[box type=’note’ fontsize=’16’] చిత్తూరు జిల్లాలో భక్తి పర్యటనలో భాగంగా నారాయణవనం లోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]
శ్రీ కళ్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయం, నారాయణవనం.
[dropcap]కిం[/dropcap]దటివారం తిరుమల కొండలని శ్రీ రామచంద్రుడు లక్ష్మణ సమేతంగా దర్శించటం గురించి చెప్పుకున్నాము కదా. తిరుమల నుంచి అలిమేలు మంగాపురం వెళ్ళి అలిమేలు మంగమ్మని దర్శించి, ఆవిడ ఆశీర్వాదం తీసుకుని, ఇప్పుడు తిరుపతికి సుమారు 50 కి.మీ.ల దూరంలో వున్న నారాయణవనానికి వెళ్దాము.
శ్రీ పద్మావతీ, వెంకటేశ్వరుల పరిణయమయిన స్ధానం నారాయణవనం. మరి అంత ప్రసిధ్ధి చెందిన ఆలయం దర్శించాలికదా. దానికి ముందు కొంత కథ కూడా తెలుసుకుందాము.
శ్రీ వేంకటాచల మహాత్మ్యంనందు శ్రీ వరాహస్వామి పద్మావతీ, శ్రీనివాసుల ప్రణయగాథను భూదేవితో చెప్తున్నాడు. నారాయణవనం ప్రాంతాలను పరిపాలించే ఆకాశరాజు యజ్ఞం చెయ్యటం కోసం భూమిని బంగరు నాగలితో దున్నుతూ యజ్ఞ భూమి యందు ధాన్యపు విత్తనాలు చల్లుతుండగా పద్మ శయ్యపై పరుండి ఒక అందమైన బాలిక కనుపించింది. రాజు ఆ బాలిక నాదే అని సంతోషంగా పలుకగా, ఆకాశవాణి, ఈ బిడ్డ నీ పుత్రికే. చక్కగా పెంచుమని పలికెను. తర్వాత అతనికి వసుదాసుడనే మగబిడ్డ కలిగాడు.
పద్మావతి పెద్దదయ్యాక ఒకసారి ఉద్యానవనంలో పూలు కోస్తున్న ఆమెను, వేటకు వచ్చిన శ్రీనివాసుడు చూడటం, వివాహం చేసుకోవాలనుకోవటం అందరికీ తెలిసిందే. శ్రీనివాసుడు దేవదేవుడు కదండీ. ఆయనకి మణి మండపాలు వగైరాలు అప్పటికే వున్నాయి అక్కడ. వకుళ మాలిక ఆయనకి భోజనం పెడుతూ, ఆయన వ్యవహారాలు చూస్తూ వుండేది. పద్మావతిని చూసివచ్చి ఆలోచనలో పడ్డ శ్రీనివాసుని చూసి వివరాలన్నీ అడుగుతుంది. అపుడు శ్రీనివాసుడు వకుళమాలికను ఆకాశరాజు దగ్గరకు పంపిస్తూ ఆవిడకి తాను పద్మావతిని వివాహం చేసుకునే కారణం చెబుతాడు.
“పూర్వము పుణ్యమగు త్రేతాయుగమున నేను రావణుని సంహరించాను. అపుడు వేదవతీయను కన్య లక్ష్మీదేవికి సహాయము చేసింది. భూలోకమున లక్ష్మి జనక మహారాజు పుత్రిగా భూమినుండి అవతరించింది. పంచవటీ వనమున నేను మారీచుని చంపుటకు వెళ్ళగా నా సోదరుడగు లక్ష్మణుడు గూడ సీతా ప్రేరితుడై నన్ననుసరించాడు. అంతలో రాక్షసేంద్రుడగు రావణుడు సీతను హరించుటకు సమీపించెను. అగ్నిహోత్ర వేదికలోనున్న అగ్ని రావణుని ప్రయత్నము నెరింగి సీతను పాతాళములో స్వాహాయందు ప్రవేశపెట్టి పూర్వమా రావణునిచే స్పృశింపబడి అగ్నియందు దేహమును విడచిన యా వేదవతిని రావణుని సంహారార్థమై సీతవలె తయారుగావించి యాశ్రమమునందు విడచెను. ఆమెయే రావణునిచే హరింపబడి లంకలో ప్రవేశపెట్టబడెను.
రావణుడు చంపబడిన తరువాత నామె మరల నగ్నిలో ప్రవేశించెను. ఆగ్ని దేవుడునూ స్వాహాచేత రక్షింపబడిన లక్ష్మి యవతారమగు నా సీతను నా హస్తమందు సమర్పించి సీతతోకూడిన నన్నుగాంచి రామా, ఈమె వేదవతి. సీతకు శ్రేయోభిలాషిణి. సీత కొరకై లంకలో రావణునిచే బంధింపబడి యున్నది. కావున నీవేదైన వరము నొసంగి వేదవతిని సీతతో కూడ సంతోష పరచుమని పలికెను. ఇట్లు హుతాశనుడు పలికినంతనే సీత నాతో నిట్లనియెను. స్వామీ, ఈ వేదవతి నాకెల్లపుడును హితకారిణియై యున్నది. ఈమె పరమ భాగవతోత్తమురాలు. కావున మీరీమెను వరింప ప్రార్థించుచున్నానని కోరెను.
అంత శ్రీనివాసుడు ఆ మాటలను విని దేవీ, 28వ కలియుగముననట్లే యాచరించెదను. అంతవరకీమె బ్రహ్మలోకమున సుర పూజితయైయుండుగాక. అనంతరము భూదేవి పుత్రియై ఆకాశరాజు కుమార్తెయై విలసిల్లును. అని యిట్లు నా చేతను లక్ష్మి చేతను వేదవతికి వరమీయబడెను. నేడామె నారాయణ పురమున భూమినుండి పుట్టినది. వనమున పుష్పములు కోయుచు తిరుగుచున్న యామె నాకు గానుపించినది. లక్ష్మితో వలెనామెతో నేడు నాకు సంతోషము గలిగిననే నా ప్రాణములు స్ధిరముగా నిలుచును. ఇది నిజమని నమ్ముము. వకుళమాలికగా, నీవు నేడచ్చటికేగి యాకన్యను చూచి ఆమె నాకు తగినదేమో గుర్తెరుంగుము.” అని పంపగా వకుళమాల వెళ్ళి వారితో మాట్లాడుతుంది. తర్వాత ఆకాశరాజు రాజధాని నారాయణవనం కనుక ఇక్కడే వారిరువురి వివాహం జరిగింది.
వారి వివాహమయిన తర్వాత వారి వివాహ మహోత్సవ సందర్భంగా పద్మావతీ దేవి తమ్ముడు వసుదాసుడు నారాయణవనంలో ఒకటి, తిరుమలలో ఒకటి, రెండు ఆలయాలు నిర్మించాడని చెబుతారు. అతి పురాతనమైన పురాణ ప్రసిధ్ధి చెందిన ఆలయం ఇది. ఇక్కడ వెంకటేశ్వరస్వామిని, లక్ష్మీ దేవిని, పద్మావతిని ఒకే ఆవరణలో చూడగలము.
చరిత్ర ప్రకారం ఈ ఆలయం క్రీ.శ. 1541లో నిర్మింపబడి తర్వాత అభివృధ్ధి చేయబడింది. ప్రస్తుతం తిరుమల తిరుపతి వారి అధీనంలో వున్నదీ ఆలయం.
పెళ్ళి కొడుకుగా శ్రీనివాసుడు నడయాడిన ప్రదేశం, పద్మావతీ శ్రీనివాసుల పరిణయమయిన ప్రదేశం గనుక కొత్త జంటలు చాలామంది ఈ ఆలయ దర్శనం చేసుకుంటారు.
విశాలమైన ఆలయ శోభ కన్నుల పండుగగా వుంటుంది. 150 అడుగుల ఎత్తయిన రాజ గోపురం సకల దేవతా విగ్రహాలతో, 9 కలశాలతో 7 అంతస్తులతో అలరారుతోంది. ప్రశాంతమైన వాతావరణం భక్తి భావాలని ఇనుమడింప చేస్తుంది. స్వామి తిరునామాలతో, కటి, వరద హస్తాలతో శంఖు, చక్రాలతో దర్శనమిస్తారు. అమ్మ ప్రత్యేక ఆలయంలో తూర్పు అభిముఖంగా వుంటుంది.
ఇంకా ఇతర ఉపాలయాల్లో అవనాక్షమ్మ అంటే వేదములే కన్నులుగా గలదిట, వినాయకుడు, నాగ ప్రతిమలు వున్నాయి. పద్మావతీదేవి వివాహానికి ముందు గౌరీ పూజ ఈ అవనాక్షమ్మకే చేసింది అంటారు.
తిరుపతి వెళ్ళినవారికోసం దేవస్ధానం వారు కూడా కొన్ని ఆలయాల దర్శనం కోసం ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. ఈ సౌలభ్యం వల్ల కొన్ని ప్రసిధ్ధ ఆలయాలు చూడవచ్చు.
సేకరణ.. పి.యస్.యమ్. లక్ష్మి