[box type=’note’ fontsize=’16’] ఈ శీర్షికలో రచయితలు తమ రచనల వివరాలు, తామెందుకు రచనలు చేస్తున్నారు, తమ లక్ష్యం ఏమిటి వంటి విషయాలను వివరిస్తూ తమని తాము పరిచయం చేసుకుంటారు. [/box]
చాందినీ బల్లా
[dropcap]మ[/dropcap]న సమాజం ఎంత నాగరికత పులుముకున్నా, అభివృద్ధి చెందినా కొన్ని అంశాల్లో ఇంకా వెనుక పడే ఉంది. మనలో చాలా మంది ఇంకా రుతుస్రావం, చనుబాలు వంటి విషయాల్ని నిషిద్ధ అంశాలుగా భావించి మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. అటువంటి విషయాలపై అవగాహన పెంచి, వివక్షతను రూపు మాపే విధంగా నాకున్న ఉద్దేశాలను కథా రూపంలో, కవిత రూపంలో రాస్తూ ఉంటాను. మనం రాసే వాటి వల్ల ఒక్కరైనా సంభాషణ మొదలు పెడితే మన అక్షరానికి అవార్డు దక్కినట్టే అని భావిస్తాను, ఎందుకంటే మార్పు ఎప్పుడూ సంభాషణలతోనే మొదలు అవుతుందని నా ఉద్దేశం.
మామ్స్‌ప్రెస్సో అనే ఆప్ ద్వారా రాయడం మొదలు పెట్టాను, ఆ తరువాత స్టోరీ మిర్రర్, గో తెలుగు.కాం, లోగిలి వంటి వాటిలో నేను రాసిన కథలు ప్రచురితం అవడమే కాకుండా మంచి స్పందన లభించింది, తెలుగు ఇజం, తెలుగు సాహితీ వనం ముఖ పుస్తక సముహం వారు నిర్వహించిన కవితల పోటీలలో బహుమతులు అందుకున్నాను. మన యువ రచయితలకు స్ఫూర్తినిచ్చే తపన – రచయితల కర్మాగారం వారు నిర్వహించిన పోటీలలో కూడా బహుమతులు అందుకుని నెచ్చెలి, తపస్వి మనోహరం వెబ్ మాగజైన్లలో ప్రచురణకి అర్హత పొందాను.
నా కథలు అన్నింటిలో నాకు బాగా నచ్చినది, ‘చనుబాలు’. పలువురిలో పాలివ్వడానికి ఒక తల్లి పడే ఇబ్బంది గురించి అనుభవపూర్వకంగా రాసిన కథ.
సమాజంలో మార్పు తెచ్చే శక్తి సాహిత్యానికి ఉందని బలంగా నమ్ముతాను, ఈ కాలపు రచయితలను చూస్తే సాహిత్యం మూస పద్ధతి కాకుండా కొత్త పుంతలు తొక్కుతోంది అని అనిపిస్తుంది, అది నా వంటి వారిలో మరింత ఉత్సాహం నింపుతుంది. నిజానికి నాకు సాహిత్యం గురించి పెద్దగా అవగాహన లేదు, ఇప్పుడిప్పుడే తొలి అడుగులు వేస్తూ నేర్చుకుంటూ ఉన్నాను, దానికి ఎంతో మంది యువ రచయితల సహకారం ఉంది. వారందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు.
చాందినీ బల్లా.. ఆస్ట్రేలియా
chandinhyballa@gmail.com