కలగంటినే చెలీ-4

0
3

[box type=’note’ fontsize=’16’] శ్రీ సన్నిహిత్ వ్రాసిన ‘కలగంటినే చెలీ’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]అం[/dropcap]దుకే సూర్యం ఫ్రెండ్స్‌‌తో “ఒరేయ్‌.. నేను రూముకి వెళ్ళిపోతానురా.. మళ్ళీ రేపు కలుద్దాం” అన్నాడు.

“సరే గాని ఏదైనా తినరా.. డబ్బులు కోసం చూసుకుని తిండి మానెయ్యకు” అన్నారు ఫ్రెండ్స్‌. ‘ఏనాటిదో ఈ బంధం’ అనుకున్నాడు సూర్యం.

“అలాగేరా..” అని చెప్పి అక్కడి నుండి నడుచుకుంటూ రూము బాట పట్టాడు.

***

సాయంకాలమైంది… సూర్యం రూము నుండి బయటకు వచ్చి నిలబడి చుట్టూ చూడసాగాడు. చల్లటి గాలి ఆహ్లాదంగా వీస్తోంది. అతడున్నది డాబా పైన కాబట్టి సిటీ బాగానే కనబడుతోంది. ఎంతో అభివృద్ధి చెందిన నగరం వైజాగ్‌. ఆ సిటీకి చుట్టుపక్కల అన్నీ పల్లెటూళ్లే! కానీ వైజాగ్‌ వరకు మాత్రం బాగా డెవలప్డ్‌! ఇండియా మొత్తంలో ఉన్న వివిధ ప్రాంతాల నుండి ఉద్యోగ రీత్యా వచ్చిన జనాల వల్ల డ్రాస్టిక్‌ డెవలెప్మెంట్‌ కనబడుతుంది. చుట్టూ ఉన్న ఊళ్ళళ్ళో ఉన్న అనాగరికతకు, వైజాగ్‌ లో ఉన్న నాగరికతకు మధ్య క్లియర్‌ కాంట్రాస్ట్‌ కనబడుతుంది. థాంక్స్‌ టు సీ కోస్ట్‌!

సూర్యం ఆ వాతావరణాన్ని ఆస్వాదించసాగాడు. ‘చదువు అనేది ఒక నిచ్చెన లాంటిది. అది నిన్ను ఎన్నో ఉన్నత శిఖరాలకి తీసుకు వెళుతుంది . కొత్త ప్రపంచాన్ని.. కొత్త మనస్తత్వాలని నీకు పరిచయం చేస్తుంది’ అని స్కూల్‌‌లో సైన్స్ మాష్టారు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి అతనికి.

నిజమే.. ఆ నిచ్చెన తను కష్టపడి ఎక్కాలి. అప్పుడే తనకి ఆ కొత్త ప్రపంచం లోకి ప్రవేశం దొరుకుతుంది అనుకున్నాడు.

క్రమంగా చీకటి పడింది. వైజాగ్‌ లాంటి అందమైన నగరం రాత్రిళ్ళు మరింత అందాన్ని సంతరించుకుంటుంది. విద్యుత్‌ దీపాల వెలుగులో నగరం వెలిగిపోతోంది. సూర్యానికి తన పల్లెటూరు గుర్తుకొచ్చింది. ఊరంతా తిప్పి తిప్పి కొడితే కరెంట్‌ ఉన్న ఇళ్ళు పది కంటే ఎక్కువ ఉండవు. వీధి దీపాలు పేరుకే ఉంటాయి. కానీ అవి వెలగవు…..

కడుపులో కదలిక తెలుస్తోంది. ఆకలి.. ఎప్పుడో పొద్దున్న కోచింగ్‌ సెంటర్‌‌కి నడిచి వెళుతూ తిన్న టిఫిన్‌.. అరిగి పోయి చాలా సేపు అయింది. ఆ నిశ్శబ్ద నీరవంలో అతనికి తల్లిదండ్రులు గుర్తొచ్చారు… చెల్లెళ్ళు గుర్తొచ్చారు. సెంటిమెంట్‌‌తో కూడుకున్న బంధాలు అప్పుడప్పుడు మనిషి ఎదుగుదలకు అడ్డు పడుతూ ఉంటాయి. అవసరాన్ని బట్టి వాటిని తాత్కాలికంగా పక్కకు పెట్టాలి. జీవితంలో ఎదిగాక వాటిని మళ్ళీ కొనసాగించవచ్చు. సెంటిమెంట్‌కి ప్రాధాన్యత ఇచ్చి ఎదగకపోవడం ఇంకా తప్పు కదా! ఆలోచనలని పక్కకు నెట్టి… స్నానానికి వెళ్ళాడు.

అమ్మ మెస్‌ రష్‌గా ఉంది. టోకెన్‌ తీసుకుని ఒక మూల సీట్లో కూర్చున్నాడు సూర్యం. సర్వర్‌ వచ్చి ప్లేట్‌ పెట్టాడు. దాని వైపు చూసాడు సూర్యం. అన్నం, కూర, పప్పు, పెరుగు, పచ్చడి,అప్పడం బాగానే ఉన్నాయి ఐటెమ్స్. నిశ్శబ్దంగా తినసాగాడు. కూర బాగుంది గానీ అన్నం మరీ గట్టిగా ఉంది.

“ఏ ఊరు బాసూ నీది?” ఎవరో అడిగారు. తలెత్తి చూసాడు.

ఎదురుగా ఒక కుర్రాడు. సూర్యం కంటే వయసులో అయిదారేళ్ళు పెద్దవాడు.

“నిన్నే గురూ.. ఏ ఊరు మనది?” మళ్ళీ అడిగాడు అతను. చెప్పాడు సూర్యం

అతను ‘మాది విజయనగరం గురూ’ అని ‘ఎక్కడుంటున్నావు?’ అన్నాడు

“ప్రస్తుతానికి టెంపరరీగా నాకు తెలిసిన ఒక సార్‌ ఇంటిలో ఉంటున్నాను.. కొన్ని రోజుల తర్వాత వేరే రూము చూసుకోవాలి” అని చెప్పాడు.

“ఆహా.. నేను కూడా ఈ దగ్గరలోనే అద్దెకుంటున్నాను. రోజూ ఈ మెస్‌ లోనే తిండి.” నవ్వాడు

“..ఏం చేస్తుంటారు మీరు?”

“డిప్లొమా చేసాను.. ప్రైవేట్‌ కంపెనీలో జాబ్‌.” నిదానంగా అన్నాడు ఆ కుర్రాడు.

“నేను ఎంసెట్‌ కోసం ప్రిపేర్‌ అవుతున్నాను.”

“ఆహా వెరీ గుడ్‌.. బాగా చదువు” అన్నాడతను

ఇద్దరిదీ భోజనం అయిన తర్వాత బయటకొచ్చి వెళుతున్నప్పుడు సూర్యం అన్నాడు “అన్నా.. నా పేరు సూర్యం.. నీ పేరు”

“బ్రహ్మం.. ఎప్పుడైనా నా రూముకి రా..” అని ఆహ్వానించాడతను

“అలాగే అన్నా” అని చెప్పి వచ్చేసాడు సూర్యం . ఎందుకో… బ్రహ్మం చాలా మంచివాడులా అనిపించాడు సూర్యానికి.

రూముకి వచ్చాక డ్రెస్స్‌ మార్చుకుని పుస్తకాల ముందు కూర్చున్నాడు. కోచింగ్‌ సెంటర్‌ వాళ్ళు ఇచ్చిన మెటీరియల్‌ తీసి చదవసాగాడు. ఒంటరిగా కూర్చుని కృషి చెయ్యడం చాలా కష్టం. దానికి చాలా సెల్ఫ్‌ మోటివేషన్‌ కావాలి. అది సూర్యానికి బాగా ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. చాలా సేపు చదువుకున్నాక రిలీఫ్‌ కోసం రూము బయటకు వచ్చి గాలి పీల్చుకోసాగాడు. కింద పోర్షన్‌లో ఉన్న మేథ్స్‌ సార్‌ దంపతులు మాట్లాడుకుంటున్న మాటలు గాలి వాటున లీలగా వినిపించసాగాయి.

మేథ్స్‌ సార్‌ భార్య అంటోంది “ఏంటండీ.. మీరేమో పెద్ద దానకర్ణుడిలా ఆ అబ్బాయిని తీసుకొచ్చి పెట్టారు. ఇంకా ఎన్నాళ్ళుంటాడు”

“పోనీ లేవే.. పేద కుర్రాడు.. రూము చూసుకుని త్వరలోనే వెళతాడులే”

“ఏమో.. మన కామన్‌ టాయిలెట్‌ వాడుతున్నాడు.. క్లీన్‌ చేసేది మనమే కదా.. కరెంట్‌ బిల్లు కూడా పెరుగుతుంది కదా”

“అవును.. కొన్ని రోజులు చూద్దాం.. తర్వాత నెమ్మదిగా చెబుతాను” అన్నారు మేథ్స్‌ సార్‌. మనసంతా చేదుగా అనిపించింది సూర్యానికి. కానీ వాస్తవం అదే కదా. ఎప్పటికైనా తను రూము చూసుకుని వెళ్ళాల్సిందే కదా! రూములోకొచ్చి పుస్తకాలు మూసేసాడు. తర్వాత ఎంత ప్రయత్నించినా చాలా సేపటి దాకా నిద్రాదేవి కరుణించలేదు. తల్లిదండ్రుల రెక్కల చాటునుండి బయటకొచ్చి బ్రతకడం అంత ఈజీ కాదన్న సత్యం అతనికి ప్రాక్టికల్‌గా అర్థం కాసాగింది. ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు.

మర్నాడు… కోచింగ్‌ సెంటర్‌లో క్లాసు శ్రద్ధగా వినసాగాడు సూర్యం. సాధారణంగా ముందు బెంచీలో కూర్చుంటాడు తను. అతని ఫ్రెండ్స్‌ వెనక బెంచీల్లో కూర్చుంటారు. టీచర్‌ చెప్పేది కాన్‌సన్‌ట్రేషన్‌తో వినాలని అతని తపన.

కో ఎడ్యుకేషన్‌ క్లాస్‌ అది. చాలా మంది అమ్మాయిలు కూడా ఉన్నారందులో.

‘ఎవరో తనని గమనిస్తున్నారు’ అన్న ఫీలింగ్‌ కలిగింది అతనికి. తలతిప్పి చూసాడు. పక్క బెంచీలో ఉన్న అమ్మాయి చప్పున తలతిప్పుకుంది. అతనికి అర్థం అయింది. అర్థం చేసుకోలేనంత చిన్న పిల్లాడు కాదు సూర్యం. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది. ముఖ్యంగా ఆమె కళ్ళు.. ఎన్నో భావాలని పలికించేలా ఉన్నాయి. చిన్నగా నవ్వుకుని లెసన్‌ వినడం మీద కాన్‌సన్‌ట్రేట్‌ చేసాడు.

ఆ రోజు క్లాసులయిపోయాక ఫ్రెండ్స్‌కి బై చెప్పి నడుచుకుంటూ రూముకి వచ్చేసాడు. ఆకలిగా అనిపించసాగింది. రెండు బిస్కట్లు తిని నీళ్ళు తాగాడు. ఆకలి బాధ కొంచెం తగ్గింది. పుస్తకాలు తీసి ఆ రోజు చెప్పిన పాఠాలు చదవసాగాడు. రాత్రి తను విన్న మాటలు గుర్తుకురాసాగాయి… వేరే రూము చూసుకోవాలి అనుకున్నాడు… గుచ్చుతున్నట్టు చూస్తున్న రెండు కళ్ళు గుర్తొచ్చాయి. తన మీద తనకే జాలి వేసింది సూర్యానికి. వయసు చేస్తున్న అల్లరి.. సమస్య మనసుది కాదు.. వయసుది. అందుకే ఒళ్ళు అదుపులో పెట్టుకోవాలి అనుకున్నాడు. ‘ఇంజనీరింగ్‌ లాంటి పెద్ద చదువు మన లాంటి వాళ్ళకి అవసరమా’ అన్న తండ్రి మాటలు గుర్తొచ్చాయి.. తండ్రిని ఎదురించి ఇక్కడికి రావడం అందుకేగా! అలాగే ‘ప్రేమ’ అనేంత పెద్ద సౌఖ్యం తన లాంటి సామాన్య మనసులకి అవసరమా అని తనని తానే ప్రశ్నించుకున్నాడు . ‘అనవసరం’ అన్న సమాధానం అతని విచక్షణ ఇచ్చింది. రిలీఫ్‌గా ఫీల్‌ అయ్యాడు.

లగ్జరీ లైఫ్‌! ఈ రోజుల్లో చాలామందికి సులభంగా దొరుకుతోంది. కానీ సూర్యం లాంటి వాళ్ళకి అది అందని ద్రాక్ష. మంచి తిండి.. మంచి బట్ట.. ఎంటెర్టైన్‌మెంట్‌ ఇవన్నీ కావాలంటే సామాన్యుడు కొంచెం కష్టపడాలి. కొన్ని త్యాగాలు చెయ్యాలి. సూర్యం పరిస్థితి అంతే! ప్రతీ రోజూ పొద్దున్న టిఫిన్‌ చేసి మళ్ళీ రాత్రిళ్ళు మాత్రమే భోంచేస్తున్నాడు. డబ్బులు ఆదా చెయ్యాలని అతని ఆలోచన. ఒక్కోసారి మూడ్‌ లేకపోతే రాత్రిళ్ళు కూడా భోంచేయడు. చదువు మీద దృష్టి పెట్టి ఆకలి మర్చిపోవడానికి ప్రయత్నిస్తాడు.

రాత్రి అమ్మ మెస్‌కి వెళ్ళాడు. అప్పటికే బ్రహ్మం వచ్చి భోంచేస్తున్నాడు. సూర్యాన్ని చూసి –

“రా బ్రదర్‌.. కనపడటం లేదు ఈ మధ్య” అన్నాడు

“అప్పుడప్పుడు వస్తున్నా అన్నా”

“ఏంటి డల్‌గా ఉన్నావు.. ఏదైనా ప్రోబ్లెమా?”

“అవును అన్నా… వేరే రూము చూసుకోవాలి. ఇప్పటికిప్పుడు ఎక్కడ దొరుకుతుంది వేరే రూము. పైగా ఎడ్వాన్స్‌ ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు కూడా లేవు” బాధగా అన్నాడు సూర్యం.

“ఓస్‌… ఇంతేనా… దానికేముంది.. నా రూములోకి వచ్చెయ్‌. నేను ఎలాగూ ఒక్కడినే ఉంటాను. నువ్వొస్తే నాక్కూడా కంపెనీ ఉంటుంది.” ఎంతో అభిమానంగా అన్నాడు బ్రహ్మం.

సంతోషంగా అనిపించింది సూర్యానికి. మనుషుల్లో ఇంకా మానవత్వం ఉంది అన్న నమ్మకం పెరిగింది.

“అలాగే అన్నా.. త్వరలోనే నీ రూముకి మారిపోతాను” అన్నాడు.

సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఇద్దరూ భోజనం ముగించారు. ఒక్కోసారి మనకు తెలియకుండా తప్పులు చేస్తూ ఉంటాము. సూర్యం ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కూడా అలాంటిదే!

***

తర్వాతి రోజు మేథ్స్‌ సార్‌ని కలిసి చెప్పాడు సూర్యం “సార్‌.. నాకు వేరే రూము దొరికింది.. అక్కడికి మారిపోతాను” అని

“వెరీ గుడ్‌ రా..” అని నవ్వేసారాయన.

ఆయన కాళ్ళకు దండం పెట్టి “ఎక్కడో పల్లెటూరు నుండి వచ్చిన నాకు ఇంత ఆశ్రయం ఇచ్చారు సార్‌. మీ మేలు నా జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను” అన్నాడు సూర్యం.

“ఫర్వాలేదురా.. అన్ని పెద్ద మాటలెందుకు. నువ్వు బాగా చదివి ఎంసెట్‌లో మంచి రేంక్‌ సాధించు. అదే నాకు నువ్వు ఇచ్చే గురుదక్షిణ” అన్నారు

“అలాగే సార్‌.. నా శాయశక్తులా కృషి చేసి సాధిస్తాను” అని సెలవు తీసుకుని లగేజ్‌తో బ్రహ్మం రూముకి షిఫ్ట్‌ అయ్యాడు సూర్యం.

విశాలమైన కాంపౌండ్‌ లోపల ఉన్న పెద్ద ఇల్లు అది. గ్రౌండ్‌ ఫ్లోర్‌ మీద ఫస్ట్‌ ఫ్లోర్‌తో చాలా పోర్షన్స్ ఉన్నాయి. అన్ని పోర్షన్స్‌ లోనూ అద్దె కున్న వాళ్ళే ఉన్నారు. ఓనర్స్‌ ఎక్కడో దూరంగా వేరే ఇంటిలో ఉంటారట!

ఆ కాంపౌండ్‌ లోపల చిన్న చిన్న పూలమొక్కలు ఉన్నాయి. మల్లె.. మందారం లాంటివి. ఒక వైపుగా బావి ఉంది. దాన్ని ఆనుకునే కొబ్బరి చెట్టు ఠీవిగా నిలబడి ఉంది. వాటికి వెనగ్గా కామన్‌ బాత్రూంలు.. టాయిలెట్స్‌.

అద్దెకున్న వాళ్ళందరూ మధ్యతరగతి వాళ్ళే! లోపల ఆవరణ చాలా అందంగా ప్రశాంతంగా ఉంది. బ్రహ్మం మేడపైన పోర్షన్‌లో ఉంటాడు. ఒక చిన్న ఫేమిలీ ఉండటానికి సరిపోయే పోర్షన్‌ అది. రెండు గదులు. ముందు గదిలో బట్టలు.. సామానులు ఉన్నాయి. వెనక గదిలో వంట చేసుకునే సరంజామా అంతా ఉంది. ఫర్వాలేదు.. ఇద్దరికి చక్కగా సరిపోతుంది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here