[box type=’note’ fontsize=’16’] జీవన గమనంలో ఆంధ్రా బ్యాంకులో ఉద్యోగపర్వంలో తాను చవిచూసిన సంతోషాలు… దుఃఖాలు…; సుఖాలు…, కష్టాలు…; ఆశలు…, నిరాశలు…; సన్మానాలు…, అవమానాలను… ఒక్కొక్కటిగా నెమరు వేసుకుంటూ సంచిక పాఠకులకు అందిస్తున్నారు తోట సాంబశివరావు. [/box]
50
[dropcap]ఆ[/dropcap]రోజు సాయంత్రం ఆరుగంటలకు ఇద్దరు సీనియర్ సిటిజన్లు నా క్యాబిన్ లోకి వచ్చారు. ఇద్దరూ తేటతెల్లని పంచెకట్టుతో, తెలుగుదనం ఉట్టిపడేలా వున్నారు. వారిని చూడగానే నేను లేచి నిలుచుని, అప్రయత్నంగా రెండు చేతులు జోడించి నమస్కరించాను. వారు ప్రతి నమస్కారం చేస్తూ కూర్చున్నారు. వారు చాలా పెద్దరికంగా, హుందాగా కనిపించారు. ఆ తరువాత మరో ఇద్దరు వచ్చి కూర్చున్నారు. వారిలో ఒకరు..
“సార్! నేను పొన్నూరు నిడుబ్రోలు లయన్స్ క్లబ్ అధ్యక్షుడిని; వీరు సెక్రటరీ… ఇక వీరిద్దరూ… మా క్లబ్ వ్యవస్థాపకులు. ఈ రోజు మా లయన్స్ జిల్లాలో పొన్నూరు నిడుబ్రోలు లయన్స్ క్లబ్‍కు ఓ ప్రత్యేకమైన స్థానం వుందంటే, అందుకు కారణం వీరిద్దరి కృషే! వీరి మార్గదర్శకత్వంలోనే మా క్లబ్ ఎన్నో సమాజ సేవా కార్యక్రమాలు చేస్తుంది. ఎన్నో అవార్డులు సాధించి, జిల్లాలోనే ముందంజలో వుంది. వీరు మిరియాల బసవ కోటేశ్వరరావుగారు… వీరు నన్నపనేని శ్రీనివాసరావుగారు…” అంటూ మిగతావారిని పరిచయం చేశారు.
పెద్దవారైన వారిద్దరి మీద ఆ క్షణంలో నాకు అపారమైన గౌరవ భావం ఏర్పడింది.
“మేనేజర్ గారూ! మీరు కొత్తగా ఈ బ్రాంచిలో జాయిన్ అయ్యారని తెలిసింది. మిమ్మల్ని కలవాలని వచ్చాము!” అన్నారు బసవ కోటేశ్వరరావుగారు.
“చాలా సంతోషం సార్!” అన్నాను.
“మరి మీరు కూడా మా క్లబ్‍లో జాయిన్ అయి మాతో పాటు సమాజ సేవా కార్యక్రమాలలో పాల్గొనమని కోరడానికి వచ్చాము” అన్నారు శ్రీనివాసరావుగారు.
“తప్పకుండా చేరతాను సార్!” అని చెప్పి… మహబూబాబాద్ లయన్స్ క్లబ్‍లో నా పాత్ర ఎలా వుండేదో వివరిస్తూ, బెస్ట్ సెక్రటరీగా ఎన్నికైన విషయం కూడా చెప్పాను. అందుకు వారెంతో సంతోషించారు.
“అయితే మా క్లబ్‍లో మంచి అనుభవం వున్న మీరు సభ్యులుగా చేరుతున్నందుకు… చాలా ఆనందంగా వుంది!” అన్నారు బసవ కోటేశ్వరరావుగారు.
“అయితే రాబోయే రోజులలో మా క్లబ్ అధ్యక్షుడు అయి బెస్ట్ ప్రెసిడెంట్‌గా అవార్డు అందుకోవాలి మరి!” అన్నారు శ్రీనివాసరావుగారు.
“మీలాంటి గొప్పవారితో కలిసి పని చేయడం నా అదృష్టంగా భావిస్తానండి!” అంటూ అప్పటికప్పుడు ప్రవేశ రుసుము, నెలవారీ రుసుము చెల్లించాను.
“ఇక మీరు మా క్లబ్ మీటింగులు అన్నింటికీ వస్తూ వుండండి… మా కార్యక్రమాల్లో తప్పకుండా పాల్గొనండి!” అన్నారు అధ్యక్షులు.
“మీకు ఎప్పటికప్పుడు మీటింగుల గురించి, వివిధ కార్యక్రమాల గురించి సమాచారం అందిస్తుంటాము. మీరు తప్పక రావాలి!” అన్నారు సెక్రటరీ.
“ఓ… తప్పకుండా వస్తానండి! మీ క్లబ్ ద్వారా సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం నాకు లభించబోతున్నందుకు ఎంతో సంతోషంగా వుంది!”
“సరే అండి! ఇక మేము బయలుదేరుతాం!” అంటూ నలుగురూ లేచి నిల్చున్నారు.
“అలాగే సార్!” అంటూ బయటిగేటు దాకా వెళ్ళి వీడ్కోలు చెప్పాను!
51
రోజులు గడుస్తున్నాయ్!
బ్రాంచి సాఫీగా నడుస్తుంది. బ్యాంకు పరిధిలోని నలభై గ్రామాలను చుట్టేశాను. గ్రామ పెద్దలతో, సర్పంచులతో, ఇతర ప్రజాప్రతినిధులతో పరిచయాలు పెంచుకోగలిగాను. చాలామంది రైతులను, ఇతర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను కలవగలిగాను. ఎవరితో మాట్లాడినా, బకాయిల వసూళ్ళ గురించే గట్టిగా చెప్తూ వచ్చాను. రాబోయే వసూళ్ళ సీజన్‌లో మంచి ఫలితాలు రాబట్టేందుకు బాటలు వేయగలిగాను.
స్వతహాగా సమాజ సేవ ద్వారా పేదలకు సహాయపడాలనే భావన వున్న నేను, సహజంగానే లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలన్నింటిలో ఉత్సాహంగా పాల్గొంటున్నాను. మీటింగుల్లో, పూర్వానుభవంతో నేను వ్యక్తపరిచే భావాలను అందరూ సమర్థిస్తున్నారు, ఇచ్చే సలహాలను స్వీకరిస్తున్నారు, పాటిస్తున్నారు కూడా!
సేవా కార్యక్రమాలలో నేను చూపించే శ్రద్ధకు, చొరవకు అందరూ నన్ను మెచ్చుకోవడం మొదలెట్టారు. ఏమైతేనేం ‘మానవ సేవయే మాధవ సేవ’ అని ప్రగాఢంగా విశ్వసించే నాకు, లయన్స్ క్లబ్ ద్వారా పేదలకు సేవలందించే భాగ్యం కలిగింది. పట్టణంలోని డాక్టర్లు, లాయర్లు, లెక్చరర్లు, ఇతర ఉద్యోగస్థులు, వ్యాపారస్థులు, చాలామందితో నాకు పరిచయాలు పెరిగాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, ఇప్పుడు పురప్రముఖుల జాబితాలో నా పేరు కూడా చేర్చబడింది.
52
1987వ సంవత్సరం.
ఆ రోజు ఆఫీసుకు రాగానే ప్రభాకరరెడ్డి, రామకృష్ణలను క్యాబిన్‍లోకి పిలిపించాను.
“రండి… రండి… కూర్చోండి!”
“నమస్కారం సార్!” అన్నారు ఇద్దరూ ఒకేసారి.
“ఆ… నమస్కారం!… ఇక విషయానికొద్దాం! చూడండి! నేను, మీరు… అంటే మన ముగ్గురం… వ్యవసాయశాస్త్రంలో పట్టభద్రులం… గ్రామాల్లో పుట్టి పెరిగాము… రైతు కుటుంబాల నుంచి వచ్చాము. మన బ్యాంకులో గ్రామీణాభివృద్ధి అధికారులుగా పదోన్నతులు పొందాము. అలాంటి మనకు, గ్రామీణ ప్రాంత ప్రజల, ముఖ్యంగా రైతాంగం యొక్క అభ్యున్నతి కోసం పెట్టిన ఈ బ్రాంచీలో పని చేస్తూ, వాళ్ళందరికీ సేవ చేసే అవకాశం లభించడం, నిజంగా మన అదృష్టం!”
“అవున్సార్! మీరు చెప్పింది అక్షరాలా నిజం సార్!” అన్నాడు ప్రభాకరరెడ్డి.
“మరి ఇంత మంచి అవకాశాన్ని మనం అందిపుచ్చుకోవాలి; సద్వినియోగం చేసుకోవాలి. అందుకోసం మన ముగ్గురం కలిసి పనిచేద్దాం. ఇప్పుడు మన ముందున్న పెద్ద సమస్య ‘ఓవర్ డ్యూస్’… ముందు వాటిని వసూలు చేసేందుకు నడుం బిగిద్దాం! అందుకు నేనొక ప్రణాళికను తయారుచేశాను. అది అమలు పరచగలిగితే మనం అనుకున్నది తప్పక సాధించగలం, ఏమంటారు?”
“చెప్పండి సార్! మన సత్తా చూపిద్దాం!” అన్నాడు రామకృష్ణ.
“ఓ.కే. వినండి!”
ప్రభాకరరెడ్డి, రామకృష్ణ టేబుల్‍పై ముందుకు వంగి, పెదాలు బిగించి, కళ్ళు చిన్నవిగా చేసి, వినడానికి సంసిద్ధంగా వున్నారు. నేను చిన్నగా నా స్ట్రాటజీ చెప్పడం మొదలెట్టాను.
- మొదటిగా గ్రామాలవారీ బకాయిదారుల జాబితాలు తయారుచేద్దాం.
- ఒక్క సంవత్సరం దాటిన ఓవర్ డ్యూస్లో, ప్రతి బకాయిదారుడికీ, ఆర్డినరీ నోటీస్ పంపిద్దాం.
- రెండు, మూడు సంవత్సరాలు దాటిన ఓవర్ డ్యూస్లో ప్రతి అప్పుదారుడికీ రిజిస్టర్డ్ నోటీసు పంపిద్దాం.
- ఆ నోటీసుల్లో, ఎంత లోను తీసుకున్నారు, ఎప్పుడు తీసుకున్నారు, ఎంత బకాయిలు వున్నాయి, వాటిని ఏ తేదీలోపు చెల్లించాలి, అలా చెల్లిస్తే కలిగే ఉపయోగాలు, చెల్లించకపోతే కలిగే నష్టాలు, ఇబ్బందుల గురించి సవివరంగా తెలియజేయాలి.
- ఈ నోటీసులు పంపించడం గరిష్టంగా మూడు రోజుల్లో పూర్తి కావాలి.
- నాలుగో రోజు నుండి, రోజుకు రెండు గ్రామాల చొప్పున, నలభై గ్రామాలను ఇరవై రోజుల్లో మొదటి విడతగా మన ముగ్గురం కలిసి తిరగాలి. ప్రతిరోజూ మనతో పాటు మోటారు సైకిలు లేదా స్కూటర్ ఉన్న ఒక స్టాఫ్ మెంబర్‍ని కూడా తీసుకెళ్దాం.
- నలుగురం రెండు వాహనాల మీద వెళ్ళడం కాదు… నలుగురం నాలుగు వాహనాల మీద గ్రామాల్లో తిరగాలి. మన నలుగుర్ని అలా చూసిన గ్రామస్థుల్లో, ఒక ఆలోచన రేకెత్తుతుంది. దాని ఇంపాక్ట్ మీకు ముందు ముందు తెలుస్తుంది.
- మన నలుగురం కలిసి ప్రతి ఇంటికీ వెళ్ళాలి. అప్పుదారుడిని కలవాలి. బకాయిల వసూళ్ళకు ఒత్తిడి తేవాలి.
- ఆ క్రమంలో గ్రామ సర్పంచ్, ఇతర గ్రామ పెద్దలను కూడా కలవాలి. గ్రామాల్లో అందుబాటులో వున్న ప్రజాప్రతినిధులను కూడా కలవాలి. మొండి బకాయిల వసూళ్ళలో వారి సహాయ సహకారాలను మనం తీసుకోవాలి.
- మనం గ్రామాలకు వెళ్ళినప్పుడు, ఎవరైనా బకాయిదారుడు అప్పు చెల్లించడానికి బ్రాంచికి వస్తే, లెక్క కట్టి డబ్బులు క్యాష్ కౌంటర్‍లో కట్టించేందుకు, ఒక క్లర్కుకు బాగా శిక్షణ ఇచ్చి మీ డిపార్టుమెంటులో కూర్చోబెట్టాలి.
- ఒక రిజిస్టరులో డబ్బు చెల్లించిన బకాయిదారుల పేర్లు, ఏ రోజు కా రోజు వ్రాసుకోవాలి.
- ఇరవై రోజుల తరువాత, బకాయిలు చెల్లించిన క్రమంలో, వారికి తిరిగి అప్పు ఇచ్చే తేదీ కూడా వ్రాసుకోవాలి.
- అప్పు చెల్లించే వారి కిచ్చే రసీదు వెనకాలే, క్రమ సంఖ్య, మరల అప్పు ఇచ్చే తేదీ వ్రాయాలి. ఆ రోజున వెంట తీసుకుని రావల్సిన పత్రాల గురించి కూడా వ్రాయాలి. ఇది చాలా శాస్త్రీయబద్ధంగా జరగాలి.
- మనం చెప్పిన తారీఖున, వెంట తీసుకుని రమ్మని చెప్పిన ఆ పత్రాలతో వచ్చిన రైతుకు, విధిగా ఆ రోజు అప్పు ఇవ్వాలి. రిక్త హస్తాలతో వెనక్కు పంపనే కూడడు. అందులో ఏ మాత్రం తేడా రాకూడదు.
- ఈ ఇరవై రోజులు మనం ఉదయం 6 గంటలకు బయల్దేరి, గ్రామాల్లో పని పూర్తి చేసుకుని మధ్యాహ్నం 2 గంటలకు బ్రాంచికి రావాలి.
- ఇరవై రోజుల తరువాత సాయంత్రం 5 గంటలకు గ్రామాలకు బయలుదేరాలి. ఎందుకంటే అప్పుడు మనం పగలంతా బ్రాంచీలో వుండి, తిరిగి చెల్లించినవారికీ, కొత్తవారికి అప్పులు ఇవ్వాలి.
- అలా నలభై రోజుల తరువాత మరో ఇరవై రోజుల పాటు, రోజు మార్చి రోజు, గ్రామానికి ఇద్దరు చొప్పున ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు వసూళ్ళ కొరకు తిరుగుదాం. ఉదయం 10 గంటల నుండి, సాయంత్రం 5 గంటల వరకు బ్రాంచిలో అందరికీ అందుబాటులో వుందాం.
- అప్పటికి మొత్తం అరవై రోజులు అంటే రెండు నెలలు.
- ఆ తరువాత మన ప్రయత్నాల ఫలితాలను సమీక్షించి విశ్లేషించుకుందాం… అప్పుడు తదుపరి చర్యలను గురించి ఆలోచించి, భవిష్యత్ కార్యాచరణను తయారుచేసుకుందాం…
ఇదీ మన స్ట్రాటజీ…! ఎలా వుందీ?” అని వాళ్ళిద్దర్నీ అడిగాను.
“బ్రహ్మాండంగా వుంది సార్!” అన్నాడు ప్రభాకరరెడ్డి.
“దీనికి తిరుగులేదు సార్!” అన్నాడు రామకృష్ణ.
“ఇక్కడ మరో ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి. ఇది రికవరీ సీజన్. ఈ సంవత్సరం పంటలు కూడా బాగా పండాయి. రైతుల దగ్గర, ఇతర గ్రామీణ ప్రజల దగ్గర డబ్బులు బాగానే వుంటాయ్. ఈ అవకాశాన్ని మనం జారవిడుచుకోకూడదు… మరి రేపటి నుంచి రంగంలోకి దిగుదామా?” గట్టిగా అడిగాను.
“తప్పకుండా సార్!” ఇద్దరూ కలిసి పెద్దగా చెప్పారు.
(మళ్ళీ కలుద్దాం)