[box type=’note’ fontsize=’16’] స్ప్రెడింగ్ లైట్ జ్యోతిగా, పుస్తకం జ్యోతిగా, తెలుగు సాహితీ అభిమానులకు సుపరిచితమయిన పి.జ్యోతి, సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా రచిస్తున్న పుస్తక పరిచయాలు/సమీక్షలు… [/box]
[dropcap]పా[/dropcap]లో కొయల్హో ప్రఖ్యాత బ్రెజిలియన్ రచయిత. అతని Alchemist నవల ‘పరుసవేది’గా తెలుగులోకి అనువాదం అయి ఎన్నో కాపీలు అమ్ముడుపోయింది. పాలో పుస్తకాలన్నీ చదివాను కాని నాకు ఆయన నవలలో బాగా నచ్చిన పుస్తకం BY THE RIVER PIEDRA I SAT DOWN AND WEPT. మనిషిలోని అంతరంగ మథనాన్ని ఈ పుస్తకం చాలా గొప్పగా చూపిస్తుంది. అసలు నేనేంటి నాకేం కావాలి అన్న ప్రశ్నకు జవాబు వెతుక్కోవాలనే ఆలోచనే చాలా మందికి రాదు. మనం మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గుడ్డిగా అనుకరిస్తూ బ్రతికేస్తూ ఉంటాం. కాని మనలో తెలీని అశాంతి రగులుతూ ఉంటుంది. జీవితాన్ని అర్థం చేసుకుని, బ్రతుకు అర్థం తెలుసుకోవాలని తపన పడే వ్యక్తులలో ఈ అశాంతి ఇంకా ఎక్కువ. చాలా కాలం పాలో అదే అశాంతితో కొట్టుకుపోయారు. ఆధ్యాత్మిక బాటలో నడుస్తూ తన అనుభవాలను నవలలో రాసుకుంటూ వెళ్ళారు. అందుకే వారి నవలలన్నిటిలోని పాత్రలలో ఈ ఆధ్యాత్మిక అన్వేషణ కనిపిస్తూ ఉంటుంది.
ప్రేమ అంటే ఏంటీ? సంపూర్ణంగా తృప్తి నిచ్చే మానవ సంబంధాలు ఉంటాయా? ఆనందం అంటే ఏంటీ? పరిపూర్ణమైన ఆనందం మనిషికి లభించాలంటే మనిషి జీవితంలో ఏ మార్గాన ప్రయాణించాలి? ఇలాంటి ప్రాథమిక ప్రశ్నలతో వీరి నవలలన్నీ మొదలవుతాయి. మనకు కనిపించే ప్రపంచంతో పాటు మరొక ప్రపంచం ఉంటుందని, మనకు తెలీని రహస్యాలెన్నో ఆ ప్రపంచంలో ఉన్నాయని, శక్తి ఉంటే ఆ ప్రపంచపు సందేశాలు మనకి చేరుతాయని పాలో నమ్ముతారు. మానవ జీవితాలను నియంత్రించే సమజంలో మనిషి అనుభూతులన్నీ కూడా సామాజీకరించబడ్డాయి. తనను తాను తెలుసుకునే క్రమంలో తనలోని ప్రపంచం వైపుకు మనిషి ప్రయాణం చేయగలిగితే ఎన్నో రహస్యాలను అతను సొంతం చేసుకుంటాడు. ఇది వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ అనుభవించవలసిన అనుభవం తప్ప ఒకరి అనుభవాలు మరొకరివి కాలేవు అన్నది పాలో నమ్మిన సిద్దాంతం.
ప్రేమలో మనషి పూర్తిగా తనను తాను సమర్పించుకోవడం జరగదు. ఎన్నో ఆలోచనలు, జాగ్రత్తల నడుమ ప్రేమను అనుభవించాలనుకూంటాడు. కాని అలా ఏర్పడిన బంధాలలో ఒక అసంపూర్ణత ఎప్పుడూ మిగిలే ఉంటుంది. అందుకే మనిషి పూర్తిగా అ బంధాలలో ఆనందాన్ని అనుభవించలేకపోతాడు. స్వేచ్ఛాపూరిత నిస్వార్థ సమర్పణ ప్రేమ అన్వేషణలో మనిషికి ఈ ప్రపంచంలో అందదు. అందే పరిస్థితులు ఉండవు. అదే మనిషి అసంతృప్తికి కారణం. ఇది పాలో ప్రతి నవలలో అంతర్లీనంగా మనకు కనిపించే సందేశం. శారీరిక కలయిక తరువాత ప్రతి ప్రేమజంట జీవితంలో ఓ ఒక స్థితిలో నిర్లిప్తత వచ్చి చేరుతుంది. అది లేకుండా చేసుకోవడానికి మానవుడు చాలా ఎదగాలి.
ఈ నవలలో కథానాయిక పీలర్. ఆమె బాల్య స్నేహితుడు, ప్రేమికుడితో విడిపోయిన దశాబ్దం తరువాత ఇద్దరూ మళ్ళీ కలుస్తారు. పీలర్ ఈ దశాబ్దకాలంలో స్వతంత్ర భావాలున్న ఆధునిక మహిళగా రూపాంతరం చెందుతుంది. ఆమె స్నేహితుడు ఆధ్యాత్మికత వైపు ఆకర్షితుడయి పది సంవత్సరాలు దేశాలన్నీ తిరుగుతూ తనను తాను తెలుసుకునే ప్రయత్నం చేస్తూ గడుపుతాడు. అతను ఎన్నో మతాలను, సాంప్రదాయాలను పరిశిలించి, భిన్నమైన వ్యక్తుల మధ్య జీవించి వస్తాడు. స్త్రీ శక్తిలో దేవుడిని ఆరాధించే సాంప్రదాయం అతన్ని ఆకర్షిస్తుంది. తన అనుభవాలను పీలర్‌తో పంచుకోవాలని అతను అనుకుంటాడు. కాథలిక్‌గా పెరిగి ప్రశ్నించడం తప్పని నమ్మిన వ్యవస్థలో పెరుగుతుంది పీలర్. ఆమె మనుషులను ప్రేమించి ఎన్నో గాయాలను అనుభవించింది. ఆమెలో చెప్పలేని అసంతృప్తి బాధ ఉంటాయి. సమాజం నిర్దేశించిన దారిలో నడవకపోవడమే తన తప్పని, ఈ సమాజంలో కలిసిపోవడానికి తాను ఆనందం అనుకుంటున్న చాలా వాటిని వదులుకోవాలని ఆమె నమ్ముడం మొదలెడుతుంది. ఇష్టం లేకపోయినా ప్రపంచం కోసం తనను తాను మార్చుకోవాలనుకుంటుంది.
తన స్నేహితునితో ఒక యాత్రకు ఆమె వెళుతుంది. ప్రాన్స్ దేశ సరిహద్దులను దాటి చేసే వారి ప్రయాణంలో, ఆమెలో చాలా అలోచనలు కలుగుతాయి. తన గురించి తనకు కొత్త సంగతులు తెలుస్తాయి. తనకు కావలసిన దాని పట్ల ఒక స్పష్టత ఏర్పర్చుకోవడానికి ఈ యాత్ర, దారిలో మిత్రునితో చేసే చర్చలు ఆమెకు సహాయపడతాయి. తను అనుకున్నట్లు తాను ఇతరులను బేషరతుగా ప్రేమించగలనని, తాను అనుకున్న విధంగా జీవించగలనని ఆమెను నమ్మకం ఏర్పడుతుంది. ఆమె స్నేహితుడికి పీలర్‌పై ప్రేమ కలుగుతుంది. కాని తాను ఆధ్యాత్మిక బాటలో ఉన్నానని, బంధాల మధ్య మళ్ళీ రాలేనేమో అన్నది అతని అనుమానం. తాను ఆధ్యాత్మికంగా ఒక స్థాయికి చేరాక మళ్ళీ ప్రపంచ బంధాల వైపుకు రావడం సరికాదన్న అతని అనుమానాన్ని పీలర్ బలపరుస్తుంది.ఇన్ని సంవత్సరాల అతని కృషి కేవలం తన కోసం, తన పొందు కోసం అతను ఒదులుకోవడానికి ఆమె ఇష్టపడదు. శారీరిక వాంచకు అతీతమైన మానసిక ప్రేమను ఇద్దరూ అనుభవించే స్థ్తితికి చేరతారు. ఆధ్యాతిక కలయిక సాధ్యం అన్న స్థితికి చేరిన వారి బంధం వారిని ఉన్నతులుగా చేస్తుంది. మనిషి కొన్ని సిద్దాంతాలను ఒప్పుకుని జీవించడం వల్ల పూర్తి ఆనందం అనుభవించడని, ఆ సిద్దాంతమే తానయి జీవించాలని అదే మనిషి జీవిత లక్ష్యం అయినప్పుడు అన్నిట్లో ఆనందాన్ని అనుభవిస్తాడని ఆ ప్రయాణంలో వారిద్దరిలో జరిగుతున్న అంతర్మథనం స్పష్టపరుస్తుంది.
ఈ నవల 1998లో మొదటి సారి పబ్లిష్ అయింది. భారతీయ ఆధ్యాతికతకు చాలా దగ్గరగా కొన్ని చర్చలు ఈ నవలలో కనిపిస్తాయి. తన జీవితంలోని ప్రేమ పరిచయాలలో ఈ మానసిక కలయిక లేనందువలనే అవి తనకు బాధను మిగిల్చాయని పీలర్ తెలుసుకోవడం నవల ముగింపు. ఆలోచనలను, అపనమ్మకాలను వదిలేసి సంపూర్ణంగా మరొకరిని ప్రేమించినప్పుడు శరీరాల కలయిక కన్నా మానసిన కలయిక యిచ్చే తృప్తి అన్ని ఆనందాలకు అతీతం అని అనుభవించి అర్థం చేసుకుంటుంది పీలర్. అది అనుభవించిన తరువాత తనతో ఉండిపోవడానికి తన మార్గాన్నే మార్చుకుంటానన్న మిత్రుడిని ఆపుతుంది. అలా ఏర్పడే తమ బంధంలో ఈ దగ్గరతనం ఉండదని అతనితో విడిగా ఉండడానికి నిశ్చయించుకుంటుంది. ప్రేమలో విషాదం ఉంటుందని తెలిసి కూడా దాన్నిఅందుకోవడానికి ధైర్యం చేయగలిగినపుడే నిజంగా ప్రేమను అనుభవించగలమని ఇద్దరూ అర్థం చేసుకుంటారు. జీవితాన్ని కలిసి చూడడమే ప్రేమ అని, కలిసి బ్రతకడం ముఖ్యం కాదని, తమ జీవితాల పంథా మార్చుకుంటారు.
ఈ నవలలో ఈ రెండు పాత్రల సంఘర్షణతో మనం కనెక్ట్ అవుతాం. మనలోని ప్రశ్నలకు జవాబులు వెతుకుతున్న పాత్రలుగా వారు కనిపిస్తారు. శరీరమనే బంధాన్నీ విడి అనంతమైన విశ్వంలోకి ప్రయాణీంచే ప్రేమమూర్తులుగా ఆ ఇద్దరు మనుష్యులు మారడం చూస్తాం. పరిపూర్ణమైన తృప్తిని ఇచ్చే నవల ఇది. సుఖం, దుఖం, కష్టం, నష్టం, వీటికి అతీతంగా నిలిచే బంధం శ్రేష్ఠతను గుర్తుంచే స్థితికి పాఠకులను తీసుకువెళ్ళే గొప్ప రచన ఇది. ఈ అనుభవాన్ని చేరడానికి ఆ ఇద్దరూ పడే మానసిక సంఘర్షణ, ఆ నది ఒడ్డున వారు కార్చే కన్నీరు, వారు మనసులను పునీతం చేసే తీరు అద్భుతంగా ఉంటుంది. సాధారణమైన యువతీ యువకులుగా తమ పాత కలయికను గుర్తు చేసుకుంటూ ఒకరితో ఒకరు చేసే ప్రయాణం వారిలో అంతర్లీనంగా తెచ్చే మార్పు, చివరకు మానవ సంబంధాలలోని ఆనందాన్ని వెతుక్కోవడానికి తమను తాము సిద్ధపరుచుకుంటూ మానసికమైన కలయిక గొప్పతనాన్ని ఒప్పుకుని అంతకు మించిన సుఖం శారీరిక కలయికలో కూడా లేదని నిర్ధారించుకోవడం వరకు వారు జీవితంలో చేసిన ప్రయోగాలు, ఇతర సంబంధాలలోని అసంతృప్తులు, అవి విఫలం అవడం వెనుక కారణాలను వారు అర్థం చేసుకునే స్థాయికి రావడం ఈ నవలలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది.
మానవుల మధ్య అసంతృప్తికి కారణాలు చాలా వరకు మానసికమని, అసంతృప్తి నుండి ఆనందం వైపుకు మనిషి ప్రయాణించడానికి అతను ప్రపంచాన్ని, తనని, ప్రపంచంలో తనను తాను చూసుకోనే విధానంలో మార్పు రావాలని పీలర్ ఆమె స్నేహితుని పాత్రల ద్వారా రచయిత చెప్పే ప్రయత్నం చేసారు. పాలో కోయల్హో నవలలు చదవడం ఒక గొప్ప అనుభవం. వారి నవలలన్నీటిలోకి ఈ నవలలో వారు చెప్పదల్చుకున్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పగలిగారని నా కనిపిస్తుంది.