జ్ఞాపకాల పందిరి-66

58
4

[box type=’note’ fontsize=’16’] “కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే…!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్. [/box]

మళ్ళీ…. ఇప్పుడు!!

[dropcap]ఒ[/dropcap]కసారి వృద్దాప్యంలోకి అడుగుపెట్టాక, బాధ్యతలన్నీ తీరిపోయినా, తీరకపోయినా మనసు గతాన్ని తలుచుకొని సమయం వుండదు. కావాలని జరిగిపోయిన కాలాన్ని సింహావలోకనం చేసికొనక పోయినా ఏదో సందర్భం వెనుకటి జ్ఞాపకాల వైపు పరిగెత్తించి గుర్తు చేసుకోవడమో, చిన్ననాటి స్నేహితులు కలసి ముచ్చటించుకున్నప్పుడో, లేదా ఫలానా ప్రాంతాన్ని దర్శించినప్పుడో నాటి జ్ఞాపకాలు ముఖ్యంగా చిన్ననాటి లేదా విద్యార్థి దశ నాటి జ్ఞాపకాలు కళ్ళముందు ఈగల్లా ముసురుతాయి. అలాంటప్పుడు మనకు తెలియకుండానే నాటి సంగతులన్నీ మనలో పరకాయ ప్రవేశం చేసి, ప్రస్తుతాన్ని మరచిపోయేలా చేసి గతాన్ని యెంత లోతు నుంచైనా బయటికి తవ్వుతాయి. వయసు మరచిపోయేలా చేసి, గడిచిపోయిన బాల్యం, యవ్వనం మన ముందు నాట్యం చేస్తాయి. ఈ వింతైన విలువైన పరిస్థితిని అందరూ ఆస్వాదించలేరు, అలాగే గతం గురించి ఆలోచించలేరు, గతం గతః అన్నట్టుగా ఎలాంటి స్పందన లేకుండా మిన్నకుండి పోతారు. వీరికి భిన్నమైన వ్యక్తులు గతాన్ని గుర్తుచేసుకున్నప్పుడల్లా ఒకరకమైన మానసిక అనుభూతినీ ఆనందాన్నీ పొందుతారు. అవకాశాన్ని బట్టి తరచుగా స్నేహితులను శ్రేయోభిలాషులను కలుసుకోవడానికి ఆరాటపడుతుంటారు. అందులో వారు చెప్పలేనంత ఆనందాన్ని, కొలవలేనంత శారీరక శక్తిని పొందుతారు. ఇలాంటి సందర్భాలలో పురుడుపోసుకుంటున్నవే, పాత విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాలు. వీటికోసం ప్రత్యేకంగా అసోషియేషన్లు రూపొందించుకుని, నాటి మిత్రులను సమీకరించి సమ్మేళనాలు ఏర్పాటు చేసుకోవడం గతాన్ని గుర్తుచేసుకుని ఆనందించడం అందుబాటులోవున్న గురువులను ఆహ్వానించి వారిని ఆత్మీయంగా సన్మానించుకోవడంవంటి పనులు చేపడుతున్నారు. విశ్రాంత జీవితాన్ని మరింత చురుగ్గా మెరుగుపరుచుకోవడానికి దోహద పడుతున్నాయి. ఇది చాలా మంచి ఆలోచన మంచి కార్యక్రమం.

మిత్రుడు, పారిశ్రామిక వేత్త శ్రీ టి.వరప్రసాద్ తో రచయిత.

నాకు హైస్కూల్ స్థాయినుంచి డిగ్రీ స్థాయి వరకు కొంతమంది మిత్రులు టచ్‌లో వుండడం నా అదృష్టంగానే భావిస్తాను. అంతమాత్రమే కాదు నాకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులు, లెక్చరర్‌లు, ప్రొఫెసర్లు కూడా. ఇరువైపులా ఆ అభిరుచి వున్నవాళ్లు కాబట్టే దీనికి సాధ్యమైంది. అప్పటి నా సహాధ్యాయుల గురించి, నా గురువుల గురించి చెబుతుంటే నా పిల్లలే కాదు బంధువులు సైతం ఆశ్చర్యపోతుంటారు. ఇప్పుడు మొబైల్ ఫోన్ల హవాలో ఇది మరింత సులభతరమైంది. విదేశాల్లో వున్నా స్వదేశంలో వున్న భావనతో ఒకరినొకరు చూసుకుంటూ మాట్లాడుకునే సదుపాయాలు మనకు అందుబాటులోనికి వచ్చాయి. వివిధ స్థాయిల్లో గ్రూపులు వెలసి ఆనందించే వెసులుబాటు కలిగింది. ఈ నేపథ్యంలో మాకు ‘ఇంటర్ 1972-74, నాగార్జునసాగర్ గ్రూప్’ వుంది. ఇందులో సభ్యుల సంఖ్య తక్కువ వున్నా, రోజువారీగా స్పందించేవారు కూడా అతి తక్కువ. అయినా ఈ గ్రూపు ద్వారా మేము నిత్యం ఆనందం పొందుతుంటాము. మా గ్రూపులో మా గురువులు కూడా ఉండడం విశేషం.

నాటి ఇంటర్మీడియట్ మిత్రుడు, నేటి పారిశ్రామిక వేత్త టి.వరప్రసాద్ (తంగేడు ఫార్మ్ హౌస్ అధినేత)

1974లో మా ఇంటర్మీడియేట్ అయిపోయిన తర్వాత ఎవరి మార్గంలో వారు చదువు దృష్ట్యా, ఆపైన ఉద్యోగాల దృష్ట్యా వేరైపోయాము. ఎవరో ఒకరిద్దరు తప్ప మిగతా వాళ్ళం ఏవిధంగానూ కలుసుకోలేకపోయినాము. నాకు మొదట కలిసిన మిత్రుడు శ్రీ ఆర్.చంద్రశేఖర్ రెడ్డి. అది నేను మహాబూబాబాద్‌లో పనిచేస్తున్నప్పుడు జరిగింది. అప్పుడు ఆయన సింగరేణి సంస్థలో పనిచేసేవాడు. తర్వాత నేను హన్మకొండకు వచ్చిన తరువాత (1994) అనుకోకుండా నా క్లినిక్‌కు దగ్గరలోనే మాకు కెమిస్ట్రీ బోధించిన రమేష్ కుమార్ (రామ్ నగర్) కలిశారు. అప్పటి నా ఆనందాన్ని అక్షరాల్లో వ్యక్తపరచలేను. సర్ నన్ను గుర్తు పట్టలేదు కానీ, నేను గురువుగారిని గుర్తుపట్టాను. ఆయన కూడా నన్ను చూసి చాలా సంతోషించారు. అప్పటినుండీ మా పలకరింపులు కొనసాగుతూనే వున్నాయి. తర్వాత గైనకాలజిస్టు (హైదరాబాద్) మిత్రుడు డా.దుర్గాప్రసాద్ వరంగల్ పని మీద వచ్చి నన్ను కలిసాడు. ఆ తర్వాత రెండు సార్లు ప్రొఫెసర్ నాగులు గారిని (మాకు జువాలజీ బోధించారు – ఆ తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గాను, పరీక్షల నియంత్రణాధికారి గాను పనిచేసి పదవీ విరమణ చేశారు) నేను మా ఇంట్లోనే కలుసుకునే అవకాశం కలిగింది.

గురువులు ప్రొఫెసర్ నాగులు(జువాలజీ) గారితో మా మిత్ర బృందం.

తర్వాత మా అక్క శిష్యుడు సుభాష్ చంద్రబోస్ ద్వారా నా ఇంటర్ మిత్రుడు టి.వరప్రసాద్ మొబైల్ నంబర్ సంపాదించగలిగాను. ఫోన్లో మాట్లాడుకుని ఇద్దరమూ చెప్పలేని ఉద్వేగానికి గురయ్యాము. ఒక సాధారణ కుటుంబంలో అతి సాధారణ జీవితం గడిపిన వరప్రసాద్, ఊహించిన దానికంటే ఎత్తుకు ఎదిగి పోయినాడు. అతని ఎదుగుదల నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. కించిత్ గర్వం కూడా కలిగింది. అతనికి చిన్నప్పటి నుండీ కష్టపడడం బాగా తెలుసు. ఆ వయస్సులోనే పరిశోధన, నూతన ఆవిష్కరణల పట్ల అమిత ఆసక్తిని కనబరిచేవాడు. అందుచేతనే అబ్దుల్ కలాంగారితో కలిసి పనిచేసే అదృష్టాన్ని కైవసం చేసుకోగలిగినాడు. ఆయన సూచనల ప్రభావమే ఈనాడు వరప్రసాద్ కొన్ని వందల మందికి జీవనోపాధి కలిగించగల పారిశ్రామికవేత్త అయినాడు. యెంత ఎదిగినా వొదిగి వుండే మనఃస్తత్వం అతనిలో ఉండడం వల్లనే ఈనాటి వరకూ మా స్నేహం పచ్చగా వర్ధిల్లుతున్నది.

గురువులు ప్రొఫెసర్ నాగులు గారు (ఎడమ) రమేష్ కుమార్ గారు (కుడి) వెనుక ఎడమ ఆర్. చంద్ర శేఖర్ రెడ్డి, మధ్యలో రచయిత, కుడి వరప్రసాద్.

ఇలా రమేష్ కుమార్ సార్ సంగతి, వరప్రసాద్ సంగతి, ప్రొఫెసర్ నాగులు గారికి చెప్పడం ద్వారా అందరిమధ్య కమ్యూనికేషన్ సులభమైంది. తద్వారా ఖమ్మం (ఇప్పుడు హైదరాబాద్)లో వున్న చంద్రశేఖర్ రెడ్డి, నిజామాబాద్‌లో వున్నశ్యామ్ & లీల, హైదరాబాద్‌లో వున్న సూర్యప్రకాష్ రెడ్డి, హన్మకొండలో వున్నరమేష్ కుమార్ సార్‌ల మధ్య మంచి లింకు ఏర్పడింది. అదే వరప్రసాద్ ఫామ్ హౌస్‌లో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకోవడానికి మార్గం సుగమం చేసింది.

వరప్రసాద్ కొంపల్లిలో విలాసవంతమైన భవనంలో ఉంటున్నాడు. అతను అభివృద్ధి చేసిన ‘తంగేడు ఫార్మ్‌హౌస్’ అతని ఇంటికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఇస్లాంపూర్ (మెదక్ జిల్లా)లో వుంది. అందుచేత అక్కడ ప్రసాద్ 2019, సెప్టెంబర్ 20న ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసాడు. అప్పుడు హైదరాబాద్ నుండి డా.నాగులు గారు, వారి శ్రీమతి, వారి అబ్బాయి వచ్చారు. నిజామాబాద్ నుండి మిత్రుడు శ్యామ్, ఆయన శ్రీమతి లీల వచ్చారు. హన్మకొండ నుండి కెమిస్ట్రీ సార్ రమేష్ కుమార్ గారిని తీసుకుని వెళ్లాను. ఫార్మ్‌హౌస్ అధిపతి వరప్రసాద్ ఆయన శ్రీమతి వచ్చారు. పంటపొలాల మధ్య పచ్చని, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉదయంనుంచి సాయంత్రం వరకూ చాలా ఆనందంగా గడిపాము. ఒకప్పుడు భయంగా మెలిగిన లెక్చరర్స్‌తో, స్నేహితుల్లా కలిసిపోయాము.

తంగేడు ఫార్మ్ లో..గురువు లతో

మిత్రుడు శ్యామ్, ఆయన శ్రీమతి లీల (ఇద్దరూ ఇంటర్ సహాధ్యాయులే) కమ్మని పాటలు పాడారు. అంతమాత్రమే కాదు స్వయంగా పిండివంటలు చేసి తీసుకు వచ్చారు. ప్రసాద్ చక్కని లంచ్ తయారు చేయించాడు. ఆ తర్వాత అందరం స్వంత అనుభవాలు పంచుకున్నాము. ఇది మరచిపోలేని సన్నివేశం. మధురానుభూలను మిగిల్చిన రోజు. సాయంత్రం తేనీరు సేవించి ఎవరి ఇళ్లకు వాళ్ళం బయలుదేరాం. ఇదే అనుభూతి మరోసారి కలిగే అవకాశానికి ‘కరోనా’ వల్ల బ్రేక్ పడింది.

ఆత్మీయ సమ్మేళనంలో పాటలు పాడుతున్న ఇంటర్మీడియట్ మిత్రుడు శ్యామ్ కుమార్ (నిజామాబాద్)
సహాధ్యాయని శ్రీమతి లీలా శ్యామ్ కుమార్ (నిజామాబాద్)

మళ్ళీ ఆ అవకాశం కోసం అందరం ఎదురు చూస్తూనే వున్నాం.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here