[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా నీలమతపురాణం తరువాత అందిస్తున్న జోనరాజు, శ్రీవరుడు, ప్రజ్ఞాభట్టులు కల్హణుడి అడుగుజాడల్లో నడుస్తూ సంస్కృతంలో రచించిన ‘కశ్మీర రాజతరంగిణి’ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]
[dropcap]రెం[/dropcap]డవ తరంగంలో కల్హణుడు ఆరుగురు రాజుల 192 సంవత్సరాల పాలనను ప్రదర్శించాడు. క్రీ. పూ. 272 నుంచి క్రీ. పూ. 80 సంవత్సరం వరకు ఉన్న ఈ కాలంలో ఇద్దరు అత్యద్భుతమైన రాజుల ప్రస్తావన వస్తుంది. ఆ ఇద్దరు రాజుల గురించి విపులంగా, తెలుసుకుంటూ, మిగతా రాజులను స్పృశిస్తూ ముందుకు సాగాల్సి ఉంటుంది.
రెండవ తరంగం ఆరంభంలోనే వివాదాస్పదమైన శ్లోకం ఉంది.
అథ ప్రతాపాదిత్యాఖ్యసై రానీయా దిగన్తరాత।
విక్రమాదిత్య భూభర్తుర్ఞాతి రత్రాభ్య షిచ్యత॥
(కల్హణ రాజతరంగిణి 2.5)
రాజ్యం కోల్పోయిన అంధయుధిష్ఠిరుడు తిరిగి రాజ్యం పొందాలని తపన పడ్డా, అతని శ్రేయోభిలాషులు, బంధువులు అతడిని ఆపారు. అంధయుధిష్ఠిరుడు యుద్ధంలో రాజ్యం కోల్పోలేదు. అతడి చుట్టూ ఉన్న దుష్టులు రాజును మోసం చేసి దాడి చేయడంతో ప్రాణాలు అరచేత పట్టుకుని అంధయుధిష్ఠిరుడు సింహాసనం వదిలి పారిపోయాడు. దాంతో కశ్మీరు రాజు లేని రాజ్యం అయింది. అప్పుడు పెద్దలంతా కశ్మీరు కోసం రాజు విక్రమాదిత్యుడి బంధువైన ప్రతాపాదిత్యుడిని వేరే ప్రాంతం నుంచి తెచ్చి రాజుగా అభిషేకించారు.
ఇది కల్హణుడు రాసింది. ఇక్కడ ఒక అయోమయం కలిగించాడు చరిత్ర రచయితలలో. ఒక అనుమానం తొలగించాడు విశ్లేషణాత్మకంగా రాజతరంగిణి చదువుతున్నవారిలో.
కశ్మీరులో అశోకుడి ప్రస్తావన వచ్చినప్పుడు అతడిని మౌర్య అశోకుడిగా చరిత్ర నిర్మాతలు భావించటం పొరపాటేమోనన్న ఆలోచన కలిగింది. ఇప్పుడీ శ్లోకం చదివాకా కశ్మీర అశోకుడు, మౌర్య అశోకుడు వేర్వేరు అన్న ఆలోచన స్థిరపడుతుంది. ఎందుకంటే, ఈ శ్లోకంలో కల్హణుడు స్పష్టంగా చెప్తున్నాడు, ప్రతాపాదిత్యుడు కశ్మీరుకు చెందినవాడు కాడని. ఒకవేళ మౌర్య అశోకుడే కశ్మీరు వచ్చి రాజ్యం చేసి ఉంటే, ఆ విషయం కూడా కల్హణుడు స్పష్టంగా చెప్పి ఉండేవాడు. చెప్పలేదంటే అర్థం, ఆ అశోకుడు కశ్మీరువాడే అనీ, అతడికి మౌర్య అశోకుడికీ సంబంధం లేదనీ. ఇదే తర్కం మిహిరకులుడికి కూడా వర్తిస్తుంది. మిహిరకులుడు హుణుడయి, కశ్మీరుకు వచ్చి రాజ్యం చేసి ఉంటే ఆ విషయం కూడా కల్హణుడు స్పష్టంగా చెప్పి ఉండేవాడు. ఈ సందర్భంలోనే కాదు, మూడవ తరంగంలో కూడా ఉజ్జయినికి చెందిన హర్షుడు కశ్మీరుకు రాజు లేకపోవటంతో మాతృగుపుడిని కశ్మీరు రాజుగా పంపిన విషయం కల్హణుడు స్పష్టంగా ప్రస్తావించాడు. అంతేకాదు, ఇలాంటి సంఘటనలను ఎలాంటి దాపరికం లేకుండా స్పష్టంగా చెప్పాడు కల్హణుడు. కాబట్టి అశోకుడు, మిహిరకులుడు బయటి నుంచి వచ్చినవారైతే, కల్హణుడు ఆ విషయం కూడా నిర్మొహమాటంగా చెప్పి ఉండేవాడు. ఇప్పుడు ప్రతాపాదిత్యుడి విషయం కూడా చెప్పి, ఆ తరువాత ప్రతాపాదిత్యుడు ‘విక్రమార్కుడి బంధువు’ అన్న విషయంలో అప్పటికే తలెత్తిన్న అపోహలను ఖండించి నిజం స్పష్టం చేస్తాడు నిర్మొహమాటంగా.
శకారిర్విక్రమాదిత్య ఇతి సా భ్రమాశ్రితైః।
అన్యైరత్రోన్యథా లేఖి విసంవాది కదర్థితామ్॥
(కల్హణ రాజతరంగిణి 2.6)
విక్రమార్కుడి బంధువు అనగానే చరిత్ర రచయిత్రలు తమకు తెలిసిన విక్రమాదిత్యుడి కాలం, ప్రతాపాదిత్యుడు కాలంతో పోల్చారు. తేడా వచ్చింది. తేడా వస్తుంది. ఎందుకంటే, కల్హణుడు చెప్పిన విక్రమాదిత్యుడు క్రీ.పూ. 57కు చెందిన శకారి విక్రమాదిత్యుడు కాదు. ఈ విక్రమార్కుడిని శకులతో పోరాడిన విక్రమాదిత్యుడిగా భ్రమపడి పలువురు అలా తీర్మానించారు. ఇది పొరపాటు అని స్పష్టంగా చెప్పాడు కల్హణుడు. మరి ప్రతాపాదిత్యుడు ఏ విక్రమార్కుడి బంధువు? అన్న ప్రశ్న వస్తుంది. ఈ ప్రశ్నకు కోట వేంకటాచలం గారు, క్రీ.పూ. 457లో ఉజ్జయిని పాలించిన హర్ష విక్రమార్కుడి బంధువు అని బావించారు. ఈ విషయంలో ఏకాభిప్రాయం లేదు ఇంత వరకు. కానీ ఇక్కడ కూడా కల్హణుడు నిర్మొహమాటంగా అపోహలు, భ్రమలను ప్రస్తావించాడు. అది కాదు, ఇది అని స్పష్టంగా చెప్పాడు.
కశ్మీరు ప్రతాపాదిత్యుడి జన్మస్థలం కానప్పటికీ, అతడు ఆ భూభాగాన్ని ఒక భర్త తన భార్యను ప్రేమించినట్టు ప్రేమించాడు అని వ్యాఖ్యానించాడు కల్హణుడు. అలా 32 ఏళ్ళు రాజ్యం చేసిన తరువాత అతని కొడుకు జలౌకసుడు రాజయ్యాడు. అతడు కూడా తండ్రి లాగే 32 ఏళ్ళు రాజ్యం చేశాడు. అతడి తరువాత తుంజీనుడు రాజయ్యాడు. అతడి భార్య పేరు ‘వాక్పుష్ట’. ఈ ఇద్దరి గాథ అత్యద్భుతమైనది. భారతీయ రాజుల ధర్మనిష్ఠ, వారి ఆలోచనా విధానం, వారి గొప్పతనం ఈ ఇద్దరి జీవితం నిరూపిస్తుంది. వారి పాలనలో శివుడి జటాజూటం గంగ, చంద్రుడు వంటి వారితో అలంకృతమయినట్టు కశ్మీరు అలంకృతమయింది. ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలు అనుభవించారు.
ఇంతలో గడ్డు దినాలు ప్రాప్తించాయి.
పంటలు నాశనమయ్యాయి. అకాల మంచు తుఫానులతో పండిన పంటలు పాడయ్యాయి. ఆ కాలంలో మంచు పడే శబ్దం ప్రళయ కాలంలో సర్వం నాశనం చేసే శివుడి వికటాట్టహాసంలా ఉండేదట. పంటలు పండక పోవడంతో తిండి లేక ప్రజలు అల్లల్లాడిపోయారు. కరువు కాటకాలతో కశ్మీరం కంపించిపోయింది. ప్రజలు తిండితిప్పలు లేక మలమల మాడిపోయారు. తిండి కోసం వీధుల్లో పడ్డారు. వావి వరసలు మరిచి, బంధుత్వాలు విడిచి, ఎవరి ప్రాణాలు వారు కాపాడుకోవాలని పశువుల్లా ప్రవర్తించారు. ఒకరినొకరు పీక్కుని తిన్నారు.
ఈ పరిస్థితి రాజుని బాధించింది. తన దుష్కర్మ ఫలితం ఏదో తన ప్రజలను పట్టి పీడిస్తున్నదని రాజు బాధ పడ్డాడు. రాజు, రాణి ఖజానా మొత్తం ఖాళీ చేసి వీధి వీధి తిరిగి ఏ ఒక్కరినీ వదలకుండా అందరికీ ఆహారం అందించారు.
సపత్నీకో నిజై నిజైః కోశైదుహే సంచయైర్మంత్రి నాణామపి।
క్రీతాన్నః సదివారాత్రం ప్రాణినః సమజీవయత్॥
(కల్హణ రాజతరంగిణి 2.28)
తన భార్యతో కలిసి రాజ్యంలో ఉన్న ధనాన్నంతా, మంత్రులు, ఇత అధికారుల ధనంతో సహా, సర్వం ఖర్చు చేసి రాజు ప్రజలకు ఆహారాన్ని అందించాడు. మధ్యవర్తుల ప్రసక్తి లేకుండా తానూ, రాణి కలిసి వీధి వీధి తిరిగి, మూల మూలలా వెతికి మరీ ‘ఆకలి’ అని అలమటించే వ్యక్తి లేకుండా చేశారు.
ఇది ఒక అత్యద్భుతమైన ఘట్టం.
ఇలాంటి రాజులు భారతదేశ చరిత్రలోనే కనిపిస్తారు. భారతీయ రాజులు విలాసాల జీవితాలు గడిపేవారనీ, వారు ప్రజా ధనాన్ని దోచుకు తింటూ, ప్రజలను హింసించే వారనీ, పన్నుల భారంతో చంపేవారనీ పలు కథలు ప్రచారంలో ఉన్నాయి. కానీ భారతీయ రాజుల ప్రకృతి వేరు. వారు ప్రజలను కన్నబిడ్డలుగా పాలించేవారు. ప్రజలకు కష్టం కలగటం తమ కర్మల వల్ల అని బాధపడేవారు. కష్ట సమయంలో ప్రజలకు అండగా నిలిచేవారు అని రాజతరంగిణిలో పలు సంఘటనలు నిరూపిస్తాయి. అయితే ఎలాగయితే అందరూ ఉత్తములు కాలేరో, అందరూ అథములు కారు. ప్రతి చోటా మంచి చెడు ఉంటాయి. కానీ మంచిని దాచి చెడుకి మాత్రమే ప్రచారం ఇవ్వడం వల్ల ఒక జాతి జాతి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతుంది. తమ గతాన్ని చూసి సిగ్గుపడుతుంది. గర్వించదగ్గ ఉత్తములు తమ పూర్వీకులలో లేనేలేరని న్యూనతాభావానికి గురవుతుంది. తమ వారిని చీదరించుకుని పరాయివారిని అక్కున చేర్చుకుంటుంది. ఆదర్శంగా భావిస్తుంది. తనని తాను మరిచి, పరాయివాడిలా మారుతుంది. ఇలాంటి అనర్థం సంభవించకూడదనే, చరిత్రను, చరిత్రలో మంచిని జాతి జనులు మరువకూడదనే కల్హణుడు రాజతరంగిణిని రచించాడు.
రాజు ఖజానా ఖాళీ అయిపోయింది. రాజ్యంలో ధనం అయిపోయింది. ప్రజల ఆకలి మాత్రం తీరలేదు. ఆకలి అన్నది ఏ రోజు కారోజే. ఏ పూటకా పూటే. ఈ పూట కడుపు నిండా తింటే సరిపోదు, మరో పూట మళ్ళీ కావాలి. దాంతో మళ్ళీ రాజ్యంలో ఆకలి చావులు మొదలయ్యాయి. అప్పుడు రాజు బాధ వర్ణనాతీతం. చివరికి ప్రజల బాధ చూడలేక, ప్రజల ఆకలి తీర్చలేక, రాజు ప్రాణత్యాగం చేయాలనుకున్నాడు.
తదేష గలితోపాయో జుహోమి జ్వాలనే తనుమ్।
నతు దృష్ణ్టం సమర్థోస్మి ప్రజానం నాశమీదృశమ్॥
(కల్హణ రాజతరంగిణి 2.41)
ప్రజలకు ఆహారం అందించాలని శాయశక్తులా కృషి చేశాను. నా శక్తి అయిపోయింది. ఇప్పుడు నేను నిస్సహాయుడను. కాబట్టి ప్రాణత్యాగం చేస్తాను నా శరీరాన్ని అగ్నికి అర్పిస్తాను. నా ప్రజలు ఇలా అలమటిస్తూ నాశనమవటం నేను చూడలేను” అని బట్టతో ముఖం కప్పుకుని పడి ఏడుస్తాడు రాజు.
రాణి రాజుకు ధైర్యం చెప్తుంది. కష్ట కాలంలోనే ధైర్యంగా ఉండాలని బోధిస్తుంది.
పత్యాభక్తివ్రతం స్త్రీణామద్రోహో మంత్రాణం వ్రతమ్।
ప్రజాను పాలనేనన్య కర్మతో భూభృతాం వ్రతమ్॥
(కల్హణ రాజతరంగిణి 2.48)
పతి భక్తి స్త్రీ వ్రతం. రాజుకు విధేయత మంత్రుల కర్తవ్యం. ప్రజలను రక్షించటం తప్ప రాజుకు మరో కర్తవ్యం లేదు.
ఇలా రాజుకు ధైర్యం చెప్పి ప్రేరణనిస్తుంది రాణి. రాత్రంతా దైవ ప్రార్థన చేస్తుంది. తెల్లవారేసరికి ఆకాశం నుంచి పావురాల వర్షం కురుస్తుంది. ఇలా రోజు పావురాల వర్షం కురవటం వల్ల ప్రజలు ఆకలి తీర్చుకుని ప్రాణాలు కాపాడుకున్నారు.
“ఆకాశం నుండి పావురాల వర్షం కురవటమా? అబ్బే… ఇది పుక్కిటి పురాణం. నమ్మశక్యంగా లేదు. ఎక్కడయినా ఆకాశం నుంచి పావురాలు కురుస్తాయా? ఇది నమ్మేవారంతా మూర్ఖులు” అని ఆధునిక మేధావులు చీదరించి, ఛీత్కరించేందుకు తొందరపడకూడదు. ఆ తరువాత కల్హణుడు రాసిన రెండు శ్లోకాలు చదివిన తరువాత నోళ్ళు విప్పాలి.
వాస్త్యంతరం కిమపి తత్సాధ్వీమానం ససర్జసా।
జనతా జీవితా వాప్త్యై న కపోతాస్తు తే భవన్॥
తాదృశాం నహి నిర్వాజప్రాణి కారుణ్య శాలినామ్।
హింసయా ధర్మ చర్యాయాః శక్యం క్వాపి కలంకణమ్॥
(కల్హణ రాజతరంగిణి 2.52,53)
ఆకాశం నుంచి పావురాలు కురవటం అసంభవం కాబట్టి, ఆ ఉత్తమ వనిత మరేదో ఉపాయం చేసి ప్రజల ఆకలి తీర్చి ఉంటుంది. ఇలాంటి ఉత్తమమయిన వారి మనస్సులలో జాలి, కరుణ, ఇతర ప్రాణల పట్ల ప్రేమ ఉన్నవారు, ఇతర ప్రాణులను చంపి హింస ద్వారా ప్రాణాలు నిలుపుకునేట్టు చేయడం అన్నది అసంభవం. కాబట్టి, కాలక్రమేణా, జరిగిన ఒక సంఘటన చుట్టూ అల్లిన అద్భుతమైన కాల్పనిక గాథ అయి ఉండవచ్చని కల్హణుడే వ్యాఖ్యానించాడు. కానీ ఇలాంటి ఉత్తమ రాజుల గాథలు ప్రచారంలోకి వస్తే ప్రజల ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసాలను దెబ్బతీయటం కష్టం. అందుకని కల్హణుడు రాసిన రాజతరంగిణిలో మొదటి మూడు తరంగాలు అభూత కల్పనలనీ, నమ్మశక్యం కాని అంశాలున్నాయని, దాన్ని చరిత్రగా పరిగణించకూడడని ఇతరులే కాదు, భారతీయ చరిత్రకారులు కూడా బల్లలు గుద్ది మరీ చెప్తారు. కాని గమనిస్తే, ఏది నమ్మవచ్చో, ఏది నమ్మశక్యం కానిదో తెలియనంత విచక్షణాశూన్యుడు కాదు కల్హణుడు అన్నది రాజతరంగిణి అడుగడుగునా తెలుస్తూంటుంది, చూడగలిగితే!
ఆ తరువాత వర్షాలు పడ్డాయి. దేశం సుభిక్షమయింది. ప్రజలు సుఖంగా జీవించారు. 36 ఏళ్ళ పాలన తరువాత రాజు మరణించాడు. రాజు మరణంతో రాణి కూడా స్వచ్ఛందంగా ప్రాణత్యాగం చేసింది. రాజు నుంచి వేరయిన విరహాగ్నిని ఆమె చితి మంటలతో చల్లార్చుకున్నదని కల్హణుడు వ్యాఖ్యానిస్తాడు. చితి మంటలు ఆమెకు తామరతూడుల తల్పంలా అనిపించిందంటాడు.
ఆమె మరణించిన స్థలాన్ని ప్రజలు పవిత్ర స్థలంలా భావించారు. అయితే ఆమె ఏర్పాటు చేసిన ఉచిత ఆహార వితరణ పథకం ఈనాటికీ (కల్హణుడి కాలానికి) కొనసాగుతోందనీ, దేశ విదేశాల నుంచీ వచ్చిన ప్రజలందరి క్షుద్బాధను తీరుస్తోందనీ కల్హణుడు వ్యాఖ్యానిస్తాడు. అయితే వారిద్దరికీ సంతానం లేదు. ఇద్దరు అత్యద్భుతమైన వ్యక్తులను సృష్టించిన తరువాత మళ్ళీ ఇంకో అద్భుతమైన సృజన చేయలేనని బహుశా భగవంతుడు వారికి సంతానాన్ని ఇయ్యలేదేమో అని వ్యాఖ్యానిస్తాడు కల్హణుడు.
ఇక్కడ మరో విషయాన్ని గమనించాలి. ప్రాచీన కాలం నుంచీ భారతీయ మహిళలు రాజ్యపాలనలో పాల్గొన్నారు. పరదాల మాటున దాగి వంటిళ్ళకు పరిమితం కాలేదు. ఇలాంటి గాథలకు విస్తృత ప్రచారం ఇస్తే సమాజంలో పలు అపోహలు తొలగే వీలుంటుంది. తరువాత మరో వంశానికి చెందిన ‘విజయ’ అనే వాడు రాజయ్యాడు.
(ఇంకా ఉంది)