[box type=’note’ fontsize=’16’] దిలీప్ కుమార్ నటించిన చిత్రాల నుంచి వైవిధ్యభరితమైన 40 చిత్రాలను పాఠకులకు పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి. [/box]
స్వతంత్ర భారతదేశంలో బాన్ చేయబడిన మొట్టమొదటి సినిమా – జుగ్ను
[dropcap]1[/dropcap]947లో వచ్చిన జుగ్ను సినిమాకి చాలా చరిత్ర ఉంది. 1944లో జ్వార్ భాటా తో సినిమా జీవితం మొదలు పెట్టినా కాని, దిలీప్ కుమార్ జీవితంలో వచ్చిన మొదటి గొప్ప హిట్ మాత్రం జుగ్ను. అలాగే ఇందులో నాయికగా నటించిన నూర్జహాన్ భారత దేశపు నటిగా నటించిన ఆఖరి సినిమా ఇది. 1947లో దేశ విభజన తరువాత నూర్జహాన్ తన కుటుంబంతో పాకిస్తాన్ వెళ్ళిపోయారు. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన షౌకత్ హుస్సైన్ రిజ్వీ ఆమె భర్త. ఈ సినిమాలో మొట్టమొదటి సారి మహమ్మద్ రఫీ ఒక సీన్‌లో కనిపిస్తారు. హాస్టల్‌లో దిలీప్ కుమార్ తోటి విద్యార్థిగా ఆయన కాసేపు ఒక పాటలో మనకు కనువిందు చేస్తారు. ఉమ్మడి భారతదేశంలో నిర్మించిన ఈ సినిమా దేశ విభజన తరువాత రిలీజ్ అయింది.
ఈ సినిమా ప్రజలకు ఎంతో నచ్చింది, కాని విద్యాధికులుగా స్థిరపడ్డ ఒక వర్గం ఈ సినిమాను చాలా విమర్శించారు. ఎంతలా అంటే సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చి విడుదల అయి సిల్వర్ జూబ్లీ దిశగా ప్రయాణిస్తున్న ఈ సినిమాను మొరార్జీ దేశాయ్ బొంబాయిలో బాన్ చేయవలసి వచ్చింది. స్వతంత్ర భారతదేశ చరిత్రలో బాన్ విధించిన మొదటి సినిమా కూడా ఇదే.
సినిమా కథకు వస్తే చిన్నతనంలో తల్లి తండ్రులు చనిపోయిన తరువాత జుగ్ను బంధువుల సంరక్షణలో పెరుగుతుంది. తనని పెంచిన వ్యక్తిని ఆమె బాబాయ్ అని పిలుస్తుంది. ఆ బాబాయ్ కొడుకు జుగ్నుని పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు. జుగ్ను కాలేజీలో చదువుతుంటుంది. సూరజ్ కూడా అదే కాంపస్‌లో ఉన్న మగపిల్లల కాలేజీలో చదువుతుంటాడు. సినిమా మొదటి భాగం అంతా కాలేజీలో మగపిల్లలు, ఆడపిల్లల మధ్య వైరం వారి మధ్య అల్లరి నేపథ్యంలో నడుస్తుంది. ఇప్పటి కాలేజీ వాతావరణానికి ఏ రకంగానూ తీసిపోని సీన్లు ఉంటాయి. ప్రొఫెసర్ల మీద వీరు వేసే ప్రాంక్లు, కాలేజీలో ఆడపిల్లలు మగపిల్లల మధ్య చాలెంజీలు మొదటి సగబాగం నిండా ఉంటాయి. ఆ అల్లరి మధ్యే సూరజ్, జుగ్ను బాబాయ్ కొడుకుని నదిలో పడవేయిస్తాడు. ముందే జ్వరంతో ఇబ్బంది పడుతున్న అతనికి న్యుమోనియా వస్తుంది. దీనికి కారణం జుగ్ను అని కాలేజీలో పుకారు పుడుతుంది. కొడుకును ఆ స్థితిలో చూసిన ఆ తండ్రి కోపంతో ఇక తాను జుగ్నుకి సహాయం చేయనని చెప్తాడు. జుగ్ను చదువుకు సహాయం చేయడానికి సూరజ్ తండ్రిని తనకు నెలకిచ్చే పాకెట్ మనీ పెంచమని అడుడుతాడు. అప్పుడు అతని తండ్రి తాము ధనవంతులం కామని అప్పులలో కూరుకుపోయి ఉన్నామని తాము ఈ పరిస్థితులలో నిలబడాలంటే సూరజ్ డబ్బున్న తన స్నేహితుని కూతురుని వివాహం చేసుకోవాలని చెప్తాడు. కాని సూరజ్ తాను జుగ్నుని ప్రేమించానని ఆమెనే వివాహం చేసుకుంటానని చెప్తాడు.
సూరజ్ మొండి పట్టుదల చూసి భర్తను ఒప్పించాలని వచ్చిన సూరజ్ తల్లితో అతని తండ్రి, సూరజ్ ఈ పెళ్ళికి ఒప్పుకోకపోతే తాను ఆత్మహత్య చేసుకోవడం ఖాయం అని చెపుతాడు. భర్త నైజం తెలిసిన ఆమె భయపడుతుంది. జుగ్నుని కలిసి పరిస్థితి వివరించి సూరజ్‌ని వదిలేయమని చెబుతుంది. జుగ్ను తప్పని పరిస్థితులలో సూరజ్ జోలికి రానని అతని తల్లికి ప్రమాణం చేస్తుంది. సూరజ్‌కు దూరం అవుతుంది. జుగ్నులో ఈ మార్పు ఎందుకు వచ్చిందో తెలియన సూరజ్ బాధపడతాడు. ఆమె తనను కలవకపోవడం తన బాబాయి కొడుకుతో కలిసి తిరగడం చూసి అతనికి విపరీతమైన కోపం వస్తుంది జుగ్నుని సాధించడానికి ఎవరెవరితోనో తిరుగుతూ అల్లరి చిల్లరిగా ప్రవర్తిస్తూ ఉంటాడు.
సూరజ్‌లో ఈ మార్పు చూసి ఏం చేయలేక, అతన్ని మర్చిపోలేక జుగ్ను చాలా వ్యథ చెందుతుంది. ఆమె ఆరోగ్యం పాడవుతుంది. డబ్బు లేక జరుగుబాటు కోసం, తనకు వచ్చిన బహుమతులు అమ్ముకుంటుంది. ఇది తెలిసిన సూరజ్ తల్లి ఆమెకు కొంత డబ్బు పంపిస్తుంది. కాని జుగ్ను ఆ డబ్బు తీసుకోదు. తాను సూరజ్ బాగు కోసం మాత్రమే అతన్ని వదిలేసానని, దానికి డబ్బుతో ముడి పెట్టడం సరి కాదని ఒక ఉత్తరం రాసి సూరజ్ తల్లికి పంపుతుంది. ఆ ఉత్తరం చూసిన తరువాత కాని సూరజ్‌కు అసలు జరిగినదేంటో అర్థం కాదు. జుగ్ను తనకోసం చేసిన త్యాగం తెలుసుకుని ఆమెను చేరేసరికి జబ్బు ముదిరి ఆమె అతని కళ్ళ ముందే చనిపోతుంది.
సినిమా మొదట్లో కాలేజి అబ్బాయిలతో పిక్నిక్‌కి వెళ్ళిన సూరజ్ స్నేహితులు ఆడపిల్లలు కూడా పిక్నిక్‌కి రావడం చూస్తారు. వారు భోజనానికి కూర్చున్నప్పుడు ఆ పదార్థాలు దొంగలించాలనే ఉద్దేశంతో సూరజ్ కొండ మీద నుండి క్రిందకి దూకి ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు నటిస్తాడు. జుగ్ను అది నిజం అని నమ్మి అతన్ని ఆపుతుంది. అందరు ఆడపిల్లలు అతన్ని మందలించే సమయంలో వారు వండుకున్న పదార్థాలను దొంగలిస్తారు సూరజ్ స్నేహితులు. ఇప్పుడు చివర్లో జుగ్నును మొదటిసారి కలిసిన కొండ వద్దకే వస్తాడు సూరజ్. తల్లి తండ్రులు చూస్తూ ఉండగానే ఆ కొండ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకుంటాడు.
కామెడీ సినిమాగా మొదలయిన చిత్రం చివరకు ట్రాజెడీతో ముగుస్తుంది. సినిమా ఇప్పుడు చూస్తే కాస్త సాగతీతగా అనిపించే మాట వాస్తవం. కాని దీనికున్న చరిత్ర మాత్రం భారతదేశ చరిత్రలో దీని ఒక విలువైన సినిమాగా నిలుపుతుంది. సినిమా చాలా చోట్ల సిల్వర్ జూబ్లీలు జరుపుకుంటున్నప్పుడు కూడా దీనికి వ్యతిరేకంగా వచ్చిన నినాదాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. దేశ విభజన తరువాత పరిస్థితులు, ఆధునిక భారత దేశ నిర్మాణం అందులో యువత పాత్ర గురించి మేధామథనం జరుగుతున్న సందర్భంలో ఈ సినిమాలోని కాలేజీ జీవితాన్ని విమర్శించి, కాలేజీ అంటే ఇలాంటి చిల్లర అల్లరి బాధ్యతారాహిత్యంతో ప్రవర్తించే యువతతో నిండి ఉంటుందని, భారత దేశంలోని యువత ప్రస్తుతం దేశంలో నెలకొని ఉన్న గంభీరమైన పరిస్థితులలో ఇలా బాధ్యతా రాహిత్యంగా జీవిస్తున్నారనీ, ప్రపంచం చులకనగా చూసే అవకాశం ఉంటుందని కొలంబో, సింగపూర్ లో ఉన్న భారతీయులు కూడా విమర్శిస్తూ ఈ సినిమాను వల్గర్ సినిమాగా పేర్కొన్నారు. ఫిల్మిస్తాన్ ఆర్చీవ్స్‌లో ఈ సినిమాకు సంబంధించి ఎమ్. టి. పియాసీలా అనే వ్యక్తి కొలొంబో నుంచి, షివ్ దాస్ సింగ్ అనే విద్యార్థి జోధ్‌పూర్ నుంచి రాసిన ఉత్తరాలు ఉన్నాయి. ఆ విద్యార్థి అయితే ఈ సినిమా చూసిన తల్లితండ్రులు తమ పిల్లలను ఉన్నత చదువుల కోసం కాలేజీలకు పంపరు అంటూ బాధపడుతూ ఉత్తరం రాసాడు. అప్పట్లో బాంబే హోమ్ మినిస్టర్ మొరార్జీ దేశాయికి ఇవి చేరడం, అక్టోబర్ 26న అతను స్వయంగా ఈ సినిమాను చూడడం, ఆ తరువాత మూడు రోజులకి జెనెరల్ క్లాజెస్ ఆక్ట్ 1897, సెక్షన్ 21 క్రింద ఈ సినిమాను బాన్ చేయడం జరిగింది. సెన్సార్ సర్టిఫై చేసిన ఈ సినిమాను హోమ్ మినిస్టర్ బాన్ చేయడంపై అప్పట్లో ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేసారు. తరువాత మిగతా రాష్ట్రాలలో కూడా ఈ బాన్ మొదలయినప్పుడు సెన్సార్ బోర్డుకు ఇది మళ్ళీ వెళ్ళి 28 నిముషాల కటింగ్‌తో బయటకు వచ్చింది. అప్పుడు మళ్ళీ ధియేటర్లలో దీన్ని ప్రదర్శించారు.
ఈ సినిమాపై విధ్యాధికులు కోపం చూపడానికి మరో కారణం ఇందులో హాస్టల్ వార్డెన్‌గా నటించిన రూబీ మయర్స్ పాత్ర. ఆంగ్లో ఇండియన్ స్త్రీ పాత్ర ఇది. బాయ్స్ కాలేజీ ప్రొఫెసర్‌కి ఆమెకి మధ్య రొమాంటిక్ సంభాషణలు భారతీయ విద్యా వ్యవస్థకు మచ్చ తెచ్చే విధంగా ఉన్నాయని అప్పట్లో చాలా మంది టీచర్లు ఫ్రొఫెసర్లు మండి పడ్డారు. ఇక ఇప్పుడు కాలేజీల నేపథ్యంలో వచ్చే సినిమాలను అసలు ఊహించి అన్నా ఉంటారా అనిపిస్తుంది. 1947లోనే ఆడపిల్లలు మగపిల్లల మధ్య సవాళ్ళు, ప్రేమలు, ఒకరి హాస్టల్ రూముల్లో మరొకరు దూరడాలు, లేటువయసు ప్రొఫెసర్ల ప్రేమలు అన్నీ ఇప్పటి సినిమాలో రొటీన్ అయిపోయాయి. ఏదో మాడర్న్ కాలేజి వాతావరణాన్ని చూపిస్తున్నాం అనుకుంటున్న ప్రస్తుత దర్శకులంతా ఈ సినిమాను చూడాలి. వారి సినిమాలన్నీ ఈ సినిమా సీన్లకు కాపీ అని ఒప్పుకోక తప్పదు.
జుగ్ను సినిమాపై ఇంత కోపం ప్రదర్శింపబడడానికి స్వతంత్ర భారతదేశ భవిష్యత్తు నిర్మాతలుగా బాధ్యతగా ఉండే యువతను కోరుకుంటున్న భారతీయ సమాజం ఒక కారణం అయితే సినిమాను సొంత బానర్‌పై నిర్మించిన షౌకత్ రిజ్వి, నూర్జహాన్‌లు భారత్ వదిలి పాకిస్తాన్ వెళ్ళడంపై వారి మీద ఉన్న కోపం కూడా ఒక కారణం. అయినా ఇవన్నీ జుగ్నును సూపర్ హిట్ సినిమాగా నిలిపాయి. రెండు దేశాల మత కలహాల మధ్య కూడా రెండు దేశాలలో ఈ సినిమా పాటలు బహుళ ప్రజాదరణ పొందడం విశేషం. సంగీతానికి ఎల్లలు లేవని జుగ్నూ సినిమాలో రఫి, నూర్జహాన్‌లు పాడిన యుగళగీతం యహాన్ బద్లా వఫా కా నిరూపిస్తుంది. దేశ విభజనవల్ల ఇరువైపులా మారణకాండ చెలరేగుతూ ద్వేషానల జ్వాలలు ప్రజ్వరిల్లుతూన్న సమయంలో కూడా సరిహద్దులకిరువైపులా ఈ పాట మార్మ్రోగుతూండేది. తన సినీ సంగీత జీవితంలో రఫీ పాడిన తొలి యుగళగీతం కూడా ఇదే. దేశం వదిలి వెళ్ళాక షౌకత్ రిజ్వి పాకిస్తాన్‌లో కూడా కొన్ని సినిమాలు తీసారు. ముగ్గురు పిల్లలు పుట్టిన తరువాత నూర్జహాన్‌తో విడాకులు తీసుకున్నారు. నూర్జహాన్ పాకిస్తాన్ సినిమా చరిత్రలోనే అగ్రతారగా వెలిగారు. ఒక గొప్ప గాయనిగా రూపాంతరం చెందారు. ఈవిడ నిష్క్రమణ లతా మంగేష్కర్ సినీ జీవిత ప్రస్థానాన్ని సుగమం చేసింది. ఫెరోజ్ నిజామీ ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహించారు. మహమ్మద్ రఫీని సినీ సంగీతానికి పరిచయం చేసింది ఇతనే. విభజన తరువాత పాకిస్తాన్‌కి తరలి వెళ్ళిన మరో సినీ దిగ్గజం ఈయన. పాకిస్తాన్ దేశంలో గొప్ప సంగీత దిగ్గజంగా ఈ నాటికీ ఆయన జన్మదినాన్ని జరుపుకోవడం విశేషం.
మరో ఆసక్తి కరమయిన విషయం ఏమిటంటే దేశవిభజన జరిగినప్పుడు మహమ్మద్ రఫీ బొంబయిలో వున్నాడు. అతని కుటుంబం లాహోర్ లో వుంది. జుగ్నూలో పనిచేసిన వారనేకులు పాకిస్తాన్ వెళ్తూ రఫీనీ రమ్మన్నారు. కానీ, ఆయన పాకిస్తాన్ నుంచి తన కుటుంబాన్నే బొంబాయి రప్పించుకున్నాడు… నూర్జహాన్ మాట విని రఫీ పాకిస్తాన్ వెళ్ళివుంటే.?????.. ఆలోచనే భయంకరంగా వుంటుంది..
దేశ విభజన సమయంలో దిలీప్ కుమార్ సోదరుడు నసీర్ ఖాన్ పాకిస్తాన్ వెళ్ళాడు. అక్కడి తొలి సినిమాలో హీరో వేషం వేశాడు. కానీ, 1951లో భారత్ తిరిగి వచ్చాడు.
ఇంతటి చరిత్రను చూసిన జుగ్ను సినిమాగా ఇప్పుడు మనల్ని రంజింప చేయకపోయినా భారతీయ సినిమా చరిత్రలో ప్రముఖ స్థానాన్ని దక్కించుకుంది. ఇందులో నటించిన సూరజ్‌గా నటించిన దిలీప్, జుగ్నుగా నటించిన నూర్జహాన్‌లు చివరి దాకా మంచి స్నేహితులుగా మిగిలిపోయారు. ఇరు దేశాల సంబంధాల మధ్య వారధిగా దిలీప్ కుమార్‌ని ప్రజలు చూసారంటే ఇంత నేపథ్యం ఉండడమే కారణం. దిలీప్ మరణంతో ఆ వారధి శాశ్వతంగా దూరమయిందన్నది ఎవరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా ఒక నిజం. ఇరు దేశాల చరిత్రకు గుర్తుగా నిలిచిన తరం దిలీప్‌తో శాశ్వతంగా అంతమయ్యింది.