సత్యాన్వేషణ-50

1
3

[box type=’note’ fontsize=’16’] ఇది ఆత్మాన్వేషణ. ఇది సత్యాన్వేషణ. సత్యాన్వేషణ పథానికి మార్గదర్శనం చేసే గురువు అన్వేషణ. సంధ్య యల్లాప్రగడ స్వీయానుభవ కథనం. [/box]

[dropcap]ని[/dropcap]ష్కామము అంటే కోరికలు లేకపోవటము. కర్మ అంటే పని.

నిష్కామ కర్మ అంటే చేసే పని నుంచి ఫలితము ఆశించకుండా చెయ్యటము. మనము సామాన్యంగా చేసే పనులలో దాదాపు అన్ని పనులను ఏదో ఒక ఫలితము ఆశించే చేస్తాము.

ఉదా: పరీక్షలలో ఉత్తీర్ణులవటం కోసం చదవటము. ఆకలి తీరటం కోసము తినటము వంటివి.

ఇందులో చేసే పనులలో కొంత మనము కర్మ ఫలితాలు, మంచి కానీ, చెడు కానీ మూట కట్టుకుంటాము. ఈ కర్మ ఫలితాలే మనకు సుఖమో, కష్టమో కలిగిస్తాయి. ఈ కర్మలను అనుభవించటానికి మనము తిరిగి తిరిగి జన్మిస్తూ వుంటాము.

మనము సాధనతో పరమాత్మ నిజతత్త్వం తెలుసుకోవాలంటే, మోక్షగామిగా మన జీవితము పండించుకోవాలంటే, నిష్కామకర్మ తప్పని సరి. అసలు మోక్షానికి ఈ నిష్కామకర్మయే సులువైన మార్గం.

ఈ నిష్కామ కర్మలను అనుసరించటము వలన సర్వ సంకల్పాలు నశించి, మనసు శుద్ధమై, నిర్మలమైన భక్తుడు భగవంతుని చేరుతాడు. మానవులు ధర్మబద్ధంగా నివసించటము వలన ఈ నిష్కామకర్మ అవలంబించగలరు.

నిష్కామకర్మ గురించి కృష్ణ భగవానుడు భగవద్గీతలో (2వ అధ్యాయం 47వ శ్లోకం) వివరించాడు.

“కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన! మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోస్త్వ కర్మణీ!!”

అంటే -ఫలంపై దృష్టిలేని పని విధానాన్ని భగవానుడు సూచించాడు. అలాగని ఉదాసీనంగా పని చేయమని భగవానుడు చెప్పడం లేదు. ఉత్సాహంగా శ్రమించు; తుది ఫలితాన్ని మాత్రం తనకు వదిలిపెట్టమంటున్నాడు. ఎవరికి దక్కాల్సింది వాళ్ళకు దక్కే తీరుతుంది; అర్హత లేకపోతే ఎంత తాపత్రయపడ్డా అందే అవకాశమే లేదు. కర్తవ్యాన్ని ఎంత దీక్షతో చేస్తున్నామన్నదే ముఖ్యం. ఫలితమేదైనా, మహాప్రసాదం అనుకోవడమే ఆనందదాయకం. అంటే మనం కుదిరినంతగా ప్రక్కవారికి సహాయం చెయ్యటం. చేసేది పరమాత్మ, మనద్వారా అని నమ్మటం. ఫలితం తీసుకోకపోవటం. ఆ సాయం ఎంత చిన్నదైనా కానీ.

నిష్కామకర్మ యోగం ఆచరించే వ్యక్తి ప్రతి జీవికి పరమ లక్ష్యమైన మోక్షాన్ని అందుకోగలరు.

జీవితంలో నిష్కామ కర్మయోగం ఎంతో అవసరం… స్వధర్మాన్ని చక్కగా ఆచరిస్తూ ఫలితాన్ని గురించిన తాపత్రయాన్ని వదిలేస్తే ఎంతో మనశ్శాంతిగా ఉంటుంది. (ఇది నిజంగా నా కోసమే చెప్పారనిపించింది. నేను ఎప్పుడు గమ్యం వైపు దృష్టి పెట్టి పనులు చేస్తాను. కానీ చేసే పనిని ఆ క్షణాన అనుభవిస్తూ, ఆనందిస్తూ, పరమాత్మ నా ద్వారా చేయిస్తున్నదనుకోవటం సాధన చేయాలనీ నాకు చెప్పారు గామోలు.)

సకామ కర్మల వలన మమకారము పెరుగుతుంది. అది బంధాలు పెనవేసుకోవటానికి కారణమవుతుంది. తత్ ఫలితముగా ఈ జనన మరణ చట్రంలో చిక్కుకుపోయిన ముడులు విప్పలేము.

కాని, నిష్కామ కర్మల వలన మమకారము తగ్గుతుంది.

సాధకుడు శాస్త్ర అధ్యయనము, సాధన, జపతపాదులు వలన వైరాగ్యముదయించి, నిష్కామ కర్మలు అవలంబిస్తాడు. తత్ ఫలితముగా జ్ఞానము కలిగి మోక్షానికి అర్హుడవుతాడు.

నిష్కామకర్మ అంటే దేనిపైనా శ్రద్ధ లేకుండా నిస్సారంగా జీవించటం కాదు. జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను ఎదురొంటూ ఆ ఆటుపోట్లకు క్రుంగిపోని చక్కటి జీవితాన్ని పొందటానికి అద్భుతమైన మార్గమిది.

అయితే, నిష్కామకర్మ ఆచరించే వారికి క్రుంగుబాటు దరిచేరదు.

సంసార జీవితంలో స్త్రీలకు, పురుషులకు ఎదురయ్యే సమస్యలకు కూడా నిష్కామకర్మ అనేది అద్భుతమైన పరిష్కారమార్గం.

జనకమహారాజు సంసారంలో ఉంటూ రాజ్యపాలన చేస్తూనే నిష్కామయోగిగా జీవించారని పెద్దలు తెలియజేసారు.

మనస్సును అదుపులో ఉంచుకోవటం, చుట్టూ సమాజంలో ఉన్న పరిస్థితుల మధ్య నిష్కామకర్మ యోగాన్ని ఆచరించటం అనేది కష్టమైనా, సాధన వలన, ధృడసంకల్పముతో దానిని సాధించవచ్చు.

అన్నదానం ముఖ్యమైనదే – కానీ, జ్ఞానదానం మరింత ముఖ్యమైనది. కుదిరిన వారు రెండు కూడా చెయ్యవచ్చు. అంటే మనం, మన చుట్టూ ఉన్న సమాజపు అవసరాలను మనకు చేతనైనంతగా తీర్చాలి.

ఆకలిగా వున్నవారికి సాధ్యమయినంతగా అన్నదానము, జ్ఞానము కోరిన వారికి జ్ఞానదానము చేయటం మొదలు ఎన్నో తోటి వారికి ఉపయోగపడే పనులు చేసి, వాటి నుంచి ఫలితము ఆశించకపోవటము నిష్కామకర్మనే!

నిలువ ఉంచుకోవటం అన్నది సాధకునికి చుక్కెదురు. (అందుకే సాయిబాబా ప్రతి రోజు వచ్చినవాళ్ళకు సర్వం దానం చేసి, ఆ సాయంత్రానికి మళ్ళీ సామాన్యమైన ఫకీరులా మిగిలిపోయేవారు)

మనం చేసే సాయం – పరమాత్మ వారి భక్తులకు అందిస్తున్నాడు మన ద్వారా, అంతే కానీ మనం చెయ్యటం లేదన్న స్పృహను కూడా ఏర్పరుచుకోవాలి.

ఇలాంటి పనులతో మొదలైన ధర్మచింతన పరమపథమైన మోక్షానికి మార్గం చూపుతుందని మనకు గీతలో భగవానుడు చెప్పివున్నాడు. కాబట్టి, సాధకులకు అనువైన సులభమైనది ఈ నిష్కామకర్మ. సంసారులకు సంసారములలో తరించటానికి, జీవితములో వచ్చే ఆటుపోట్లకు నిలబడే ధైర్యం ఇచ్చి బ్రతుకు పండించుకోవటానికి ఈ నిష్కామకర్మ ఉత్తమమైన మార్గంగా పెద్దలు చెబుతారు.

– ఏమి చేసినా అనుభూతి ముఖ్యం. చేసే పనిని అనుభూతితో చేస్తే ఫలితాలు ఉహించలేనంతగా ఉంటాయి. ఉదాహరణకి తల్లి పిల్లలకి బువ్వ పెట్టేటప్పుడు, పిల్లలు తినాలని ప్రేమతో (అనుభూతితో) పెడుతుంది. నామ మాత్రంగా కాకుండా అలా తల్లి చేసే పనిలో ప్రేమను లెక్కించ నెవరికి సాధ్యం? అనుభూతి వలన పిల్లలు తిన్నది వారికి మంచి చేస్తుంది.

అనుభూతి వలన సాధనలో పురోగమనం సుసాధ్యమౌతుంది.

– మనం ఉన్న ఈ ప్రపంచం ఒక కాస్మిక్ ఎనర్జీ. (నేను సదా అమ్మవారు ప్రతి రూపంలో ఉంటుందని అనుకున్నట్లుగా). అందుకే మనకు కలిగే ఫీలింగ్స్ మనకు తెలియకుండా మన చుట్టూ ఉన్నవారితో కలిసి ఉంటాయి. (Internally connected). మనకు కలిగిన భావన ప్రక్కవారికి త్వరగా పాకుతుంది. అది కోపమైతే కోపం, ప్రేమ అయితే ప్రేమ. అందుకే శాంతాన్ని, సహనాన్ని సాధన చెయ్యాలి.

ఆ సహనాన్ని సాధన చేసినప్పుడు, మనము కోపం ఆపుకోవటం లాంటిది చెయ్యకూడదు. అలా చేస్తే కోపము పర్వతములా పేరుకుపోతుంది. అలా పేరుకుపొయిన కోపం ఒక్కసారిగా బయటపడుతుంది. మనసులో కోపం అన్నది లేకుండా చేసుకోవటం ముఖ్యం. అప్పుడు సహనం సహజంగా వుంటుంది.

మూలం అంతా ఒక్కటే, అందరు అమ్మవారి స్వరూపం అన్నది బాగా మనసుకు ఎక్కించుకోవాలి. దాని ద్వారా మనం సహనాన్ని సహజంగా అవలంబిస్తాము. వేరు భావన ఉండదు. అలాంటి సమయాలలో కోపిష్టి కూడా శాంతంగా మారుతారు. కాబట్టి, సహనాన్ని సహజంగా ఉండేలా అవలంబించాలి.

– తపన : సాధనలో తపన ఉండాలి. మనసు తపించాలి.

తపనలో ఉన్నప్పుడు మనకు నిద్ర కానీ, ఆకలి కానీ గుర్తుకు రావు.

ఆ తపన ఎలాంటి తపన అంటే, శ్వాస ఆడనంత తపన, ఉక్కిరి బిక్కిరి చేసే తపన.

సత్యం కోసం తపన. గురువు కోసం తపన.

గురు అనుగ్రహం కోసం తపన.

నడత, నడక కోసం తపన.

‘నేను’ అన్నది వదిలెయ్యటానికి తపన.

ఇగో/అహం వదిలెయ్యటానికి తపన, నిరహంకారం కోసం తపన.

సర్వదా సర్వత్రా ఉన్న జగదంబ కోసం తపన.

అలాంటి తపన ఎంత ఎక్కువ ఉంటే అంత త్వరగా సాధనలో పురోగమనం ఉంటుంది.

ఫలితం అంత త్వరగా వుంటుంది.

నిష్కామ కర్మ సహనానికి సహాయం చేస్తుంది. సహనం పెరిగిన తరువాత నిరహంకారంతో తపించిన సాధకులకు అంతర్ముఖం అవటం సులభ సాధ్యమౌతుంది. అంతర్ముఖమైన సాధకులకు అనుభూతులు కలుగుతాయి.

“ఈ అనుభూతులలో సర్వత్రా, సర్వం నిండి ఉన్న పరమాత్మ అనుభూతి కూడా కలుగుతుంది. తమ, తర భేదం వదిలిన సాధకులు లోపల అగ్నితో దహించి, ప్రాణమయ, అన్నమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాలలో మార్పు సంభవిస్తుంది.”

వీటికి తోడు సత్సాంగత్యం వల్ల కూడా మంచి ఫలితాలను పొందవచ్చు.

అని చెప్పారు.

తరువాత నన్ను “మీకు ఏం కావాలి?” అని అడిగారు.

నేను ఆమె పాదాలు తాకి “సర్వత్రా వున్న పరమాత్మను అనుభవము కలిగేలా దీవించండి చాలు” అన్నాను.

ఆమె నాతో “మీకు తపన ఎక్కువగా వుంది. మీకు తప్పక ఆ అనుభూతి కలుగుతుంది” అని దీవించారు.

నన్ను వచ్చి తనతో వుండమని ఆహ్వానించారు.

సందేహములేని భక్తి గురువు మీద వుంచమని దీవించారు.

నేను ఆమె వద్ద నాలుగు గంటలు గడిపాను. అవి చాలా అమూల్యమైన నాలుగు గంటలు.

అక్కడ్నుంచి వచ్చాక, ఆమె వద్దకు పంపిన నా మిత్రురాలికి హృదయ పూర్వకమైన కృతజ్ఞతలు తెలపటము నేను మరవలేదు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here