ఆచార్యదేవోభవ-28

1
3

[box type=’note’ fontsize=’16’] ఈ శీర్షిక ద్వారా గత 20వ శతాబ్దిలో ఎందరో విశ్వవిద్యాలయ, కళాశాలల తెలుగు అధ్యాపకులను/ఆచార్యులను తీర్చిదిద్దిన ప్రాతఃస్మరణీయ యశఃకాయులను పరిచయం చేస్తున్నారు డా. అనంత పద్మనాభరావు. [/box]

[dropcap]తె[/dropcap]లుగు సాహిత్య రచన పింగళి లక్ష్మీకాంతంగారితో మొదలై కొర్లపాటి శ్రీరామమూర్తి, ఆరుద్ర, ద్వానాశాస్త్రి, వెలమల సిమ్మన్న, యస్.వి.రామారావు ప్రభృతుల పర్యంతం కొనసాగింది.

సాహిత్య చరిత్రకారుడైన నాగయ్య:

మృదుస్వభావి, పరిశోధనా తత్పరుడు అయిన జి. నాగయ్య, పింగళి లక్ష్మీకాంతం పర్యవేక్షణలో ద్విపదవాఙ్మయంపై ప్రామాణిక సిద్ధాంత వ్యాసం ప్రచురించారు. వీరు రచించిన ఆంధ్ర సాహిత్య చరిత్ర పరిశోధనాత్మకం. సాహితీవేత్తలకు కరదీపిక. వీరు 1966లో తెలుగు శాఖలో చేరి రీడర్, ప్రొఫెసర్‌గా వ్యవహరించారు. అనారోగ్యంతో కాలు తీసివేశారు. అయినా పఠనపాఠనాలలో విశ్రమించలేదు. సరళ స్వభావంతో మైత్రి పెంచుకొనేవారు. 1992 మే 7న పరమపదించారు. వీరి పర్యవేక్షణలో 10 పి.హెచ్.డి.లు, 22 ఎం.ఫిల్‌లు వచ్చాయి. 1984-86 మధ్య శాఖాధ్యక్షులు. స్వయంగా ఆరు రచనలు చేశారు. విమర్శకుడిగా పేరు.

చిత్తూరు నాగయ్య సినిమాలలో ఎలా ప్రసిద్ధుడో, ఆంధ్ర సాహిత్య చరిత్రకారులలో గూడూరు నాగయ్య అంతటి పరిశోధకులు. ఆయన కడప జిల్లా తాతిరెడ్డిపల్లిలో 1936, జూలై 30న జన్మించారు. 1959-61 తొలి  బ్యాచ్ ఎం.ఏ. తెలుగు విద్యార్థిగా తిరుపతిలో ఉత్తీర్ణులయ్యారు. రెండేళ్ళు కడప ప్రభుత్వ కళాశాలలో అధ్యాపకులుగా పని చేశారు. ద్విపదవాఙ్మయ పరిశోధనకు పింగళి లక్ష్మీకాంతం పర్యవేక్షకులు (1962-66).

వీరి ఇతర రచనలలో – ‘తెలుగు కావ్యావతారికలు’, ‘ఎర్రన శ్రీనాథుల సూక్తి వైచిత్రి’, ‘తెలుగు సాహిత్య సమీక్ష’ (రెండు భాగాలు) ప్రధానాలు. వీరి సంపాదకత్వంలో – ‘మాండలిక వృత్తి పదకోశం’ (తెలుగు విశ్వవిద్యాలయం), ‘దాక్షిణాత్య జానపద దృశ్య కళారూపాలు’ ప్రసిద్ధము. నాలుగు సంపుటాలుగా ప్రచురించిన ‘దాక్షిణాత్య సాహిత్య సమీక్ష’ పరిశోధకులకు కరదీపిక. వీరి పర్యవేక్షణలో ఆంధ్ర మహాభారతంపై మూడు ప్రధాన పరిశోధనలు వెలువడ్డాయి. 1. ధృతరాష్ట్రుని పాత్ర పరిశీలన (డి.రంగారెడ్డి), 2.భీష్ముని పాత్ర చిత్రణ (పి.లలితావాణి), 3. విద్యావిధానం (ఆర్.మల్లేశుడు).

దాదాపు మూడు దశాబ్దులు విశ్వవిద్యాలయంలో ఎందరో భావిభారత తెలుగు అధ్యాపకులను తీర్చిదిద్దారు. మద్దూరి సుబ్బారెడ్ది, నాగయ్య ద్వయం స్నేహ సౌహార్దాలకు ప్రతీకగా డిపార్టుమెంటులో జి.యన్.రెడ్డి ఛత్రచ్ఛాయలలో మెలిగి తెలుగు శాఖ ప్రతిష్ఠ పెంచారు.

నాగయ్య 1992, మే 7న తుదిశ్వాస విడిచారు. ఈ విశ్వవిద్యాలయం నుండి 1969లో కందుకూరి వీరేశలింగం – సంఘసంస్కర్త అనే అంశంపై అమెరికా విస్కాన్సిన్ విశ్వవిద్యాలయం పరిశోధకుడు జాన్ లియనార్డ్ పి.హెచ్.డి. పొందారు.

అక్కినేని నాగేశ్వరరావు గారితో 1996లో ఆకాశవాణి, విజయవాడ కేంద్రంలో రచయిత

అస్మద్గురు పరంపర:

తిరుపతిలో మాకు రెండేళ్ళు పాఠాలు బోధించిన ఘనాపాఠీలను తలచుకొంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. జి.యన్.రెడ్డి – లింగ్విస్టిక్సు, కోరాడ మహాదేవశాస్త్రి – ఫిలాలజీ, జీరెడ్డి చెన్నారెడ్డి – సాహిత్య విమర్శ, జాస్తి సూర్యనారాయణ – సంస్కృతం, తిమ్మావజ్ఝల కోదండరామయ్య – వ్యాకరణం, పంగనమల బాలకృష్ణమూర్తి – పాణిని. వీరి బోధన మా భాషా సౌధానికి పటిష్ఠ పునాదులు (1965-67) వేసి, శిష్యులం అంతో ఇంతో పేరు తెచ్చుకొన్నాం.

ఆచార్య జీరెడ్ది చెన్నారెడ్డి:

కంచుకంఠంతో నిండైన విగ్రహంతో క్లాసులో ప్రవేశించగానే శిష్యులను ఆకట్టుకునే మూర్తి వారిది. కడపజిల్లా పర్లపాడు గ్రామంలో 1915, ఫిబ్రవరి 26న చెన్నారెడ్డి ఓ రైతు కుటుంబంలో జన్మించారు.  విద్వాన్ చదివారు. ఆ తర్వాత ఎం.ఏ., బి.ఇడి. చేశారు. తిరుపతి ప్రాచ్య కళాశాలలో అధ్యాపకులుగా చేరారు. తర్వాత వెంకటేశ్వర విశ్వవిద్యాలయ తెలుగుశాఖలో రీడర్‌గా పనిచేసి, ఆ తర్వాత శ్రీ వేంకటేశ్వర ఓరియంటల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‍ డైరక్టర్‌గా (1969-76) వ్యవహరించారు. మైసూరు విశ్వవిద్యాలయంలో ఆచార్య కె. సుబ్బరామప్ప వద్ద పరిశోధన చేసి పి.హెచ్.డి. సంపాదించారు. వీరి రచనలలో –  భాస నాటకాలపై గ్రంథం, శివకవుల సాహిత్యం ప్రధానం. ఇతర రచనలు – మకుట భంగము (1947) – నవల, దక్షిణ తార (1950) – నవల, ప్రెసిడెంటు (నాటకం) -1954 ప్రముఖం. మహాభారత విరాట పర్వానికి పరిష్కర్తగా (1971) వ్యవహరించారు.

చెన్నారెడ్డి మేనమామ చెమికల చెన్నారెడ్డి మంచి పద్య కవి. వారి ప్రభావం మేనల్లునిపై పడింది. మేనమామ తెలంగాణలోని వనపర్తి సంస్థానాధీశుల మెప్పు పొందారు. జీరెడ్డి పర్యవేక్షణలో తాళ్ళపాక చిన్నన్న రచనలపై కడప రమణయ్య (ద్రవిడ విశ్వవిద్యాలయ ఉపకులపతి), వెంగమాంబ రచనలపై కె.జె. కృష్ణమూర్తి; సీతారామాంజనేయ సంవాదంపై రత్నాకర  బాలరాజు పరిశోధనలు చేశారు.

చెన్నారెడ్ది జమ్మలమడుగు మిడిల్ స్కూల్‍లో చేరడానికి వెళ్ళి అక్కడి హెడ్ మాస్టర్‍పై సీసపద్యం వ్రాసి ప్రతి పాదం మొదట్లో ఆయన పేరు వచ్చేలా చదివారు. వెంటనే సీటు దొరికింది. 1931లో తమ తెలుగు పండితులు చెట్లూరు శ్రీనివాసాచార్యులతో కలిసి వెళ్ళి చెన్నారెడ్డి గద్వాల, వనపర్తి సంస్థానాలలో నూతన కవి సంభావనలందుకొన్నారు.

మదనపల్లి దివ్యజ్ఞాన కళాశాలలో 1937లో ఇంటర్మీడియట్ పాసయ్యారు. అనంతపురం ప్రభుత్వ కళాశాలలో 1937లో డిగ్రీలో చేరారు. చిలుకూరి నారాయణరావు అభిమానం సంపాదించగలిగారు. 1938 మార్చిలో విద్వాన్ పరీక్షలు ఎనిమిదింటిని ఒకేసారి వ్రాసి తక్కువ వయస్సులో పాసయ్యారు. 1940లో హిందీ సాహిత్య విశారద ప్రైవేటుగా పాసయ్యారు.

1941 జూలైలో తిరుపతి దేవస్థానం హైస్కూలులో తెలుగు పండిట్‍గా చేరారు. 1942లో కమలమ్మతో వివాహం జరిగింది. 1944లో రాజమండ్రి ట్రెయినింగ్ కళాశాల నుండి బి.ఇడి పొందారు. 1945 మార్చిలో మద్రాసు విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. తెలుగు పూర్తి చేశారు. తిరుపతి దేవస్థానం వారి డిగ్రీ కళాశాల తెలుగు శాఖాధ్యాక్షులయ్యారు. 1955లో దేవస్థానం వారి ఓరియంటల్ కళాశాల ప్రిన్సిపాల్‌గా, ప్రాచ్యభాషా పరిశోధనశాల డైరక్టర్‌గా నియమితులయ్యారు.

రైతుబిడ్డకు సంస్కృతం రాదని ఒకరు దేవస్థానం కమిటీకి ఉత్తరం వ్రాశారు. అప్పటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి, విద్యామంత్రి అయిన బెజవాడ గోపాలరెడ్డి విచారణ జరిపి నిందారోపణను కొట్టివేయించారు. మైసూరు విశ్వవిద్యాలయం నుండి ‘తెలుగు సాహిత్యముపై వీరశైవ మతప్రభావము’ అనే అంశంపై 1965లో హి.హెచ్.డి. పొందారు. 1956లో వీరి సర్వీసు వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి బదిలీ అయింది. 1968లో ఆచార్య పదవిలో చెన్నారెడ్డి ఓరియంటల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‍ డైరక్టర్‌ అయినారు. ఎందరికో ఆయన గాడ్ ఫాదర్. తన సిద్ధాంత గ్రంథాన్ని 1996లో బెజవాడ గోపాలరెడ్ది కంకితం చేశారు.

చెన్నరెడ్డి గురువు చాగలమర్రి కొండారెడ్డి. ఆయన ఇలా అన్నారు – “నా దగ్గర ఏ, బీ, సీ, డీలు నేర్చుకొన్న శిష్యులలో ఒకరు (వై. ఈశ్వరరెడ్డి) ఢిల్లీ పార్లమెంటులో దేదీప్యమానంగా వెలిగిపోతున్నారు. చెన్నారెడ్డి తిరుపతి విశ్వవిద్యాలయంలో దరి చేరిన వారందరికి కొంగు బంగారమై, దైవ సమానులై, ధ్రువతార వలె ప్రకాశిస్తున్నారు. అంటే నేను ఈ గ్రామంలో దిద్దించిన ఓనమాలలో ఒక ‘ఓ’ ఢిల్లీ వెళ్ళింది. ఇంకొక ‘ఓ’ తిరుపతి వెళ్ళిందన్న మాట”.

(‘తెలుగు సాహిత్యముపై వీరశైవ మతప్రభావము’ అనే గ్రంథంలో చెన్నారెడ్డి శిష్యులు ఆచార్య తంగిరాల వెంకట సుబ్బారావు వ్యాసం ఆధారంగా వివరాల సేకరణ).

డా. బెజవాడ గోపాలరెడ్డి గారితో 1978లో రచయిత

పంగనమల బాలకృష్ణమూర్తి:

సంస్కృతాంధ్రాలలో నిష్ణాతులైన పండితులు. ఓరియంటల్ కళాశలలో పదవీ విరమణానంతరం కొంత కాలం విశ్వవిద్యాలయ తెలుగు శాఖలో 1965-68 మధ్య పాఠాలు చెప్పారు. ప్రాచీన సంప్రదాయ ధోరణిలో కొనసాగేది వారి బోధన. బ్రతుకుతెరువు కోసం ఆయన వాకాడు ఓరియంటల్ కళాశాల ప్రిన్సిపాల్‍గా కొంతకాలం పనిచేశారు.

ఏవం విధ గురుపరంపరలో కొనసాగిన మా తెలుగు అధ్యయనం పలువురు కవి పండితులను తీర్చిదిద్దింది. ఈ గురుపరంపరలో ఆచార్య కోరాడ మహాదేవశాస్త్రి గురించి శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ సందర్భంగా ప్రస్తావిస్తాను. అనంతపురం పి.జి. సెంటరుకు వారే స్పెషల్ ఆఫీసరు (1968).

వ్యాకరాణాన్ని ఔపోసన పట్టిన అగస్త్యుడు:

వ్యాకరణాన్ని బోధించడంలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో దువ్వూరి వెంకటరమణ శాస్త్రి జగత్ ప్రసిద్ధులు. అలానే తిమ్మావజ్ఝల కోదండరామయ్య వ్యాకరణ శాస్త్ర బోధనలో ఘనాపాఠీ అనడానికి నేనే ప్రత్యక్షసాక్షి. 1965-67లో వారి వద్ద ఎం.ఏ. తెలుగులో వ్యాకరణ పాఠాలు నేర్చుకొన్నాను. తత్రాపి ‘బాలప్రౌఢ సాధింపని ప్రయోగ విశేషములు’ అనే పేరుతో భారతి లోనూ, సాహితి మాస పత్రికలోను రెండు పరిశోధనాత్మక వ్యాసాలు ప్రచురించాను.

కోడండరామయ్య ప్రస్థానం:

1925 ఫిబ్రవరి 2న నెల్లూరు జిల్లాలో జన్మించారు. విద్యాభ్యాసం 1931-41 మధ్య తిరుపతి దేవస్థానం పాఠశాలలో పూర్తిచేశారు. 1941-46 మధ్య ఓరియంటల్ కళాశాలలో తెలుగు విద్వాన్‍లో స్వర్ణ పతక గ్రహీత. ఆయనకు యస్.యస్.యల్.సి., విద్వాన్, బిఓయల్, యం.ఏ.లలో అన్నీ స్వర్ణ పతకాలే. 1950లో మదరాసులో త్యాగరాయ కళాశాలలో తెలుగు ఉపన్యాసకుడిగా చేరి 1956లో శాఖాధిపతి అయ్యారు.

1961లో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తెలుగు అధ్యాపకులుగా ప్రవేశించారు. ‘దేశి కవిత్వోద్యమము – పాల్కురికి సోమన పాత్ర’ అనే అంశంపై పరిశోధన చేసి 1968లో పి.హెచ్.డి. సంపాదించారు.

మధురాధిపతి:

తమిళనాడులోని మదురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ ప్రవేశపెట్టడంతో 1972లో ఆచార్యులుగా, శాఖాధిపతిగా కోదండరామయ్య చేరారు. ఎందరో ఎం.ఏ. విద్యార్థులని తీర్చిదిద్దారు. పాఠం చెప్పడంలో విలక్షణత, విశ్లేషణాత్మక ధోరణి గొప్పవి.

విషాదాంతం:

1981 మే నెల మండుటెండలు. మదురై నుండి తిరుపతికి వేసవి సెలవకలు వచ్చారు. రామకుప్పంలో బంధువుల ఇంటికి బస్సులో ప్రయాణించారు. మండుటెండలో రెండు, మూడు మైళ్ళు నడవవలసి వచ్చింది. ఒంటరి ప్రయాణం. రహదారి సరిలేదు. ప్రయాణ సౌకర్యాలు లేవు. భోజనం వేళకు ఇంటికి చేరవచ్చునని చేతి సంచితో బయలుదేరారు. అది మే 26. వడగాడ్పుకు కోదండరామయ్య స్పృహ తప్పి పడిపోయారు. ఆయన వయస్సు 56 సంవత్సరాలే. అకాలమరణం ఆయనను బలిగొంది.

ఆయన రచనలు:

ఆకాశవాణిలోను, పత్రికలలోనూ 300 పైగా రచనలు. ఏడు పరిష్కృత గ్రంథాలు, ఎనిమిది అనువాద గ్రంథాలు, నాలుగు పరిశోధన గ్రంథాలు, రెండు స్వతంత్ర నాటకాలు, ఉదాహరణ కావ్యం ప్రముఖాలు.

పరిశోధన పత్రికకు తిరుమల రామచంద్రతో కలిసి సంపాదకత్వం వహించారు. ఎన్నో గ్రంథాలకు పీఠికలు వ్రాసిన దేశికోత్తము డాయన. నమోస్తు గురుదేవా!

అప్పటి భారత రాష్ట్రపతి శ్రీ జ్ఞానీ జైల్‌సింగ్‌లో 1984లో రచయిత

భాషాశాస్త్ర నరసింహుడు:

శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ లింగ్విస్టిక్స్ శాఖలో పనిచేసిన పెంచుకల చిన నరసింహారెడ్డి మహబూబ్‍నగర్ జిల్లా గద్వాల తాలుకా గట్టు మండలంలోని పెంచుకలపాడు గ్రామంలో జన్మించారు.

ఆ ఊళ్లో రెండు పెద్ద బండరాళ్లు పెనవేసుకున్నట్టు ఉంటాయి కాబట్టి ఆ గ్రామాన్ని ‘పెంచుకలపాడు’గా వ్యవహరిస్తారు. నరసింహారెడ్డి తండ్రి బసిరెడ్డి పోలీసు పటేల్‌. నరసింహారెడ్డి గద్వాలలో ప్రాథమిక విద్య చదివారు. మాజీ రాష్ట్ర మంత్రి డి.కె.సమరసింహారెడ్డి ఈయనకు సహధ్యాయి. ఉస్మానియాలో లింగ్విస్టిక్స్ ఎం.ఏ.చేశారు. పోరంకి దక్షిణామూర్తి, ఓలేటి సుబ్బారావుగార్లు తోటి విద్యార్థులు.

చిన్నతనం నుండి బొమ్మలు గీయడం అలవాటు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో లెక్చరరుగా చేరి క్రమంగా, రీడరు, ప్రొఫెసరు, డీన్ అయి  రిటైరయ్యారు. ‘బంగోరె’ బ్రౌన్‌ పై చేసిన ప్రాజెక్టులకు బొమ్మలు గీశారు. చలసాని ప్రసాదరావు ఈయనతో ‘హిందూ కళ- వికాసం’ అనే వ్యాసం  రాయించారు.

తెలుగు అకాడమీలో జిల్లావారీ మాండలిక పద సంకలనాల కోసం రెడ్డి అవిరళ కృషి చేశారు. రిటైరయిన తర్వాత యుజిసి ప్రణాళికలో ‘ద్విభాషా వ్యవహారం – భాషా సామాజిక పరిశీలన’ పై పరిశోధించారు.

చిత్తూరు జిల్లా నగరి ప్రాంతం తెలుగు, తమిళం భాషల ప్రభావం కలిగి ఉంటుంది. అక్కడి దళితులు కేవలం తమిళంలోనే మాట్లాడాలనే నియమం. ఒక రెడ్డి కులస్థుడి ముందు ఒక దళితుడు తెలుగులో మాట్లాడటం నేరంగా భావించి చెట్టుకు కట్టేసి కొరడా దెబ్బల శిక్ష విధించారని రెడ్డి పేర్కొన్నారు. అలానే మిగతా రాష్ట్ర సరిహద్దుల్లో తెలుగు – ఒరియా, తెలుగు – మరాఠి, తెలుగు – కన్నడ భాషలపై పరిశోధించారు. దాదాపు అరవై వేల వాడుక పదాల్ని సేకరించగలిగారు. పదవీ విరమణానంతరం హైదరాబాదులో స్థిరపడి 2000 చివరిభాగంలో మృతి చెందారు.

మరికొందరి జీవనరేఖలు:

తిరుపతిలో పనిచేసిన సజీవ స్వరాల విశేషాలు స్థలాభావం వల్ల ప్రసక్తం చేయడం లేదు. తుమ్మపూడి కోటీశ్వరరావు శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయంలో చాలా కాలం పనిచేశారు. వారి వివరాలు అక్కడ ముచ్చటిస్తాను.

తమ్మారెడ్డి నిర్మల అధికభాగం నాగార్జున విశ్వవిద్యాలయంలో పనిచేశారు. వారి వివరాలు అక్కడ. తిరుపతి అనగానే నాకు జ్ఞాపకాల దొంతరలు ముసురుకొని తబ్బిబ్బు చేస్తాయి. ఎప్పటి మాట 1965. గడిచిపోయిన 56 సంవత్సరాలలో వందలసార్లు తెలుగు శాఖలోకి తొంగి చూశాను. అధ్యాపకుల ముందు అష్టావధానం చేశాను. ద్వారం ముందు బోర్డులో స్వర్ణ పతక విజేతలలో 1967లో, పిహెచ్.డి.ల లిస్టులో 1977లో నా పేరు చూసుకుని మురిసిపోవడం మరో ఎత్తు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here