[dropcap]వి[/dropcap]శాఖపట్నం. సీతమ్మధార. ఒక సందు చివర లోని ఒక మూడు వాటాల ఇంట్లో, ఒక వాటా. ఆ వాటాలో కాపురముంటున్న భార్యాభర్తలూ, ఒక కుమార రత్నం.
పక్క సందు చివర నించి, కోడి కూత వినపడి, పొద్దున్నే నిద్ర లేచింది కనకం.
“అప్పుడే తెల్లారిందా?” అంది బద్దకంగా కదులుతూ కనకం.
“ఆ కోడికీ, నాకూ వేరే పని లేదు. కాస్సేపు పడుకో!” అన్నాడు కామేశం, దుప్పటి ముసుగు లోంచే.
నిజానికి, ఎప్పుడో ఏ పిల్లికో, ఏ కుక్కకో భయపడి తప్ప, ఆ కోడి ఠంచనుగా ఆరింటికే కూస్తుంది ఎప్పుడూ. ఆ సంగతి, ఆ దంపతులకీ తెలుసు. ఆ కోడికీ తెలుసు. అయినా సరే, ఆ అనాథ కోడిని విసుక్కోవడం, ఆ దంపతులకి సరదా.
“ఇంకా పడుకుంటే, మీకు వేళకి ఉపాహారం, కాఫీ ఎక్కణ్ణించి వస్తాయంటా?” అంది మంచం దిగి, దుప్పటి మడత పెడుతూ.
“కనకం, కనకం” అన్నాడు కామేశం నసుగుతూ.
“ఏమిటీ ఆ నసుగుడు? ఏదో కొత్త వంట గుర్తొచ్చిందా?” అంది నవ్వుతూ కనకం.
“అది కాదు, కనకం! మీ పుట్టింట్లో ఆవ పెట్టి, పనస పొట్టు కూరా, కందా-బచ్చలి కూరా చేసేవారా? తిరగలి మీద కంది పొడి విసిరేవారా?” అని ఆరాగా అడిగాడు కామేశం.
“అబ్బా! మీ కెప్పుడూ తిండి రంధీ, తిండి యావానూ” అని సుతారంగా విసుక్కుంది కనకం.
“అవేమీ లేకపోవడానికి, నేనేమన్నా స్థితప్రజ్ఞుడినా? కడుపులో జఠరాగ్ని వున్నంత కాలం, సుష్టుగా ఆరగించాల్సిందే! అది సరే గానీ, నేనడిగిన దానికి జవాబు చెప్పు” అని అడిగాడు కామేశం.
“ఏమో! నాకేవీ గుర్తు లేవు. ఎప్పుడూ అంతగా పట్టించుకోలేదు. మా ఇంట్లో ఇలాంటి వంటలు అరుదే. మా నాన్న కెప్పుడూ ఉద్యోగం. మా అమ్మకి సంగీతం. మాకు చదువులు. ఇలాంటి అనుభవాలు తక్కువే నాకు మరి. మా అమ్మ ఎప్పుడు చేసేదో, ఎలా చేసేదో, ఏం చేసేదో కూడా సరిగా తెలియదు. మా అమ్మ ఏం వొండితే, అదే తినేసే వాళ్ళం.”
“అలాగా! మా చిన్నతనంలో, మా నాన్న చక్కటి మిస మిసలాడే పచ్చటి పనస కాయ తెచ్చేవాడు. తనతో పాటు, పనస పొట్టు కొట్టే అబ్బాయిని తన వెంట తీసుకు వచ్చేవాడు బజారు నుంచి. ఆ అబ్బాయి దగ్గిర, ఎంత పెద్ద కత్తి వుండేదో! పిల్లలందరం, ఆ అబ్బాయి చుట్టూ మూగే వాళ్ళం ఆసక్తిగా. మా ఇంటి వరండాలో, ఒక గోనె సంచి పరచి, దాని మీద ఒక చెక్క బల్ల పెట్టి, దాని మీద పనస పొట్టు కొట్టేవాడు. ముక్కలు ఎగిరి చుట్టూ పడితే, పిల్లలం గోల చేసుకుంటూ పరిగెత్తుకెళ్ళి, తెచ్చి ఇచ్చే వాళ్ళం. మా అమ్మ, చక్కగా ఆవ పెట్టి కూర చేసేది. ఏంత బాగుండేదో! మా అమ్మ, కంది పచ్చడి ఎంత బాగా రుబ్బేదో!” అన్నాడు కామేశం మైమరపుగా.
భర్త మైమరుపు చూసి, బార్యకు చాలా ముచ్చటేసింది.
“ఎంతైనా మీ తూర్పు వాళ్ళకి రుచులు ఎక్కువ లెండి” అంది ముచ్చటగా మూతి తిప్పుతూ, ఆ పడమటి వాస్తవ్యురాలు కనకం.
“మన పెరట్లో అన్ని వాటాలకీ ఉమ్మడిగా, ఒక రుబ్బు రోలు వుందిగా? ఒకసారి కంది పచ్చడి రుబ్బకూడదూ? నువ్వు చేస్తే చాలా బాగుంటుంది, కనకం!” అన్నాడు కనకాన్ని కాస్త కాకా పడుతూ కామేశం.
ఎప్పుడూ బుట్టలో వేయడానికి ప్రయత్నిస్తూనే వుంటాడు కామేశం. తెలిసి కూడా, ఎప్పుడూ ఆ బుట్ట లోనే, ఇష్టంగా పడుతూ వుంటుంది ఆ కనకం.
“పెళ్ళైన కొత్తలో చక్కగా హిడింబిలా వుండేదాన్ని. మీకు పచ్చళ్ళు రుబ్బీ, రుబ్బీ, సుభద్రలా తయారయ్యాను. మీరు, మొదట్లో చక్కగా అర్జునుడి లాగా వుండేవారు. ఆ పచ్చళ్ళు తినీ తినీ, భీముడి లాగా తయారయ్యారు. మన కెప్పుడూ వరసా కలవడం లేదు! పొత్తు అంతకన్నా కుదరడం లేదు” అంది కనకం గాఢంగా నిట్టూరుస్తూ.
తన చిరు పొట్టని సుతారంగా నిమురుకుంటూ, “అది కాదు కనకం! మరేం, మరేం, తిరగలి మీద మా బామ్మ లాగా, కంది పొడి విసర కూడదూ? తిని ఎన్నాళ్ళయిందో!!” అన్నాడు లొట్టలేసుకుంటూ కామేశం.
“అమ్మో, నా వల్ల కాదు సుమీ! మీ పుట్టింటి వాళ్ళిచ్చిన తిరగలి, ఆ పక్క మేడ వాటా వారి మెట్ల కింద పడి, మూలుగుతోంది. మీరే విసురుకోండి” అంది ఖరాఖండిగా కనకం.
“ఇదిగో, నన్నేమన్నా అను. పడతాను. కానీ, మా పుట్టింటి వారినీ, మా ఊరినీ ఏమీ అనమాకు. వారేమన్నా నీ జోలి కొచ్చారా, శొంఠి కొచ్చారా?” అన్నాడు కామేశం మూతి ముడుచుకుంటూ.
కామేశం బుంగ మూతి చూసి, రాబోయే నవ్వును బలవంతంగా ఆపుకుంది కనకం.
“మీ పుట్టింటి వారిని నేనెక్కడ అన్నానూ? నేనేమన్నా అంటే, నాకు పుట్ట గతులుంటాయా? ఇంతకీ, ఒడికట్టు బియ్యం చాల లేదని, పెళ్లిలో సణిగింది మీ మేనత్త గారి తోటికోడలేనటగా? కాకి చెప్పింది లెండి!” అంది కనకం సాగదీస్తూ.
“మా మేనత్త గారి తోటికోడలా? ఎవరబ్బా? ఓ, ఆవిడా!! అందరూ, ఆవిడ మా గొప్ప ఇల్లాలని అనేవారు.”
“అబ్బ! ఆవిడ సంగతి చెప్పకండి. నాకు ఒళ్ళు మండుతుంది. ‘ముసుగేసుకుని, తీసేసుకుని, పసుపు రాసుకునే’ రకం. ఆవిడ, ఎప్పుడూ చీకటి మడి మాత్రమే కట్టుకుంటుందని అనుకునేవారు. ఇదీ, కాకే చెప్పింది లెండి.”
“ఎప్పుడో పన్నెండేళ్ల కిందటి విషయాలు! ఇప్పుడెందుకు లెద్దూ? ఆ సంగతులన్నీ కాకులకే వదిలేసి, నా కంది పొడి సంగతి మాట్లాడుదూ, నీకు పుణ్యం వుంటుంది” అన్నాడు కామేశం బతిమాలుతూ.
“ఏముంది మాట్లాడ్డానికి? నాకు కంది పొడి విసిరే ఓపిక లేదు బాబూ! ఆ పనేదో మీరే చూసుకోండి. ఎప్పుడన్నా కంది పచ్చడి రుబ్బి పెడతా పోనీ” అంది రాజీకొస్తూ కనకం.
“మరేం కనకం! కొత్తగా గంట్లు పెట్టిన తిరగలి మీద, మా బామ్మ కంది పొడి విసిరేది. చాలా కమ్మగా, రుచిగా వుండేది” అన్నాడు కామేశం, పాత రుచులు గుర్తు నెమరు వేసుకుంటూ.
“గంట్లా? గంట్లు అంటే ఏమిటండీ?” అని అమాయకంగా అడిగింది కనకం.
“అలా అడుగు, చెబుతాను” అంటూ దుప్పటి పక్కన పడేసి, బాసింపట్టు వేసుకుని కూర్చున్నాడు కామేశం.
కనకం కూడా, మంచి శిష్యురాలి లాగా, భర్త అనే గురువు చెప్పబోయే పాఠం కోసం మంచం మీద కూర్చుంది.
గొంతు సర్దుకుని, కామేశం, “చిన్న కథ చెబుతాను విను” అంటూ మొదలు పెట్టాడు.
* * *
అప్పుడు నాకు పదేళ్ళు.
“ఒరేయ్ కాముడూ!” అని పిలిచింది మా బామ్మ.
“ఎందుకే బామ్మా?” అనడిగాను హిందీ చూచివ్రాత రాసుకుంటున్న నేను.
“కాస్త బజార్లోకి వెళ్ళి, తిరగలికీ, రోలుకీ గంట్లు వేసే అబ్బాయిని పిలుచుకు రారా, నాయనా! ఆ తిరగలి మీద విసరలేకా, ఆ రుబ్బు రోట్లో రుబ్బలేకా, నా జబ్బలు పడి పోతున్నాయి. మీ అమ్మకి కూడా చాలా కష్టంగా వుంది” అంది మా బామ్మ.
“అబ్బ! నువ్వుండవే! రాసుకుంటున్నాను. ఇంకా, నేను బడి పుస్తకాలకి అట్టలేసుకోవాలి. నేనెళ్ళలేను బాబూ” అన్నాను మొండికేస్తూ.
“బాబ్బాబు! అలా అనకురా! బంగారు కొండ కదూ! నీకు చక్కటి మినప సున్ని విసిరి పెడతాగా?” అంది మా బామ్మ వదలకుండా, ఆశ పెడుతూ.
మినప సున్ని అంటే మోహం కలిగినా, బద్దకం వదల లేదు నాకు.
“నా కొద్దు నీ మినప సున్ని” అన్నాను గట్టిగా.
“ఏమిట్రా, బామ్మ చెప్పిన మాట వినవేం?” అంటూ మా అమ్మ కసిరింది.
ఇక లేవక తప్పలేదు నాకు.
“ఇంతకీ బామ్మా, గంట్లు అంటే ఏమిటే?” అనడిగాను తెలుసుకుందామని.
“చిన్న సుత్తితో, తిరగలి కింద భాగం పైనా, రోట్లోనూ చాలా చాలా, చిన్న చిన్న గుంటలు కొడతారు. వాటిని గంట్లు అంటారు. ఆ గంట్ల వల్ల, పిండి మెత్తబడుతుంది సులభంగా” అని జ్ఞానబోధ చేసింది మా బామ్మ.
అదేదో సరదా పని లాగా అనిపించింది నాకు. బజారు వెళ్ళి, అక్కడంతా వెతికి గంట్లు వేసే అబ్బాయిని తీసుకొచ్చాను ఇంటికి.
ఆ గంట్ల అబ్బాయి, తిరగలికీ, రోలుకీ గంట్లు కొడుతుంటే, తన్మయత్వంతో చూశాను.
ఎంత బాగుందో ఆ దృశ్యం!
అంతలోనే, ‘కెవ్వు’మన్నాను నొప్పితో.
నెత్తి మధ్య నుండి, రక్తం బొట బొటా కారసాగింది.
గంట్ల అబ్బాయి చేతి లోని ఉలి, పట్టు తప్పి, గాలి లోకి ఎగిరి, నా నడి నెత్తి మీద వాలి, ఒక చిన్న గంటు పెట్టింది.
“అమ్మోయ్! బామ్మోయ్!” అంటూ అరవసాగాను మంటతో.
మా బామ్మ, గబ గబా, డబ్బా లోంచి కొంత కాఫీ పొడి తీసి, నా నెత్తి మీద అద్ది, గట్టిగా పట్టుకుంది, రక్తస్రావం ఆపడానికి. అది కాస్సేపటికి ఆగింది.
కాస్సేపు నొప్పితో కేకలు పెడుతూ ఏడిచాను. ఈ లోపల, మా అమ్మ ఒక పూర్ణం బూరె చేతిలో పెట్టింది. రెండ్రోజుల కిందట పండక్కి చేసినవి.
ఆ తియ్యటి బూరె తింటూ, ఏడవడం మర్చిపోయాను.
ఆ గోలకి భయ పడిపోయి, తన ఉలి తీసుకుని, డబ్బులన్నా అడగకుండా, ఆ గంట్ల అబ్బాయి పారిపోయాడు.
ఆ మర్నాడు, మా నాన్న, నన్ను సైకిలు మీద ఎక్కించుకుని పెద్దాసుపత్రికి తీసుకెళ్ళాడు. అక్కడ, డాక్టరు, గాయాన్ని శుభ్రం చేసి, మందు వేసి, కట్టు కట్టాడు.
“ఇంకా నయం, కాస్త పాలూ, పంచదారా కూడా కలపలేదు దెబ్బ తగిలిన చోట. మంచి కాఫీ తయారయ్యేది” అంటూ వేళాకోళం చేశాడా డాక్టరు.
అలా ముగిసింది ఆ గంట్ల సన్నివేశం.
* * *
భర్త గారి చిన్న నాటి జ్ఞాపకానికి ముచ్చటేసింది భార్య గారికి.
“చూడు! నా నెత్తి మీద, ఆ ఉలి గంటు మచ్చ ఇంకా వుంది” అంటూ బుర్ర వంచి, నడి నెత్తిన వున్న మచ్చని చూపించాడు కామేశం.
“అలాగా! అయ్యో, పాపం!! ఎల్లుండి, ఏకాదశి నాడు, కాలనీలో ఆడవాళ్లం, శివాలయానికి వెళ్తున్నాం. ఆ రోజు, మీ ఆఫీస్కు కూడా శలవే గనక, చక్కగా కంది పప్పు వేయించుకొని, తిరగలి మీద విసిరి, కంది పొడి చేసేయండి. నేను వచ్చాక, మిగిలిన వంట చేస్తాను. అన్నట్టు, మీ పుట్టింటి వారి తిరగలి, ఆ మెట్ల కింద వుంది. అది తీసి, ప్రారంభోత్సవం చేసెయ్యండి” అని వివరంగా చెప్పింది ఆ భార్యామణి.
కామేశానికి చాలా సంతోషం కలిగింది.
“సరే! సరే! అలాగే చేస్తాను. నువ్వే మెచ్చుకుంటావు, ఆ కంది పొడితో అన్నం తిని. ఇంతకీ, ఇవాళ ఉపాహారం ఏం చేస్తున్నావు? తొందరగా అయిపోతుందని, జారుడు ఉప్మా చెయ్యమాక!” అన్నాడు కామేశం.
“మహాశయా! మొన్న ఇడ్లీలు చెయ్యగా మిగిలిన పిండి వుంది. ఇత్తడి బూర్లె మూకుడులో దిబ్బ రొట్లు కాలుస్తాను. ఆరగించుదురు గాని” అని హామీ ఇచ్చింది కనకం.
దిబ్బ రొట్టి పేరు వినగానే, కామేశం మొహం చింకి చాటంత అయింది.
“నువ్వు మంచి దానివి, కనకం” అని భార్యని మనస్ఫూర్తిగా మెచ్చుకున్నాడు.
కనకం నవ్వుతూ వంటింట్లోకి నడిచింది.
* * *
ఆ ఎల్లుండి ఏదో రానే వచ్చింది, ఏకాదశి రోజున. కామేశం, కనకం పెట్టిన ఇడ్లీలు భుజించి, కాఫీ సేవించి, హాయిగా వార్తాపత్రిక చదువుకోసాగాడు.
“ఇదిగో మహానుభావా! కంది పప్పు డబ్బా, గట్టు మీద పెడుతున్నాను. రావడానికి ఒక గంట అయినా పడుతుంది. వచ్చాక చేస్తాను వంట. ఈ లోగా మీ కంది పొడి విసరడం కానివ్వండి. బుజ్జిగాడి చేత లెక్కలు చేయించండి. వాడికి రేపు బళ్ళో, లెక్కల పరీక్ష వుంది” అంటూ కనకం, పనులన్నీ పురమాయించింది.
అప్పుడు గుర్తొచ్చింది కామేశానికి, తన తిరగలి సంగతి.
భార్యామణి ఇంట్లోంచి వెళ్ళగానే, పడక కుర్చీ లోంచి లేచి, ఒళ్ళు విరుచుకున్నాడు. ఒక తువ్వాలు, నడుంకి కట్టుకున్నాడు, గొప్ప పని చేసే మనిషి లాగా.
“ఒరేయ్, బుజ్జిగా! ఇలా వొచ్చి, ఈ తిరగలి కాస్త సాయం పట్టరా!” అని పన్నెండేళ్ళ కొడుకుని పిలిచాడు.
కొడుకు సాయంతో, మెట్ల కింద వున్న తిరగలిని బయటకు తీసి, శుభ్రం చేసి, పాత చీర పరిచి, దాని మీద పాత పేపర్ వేసి, దాని మీద తిరగలి పెట్టాడు.
“బుజ్జీ! నువ్వీ వరండాలో కూర్చుని లెక్కలు చేయడం మొదలు పెట్టు. నేను వంటిట్లో కంది పప్పు వేయిస్తాను” అన్నాడు కామేశం.
“అలాగే, నాన్నా!” అన్నాడు బుజ్జిగాడు, తన పుస్తకాలు ముందేసుకుని, లెక్కలు చేయడం మొదలు పెడుతూ.
“కంది పప్పు వేగడం అవగానే, ఇంక ఆలస్యం ఉండరాదు. వెంటనే విసరడం మొదలు పెట్టాలి. అన్నీ పద్ధతిగా చెయ్యాలి” అని కామేశం, తనకు తానే మనసులో చెప్పుకున్నాడు.
మూకుట్లో రెండు కప్పుల కంది పప్పు పోసి, వేయించడం మొదలు పెట్టాడు కామేశం.
“నాన్నోయ్!” అంటూ బుజ్జిగాడు అరిచాడు.
“ఏంట్రా?” అడిగాడు కామేశం.
“నిశ్చలమైన నీటిలో ఒక పడవ, గంటకి 5 కిలోమీటర్ల వేగంతో వెళుతోంది. ఆ నీటి వేగం ఎంత నాన్నా? పడవ వేగానికి కలపాలి కదా?”
“నిశ్చలమైన నీటికి వేగం వుండదు. అది సున్నా అవుతుంది. ఏమీ కలపక్కర్లేదు.”
“అవును కదూ! నువ్వు భలే తెలివి గలవాడివి నాన్నా!” అంటూ తండ్రిని మెచ్చుకున్నాడు ఆ కుమార రత్నం.
“నాన్నోయ్!” అంటూ మళ్ళీ అరిచాడు.
“ఏమైందిరా మళ్ళీ?”
“ఈ లెక్కకి జవాబు తప్పుగా వచ్చింది. చెప్పు నాన్నా!”
కామేశం కొడుకు దగ్గిరకి వెళ్ళి, లెక్కల రాత పుస్తకం చూశాడు. తప్పు పట్టుకున్నాడు. వివరంగా చెప్పాడు.
“నాన్నోయ్!” అని మళ్ళీ అరిచాడు.
“నేనిక్కడే, నీ పక్కనే వున్నాగా? మళ్ళీ అరుస్తావేం?” అంటూ కసిరాడు కామేశం.
“అది కాదు నాన్నా! వంటిట్లోంచి మాడు వాసన వస్తోంది” అన్నాడు బుజ్జిగాడు.
కామేశం, ఒక్క ఉదుటున వంటిట్లోకి పరిగెత్తాడు. అప్పటికే, వేగుతున్న పప్పు మాడి పోయింది. ఉసూరుమంటూ, ఆ మాడిన పప్పుని, పెరట్లో పారేశాడు.
మళ్ళీ డబ్బా లోంచి, ఇంకో రెండు కప్పుల పప్పు తీసి, వేయించడం మొదలు పెట్టాడు. అప్పటికే, ఆ డబ్బాలో పప్పు అడుగంటింది.
“అమ్మ తిడుతుందేమో నాన్నా, పప్పు మాడగొట్టి పారేశావని” అన్నాడు జాలిగా పుత్ర రత్నం.
“తిడితే తిడుతుంది. ఏం చేస్తాం? చూసుకోలేదు” అన్నాడు కామేశం, తన మీద తానే జాలి పడుతూ.
“నాన్నోయ్!” అంటూ మళ్ళీ పుత్ర రత్నం అరుపు.
“ఏమిట్రా? ప్రతీ దానికీ అలా అరుస్తావు? మామూలుగా పిలవలేవా?” అంటూ కసిరాడు కామేశం.
“అది కాదు నాన్నా! ఈ లెక్క ఎలా చెయ్యాలో నాకు తెలవడం లేదు. నువ్వే చెప్పు” అనడిగాడు బుజ్జిగాడు.
“ఇక్కడ పప్పు మాడి పోతుంది, నేనక్కడకి వస్తే. నువ్వే ఆ పుస్తకం, ఇక్కడకి తీసుకుని రా” అన్నాడు కామేశం.
ఆ పుత్రుడు, లెక్కల పుస్తకం తీసుకుని, వంటిట్లోకి వెళ్ళి తండ్రికి ఆ లెక్క చూపించాడు.
ఒక చేత్తో పప్పు వేయిస్తూ, ఇంకో చేత్తో లెక్కల పుస్తకం లోని లెక్క చదువుతూ, సవ్యసాచి అయిపోయాడు ఆ వంటింటి వీరుడు.
“సాపేక్ష వేగం లెక్క కట్టాలంటే, ఎదురెదురుగా వెళ్ళే రైళ్ళ వేగాలు కలపాలి. ఒకే దిశలో వెళ్ళే రైళ్ళ వేగాలు తీసివెయ్యాలి. ఈ విషయాలు తెలియవా? స్కూల్లో చెప్పలేదా? నువ్వు మర్చిపోయావా?” అన్నాడు తండ్రి.
“నాన్నోయ్!” అంటూ మళ్ళీ అరిచాడు కుమారుడు.
“మళ్ళీ ఏమైందిరా?” అని మళ్ళీ అడిగాడు తండ్రి.
“నీ పప్పు మళ్ళీ మాడు వాసన వస్తోంది, నాన్నోయ్” అని అరిచాడు బుజ్జిగాడు.
మూకుట్లోకి చూశాడు కామేశం. కొన్ని బద్దలు బాగానే మాడాయి. కొన్ని బద్దలు బాగానే వున్నాయి. మూకుడును దించేశాడు పొయ్యి మీద నుంచి.
“కాసిని బద్దలు మాడినా, ఫరవాలేదు. కొంపలంటుకు పోవు. కంది పప్పు కూడా అడుగంటింది డబ్బాలో. పొడిగా విసిరేక, ఉప్పూ, కారం, జీలకర్ర పొడీ కలిపాక, ఆ మాడు వాసన పోతుందిలే” అని తనకే తానే ధైర్యం చెప్పుకున్నాడు కామేశం.
అవును మరి! అలా చెప్పుకోక చస్తాడా? మామూలు తేలా కుట్టింది? దొంగని కుట్టిన తేలాయే!
యిక కంది పొడి విసురుదామని, తిరగలి దగ్గిర కూర్చున్నాడు. ఒక కాలు మడిచాడు. ఒక కాలు చాచాడు. వాళ్ళ బామ్మని చూశాడు, అలా తిరగలి విసరడం. అలాగే విసరాలనుకున్నాడు.
ఎంత అమాయకుడంటే, అలా విసిరితేనే ఆ రుచి వస్తుందని నమ్మాడు.
గుప్పెడు కంది పప్పు తిరగలి మధ్య కన్నంలో పోసి, చెయ్యి వూదుకున్నాడు, ‘కుయ్యి’ మంటూ.
పాపం, పప్పు ఇంకా చల్లార లేదు. కామేశాని కన్నీ కష్టాలే!
“ఆహు! ఆహు! అత్త లేని కోడలుత్తమురాలూ, ఓయమ్మా, కోడల్లేని అత్త గుణవంతురాలు” అని పాడుతూ, తిరగలి పిడి పట్టుకుని గట్టిగా ఒక సారి తిప్పాడు.
ఆ తిరగలి పిడి కాస్తా, అతని చేతుల్లోకి వచ్చేసింది.
“ఓర్నీ! ఇదేంటీ?” అనుకుంటూ, ఆ పిడినీ, దాని గుంటనీ కాస్సేపు తేరి పార చూశాడు.
“ఒరేయ్, బుజ్జీ! ఇలా రారా!” అని గట్టిగా అరిచాడు.
“నేనిక్కడే వున్నా నాన్నా! ఎక్కడికో పోతే కదా రావడానికి?” అని కిస్సుక్కున నవ్వాడు బుజ్జిగాడు.
వాడు అక్కడే నించుని, వాళ్ళ నాన్న చేస్తున్న ఘన కార్యాన్ని పరిశీలనగా చూస్తున్నాడు.
“ఇక్కడే వున్నావా? సరే, వెళ్ళి ఆ గూట్లో వున్న సుత్తి తీసుకురా” అని పురమాయించాడు కుమార రత్నానికి.
కొడుకు వెళ్ళి, రాముడి పాదుకలంత భద్రంగా, ఆ సుత్తి తీసుకు వచ్చి, భక్తిగా తండ్రికి సమర్పించబోయాడు.
“నాకొద్దు. నేనీ పిడిని పట్టుకుంటాను రెండు చేతుల్తో. నువ్వు గట్టిగా దాని మీద సుత్తితో కొట్టు, అది ఈ కన్నం లోకి దిగేలా” అని పుత్రుడికి వడ్రంగి పని అప్పజెప్పాడు.
“సరే” అంటూ, ఆ కొడుకు తన బలంతో, ఆ తిరగలి పిడి మీద ఒక్క దెబ్బ వేశాడు సుత్తితో.
కెవ్వున కేక పెట్టాడు ఆ తండ్రి.
రాముడు అడవులకు వెళుతున్నప్పుడు, దశరథుడు కూడా అంత గట్టి కేక పెట్టలేదు.
కుమారుడు దడుసుకుని, “నాన్నోయ్!” అంటూ, తండ్రిని వాటేసుకున్నాడు.
కామేశం, పిల్లాడిని విడిపించుకుని, “సుత్తితో నా చేతి మీద దెబ్బ వేసి, నన్ను వాటేసుకుంటావేం, నీకేదో దెబ్బ తగిలినట్టు?” అని లబో దిబో మన్నాడు.
“కాదు నాన్నా! నువ్వలా అరిచేటప్పటికి భయం వేసింది” అని సంజాయిషీ ఇచ్చుకున్నాడు బుజ్జిగాడు.
కామేశం ఎడం చెయ్యి బొటన వేలు, ఎర్రగా, మందారం లాగా, వాచింది ఆ సుత్తి దెబ్బకి.
“కొబ్బరి నూనె తెచ్చి రాయనా నాన్నా?” అని అడిగాడు బుజ్జిగాడు ప్రేమగా.
“వద్దు గానీ, బేండైడు చుట్టి, చిన్న కట్టు కడదాం. మీ అమ్మ బాగా జాలి చూపిస్తుంది. నువ్వు నాకు ఈ తిరగలి తిప్పడంలో కాస్త సాయం చెయ్యి” అన్నాడు బొటన వేలుని వూదుకుంటూ.
కొడుకు తెచ్చిన సరంజామాతో, కట్టు కట్టే పని పూర్తి చేశాడు.
ఇక తండ్రీ, కొడుకులిద్దరూ తిరగలికి చెరోవేపూ, బాసింపట్లు వేసుక్కూర్చున్నారు.
ఒక కాలు, తన బామ్మలా చాచుకుని తిరగలి విసరడం లేదనీ, రుచి సరిగా రాదనీ కాస్త దుగ్ధ వుండనే వుంది కామేశానికి. అయినా, ఏం చెయ్యగలడు? పరిస్థితులకు లోబడి, అలాగే పని కానిద్దామనుకున్నాడు.
వాళ్ళిద్దరూ అలా, పైపైన తిప్పుతూ వుంటే, కంది పప్పు ముక్కలై, అవే కింద పడ సాగాయి.
“నాన్నోయ్! కంది పొడి రావడం లేదు నాన్నోయ్! కంది ముక్కలే వస్తున్నాయి” అని అరిచాడు బుజ్జిగాడు.
“ప్రతీ దానికీ నువ్వలా అరవకురా, నాయనా! పక్కింటి వాళ్ళు, నేనేదో నిన్ను కొడుతున్నా ననుకుంటారు. అవును, పొడి రావడం లేదు. ఎందుకో మరి!” అంటూ కొన్ని కంది ముక్కల్ని ఏరి, మళ్ళీ మధ్య కన్నంలో వేశాడు కామేశం.
ఈ సారి రవ్వంత పిండి కూడా వచ్చింది. ఇలా విసురుతూ వుంటే, ఎప్పటికి కంది పొడి తయారయ్యేను?
ఆ తిరగలి తిప్పడం సరదాగానే వున్నా, చేసుకోవాల్సిన లెక్కలు గుర్తుకు వచ్చాయి బుజ్జిగాడికి.
“నేను లెక్కలు చేసుకోవాలి, నాన్నా! నాకు రేపు పరీక్ష వుంది. నేను పోతున్నాను” అంటూ లేచిపోయి, పక్క గదిలోకి వెళ్ళి పోయాడు బుజ్జిగాడు.
ఇక చేసేదేమీ లేక, కొంచెం సేపు ప్రయత్నించి, ఒంటి చేత్తో తిరగలి విసర లేక, లేచి అన్నీ సర్దేశాడు.
తన కంది పొడి కార్యక్రమం విఫల మయ్యిందనీ, కనకం, ఇంటికి వచ్చాక బాగా నవ్వుతుందనీ, బాగా అర్ధం అయిపోయింది కామేశానికి.
కనకం ఇంకా రాలేదు ఇంటికి. ఏవేవో ఆలోచనలు చుట్టు ముడుతున్నాయి కామేశానికి. దిగులుగా కూర్చున్నాడు. అప్పుడు గుర్తొచ్చింది, అంతకు ముందు రోజు, కనకం ఇచ్చిన పచారీ సరుకుల చీటీ. ఇంట్లోకి కొన్ని సరుకులు తీసుకు రావాలి.
“బుజ్జిగా? నీ లెక్కలు చెయ్యడం పూర్తయిందిరా?” అనడిగాడు కొడుకుని, కామేశం.
“అయింది నాన్నా! పుస్తకాల పెట్టె సర్దుకుంటున్నాను” అని జవాబిచ్చాడు కొడుకు.
“ఈ చీటీ తీసుకుని, సందు చివర వున్న పచారీ కొట్టు లోని సరుకులు తీసుకురా” అంటూ, ఒక సంచీ, చీటీ, డబ్బూ ఇచ్చాడు బుజ్జిగాడికి.
ఇంటి పనులు చేయడం అలవాటే పిల్లవాడికి. నేర్పారు తల్లిదండ్రులు.
పిల్లాడు ఆ సరుకులు తెచ్చివ్వడం, తండ్రి వాటిని వంటిట్లో సర్దడం, ఆ తర్వాత కాస్సేపటికే కనకం ఇంటికి రావడం, అన్నీ జరిగాయి.
రాగానే, భర్త ఎడం చేతి బొటన వేలికున్న కట్టు చూసింది.
“అయ్యో! ఏమయిందండీ? ఏమయింది?” అంటూ కంగారుగా చెయ్యి పట్టుకుంది.
“మరేమో, మరేమో, తిరగలి పిడి మీద వెయ్యాల్సిన సుత్తి దెబ్బ, నా చేతి మీద వేశాడు బుజ్జిగాడు, చూసుకోకుండా. చిన్న దెబ్బేలే” అని సర్ది చెప్పాడు కామేశం.
“అయ్యో, అయ్యో” అంటూ లబ లబలాడి, చాలా జాలి చూపించింది భర్త మీద.
బాగా మురిసి పోయాడు భార్య ప్రేమకు.
“శివాలయం దగ్గిర పనస పొట్టు అమ్మే అబ్బాయి కనపడ్డాడు. మీ కిష్టం అని కొన్నాను. పక్కింటి పిన్ని గార్ని అడిగాను, ఎలా చెయ్యాలో. ఆవ పెట్టి వొండుతాను” అంది భర్తని ప్రేమగా చూస్తూ.
గంటన్నర తర్వాత ముగ్గురూ భోజనాలకు కూర్చున్నారు.
ఆవ పెట్టిన పనస పొట్టు కూర, బాగా మెచ్చుకుంటూ తిన్నారు తండ్రీ, కొడుకులు.
అప్పుడు చూసింది అక్కడ వున్న గిన్నె లోని కంది పొడి.
“అబ్బ! చూడ్డానికి బాగానే వుందే! మీరు చేసిందే?” అంటూ అన్నంలో కలుపుకుంది ఆ కంది పొడిని కనకం.
బుజ్జిగాడు, రెండో సారి పనస పొట్టు కూర తినే హడావుడిలో వున్నాడు.
కామేశం బుర్రూపాడు, అవునన్నట్టు.
కంది పొడి అన్నం, ఒక ముద్ద నోట్లో పెట్టుకుంది కనకం.
“కొంచెం ఉప్పు తక్కువయింది గానీ, కంది పొడి చాలా బాగానే విసిరారు. మంచి పనివారే” అంటూ భర్తని మెచ్చుకుంది.
ఆ మెప్పుదల చాలా తన్మయత్వం కలిగించింది కామేశానికి.
“అది నాన్న విసిరింది కాదమ్మా! నా చేత పచారీ కొట్టు నుంచి తెప్పించాడు నాన్న” అంటూ చెప్పేశాడు బుజ్జిగాడు.
“ఆ చీటీకి కంది పొడి కలిపానని నీకెలా తెలిసిందిరా?” అని ఆశ్చర్యంగా అడిగాడు కామేశం.
కొడుక్కి తను చీటీలో ఆ సరుకు కలిపిన సంగతి తెలియదనే అనుకున్నాడు.
“నువ్వేగా, సరుకులు కొన్నాక, ప్రతీదీ చీటీలో రాసిన వాటితో పోల్చి, లెక్క చూసుకోమని చెప్పావు? వాటిలో కంది పొడి వుందని చూశాను” అని చెప్పేశాడు బుజ్జిగాడు.
“అమ్మదొంగా! పచారీ కొట్టులోని కంది పొడా ఇది? మీరు తిరగలి మీద విసిరారనుకుని, మిమ్మల్ని తెగ మెచ్చేసుకున్నాను” అంటూ దెబ్బలాడింది కనకం.
కామేశం, తప్పు చేసిన వాడి లాగా తల వొంచుకున్నాడు. ఎడం చేతి బొటన వేలి కట్టును, వూదుకోసాగాడు, భార్యకి ఎక్కువ జాలి కలిగించాలని.
కొడుకు, పచారీ కొట్టు కంది పొడితో అన్నం, ఇష్టం గానే తింటున్నాడు తల్లిదండ్రులను పట్టించు కోకుండా.
భర్తని చూసి జాలేసింది, భార్యకి.
“పోనీలెండి. వచ్చే ఆదివారం, మనిద్దరం కలిసి తిరగలి మీద కంది పొడి విసురుకుందాం. మీ కోరిక తీరుద్దాం. మీ తాపత్రయం చూసి, నాకూ తిరగలి కంది పొడి మీద మనసేస్తోంది. మనిద్దరం కలిసి చేసుకుంటే, సులభంగా అయిపోతుంది లెండి” అని భర్తకి వరం ఇచ్చేసింది కనకం.
కామేశం మొహం వికసించింది.
“అమ్మా, నేనూ ఆడతానమ్మా ఆ తిరగలి ఆట. నాన్నా, నన్నూ ఆడించు” అన్నాడు బుజ్జిగాడు.
తల్లిదండ్రులిద్దరూ ఫక్కున నవ్వారు.