[dropcap]మీ[/dropcap]రు తెలుగు మీడియమా? అయితే ఇది మీ కోసమే. ఇకపై మీరు మాతృభాషలాగా ఇంగ్లీష్ మాట్లాడగలరు. MNC జాబ్ తెచ్చుకోగలరు.
~
ఆ రోజటి క్లాసుకు అందరూ చాలా ఉత్సాహంగా వచ్చారు.
క్లీన్‌గా షేవ్ చేసుకుని, ఫార్మల్ డ్రస్సులో, నిగనిగలాడేలా పాలిష్ చేసిన షూస్, టై – ఇలా ఏదో కార్పొరేట్ ఈవెంట్‌కి అటెండ్ అవుతున్న డెలిగేట్స్ లాగా వచ్చారు.
గత కొన్ని రోజులుగా ఈ కుర్రాళ్ళ హడావుడి చూస్తున్న వారి వారి కుటుంబ సభ్యులందరికీ వినోదంగా ఉంది. వారికి అర్థమవుతోంది సంతోష్ వారందరిలో చాలా మార్పులు తీసుకురాబోతున్నాడని. సంతోష్ పెట్టిన నిబంధన ప్రకారం ఆ కుర్రాళ్ళందరూ తమ ఇంట్లో వాళ్లతో అయితేనేమి, ఫ్రెండ్స్ తో అయితే నేమి, అందరితో కేవలం ఇంగ్లీషే మాట్లాడటం ప్రారంభించేశారు. క్లాసుకు వచ్చేటప్పుడు అందరూ కూడా ఫార్మల్ డ్రస్సులు వేసుకుని, క్లీన్‌గా షేవింగ్ చేసుకుని, షూస్‍ని నల్లగా నిగనిగలాడేలా పాలిష్ చేసుకుని మరీ వస్తున్నారు.
ఒక్క మంచి ట్రెయినర్ వల్ల వ్యక్తులలో ఎంత మార్పు వస్తోందో అందరికీ అర్థం అవుతోంది.
బూట్ క్యాంపు రెండవ రోజు
ఆ రోజు క్లాసు ప్రారంభం అవ్వటమే చాలా ఉత్సాహంగా కోలాహలంగా ప్రారంభం అయింది.
క్రితం రోజు క్లాసు వదిలే ముందు చెప్పాడు సంతోష్ “రేపు అందరూ కూడా మానసికంగా సిద్ధం అయి రావాలి. మిమ్మల్ని అందర్నీ ఎక్కడికో తీసుకువెళాతాను. ఎక్కడికి ఏమిటి అన్న విషయంలో మీరు ఎన్ని అంచనాలు అయినా పెట్టుకుని రండి, మీ అంచనాలని మించి మీరు బెనిఫిట్ పొందబోతున్నారు” అని చెప్పి పెట్టాడు.
సంతోష్ అలా ప్రకటించి ఉండటంతో వారంతా చాలా ఎక్సైట్ అయ్యారు.
వారు రకరకాలుగా ఊహించుకున్నారు. ఏదైనా పిక్నిక్ లాగా తీస్కువెళతాడేమో అని కొందరు, వీడియో వేసి ఏదైనా కొత్త సిటీ చూపిస్తాడేమో అని కొందరు, ఏదయినా కార్పొరేట్ కంపెనీకి తీసుకువెళతాడేమో అని కొందరూ ఇలా ఎవరికి తోచిన విధంగా వారు ఊహించుకున్నారు.
మొత్తం మీద అందరిలో ఆసక్తి రేకెత్తించడంలో సక్సెస్ అయ్యాడు సంతోష్.
సంతోష్ ఇచ్చిన సూచనకి అనుగుణంగా అందరూ ఒక పదిహేను నిమిషాల ముందరే వచ్చి చేరుకున్నారు క్లాసుకి.
మొదట వారిని ఆకట్టుకున్న అంశం కుర్చీల అరెంజ్‍మెంట్. రోజు కుర్చీలు, క్లాసురూంలో లాగా మామూలు ఒకదాని వెంబడి వేసి ఉంటాయి ఆరేడు వరుసలుగా, కానీ ఆ రోజు అలా కాకుండా, ఆ గదిలో గోడల వెంబడి U షేప్ లో కాన్ఫరెన్స్ హాలులో లాగా, మధ్యలో ఖాళీ వదిలేసి, కుర్చీలు అమర్చబడ్డాయి.
కుర్చీ కుర్చీకి మధ్య తగినంత ఖాళీ స్థలం వదలబడి ఉంది.
స్పీకర్లలోంచి మెల్లిగా ఫ్లూట్ సంగీతం వినిపిస్తోంది. వైట్ బోర్డు పై ‘వెల్‍కం ఇన్‍టు ది వర్ల్డ్ ఆఫ్ సక్సెస్’ అని చక్కగా ఇంగ్లీష్ లో వ్రాయబడి ఉంది.
“మీ బ్యాగులు, పుస్తకాలు, హెల్మెట్లు అన్నీ కప్ బోర్డులో పెట్టేసి ప్రశాంతంగా కూర్చోండి” రాజు ప్రకటించాడు.
అందరూ తమ తమ కుర్చీలలో కూర్చున్న తరువాత స్పీకర్లలోంచి వస్తున్న వాయిద్యం తాలూకు వాల్యూం తగ్గించి, గొంతు సవరించుకుని చెప్పటం మొదలెట్టాడు సంతోష్
“మనం నిన్నటి క్లాసులో నాలుగు ప్రధానమైన విషయాలు నేర్చుకున్నాము. అవి ఏమిటి అంటే
- ఉత్సాహం
- విజువలైజేషన్
- పాజిటివ్ సెల్ఫ్ అఫర్మెషన్స్
- మన గోల్స్‌ని ఉత్సాహంతో, విజువల్ లాంగ్వేజీ ద్వారా పాజిటివ్ సెల్ఫ్ అఫర్మెషన్స్‌తో మన సబ్‌కాన్షస్ మైండ్‌లో నింపుకోవటం
మీరు పదే పదే ఏదనుకుంటే అదే అవుతుంది.
‘ఏదైనా స్కిల్ నాకు రాదు, నాకు రాదు అనుకుంటే మీ సబ్‌కాన్షస్ మైండ్ అది నిజమని నమ్మేస్తుంది. మీ సబ్‌కాన్షస్ మైండ్ చాలా శక్తి వంతమైనదే అయినప్పటికి దానికి లాజికల్ థింకింగ్ ఉండదు. మీరు ఏదైనా బలంగా అనుకుంటే అది నిజం అనుకుంటుంది.
“నేను తెలుగు మీడియంలో చదువుకున్నాను”
“నేను పెద్ద పెద్ద నగరాలలో చదువుకోలేదు”
“సిటీల్లో ఉండే విద్యార్థులు నన్ను సులభంగా అధిగమించేస్తారు”
ఇలా మీరు పదే పదే ఏమి ఆలోచిస్తారో దానికి అనుగుణంగానే మీ సబ్‌కాన్షస్ మైండ్ మిమ్మలి తీర్చి దిద్దుతుంది.
ఇంకో రకంగా చూద్దాం. రెగ్యులర్ పరీక్షలలో, పోటీ పరీక్షలలో, స్పోర్ట్స్‌లో, ఉద్యోగ ఇంటర్వూలలో, విజేతలుగా నిలిచిన వారిని మీరు పరిశీలిస్తే వారిలో ప్రత్యేకమైన లక్షణాలు ఏమీ ఉండవు. ఒక్కోసారి వారిని చూసి మీరు ఆశ్చర్యపోతారు ‘అరె, చూడ్డానికి చాలా సామాన్యంగా ఉన్నాడే, ఇంత పెద్ద విజయం ఎలా సాధించాడబ్బా’ అని కూడా అనుకుని ఉంటారు వారిని చూసి.
‘మీ జీవితం మీ నిర్ణయాలకు అనుగుణంగా రూపుదిద్దుకుంటుంది. మీరు ఏమి అవ్వాలి’ అని నిర్ణయం తీసుకుంటారో దానికి అనుగుణంగానే మీ జీవితం ఉంటుంది. ఏ నిర్ణయం తీసుకోలేదు అనుకోండి, గాలివాటుగా గుడ్దిగా సాగిపోతుంది జీవితం.
నేను విజేతనవ్వాలి అని కలకనడం ఒక ఎత్తు, నేను విజేతను అవ్వాలి నిర్ణయం తీసుకోవడం ఒకెత్తు.
విజయం అనేది ఒక నిర్ణయం అంతే. వేరే మాటలు లేవు. విజేతలు గెలవాలి అని నిర్ణయం తీసుకుంటారు. మిగతా అందరూ కేవలం కలలు కనటం దగ్గరే ఆగిపోతారు. మీరు ఎంత బలంగా నిర్ణయం తీసుకుంటారో అంత తీవ్రంగా మీ సబ్‌కాన్షస్ మైండ్ మీకు సహకరించటానికి సిద్దం అవుతుంది.
మీరు ఇప్పుడు ఉన్న స్థితికి మీరే కారకులు. ప్రస్తుతం మీరు ఉన్న స్థితి మీకు ఆనందం కలిగిస్తూ ఉన్నా, అశాంతి కలిగిస్తూ ఉన్నా, ఒకటి మాత్రం నిజం. గతంలో మీరు తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగానే మనం అందరం ప్రస్తుతం ఉన్న స్థితిలో ఉన్నాము.
మీరు గతంలో తీస్కున్న నిర్ణయాల కారణంగా ఈరోజు ఈ స్థితిలో ఉన్నారు. ఇవ్వాళ తీసుకోబోయే నిర్ణయాల అధారంగా మీ భవిష్యత్తు ఉండబోతోంది. ఇది అతి కీలకమైన విజయరహస్యం.
మీ కలల్ని, లక్ష్యాలని, గమ్యాలని ఒక క్రమపద్దతిలో మీ సబ్‌కాన్షస్ మైండ్‍లో ముద్రించటమే విజయానికి మొదటి మెట్టు. ఈ రోజు అదే చేయబోతున్నాము”
అందరూ ఆసక్తిగా వింటుండి పోయారు.
ఫీల్ గుడ్ ఫాక్టర్:
మనం ఇప్పుడు చిన్న మెంటల్ ఎక్సర్‍సైజ్ చేద్దాం.
కాసేపు కళ్ళు మూసుకుని ఒక శెలవు రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా మీరు టైం ఎలా గడిపారో గుర్తు తెచ్చుకోండి.
టీవీ చూస్తూ కూచోవటమో, వీడియో గేమ్ ఆడుతూ టైం స్పెండ్ చేయటమో, ఫ్రెండ్స్‌తో సోషల్ మీడియాలో చాట్ చేయటమో, సరదాగా క్రికెట్ ఆడటమో, అలా సాయంత్రం బయటికి వెళ్ళి ఫ్రెండ్స్‌తో ఏ ఐస్ క్రీం పార్లర్‍లోనో టైం స్పెండ్ చేయటమో చేసి ఉంటాము కద.
ఇవేవి చెడ్డవి కావు. కానీ అవే చేస్తూ ఉండి పోవటం నిస్సందేహంగా టైమ్ వేస్టే కద.
ఇలా టైం ఎందుకు వృథా చేస్తాము అని ప్రశ్నించుకుంటే ఒక విషయం తెలుస్తుంది. అదేమిటి అంటే, అలా చేస్తూ ఉంటే హాయిగా ఉంటుంది. దీన్నే ‘ఫీల్ గుడ్ ఫాక్టర్’ అని చెప్పుకోవచ్చు.
హాయిగా ఏ పని చేయకుండా ఇలా ఉంటే నాకు బాగుంటుంది అని మనం మనకు తెలియకుండానే మన సబ్‌కాన్షస్ మైండ్‌కి ట్రెయినింగ్ ఇచ్చామన్న మాట. అదే సబ్‌కాన్షస్ మైండ్‌కి మనం ఇంకో రకంగా శిక్షణ ఇవ్వవచ్చు.
అది ఎలాగంటే, మీరు మీ కలల్ని, గోల్స్‌ని పదే పదే మీ మనసు తెరపై ఒక సినిమా లాగా చూసుకోండి. అంటే మీరొక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అవ్వాలి అనుకుంటున్నారు అనుకుందాం. ఒక పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీలో మీరు పని చేస్తున్నట్టు, ఆ ఆఫీస్ వాతావరణాన్నీ, అక్కడి కార్పొరేట్ బిల్డింగ్‌ని, మీ చాంబర్‌ని, ఇతర కొలీగ్స్‌ని ఊహించుకోండి. మీ ఊహల్లో మీరే రారాజు. ఈ ఊహని ఒక సినిమాలాగా, మీ మనసు తెరపై వేసుకుని చూడండి. ఈ కలలో మీ మనసుని మొత్తం పాజిటివ్ థాట్స్‌తో నింపండి. మీరు హాయిగా కంప్యూటర్ ముందు కూర్చుని నవ్వు మొహంతో పని చెసుకుంటున్నారు, మీ కొలీగ్స్ అందరికీ మీరు తలలో నాలుక లాగా వ్యవహరిస్తున్నారు, మీ కొలీగ్స్ అందరూ మీ సలహా సంప్రదింపుల కొరకు ఎదురుచూస్తున్నారు. మీరు మాట్లాడుతూ ఉంటే అందరూ మంత్ర ముగ్ధులలాగా వింటుండి పోతుంటారు.
మీ వృత్తిలో మీరు విజయం మీద విజయం సాధిస్తున్నారు. ప్రమోషన్లు పొందుతున్నారు. విదేశాలకు ప్రాజెక్టుల మీద వెళ్తున్నారు. మీ విజయాలను చూసి అబ్బురపడి మిమ్మల్ని టీవీ చానెల్స్ వాళ్ళు ఇంటర్వ్యు చేస్తున్నారు. సాప్ట్‌వేర్ జాబ్ తెచ్చుకోవాలని ఆశించే యువతకి మీరు గైడెన్స్ ఇస్తున్నారు. మీరు స్టేజి పై నిలబడి, మైకందుకుని ఉపన్యాసం ఇస్తున్నారు. మీ ప్రెజెంటేషన్ వినటానికి ఒక ఫుట్‍బాల్ స్టేడియం లాంటి పెద్ద ఆడిటోరియం నిండా కూర్చుని వేలాది మంది మీ ప్రసంగం వింటున్నారు. స్టేజి పై ఉన్న తెరపై పెద్ద సైజులో వీడియో రూపంలో ప్రసంగం ఇస్తున్న మీరు డిస్‍ప్లే అవుతున్నారు. ఉండుండి ప్రేక్షకులు కరతాళ ధ్వనులతో స్టేడియంని దద్దరిల్లింపజేస్తున్నారు.
ఇలా ఎల్లలు అన్నవి ఎరుగని మీ ఊహాప్రపంచానికి మీరు రారాజు. ఇలా ఊహలు సాగనివ్వండి. మీరు జీవితంలో ఏమి సాధించాలి అని అనుకుంటున్నారో, ఆ కలలన్నీ వీలయినంత వివరంగా మీ మనసు తెరపై ఒక సినిమా లాగా వేసి చూసుకోండి.
ఇలా కలలు కంటూ ఉంటే ఎలా ఉంది. మనసుకు ఆనందంగా ఉంది కద. ఇది నిజమైన ఫీల్ గుడ్ ఫాక్టర్. మీ మనసుకు మీరు ఇలాంటి శిక్షణ ఇవ్వాలి. మీ మనస్సు విశ్రాంతి కోరినప్పుడల్లా, వృథాగా టైం వేస్ట్ చేయాలి అని అనిపించినప్పుడల్లా, ఇప్పుడు నేను వేస్ట్ చేసే ఈ టైం నా నిజమైన ఫీల్ గుడ్ ఫాక్టర్‌కి నన్ను దూరం చేస్తుంది అని గుర్తు తెచ్చుకోండి. నా నిజమైన ఫీల్ గుడ్ ఫాక్టర్ నా కలల్ని నిజం చేసుకున్నప్పుడు లభిస్తుంది. అప్పటిదాకా నేను క్రమ శిక్షణతో నా జీవితాన్ని గడుపుతాను. అనసరంగా టైం వృథా చేసుకోను అని మీకు మీరు చెప్పుకోండి.
“ఈ రోజు మనం ప్రధానంగా రెండు ఆక్టివిటీస్ చేయబోతున్నాము. రెండిటికి రెండూ చాలా ముఖ్యమైనవే.
- మీ సబ్‌కాన్షస్ మైండ్‌లో మీ కలల్ని, లక్ష్యాలని, గమ్యాలని ఒక క్రమపద్దతిలో ముద్రించబోతున్నాము.
- పాజిటివ్ అఫర్మేషన్స్‌ని ఎలా సాధన చేయాలా అని తెలుసుకోబోతున్నాము.
అందరూ సిద్దమేనా?, గట్టిగా మీ సమాధానం చెప్పాలి”
అందరూ ముక్త కంఠంతో “సిధ్ధమే” అని అరిచి చెప్పారు.
“వెరీ గుడ్. ఇప్పుడు నేను మీ అందరికి ఒక చిన్న ప్రశ్న పత్రం ఇస్తాను. అది మీరు పూర్తి చేసిన తర్వాత మనం ఈవేళ్టి ఆక్టివిటీస్ మొదలెడదాం” అని ప్రకటించి అందరి చేతిలో ఒక ప్రశ్న పత్రం ఉంచాడు. అందులో కేవలం పది ప్రశ్నలు ఉన్నాయి.
ఆ ప్రశ్నలు ఇలా ఉన్నాయి.
- ఇంగ్లీష్ లాంగ్వేజ్‌ని మీ మాతృభాషలా సునాయాసంగా మాట్లాడలనుకుంటున్నారా?
- కమ్యూనికేషన్ స్కిల్స్‌పై పూర్తి పట్టు సాధించాలనుకుంటున్నారా?
- మీరు ఎన్నుకున్న రంగంలో నెంబర్ వన్ అవ్వాలి అనుకుంటున్నారా?
- ఎప్పటికీ చెక్కు చెదరని మానసిక స్థైర్యం కావాలి అని కోరుకుంటున్నారా?
- మీ జీవితాన్ని ఉల్లాసంగా, ఉత్సాహంగా గడపాలి అనుకుంటున్నారా?
- మీ కలలనీ నిజం చేసుకోవాలనుకుంటున్నారా?
- ఏ చీకు చింత లేని ప్రశాంతమయిన జీవితాన్ని కోరుకుంటున్నారా?
- అడ్వంచరస్ స్పోర్ట్స్ ఆడుతూ, ఆటపాటలతో జీవితాన్ని ఒక ఆట లాగా గడిపేయలనుందా?
- ఏ బలహీనతలకు లోను కాని స్థిరమైన వ్యక్తిత్వం మీ స్వంతమవ్వాలనుకుంటున్నారా?
- అందర్నీ ఆకర్షించే (కరిష్మాటిక్) వ్యక్తిగా ఎదగాలనుకుంటున్నారా?
ఈ ప్రశ్నలలో ఏ ఒక్క దానికైనా “అవును” అని సమాధానం మీరు చెప్తే ఈ రోజటి కార్యక్రమం మీకు నిజంగా బాగా ఉపయోగ పడుతుంది.
“ఒక్కదానికి ఏమిటి సంతోష్! ప్రతి ప్రశ్నకు మా సమాధానం – అవును ” అని అరిచి చెప్పారు ఆ గదిలో ఉన్న కుర్రాళ్ళందరూ.
“కంగ్రాచ్యులేషన్స్ టు ది ఫ్యూచర్ విన్నర్స్” అని సంతోష్ అందరిని అభినందించాడు.
అందరినీ ఒకసారి నిలబడమని చెప్పాడు. “ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విని నేను చెప్పినట్టు పాటించండి. ప్రతి ఒక్కరు మీకు అటు పక్కన ఉన్నవ్యక్తికి , ఇటు పక్క ఉన్న వ్యక్తికి కుడిచేయి గాలిలో లేపి, “హై ఫైవ్” (మీ కుడి చేత్తో, పక్క వారి కుడిచేతిపై) గట్టిగా చప్పుడు వచ్చేలా కొడుతూ “కంగ్రాచ్యులేషన్స్ ఇన్ అడ్వాన్స్” అని అరిచి చెప్పండి”.
గది అంతా కాసేపు “హై ఫైవ్”’ తాలూకు చప్పుళ్ళతోనూ, “కంగ్రాచ్యులేషన్స్” అన్న మాటలతోనూ మారు మ్రోగిపోయింది.
కాసేపయ్యాక, “సైలెన్స్” గట్టిగా అరిచి అందరినీ శాంతింపజేశాడు సంతోష్. “ఇప్పుడు నేను చెప్పేది వినండి. మీ రెండు పక్కలనున్న వారికి “హై ఫైవ్” ఇవ్వటం అయింది కద. వెరీ గుడ్. ఇప్పుడు మీరేమి చేస్తారంటే, మీరున్న చోటు నుంచి కదిలి, ఈ గది అంతటినీ తిరుగుతూ, ఈ గదిలో ఉన్నఅందరితో ఇదే విధంగా “హై ఫైవ్” ఇస్తూ, “కంగ్రాచ్యులేషన్స్ ఇన్ అడ్వాన్స్” అని అరిచి చెప్పండి. వీలయినంత మందికి హై ఫైవ్ కొట్టి చెపండి.” అని గట్టిగా అరిచి చెప్పాడు సంతోష్.
అంతే వారి ఉత్సాహం ఆకాశాన్ని అంటింది, కాసేపు అక్కడ ఒక పెద్ద పండగ వాతావరణమే నెలకొనింది.
ఒక అయిదు నిమిషాల తర్వాత, ఎవరిసీట్లలో వారిని స్థిమితంగా కూర్చోబెట్టేటప్పటికి సంతోష్ ఎంతో ప్రయాస పడాల్సి వచ్చింది.
ఆ గదినిండా ఉత్సాహమే, ఉల్లాసమే. ఎంతో పాజిటివ్ ఎనర్జీ వెల్లువలాగా ప్రవహిస్తోంది ఆ గదిలో. ప్రతి ఒక్కరి మనస్సులలో పూర్తి ఉత్సాహం, ఆనందం చోటు చేసుకున్నాయి. కొన్ని రోజుల క్రితం వరకు ఉన్న నిరాశ, నిస్పృహ ఎటో మాయమయి పోయాయి. ప్రతి ఒక్కరూ పూర్తి పాజిటివ్ ధృక్పథం (యాటిట్యూడ్) తో ఉన్నారు.
ఖచ్చితంగా విజయం సాధించి తీరతామని అందరికీ గట్టి నమ్మకం ఏర్పడిపోయింది.
“మైడియర్ ఫ్రెండ్స్, మనం ఏదైనా పనిలో నూటికి నూరు శాతం విజయం సాధించాలి అంటే మనకు ఉండాల్సింది ఇలాంటి ఉత్సాహమే. మనలో పూర్తిగా నిండిన ఈ పాజిటివ్ యాటిట్యూడ్‌ని ఎప్పటికీ కోల్పోకూడదు మనం.
ప్రతి రోజు, ప్రతి క్షణం మీలో ఈ ఉత్సాహం ఉంటే మీరు సాధించలేనిది ఏదీ లేదు. నేను స్టాప్ అని చెప్పే వరకు మీరు అందరు మీ కుర్చీలలోనే కూర్చుని గట్టిగా చప్పట్లు కొడుతూ ఉండండి” అని అందరినీ ఉత్సాహపరిచి తాను చప్పట్లు కొట్టటం ప్రారంభించాడు సంతోష్.
అంతే. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టడం ప్రారంభించారు.
ఆ గది ఉత్సాహానికి మారుపేరులా ఉంది. పాజిటివ్ ఎనర్జీకి కేంద్ర బిందువులాగా ఉంది ఆ క్లాసు వాతావరణం. సంతోష్, ఒక సరయిన నాయకుడిలా ఉత్సహానికి, శక్తికి, మారుపేరులా, ఇలా విజయోత్సహాలకు చిరునామాగా ఉండటం వారిలో కొత్త ఉత్సాహాన్నీ నింపుతోంది.
“ఓకే ఫ్రెండ్స్. మనం ఇక అసలు ఆక్టివిటీ మొదలు పెడదాం. అందరూ కాసేపు కళ్ళు ముసుకుని, ఈ స్పీకర్లలో వినిపిస్తున్న ప్రశాంతమైన మెడిటేషన్ మ్యూజిక్ వింటూ ఉండండి” అంటూ మెల్లిగా మెడిటేషన్‌కి అవసరమైన సంగీతం ప్రారంభించాడు సంతోష్.
మెల్లిగా మృదువైన కంఠస్వరంతో సంతోష్ చెబుతున్న మాటలు స్పీకర్లలోంచి తేలి వస్తున్నాయి. అతని కంఠ ధ్వని వింటేనే ఒక విధమైన ఆహ్లాదం కలుగుతోంది అందరికి.
“ఎవ్వరూ కూడా కళ్ళు తెరవద్దు. ప్రశాంతంగా అందరూ నా మాటల్ని శ్రద్ధగా వినండి. నేను చెప్పే మాటలని మీరు పాటించాలి.
అందరూ వేగంగా శ్వాస తిసి వదలండి. ఇలా ఒక అయిదు సార్లు దీర్ఘ శ్వాస తీసి వదులండి.”
అలా అందరూ దీర్ఘ శ్వాస తీసి వదిలిన తర్వాత, కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయాడు సంతోష్.
స్పీకర్లలోంచి ప్రశాంతంగా మెడిటేషన్ మ్యూజిక్ వస్తోంది.
కాసేపటి తర్వాత, స్పీకర్ల లోంచి మంద్రంగా సంతోష్ కంఠధ్వని వినిపించసాగింది.
“మొదట అందరూ దీర్ఘ శ్వాస తీసుకోండి. వీలయినంత దీర్ఘ శ్వాస తీసుకోండి. ఈ దీర్ఘ శ్వాసలోని ఊపిరితో మీలోకి కొత్త శక్తి ప్రవేశిస్తున్నట్టు ఊహించుకోండి.
పాజిటివిటీ ఇన్ న్ న్ న్ న్ న్ న్ న్ న్…… అన్న మాటని ఉచ్చరిస్తూ ఊపిరి లోపలికి తీసుకోండి. ఇక ఏమాత్రం ఊపిరి తీసుకోలేము అన్నపాయింట్ దగ్గర ఆగి పోండి, ఏమి ఫర్వాలేదు. ఇప్పుడు ఆ పీల్చుకున్న ఊపిరిని బిగబట్టి ఉంచండి.
మీ శరీరం అంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిఉన్నట్టు ఊహించుకోండి.
ఆ తర్వాత నెమ్మదిగా ఊపిరి వదుల్తూ ‘నాలోని నెగెటివిటీ వెళ్ళిపోతోంది’ అన్న మాటల్ని మనసులో అనుకోండి.
తిరిగి మరొక సారి దీర్ఘ శ్వాస తిసుకోండి.
వీలయినంత దీర్ఘ శ్వాస తీసుకోండి. ఈ దీర్ఘ శ్వాసలోని ఊపిరితో మీలోకి కొత్త శక్తి ప్రవేశిస్తున్నట్టు ఊహించుకోండి.
పాజిటివిటీ ఇన్ న్ న్ న్ న్ న్ న్ న్ న్…… అన్న మాటని ఉచ్చరిస్తూ ఊపిరి లోపలికి తీసుకోండి. ఇక ఏమాత్రం ఊపిరి తీసుకోలేము అన్నపాయింట్ దగ్గర ఆగి పోండి, ఏమి ఫర్వాలేదు. ఇప్పుడు ఆ పీల్చుకున్న ఊపిరిని బిగబట్టి ఉంచండి.
మీ శరీరం అంతా పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉన్నట్టు ఊహించుకోండి.
ఆ తర్వాత నెమ్మదిగా ఊపిరి వదుల్తూ ‘నాలోని నెగెటివిటీ వెళ్ళిపోతోంది’ అన్న మాటల్ని మనసులో అనుకోండి.”
ఇలా ఓ అయిదారు సార్లు చేసిన పిమ్మట మరలా కాసేపు సంతోష్ నిశ్శబ్దంగా ఉండిపోయాడు.
“మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెబుతున్న మాటలని శ్రద్ధగా వినండి.
ఒక ఫైవ్ స్టార్ హోటల్లో అది బాంకెట్ హాల్. అక్కడొక పార్టీ జరుగుతోంది. చాలా విశాలమైన హాలు అది. వందలాది మంది గెస్ట్స్ పిలవబడ్డారు. ప్రతి నలుగురికి ఒక రౌండ్ టేబుల్, దానిపై తెల్లటి క్లాత్, టేబుల్ మధ్యలో ఫ్లవర్ వేజ్, అందులో ఎర్ర గులాబీ. ఇలాంటి రౌండ్ టేబుల్స్ వందలాది అమర్చబడి ఉన్నాయి ఆ విశాలమైన హాలులో.
మంద్రమయిన ధ్వనిలో సంగీతం వినిపిస్తోంది.
మీరు వేదిక మీద కూర్చుని ఉన్నారు. అవును మీరే ఆ పార్టీకి హోస్ట్.
మీరు కలలు కన్న ఉద్యోగం మీ స్వంతం అయిన సందర్భంగా మీరు ఇస్తున్న పార్టీ అది. ఆ పార్టీకి మీ దగ్గరి వారందరినీ మీరు ఆహ్వానించారు.
స్టేజి మీద మీ పక్కన వరుసగా అయిదు కుర్చీలు వేసి ఉన్నాయి.
ఒకసారి వేదిక మీద ఉన్న మిమ్మల్ని మీరు చక్కగా ఊహించుకోండి. చక్కగా హుందాగా చాలా ఖరీదైన దుస్తులు ధరించి ఉన్నారు మీరు. చూడగానే ఎవరికైన అర్థం అయిపోతుంది మీరు జీవితంలో చక్కటి స్థిరత్వం సాధించారని.
మీ ముఖముపై కొట్టవచ్చినట్టు కనిపిస్తున్న తృప్తి, ఆత్మ విశ్వాసం. ఒక విజేత మొహంలో కనిపించే తాలూకు విజయగర్వం మీ వదనంపై కనిపిస్తోంది. తృప్తితో కూడిన చిరునవ్వు మీ వదనానికి కొత్త అందాన్ని ఇస్తోంది.
మీతో బాటుగా స్టేజిపై మరో అయిదుగురు కూర్చున్నారు. వారెవరంటే
- మీ కుటుంబ సభ్యులలో ఒకరు
- మీ దగ్గరి స్నేహితుడు ఒకరు
- మీ బంధువులలో ఒకరు
- మీ కాలేజి లెక్చరర్లలో ఒకరు
- మీ కాలనీలోని సభ్యులలో ఒకరు
వారిలో ఒకరి తర్వాత ఒకరు వేదిక మీద ఉన్న మైకందుకుని, మీతో వారికున్న అనుబంధం గూర్చి, మీరు సాధించిన విజయం గూర్చి మాట్లాడుతున్నారు.
మీ గురించి వారు చెపుతున్న మాటలని ఆడియెన్స్ శ్రద్ధగా వింటున్నారు. వక్తలు ఒక్కొక్కరే మైకు తీస్కుని మీ గురించి గొప్పగా చెబుతున్నారు. మీరు ఎంత కష్టపడి ఈ విజయం అందుకున్నారో వారు మైకులో చెపుతున్నారు. మీలోని మంచి గుణాలన్నీ వారు ఏకరువు పెడ్తున్నారు. మీలో వారికి నచ్చిన గుణాలని చెప్పి మిమ్మల్ని అభినందిస్తున్నారు. మిమ్మల్ని ప్రతి ఒక్కరూ ప్రేరణగా తీసుకోవాలని వారు శ్రోతలకు ఉద్భోద చేస్తున్నారు.
వారి మాటలకు శ్రోతలు అందరు కరతాళ ధ్వనులతో తమ హర్షధ్వానాలు తెలియజేస్తున్నారు.
మైడియర్ ఫ్రెండ్స్, ఆ మైకులో మాట్లాడుతున్న పెద్దలు మీ గురించి ఏమి మాట్లాడాలి అని మీరు ఆశిస్తున్నారో ఒక్కసారి ఊహించుకోండి. మీ విజయం గూర్చి వారు ఏమి మాట్లాడాలి అని మీరునుకుంటున్నారు, మీరు సాధించిన ప్రగతి గూర్చి వారు ఏమి మాట్లాడాలని మిరు అనుకుంటున్నారు? అదే మీ గోల్.
దానికి అనుగుణంగా ఈ వేళ్టి నుంచి మీరు జీవించడం ప్రారంభించండి.
ఈ కలని పదే పదే మీ మనసు తెరపై ముద్రించుకోండి. ప్రతీ రోజూ కనీసం మూడు సార్లు ఈ కలని ఊహించుకోండి. అదే మీ అసలైన గమ్యం. అదే మీ అసలైన లక్ష్యం.
మీ ఊహా శక్తి మేరకు ఈ కలని పొడిగిస్తూ వెళ్ళవచ్చు.
ఒక పదేళ్ళ తర్వాత మీ జీవితం ఎలా ఉండాలి అని అనుకుంటున్నారు?
మీరు రిటైర్ అయి మీ బాధ్యతలు మీ పిల్లలకు అప్పజెప్పబడిన తర్వాత, ఇలాంటి మీటింగ్‌లో ఎలాంటి మాటలు వినాలని మీరు అనుకుంటున్నారు?
దీనినే స్టిఫెన్ ఆర్ కవీ వ్రాసిన ‘7 హాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్’ అనే పుస్తకంలో దీనినే ‘బిగిన్ విత్ ఎండ్ ఇన్ ది మైండ్’ అని చెప్తారు.
ఇప్పుడు మీరు ప్రశాంతంగా మీ పార్టీని, మీ ప్రధాన వక్తల ఉపన్యాసాలనీ ఊహించుకోండి.”
అంటూ సంతోష్ తిరిగి మంద్రంగా సంగీతం ఆన్ చేశాడు స్పీకర్లలో.
చాలా నెమ్మదిగా వినిపిస్తున్న సంగీతం నేపధ్యంలో క్లాసులోని అందరూ కళ్ళు మూసుకుని తమ భవిష్యత్తుని, గోల్స్ ని ఊహించుకోసాగారు.
ఇలా ఒక పది నిమిషాలు సాగింది.
కాసేపటి తర్వాత, మైకులో ఇలా చెప్పాడు సంతోష్ “మై డియర్ ఫ్రెండ్స్, మీకు మీ భవిష్యత్తు ఎలా ఉండాలి అన్న అంశం మీద ఒక స్పష్టమైన అవగాహన వచ్చిందనుకుంటాను.
ఇప్పుడు మీరు మీ అరచేతులను దగ్గరగా తెచ్చి బాగా రాపిడి కలిగించండి. వెచ్చగా ఉన్న మీ అరచేతులను మూసిన మీ కండ్ల మీద పెట్టుకుని నెమ్మదిగా మీ కండ్లు తెరవండి. ఆ తరువాత మీ అరచేతులను నెమ్మది నెమ్మదిగా తొలగిస్తూ, తిరిగి వర్క్‌షాప్ వాతావరణంలోకి వచ్చేయండి.”
అందరూ ఆ సూచనలని పాటించి ఈ లోకంలోకి వచ్చారు.
అందరి వంకా చూస్తూ చిరునవ్వుతో అడిగాడు సంతోష్ “ఎలా ఉంది ఈ డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్?”
వారందరూ తమ అభిప్రాయాలు తెలపటానికి పోటీలు పడ్డారు. అందరిలోనూ గట్లు తెగిన నదిలా ఉత్సాహం ఉరకలెత్తుతోంది. అందరు చెప్పిన దాని సారాంశం ఒక్కటే
“మా విజయాన్ని నిజంగానే అందుకున్నట్టు, నిజంగానే అలా మేము ఫైవ్ స్టార్ హోటల్లో అలా పార్టీ ఇచ్చినట్టు, మా కుటుంబ సభ్యులు అందరూ నిజంగానే మాతో మా ఉత్సాహాన్ని పంచుకున్నట్టు ఊహించుకున్నాము. అది అసలు ఊహ కాదని నిజంగా జరిగిందన్న అనుభూతి కలిగింది. ఇంత చక్కటి అనుభూతి మాకు కలగజేసినందుకు మీకు ఎలా కృతఙ్జతలు తెలియజేయాలో అర్థం కావటం లేదు”
ఇంచుమించు అందరి నోటా ఇదేమాట.
“వెరీ గుడ్ మైడియర్ ఫ్రెండ్స్. నేను చెప్పదలచుకుంది కూడా ఇదే. నిజమైన ఫీల్ గుడ్ ఫాక్టర్ ఇదే అని ఎప్పుడైతే మీ సబ్‌కాన్షస్ మైండ్ తెలుసుకునిందో, మిమ్మల్ని ఆ గమ్యాన్ని చేర్చటానికి తన వంతుగా ఎటువంటి లోపం లేకుండా ఇక కృషి చేస్తుంది.
మీరు చేయవలసిందల్లా మీ గమ్యం ఏమిటి అన్నది స్పష్టంగా నిర్ణయించుకోవటం. ఇప్పుడు ఒక అయిదు నిమిషాలు బ్రేక్ తీసుకుందాము. ఆ తరువాత, సెల్ఫ్ అఫర్మేషన్స్ ఎలా ఇచ్చుకోవాలి అన్న ఆక్టివిటీ మొదలు పెడదాము” అని ప్రకటించి ఒక అయిదు నిమిషాలు బ్రేక్ ఇచ్చాడు సంతోష్.
***
బ్రేక్ తర్వాత అందరూ మళ్ళీ కొత్త ఉత్సాహంతో హాల్లో కూర్చున్నారు.
వేదిక మీద ఉన్న సంతోష్ వైట్ బోర్డ్ మీద ఇలా వ్రాశాడు
Success Mantras
English is Easy
English is Fun
I am lovable
I am capable
I am important
I can speak
I can win
ఇక్కడ వ్రాసిన ఈ చిన్ని చిన్ని వాక్యాలనే సెల్ఫ్ అఫర్మేషన్స్ అంటారు. సర్వ సాధారణంగా మనం వాడుక భాషలో వాడే పదాలతోనే మన సెల్ఫ్ అఫర్మెషన్స్ ఉండాలి.
ప్రస్తుతం మన అందరి గమ్యం ఈజీగా ఇంగ్లీష్‌లో మాట్లాడటం కనుక దానికి అనుగుణంగా ఈ సెల్ఫ్ అఫర్మేషన్స్‌ని వ్రాసుకోవడం జరిగింది.
ఇలా ఎన్ని సెల్ఫ్ అఫర్మేషన్స్ అయినా మీరు తయారు చేసుకోవచ్చు. సెల్ఫ్ అఫర్మేషన్స్‌ని తయారు చేసుకోవడంలో మిరు పాటించాల్సిన నియమాలు కింద ఇస్తున్నాను.
- మనం సర్వ సాధారణంగా మాట్లాడే పదాలతోనే సెల్ఫ్ అఫర్మేషన్స్ ఉండాలి
- ఇవి ఖచ్చితంగా మన విజయానికి తోడ్పడేలాగా ఉండాలి
- మనం ఏదయితే గమ్యాన్ని చేరుకోవాలి అని అనుకుంటున్నామో, దానికి అనుగుణంగా మన సెల్ఫ్ అఫర్మేషన్స్ ఉండాలి
- మీ ప్రతి అఫర్మేషన్‌తో స్పష్టమైన దృశ్యం మీ మనసు తెరపైకి రావాలి
ఇప్పుడు పైన చెప్పిన ఒక్కొక్క అఫర్మేషన్ గూర్చి చెప్పుకుందాము.
మొదటి సారిగా ఈ అఫర్మేషన్స్ చెప్పుకునేటప్పుడు, ప్రశాంతంగా కండ్లు మూసుకుని కూర్చుని, అయిదు సార్లు దీర్ఘంగా శ్వాస తీసి వదిలి, మీ మనసును ఆహ్లాదంగా ఉంచుకున్న పిమ్మట ఒక్కొక్క అఫర్మేషన్‌ని ప్రశాంతంగా మనసులోనే ఉచ్చరిస్తూ, దానికి అనుగుణంగా దృశ్యాన్ని ఊహిస్తూ, ఆ లోకంలో కాసేపు ఉండి పోండి.
1) English is Easy:
ఇది మీ మొదటి అఫర్మేషన్.
ఈ మాట చెప్పేటప్పుడు, మీ మనసు తెరపై మీరు ఇంగ్లీష్ అనర్ఘళంగా సునాయాసంగా మాట్లాడుతున్నట్టు దృశ్యం ఊహించుకోండి.
ఎటువంటి తడబాటు లేకుండా, హాయిగా అహ్లాదంగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నట్టు, అందరూ మీ మాటల్ని శ్రద్దగా వింటున్నట్టు, మిమ్మల్ని అభినందిస్తున్నట్టు, చక్కగా మీరు అందరితో కమ్యూనికేట్ చేస్తున్నట్టు ఊహించుకోండి. ఎంత స్పష్టంగా వీలయితే అంత స్పష్టంగా దృశ్యం ఊహించుకోండి.
మీరు వేసుకున్న దుస్తులు, మీ చుట్టు పక్కల ఉన్న వాతావరణం, మీ చుట్టు పక్కల ఉన్న వారి హావభావాలు, మీ చుట్టూ ఉన్న వస్తువల రంగు, వాటి నిర్మాణం ఇలా ఎంత స్పష్టంగా వీలయితే అంత స్పష్టంగా ఊహించుకోండి.
ఒక్కో అఫర్మేషన్ ఇచ్చుకున్నాక, ఆ ఊహలో కాసేపు ఉండి పొండి, ప్రశాంతంగా ఊపిరి పీల్చి, వదులుతూ ఆ ఊహలోనే కాలాన్ని గడపండి కాసేపు
2) English is Fun:
ఇది మీ రెండో అఫర్మేషన్.
మీరు ఉల్లాసంగా ఇంగ్లీష్‌లో మాట్లాడుతూమీ టీమ్ మేట్స్‌ని, మీ చుట్టు పక్కల ఉన్న వారిని నవ్విస్తూ, మీరు నవ్వుతూ ఆనందంగా గడిపేస్తున్నారు. ఆఫీసులో హాయిగా పనిచేస్తూ, ఇంగ్లీష్‌లో హాయిగా మాట్లాడేస్తున్నారు. మీ చుట్టుపక్కల వాతావరణాన్ని తేలిక పరుస్తూ, పాజిటివ్ వైబ్రేషన్స్‌ని క్రియేట్ చేస్తూ అందరూ మీ ప్రెజన్స్‌ని ఇష్టపడేలా ఆక్టివ్‌గా ఉన్నారు, ఈ దృశ్యంలో.
ఇందాక చెప్పినట్టు, ఎంత వీలయితే అంత స్పష్టంగా ఈ ఊహని మీ మనసు తెరపై ఒక సినిమా లాగా వేసుకోండి
3) I am lovable
మీ రాక కొరకు అందరూ ఎదురు చూస్తు ఉంటారు. ఎక్కడకి వెళ్ళినా మీకు స్వాగత సత్కారాలు లభిస్తున్నాయి. మీరు ఒక పెద్ద సెలబ్రిటీ స్థాయి హోదా ఎంజాయ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో అయితేనేమి, మీ ఆఫీస్ సర్కిల్స్‌లో అయితేనేమి, మీ బంధు వర్గంలో అయితేనేమీ, మీ ఫ్రెండ్స్ సర్కిల్‌లో అయితే ఏమి, ఇలా ఎక్కడికి వెళ్ళినా అందరూ మిమ్మల్ని ప్రత్యేకంగా గుర్తించి, గౌరవిస్తున్నారు. మీకు అన్ని తెలుసు, మీకు ఇంగ్లీష్ బాగా వచ్చు అనే అభిప్రాయం అందరూ వ్యక్త పరుస్తున్నారు. అందరూ మీరంటె తెగ ఇష్టపడుతున్నారు. మీకు గొప్ప గుర్తింపు లభిస్తోంది.
ఇందాక చెప్పినట్టు, ఎంత వీలయితే అంత స్పష్టంగా ఈ ఊహని మీ మనసు తెరపై ఒక సినిమా లాగా వేసుకోండి
4) I am capable
ఫారిన్ డెలిగేట్లతో మాట్లాడటమేమిటి, వేదికనెక్కి ఉపన్యాసాలు ఇవ్వడం ఏమిటి ఇలా అన్ని పనులు మీరు సునాయాసంగా చేసుకోగలుగుతున్నారు. కంప్యూటర్ ముందు కూర్చుని చక్కగా అందరితో కమ్యూనికేట్ చేయగలుగుతున్నారు. ఈ మెయిల్ కమ్యూనికేషన్ సునాయాసంగా చేయగలుగుతున్నారు. మీ టీమ్‌కి లెటర్స్ ఇంగ్లీష్‌లో ఈజీగా వ్రాయగలుగుతున్నారు. మీరు వేగంగా ఇచ్చే డిక్టేషన్‌ని మీ సెక్రటరీ వేగంగా నోట్ చేసుకుంటూ మీ వంక ఆశ్చర్యంగా చూస్తున్నారు.
లెటర్స్, ఈమెయిల్స్, స్టేజ్ మీద నిలబడి పబ్లిక్ స్పీకింగ్, లెటర్ డ్రాఫ్టింగ్ ఇలా అన్నీ సునాయాసంగా నిర్వహించుకోగలుగుతున్నారు.
ఈ ఊహని ఎంత వీలయితే అంత స్పష్టంగా ఈ ఊహని మీ మనసు తెరపై ఒక సినిమా లాగా వేసుకోండి. ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు మీ మనసు తెరపై ఈ దృశ్యాన్ని చూసుకోండి
5) I am important
మీ ఇంగ్లీష్ స్కిల్స్ ఆధారంగా మీకు ప్రత్యేక గుర్తింపు లభిస్తోంది. మీరు కాంపిటీటివ్ పరీక్షలలో విజేతలుగా నిలిచారు. మీరు మీ ఉద్యోగ జీవితంలో అంచెలంచెలుగా ప్రమోషన్లు పొందుతున్నారు. ఏదయినా వేదిక మిద ఉపన్యాసం ఇవ్వాలి అంటే మీ ఆఫీసులో మీ పై అధికారులందరూ మీ పేరునే సూచిస్తున్నారు. మీరు మీ సర్కిల్స్‌లో ఒక ప్రత్యేక వ్యక్తిగా గుర్తింపు పొందుతున్నారు.
కీలకమైన హోదాలు మిమ్మల్ని వరించి వస్తున్నాయి.
ఈ ఊహని ఎంత వీలయితే అంత స్పష్టంగా ఈ ఊహని మీ మనసు తెరపై ఒక సినిమా లాగా వేసుకోండి. ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు మీ మనసు తెరపై ఈ దృశ్యాన్ని చూసుకోండి
6) I can speak
ఇంగ్లీషే మీ మాతృభాషేమో అన్నంత సునాయాసంగా మీరు ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నారు. హాయిగా ఎటువంటి తడబాటు లేకుండా మీ మిత్రులతో, మీ ఆఫీస్ కొలీగ్స్‌తో, మీ బంధువర్గంలో, మీరు మంచి వక్త అని పేరు తెచ్చుకున్నారు. మీ ఉద్యోగ జీవితంలో భాగంగా విదేశాలు వెళ్ళాల్సి వస్తుంది. ప్రపంచం అంతా తిరగుతున్నా మీకు ఎక్కడా కొత్త అనిపించటం లేదు. అందరితో ఇంగ్లీష్‌లో హాయిగా మాట్లాడగలుగుతున్నారు. మీ మాతృభాష ఇంగ్లీషా అని మిమ్మల్ని విదేశాల్లో అడుగుతున్నారు. మీరు అందరిని ఆశ్చర్య పరుస్తూ ఇంగ్లీష్‌లో సునాయాసంగా మాట్లాడుతున్నారు.
ఈ ఊహని ఎంత వీలయితే అంత స్పష్టంగా ఈ ఊహని మీ మనసు తెరపై ఒక సినిమా లాగా వేసుకోండి. ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు మీ మనసు తెరపై ఈ దృశ్యాన్ని చూసుకోండి
7) I can win
ఎక్కడికి వెళ్ళినా విజయం మీదే. ప్రతీ పోటీ పరీక్షలో విజేత మీరే. ఉద్యోగ ఇంటర్వ్యూలలో విజేత మీరు. గెలవటం అనేది మీకు ఒక అలవాటుగా మారిపోయింది. మీరు విజేతగా నిలవడమే కాదు, మీ తోటి వారిని కూడా విజేతలుగా ఎదిగేలా సాయపడుతున్నారు. మీరు ఉన్న టీం విజయానికి మారుపేరులా మారిపోయింది. మీ టీం అంతా మిమ్మల్ని తమ నాయకుడుగా భావిస్తున్నారు. మీరు అందరికీ తలలో నాలుకలాగా ఉన్నారు.
ఈ ఊహని ఎంత వీలయితే అంత స్పష్టంగా ఈ ఊహని మీ మనసు తెరపై ఒక సినిమా లాగా వేసుకోండి. ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు మీ మనసు తెరపై ఈ దృశ్యాన్ని చూసుకోండి
***
ఇలా పాజిటివ్ అఫర్మేషన్స్‌ని మొదటి సారిగా సాధన చేస్తున్నప్పుడు, ప్రశాంతమైన వాతావరణంలో హాయిగా కళ్ళు మూసుకుని నెమ్మదిగా శ్వాస పీల్చి వదులుతూ, హాయిగా ఈ ఊహల్ని మీ మనసు తెరపై ఒక సినిమా లాగా వేసుకుని ఆనందించండి.
ఎట్టి పరిస్థితులలోనూ మిమ్మల్ని మీరు అనుమానపడకండి.
ఈ అఫర్మేషన్స్ తాలూకు ఊహల్లో హీరో మీరే. మీ ఊహల్లో మిమ్మల్ని మీరు హీరోలాగా ఊహించుకుని ఈ దృశ్యాలని మీ మనసు తెరపె వేసుకుని సాధన చేయండి.
మొదటి సారి చేస్తున్నప్పుడు రోజుకు కనీసం మూడు సార్లు చేయండి. ఊదయాన్నే నిద్ర లేచిన తర్వాత, మధ్యహ్నం భోజనానంతరం, రాత్రి పడుకునే ముందు ఒకసారి.
ఆ తరువాత మీకు తీరిక దొరికినప్పుడల్లా ఈ సక్సెస్ మంత్రాలని మనసులో ఒక సారి నెమరు వేసుకోండి.
మీ జీవితంలో జరిగే మార్పులు చూసి మీ చుట్టుపక్కల వారు ఆశ్చర్యపోతారు.