[box type=’note’ fontsize=’16’] జీవితంలోని వివిధ దశలలో తనకు కలిగిన విశేష అనుభవాలను సంచిక పాఠకులతో పంచుకుంటున్నారు డా॥ కాళిదాసు పురుషోత్తం. [/box]
[dropcap]వా[/dropcap]రు శ్రీ దేవులపల్లి రామానుజరావు గారికి ఉత్తరం రాసిచ్చారు. మరుసటి రోజే హైదరాబాదు బయల్దేరి వెళ్ళాను. సాయంత్రం సారస్వత పరిషత్ ఆఫీసులో రామానుజరావు గారిని దర్శించి కోడందరామరెడ్డి గారు ఇచ్చిన ఉత్తరం ఇచ్చాను. “నారాయణరావు గారూ! నెల్లూరు నుంచి కోదండరామరెడ్డి గారు మనిషిని పంపించారు!” అన్నారు రామానుజరావు గారు. బహుశా ఆ నారాయణరావు గారు పరిషత్ ఆఫీసు మేనేజరు కావచ్చు. తెల్లగా నెరసిన పొడవాటి గడ్డంతో ఒక యోగిలా అనిపించారు. వారు ఆఫీసులో టైపు చేస్తున్న ఒక యువకుణ్ణి నా వెంట పంపించారు.
బర్కత్‍పురా లోని వారి ఇంటి ముందు ఆచార్య అవధాని గారు కుర్చీలో కూర్చుని ఉన్నారు. రామానుజరావు గారిచ్చిన ఉత్తరం వారికిచ్చాను. రెండు పర్యాయాలు ఎంపిక చేసిన విద్యార్థుల జాబితా ప్రకటించినా, ఎం.ఏ. తెలుగులో తగినంత మంది చేరలేదని, మరల ప్రకటన జారీ చేస్తున్నట్టు, మరుసటి రోజున డిపార్టుమెంటులో కలవమని అవధాని గారు చెప్పారు. అవధాని గారింటికి నన్ను వెంట పెట్టుకొని వెళ్ళిన యువకుడే తర్వాతి కాలంలో తెలుగు యూనివర్సిటీ రిజిస్ట్రార్ పదవి నలంకరించారు. వారి పేరు గుర్తుకు రావడం లేదు.
అవధాని గారిని మరుసటి రోజు తెలుగు డిపార్టుమెంటులో, వారి గదిలో కలిసి, వారి సూచనల ప్రకారం అప్లికేషన్ పూర్తి చేసి, యూనివర్శిటీ ఆఫీసులో దాఖలు చేసి, వారి వద్దకు వెళ్ళాను, సెలవు తీసుకోడానికి. ‘ఈ విశ్వవిద్యాలయంలో సెలెక్టు అయిన అభ్యర్థుల పేర్లు నోటీసు బోర్డు మీద వేస్తారు. అభ్యుర్థులు రోజూ వచ్చి చూచుకుంటూ వుండాలి. వారికి లెటర్ వ్రాసి తెలిపే సంప్రదాయం ఇక్కడ లేదు. ఇక్కడ చదువుతున్న విద్యార్థి ఎవరైనా తెలిసివుంటే వెంటపెట్టుకొని రమ్మ’న్నారు. అక్కడ అంతా నాకు కొత్త. ఎవరూ తెలియరు. ఆ రంగు రంగు డ్రెస్సుల్లో, యువతీయువకులు హడావిడిగా తిరుగుతున్న విద్యార్థినీ విద్యార్థులను చూసి నాలోపల ఏదో ఆత్మన్యూనతాభావం, భయం కలిగింది. ఇక్కడ సీటు రాకపోతేనే మంచిదేమో అనే ఒక పిరికి భావం మనసులో పొటమరించింది. ఏమి చెయ్యాలో తోచక, యూనివర్శిటీ ముందున్న పచ్చికలో (లాన్) కూర్చొని, తెలిసిన వారెవరైనా కనబడతారేమోనని చాలాసేపు వేచి చూశాను. తెలిసిన ముఖం ఒకటీ కనిపించలేదు.
ఇంతలో ‘మామా’ అంటూ వి.ఆర్. కాలేజీలో నాతో బాటు బి.ఏ. చదివిన రమణారావనే మిత్రుడు, సహాధ్యాయి దగ్గరకు వచ్చి నవ్వుతూ పలకరించాడు. తను ఎం.ఎ. ఎకనామిక్సులో చేరి తరగతులకు హాజరవుతున్నాడట. నా సమస్య విని, నా వెంట అవధాని గారి వద్దకు వచ్చాడు. “బాబూ! ప్రతి రోజూ నాకు కనబడాలి. సెలెక్షన్ అయి, ప్రకటించగానే నీకు చెప్తాను” అన్నారు అవధాని గారు. మాట ఇచ్చిన ప్రకారమే నా మిత్రుడు రమణారావు రోజూ అవధాని గారిని కలిసేవాడు. సీటు వచ్చిందని చెప్పగానే బయలుదేరి రమ్మని టెలిగ్రాం ఇచ్చాడు. తెల్లవారి కల్లా హైదరాబాదులో వాలి ఫీజు కట్టి ఎం.ఏ.లో జాయిన్ అయ్యాను. నాకు ఈ గొప్ప సహాయం చేసిన మిత్రుడు రమణరావు బార్డర్ సెక్యూరిటీ ఫోర్సులో ఐ.జి.గా చేసి, ఆరోగ్య సమస్యలతో ముందస్తు పదవీ విరమణ చేశాడు. ఆ మిత్రుడు సహాయమే లేకపోతే, సీటు లభించినా, నాకు ఆ విశ్వవిద్యాలయంలో చదువుకొనే అవకాశమే లేకపోయేది! మూడు సార్లు సెలెక్షన్ లిస్టులు ప్రకటించినా, మొత్తం విద్యార్థులం 14 మందిమే. అందులో ఒకరు గత ఏడాది మధ్యలో చదువు మానుకొని మళ్ళీ ఈ ఏడాది రీఅడ్మిషన్ తీసుకొన్న విద్యార్థి ఉన్నారు.
***
నా బాల్య మిత్రుల్లో ప్రాణ మిత్రుడు మా మేనత్త మనవడు నరహరిని స్మరించుకోవాలి. తను నా కన్నా నాలుగేళ్ళు పెద్ద. విపరీతమైన ఉత్సాహం, తెలివికి తోడు లేడికి లేచిందే పరుగని ఆలోచని రాగానే ఆచరణలో పెట్టేవాడు. తండ్రి ప్రభుత్వోద్యోగి. ఎప్పుడూ కేంపులు. తల్లి పూజలూ పునస్కారాలతో… మా నరహరి ఎడమచేతి వాటం… ఆ రోజుల్లో రైల్వే వారి వార్తాసాధనాల కోసం రైలు కట్టకు ఇరువైపులా టెలిగ్రాఫ్ స్తంభాలుండేవి. మావాడు గురి చూసి రాయి రువ్వాడంటే స్తంభం మీది పింగాణి గుబ్బ బద్దలయ్యేది. ఇంట్లో ఏ పని చేసినా, పనికి remuneration ఇవ్వాల్సిందే. లేకపోతే పట్టించుకోడు. మా బృందంలో సిగరెట్ కాల్చడం హైస్కూల్లోనే నేర్చుకొని జీవితాంతం ఆ వ్యసనానికి బానిస అయ్యాడు. నరహరితో కలిసి సిగరెట్ కాల్చడం పట్టుబడ్డా ఇది అలవాటుగా మారలేదు.
నాకన్నా పదేళ్ళు పెద్దవారైన ఒక వ్యక్తితో స్నేహం చేశాను. హైస్కూలు చదివే రోజుల్లో మా వీధిలో ఒకరి పంచలో కుట్టు మిషను పెట్టుకొన్న పాతికేళ్ళ యువకుడు టి.వి.ఎస్.తో స్నేహం కుదిరింది. వీధిలో అంతా ఆ పేరుతోనే పిలిచేవారు. వాళ్ళు 11, 15, 16 ఏళ్ళ వయసు ముగ్గురు అన్నదమ్ములు. ఆ వయసులో తండ్రి చనిపోతే తల్లి మళ్ళీ పెళ్ళి చేసుకొని తొలి భర్త వల్ల కలిగిన పిల్లల్ని గాలికి విడిచిపెట్టింది. నా మిత్రుడి చదువు 5వ క్లాసుతో ముగిసింది. ఎక్కడెక్కడో ఏవో పనులు చేశాడు. బంధువుల సహకారంతో నైజాం వెళ్ళి చిన్న పనులు చేశాడు. మైనారిటీ తీరకుండానే సైన్యంలో చేరి పారిపోయి, టైలరింగ్ నేర్చుకొని ఆడవాళ్ళకు బట్టలు కుట్టడంలో నైపుణ్యం సంపాదించి మా వీధిలో టైలరుగా స్థిరపడ్డాడు. టి.వి.ఎస్. నైజాంలో ఉండి రావడం వల్ల హిందీ పట్టుపడింది. అతనితో కలిసి మంచి హిందీ సినిమాలు చూచేవాణ్ణి. అతను తెగిన గాలిపటంలా తిరిగినా నైతిక స్థైర్యాన్ని నిలబెట్టుకొన్నాడు. ఒకరోజు రాత్రి మా యింటికి వచ్చి “అమ్మా! మీ అబ్బాయిని తోడు పంపించండి” అని వెంటపెట్టుకొని వెళ్ళాడు. అతని గదిలో ఒక యువతి వుంది. తెల్లవారి ఆ దూరపు బంధువు తిక్క వ్యవహారం చెప్పి నవ్వాడు.
మా నాయన పోయాక మళ్ళీ శిఖ పెట్టుకోకుండా జుట్టు పెంచాను. ఫోర్తు ఫారం పరీక్షలు అయ్యాకా, 1954 వేసవిలో టి.వి.ఎస్., టి.వి.ఎస్. మిత్రుడు మధుర మిఠాయి కొట్టు సింగ్ గారితో కలిసి తిరుపతి వెళ్ళి గుండు కొట్టించుకున్నా. నా తిరుపతి యాత్ర ఖర్చు కేవలం 8 రూపాయలు మాత్రమే. తిరుపతి నుంచి వచ్చాక మళ్ళీ మంగలి షాపు గుమ్మం తొక్కలేదు. అమ్మ క్రాఫు చేసుకోడానికి అనుమతించదు. నాకు శిఖ పెట్టుకోడం ఇష్టం లేదు. జుట్టు పొడవుగా పెరిగి భుజాల కిందకి వేలాడుతుండేది. రోజూ చక్కగా దువ్వి స్కూలుకు పంపేవారు లేరు. స్కూలు మొత్తంలో నేను conspicuous గా కనిపించేవాణ్ణి.
నాకు బాల్యంలో తరచూ కడుపునొప్పి వచ్చేది. సైంధవ లవణం, వాము వాటరు వైద్యం. నా బాధలకు కారణం సరైన పోషకాహారం తీసుకోకపోవడమేనని, పెద్దవాణ్ణయినాక తెలిసింది. SSLC రికార్డులో నా బరువు 42 పౌండ్లని రికార్డయింది. మొత్తం నా తరగతిలో నాకన్నా, పొట్టివాడు ఎవడూ లేడు. అట్లా కూడా అందరి దృష్టిలో పడ్డాను. బాల్యంలో ఏ ఆటలూ లేవు. నా బాల్యమిత్రులందరూ చీట్లాటలో ప్రవీణులయ్యారు. కొందరు ఆ వ్యసనంలో కూరుకొనిపోయారు. నాకు మాత్రం దాని మీద అకారణ వైముఖ్యం ఏర్పడింది. ఎన్నడూ కార్డ్సు ముట్టుకోలేదు.
మాకు హైస్కూలులో పి. సుబ్రహ్మణ్యం గారు సైన్సు టీచరు. సైన్సు చాలా బాగా పాఠం చెప్పారు. వారు తరగతికి వచ్చే ముందే అటెండర్ సైన్సు ప్రయోగ పరికరాలు తెచ్చి బల్ల మీద పెట్టేవాడు. ఇప్పుడు చాలా ప్రైవేటు కళాశాలల్లో ఇంటర్లో కూడా విద్యార్థుల చేత ప్రయోగశాలలలో ప్రయోగాలు చేయించకుండానే దారుణంగా రికార్డు డిక్టేట్ చేసి, రాయించి పాస్ చేయిస్తున్నారు – నిస్సిగ్గుగా. బందెలదొడ్డి అని చెడ్డ పేరు సంపాదించుకొన్న మా స్కూల్లోనే అంత చక్కగా బోధించారు. మా సైన్సు మాస్టారి కుమారులు డాక్టార్ పి.ఎస్.ఆర్. మూర్తి ఎంబిబియస్ పాసై పేదల డాక్టరుగా గొప్ప పేరు, పేద ప్రజల మన్నన పొందారు. గత ఏడాది 82వ ఏట వారు పోయే వరకు వైద్యం చేస్తూనే వచ్చారు. వారి ఫీజు చివరి రోజుల్లో ₹ 5 తీసుకొనేవారు.
మా స్కూల్లో సోషల్ టీచర్ కె.ఎస్. సుందరరాజారావు గారిని గురించి కూడా చెప్పాలి. మా చేత రైల్వేస్టేషన్, కోర్టు వంటి ప్రదేశాల నుంచి, స్కూలు వరకు స్కేలు ప్రకారం మ్యాపులు తయారు చేయించేవారు. వారే నెల్లూరు టౌన్‍లో స్కౌట్ సంస్థ అధిపతి కూడా. నేను 3వ ఫారంలోనే స్కౌట్‍గా చేరాను. ఆదివారం ఉదయాలు వారి ఇంట్లో క్లాసులు జరిపేవారు. మమ్మల్ని వెంటపెట్టుకొని తిరునాళ్లల్లో ట్రాఫిక్ నియంత్రణ వంటి కార్యక్రమాలు చేపట్టారు. ఒక స్కౌటు పిల్లవాడి కాలు పొరపాటున బిచ్చగత్తె భిక్షాపాత్రకు తగిలి ఆమె వస్తువులు చెల్లా చెదురయ్యాయి. మా స్కౌట్ మాస్టర్ అత్యంత వినయంగా ఆమెకు క్షమాపణ చెప్పి ఆమె భిక్షాపాత్రలో రూపాయ నాణెం వేసి రావడం మాకందరికీ ఆశ్చర్యం కలిగించింది. ‘బాల సంఘ సభ్యులం భరతమాత పుత్రులం’ అని పాడిస్తూ వీధుల్లో కవాతు చేయిస్తూ నడిపించుకొని వెళ్ళేవారు.
మా ఇల్లు నెల్లూరు మధ్య పొగతోటలో వుంది. మా వీధికి కస్తూరీదేవి నగర్ అని పేరు. 1928లో శ్రీమతి పొణకా కనకమ్మగారు మా పై వీధిలో 2.50 ఎకరాలు కొని పాకలు వేసి శ్రీ కస్తూరిదేవి విద్యాలయం నడిపారు. మహాత్మా గాంధీజీ 1929లో నెల్లూరు వచ్చినప్పుడు ఆవిడ స్కూలు భవనాల కోసం శంఖుస్థాపన చేశారు. తర్వత స్కూలు దర్గామిట్ట లోని విశాలమైన స్థలానికి తరలిపోయినా, మహాత్ముని చరణస్పర్శతో పునీతమైన మా వీధులకు కస్తూరిదేవి నగర్ అని పేరు వాడుకలోకి వచ్చింది. 1980 వరకు మునిసిపాలిటీ వారు స్తంభానికి బిగించిన బోర్డు అలాగే వుండేది.
1951 ప్రాంతంలో డా. పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి గారు మా వీధిలో ఒక బాడుగ భవనంలో ప్రాక్టీసు ప్రారంభించారు. వారు గొప్ప ప్రజావైద్యులుగా, పేదవారి వైద్యులుగా విఖ్యాతి పొందారు. వారు కొంత కాలం మా పక్క ఇంటిలో, కొంత కాలం పక్క వీధిలో బాడుగ ఇళ్లల్లో ఉంటూ ఆసుపత్రి నిర్వహించారు. వారి ఆత్మీయ మిత్రులు వేములపల్లి అనంతరామయ్యగారు మా ఎదురు వరుసలో ఇంట్లో బాడుగకు చేరారు. మా మేమత్త కుమారులు సి. వి. సుబ్బరామయ్య – అనంతరామయ్యగారి వద్ద ప్రాక్టీసు చేశారు.
1952 ఎన్నికల్లో కమ్యూనిస్టులు బలపరిచిన ఖండవల్లి కృష్ణారావు గారు స్వతంత్ర అభ్యర్థిగా ఆనం చెంచు సుబ్బారెడ్డి గారి మీద అతి పెద్ద మెజారిటీతో ఘన విజయం సాధించారు. వారు మాకు రెండు వీధుల ఎగువన శంకరాగ్రహారంలో నివసించేవారు. ఆ రోజుల్లో జిల్లా కమ్యూనిస్టులందరికీ వారు సైద్ధాంతిక గురువని అనుకొనేవారు. 1958 కల్లా సింగరాజు రామకృష్ణయ్యగారు మా వీధిలో కాపురం పెట్టారు. ఆ వీధిలో ఒక విధమైన కమ్యూనిస్టు వాతావరణం వుండేది. డాక్టర్ పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి గారు నిత్యం మా ఇంటి ముందుగా చేతుల్లో స్టెతస్కోప్ ధరించి, పాదరక్షలు లేకుండా, తెల్లటి ధోవతి, హాఫ్ షర్ట్ వేసుకొని వెళ్తుండేవారు. వారిని చూస్తే పిల్లలకు ఒక విధమైన భయం, ప్రేమ వుండేవి. వేములపాటి అనంతరామయ్యగారు ఆయనకు అత్యంత సన్నిహిత మిత్రులు. రామచంద్రారెడ్డి డాక్టరు గారికి ఎప్పుడైనా ఒకసారి మానసిక సమతౌల్యం చెదరి చాలా కోపంగా వ్యవహరించేవారు. మా ఇంటి సమీపంలో రైలుకట్ట మీద కూర్చుని మలవిసర్జన చేసేవాళ్లను తరిమికొట్టేవారు. ఆ రోజుల్లో ప్రతి ఇల్లాలు ఇల్లు శుభ్రం చేసి కాంపౌండ్ మీదుగా చెత్త వీధుల్లో కుమ్మరించడం సాధారణం. వారు అలాంటి ఇళ్ళ ముందు నిలబడి తిట్టేవారు. డాక్టరు గారి మిత్రులు అనంతరామయ్యగారు అటువంటి సమయాల్లో ఆయన వెంట వుండి మంచి మాటలలో ఇంటికి తీసుకొని వెళ్ళడం పరిపాటి. హాస్పిటల్ సిబ్బంది కూడా లోపలికి వచ్చే రోగుల వద్ద పొగాకు, బీడీలు, చుట్టలు తీసుకొని లోపలికి పంపించేవారు. హైస్కూలు విద్యార్థి దశలోనే డాక్టరుగారు ప్రత్యక్షంగా తెలుసు. వారి శ్రీమతి రాజ్యలక్ష్మమ్మగారు, వారి పిల్లలు అందరూ తెలుసు. కాలేజీ చదివే రోజుల్లో తరచూ ఎవరో ఒకరి వైద్యం కోసం వారి వద్దకు తీసుకొని వెళ్ళేవాళ్ళం. నెల్లూరులో డాక్టర్ పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి ఆస్పత్రి ఎరగని వారుండరు. ఆ విధంగా మా వీధికి ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది.
(ఇంకా ఉంది)