[dropcap]వి[/dropcap]శాఖ సాహితి ఆధ్వర్యంలో 11-7-2021 సాయంత్రం 5:45 గంటల నుండి విశాఖ సాహితి స్వర్ణోత్సవ సభలలో భాగంగా, ‘ఆచార్య బొమ్మిరెడ్డిపల్లి భానుశ్రీ గారి స్మారక ఉపన్యాస కార్యక్రమం’ అంతర్జాల మాధ్యమం ద్వారా జరిగింది.
డా. మంగిపూడి వాణీ సుబ్రహ్మణ్యం గారి ప్రార్థనా గీతంతో ఆరంభమైన ఈ సభకు అధ్యక్షత వహించిన విశాఖ సాహితి అధ్యక్షులు ఆచార్య కోలవెన్ను మలయవాసిని గారు ఆచార్య భానుశ్రీ గారితో తమకు గల అనుబంధాన్ని వివరిస్తూ, భానుశ్రీ గారు మృదుభాషి అని, ఆమె చక్కని కవితలు వ్రాయడమే కాకుండా జాతీయ అంతర్జాతీయ సభలలో పాల్గొనేవారని, వారి జ్ఞాపకార్థం వారి సోదరి శ్రీమతి ఉషాకిరణ్ గారు ఈ రోజు స్మారకోపన్యాసం స్పాన్సరు చేయడం, భానుశ్రీ గారికి నిజమైన నివాళి అని అభివర్ణించారు.
శ్రీమతి ఉషాకిరణ్ గారు మాట్లాడుతూ, భానుశ్రీగారితో తమ అరవైయ్యేళ్ళ అనుబంధాన్ని, చిన్నప్పటి నుండి వారిద్దరూ కలసి హాజరయిన అనేక సభలను, కలసిన సాహితీవేత్తలను గుర్తుకు తెచ్చుకున్నారు.
ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ సాహితీవేత్త, విమర్శకులు ఆచార్య చందు సుబ్బారావు గారు తమ సందేశంలో, ఆధునిక కవిత్వానికి ఆద్యుడు గురజాడ అని చెబుతూ, ఆధునిక కవిత్వం గురజాడ కాలం నుండి ప్రస్తుత కాలం వరకు ఎలా పరిఢవిల్లిందో సోదాహరణంగా తెలియజేసారు.
ప్రధాన వక్త డా. వోలేటి పార్వతీశం గారు హైదరాబాదు నుంచి పాల్గొంటూ ‘ఆధునిక కవిత్వం – పోకడలు’ అనే అంశంపై ప్రసంగించారు. పార్వతీశం గారు ఆధునిక కవిత్వం విస్తృతి చాలా విశాలమైనదని ప్రస్తావిస్తూ, కాలానుగుణంగా ఆధునిక కవిత్వం, భావ కవిత్వపు శాఖను దాటి అభ్యుదయ కవిత్వ శాఖకి జన్మనిచ్చిందంటూ, ఆధునిక యుగంలో వచన కవిత్వ ప్రక్రియ విరాజిల్లిందన్నారు.
ముఖ్య అతిథిని డా. డి. వి. సూర్యారావు గారు, ప్రధాన వక్తను శ్రీ భమిడిపాటి సుబ్బారావుగారు సభకు పరిచయం చేయగా, విశాఖ సాహితి సంయుక్త కార్యదర్శి శ్రీమతి లలితా వాశిష్ట గారు వందన సమర్పణ చెసారు. దేశ విదేశాల నుంచి పలువురు సాహితీవేత్తలు, సాహిత్యాభిమానులు పాల్గొన్న ఈ సభకు విశాఖ సాహితి కార్యదర్శి శ్రీ ఘండికోట విశ్వనాధం గారు సమన్వయకర్తగా వ్యవహరించారు.