తిరుమలలో శ్రీవారు – సేవలు

0
3

[dropcap]శ్రీ [/dropcap]వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు తిరుమలలో బారులు తీరుతుంటారు. ఇప్పుడంటే కరోనా కానీ, భక్తజనులు దర్శించుకొనే అలవైకుంఠనాథుడు శ్రీ వేంకటేశ్వరుడు. ఈ స్వామికి ఉదయం సుప్రభాత సేవ నుండి పవళింపు సేవ వరకు తిరములలోని అర్చకులు ప్రతి నిత్యం, ప్రతి క్షణం పూజాదికాలతో నిర్విఘ్నంగా సేవిస్తూనే వుంటారు. అయితే అక్కడ ఎప్పుడెప్పుడు ఎలాంటి పూజాదికాలు నిర్వహిస్తారు, ఆ సమయాల్లో స్వామివారిని ఎలా సేవిస్తారు. ఈ విషయాలు చాలా మందికి తెలుసుకోవాలని వుంటుంది.

తిరములలో స్వామివారిని అర్చకులు శ్రీ వైష్ణవ సాంప్రదాయ (సంప్రదాయం) ప్రకారం నిత్య సేవా కైంకర్యాలు జరుపుతుంటారు. ఈ నిత్య సేవలలో వరుసగా నిర్వహించేవాటిని చూద్దాం.

కౌసల్యా సుప్రజా రామా పూర్వా సంధ్యా… అంటూ సాగే సుప్రభాత సేవ

తిరుమల శ్రీవారి ఆలయంలో ఉదయాన్నే గర్భగుడి తెరచిన వెంటనే, స్వామివారిని కొలిచే సందర్భాన్ని ‘సుప్రభాత సేవ’ అంటారు. తొండరడిప్పొడి ఆళ్వార్ రచించిన ‘తిరుప్పళ్ళి ఎళుచ్చి’ అనే పాశురాలను సంవత్సరం పొడుగునా, సుప్రభాత సేవలో లయబద్ధంగా పఠించేవారు. ప్రతివాది భయంకర అణ్ణన్ అనువారు ‘సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళం’ అనే నాలుగు భాగాలుగల శ్రీవారి స్తుతిని రచించారు. ఈ రచన లయబద్ధంగానూ, అందరికీ అర్థమయ్యేలాను, బాగా వుండడంతో ఈ రచననే ప్రతి రోజూ సుప్రభాత సేవలో స్తుతిస్తారు. అయితే ఒక్క మార్గశిర ధనుర్మాసంలో మాత్రం ‘తిరుప్పళి ఎళుచ్చి’ని స్తుతిస్తూ సుప్రభాత సేవ చేస్తారు.

సుప్రభాత సేవ తరువాత చేసే కైంకర్య సేవ తోమాల సేవ. ప్రతీ రోజు చేస్తారు కనుక దీనిని నిత్య తోమాల సేవ అని కూడా వ్యవహారం. నిజానికి తోమాల సేవ అంటే శ్రీవారికి ముందు రోజు జరిగిన పూజలలో చేసిన అలంకరణలు, పుష్పాలు, హారాల అన్నింటినీ శుభ్రం చేస్తూ, తిరిగి కొత్త వాటిని ధరింపజేయడం. ఇందులో ముఖ్యమయినది శ్రీవారికి అలంకరింపజేసే తోటమాల అంటే తోటలో పువ్వులను కలిపి మాలగా పూలహారాన్ని అలంకరించడం ‘తోమాల’ సేవగా వ్యవహరిస్తారు. ఇక మరో వివరణ కూడా తమిళులు చెప్పుకునేది ఏమిటంటే తోళ్ అంటే భుజం అని తమిళంలో అర్థం. కనుక భుజమును అంటి వుండేలాంటి ‘మాల’ను అలంకరించడం ‘తోళ్ మాల’ ఇదే తోమాల. ఈ తోమాల సేవ శ్రీవారికి నిత్యం ఉదయం, సాయంత్రం కూడా వుంటుంది. ఉయదం చేసే సేవలో తొండరడిప్పొడి తిరుప్పళ్ళి ఎళుచ్చి, ఆండాల్ తిరుప్పావై పాశురాలను పాడుతూ స్తుతిస్తారు. అప్పుడే నైవేద్యం కూడా పెడతారు. అదియైన వెంటనే ‘తిరుప్పావై సొత్తుమురై’ ని ఆలపిస్తారు. ప్రతి సాయంత్రం 15 రకాల దశకాలను గానం చేస్తూ తోమాల సేవను నిర్వహిస్తారు. తిరుప్పల్లాండు, పుచ్చుడల్, కాప్పిడల్, సెన్నియోంగు పాశురాలు, తిరుమంగై ఆళ్వారులు విరచించిన తాయెతందై వాడమరుదిడై ఏళై ఏతలన్ పాశురాలు, ఆండాళ్ చే రచించబడిన విణ్ణేశ్ మే లాస్టు నమ్మాళ్వారులచే విరచితమయిన ఒళివిలఖ కాలం, ఉలగముండ, పెరువాయ, కంగులుం పంగలుం, ఆళియేళ పాశురాలు, ఇంకా తిరుప్పాణ్ ఆళ్వారుల రచన అయిన అములనాది సిరాన్, మధురకవి ఆళ్వారుల విరచితం కణ్ణినుం సిరుత్తాంబు. ఇలా 15 రకాలయిన దశకాలను ఆలపిస్తూ తోమాల సేవను చేస్తారు. ఈ సమయంలోనే అర్చుకులకు ‘తులసి’ని అనుగ్రహిస్తారు. పెద్ద జియ్యంగారు వారికి ఆ రోజు అవకాశం లేకపోతే, చిన్న జియ్యంగారు అనుగ్రహిస్తారు. అప్పుడే ఆలవట్ట పూజలు చేస్తూ ప్రబందాల పారాయణం జరుగుతుంది.

ఈ సొత్తుమురైలో అర్చకులకు పెద్ద జియ్యరు వారిచే అనుగ్రహింపబడిన తులసిని అర్చకుల స్వామివారికి అర్పించుతారు. అలా పూజను చేస్తూ, ‘వాళి తిరునామం’ను ఆలపిస్తారు. దీనిని రచించిన వారు మానవాళ మహమునులు. ఈ సందర్భంలో ఆలయంలో వుండే భక్తులందరికీ తీర్థం, శ్రీ శఠారి లభిస్తుంది. తదుపరి ప్రసాదాన్ని పంచి పెడతారు. అందుకే భక్తులు ఈ తోమాల సేవకు ఎంతో ప్రాధాన్యాన్ని ఇస్తారు. ఈ తోమాల సేవ మూల విరాట్టుతో పాటు ఉత్సవ మూర్తికి కూడా జరుగుతుంది.

తిరుమలలో శ్రీవారికి జరిపించే పూజా విశేషాల్లో పూలంగి సేవకు ఓ విశిష్టత ఉంది. ఇది కేవలం గురువారం (లక్ష్మీవారం) మాత్రమే ఉంటుంది. (సాయంకాలంలో వుంటుంది). వాడమరుదిడై, ఊణ్‌వాడ, ఉణ్ణాదు పాశురాలను పూలంగి సేవ సమయంలో శ్రావ్యంగా ఆలపిస్తూ పూజను జరుపుతారు. ఈ పాశురాలను రచించినవారు ‘తిరుముడై యాళ్వారు’ వారు. వారంలో ఒక్క గురువారం సాయంత్రం నిర్వహిస్తారు. కనుక ఈ పూలంగి సేవకు కూడా భక్తులు ప్రాధాన్యత ఇస్తారు.

నిత్య తోమాల సేవలు శ్రీవారికి ప్రతి రోజు రెండు పర్యాయాలు వుంటే ఒక్క శుక్రవారం నాడు మాత్రం మూడు తోమాల సేవలుంటాయి. అదనంగా వుండేదే తిరుమంజన సేవ. ఆలయంలోని మూల విరాట్టుకు మాత్రమే తిరుమంజన సేవను చేస్తారు. చివర్లో ప్రసాదాన్ని నివేదిస్తారు. స్వామివారికి తరువాత నిచ్చియార్ తిరుమొళి సొత్తుమురై జరుగుతుంది. ఈ తిరుమంజన కైంకర్యం అవుతున్నంత సేపు నాచ్చియార్ తిరుమొళిని, సిరియ తిరుమడల్‌ను ఆలపిస్తారు. అండాళ్ వారు నాచ్చియోర్ తిరుమొళిని రచించగా, సిరియ తిరుమడల్‌ను తిరుమంగై ఆళ్వార్ రచించారు.

శ్రీవారికి కళ్యాణోత్సవం తిరుమలలో ఎంతో ప్రాధాన్యతను పొందింది. భక్తులు ఈ కళ్యాణోత్సవంలో పాల్గొనడానికి నెలల తరబడి వేచిచూస్తారు. ఎప్పుడు స్వామి కళ్యాణోత్సవం చేసి అదృష్టం దక్కుతుందా అని ఎంతగానో ఎదురు చూస్తారు. శ్రీవారి కళ్యాణ సమయంలో ‘వారణ మాయిరం’ పాశురం ఆలపిస్తారు. ఈ పాశురాలను రచించినది ‘ఆండాళ్’ వారు. వైష్ణవ సంప్రదాయం ప్రకారం కొబ్బరికాయలను ధరించడం ఇక్కడ స్వామివారి కళ్యాణోత్సవంలో భక్తులకు కనువిందు చేస్తుంది.

తిరుమలలో ఇంకా నక్షత్రాల ప్రకారం కొన్ని సేవలుంటాయి. ధనుర్మాసంలో జరిపే సేవలకు ప్రత్యేకంగా కొన్ని పాశురాలను ఆలపిస్తారు. నిత్య సేవలలో ఆలపించేవి వేరుగా వుంటాయి. బ్రహ్మోత్సవాలలో శ్రీవారు మాడ వీధులలో తిరిగే సమయంలో ఒక్కోరోజు ఒక్కో విధంగా ప్రత్యేకించబడిన పాశురాలను ఆలపిస్తారు.

శ్రీవారి ప్రతి కైంకర్యానికి ప్రత్యేకమయిన పాశుర గానం వుంది.

‘కౌసల్యా సుప్రజ…’ నుండి ప్రారంభయమ్యే సుప్రభాత సేవనుండి పవళింపు సేవ వరకు స్వామి అనుగ్రహం కోసం భక్తులు ఎంతగా ఎదురుచూస్తుంటారో మనకు తెలుసు. ఈ పూజాదికాల పైన, శ్రీవారి కైంకర్యాల పైన శ్రీ పెద్ద జియ్యంగారు, శ్రీ చిన్నజియ్యంగార్ల పర్యవేక్షణ వుంటుంది.

(నాకు లభించిన ఆధారాలననుసరించి ఈ వ్యాసం మీకు అందిస్తున్నాను. నాకు తెలియక దొర్లిన పొరపాట్లు ఏమైనా ఉంటే విజ్ఞులు మన్నిస్తారని వేడుకొంటున్నాను. – రచయిత)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here