[dropcap]ని[/dropcap]లువు దోపిడి జరిగిపోయిందని అప్పుడు తెలియదు!
గుర్తు చేసుకుందామని వెనక్కు మళ్ళించి చూసుకున్నాను జీవితాన్ని!!
నా బాల్యపు అమూల్యమైన జ్ఞాపక మందిరాలు లేవు, అవశేషాలు తప్ప
ఎవరు లాక్కున్నారు నాకు తెలియకుండా నా స్వప్నాలను!
చడీ చప్పుడు లేకుండా గ్రహణం చంద్రుడిని పట్టినట్టు!
వడి వడిగా కాలమనే మరణం నన్ను మింగేస్తోంది రహస్యంగా
బడబాగ్ని నీటినే కాల్చినట్టు నా ఇంటికే ముప్పు నిప్పు
ఎలా తప్పించుకోగలను? నాలోంచి నేనెలా బయటపడగలను?
స్వాతంత్ర్యం మీద ఉపన్యాసాలు వినడమే గాని అది ఎక్కడుందో తెలియదు!
హోటళ్ళలో చెత్తకుండీల్లో ధనవంతుల ఇళ్ళల్లో రోడ్ల మీద
నా బాల్యాన్ని బలవంతంగా ముక్కలు చేస్తుంటే అందరూ చూస్తారు!
నా తడి కళ్ళలో ఎప్పుడైనా పండే కలలని కల్లలు చేస్తారు
నా పసి కాళ్ళలో చిందులేసే ఆటలు అరికట్టేస్తారు!
కానీ ఎన్ని నాశనం చేసినా వారు వేలేయలేనిది ఒకటుంది! అదే భవిష్యత్తు!
ఆ దేవత ఒడిలో నాకెపుడూ స్థానం ఉండే ఉంటుంది!