతివ్రేళ్ళలోని అందెల్ని మ్రోగిస్తూ తంబురా శృతిలో కథా గానం చేస్తాడు. షరాయి, నిలువుటంగీ, తలపాగ ధరించి, కాళ్ళకు గజ్జెలు ధరించి, రసానుగుణంగా చిందులు తొక్కుతూ, గంతులు వేస్తూ, అభినయిస్తాడు. అతని గానాలాపనలకు సహకరిస్తూ ఇద్దరు లేక ఒక్కరు గుమ్మెటలు ధరించి, తందాన తాన వంత పాడుతూ, కథాకథనంలో తాళరీతిని అందిస్తారు.
బుర్రకథలుగా స్వాతంత్ర్య వీరుల గాథలు ఆబాల గోపాలాన్ని ఉర్రూతలూగిస్తాయి. భారత స్వాతంత్ర్య చరిత్రలో అల్లూరి సీతారామరాజు చరిత్ర ప్రత్యేకమైన అధ్యాయం.
ఓడిపోతానని తెలిసి కూడా/కడదాకా పోరి
నెత్తురోడి పడిపోవడం/సాధారణ యోధ కథ
ప్రజల మీది ప్రేమతో/ప్రజల్ని గట్టెక్కించాలని
ఆత్మార్పణ చెయ్యడం/అసాధారణ వీరగాథ!…
అటువంటి అసాధారణ యోధుడు అల్లూరి సీతారామరాజు గాథను వచన కవితా కథా కావ్యంగా మలిచారు ప్రజాకవి డాక్టర్ అద్దేపల్లి రామ్మోహనరావుగారు. అల్లూరి సీతారామరాజు గారి వీర గాథ తెలుగులో అనేక ప్రక్రియలుగా వెలువడింది. వీరగాథా వాఙ్మయంపై లోతైన పరిశోధన చేసిన డా.తంగిరాల సుబ్బారావు గారి కోరిక మేరకు డా.మల్లెల గురవయ్య 1995లో ‘సీతారామ రాజీయము’ పేరుతో సుమారు 2000 పద్యాల్లో ఒక మహా కావ్యాన్ని రచించారు. దాన్ని అల్లూరి శతజయంతి సందర్భంగా 1997 జూలైలో ముద్రించారు.
జానపదులు అల్లుకున్న వీర గాథల్లో మిక్కిలి జనప్రియమైన కథ అల్లూరి సీతారామరాజు. శ్రీ సుంకర సత్యనారాయణ గారు ఈ వీరుని స్వాతంత్య్ర సమరాన్ని ఒక ఉత్తేజపూరిత మైన బుర్రకథగా రూపొందించారు. బుర్రకథా పితామహులుగా పేరు పొందిన శ్రీ నాజరు గారు ఈ వీరుని కథను ఊరూరా ప్రదర్శించి ప్రచారం చేసారు. బుర్రకథకు ప్రత్యేకమయిన దుస్తులు ధరించడం శ్రీ నాజరు గారితో ప్రారంభమయింది.
శ్రీ అల్లూరి సీతారామరాజును విప్లవ జ్యోతిగా కీర్తిస్తూ శ్రీ పి. దుర్గా రావు ఎం.ఒ.ఎల్ గారు బుర్రకథను రాసారు (1955). దుర్గా రావు గారు భారత కోకిల సరోజినీ దేవి, నవయుగ నిర్మాత శ్రీ కందుకూరి, వీర నారీమణి ఝాన్సీ లక్ష్మీబాయి జీవితాలను గూర్చి చిన్న చిన్న బుర్రకథలను రాసినట్టు తెలిపారు. పూర్వం వారు రావుల పెంట పాఠశాల విద్యార్థులు ప్రదర్శించడానికి రాసిన కథను విస్తృతపరచి ప్రస్తుత బుర్రకథను బాలలందరికి ఉపయోగార్థంగా ప్రచురించారు (1984 మే). పుస్తక ప్రతిని బట్టి వారు చెరుకుపల్లి పోస్ట్, నక్రేకల్, నల్లగొండ జిల్లా వాస్తవ్యులని తెలుస్తుంది.
దుర్గా రావు గారు తాము ఈ కథను బాలల కోసం రాసినట్లుగా ప్రకటించినా, అల్లూరి సీతారామరాజుకథ ఆబాల గోపాలానికి అచంచలమైన దేశ రక్షణా ధ్యేయాన్ని కలిగిస్తుంది.
తమ రచనకు అల్లూరి సీతారామరాజు చరిత్ర పరిశోధకులు, రచయిత, స్వాతంత్య్ర సమరయోధులు. శ్రీ పడాల రామారావు గారు రాసిన “ఆంధ్రశ్రీ “మొదలైన గ్రంధాలు ఆధారమని తెలిపారు. దుర్గారావుగారు బుర్రకథ ఆరంభంలో అమర వీరులందరకూ, దేశభక్తులకూ జోహారులను అర్పించారు. ప్రార్థనగా “అంబవైన నీవేనమ్మా! జగదాంబవైనా నీవేనమ్మా!” అని భారతాంబను స్తుతించారు.
బుర్రకథకు జీవం వంతలు. వంతల బలం లేక పోతే బుర్రకథకు అందం లేదు. కథకుడు చరణం పాడిన తరువాత, “భళా భళానోయ్ తమ్ముడా! సై భాయి భళానోయ్ తమ్ముడా!” అంటూ ఈ బుర్ర కథలో వంత కథకునికి తోడుగా తమ్మునిగా సహకరించాడు.
వంత అడిగిన ప్రశ్నలకు సందేహాలకు జవాబు చెబుతున్నట్లుగా కథకుడు విశాఖ జిల్లా పాండ్రింగిలో 1897 జులై 4వ తేదీన అల్లూరి సీతారామరాజు పుట్టుక నుంచి 1924లో జరిగిన బలిదానం వరకూ జరిగిన ఏ సంఘటననూ విడవకుండా అన్నింటినీ పూసగుచ్చినట్లుగా వివరించాడు.
వినరా భారత వీర కుమారా ! విజయము మనదేరా! అంటూ పల్లవితో ఆరంభం అయిన కథ, రగడలతో, కీర్తనలతో, పల్లె పదాలతో, సందర్భానికి తగిన బాణీలతో, రసావేశం చిందే పదాలతో రక్తి కట్టింది.
రచయిత తాము బాలలకోసం ఉద్దేశించి రాసారు కాబట్టి, ప్రతి గీతాన్ని పాడిన తరువాత తమ్ముడు అని సంబోధించిన వంతకు సంభాషణలో మరల కథను వివరించారు.
“పదునేడవ శతాబ్దిరా పడవల పైనే వచ్చిరి…ఈస్టిండియా పేరుతో వాణిజ్యానికని వచ్చిన ఆంగ్లేయులు ‘నెత్తిన టోపీ పెట్టుక, మెత్తని మాటలు నత్తుచు, ఒకచే త్రాసునుబట్టుక, ఒకచే కత్తినిబట్టుక’ భారత దేశము నాక్రమింపగా పన్నాగమునే పన్నిరి దొరలు”. …అని కథకుడు ద్రుత తాళ గతులతో పాడుతూ,
“భారత ప్రజలే ముందుకొచ్చిరి పగతురనెదిరింపా…” అంటూ ఆవేశం కనబరుస్తూ “బుసలు కొట్టెడి నాగుబాములా కెరటాల్ చిందే సముద్రంబులా గిర గిర తిరిగే సుడిగుండములా..” దేశ ప్రజలలో రగులుకున్న జ్వాలను ఉపమానం కావించాడు.
ఆ ప్రజా విప్లవం తిరుగుబాటును ఆంగ్లేయులు అణచి వేసారని ఆ ఆరంభ సంగ్రామమే స్వాతంత్ర్య దీక్షకు ప్రేరణమని కథకుడు…తందాన తాన, క్రమంలో కథను సమ తులగతులతో నడిపించాడు.
తరువాత గాంధీజీ నాయకత్వంలో స్వాతంత్రోద్యమం జరుగుతున్నా సాయుధంగా పోరాడి రక్తం చిందినప్పుడే స్వాతంత్ర్యం పొందగలమని మన్యంలో పోరాటం జరిపాడు అల్లూరి సీతారామరాజని కథా సూత్రాన్ని బిగించాడు.
విశాఖలో సుభాష్ చంద్రబోసు ఉపన్యాసం ద్వారా దీక్షా కంకణబద్ధుడై చదువుకు స్వస్తి చెప్పి సీతారామరాజు సంగ్రామానికి దూకాడని ఆ యువకునిలో జాగృత చైన్యానికి నాందిని తెలిపాడు.
మహాత్మా గాంధీ గారు ఆంధ్ర పర్యటనలో ఉండగా ఆయనకు అల్లూరి చిత్రపటాన్ని బహూకరించిన సందర్భంలో “నేను సాయుధ విప్లవాన్ని ఆమోదించ లేను, కాని శ్రీ రామరాజు వంటి ధైర్యవంతుడు, త్యాగి, నిరాడంబరుడు, ఉత్తమ శీలుడునగు యువకునికి జోహారులు అర్పింపకుండ ఉండలేను” (యంగ్ ఇండియ పత్రిక 1926.) అని గాంధీ గారు సీతారామరాజును గురించి రాసారు.
సీతా రామరాజు స్వాతంత్ర్య దీక్షను వహించడానికి ముందుగా దేశమంతా పర్యటన కావించాడని, తాను నిర్వహించ వలసిన కర్తవ్యాన్ని గురించి పరి పరి విధాల ఆలోచించాడని తెలుపుతూ కథకుడు సంభాషణా లౌల్యంలో మునిగిపోయినప్పుడు, వంత అతడు ఉపన్యాస ధోరణి లోకి మళ్ళాడని చనువుగా చెప్పడం రచయిత తనకు తానే హెచ్చరించుకున్నట్లు కనిపిస్తుంది.
రౌలటు ఆక్టు, తీవ్ర నిర్బంధాలు, జలియన్‌వాలా బాగ్ హత్యలు, డయ్యరు సేనాని దురంతాలు సీతా రామ రాజు మనస్సును కలచి వేశాయి. మన్య ప్రాంతంలో ఆంగ్లేయుల ఘోర పైశాచిక కృత్యాలు కనబడ్డాయి. కోయ ప్రజల దీనావస్థలను కళ్ళారా తిలకించాడు.
నిర్దాక్షిణ్యంగా హింసిస్తున్న తీవ్ర శక్తులతో పోరాడాలని బహిరంగంగానూ, రహస్యం గానూ, పోరాడి చావు దెబ్బ కొట్టాలని నిశ్చయించాడు.
ఇక్కడ రచయిత రామరాజు వ్యక్తిత్వాన్ని చక్కగా నిరూపించారు. వ్యక్తిగతంగా ఆ వీరుడు హింసావాది కాదని, తీవ్ర శక్తులను అంత చేయడమే ఆతని ధ్యేయం అనీ స్పష్టం చేసారు. ఆ ఆశయం కోసం నిప్పు రవ్వగా రాజుకొని జ్వాలగా ప్రజ్వరిల్లిన ఆతన భావ తీవ్రతను బాలలకు తగిన పదాలతో వివరించారు.
పరదేశీయులతో జరిగే పోరాటంలో సమిధగా కావాలనీ, దేశమాత చరణాలకు పూజా పుష్పంగా ఆత్మార్పణ కావించు కోవాలని ఎంచినట్లు సీతారామరాజు త్యాగ గుణాన్ని తెలిపారు.
మన్య ప్రాతం మధ్య ప్రదేశ్ ఒరిస్సాలకు మధ్య – ఇటు ఉభయ గోదావరులను ఆనుకుని కొండలతో, కోనలతో, అడవులతో నిండి ఉందని మన్య ప్రాంతాన్ని బాలలకు భౌగోళిక పటం గీసినట్లు తెలిపారు.
మన్య ప్రాంత ప్రజలు “చేతులు రెండు – చక్కన ఉంటే – చల్ల కదలనీ – చల్లని బ్రతుకు – ఎల్లారే ఎల్లల్ల పిల్లా!” అంటూ జానపద రీతులలో ప్రకృతి ఒడిలో స్వేచ్ఛగా ఉన్న జన జీవన రీతికి తంబురను మీటారు.
అల హాయిగా సాగే మన్యంలో జొరబడి క్రూరమైన దమన నీతితో ఆంగ్లేయులు అమాయకులను హింసించారు. వాళ్ళ భూములను ముఠాదార్లకు అప్పగించారు.
ఇక్కడ రచయిత కథకు కొంత విరామాన్ని కల్పిస్తూ కథకుని ద్వారా మన్య ప్రజలను కాపాడదలచిన సీతారామరాజు తలిదండ్రలు, జననము. బాల్యములను గురించి వినరా భారత వీర కుమారా! అని వినిపించారు. ‘ప్రాణాలకు తెగించి పోరాడుట, ప్రాణాలిచ్చి యితరుల్ని రక్షించుట, అతనికి పుట్టుక నుంచి కలిగిన గుణాలు.. అందుకు ఉదాహరణగా బాల్యంలో గోదావరిలో కొట్టుకుపోతున్న మిత్రుణ్ణి తనకు ఈత రాక పోయినా సంకల్ప బలంతో గోదావరిలో దూకి అతన్ని ఒడ్డుకు లాగి రక్షించడా’న్ని విన్నవించారు.
సీతారామరాజు మన్యానికి సింహద్వారం అయిన కృష్ణదేవుపేట నీలకంఠేశ్వరాలయంలో సన్యాసిగా రాజకీయ జీవితాన్ని ఆరంభించడం జరిగింది. అక్కడ రాజుకు చిటెకెల భాస్కర రావు గారు ఆశ్రయం ఇచ్చారు.
ఇక మన్యం కోయలను బాష్టియన్ అనే తహసిల్దారు క్రూరంగా హింసించిన రీతి ఆనాటి దీనావస్థను ధ్వనించింది.
కోయలను కూలెద్దులుగా చేసి, వాళ్ళ శ్రమను దోచుకున్న విధానాన్ని తెలుపుతూ, “భద్రాద్రి రాముడా!బాధలింకెన్నాళ్ళు! ఐలేసా!ఓ ఐలేసా” అంటూ శ్రామిక గీతాలను చేర్చారు. అతని బాధలు తట్టుకోలేక కోయలు ఎదురు తిరిగారు. సీతారామరాజు వారికి అండగా నిలిచాడు. సమీపాన ఉన్న గట్టు పొణకల గ్రామం మునసబు గంటు దొర, అతని తమ్ముడు మల్లుదొరలు కూడా తోడయ్యారు. వారితో బాటుగోవిందు రత్తి దంపతుల పరిచయం కలిగింది. మరికొంతమందితో కలసి సీతారామరాజు సామ్రాజ్యవాద శక్తులను, వారి తాబేదార్లను ఎదుర్కొనడానికి ప్రణాళికను సిద్దం చేసాడు.
ముందుగా సీతా రామరాజు కోయ చెంచులలో ఐకమత్యం కలిగించడానికి కృషి చేసాడు. తాగుడు మానమని ప్రబోధించి, మల్లు దొర వంటి వారిచే కూడా మానిపించాడు.
అంతా ఒక్కటే కులం కర్మజీవులం శ్రమజీవులం అని బోధించాడు. వారిని మట్టి నుండి మహావీరులను కావించాడు. ఇత్తడిని పుత్తడిగా మలచాడు. 24 సంవత్సరాల వయసులో (1921) లోమన్యం తిరుగు బాటు సాయుధ పోరాట లక్ష్యం స్వాతంత్ర్య సాధనగా ఏర్పరచాడు.
సీతారామరాజు గాము కొండ ధార కొండల నడుమ విప్లవ పొరాట యొధులకు గెరిల్లా పద్ధతులను ప్రబోధించాడు. గెరిల్లా పద్ధతులను గురించి
“ప్రక్క పోటు పొడవండి
పక్షి వోలె యెగరండి
చుక్కలు తెగి పడి నట్టులుగా
సూటిగ శత్రువు పై బడుడీ
వెనక నుండి పై బడదాము వేగమె
కను మరుగవుదాము భారతీయ వీరులు అనగా
భయము తోడ పరుగిడవలెరా”
అంటూ కథకుడు పోరాట పటిమకు తగిన అభ్యాస నైపుణ్యాన్ని విశదం చేసాడు.
ఇక తుపాకులు ఫిరంగులు మారణాయుధాలు కలిగిన ఆంగ్లేయులతో రామరాజు
“విల్లమ్ములతో వచ్చి చేరుకొను వేయి కనులతోడా ..
అమ్ముకు కట్టీ మిరపకాయలను
అంపును లేఖల శత్రు శిబిరముల,
ఇన్ని గంటలాకు-ఇన్ని దినములకు
వచ్చెద కాచుకొమ్మనుచు…
అంటూ మిరప కాయ టపాను గూర్చిన విశేషాన్ని తెలిపినప్పుడు ఒక అమ్ముకు మిరపకాయను చీటీని గుచ్చి తాము దాడి చేయ బోయే ప్రదేశానికి దగ్గర చెట్టుకో తలుపుకో ప్రయోగించేవారని బాలలకు విశదం అవుతుంది.
అల్లూరి సీతారామరాజు మెరుపు దాడి చేసిన స్టేషనులను వరుస గా తెలుపుతూ, ఆ దాడులలో పట్టుబడిన ఆయుధాల వివరాలను ఎప్పటికి అప్పుడు రికార్డు పుస్తకాలలో దాఖలా చేసినట్లు, అల్లూరి సీతారామరాజు పోరాట నిబద్ధతను కథకుడు వెల్లడించాడు.
అలాగే లాగరాయి పితూరియోధుడు వీరయ్యను గురించి చెప్తూ. పితూరీలు అంటే ఉద్యమాలు, తిరుగుబాట్లు అనీ. వాటిని వైరులు అణచి వేసానీ తెలిపాడు.
ఇలా కొనసాగి పోతుంటే ఆ వెల్లువ నాపే శక్తి లేదని బాష్టియను బ్రేకను దొరకు వినతి చేసాడు.
ఇక్కడ హాస్యాన్ని జోడించారు రచయిత. బ్రేకను హల్లో హల్లో అని ఆర్తనాదం చేస్తూ మన్యం వీరుని చిత్ర గాథలను మద్రాసు గవర్నరు వెల్లింగ్టన్‌కు ఫోనులో గోడు చెప్పుకున్నాడని అల్లూరి సీతారామరాజు పరాక్రమాన్ని అన్యాపదేశంగా నిరూపించారు.
మన్యం విప్లవాన్ని అణగ ద్రొక్క డానికి జర్ జర్ మనుచు లారీల నిండా కాకినాడ రిజర్వు దళాలు కదిలి వచ్చాయి, జయపురం నుండి ఏనుగులు వచ్చాయి. తిరుగుబాటును అణచి వేయడానికి గవర్నరు ప్రపంచ యుద్ధంలో పేరు పొందిన మేజర్ జనరల్ గుడాల్ ను పంపించాడు. కాని అతని వల్ల కూడా సాధ్యం కాలేదు.
“కుయ్యో మొర్రో అని కూత పెట్టాడు….
గుడాలు వినతికి పై అధికారులు
పంపిరి వేలాది సైనిక భటులను,
గూర్ఖాదళమును గూర్చి పంపిరీ
మలబార్ పోలీసు మందిని దెచ్చిరి మన్యం భూములకూ” …
రామరాజుతో తామిక చాలలేమని స్పెషల్ ట్రయినులో దిగిన అస్సాము, మలబారు, గూర్ఖా దళాలతో మన్యం నిండి పోయింది.
తూర్పు గోదావరి జిల్లా కలెక్టరు బ్రేకను దొరకు బదులు రూథరుఫర్డ్ వచ్చాడు. ఈ రూథర్‌ఫర్డ్ పన్నుల నిరాకరణోద్యమం సాగించిన పల్నాటి వీర హనుమంతుని చంపినవాడు. ప్రపంచ యుద్ధంలో ఎడారి యుద్ధ యోధునిగా పేరు పొందిన కవర్టు హైటరులు కూడా గుడాలుకు సహాయకులుగా వచ్చారు.
వారు ఇక విప్లవ జ్యోతిని మోసంతో ఆర్పివేయడమే శరణ్యం అని తలచారు,
వారి క్రూర నీతి నెరుగక భాస్కర రావు గుడాలుతో సంధి చేసుకోడానికి వెళ్ళమని అల్లూరి సీతారామరాజుకు సలహాను ఇచ్చారు.
అల్లూరి సీతారామరాజు ఆంగ్లేయులకు దొరికి పోవడం, ఆ వీరుని మరణాలను గురించి, వేర్వేరు వివరణలున్నాయని, బుర్రకథా రచయిత తెలిపారు.
కొన్ని గ్రంథాలలో ఆశ్రయాన్నిచ్చిన చిటికెల భాస్కర రావు గారి సలహాను అనుసరించి అల్లూరి సీతారామరాజు ఆంగ్ల సేనాని గుడాలు దగ్గరకు వెళ్ళడం, అతడు మోసంతో అల్లూరిని బంధించి కాల్చివేసినట్లు ఉందని, శ్రీ పడాల వారు రాసిన ‘ఆంధ్రశ్రీ’లో శ్రీ రాజు రక్త సిక్తమైన తన దేహాన్ని యేటిలో కడుగు కొని అర్ఘ్యం ఇస్తున్న సమయంలో అస్సాం సైన్యానికి తెలిసి, శ్రీ రాజును బంధించి చెట్టుకు కట్టి కాల్చారని ఉందని దుర్గా రావు గారు తెలిపారు.
దుర్గా రావు గారు తమ బుర్రకథలో సీతారామరాజు భాస్కర రావు గారి సలహాను విని ఒక్క క్షణం చలించినట్లు, తరువాత చిన్నతనంలో తడ్రి పలికిన మాటలు జ్ఞప్తికి వచ్చి ఆంగ్లేయులతో పోరాడడానికే నిశ్చయించినాట్లు రాసారు. రక్తసిక్తమైన దేహాన్ని నదిలో కడుగు కొని సంధ్యార్కునికి అర్ఘ్యాన్ని ఇస్తున్న సమయంలో అస్సాం సైన్యం చుట్టు ముట్టి, సేనాని గుడాలు దగ్గరకు తీసుకుని పోగా అతడు సీతారామరాజును చెట్టుకు కట్టి కాల్చాడని రాసారు.
అల్లూరి సీతారామ రాజు అనుచరుల పేర్లు, శత్రువులైన దొరలపేర్లు, అధికారుల పేర్లు, ఇలా అందరి పేర్లూ రచయిత పొందుపరిచారు. ఒక ప్రజాయోధుడు, ఒక మహా విప్లవకారుడు మన స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు వెలుగుబాట వేసిన త్యాగధనుని అమరగాథను అతి సరళంగా బుర్రకథగా రచించిన పి. దుర్గా రావు గారు అభినందనీయులు.