సైంటిస్ట్ న్యూరాన్

1
3

[dropcap]ఇ[/dropcap]రవై రెండేండ్ల కారుణ్య లండన్ ఫ్లైట్ దిగి నేరుగా ఇంటికి వచ్చేశాడు… కొత్త కోర్స్ యమ్.యస్సీ (వైరాలజీ) చేస్తున్నాడు.

కోర్సులో చేరిన కొద్దిరోజులకే కరోన కలకలంతో అందర్నీ వెనక్కి పంపించడంతో అతడు ఇండియాకి వచ్చేశాడు.

కారుణ్య తాతయ్య పేరు ‘న్యూరాన్’. ఆయన సైంటిస్ట్. వైరస్‌లపై ప్రయోగాలు చేస్తున్నాడు.

కారుణ్య కాస్త రిలాక్స్ అయ్యాక కుటుంబ సభ్యులందరితో పలకరింపులు పూర్తయ్యాక, తాత ముందు పర్సనల్ ల్యాబ్‌లో కూర్చున్నాడు.

“కొత్తగా ఈ కరోనా గోల ఏంటి తాతయ్య?” అని అడిగాడు తాత గారిని.

“ధర్మం వికటించినప్పుడు.. అధర్మం రాజ్యం ఏలుతున్నప్పుడు.. యుగానికొక అవతారంలా…. ఈ కాలానికి దేవుడు రాక్షసత్వంపై ప్రయోగించిన వజ్రాయుధం కరోనా… ఈ భూమిపై నివసించే హక్కు అందరికీ ఉంటుంది. చెట్టు మీది పిట్టకి, నేల పైని చీమకి, కొండ మీది కోతికి! అది మరచి మానవుడు స్వార్థంతో విధ్వంసం సృష్టిస్తే బదులుగా ప్రకృతి వికటాట్టహాసం చేస్తుంది. అన్ని జీవుల పైన సమభావం చూపమని అనవరతం మానవునికి హెచ్చరిక చేస్తుంటుంది.”

విమానాశ్రయంలో జరిగిన కరోన టెస్టుల్లో నెగటివ్ వచ్చింది కారుణ్యకి.

అత్యంత మేధావి అయిన తాత గారి మాటలు శ్రద్ధగా వింటున్నాడు.

***

అది విని కిరీటంలా ఉన్న తన ముళ్ళని ఒక్కసారిగా గట్టిగా విదిలిస్తూ… కోపంతో రగిలిపోయింది కరోన…

“వీల్లేదు… మన కరోన జాతిని చంపడానికి ఎవరు కూడా టీకా మందు తయారు చేయడానికి వీల్లేదు. అలాంటి ప్రయత్నానికి పూనుకుంటున్న వారెవరినినీ… వూరికే వదిలి పెట్టను… చంపేస్తా! ఆ జాతి యావత్తును అంతమొందిస్తా!!”

రహస్యంగా తనకు ఈ కబురు చేరవేసిన తన కరోన వేగులతో బిగ్గరగా అరిచింది ఆ కరోన రాజు.

***

 “కొత్తగా ఈ కరోన గోల ఏంటి తాతయ్యా?” తన సందేహాన్ని తాత గారి ముందుంచాడు కారుణ్య.

“వైరస్‌లు ఒక రకం జీవులేగా! నీకు తెలియంది కాదు. అయినా నా పరంగా కొంత చెబుతాను. ఎంత మనుషుల్లో మంచివారు, చెడ్డవారు ఉన్నట్టే, కొన్ని వైరస్‌లు ఎలాంటి హాని చేయకుండా శరీరంలో జీవిస్తాయి‌. మరి కొన్ని వైరస్‌లు… ఎయిడ్స్, ఆటలమ్మ, మశూచి, తట్టు, పోలియో, ఎల్లో ఫీవర్, రేబిస్..‌. వంటి వ్యాధులకు గురి చేస్తూ మానవజాతిని తరతరాలుగా పీడిస్తూనే ఉన్నాయి. వైరస్ అంటేనే విషం. అలాంటి కొత్త రకమైన ఒక విష వైరస్ ‘కరోన వైరస్’కు చెందినది. 15 నుండి 600 నానో మీటర్ల పొడవు ఉండే ఈ వైరస్ తన సంతతిని పెంచుకోవడం కోసం ఇతర కణాలపై దాడి చేస్తుంది. తాను విభజన చెంది పునరుత్పత్తి జరగాలంటే దీనికి మరో జీవకణం అవసరం… అందుకే అన్ని కొన్ని జీవరాశులతో పాటు మనుషులపై అది దాడి చేస్తుంది…”

“కానీ తాతయ్యా! ఈ వైరస్‌లకు జంతువులే వాహకాలు కదా!”

“ఇంటెలిజెంట్ క్వశ్చన్! ఈ కరోన వాస్తవానికి… పిల్లులు, ఒంటెలు, గబ్బిలాల నుండి ఏదో విధంగా మనుషుల్లోకి వ్యాప్తి చెందినట్లు సమాచారం.”

“వాటిని కోళ్లు, గొర్రెల్లను తిన్నట్టు తింటే అంటువ్యాధిగా మానవజాతికి సంక్రమించే అవకాశం ఉంది కదా?”

“హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్! ఆ పొరపాటే ప్రస్తుతం 200 పైచిలుకు దేశాలను వణికిస్తోంది. అలా ఒక దేశంలో పుట్టిన ఈ కరోన… భూగోళాన్ని లాక్‌డౌన్ పేరిట దుప్పటి కప్పుకునేలా చేస్తోంది. యావత్ ప్రపంచానికి కునుకు లేకుండా చేస్తోంది.”

“ఈ ప్రాణాంతకమైన మహమ్మారి కరోన… జంతువుల నుండి మరో జీవ జాతిలో ఎదిగేందుకు వీలుగా తనను తాను మార్చుకున్నపుడు సమస్య తీవ్రత ఎలా పెరుగుతుంది?”

“ఇలాంటి పరిస్థితుల్లో కరోన మనుషుల్లో వ్యాపిస్తూ… సార్స్, మెర్స్ వంటి శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతూ సమస్యను పెంచుతున్నాయి. ఈ రకంగా బహుకణ జీవుల కణజాలాలపై వైరస్‌లు దాడి చేస్తే, అవసరమైన కణాలు మరణించి దాని ప్రభావం మొత్తం జీవిపై పడుతుంది. అలా ప్రస్తుతం మనుషులు విగత జీవులు అవుతున్నారు.”

“ఇలా ఈ కరోనా వైరస్‌లు మన మానవ జాతిపై విశృంఖలంగా దాడి చేయవలసినదేనా?”

“అత్యాశకు పోయే ఏ జీవికైనా ఏదో ఒక రోజు ఎదురుదాడి తప్పదు…”

“కానీ ఈ వైరస్‌పై ఎలా మనం దాడి చేసి దాన్ని సమూలంగా నాశనం చేయడం?”

“చెడుపై ఎప్పుడు మంచి గెలుస్తూనే ఉంటుంది.ఇది చరిత్ర చెప్పే ధార్మిక పాఠం! ప్రతి వ్యాధికి తప్పక మందు కనుగొనబడుతుంది. మనిషి తప్పక విజయం సాధిస్తాడు. ఎందుకంటే అతడు బుద్ధ జీవి కనుక!!”

“కానీ తాతయ్యా! ప్రకృతి ముందు మానవ జాతి ఏపాటిది?”

“అవును. ప్రకృతికి ఎదురు వెళ్ళినప్పుడు మానవుడికి కూడా విపత్కర పరిస్థితులు ఎదురు కాక తప్పదు!!”

“అందుకు మానవులుగా మనం ఏమి చేయాలి అంటారు?”

“ధర్మ ఏవ హతో హంతి! అనేది మన నానుడి. ధర్మాన్ని మనం రక్షించకపోతే అది మనల్ని రక్షించదు. మానవ జాతి ధర్మ రక్షణా బద్ధమై జీవనం గడపాల్సిందే! తప్పదు. అంతకు మించి మరో మార్గం లేదు”

***

“మన కరోన జాతిని మట్టు పెట్టడానికి… క్లోరో క్విన్ మందుని ఆయుధంగా వాడుతున్నారట…” వేగులు చేరవేసిన సమాచారానికి స్పందిస్తూ “నీకు కుడి వైపు దిశగా వెళ్లిన వేగులు కూడా తెలియపరిచారు. ప్యారాసిటమాల్ మందు బిళ్ళలు వేసి కూడా మనపై ప్రయోగం చేస్తున్నారని. అందుకే ఆ దిశ వైపు ఉన్న మన జాతికి కబురు పంపాను. ప్రాణ త్యాగానికి సంసిద్ధులై ఉండమని. ఇలాంటి మందులు వేసినప్పుడు స్వయం సిద్ధంగా చనిపొమ్మని. అలా అలా మనుషులని నమ్మించి… ప్రయోగాలు చేసి అసలైన టీకాలు కనుగొని మనపై దాడి చేయక ముందే, మనమే ఒకేసారి మానవులపై విరుచుకుపడాలి. ఈ భూవలయంపై మానవజాతిని నామ రూపాలు లేకుండా చేయాలన్నది నా భావి ప్రణాళిక. మనంతటి వారు లేరని విర్రవీగే మానవులకు ఇదొక హెచ్చరిక కావాలి. ఒక చిన్న ప్రాణి సైతం మనుషుల ఉనికికి సవాల్ విసరగలదని తెలిసి రావాలి. అప్పటివరకు మన పోరాటం ఆగకూడదు” అంటూ ఆ వేగుల ముందే అదోలా నవ్వింది కరోన కింగ్.

***

“ఒక సీనియర్ సైంటిస్ట్‌గా తాతయ్యా… ఈ కరోన బారినుండి మానవ లోకాన్ని సురక్షితంగా ఎలా వేరు చేయాలనుకుంటున్నారు…”

“అందుకు రాత్రి పగలు శ్రమించింది మా జూనియర్ సైంటిస్టుల టీం. ఎలుకలపై కూడా ప్రయోగాలు చేసాం. రెండు దశల వారీగా మానవులపై ప్రయోగాలు జరిపారు. మేము అనుకున్నది అనుకున్నట్టుగానే జరుగుతోంది. టీక సత్ఫలితాలను ఇస్తోంది. మూడోదశ ప్రయోగం మానవులపై రేపు ప్రారంభం కాబోతోంది. ఈ ప్రయోగం వికటించకపోతే మన దేశం మొదటి కరోనాల తొలి టీకా కనుగొన్న దేశంగా నమోదు అవుతుంది.”

“వావ్ తాతయ్యా!యు ఆర్ వెరీ జీనియస్!” పసిపిల్లాడిలా చప్పట్లు కొట్టాడు కారుణ్య.

“నాట్ మై సెల్ఫ్ మై డియర్ గ్రాండ్‌సన్! మా టీమ్ లోని ప్రతి ఒక్క సైంటిస్టూ ఇంటెలిజెంటే! ది టోటల్ క్రెడిట్ గోస్ టు ఎవ్రీ యంగ్ సైంటిస్ట్!” అంటూ మనవడి చప్పట్లతో తను శృతి కలిపాడు న్యూరాన్.

న్యూరాన్ తన మనవడు కారుణ్యతో కరోన గురించి సంభాషిస్తున్నప్పుడు కరోన రాజు ఆ గదిలోనే ఉంది. ఆవేశంతో రగిలిపోతోంది. పళ్ళు పటపట కొరుకుతోంది.క్రోదాగ్ని ఏరులై పారుతోంది.

అప్పుడు రింగ్ అయింది కారుణ్య సెల్ ఫోన్.

“తాతయ్యా! కాలేజీ నుండి అర్జంట్ కాల్. వితిన్ ఫ్యూ మినిట్స్ ఐ విల్ బ్యాక్!”

“ఇట్సోకే” అన్నాడు న్యూరాన్.

తలూపుకుంటూ ఆ గది దాటాడు కారుణ్య.

మనవడితో సంభాషిస్తున్నప్పటి నుండే న్యూరాన్‌కి ఆ గదిలో ఏదో తేడాగా అనిపించింది. కానీ దానిపై పెద్దగా ఫోకస్ పెట్టలేదు.

ఇప్పుడు ఎందుకో వదిలిపెట్టాలనిపించలేదు. తన అనుమాన నివృత్తి కోసం ఆలస్యం చేయకుండా చప్పున తన సూపర్ మైక్రో ఫోన్ ఆన్ చేసి గది అంతా కలియ తిరిగి చూసాడు. ఒక్కసారిగా అదిరిపడ్డాడు!

అక్కడ ఇందాక తాను తెచ్చుకున్న బ్రెడ్ ప్యాకెట్ పైన… కిరీటంలాంటి ముళ్ళతో మెరుస్తున్న గోళాకారపు వింత ప్రాణి. మునుపు ఎప్పుడూ చూసి ఉండలేదు.

కానీ,ఆనవాళ్లను బట్టి… అది కరోన వైరస్ జీవే…!!,దాని వెనకాల కోటానుకోట్ల వైరస్ కణాలు… యుద్ధానికి సిద్ధమై వచ్చిన సైనిక పటాలంలా…

ఒక్కసారిగా ఒళ్ళు జలదరించింది అంతటి సైంటిస్ట్ న్యూరాన్‌కి!

గత పది రోజులుగా తాను ఆ బేకరీ నుండి బ్రెడ్ తెచ్చుకుంటున్నాడు..

నిన్నటి నుండి ఎందుకో కాస్త గొంతు నొప్పి… పొడిగా దగ్గు రావడం… వీటిని తేలిగ్గా తీసుకున్నాడు!

అంటే –

తనలో కరోనా లక్షణాలు మొదలయ్యాయి అన్న మాట. అంటే కరోన జీవులు తన గొంతులో తిష్ట వేశాయి.

సైంటిస్ట్ న్యూరాన్ మానసిక స్థితిని పసిగట్టినట్టు పడీ పడీ నవ్వుతోంది ఆ కరోన కింగ్!!

“మొదటి రోజే బయటనుండి వచ్చాక చేతులు శుభ్రంగా కడుక్కోవడం మరిచావు. నీ చేతి వేళ్లతో కళ్ళు నులుముకున్నావు. ప్చ్!! నా జాతిని సమూలంగా తుదిముట్టించాలని కంకణం కట్టుకొని టీకా కోసం ప్రయోగాలు చేస్తున్నావు కదా! ఆ ధ్యాసలో పడి ఈ జాగ్రత్తలన్నీ మర్చిపోయావు. అదను చూసి ఆ క్షణంలోనే నా జాతి కరోన వైరస్ సమూహం నీ గొంతులో తిష్ట వేశాయి”

దాని మాటలు సీనియర్ సైంటిస్ట్ న్యూరాన్ చెవిని సోకుతున్నాయి.

“అసాధ్యం “బిగ్గరగా అరిచాడాయన.

“ఏమి.. మేము అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించడం లేదా? సైంటిస్ట్‌వి అయినంత మాత్రాన పొరపాటు చేయకూడదని ఎక్కడైనా రాసి ఉందా? మరణం చేరువైనపుడు ఎవరు మాత్రం ఏం చేస్తారు…”

“నిజమే పలికేవు… నీ కరోన జాతి యావత్తు నాశనం అయ్యే ఘడియ రాబోతుంది. నన్ను ఈ కోవిడ్ బారిన పడదోసి, మృత్యువాతకు గురిచేయాలని తలచినంత మాత్రాన, మీపై మానవులు విజయవంతంగా ప్రయోగించబోయే టీకా దాడి ఆగదు. మా సైంటిస్టుల టీమే కాదు. నా భారతదేశం లోని ఎన్నో కంపెనీలు ఈ పనికి కంకణం కట్టుకున్నాయి. కష్టపడి సాధిస్తాం మాలో ఎవరో ఒకరం! ఈ టీకా మందు తయారీ గురించిన ఫార్ములాని ఎప్పుడో నా మనవడికి విశదీకరించాను. అతి త్వరలో వాడి ఆధ్వర్యంలో నా టీమ్ సైంటిస్టులంతా కలిసి తయారు చేయబోయే అద్భుతమైన టీకాతో మీ జాతి పతనానికి తప్పక శ్రీకారం చుడతారు…”

ఆ మేథో సైంటిస్ట్ న్యూరాన్ ఛాలెంజ్ విసురుతుంటుంటే… అప్పుడు వచ్చింది అతడికో దగ్గుతెర. తెరలు తెరలుగా దగ్గు తెర. ఊపిరాడనివ్వని దగ్గు!

న్యూరాన్ గత కొద్ది రోజులుగా లంగ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. ఆ విషయం తన కుటుంబ సభ్యులకు, అలాగే మనవడికి కూడా తెలియనివ్వలేదు. జీవితపు చివరి స్టేజ్‌కి వచ్చేసానని అతనికి అర్థమవుతూనే ఉంది.

న్యూరాన్ దగ్గుతున్న ప్రతిసారి గుప్పెడు గుప్పెడు రక్తం నోట్లో నుంచి పడుతోంది. తన లోని లంగ్ క్యాన్సర్ గురించి కరోనకి తెలియజేయాల్సిన అవసరం లేదనుకున్నాడు న్యూరాన్.

‘కరోన భ్రమలో దాన్ని ఉండనీ!’ అనుకున్నాడు మనసులో.

కరోన కింగ్ అది చూసి అదంతా తన కరోన జాతి ప్రభావమేనని మురిసిపోతూ అదేపనిగా కరాళ నృత్యం చేస్తూనే ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here