[dropcap]బా[/dropcap]ల అందమైన ఏడేళ్ళ పాప. అందమైనదే కాదు, తెలివైనది కూడా. వయస్సు రీత్యా కొంత అమాయకత్వమూ ఉంది. అన్నీ తనకు తెలుసుననుకుంటుంది. అంతే కాదు, అన్నిటి లోనూ తల దూర్చి అందరికీ సలహాలు కూడా ఇస్తుంది. ఆ బాల చేసిన పనుల్లో కొన్ని కథల్లాగా చెప్పచ్చు. అందులో ఇది ఒకటి.
బాల సందేహం
ఒకరోజు బాల అన్నయ్య బబ్లూ బాలకి రహస్యముగా చెప్పాడు “సాయంత్రం హోటల్లో పార్టీ ఇస్తాను” అని.
“డబ్బులో” అడిగింది బాల కూడా రహస్యముగా.
“ఉన్నాయిలే” అన్నాడు దర్పముగా.
ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఏమైనా కొనుక్కోమని ఇచ్చిన డబ్బులు తనలాగే దాచుకున్నాడేమో, తనకి ప్రేమగా ఇప్పిస్తున్నడేమో అని ఆనందపడింది.
బాల భావాలు కనిపెడుతూనే ఉన్నాడు బబ్లూ. పాపం పిచ్చిది. ప్రేమ అనుకుంటోంది. కానీ ఇలా కట్టి పడేస్తే తనమీద అస్తమాను నాన్నమ్మకి చాడీలు చెప్పదని, ఇంకా తన గొప్పదనం చూపించుకోవచ్చని తన ఉద్దేశం అని తెలియదు అనుకున్నాడు.
సాయంత్రం ఎప్పుడవుతుందా అని ఇద్దరూ ఎదురు చూశారు.
స్కూల్ అయిపోయాక ఇద్దరూ తాము ఇంటికి వచ్చే దారిలో ఉన్న హోటల్‌కి వెళ్ళారు.
బబ్లూ అంతే ఉన్న బాయ్ వచ్చాడు. బబ్లూని చూసి నవ్వాడు. “ఏమి కావాలి” అని అడిగాడు.
బాల అన్న వంక చూసింది. అన్న దగ్గర ఎన్ని డబ్బులున్నాయి తెలియదు కదా!
“ఫరవాలేదు. నీకు కావలసినవి అడుగు” అన్నాడు ఉత్సాహపరుస్తూ.
“ఐస్ క్రీం” అంది సందేహముగా.
“సరే. నీకిష్టం కదా, దోశ కూడా తిను” అని ఆ పిల్లవాడి వంక చూసి “రెండు దోశ, రెండు ఐస్ క్రీమ్” అన్నాడు. సరే అని అతను వెళ్ళిపోయాడు.
***
“చొక్కా ఏదిరా” గద్దించాడు నాన్న. బబ్లూ మాట్లాడలేదు. ఏడుపు మొదలెట్టాడు. అన్నని చూసి బాల కూడా ఏడుపు అందుకొంది.
“చెప్పూ మాట్లాడవేం” మళ్ళీ గడించాడు ఈసారి ఇంకా గట్టిగా.
“డబ్బులు ఇవ్వలేదని హోటల్ అంకుల్ తీసేసుకున్నాడు.” అంది బాల రాగం పెడుతూనే.
“హోటల్ ఏమిటి? ఎందుకెళ్లారు? ఎవరితో వెళ్ళారు?” ఇంకా కోపముగా అడిగాడు నాన్న.
తల్లి తండ్రిని వారించి, కొంచెం బుజ్జగింపుగా “నాన్న అడుగుతున్నారుగా.. చెప్పు మరి” అంది.
బెక్కుతూ, నట్టుతూ చెప్పాడు బబ్లూ. బబ్లూ స్నేహితుడు రాము, క్లాస్‌మేట్ ఆ హోటల్‌లో సర్వర్‌గా చేరాడుట. ఏది తిన్నా ఇడ్లీకే బిల్ ఇస్తాడుట. ఎప్పుడయినా రావచ్చు అని చెప్పాడుట. అందుకే వెళ్ళారట.
తీరా బిల్లు ఇచ్చేటప్పుడు మేనేజేర్ ఏమి తిన్నారని అడిగితే ఇడ్లీ తిన్నామని ఎప్పటిలానే బబ్లూ చెప్పాడుట.. ఇంతలో బాల “అన్నయ్యా మనం తిన్నది ఇసుక్రీం, దోశ కదా” అందిట.
దాంతో మేనేజర్ రాముని పిలిచి గద్దించి విషయం రాబట్టాడట.
డబ్బులు లేన౦దున బబ్లూ చొక్కా విప్పించి, రాముని వాళ్ళ నాన్నని తీసుకు రమ్మని చెప్పాడట.
నాన్న బబ్లూని రెండు బాది, బుద్ధి చెప్పమని తల్లికి చెప్పి, బబ్లూ చొక్కా విడిపించి, రాముని కూడా క్షమించమని చెప్పటానికి హోటల్‌కి వెళ్ళాడు.
అమ్మ ఏడుస్తున్న బబ్లూ దగ్గరకు వెళ్ళింది.
“మీ ఇద్దరూ చేసింది తప్పు కాదా మరి. పని ఇచ్చిన యజమానిని మోసం చెయ్యచ్చా? అయినా రామూ ఎందుకలా చెప్పాడు? నీకేనా, స్కూల్‌లో అందరికి చెప్పాడా?” అడిగింది.
“నా ఒక్కడికే” అన్నాడు.
“ఎందుకని నీకే చెప్పాడు?”
“నేను చదువుకునేటప్పుడు అర్థం కానివి అడిగితే చెప్పేవాడిని. ఇంకా ఎప్పుడైనా స్కూలికి రాకపోతే నోట్స్ ఇచ్చేవాడిని. అందుకని నేనంటే ఇష్టమని అన్నాడు. అంతా దీని వల్లే” అన్నాడు కోపముగా బాల వంక చూస్తూ.
తల్లి తప్పుచేయటం వల్ల వచ్చే కష్టాలు నష్టాలు, అవమానాలు చెప్పి, అల్లాంటి పనులు ఎప్పుడూ చేయకూడదని మందలించింది.
“అసలు దీన్నేందుకు తీసుకెళ్ళావురా” అని పిన్ని బాబాయి నవ్వితే,
“అన్నింటిలోనూ దూరిపోతుంది” అని నాన్నమ్మ తిట్టింది.
“దీని మూలముగా పాపం వాడికి దెబ్బలు” అంది అత్త.
చివరికి బబ్లూ ఏడుపు మానాడు.
ఇంతకీ ఏమి తిన్నది అన్న మర్చిపోయాడేమో అని తను గుర్తు చేసి, నిజం చెబిత అందరికి ఎందుకు కోపం వఛ్చి౦దో బాలకి అర్థం కాలేదు.